సమస్యలులేని పరదైసు త్వరలో వాస్తవమౌతుంది
‘నీవు నాతోకూడ పరదైసులో ఉంటావు.’ నేర చరితగల ఆ వ్యక్తికి ఆ మాటలు ఎంత ఊరటనిచ్చి ఉంటాయో కదా! తాను మరణించినప్పుడు నరకాగ్నిని తప్పించుకొని పరలోకానికి పోతానని అతను భావించలేదు. బదులుగా, యేసు ప్రక్కనున్న ఆ దొంగ, ఈ భూగృహంపై పరదైసు పునరుద్ధరించబడినప్పుడు తాను పునరుత్థానం చేయబడతాననే నిరీక్షణనుబట్టి ఆదరణ పొందాడు. అయితే పరదైసును గురించిన ఈ ధైర్యవంతమైన వ్యాఖ్యానాన్ని దేవుని స్వంత కుమారుడైన యేసుక్రీస్తు చేశాడనే విషయాన్ని దయచేసి గమనించండి.—లూకా 23:43.
పరదైసును గురించిన క్రీస్తు వాగ్దానాన్ని ఏది పురికొల్పింది? ఆ దొంగ ఇలా వేడుకున్నాడు: ‘యేసూ, నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుము.’ (లూకా 23:42) ఈ రాజ్యం ఏమిటి, దానికీ మరియు ఒక భూ పరదైసుకూ మధ్య ఏమి సంబంధం ఉంది? పరదైసు సమస్యలు లేనిదిగా ఉంటుందనే విషయానికి ఇది ఎలా హామీ ఇస్తుంది?
పరదైసును స్థాపించే శక్తి
ప్రస్తుత దిన సమస్యలన్నీ పోయిన తర్వాత మాత్రమే ఈ భూమిపై నిజమైన పరదైసు రాగలదని మీరు అంగీకరిస్తారు. చరిత్ర సరిగా రుజువు చేస్తున్న విధంగా, సమస్యలను నిర్మూలించేందుకు మానవులు ఇంతవరకూ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. హెబ్రీ ప్రవక్త అయిన యిర్మీయా ఇలా అంగీకరించాడు: “యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదని . . . నేనెరుగుదును.” (యిర్మీయా 10:23) మరి నేటి దిన సమస్యలను అన్నింటినీ ఎవరు మాత్రమే తుడిచి వేయగలరు?
తీవ్ర వాతావరణ పరిస్థితులు మరియు కాలుష్యం. గలిలయ సముద్రంపై వీచిన భయంకరమైన పెనుగాలి ఒక పడవను చిన్నాభిన్నం చేయగలిగేంత పెద్ద అలలను రేపినప్పుడు, నావికులు తమతోపాటూ ఉన్న ప్రయాణ సహవాసిని నిద్ర లేపుతారు. దాని ఫలితంగా, ఆయన సముద్రాన్ని ఉద్దేశించి ఇలా అన్నాడు: ‘నిశ్శబ్దమై ఊరకుండుము!’ మార్కు యొక్క సువార్త వృత్తాంతం జరిగిన విషయాన్ని ఇలా చెబుతుంది: “గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయెను.” (మార్కు 4:39) ఆ ప్రయాణ సహవాసి మరెవరో కాదు యేసే. వాతావరణాన్ని నియంత్రించే శక్తి ఆయనకుంది.
దేవుడు ‘భూమిని నశింపజేయువారిని నశింపజేసే’ సమయం వస్తుందని అపొస్తలుడైన యోహాను ద్వారా ముందే ప్రవచించినది కూడా ఈ యేసే. (ప్రకటన 1:1; 11:18) నోవహు కాలంనాటి జలప్రళయం ద్వారా భక్తిహీనులైన యావత్ లోక ప్రజలను నిర్మూలించిన వానికి ఇది అంత అసాధ్యమైన విషయమేమీ కాదు.—2 పేతురు 3:5, 6.
నేరం మరియు దౌర్జన్యం. బైబిలిలా వాగ్దానం చేస్తుంది: “కీడు చేయువారు నిర్మూలమగుదురు యెహోవాకొరకు కనిపెట్టుకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు.” (కీర్తన 37:9, 11) నేరాన్నీ, దౌర్జన్యాన్నీ నిర్మూలించి దీనుల కొరకు పరదైసును తీసుకు వస్తానని వాగ్దానం చేసినది కూడా యెహోవా దేవుడే.
