కుండలోని క్రొవ్వు నుండి ఒక పాఠం
నా చిన్ననాటి జ్ఞాపకాల్లో కొన్ని యుద్ధం వలన కలిగిన భయంకరమైన సంఘటనలను గూర్చినవే. నాకు కేవలం నాలుగేండ్లున్నప్పుడు, అంటే రెండవ ప్రపంచ యుద్ధం ముగుస్తున్న కాలంలో మేము ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పారిపోవడం నాకు మరి ముఖ్యంగా జ్ఞాపకముంది. ఏడుగురు సభ్యులున్న మా కుటుంబం అప్పట్లో జర్మనీలో భాగమైన తూర్పు ప్రష్షాలో నివసించేది.
భయంకరమైన అంధకారంలోనికి చూస్తూ, రష్యా దేశపు బాంబర్ విమానాలు సమీపిస్తున్న చప్పుడు విన్నాను. అకస్మాత్తుగా, కళ్ళు మిరుమిట్లు గొలిపేంతటి కాంతివంతమైన మెరుపులు కనిపించాయి. చెవులు చిల్లులు పడే భయంకర శబ్దంతో ప్రేలుడ్లు జరిగాయి. అవి కొన్ని వందల గజాల దూరంలో ఉన్న ఇంధనాలను నిల్వ చేసే టాంకులకు నిప్పంటించాయి. మేమున్న రైలు పట్టాల మీద పెద్దగా కుదుపబడగా, అందులో ఉన్న ప్రయాణికులు గట్టిగా కేకలు వేశారు. అయితే త్వరలోనే ఆ బాంబర్ విమానాలు వెళ్ళిపోయాయి. మా ప్రయాణం కొనసాగింది.
మరొక సందర్భంలో, రైలుతో కలపబడివుండే పశువులను తీసుకువెళ్ళే బండిలో మేము ప్రయాణిస్తున్నాము. నేను మగత నిద్ర నుండి మేల్కొన్నప్పుడు మేమున్న బండిలోనే ఉన్న ఒక స్త్రీ ఏడుస్తూ బండిలో నుండి దూకడానికి ప్రయత్నించడం చూశాను. నాన్న ఆమెను పట్టుకుని బలవంతంగా బండిలోకి వెనక్కి లాగాడు. ఆ స్త్రీ తన బిడ్డను చేతిలో ఉంచుకుని తలుపు దగ్గర ఉండి నిద్రపోయిందట. తను మేల్కొన్నప్పుడు తన బిడ్డ చలికి గడ్డకట్టి చనిపోయి ఉండడం చూసిందట. మగవాళ్ళు ఆ బిడ్డ మృతశరీరాన్ని మంచులోకి విసిరేశారట. దుఃఖం భరించలేక ఆ తల్లి బయటికి దూకి తన బిడ్డతో పాటు చనిపోయే ఉద్దేశంతో తలుపు తెరవడానికి ప్రయత్నించింది.
ఆ విపరీతమైన చలిని తట్టుకునేందుకు, మా బండి మధ్యభాగంలో గుండ్రని పొయ్యి ఉంచబడింది. బండి చివర్లో ఉన్న కొన్ని కట్టెలను బంగాళాదుంపలు వండేందుకు ఉపయోగించారు. బండిలోని కొయ్యపలకలు విపరీతంగా చల్లబడి ఉన్నాయి. చలి నుండి తప్పించుకునేందుకు కొయ్యపలకలపై బంగాళాదుంపలను పేర్చుకుని పడకగా కూడా ఉపయోగించుకున్నాం.
ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఎందుకు పారిపోవలసి వచ్చింది? శరణార్థులముగా కొన్ని నెలల వరకూ మా కుటుంబమెలా మనుగడ సాగించింది? చెప్తానుండండి.
