శబ్దం—దాని గురించి మీరు చేయగలిగినది
మీరు దినాంతంలో చాలా అలిసిపోయి ఉన్నందున మత్తు నిద్రలోకి జారుకుంటారు. హఠాత్తుగా, పొరుగింటి కుక్కలు మొరగటంతో మీకు నిద్రాభంగమవుతుంది. మీరు మీ పరుపుపై అటువైపు తిరిగి, చిరాకు పుట్టించే ఆ శబ్దం త్వరలోనే ఆగిపోతుందని ఆశిస్తారు. అయితే అది కొనసాగుతుంది. కుక్కలు అదేపనిగా మొరుగుతూనే ఉంటాయి. నిద్రలేమి వలన విసుగుచెందిన మీరు ఇప్పుడు పూర్తిగా మేలుకుని, అంత గోలని మీ పొరుగువారు ఎలా భరించగల్గుతున్నారా అని ఆలోచిస్తారు.
ప్రజలు శబ్దాన్ని భరించే విషయంలో ఎంతో వ్యత్యాసాన్ని కలిగి ఉంటారు. రన్‌వేకు దగ్గర్లో జీవించే విమానాశ్రయ ఉద్యోగులు, విమానాల శబ్దం మూలంగా విమానాలతో ఎలాంటి సంబంధమూ ఉండని ఉద్యోగం చేసే వారికంటే కూడా చాలా తక్కువగా డిస్టర్బ్ అవుతారు. ఒక గదిలో మిక్సర్ ఉపయోగిస్తున్న గృహిణి, మరొక గదిలో కూర్చుని పుస్తకం చదివేందుకు లేదా టీవీ చూసేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తికంటే చాలా సులభంగా ఆ శబ్దాన్ని సహించగలదు.
శబ్దకాలుష్యం అంటే ఏమిటి?
శబ్దకాలుష్యాన్ని నిర్వచించే విషయంలో దేశానికీ దేశానికీ మధ్య తేడా ఉంది. మెక్సికోలో, “ప్రజలకు హానికరంగా ఉండే లేదా న్యూసెన్సులా ఉండే కోరదగని ఎలాంటి శబ్దమైనా” కూడా చప్పుడుగా పిలువబడగలదు. న్యూజీలాండ్‌లో “ఏ వ్యక్తికైనా కూడా తన ప్రశాంతత, ఆహ్లాదత మరియు సౌకర్యానికి ఆటంకం కలిగించే విధంగా నిర్హేతుకమైన రీతిలో ఉన్నప్పుడు” అది చప్పుడుగా పరిగణించబడుతుంది.
టెలిఫోన్‌ను కనుగొన్న అలెగ్జాండర్ గ్రహంబెల్ మరియు ఒక జర్మను వైద్యుడు హెన్రిక్ హర్జ్ అనే ఇద్దరు ప్రముఖ వైజ్ఞానికులు, శబ్దాన్ని కొలిచే విషయంలో దగ్గరి సంబంధాన్ని కలిగి ఉన్నారు. బెల్స్ లేక చాలా సాధారణంగా డెసిబెల్స్ (ఒక బెల్‌లోని పదియవ భాగం) పరిమిత శబ్దాన్ని కొలత వేస్తుంది అయితే హర్జ్ ఒక శబ్దం యొక్క శ్రుతిని లేదా పౌనఃపున్యాన్ని కొలత వేస్తుంది. శబ్దాన్ని కొలిచినప్పుడు సాధారణంగా శబ్దం యొక్క డెసిబెల్స్ స్థాయిని ఆ కొలతలు సూచిస్తాయి.a
ఒక శబ్దం ఎంత చికాకును కలిగిస్తుందనే విషయాన్ని ఎవరు తీర్మానిస్తారు? దాన్ని వినే వారైన మీరే! “ఎంత శబ్దం విసుగెత్తిస్తుందనే విషయాన్ని తీర్మానించేందుకు, మానవ చెవి ఇప్పటికీ అతి శ్రేష్ఠమైన గ్రాహక పరికరంగా ఉందని” లండన్‌కు చెందిన ది ఇండిపెండెంట్ పేర్కొంటుంది.