పేదరికం మరియు ఆకలి. పేద దేశాలు పేదరికంతో పెనుగులాడుతుండగా, ప్రపంచంలోని ఒక ప్రాంతంలో ఆహార పదార్థాలు “కుప్పలు తెప్పలుగా” పేరుకుపోయి ఉండేలా ప్రభుత్వాలు నిలువ చేయటాన్ని ప్రస్తుత దిన అన్యాయం అనుమతిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా శ్రద్ధ చూపే ప్రజల మద్దతుతో సహాయ సంస్థలు ప్రాథమిక అవసరాలను తీర్చేందుకు ప్రయత్నిస్తాయి, అయితే శాంతిభద్రతలు లోపించడం మూలంగా పంపిణీ కార్యక్రమాలు తరచూ విఫలమౌతాయి. ప్రవక్తయైన యెషయా వ్రాసిన దానికీ దీనికీ మధ్యనున్న వ్యత్యాసాన్ని గమనించండి: “ఈ పర్వతముమీద సైన్యములకధిపతియగు యెహోవా సమస్తజనముల నిమిత్తము క్రొవ్వినవాటితో విందు చేయును మడ్డిమీదనున్న ద్రాక్షారసముతో విందుచేయును మూలుగుగల క్రొవ్వినవాటితో విందుచేయును మడ్డిమీది నిర్మలమైన ద్రాక్షారసముతో విందుచేయును.” (యెషయా 25:6) క్షామం మరియు ఆకలి ఇక ఎన్నడూ ఉండవని ఆ మాటలు చెప్పడం లేదా? తప్పకుండా చెబుతున్నాయి.
యుద్ధం. ఈ భూగోళాన్ని ఒక సర్వదేశాతీతమైన అధికారం ద్వారా పరిపాలించాలనే ప్రయత్నాలు విఫలమయినట్లు నిరూపించబడ్డాయి. మరి 1920లో స్థాపించబడిన నానాజాతి సమితి రెండవ ప్రపంచ యుద్ధం జరగకుండా అరికట్టడంలో విఫలమైపోగా అదీ పతనమైపోయింది. శాంతికి అతి శ్రేష్ఠమైన నిరీక్షణయని ఎంతో తరచుగా పొగడబడుతున్న ఐక్యరాజ్య సమితి, పోరాటం జరుగుతున్న ప్రాంతాల్లో వైరి పక్షాల్ని వేరు చేయలేక తిప్పలు పడుతోంది. శాంతిని నెలకొల్పాలని అది బాహటంగా ప్రయత్నిస్తున్నప్పటికీ, యుద్ధాలు అంటే పౌర, జాతి సంబంధమైన యుద్ధాలైనా లేదా సముదాయాలకు సంబంధించిన యుద్ధాలైనా అవి ఎక్కువగానే జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుత దినం యుద్ధాలు చేస్తున్న వర్గాలను తీసేసి తన పౌరులకు శాంతి మార్గాల్లో తర్ఫీదునిస్తానని దేవుని రాజ్య ప్రభుత్వం వాగ్దానం చేస్తుంది.—యెషయా 2:2-4; దానియేలు 2:44.
కుటుంబం మరియు నైతిక పతనం. కుటుంబ జీవితం నానాటికీ విచ్ఛిన్నమౌతుంది. బాల్య నేరాలు పెచ్చుపెరిగిపోతున్నాయి. మానవ సమాజపు అన్ని స్థాయిల్లోనూ అనైతికత ప్రాకిపోయింది. అయినప్పటికీ, దేవుని ప్రమాణాలు ప్రారంభం నుండీ కూడా మారకుండానే నిలిచివున్నాయి. “పురుషుడు తలిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏకశరీరముగా ఉందు[రు] . . . దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచ” కూడదని యేసు రూఢిగా చెప్పాడు. (మత్తయి 19:5, 6) యెహోవా దేవుడు ఇంకనూ ఇలా ఆజ్ఞాపించాడు: “నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడవగుదువు.” (ఎఫెసీయులు 6:2, 3) దేవుని రాజ్యం క్రింద భూమిపై అలాంటి ప్రమాణాలు ఉంటాయి.
రోగం మరియు మరణం. “యెహోవా . . . మనలను రక్షించును” అని ప్రవక్తయైన యెషయా వాగ్దానం చేశాడు, “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు.” (యెషయా 33:22, 24) “ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము” అని క్రైస్తవ అపొస్తలుడైన పౌలు అంగీకరించాడు, “అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము.”—రోమీయులు 6:23.