యూదామత వారసత్వం
1940, డిసెంబర్ 22న తూర్పు ప్రష్షా లోని, లిక్ (ఇప్పుడు పోలండ్‌లోని ఎల్‌క్)లో నేను జన్మించాను. మేము ఐదుగురు పిల్లలము. అందరిలో నేనే చిన్నవాడ్ని. మత సంబంధ హింస మా యూదామత పూర్వీకులు 1700’ల చివరిలో జర్మనీ వదలి వెళ్ళడాన్ని తప్పనిసరిచేసింది. చరిత్రలో వలస వెళ్ళిన అతిపెద్ద గుంపుల్లో ఒకదానితో కలిసి వాళ్ళు రష్యాకు తరలివెళ్ళారు. అయితే, యూదామతస్థుడైన మా తాతగారు రష్యాలో అప్పట్లో ప్రబలివున్న యూదామత వ్యతిరేక హింసను తప్పించుకునేందుకు వాల్గా నది సమీపాన ఉన్న తన గ్రామం నుండి తూర్పు ప్రష్షాకు 1917లో వలస వెళ్ళారు.
తాతగారు జర్మనీ పౌరత్వాన్ని సంపాదించారు. తూర్పు ప్రష్షా సురక్షితమైన స్థలంగా కనిపించింది. మా నాన్న పేరు ఫ్రీడ్రిక్ జాలోమోన్. యూదా ఇంటి పేర్లు గలవారు వాటిని ఆర్యుల పేర్లుగా మార్చుకున్నారు. అలా మా నాన్న ఫ్రిట్స్ అని పిలువబడ్డాడు. మరొక వైపు, మా అమ్మ ప్రష్షావాసి. ఆమే, సంగీతజ్ఞుడైన మా నాన్నా 1929లో వివాహం చేసుకున్నారు.
నా తల్లిదండ్రులకు జీవితం సంతోషభరితమైనదిగా, అపేక్షించదగినదిగా కనిపించింది. మా అమ్మమ్మ ఫ్రేడరీక్, మా అవ్వ (మా అమ్మ తరపు) విల్‌హల్‌మీన్ ఒక పెద్ద పొలాన్ని కొనుక్కున్నారు. నా తల్లిదండ్రులకూ, పిల్లలమైన మాకూ అది సుఖప్రదమైన స్థలమయ్యింది. మా కుటుంబంలో సంగీతం గొప్ప పాత్ర వహించింది. మా నాన్న నాట్య బృందంలో మా అమ్మ డోలు వాయించేది.
నాజీ అధీనత
1939లో రాజకీయరంగంలో అశుభ సూచకాలు కనిపించనారంభించాయి. యూదుల సమస్యకు అడాల్ఫ్ హిట్లర్ చెప్పిన తుది పరిష్కారం నా తల్లిదండ్రులను కష్టాలపాలు చేయనారంభించింది. పిల్లలమైన మాకు యూదామత వారసత్వం ఏమిటో తెలియదు. 1978లో మా అమ్మ మరణం—అప్పటికి మా నాన్న మరణించి తొమ్మిది సంవత్సరాలు గడిచాయి—వరకూ మాకు దాని గురించి తెలియదు.
తను యూదుడు అని ఎవరూ అనుమానించకుండా ఉండేందుకు నాన్న జర్మన్ సైన్యంలో చేరాడు. మొదట ఆయన సంగీత బృందంలో సేవ చేశాడు. అయితే, ఆయన కుటుంబ నేపథ్యం గురించి బాగా తెలిసిన ఒక వ్యక్తి ఈయన యూదా మతస్థుడు అని చెప్పాడు. అలా మా కుటంబాన్నంతటినీ ఇంటరాగేట్ చేశారు. మమ్మల్ని ఫోటో తీశారు. మాకు యూదుల పోలికలున్నాయా లేవా అని నిర్ధారించేందుకు నిపుణులు ప్రయత్నించారు. మేము వాళ్ళ కంటికి ఆర్యులుగానే కనిపించాం. అలా మా అదృష్టం కొద్దీ వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేయనూ లేదు చెరసాలలో వేయనూ లేదు.
