కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g97 10/8 పేజీలు 24-27
  • మీ వినికిడి శక్తి కాపాడుకోవాల్సిన ఓ బహుమానం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ వినికిడి శక్తి కాపాడుకోవాల్సిన ఓ బహుమానం
  • తేజరిల్లు!—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రాముఖ్యమైన మీ వెలుపలి చెవి
  • మీ మధ్య చెవి—యాంత్రికపరమైన ఓ అద్భుతం
  • ఆశ్చర్యాన్నిగొలిపే మీ లోపలి చెవి
  • మీ మెదడు, వినికిడిశక్తి
  • కాపాడుకోవాల్సిన ఓ బహుమానం
  • దేవుని బహుమానమైన సంతులనం
    తేజరిల్లు!—1996
తేజరిల్లు!—1997
g97 10/8 పేజీలు 24-27

మీ వినికిడి శక్తి కాపాడుకోవాల్సిన ఓ బహుమానం

నగర ప్రాంతపు రణగొణ ధ్వనులకు దూరంగా, పల్లెసీమలో ప్రశాంతమైన సాయం సమయం, రాత్రివేళ విన్పించే మృదువైన శబ్దాల్ని ఆనందించే అవకాశాన్నిస్తోంది. పిల్లగాలి ఆకుల్ని అలవోకగా అటూ ఇటూ కదిలిస్తోంది. కీటకాలూ, పక్షులూ, జంతువులూ తమదైన వింత బాణీలను దానికి జోడిస్తున్నాయి. అలాంటి మృదువైన శబ్దాల్ని వినడం ఎంత మనోహరమైన అనుభూతో కదా! మీరు వాటిని వినగలరా?

మానవ వినికిడి విధానం యొక్క శక్తి అద్భుతమైనది. శబ్దాలన్నింటినీ హరించి వేసేందుకు నిర్మించబడిన ఉపరితలాలతో కూడిన, శ్రవణగ్రాహకరీత్యా ప్రత్యేకంగా ఉన్న గదిలో అంటే ప్రతిధ్వనిరహిత గదిలో ఒక అరగంట గడపండి. మీ వినికిడి శక్తి, మీ శరీరంలోనుండి వస్తున్న అపరిచిత శబ్దాల్ని వినడానికి తగినంత ‘తగ్గుస్థాయికి [నెమ్మదిగా] మారుతుంది.’ ఆ అనుభవాన్ని శ్రవణశక్తులను గూర్చిన మాస్టర్‌ హ్యాండ్‌బుక్‌లో శ్రవణశక్తికి సంబంధించిన శాస్త్రవేత్త ఎఫ్‌. ఓల్టాన్‌ ఎవరెస్ట్‌ వర్ణిస్తున్నాడు. మొదట, మీ గుండె కొట్టుకోవడం పెద్దగా వినిపిస్తుంది. ఆ గదిలో దాదాపు ఓ గంటసేపు ఉన్న తర్వాత, మీ రక్తం రక్తనాళాల్లో నుండి ప్రవహిస్తుండాన్ని మీరు వింటారు. చివరగా, మీకు మంచి వినికిడి శక్తి గనుక ఉంటే, “గుండె ‘చప్పుళ్ల లయబద్ధతల’కూ రక్తం చిమ్ముతున్న శబ్దానికీ మధ్య వెలువడే అపరిచితమైన హుస్సనే శబ్దాన్ని, మీరంతసేపూ ఓపిగ్గా వేచివున్నందుకు ప్రతిఫలంగా వింటారు. అదేమిటి? అది మీ కర్ణభేరిని పదేపదే బలంగా తాకుతున్న గాలికణాల శబ్దమే”నని ఎవరెస్ట్‌ వివరిస్తున్నాడు. “ఈ హుస్సనే శబ్దం మూలంగా కల్గిన కర్ణభేరి చలనం, నమ్మశక్యంకానంత తక్కువగా అంటే ఓ సెంటీమీటరులో 1/100వ మిలియన్‌వంతు ఉంటుంది!” ఇది శబ్దాన్ని పసిగట్టే మీ సామర్థ్యపు కనిష్టస్థాయి “వినికిడి ముఖద్వారమే.” గాలి కణాల కదలిక రొద, బలహీనమైన శబ్దాలను వినబడకుండా చేస్తుంది గనుక సునిశిత శబ్దగ్రాహకశక్తి మీకెందుకూ కొరగాకుండా పోతుంది.