శబ్దం యొక్క ప్రభావాలు
శబ్దాన్ని గుర్తించడంలో చెవి “అతి శ్రేష్ఠమైన గ్రాహక పరికరం” గనుక శబ్దం మూలంగా ఎక్కువ హాని కలిగేది కూడా ఆ అవయవానికే అనే విషయం సుస్పష్టం. మీ లోపలి చెవి యొక్క సున్నితమైన నరాలకు నష్టం వాటిల్లడం శాశ్వత బధిరత్వాన్ని కలిగించగలదు. పెద్ద శబ్దాలకు ప్రజలు ప్రతిస్పందించే రీతిలో వ్యత్యాసం ఉంటుందనే విషయం వాస్తవమే. 80 నుండి 90 డెసిబెల్‌ల కంటే ఎక్కువున్న శబ్దాన్ని తరచుగా వినవలసి రావడం క్రమంగా బధిరత్వానికి దారి తీయగలదు. వాస్తవానికి, శబ్దం స్థాయి ఎంత ఎక్కువగా ఉంటే, మీ వినికిడి శక్తికి నష్టం కలుగకుండా శబ్దాన్ని కలిగించే పరిస్థితిల్లో మీరు అంత తక్కువ సేపు మాత్రమే ఉండగలరు.
ఫ్రాన్స్‌లో అమ్మబడే అనేక వాక్‌మ్యాన్‌లు 113 డెసిబెల్‌ల గరిష్ఠ స్థాయి శబ్దాన్ని కలిగి ఉన్నాయని న్యూ సైంటిస్ట్ పత్రిక నివేదిస్తుంది. ఒక అధ్యయనాన్ని సూచిస్తూ, “వాక్‌మ్యాన్‌లపై పూర్తి శబ్దంతో ఒక గంటపాటు మోగించబడిన రాక్ సంగీతం దాదాపు ఎల్లప్పుడూ 100 డెసిబెల్‌లు దాటిపోయిందనీ మరియు 127 డెసిబెల్‌ల శిఖరాగ్రాలను కూడా చేరుకుందని” అది పేర్కొన్నది. లైవ్ కాన్సెర్ట్ సమయాల్లో ఉత్పన్నమయ్యే శబ్దం యొక్క ప్రభావం అంతకంటే తీవ్రంగా ఉంటుంది. లౌడ్ స్పీకర్లు అన్నీ ఒక దానిపై మరొకటి అమర్చబడి ఉన్న స్థలంలో నిలబడిన ప్రజలు అచేతనావస్థలో ఉన్నారని ఒక పరిశీలకుడు కనుగొన్నాడు. “నా కంటిచూపు మసకబారింది, బాస్ దరువుతో నా శరీర రంధ్రాలు అనునాదం చెందాయి, ఆ శబ్దం నా చెవులకు ఎంతో నొప్పిని కలిగించిందని” అతను చెబుతున్నాడు.
శబ్దం మీపై ఎలాంటి ప్రభావాన్ని కలిగి ఉండగలదు? ఒక అధికారి ఇలా పేర్కొంటున్నాడు: “మామూలు నుండి అతి ఎక్కువ స్థాయి వరకూ ఉండే శబ్దాలు మీకు ఒత్తిడిని, అలసటను మరియు చికాకును కలిగించగలవు.” “ధ్వని చేత పీడించబడటం అసంతోషం కల్గించడమే కాక, అది ఒక వ్యక్తిని భౌతికంగా మరియు మానసికంగా క్షీణించేలా చేస్తుంది” అని జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ గీసెన్‌కు చెందిన ప్రొఫెసర్ గెరాల్ట్ ప్లైషెర్ పేర్కొంటున్నాడు. మాకీస్ ట్సాపగో అనే ప్రొఫెసర్ ప్రకారం, ఒత్తిడిని కలుగజేసే ఇతర పరిస్థితులకు శబ్దం తోడైనప్పుడు, అది ఒక వ్యక్తిలో కృంగుదలనూ అలాగే శారీరక వ్యాధులనూ కలిగించగలదు.