తన కుమారుడైన యేసుక్రీస్తు ఆధ్వర్యంలో ఉండే తన పరలోక ప్రభుత్వం ద్వారా యెహోవా దేవుడు ఈ సమస్యలన్నింటినీ తీసివేస్తాడు. అయితే మీరిలా అనవచ్చు, ‘ఇది ఉటోపియా స్వప్నం వలె ఉంది. అది వాస్తవమైతే చాలా ఆనందకరంగా ఉంటుంది, అయితే అది వాస్తవమౌతుందా?’
ఒక ప్రస్తుత వాస్తవం
ఇదే భూమిపై సమస్యలు లేని పరదైసులో జీవించడమంటే అనేకులకు అదెంతో అవాస్తవికమైన ఆశాభావంగా అనిపిస్తుంది. ఒకవేళ మీరు కూడా అలానే భావిస్తుంటే, అది వాస్తవంగా జరుగుతుందనడానికి గల రుజువులను పరిశీలించండి.
ఏభై లక్షలకంటే ఎక్కువమంది ప్రజలుగల ఆధునిక కాల అంతర్జాతీయ సముదాయంగా యెహోవాసాక్షులు ఉన్నారు, వారు ఇప్పటికే సాపేక్షికంగా సమస్యలు లేని పరదైసు వాతావరణాన్ని 233 దేశాల్లో ఉన్న 82,000 సంఘాల్లో కలిగివున్నారు. మీరు వారి కూటాల స్థలాలను అవి పెద్దవైనా లేదా చిన్నవైనా వేటినైనా దర్శించవచ్చు, మీరేమి కనుగొంటారు?
(1) ఆహ్లాదకరమైన, స్వచ్ఛమైన వాతావరణం. ఇంగ్లండ్‌లోని నార్‌విచ్‌లో జరిగిన యెహోవాసాక్షుల సమావేశాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ, ఫుట్‌బాల్ స్టేడియం మేనేజరు ఇలా అన్నాడు: “ఆ నాలుగు దినాల్లో ఉండిన శాంతియుతమైన వాతావరణం . . . అంతటా అలుముకుంది. మన చుట్టూ ఉన్న ఉద్రిక్త వ్యాపార ప్రపంచంలో అనుదిన జీవితంలో అనుభవించిన ఏ నాలుగు దినాలకంటే కూడా ఇక్కడ అనుభవించిన వ్యక్తిగత ప్రశాంతత ఎంతో భిన్నంగా ఉంది. సాక్షులు ఎంతో భిన్నంగా ఉన్నారు, దాన్ని వివరించడం సులభ సాధ్యం కాదు.”
ఒక నిర్మాణ సంస్థకు చెందిన, శిక్షణ సలహాదారు, యెహోవాసాక్షుల లండన్ కార్యాలయాన్ని దర్శించిన తర్వాత ఇలా చెప్పాడు: “నేను చూసిన వినిన విషయాలనుబట్టి నేనెంతో ముగ్దుణ్ణయ్యాను, మరి మీ భవనాల్లో ఉన్న ప్రశాంతత నా మీద గట్టి ముద్రవేసింది, అక్కడున్న [స్త్రీ పురుషులు] కూడా శాంతి సామరస్యాలుగల వారిగా ఉన్నారు. మరి సమస్యలతో ఉన్న ఈ మిగతా ప్రపంచానికి మీ జీవనవిధానం ఎంతో నేర్పవలసి ఉందని నేను భావిస్తున్నాను.”
(2) భద్రత మరియు శాంతి. కెనడా నందలి జర్నల్ డె మాంట్రియల్‌కు చెందిన ఒక పత్రికా విలేఖరి ఇలా వ్రాస్తుంది: “నేను యెహోవాసాక్షిని కాను. కానీ సాక్షులు చూపే ప్రవీణతకూ చక్కని ప్రవర్తనకూ మాత్రం నేను ఒక సాక్షిని. . . . ప్రపంచంలో ఈ ప్రజలు మాత్రమే ఉండి ఉంటే మనం రాత్రుల్లో తలుపులకు గొళ్లాలు పెట్టి, దొంగలొస్తే మ్రోగే అలారమ్‌ను బిగించే అవసరం మనకు ఉండదు.”