మన నాడీ వ్యవస్థకూ, మెదడుకూ ఉన్న ప్రక్రియా గ్రహణశక్తులతోపాటూ వెలుపలి చెవి యొక్క, మధ్య చెవి యొక్క, లోపలి చెవి యొక్క సహకారం ద్వారా వినికిడి సాధ్యమౌతుంది. ధ్వని తరంగ కంపనాలుగా గాలిలో ప్రయాణిస్తుంది. ఈ తరంగాలు మన కర్ణభేరీలను ముందుకు వెనుకకూ కదిలిస్తాయి. తిరిగి, ఈ కదలిక మధ్య చెవిగుండా లోపలి చెవిలోనికి ప్రయాణిస్తుంది. అక్కడ నాడీ ప్రచోదకాలకు ఆ కదలిక మార్పుచెందుతుంది. దాన్నే మెదడు శబ్దంగా విశ్లేషిస్తుంది.a

ప్రాముఖ్యమైన మీ వెలుపలి చెవి

స్థితిస్థాపక శక్తి కలిగి సంక్లిష్టంగావున్న మీ చెవి యొక్క వెలుపల ఆకారమే చెవిశంకు (పిన్నా) అని పిలువబడింది. ఈ చెవిశంకు శబ్దాన్ని సమీకరిస్తుంది, మరి అంతకన్నా ఇంకా ఎక్కువే చేస్తుంది. ఆ చిన్న నొక్కులన్నింటిని మీ చెవి ఎందుకు కల్గివుందోనని మీరెప్పుడైనా ఆశ్చర్యపోయారా? చెవిశంకు యొక్క వివిధ ఉపరితలాలపైగా ప్రతిక్షేపించబడుతున్న శబ్ద తరంగాలను, అవి వచ్చిన దిశనుబట్టి స్వల్పంగా పరివర్తనం చేస్తుంది. ఈ అత్యంత స్వల్పమైన తరంగ కంపనాల్ని మెదడు డీకోడ్‌ చేసి, శబ్దం ఎక్కడ నుండి వస్తుందో నిర్ధారించగల్గుతుంది. మీ వెలుపల, మధ్య, లోపలి చెవుల్లోకి శబ్దం ప్రవేశిస్తుండగా, దాని సమయ తీవ్రతల్ని పోల్చడంతోపాటుగా ఈ నిర్ధారణ పనిని కూడా మెదడే చేస్తుంది.

దీన్ని ప్రదర్శించడానికి, కళ్లు మూసుకున్న ఓ వ్యక్తికి ఎదురుగా మీ చేతుల్ని పైకీ క్రిందకీ కదుపుతుండగా చిటికె వేయండి. అతని రెండు చెవులకూ సమానమైన దూరంలోనే మీ వ్రేళ్లున్నప్పటికీ, ఆ శబ్దం పైనుండి వస్తుందో, క్రిందనుండి వస్తుందో లేక పైకీ క్రిందకీ మధ్యలో ఎక్కడనుండి వస్తుందో అతడు చెప్పగలుగుతాడు. నిజానికి, రెండు చెవుల్లో ఏదో ఒకటి మాత్రమే బాగా వినబడే వ్యక్తి కూడా, శబ్దాలు ఎక్కడనుండి వస్తున్నాయో గుర్తించగలడు.

మీ మధ్య చెవి—యాంత్రికపరమైన ఓ అద్భుతం

మీ మధ్యచెవి యొక్క ప్రధానమైన చర్య ఏమిటంటే మీ కర్ణభేరి ప్రకంపనలను మీ లోపలి చెవిని నింపుతున్న ద్రవానికి బదిలీచేయడమే. ఆ ద్రవం గాలికన్నా మరింత బరువైంది. ఆ విధంగా, నిటారుగా ఉన్న కొండపైకి సైకిల్ని తొక్కుతున్న వాని విషయంలో నిజమైనట్లుగానే, సాధ్యమైనంత సమర్ధవంతంగా శబ్దశక్తిని తీసుకుపోవడానికీ ‘సాపేక్షవేగ నిష్పత్తి నిర్ధారక గేర్‌ విధానం’ అవసరం. మధ్యచెవిలో, వాటి ఆకారాల్నిబట్టి హామర్‌, ఎన్‌విల్‌, స్టిర్రప్‌లని సామాన్యంగా పిలువబడే మూడు చిన్న ఎముకలద్వారా కర్ణభేరినుండి వచ్చే ఈ శబ్దశక్తి కంపనలు తీసుకుపోబడుతాయి. యాంత్రికపరమైన ఈ చిన్న అనుసంధానం, లోపలి చెవి కొరకు పరిపూర్ణమైన ఓ ‘సాపేక్షవేగ నిష్పత్తి నిర్ధారక గేర్‌ విధానాన్ని’ దాదాపు సాధిస్తుంది. ఇది లేకుండా, 97 శాతం శబ్దశక్తి కంపనలు కోల్పోబడుతాయని అంచనావేయబడింది!