1939 సెప్టెంబర్ 1న జర్మనీ పోలాండ్‌ను ఆక్రమించినప్పుడు మునుపు శాంతియుతంగా ఉండిన మా మండలాన్ని భయం ఆవహించసాగింది. సురక్షితమైన ప్రాంతానికి వెంటనే తరలివెళ్ళాలని అమ్మ కోరుకుంది. కానీ నాజీ అధికారులు మేము అలా వెళ్ళకుండా బలవంతంగా ఆపేశారు. రష్యా సైన్యాలు 1944 వేసవిలో తూర్పు ప్రష్షావైపుకు అడుగు పెడుతుండగా జర్మన్ దేశస్థులు లిక్‌నూ దాని చుట్టుప్రక్కల ప్రాంతాలనూ ఖాళీ చేయాలని నిర్ణయించుకున్నారు. జూలైలో, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళండని ఒకరోజు మాతో చెప్పారు. మాకు కేవలం ఆరు గంటల వ్యవధినే ఇచ్చారు.
అనేకులు భయంతో వలసవెళ్ళడం
అమ్మ నిర్ఘాంతపోయింది. ఏమేమి తీసుకోవాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎలా ప్రయాణించాలి? మేము మళ్ళీ ఎప్పటికైనా తిరిగి రాగలమా? ఒక్కో కుటుంబం తాము తీసుకోగల వస్తువుల విషయంలో కచ్చితమైన పరిమితులు ఉంచబడ్డాయి. అమ్మ జ్ఞానపూర్వకంగా ప్రాథమికావసర వస్తువులను—ఒక మట్టి కుండలో ఎద్దు మాంసపు క్రొవ్వూ, పంది మాంసం ముక్కలతో సహా—మేము మోయగలిగినవి మాత్రమే తీసుకుంది. ఇతర కుటుంబాలు తమ విలువైన వస్తువులను తీసుకున్నారు.
1944 అక్టోబర్ 22న రష్యా దళాలు తూర్పు ప్రష్షాలో ప్రవేశించాయి. ఒక రచయిత ఇలా వివరించాడు: “తమ సొంత కుటుంబంలోనివారిని చంపేయడాన్ని తమ స్వగృహాలనూ ధాన్యాలనూ కాల్చడాన్నీ చూసిన రష్యా సైనికులు ప్రతీకారం తీర్చుకోవడం సహజమే.” ఆ వినాశనం తూర్పు ప్రష్షా అంతటినీ భయంతో ముంచివేసింది. ప్రజలు ప్రాణభయంతో పారిపోయారు.
ఆ సమయంలో మేము తూర్పు ప్రష్షాలోని పడమరవైపున సుదూరాన శరణార్థులముగా జీవిస్తున్నాము. బాల్టిక్ సముద్రమే తప్పించుకునే ఏకైక మార్గంగా కనిపించింది. కనుక ప్రజలు డాన్జింగ్ (ఇప్పుడు పోలండ్‌లోని డాన్‌స్క్)లోని ఓడరేవుగల పట్టణానికి పారిపోయారు. అక్కడ అత్యావశ్యక రక్షణ కార్యక్రమాల కోసం సైనిక సేవలు చేసేందుకు ఓడలను నిర్బంధించడం జరిగింది. 1945 జనవరి 30 నాడు డాన్జింగ్‌కు సమీపాన ఉన్న డిన్యా నుండి బయలుదేరిన జర్మన్ పాసెంజర్ ఓడయైన విల్హమ్ గూస్ట్‌లోఫ్‌లో మమ్మల్ని ఎక్కించేందుకు మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళే రైలును మా కుటుంబం అందుకోలేకపోయింది. రష్యావారి విధ్వంసక జలాంతర్గాములు ఆ ఓడను ముంచివేశాయనీ, అలా దాదాపు 8,000 మంది ప్రయాణికులు మంచుగడ్డలాంటి ఆ నీటిలో చనిపోయారనీ మాకు ఆ తర్వాత తెలిసింది.