శబ్దాన్ని ఎడతెగక వినవలసి రావడం మీ వ్యక్తిత్వాన్ని కూడా ప్రభావితం చేయగలదు. శబ్దకాలుష్య బాధితులను ఆ శబ్దానికి కారకులైన వారిని గూర్చి మీరెలా భావిస్తున్నారని బ్రిటీష్ ప్రభుత్వ పరిశోధకులు అడిగినప్పుడు, వారు ద్వేషం, పగ మరియు హత్యల గురించి ప్రస్తావించారు. మరో వైపు, శబ్దాన్ని కలిగించే వారికి విరుద్ధంగా పదే పదే ఫిర్యాదు చేసినప్పుడు వారు తరచుగా దాడికి ఉపక్రమిస్తారు. “శబ్దం ప్రజల పరహితత్వాన్ని తగ్గిస్తుంది మరియు వారిలో దౌర్జన్యాన్నీ వైరాన్నీ సృష్టిస్తుంది” అని శబ్దానికి విరుద్ధంగా ప్రచారం చేస్తున్న ఒక వ్యక్తి పేర్కొన్నాడు.
శబ్దకాలుష్యం వలన బాధననుభవించిన అనేకులు చికాకును తట్టుకునే తమ సహనశక్తి క్రమేపీ క్షీణిస్తూ ఉందని గుర్తించారు. తన పొరుగువారు ఎల్లప్పుడూ సంగీతాన్ని బిగ్గరగా మోగించడంతో విసుగెత్తి, “మీరు ఇష్టపడని ఒక సంగతిని మీరు పదే పదే వినవలసి వస్తే, అది మీకు హాని కలిగిస్తుంది. . . . ఆ చప్పుడు ఆగిపోయిన తర్వాత కూడా అది మళ్లీ మొదలౌతుందని మాకు తెలుసు” అని చెప్పిన స్త్రీ అభిప్రాయంతో వారు ఏకీభవిస్తారు.
మరి శబ్దకాలుష్యంతో వ్యవహరించే మార్గమే ఇక లేదా?
మీరు చేయగలిగినది
శబ్దం సర్వత్రా వ్యాపించి ఉన్నందున, తాము ఇతరులకు చికాకు కలిగించేటప్పుడు అనేకమంది ప్రజలు ఆ విషయాన్ని అసలు గమనించరు. ఒకవేళ వాళ్లకు అలాగని తెలిస్తే ఇతరులకు చికాకు కలిగించే ఆ పనిని కొందరు తప్పక మానుకుంటారు. కాబట్టి ఈ కారణం మూలంగా, శబ్దాన్ని కలిగిస్తున్న పొరుగువారి ఎడల స్నేహపూర్వకమైన దృక్పథాన్ని కలిగి ఉండటం సహాయకరంగా ఉండగలదు. శబ్దం చేస్తున్నాడని తన పొరుగువారి ద్వారా అతనికి అధికారిక ఫిర్యాదు అందినప్పుడు ఒక వ్యక్తికి చాలా కోపం వచ్చింది. అతనిలా అన్నాడు: “ఆ శబ్దం వాళ్లకు అంత చికాకు కలిగించివుంటే వాళ్లు నా దగ్గరకు వచ్చి నాతోనే చెబుతారనుకున్నాను.” కొంతమంది చిన్నపిల్లల కొరకు పార్టీ ఏర్పాటు చేసిన ఒక తల్లి, శబ్దాన్ని గురించిన ఫిర్యాదు విషయమై దర్యాప్తు చేసేందుకు వచ్చిన అధికారిని చూసి నివ్వెరపోయింది. “అలా ఫిర్యాదు చేసిన వారు తమకు అది కష్టంగా ఉంటే వచ్చి నా తలుపు తట్టి నాతో ఆ విషయాన్ని చెప్పి ఉంటే ఎంత బాగుండేది” అని ఆమె అంటోంది. పొరుగువారు కలిగిస్తున్న శబ్దాన్ని గురించి ఫిర్యాదు చేసిన వారిలో 80 శాతం మంది తమ పొరుగువారిని నిశ్శబ్దంగా ఉండమని చెప్పలేదనే విషయాన్ని కనుగొని ఒక బ్రిటీష్ అధికారి ఆశ్చర్యపోయాడంటే అది వింతైన విషయమేమీ కాదు.
