శబ్దం—ఆధునిక న్యూసెన్స్
బ్రిటన్‌నందలి తేజరిల్లు! విలేఖరి ద్వారా
“జీవితంలో ఎంతో ఎక్కువ ఒత్తిడి కలిగించే వాటిలో ఒకటి.”—మకీస్ సపోగస్, ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహాదారు.
“అమెరికాలో సర్వత్రా వ్యాపించిన కాలుష్యమది.”—ది బోస్టన్ సండే గ్లోబ్, అమెరికా.
“మన కాలంలోని అత్యంత అనర్థదాయకమైన కాలుష్యం.”—డైలీ ఎక్స్‌ప్రెస్, లండన్, ఇంగ్లండ్.
మీరు దాన్ని చూడలేరు, వాసన పీల్చుకోలేరు, రుచి చూడలేరు లేక స్పర్శించలేరు. శబ్దం, ఈ ఆధునిక నగర జీవితపు శాపం ఇప్పుడు పల్లెప్రాంతాలనూ కలుషితం చేస్తోంది.
ప్రకృతి శబ్దాలను రికార్డు చేయడంలో 16 సంవత్సరాలు గడిపిన అమెరికాకు చెందిన ఒక ప్రకృతిశాస్త్రజ్ఞుడు ఇప్పుడు తన పని చాలా కష్టతరమైపోయిందని కనుగొన్నాడు. 1984లో అమెరికా నందలి వాషింగ్‌టన్ రాష్ట్రంలో, 15 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ నిమిషాల వరకూ నిశ్శబ్దంగా ఉండే 21 స్థలాలను ఆయన అధ్యయనం చేశాడు. ఐదు సంవత్సరాల తర్వాత వాటిలో కేవలం మూడే నిశ్శబ్ద స్థలాలుగా మిగిలాయి.
ప్రపంచంలోని అనేకమంది నివాసులకు, నిశ్శబ్దంగా ఉండే మూడు స్థలాలను కనుగొనడం ఒక సవాలు. జపానులో, ఏ ఇతర విధమైన కాలుష్యం కంటే శబ్దం మూలంగా ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని 1991 కొరకైన ఒక దేశవ్యాప్త నివేదిక పేర్కొన్నది. వాస్తవానికి, లండన్‌కు చెందిన ది టైమ్స్, శబ్దాన్ని “వర్థమాన కాలంలోని అత్యంత దారుణమైన ఉపద్రవమని” వర్ణించింది. విసుగు పుట్టిస్తూ ఓ కుక్క అదేపనిగా మొరగడం నుండి పొరుగువారి స్టీరియో హోరెత్తడం లేక కారులోని దొంగల అలారమ్ లేక కారు రేడియో ఏకబిగిన మోగడం వరకు, చప్పుళ్లు రావడమనేది మామూలు విషయమైంది. అయినప్పటికీ, శబ్దకాలుష్యం క్రొత్త విషయమేమీ కాదు. దానికి సుదీర్ఘ చరిత్రే ఉంది.
క్రొత్త సమస్యేమీ కాదు
ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు, జూలియస్ సీజర్ రోము నగరం మధ్యలో చక్రాల బళ్లు పగటివేళ తిరుగకూడదని నిషేధించాడు. దుఃఖకరంగా, “చెక్క మరియు ఇనుప అంచులుగల చక్రాల బళ్ళు రాళ్లుపర్చిన రోడ్లపై గరగర శబ్దం చేయడంతో” ఆయనకు ఆయన తోటి రోము నివాసులకూ కూడా ఆ ఆజ్ఞ రాత్రి వేళ్లల్లో తీవ్రమైన శబ్దకాలుష్యాన్ని కలిగించింది. (లూయిస్ మమ్‌ఫోర్డ్ రచించిన చరిత్రలో నగరం) (ఆంగ్లం) ఒక శతాబ్దం కంటే ఎక్కువకాలం గడిచిన తర్వాత, జూవినల్ అనే కవి, ధ్వని రోములోని వారికి నిత్యమైన నిద్రలేమి కలిగేలా శపించిందని ఫిర్యాదు చేశాడు.