సముద్రం గుండా తప్పించుకునే మార్గం మూయబడడంతో మేము పడమటి వైపుగా ప్రయాణించాము. మా నాన్న సైన్యంలోనుండి తాత్కాలిక సెలవు తీసుకుని, మొదట పేర్కొన్నట్లు రైలు ప్రయాణంలో కొంచెం దూరం వరకు మాతోపాటు వచ్చాడు. ఆయన సైనిక సేవలో త్వరలోనే తిరిగి చేరవలసి ఉన్నందున, చాలా దూరం కొనసాగే ప్రమాదకరమైన ప్రయాణం మా అంతట మేమే చేయవలసి వచ్చింది. కుండలోని క్రొవ్వును అమ్మ పదిలంగా ఉంచింది. అందరికీ కొంచెం కొంచెం వడ్డించింది. దారిలో మేము సేకరించే ఆహారపదార్ధాలతో ఆ క్రొవ్వును కలుపుకుని తినేవాళ్ళం. అలా అది ఆ సుదీర్ఘమైన చల్లని శీతాకాలంలో మా ప్రాణాలను నిలబెట్టింది. ఆ కుండలోని క్రొవ్వు నిజానికి బంగారంకన్నా వెండికన్నా మరింత విలువైనదని తేలింది!
చివరికి మేము స్టార్‌గార్ట్ నగరానికి చేరుకున్నాం. అక్కడే రైల్వేస్టేషన్ దగ్గర జర్మనీ సైనికులూ మరియు రెడ్ క్రాస్ సంస్థా ఏర్పరచిన శిబిరం ఉంది. ఎంతో ఆకలి ఉన్న బిడ్డకు అక్కడ ఇవ్వబడే సూపే పరమాన్నంగా కనిపించింది. తుదకు, మేము ఆకలితోను నిస్సత్తువతోనూ జర్మనీలోని హామ్‌బర్గ్‌ను చేరుకున్నాము. అయితే సజీవంగా ఉన్నందుకు కృతజ్ఞులము. రష్యా మరియు పోలండ్ యుద్ధ ఖైదీలతోపాటు మమ్మల్నీ నది ప్రక్కన ఒక పొలంలో ఉంచారు. 1945 మే 8న యూరప్‌లో యుద్ధం ముగిసేసరికి మా పరిస్థితి చాలా సందిగ్ధంగా ఉంది.
శరణార్థులుగా జీవితం
అమెరికన్లు నాన్నను ఖైదీగా తీసుకువెళ్ళారు. ఆయనకు గౌరవమర్యాదలు చూపబడ్డాయి—మరి ముఖ్యంగా, ఆయన సంగీతజ్ఞుడు అని తెలిసినప్పుడు. వాళ్ళ స్వాతంత్ర్య దిన వేడుకలకు ఆయన సంగీత నైపుణ్యాలనన్నింటినీ వాళ్ళు బాగా వినియోగించుకున్నారు. కొద్ది కాలం తర్వాత మా నాన్న ఎలాగోలా తప్పించుకుని హామ్‌బర్గ్ చేరుకోగలిగాడు. అలా మేము సంతోషంగా తిరిగి కలుసుకోగలిగాము. మేము ఒక చిన్న ఇంట్లో నివాసమేర్పరచుకున్నాం. త్వరలోనే మా అమ్మమ్మా నాన్నమ్మా సురక్షితంగా చేరుకున్నారు. అలా వాళ్ళు మమ్మల్నీ మళ్ళీ కలవగలిగారు.
అయితే ఇంతలోనే మా లూథరన్ చర్చ్‌తో సహా స్థానిక నివాసులందరూ అనేక మంది శరణార్థులపై కోపాన్ని పెంచుకోవడం మొదలుపెట్టారు. ఒక సాయంత్రం అక్కడి చర్చి పరిచారకుడు మా కుటుంబాన్ని సందర్శించాడు. తగువు పెట్టుకోవాలనే ఉద్దేశంతోటే, శరణార్థులుగా మా స్థాయిని గురించి అలా అవమానిస్తూ ఆయన మాట్లాడాడని అనిపించింది. దృఢ కాయుడైన మా నాన్నకు కోపం వచ్చి ఆ పరిచారకునిపై దాడి చేశాడు. మా అమ్మా, అమ్మమ్మ, నాన్నమ్మ మా నాన్నను వారించారు. కానీ మా నాన్న మత నాయకుడ్ని పైకి లేపి, తలుపు దాకా తీసుకు వెళ్ళి, బయటకు నెట్టేశాడు. అప్పటి నుండి ఆయన తన ఇంట్లో మత సంబంధమైన ఏ చర్చలనూ అనుమతించలేదు.
ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత, జర్మన్ రైల్వేలో నాన్నకు ఉద్యోగం దొరికింది. మేము హామ్‌బర్గ్ పొలిమేరలకు తరలివెళ్ళాం. అక్కడ నిరుపయోగంగా ఉన్న రైలుపెట్టెలో మేము నివసించాం. తర్వాత, నాన్న మా కోసం చిన్న ఇల్లు కట్టాడు. కాని శరణార్థుల ఎడల ద్వేషం అలాగే కొనసాగింది. పిల్లవాడనైన నన్ను స్థానిక పిల్లలు శారీరకంగానూ మరియు భావోద్వేగ సంబంధంగానూ చాలా వేధించారు.
మా కుటుంబం ఎన్నుకున్న మతం
పిల్లవాడనైన నేను అమ్మమ్మా, నానమ్మా పడుకునే గదిలోనే నిద్రపోయేవాడ్ని. ఇంట్లో మత విషయాలు చర్చించవద్దని మా నాన్న ఆజ్ఞ జారీ చేసినప్పటికీ, ఆయన ఇంట్లో లేనప్పుడు, వాళ్ళిద్దరూ నాతో దేవుడ్ని గురించి మాట్లాడేవారు, స్తుతిగీతాలు పాడేవారు. తమ బైబిళ్ళను చదివేవారు. ఆ విధంగా నా ఆధ్యాత్మిక ఆసక్తి రేకెత్తించబడింది. అలా నాకు పదేండ్లున్నప్పటి నుండి, దాదాపు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న చర్చ్‌లో హాజరయ్యేందుకు ఆదివారాల్లో కాలినడకన వెళ్ళి రావడం మొదలుపెట్టాను. అయితే, నేను అడిగిన అనేక ప్రశ్నలకు సంతృప్తికరమైన జవాబులు దొరకనందున నాకు నిరాశ కలిగిందని నేను తప్పనిసరిగా చెప్పవలసిందే.
తర్వాత, 1951 వేసవిలో, శుభ్రంగా ముస్తాబైన ఒక వ్యక్తి మా తలుపు తట్టాడు. ఆయన కావలికోట పత్రికను మా అమ్మకు చూపించాడు. “కావలికోట దేవుని రాజ్యంలోనికి అంతర్దృష్టిని ఇస్తుంది” అని ఆయన అన్నాడు. నేను కోరుకున్నది అదే కనుక నా హృదయం ఉప్పొంగిపోయింది. మా అమ్మ సవినయంగా దానిని నిరాకరించింది. నిస్సందేహంగా, మా నాన్న మతాన్ని వ్యతిరేకిస్తున్నందువల్లే అమ్మ నిరాకరించింది. అయితే నేను ఆమెను ఎంతో బతిమాలినందువల్ల, ఆమె నాపై దయచూపించి, నా కోసం ఒక ప్రతిని కొనింది. కొంత కాలం తర్వాత, ఎర్నస్ట్ హిబ్బింగ్ తిరిగి వచ్చి “దేవుడు సత్యవంతుడై ఉండును గాక” అనే పుస్తకాన్నిచ్చి వెళ్ళాడు.
ఆ రోజుల్లోనే, పని స్థలంలో నాన్నకు ప్రమాదం జరిగి, ఆయన కాలు విరిగింది. అంటే ఆయన నాలుగు గోడలకు బందీ అయిపోయాడన్నమాట. దీనితో ఆయనకు మరింత చిరాకు కలిగింది. ఆయన కాలుకు ప్లాస్టర్ వేయబడినప్పటికి, కుంటుతూ నడవగలిగేవాడు. ఆయన పగలు సమయమంతా అప్రత్యక్ష్యమైపోయి, భోజన సమయాల్లో మాత్రమే కనిపించి మమ్మల్ని ఆశ్చర్యంలో ముంచేసే వాడు. ఒక వారమంతా ఇలాగే జరిగింది. మా నాన్న అప్రత్యక్ష్యమైనప్పుడెల్లా, నా పుస్తకం కూడా అప్రత్యక్ష్యమౌతోందని నేను గమనించాను. ఆ తర్వాత, “ఆ మనిషి మళ్ళీ వస్తే నేను ఆయనను కలవాలనుకుంటున్నాను!” అని మా నాన్న భోజన సమయంలో అన్నాడు.