శబ్దాన్ని కలిగిస్తున్న పొరుగు వారితో ఆ విషయాన్ని గురించి మాట్లాడేందుకు ప్రజలు సంకోచాన్ని కలిగి ఉండటం పరస్పర గౌరవం లోపించిందనే విషయాన్ని సూచిస్తుంది. ‘నేను సంగీతం పెట్టాలని అనుకుంటే నేను పెడతాను. అది నా హక్కు!’ అని వారు ప్రతిస్పందిస్తారని బాధితులు అనుకుంటారు మరి తరచుగా వారికి అలాంటి ప్రతిస్పందనే లభిస్తుంది. శబ్దాన్ని తగ్గించండి అని మెత్తగా ఒక మాట చెబితే, శబ్దం చేసే పొరుగువారు గొడవలమారి అనే పేరును తమకు తగిలిస్తారని అది కలహాలకు దారి తీయగలదని వారు భయపడతారు. ఈనాటి సమాజపు ఎంత దుఃఖకరమైన ప్రతిబింబమో కదా ఇది! ఈ ‘అంత్యదినాల అపాయకరమైన కాలాల్లో’ ప్రజలు సాధారణంగా ‘స్వార్థప్రియులు, అహంకారులు, క్రూరులు మరియు గర్వాంధులుగా’ ఉంటారనే బైబిలు వ్యాఖ్యానంతో ఇది ఎంత పొందికగా ఉందో కదా!—2 తిమోతి 3:1-4.
బాధితుడు సమీపించే విధానంపై కూడా ఎంతో ఆధారపడి ఉంటుంది. కోపంగా ఫిర్యాదు చేస్తే, అది అవతలి వ్యక్తికి బాధ కలిగించినప్పుడు ఒత్తిడిగల ఆ పరిస్థితిని సరి చేసుకునే మార్గాన్ని గూర్చి ఉమెన్స్ వీక్లీ అనే పత్రిక ఇలా సలహా ఇస్తోంది: “మృదువుగా, అర్థం చేసుకునే రీతిలో ఇలా అనండి, ‘చూడండి, మీరు మీ స్టీరియోను అంత పెద్దగా పెట్టడంతో నాకు అసలు నిద్రేపట్టడం లేదు, దాంతో నాకిక చాలా కోపం వచ్చేసింది, నన్ను దయచేసి క్షమించండి’ అనే మాటలు [తమను సమర్థించుకుంటున్న పొరుగువారిని] శాంతింపజేసేందుకు సరిపోతాయి.” బహుశ వాళ్లు విసుక్కోకుండా తమ స్టీరియోను ప్రక్కనున్న గోడ దగ్గరనుండి తీసేసి ధ్వని స్థాయిని కాస్త తగ్గించవచ్చు.