ఇంగ్లండ్ రాజధాని లండన్ 16వ శతాబ్దానికల్లా సందడిగల మహానగరమైంది. “అనేకమంది సందర్శకులను మొట్టమొదట ఆకట్టుకునేది వేలకొలది వర్క్‌షాపుల్లో నుండి వచ్చే రణగొణధ్వని మరియు సుత్తి పోట్లు, బండ్ల చక్రాలు చేసే గరగరమనే కర్ణకఠోరమైన ధ్వనులు, మార్కెట్టుకు తీసుకొని పోబడే పశువుల అరుపులు, వీధిలో సరుకులమ్మే అమ్మకందారుల బొంగురుబోయిన కేకలు” అని ఎలిజబేత్ కాలంలో ఇంగ్లండ్ (ఆంగ్లం) అనే గ్రంథ రచయిత్రియైన ఆలసన్ ప్లావుడిన్ వ్రాస్తుంది.
అయితే 18వ శతాబ్దం పారిశ్రామిక విప్లవ ప్రారంభాన్ని చూసింది. ఇప్పుడు కర్మాగార కార్మికులకు వినికిడి లోపం కలగడంతో యంత్రాల ధ్వని యొక్క ప్రభావం వ్యక్తమైంది. అయితే కర్మాగారాల వద్ద నివసించని నగరవాసులు కూడా తమ ప్రశాంతతకు మరింత ఎక్కువగా భంగం వాటిల్లుతోందని ఫిర్యాదు చేశారు. చరిత్రకారుడైన థామస్ కర్లల్ కోడి కూత, పొరుగింటి వారి పియానో మరియు సమీపానున్న వీధుల్లోని ట్రాఫిక్ ధ్వనుల్ని తప్పించుకునేందుకు లండన్‌లోని తన ఇంటి పైభాగాన వున్న “శబ్దం లోనకు ప్రవేశించలేని గది” శరణుజొచ్చాడు. ది టైమ్స్ ఇలా నివేదిస్తోంది: “అది సమస్యను పరిష్కరించలేదు.” ఎందుకు? “అప్పుడు ఆయన్ని పడవలు మరియు రైళ్ల కూతలవంటి సరికొత్త శబ్దాలు పీడించాయి”!
విస్తృతంగా వ్యాపించిన ఆధునిక కాలుష్యం
శబ్దకాలుష్య నిరోధ చట్టాలను రూపొందించాలని జరుగుతున్న ప్రయత్నాలను విమానయాన కార్యాలయం వారు తీవ్రంగా అడ్డుకుంటున్నందున నేడు శబ్ద వ్యతిరేక ఉద్యమకారులు తమ అవధానాన్ని విమానాశ్రయాలపైకి మళ్లిస్తున్నారు. సూపర్‌సోనిక్ కాంకార్డ్ విమానం పైకెగిరిన ప్రతిసారీ, ఇంగ్లండ్‌నందలి మాంచెస్టర్ విమానాశ్రయం తప్పనిసరి జరిమానా విధించినప్పుడు అవి ప్రభావవంతమైన చర్యలయ్యాయా? లేదు. ఒక కాంకార్డ్ కెప్టన్ విమానం చాలా చప్పుడు చేస్తుందని అంగీకరిస్తూ, అయితే విమానం పైకెగిరేటప్పుడు ధ్వని తీవ్రతను తగ్గించేందుకు తక్కువ ఇంధనాన్ని ఉపయోగిస్తే అది టోరంటోకో లేదా న్యూయార్క్‌కో ఏకబిగిన చేరుకోలేదని చెప్పాడు.
రోడ్డు ట్రాఫిక్ శబ్దాన్ని నివారించడం కూడా సమస్యలతో కూడినదే. ఉదాహరణకు, జర్మనీలో ఈ విధమైన కాలుష్యం 64 శాతం జనాభా ప్రశాంతతకు భంగం వాటిల్లేలా చేస్తుందని అధ్యయనాలు బయల్పరుస్తున్నాయి. మరి పెరిగిపోతున్న ఈ సమస్య, సమాజం వాహనాలను ఉపయోగించడం ప్రారంభించక ముందటికంటే వేయి రెట్లు తీవ్రమైనదని చూపిస్తున్నాయి. “యూరప్ అంతటిలోకీ చాలా ఎక్కువ చప్పుడుచేసే నగరాల్లో ఏథెన్సు ఒకటి, ఆ కోలాహలం ఎంత వేదనాభరితంగా ఉందంటే అది ఏథెన్సు వారి ఆరోగ్యానికి హాని కలుగజేస్తోంది” అని గ్రీస్‌నుండి వచ్చిన నివేదిక పేర్కొంటుంది. అదే విధంగా, ట్రాఫిక్ శబ్దాల్లో మరీ విపరీతమైన పెరుగుదలను గమనించి దానికి కారణం అధికంగా వాహనాలను ఉపయోగిస్తుండడమేనని జపాన్ యొక్క పర్యావరణ సంబంధ ఏజెన్సీ పేర్కొన్నది. తక్కువ వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు కారు ఇంజనే బాగా చప్పుడు చేస్తుంది, అయితే గంటకు 60 కంటే ఎక్కువ కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు చక్రాలే ఎక్కువ శబ్దం చేస్తాయి.