సహోదరుడు హిబ్బింగ్ తిరిగి వచ్చినప్పుడు, ఆ పుస్తకాన్ని బల్ల మీదకు గిరాటేస్తూ, “ఈ పుస్తకం చెబుతున్నది నిజం!” అని మా నాన్న అనడం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. వెంటనే బైబిలు పఠనం ఆరంభించబడింది. తర్వాత కుటుంబంలోని మిగతా సభ్యులు కూడా పఠనంలో కలిశారు. సహోదరుడు హిబ్బింగ్ నాకు నమ్మదగిన సలహాదారుడూ, నిజమైన స్నేహితుడూ అయ్యాడు. నేను క్రొత్తగా కనుగొన్న విశ్వాసాలను ఇతరులతో పంచుకోవడానికి ప్రయత్నించినందుకు సండే స్కూలు నుండి త్వరలోనే బహిష్కరించబడ్డాను. అలా నేను లూథరన్ చర్చ్‌కి రాజీనామా ఇచ్చాను.
1952 జూలైలో, ఇంటింటా దేవుని రాజ్య సువార్తను ప్రకటించడంలో నా ప్రియ స్నేహితునితో పని చేయడం మొదలు పెట్టాను. తాను గృహస్థులకు సందేశాన్ని ఎలా తెలియజేస్తున్నాడో శ్రద్ధగా ఆలకించమని ప్రతి ఆదివారం సహోదరుడు హిబ్బింగ్ నాకు ఉద్భోధించేవాడు. కొన్ని వారాల తర్వాత, అనేక బిల్డింగ్‌లు ఉన్న ఒక పెద్ద బ్లాక్‌ను చూపిస్తూ, “ఇదంతా నువ్వు చెయ్యడానికే” అని అన్నాడు. కొంతకాలానికి నేను భయాన్ని అధిగమించాను. ప్రజలతో మాట్లాడ్డంలోనూ, వారికి బైబిలు సాహిత్యాన్ని అందజేయడంలోనూ సఫలీకృతుడనయ్యాను.
త్వరలోనే, యెహోవాకు నేను చేసుకున్న సమర్పణకు ప్రతీకగా బాప్తిస్మం పొందేందుకు అర్హుడనయ్యాను. నేనూ మా నాన్నా 1953 మార్చి 29న బాప్తిస్మం తీసుకున్నాం. తర్వాత ఆ సంవత్సరమే అమ్మ కూడా బాప్తిస్మం తీసుకుంది. చివరకు మా అక్క ఏరీకా; మా అన్నయ్యలు హైస్ట్‌న్ హర్‌బర్ట్ మరియు వర్నర్; అప్పటికి తమ 80లలో అడుగు పెట్టిన మా ప్రియాతి ప్రియమైన అమ్మమ్మా, నాన్నమ్మా, మా కుటుంబ సభ్యులందరూ బాప్తిస్మం తీసుకున్నారు. తర్వాత 1959 జనవరిలో నేను పయినీర్ అయ్యాను. పూర్తికాల పరిచారకులు అలా పిలువబడతారు.
క్రొత్త దేశంలో పరిచర్య
జర్మనీ వదిలిపెట్టి వెళ్ళమని మా నాన్న నాకెప్పుడూ బోధించేవాడు. పూర్వపు విషయాలను పునఃసమీక్షించినదానిని బట్టి, యూదామత వ్యతిరేకతను గురించి ఆయనకు పెరుగుతున్న భయాన్ని బట్టే ఆయన అలా అన్నాడని నమ్ముతున్నాను. ఆస్ట్రేలియాకు వలస వెళ్ళేందుకు దరఖాస్తు పెట్టుకున్నాను. పాపువా న్యూ గినియా లేదా పసిఫిక్ దీవుల్లోని మరేదైనా ప్రాంతంలో మిషనరీగా సేవ చేసేందుకు ఇదొక మెట్టుకావచ్చని ఆశించాను. నేనూ, నా సహోదరుడు వర్నర్ కలిసి బయలుదేరి 1959, జూలై 21న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ చేరుకున్నాం.