వాస్తవికంగా, మీ పొరుగువారితో మంచి సంబంధాలను పెంచుకోవటం ఎంతో యోగ్యమైన విషయం. ఒకరినొకరు వ్యతిరేకించే పొరుగువారి మధ్య మంచి సంబంధాలను ఏర్పరచేందుకు కొన్ని స్థానిక ప్రభుత్వ అధికార వర్గాలు పరస్పర అనుసంధాన సేవలను అందిస్తున్నాయి. అధికారిక ఫిర్యాదులు ప్రతికూల భావాలను కలిగించవచ్చు గనుక, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెంటును పిలవడాన్ని “ఇక గత్యంతరం లేని చివరి ప్రయత్నంగా” మాత్రమే పరిగణించాలి.
మీరు క్రొత్త ప్రాంతానికి మారాలని ఎదురు చూస్తుంటే, మీరు మీ ఒప్పందాలను నిశ్చయపర్చుకోవడానికి ముందు శబ్దం కలిగించే కారకాలు ఏవైనా ఉన్నాయేమో చూడటం ఎంతైనా జ్ఞానయుక్తమైన పని అవుతుంది. మీరు కొనబోయే ఇంటిని దినంలో వేర్వేరు సమయాల్లో దర్శించడం మంచిదని స్థిరాస్థి దళారీలు సిఫారసు చేస్తారు. మీరు పొరుగువారి అభిప్రాయాల విషయమై వారితో మాట్లాడవచ్చు. మీరు మీ క్రొత్త ఇంట్లోకి మారిన తర్వాత సమస్యలను ఎదుర్కొనవలసి వస్తే, వాటిని స్నేహపూర్వకంగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించండి. పేచీ పెట్టడం సాధారణంగా వైరాన్ని ప్రోత్సహిస్తుంది.
అయితే మీరు శబ్దం ఉన్న పొరుగు ప్రాంతంలో నివసిస్తుంటే మరియు ఎక్కడికీ మారే అవకాశం మీకు లేకపోతే అప్పుడేమిటి? మీరు ఎడతెగక బాధ అనుభవించాల్సిందేనా? అలా కానవసరం లేదు.
శబ్దం నుండి పరిరక్షణ పొందగల విధానం
మీ ఇంట్లోకి చప్పుడు అసలు రాకుండా ఉండేందుకు మీరు ఏ చర్యలు తీసుకోగలరో చూడండి. మీ గోడల్లో మరియు నేలలో ఏవైనా రంధ్రాలు ఉన్నాయేమో చూసి ఏదైనా పెట్టి వాటిని మూసేయండి. కరెంటు సాకెట్లు ఎక్కడ ఉన్నాయో ప్రాముఖ్యంగా గమనించండి. అవి భద్రంగా ఉన్నాయా?
శబ్దం తరచూ తలుపులు, కిటికీల ద్వారా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కిటికీల అద్దాలకు రెండవ పొరను (రెండంతల ఉపరితలం) అతికించడం శబ్దాన్ని తగ్గించేందుకు సహాయపడుతుంది. మీ తలుపు చివరలకు సన్నని ఫోమ్‌ను అతికించడం కూడా మీ తలుపు గట్టిగా మూసుకునేందుకు వీలు కలిగిస్తుంది. బహుశ వసారా కట్టించి తలుపు పెడితే, చికాకు కలిగించే ట్రాఫిక్ శబ్దం నుండి మీకు కాపుదలను అందించవచ్చు.