బ్రిటన్‌లో శబ్దాన్ని గురించి ఫిర్యాదు చేయడానికిగల అతి పెద్ద కారణం పొరుగువారి గృహాలనుండి వస్తున్న శబ్దమే. 1996లో, పొరుగువారు చేసే శబ్దాన్ని గురించిన ఫిర్యాదుల్లో 10 శాతం పెరుగుదలను బ్రిటన్ ప్రభుత్వ గుర్తింపు పొందిన పర్యావరణ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఆ సంస్థ కొరకైన ఒక ప్రతినిధి ఇలా వ్యాఖ్యానించింది: “దాన్ని వివరించడం కష్టం. ఒక కారకం ఏమంటే ప్రజలు తమ పనిస్థలాల వద్ద అనుభవిస్తున్న తీవ్రమైన ఒత్తిడి వారు మరింత ఎక్కువ ప్రశాంతతను నిశ్శబ్దతను కోరేందుకు నడుపుతోంది.” బ్రిటన్‌నందు 1994లో దాఖలు చేయబడిన మూడింట రెండు వంతుల ఫిర్యాదుల్లో చాలా పొద్దుపోయిన తర్వాత సంగీతం పెట్టడం మరియు కార్ల ఇంజన్లు, అలారమ్‌లు మరియు హారన్‌లు విపరీతమైన చప్పుడు చేయడాన్ని గురించినవే. అయితే ప్రతీకారం తీర్చుకుంటారనే భయం మూలంగా ఫిర్యాదు చేయని, 70 శాతం ఉన్నట్లు అంచనావేయబడిన శబ్దకాలుష్య బాధితుల సంగతేమిటి? సమస్య వాస్తవంగానే ఇంకనూ తీవ్రంగా వ్యాప్తి చెంది ఉంది.
విస్తృతవ్యాప్త ధ్వని న్యూసెన్స్ మూలంగా, పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రయత్నించే ఏజెన్సీలు శబ్దకాలుష్యాన్ని నివారించే చట్టాల కొరకు ఒత్తిడి చేస్తాయి. ఉదాహరణకు, అమెరికాలో లాండ్‌స్కేపింగ్ చేసేందుకు కరెంటు ద్వారా ఉపయోగించే పరికరాలపై ఆంక్షలు విధించేందుకు కొన్ని సముదాయాలు స్థానిక నియమాలను స్వీకరించాయి. బ్రిటన్‌లో, ఒక క్రొత్త ధ్వని చట్టం రాత్రి 11 గంటలు మొదలుకొని ఉదయం 7 గంటల మధ్యలో చట్టాన్ని అతిక్రమించి మితిమీరి శబ్దం చేసే పొరుగువారిని పట్టుకుని అక్కడికక్కడే జరిమానా చెల్లింపజేయగల అధికారాన్ని ఇచ్చింది. విపరీతంగా శబ్దం చేయడం ద్వారా విసుగు పుట్టించే స్టీరియోను జప్తు చేసే హక్కును కూడా స్థానిక అధికారులు కలిగి ఉన్నారు. అయినప్పటికీ, శబ్దం ఇంకా వస్తూనేవుంది.
శబ్దకాలుష్యం నిజంగా పెరిగిపోతున్న సమస్య గనుక బాధితునిగా మీరేమి చేయగలరని మీరు ఆలోచిస్తుండవచ్చు. అయితే మీరు చప్పుడు చేయకుండా ఎలా నివారించగలరు? ఎడతెగని ప్రశాంతత మరియు నిశ్శబ్దత ఎప్పటికైనా ఉంటాయా? జవాబుల కొరకు ఈ తదుపరి శీర్షికలను చదవండి.