కొన్ని వారాల్లోనే, మెల్వా పీటర్జ్‌ను కలిశాను. ఆమె ఫూట్‌స్క్రే సంఘంలో పూర్తికాల పరిచారకురాలుగా సేవచేస్తుంది. 1960లో మేమిద్దరం పెళ్ళి చేసుకున్నాం. మేము ఇద్దరు పాపలతో ఆశీర్వదించబడ్డాం. వాళ్ళు కూడా యెహోవాను ప్రేమించి, ఆయనకు తమ జీవితాలను సమర్పించుకున్నారు. మేము ఒక కుటుంబంగా ఆధ్యాత్మిక లక్ష్యాలనే పూర్తిగా అనుసరించేందుకుగాను నిరాడంబర జీవితాన్ని కొనసాగించాలని కఠిన యత్నం చేశాం. అనేక సంవత్సరాల వరకూ, తనను అనారోగ్యం ఆటంకపర్చనంత వరకూ మెల్వా పయినీరుగానే సేవ చేసింది. ప్రస్తుతం నేను కాన్‌బెరా నగరంలో బెల్‌కోనన్ సంఘంలో పెద్దగానూ, పయినీరుగానూ సేవ చేస్తున్నాను.
నా చిన్నాటి అనుభవాలను బట్టి, యెహోవా ఇచ్చినవాటితో సంతోషంగా సంతృప్తిగా ఉండేందుకు నేర్చుకున్నాను. అమ్మ కుండలో క్రొవ్వును తీసుకోవడం చిత్రీకరించినట్లు, మనుగడ అనేది బంగారం మీదనో, వెండి మీదనో కాదు కానీ, ప్రాథమిక అత్యవసర వస్తువులపైనే, మరి ముఖ్యంగా దేవుని వాక్యమైన బైబిలు పైనా, దాని బోధను అన్వయించుకోవడం పైనా ఆధారపడి ఉంటుందని గ్రహించగలిగాను.—మత్తయి 4:4.
యేసు తల్లియైన మరియ పలికిన బుద్ధిసూక్ష్మత గల మాటలు చాలా నిజమైనవి: “[యెహోవా] ఆకలిగొనినవారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టిచేతులతో పంపివేసెను.” (లూకా 1:53) సంతోషకరంగా, బైబిలు సత్యపు మార్గంలో నడిచే మా కుటుంబ సభ్యులను లెక్కపెడితే ఏడుగురు మనవళ్ళతోపాటు 47 మందిమి ఉన్నాం. (3 యోహాను 4) వీళ్ళందరితోపాటు, అలాగే మా ఆధ్యాత్మిక పిల్లలతోపాటూ, మనవళ్ళతోపాటూ యెహోవా యొక్క దయాపూర్వకమైన సంరక్షణ క్రింద ఉండే భద్రతతోకూడిన అద్భుతమైన భవిష్యత్తు కోసమూ, మా ప్రియులైన మిగతావాళ్ళు పునరుత్థానం చెందినప్పుడు వారిని తిరిగి కలుసుకునే గొప్ప కార్యం కోసమూ నేనూ మెల్వా ఎదురు చూస్తున్నాం.—కూర్ట్ హాన్ చెప్పినది.
[21వ పేజీలోని చిత్రం]
1944లో రష్యా సైనిక దళాలు తూర్పు ప్రష్షాలో అడుగుపెట్టడం
[క్రెడిట్ లైను]
Sovfoto
[23వ పేజీలోని చిత్రం]
మా అన్నయ్య హైస్ట్‌న్, మా అక్క ఏరీకా, మా అమ్మ, మా అన్నయ్యలు హర్బర్ట్, వర్నర్, ముందు భాగంలో నేను
[24వ పేజీలోని చిత్రం]
నేనూ, నా భార్య మెల్వా
[24వ పేజీలోని చిత్రం]
క్రొవ్వుతో నింపబడిన ఇలాంటి కుండ మమ్మల్ని పోషించింది