ట్రాఫిక్ శబ్దం యొక్క స్థాయి అతివేగంగా పెరిగిపోతున్నప్పటికీ, మీ వాహనం లోపల శబ్దం యొక్క స్థాయిని తగ్గించేందుకు వాహననిర్మాణకులు ఎడతెగక క్రొత్త పరికరాలను మరియు పద్ధతులను ఏర్పాటు చేస్తున్నారు. మీ వాహనానికి శబ్దం తక్కువ చేసే చక్రాలను బిగించడం కూడా సహాయం చేయగలదు. అనేక దేశాల్లో విభిన్న రకాల రోడ్డు ఉపరితలాలపై పరిశోధనలు చేయడం మూలంగా “విస్పర్ కాంక్రీట్” వంటి ఉత్పత్తులు తయారయ్యాయి, అందులో కాంక్రీటులోని రాళ్లు సందుల్లోకి నెట్టివేయబడకుండా అలాగే వదిలేయబడతాయి, దాని మూలంగా చక్రాలు చాలా తక్కువసార్లు రాపిడికి గురౌతాయి. ఈ ఉపరితలాన్ని ఉపయోగించడం తక్కువ బరువుగల వాహనాల్లో శబ్ద స్థాయి దాదాపు రెండు డెసిబెల్‌లకీ మరియు బరువైన వాహనాల్లో ఒక డెసిబెల్‌కి తగ్గించబడుతుందన్నట్లు తెలియవస్తుంది. ఇది తగినంతగా కనిపించనప్పటికీ, సగటున మూడు డెసిబెల్‌ల శబ్దం తగ్గడం అంటే, ట్రాఫిక్ నుండి వచ్చే శబ్దంలో దాదాపు సగాన్ని తగ్గించడంతో సమానమని అర్థం!
రోడ్డు నిర్మాణకులు ఇప్పుడు అడ్డంకుల లేదా గట్ల ద్వారా దాచబడిన రహదారులను రూపొందిస్తున్నారు, అలా ప్రభావవంతంగా శబ్దాన్ని తగ్గిస్తున్నారు. అలా చేసేందుకు అవకాశం లేని స్థలాల్లో కూడా, అల్లబడిన విల్లో కొమ్మలు మరియు ఎవర్‌గ్రీన్ చెట్లతో రూపొందించబడిన తూర్పు లండన్‌లో ఉన్నటువంటి ప్రత్యేకంగా రూపొందించబడిన ప్రహరీ, దగ్గర్లోని నివాసులను అవాంఛిత శబ్దం నుండి కాపాడుతుంది.
కార్యాలయాల వంటి కొన్ని ప్రాంతాల్లో చికాకు కలిగించే శబ్దాన్ని, తెల్లని శబ్దం—ఉదాహరణకు అస్థిర పీడనాన్ని లేక గాలిని ప్రసారం చేయడం—అని పిలువబడే దానితో కప్పేయడం చాలా ప్రభావవంతంగా ఉండవచ్చు.b జపాన్‌లో నిశ్శబ్ద పియానోలు మార్కెట్‌లోకి వచ్చాయి. తీగలను మీటే బదులు, వాయించే తీగ వాద్యకారుని ఇయర్‌ఫోన్‌లోకి స్వరాన్ని ఉత్పన్నం చేసే ఎలెక్ట్రానిక్ సర్క్యూట్‌ను క్రియాశీలం చేస్తుంది.
ఆంటీనాయిస్ అని వారు పిలిచే దాన్ని ఉత్పన్నం చేయడాన్ని గురించి పరిశోధించేందుకు వైజ్ఞానికులు ఇప్పటికే సుదీర్ఘ గంటలను గడిపారు. మౌలికంగా, శబ్ద ప్రభావాన్ని నిరర్థకం చేసే ప్రకంపనలను ఉత్పన్నం చేసేందుకు మరొక శబ్ద మూలాన్ని ఉపయోగించడం ఇందులో ఇమిడి వుంటుంది. అయితే, దానికి అదనపు పరికరాలూ మరింత వ్యయం అవసరమౌతాయి మరి సమస్య యొక్క మూలాన్ని అది వాస్తవంగా తీసేయదు. “చప్పుడును ప్రజలు సోనిక్ చెత్తగా భావించడం ప్రారంభించేంత వరకూ క్షణకాలంపాటూ నెమ్మదిని కనుగొనేందుకుగల ఏకైక మార్గం ఆంటీనాయిసే కావచ్చు” అని యు.ఎస్.న్యూస్ & వరల్డ్ రిపోర్ట్ పేర్కొంటుంది. అయితే కావచ్చు, కానీ శబ్దకాలుష్యానికి నిశ్శబ్దమే విరుగుడా?