మీ మధ్య చెవిలోని అనుసంధానానికి రెండు సున్నితమైన కండరాలు కలుపబడ్డాయి. అల్ప పౌనఃపున్యంగల విపరీతమైన శబ్దానికి మీ చెవి గురైన సెకనులో వందోవంతులోపలే, ఈ కండరాలు వాటంతటవే బిగుసుకొని, అనుసంధాన ప్రకంపనాన్ని మరింతగా నిరోధిస్తున్నాయి. ఆ విధంగా మీ వినికిడి శక్తికి కలగబోయే ఏ అపాయాన్నైనా ముందుగానే అరికడుతున్నాయి. యంత్రపరికరాల ద్వారానూ ఎలక్ట్రిక్‌ పరికరాల ద్వారానూ ఉత్పన్నమయ్యే అన్ని శబ్దాలనుండీ కాకపోయినా, ప్రకృతిలో ఉద్భవించే అన్నిరకాలైన బిగ్గర శబ్దాలనుండీ మీ వినికిడిశక్తిని కాపాడ్డంలో ఈ ప్రతిక్షేపక్రియ త్వరగా పనిచేస్తుంది. అంతేగాక, ఆ చిన్న కండరాలు ఈ రక్షక విన్యాసాన్ని పది నిమిషాల వరకు మాత్రమే చేయగలవు. కానీ కర్ణకఠోరమైన శబ్దానికి దూరంగా తరలిపోడానికి, ఇది మీకొక అవకాశాన్ని ఇస్తుంది. ఆసక్తిదాయకంగా, మీరు మాట్లాడేటప్పుడు మీ స్వంత స్వరం మీకు మరీ బిగ్గరగా ఉండకుండేలా మీ వినికిడి గ్రాహకశక్తిని తగ్గించేందుకు మీ మెదడు ఈ కండరాలకు సంకేతాల్ని పంపిస్తుంది.

ఆశ్చర్యాన్నిగొలిపే మీ లోపలి చెవి

వినడంలో చేరివున్న మీ లోపలి చెవి యొక్క భాగం, కాక్లియా లోపల ఉంటుంది. నత్తగుల్లలా ఉండే ఆకారాన్నిబట్టి కాక్లియా అని దానికి పేరు వచ్చింది. దాని సున్నితమైన నిర్మాణాన్ని కాపాడుతున్న గట్టిభాగమే మీ దేహంలో ఉండే అత్యంత గట్టి ఎముక. దాని లేబరింత్‌ లోపలే, కాక్లియా పొడవును కాలువలుగా వేరుపరుస్తున్న అనేక కణాల్లో ఒకటైన బేసిలర్‌ మెంబ్రేన్‌ ఉంటుంది. ఈ బేసిలర్‌ మెంబ్రేన్‌తో పాటూ కాక్లియాను నింపే ద్రవంలోనికి చొచ్చుకుపోతున్న రోమాల్లాంటి మొనలుగల నాడీ కణాలైన వేలాది రోమకణాలను బలపర్చే ఆర్గాన్‌ ఆఫ్‌ కార్టై (సర్పిలాకార అవయవం) ఉంటుంది.

మధ్య చెవి ఎముకల కదలిక కాక్లియా ఓవల్‌ విండోను (అండాకార కిటికీని) కంపింపచేసినప్పుడు, ఆ ద్రవంలో తరంగాల్ని సృష్టిస్తుంది. తటాకంపై ఉన్న చిన్న అలలు ఆకుల్ని పైకి క్రిందకు తేలియాడేలా చేస్తున్నట్లుగానే ఈ తరంగాలు, మెంబ్రేన్‌లను తేలేలాచేస్తాయి. నిర్దిష్టమైన శబ్దతరంగ పౌనఃపున్యాలకు తత్సమానమైన స్థలాల్లో తరంగాలు బేసిలర్‌ మెంబ్రేన్‌ను వంచుతాయి. తర్వాత, ఆ స్థలాల్లో ఉన్న రోమ కణాలు, మీదపడివున్న టెక్టోరియల్‌ మెంబ్రేన్‌ను తుడుస్తాయి. ఈ తాకిడి ఆ రోమ కణాల్ని ప్రేరేపించి, తద్వారా ప్రచోదకాల్ని ఉత్పన్నంచేసి వాటిని మీ మెదడుకు పంపిస్తుంది. శబ్దం తీవ్రత ఎంత ఎక్కువైతే అన్ని రోమ కణాలు ప్రేరేపించబడతాయి, శబ్ద తీవ్రత ఎంత వేగమైతే అంత వేగంగానూ ప్రేరేపించబడతాయి. ఆ విధంగా, పెద్ద శబ్దాన్ని మెదడు గ్రహిస్తుంది.