(3) దేవుని రాజ్య ప్రభుత్వం ఎడల యథార్థత సాక్షుల ముఖ్య లక్షణం. వారి తటస్థ వైఖరి కొందరికి నచ్చకపోవచ్చు, నిజానికి అలా నచ్చకపోనవసరం లేదు. అతుకుల బొంతలాంటి నేటి రాజకీయ పథకాల్లో వారు భాగం వహించకపోవడం, సమాజం బాగుపడాలని వారు కోరుకోకపోవడం మూలంగా కాదు. బదులుగా, పరలోక ప్రభుత్వం ద్వారా పరిపాలించే యెహోవా దేవుని, అంటే భూమికి సృష్టికర్త అయిన ఆయన్ని ప్రీతిపర్చే విధంగా ప్రవర్తించేందుకు వారు ప్రయత్నిస్తారు.
దేవుని వాక్యమైన బైబిలుపై పూర్తిగా ఆధారపడిన సాక్షుల నమ్మకాలు, వారు తెగలుగా లేక మతశాఖలుగా మారే ఉచ్చులో పడిపోకుండా నివారిస్తాయి. ఏ మతానికి చెందిన వారైనప్పటికీ ఇతర ప్రజలందరి విషయంలో వారు దయాపూర్వక ఆసక్తిని కనుపర్చుతారు. తమ ఆలోచనావిధానాన్ని మార్చుకోమని వారు ప్రజలను ఒత్తిడి చేయరు. ఈ భూమిపై త్వరలో స్థాపించబడబోతున్న సమస్యలు లేని పరదైసును గూర్చిన లేఖనాధార రుజువులను అందిస్తూ వారు తమ నాయకుడైన క్రీస్తుయేసును అనుకరించేందుకు ప్రయత్నిస్తారు.—మత్తయి 28:19, 20; 1 పేతురు 2:21.
(4) ఆధ్యాత్మిక ఆరోగ్యం మరియు సంతోషం. వాస్తవికంగా యెహోవాసాక్షులు తామీ కాలంలో పూర్తిగా సమస్యలు లేకుండా ఉన్నామని చెప్పుకోరు. ఆదాము నుండి సంతరించుకున్న పాపపు మచ్చగల ప్రజలకు ఇది అసాధ్యం. అయితే దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో, “ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము” వంటి వ్యక్తిగత లక్షణాలను వృద్ధి చేసుకునేందుకు వారు కృషిచేస్తారు. (గలతీయులు 5:22, 23) యేసుక్రీస్తు ద్వారా వారు యెహోవాను ఆరాధించడమే వారిని ఐక్యపరచి వారి నిరీక్షణను సజీవంగా ఉంచుతుంది.
సాక్షుల ప్రాంతీయ కూటాలను మీరు సందర్శించడం, దేవుడు భూమిని అక్షరార్థ పరదైసుగా మార్చుతాడనే విషయంలో మీరు ఒప్పించబడేందుకు సహాయం చేస్తుందని మేము విశ్వసిస్తున్నాము.
ప్రస్తుత దిన సమస్యలేవీ ఇక ఉండవు. విధేయులైన మానవజాతికి క్రీస్తు విమోచనా క్రయధన బలి ప్రయోజనాలు అన్వయింపబడినప్పుడు తారాడే అసంపూర్ణతలు కూడా క్రమేపి మటుమాయమౌతాయి. అవును, పరిపూర్ణ ఆరోగ్యం మరియు సంతోషం మీ స్వంతం కాగలదు.
అలాంటి ఉత్తరాపేక్షను ఆనందించేందుకు మీకు సరళమైన సిద్ధపాట్లు సహాయబడతాయి. నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకం యొక్క ఒక ప్రతి మీకు కావాలని సాక్షులను అడగండిa. సమస్యలు లేని పరదైసులో నిరంతరం జీవించేందుకు దేవుడు మీ నుండి ఏమి కోరుతున్నాడనే విషయాన్ని దాని సహాయంతో మీరు అనతి కాలంలోనే తెలుసుకోవచ్చు.
[అధస్సూచి]
a వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించినది.
[10వ పేజీలోని చిత్రం]
పూర్తిగా బైబిలుపై ఆధారపడిన సాక్షుల నమ్మకాలు వారు ఒక తెగగా లేక మతశాఖగా కాకుండా నివారిస్తాయి
[8, 9వ పేజీలోని చిత్రాలు]
సమస్యలు లేని పరదైసు కొరకైన పునాది ఇప్పుడు వేయబడుతుంది
త్వరలో భూవ్యాప్తంగా ఒక భౌతిక పరదైసు ఉనికిలోకి వస్తుంది