మీ ఇళ్లూ మీ పరిసర ప్రాంతం ప్రశాంతంగా, నెమ్మదిగా ఉండగలదన్న నిరీక్షణ నిజంగా ఏమైనా ఉందా? మా తదుపరి శీర్షిక ఆ నిజమైన నిరీక్షణను అందిస్తుంది.
[అధస్సూచీలు]
a శబ్దం యొక్క స్థాయి సాధారణంగా డెసిబెల్స్ యొక్క శబ్దాన్ని కొలతవేసే మీటరు ఉపయోగం ద్వారా తీర్మానించబడుతుంది. చెవి కొన్ని పౌనఃపున్యాలను మరితర వాటికంటే ఎక్కువ కచ్చితంగా వినగలదు గనుక, ఆ మీటరు కూడా అదే విధంగా ప్రతిస్పందించేలా రూపొందించబడింది.
b తెల్లని కాంతి ఏ విధంగా కాంతి పుంజంలోని అన్ని పౌనఃపున్యాల మిశ్రమమైవుందో, అదే విధంగా రమారమి సమాన శబ్ద స్థాయిలో వినగల పరిమాణంలోని అన్ని పౌనఃపున్యాలనూ కలిగి ఉండే శబ్దమే తెల్లని శబ్దం.
[6వ పేజీలోని బాక్సు]
మీరు శబ్దం చేసే పొరుగువారిగా ఉండటాన్ని నివారించగల మార్గాలు
● మీరు శబ్దం కలిగించే పని చేసేటప్పుడు మీ పొరుగు వారిని పరిగణలోకి తీసుకోండి, వారికి ఈ విషయాన్ని ముందే తెలియజేయండి.
● శబ్దాన్ని తగ్గించమని పొరుగువారు అడిగినప్పుడు వారితో సహకరించండి.
● మీ వినోదం మీ పొరుగువారికి విపత్తును కలిగించ కూడదని గమనించుకోండి.
● శబ్దం, ప్రకంపనలు హాళ్లు, నేలల ద్వారా సులభంగా ప్రయాణించగలవని జ్ఞాపకం ఉంచుకోండి.
● శబ్దం చేసే వంట వస్తువుల క్రింద ఒత్తు ఏదైనా పెట్టండి.
● ఇంట్లోనూ కారులోను ఉన్న ఫాల్స్ అలారమ్‌లను సరి చేసేందుకు ఎవరినైనా తప్పకుండా పిలవండి.
● రాత్రి చాలా సమయం గడిచిన తర్వాత శబ్దం చేసే పనులను చేయకండి లేక శబ్దం చేసే ఇంటి సామగ్రిని ఉపయోగించకండి.
● మీ పొరుగువారికి చికాకు పుట్టించే స్థాయిలో సంగీతాన్ని మోగించకండి.
● కుక్కలను ఒంటరిగా ఎక్కువసేపు ఉంచకండి.
● పిల్లలు నేలపై గంతులు వేసి అలా క్రింది అంతస్థులో నివసించే వారికి చికాకు కలిగించడాన్ని నివారించండి.
● రాత్రి వేళ్లలో కారు హారన్‌లు మోగించడం, తలుపులు ధడేల్‌మని వేయడం లేక ఇంజిన్‌ను రన్ చేయడం వంటివి చేయకండి.
[7వ పేజీలోని బాక్సు/చిత్రం]
శబ్దం మరియు మీరు
“నేడు బ్రిటన్‌లోని అతి విస్తృతమైన పారిశ్రామిక ముప్పుల్లో శబ్దం ఒకటి మరియు దాని మూలంగా సాధారణంగా చెవుడు వస్తుంది” అని ది టైమ్స్ పేర్కొంటుంది. 85 డెసిబెల్‌కి ఎక్కువ ఉన్న శబ్దం పిండానికి హాని కలిగించవచ్చని కొన్ని వృత్తి ఆరోగ్య అధ్యయనాలు సూచిస్తున్నాయి. శిశువు వినికిడి శక్తికి నష్టం కలుగుతుంది, మరియు శిశువుకు హార్మోన్‌లలో తేడాలు రావచ్చు అలాగే జన్మవైకల్యం కూడా కలుగవచ్చు.
బిగ్గరగా మోగే శబ్దాన్ని వినవలసి రావడం రక్త నాళాలను అడ్డగిస్తుంది మరియు మీ అవయవాలకు రక్తం ప్రవహించడాన్ని తగ్గిస్తుంది. దాని ఫలితంగా, మీ శరీరం మీ రక్తపోటును పెంచే మరియు మీ గుండె పోటును అధికం చేసే హార్మోన్‌లను ఉత్పత్తి చేయడం ద్వారా ప్రతిస్పందిస్తుంది, కొన్నిసార్లు అది గుండెదడ లేక నోటి వాపు రోగానికి కూడా దారి తీస్తుంది.
శబ్దం మీ దినచర్యకు కలత కలిగించినప్పుడు, ఇతర సమస్యలు తలెత్తవచ్చు. కలత నిద్ర పగటిపూట మీ ప్రతిక్రియలను ప్రభావితం చేయగలదు. శబ్దం మీ పని వేగాన్ని ప్రభావితం చేయకపోవచ్చు, అయితే మీరు ఎన్ని తప్పులు చేస్తారనే దాన్ని మాత్రం అది తప్పకుండా ప్రభావితం చేయగలదు.
[9వ పేజీలోని బాక్సు/చిత్రం]
పనివద్ద భద్రత
పనివద్ద కలిగే శబ్దం మీకు ఒక సమస్యగా ఉందని మీరు కనుగొంటే, చెవికి భద్రతనిచ్చే ఏ విధమైన వాటినైనా చెవికి పెట్టుకోవడాన్ని గురించి ఆలోచించండి.c ఇయర్‌మఫ్‌లు ఇయర్‌ఫోన్‌లవలె మీ తలచుట్టూ చక్కగా అమరుతాయి మరియు శబ్దం ఎక్కువగా ఉన్నప్పుడు అవి చాలా ప్రభావవంతంగా ఉంటాయి. వాటివల్ల ఉన్న ఒక ప్రయోజనం ఏమంటే మీరు వాటిని పెట్టుకుని ఉన్నప్పుడు కూడా, మాటలను మరియు యంత్రాల హెచ్చరికా సంకేతాలను మీరు వినగలరు, అయితే అవి ఎక్కడనుండి వస్తున్నాయో గుర్తించడం కష్టంగా ఉంటుంది. ఇయర్‌ప్లగ్‌లు సరైన పరిమాణానివై ఉండాలి మరి మీకు చెవి వ్యాధి లేక చెవి లోపలి భాగంలో చికాకు ఉంటే అవి మీకు సరైనవి కావు.
యంత్రాలను చక్కగా నియంత్రించడం ప్రకంపనలను తగ్గించవచ్చు. యంత్రాలను రబ్బర్ మౌంట్లపై ఉంచడం అలాగే శబ్దం చేసే యంత్రాలను వేరే ప్రాంతంలో ఉంచడం కూడా శబ్దకాలుష్యాన్ని తగ్గించేందుకు సహాయం చేయగలవు.
[అధస్సూచి]
c ఉద్యోగులు వినికిడి సంరక్షణా పరికరాలను ఉపయోగిస్తున్నట్లు యజమానులు రూఢిపర్చుకోవాలని అనేక దేశాల్లోని నియమాలు కోరుతున్నాయి
[8వ పేజీలోని చిత్రం]
వాహనాలనుపయోగించే సమాజం ఉత్పన్నం చేసే శబ్దం నుండి మిమ్మల్ని మీరెలా కాపాడుకోగలరు?