మీ మెదడు, వినికిడిశక్తి

మీ వినికిడి విధానంలో అత్యంత ప్రాముఖ్యమైన భాగం మీ మెదడే. నాడీ ప్రచోదకాల రూపంలో అది పొందే సమాచార ప్రవాహాన్ని శబ్ద మానసిక గ్రహిణిగా మార్చే అసాధారణమైన సామర్ధ్యాన్ని అది కల్గివుంది. సైకోఅకౌస్టిక్‌ అని తెలియబడిన రంగంలో అధ్యయనంచేసే ఓ సంబంధాన్ని అంటే ఆలోచనకూ వినికిడి శక్తికీ మధ్యనున్న ఓ ప్రత్యేక లింకును స్పష్టంగా చూపిస్తుండడమే దీని ప్రధానమైన పని. ఉదాహరణకు, క్రిక్కిరిసిపోయిన గదిలో జరిగే అనేక సంభాషణల్లో నుండి ఒక సంభాషణను మీరు వినేలా మీ మెదడు చేయగలదు. ఓ మైక్రోఫోనుకి ఈ సామర్థ్యం లేదు. కాబట్టి, ఇదే గదిలో చేసిన టేప్‌ రికార్డింగ్‌ దాదాపుగా గ్రహించనశక్యంగా ఉంటుంది.

కోరదగని శబ్దాల మూలంగా కల్గిన చికాకు, ఈ లింకుకున్న మరో లక్షణాన్ని చూపిస్తోంది. శబ్ద తీవ్రత ఎంత తక్కువున్నప్పటికీ, మీకు వినాలని అన్పించనప్పుడు దాన్ని మీరెంత తగ్గుస్థాయిలో విన్నా, అది మీకు చికాకును తీసుకురాగలదు. ఉదాహరణకు, కుళాయిలో నుండి బొట్లు బొట్లుగా పడే నీటి చుక్కల ద్వారా ఉత్పన్నమైన శబ్ద తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. కానీ నిశ్శబ్దంగానున్న రాత్రివేళలో అది మీకు నిద్రాభంగం కల్గిస్తే, మీకెంతో ఇబ్బంది కలగజేస్తున్నట్లు మీరు కనుగొంటారు!

నిజానికి, మన భావోద్రేకాలు మన శ్రవణ సంవేదనానికి సన్నిహితంగా ముడిపెట్టబడ్డాయి. హృదయపూర్వకమైన నవ్వుకున్న లేక యథార్థమైన అనురాగవచనంగానీ ప్రశంసగానీ ఉత్పన్నం చేసే ఉత్సాహానికున్న ప్రేరేపించే ప్రభావాన్ని గురించి కొంచెం ఆలోచించండి. అదే విధంగా, మేథస్సుతో మనం నేర్చుకునే దానిలో అధికం, మన చెవుల ద్వారానే లోపలకు తీసుకోబడుతుంది.

కాపాడుకోవాల్సిన ఓ బహుమానం

మన వినికిడి శక్తికున్న సమ్మోహనపర్చే అనేక రహస్యాలు ఇంకా బయల్పర్చబడలేదు. కానీ సంపాదించిన విజ్ఞానశాస్త్ర అవగాహన, అందులో చూపబడిన ప్రేమ జ్ఞానముల ఎడల మన మెప్పుదలను అధికం చేస్తోంది. “ఒకడు మానవ వినికిడి విధానాన్ని లోతుగా ఏ విధంగా పరిశీలించినప్పటికీ, దాని నిర్మాణంలో ఎవరిదో దయార్ద్ర హస్తం ఉందని దాని సంక్లిష్టమైన పనులూ, ఆకృతులూ సూచిస్తాయనే నిర్ధారణకు తప్పక రావాల్సిందే” అని శ్రవణశక్తి పరిశోధకుడు ఎఫ్‌. ఆల్టన్‌ ఎవరెస్ట్‌ రాశాడు.

మన వినికిడి శక్తికున్న అంతర్గత పనితీరుల్ని గూర్చిన ఆధునికకాల విజ్ఞానశాస్త్ర జ్ఞానం ప్రాచీన ఇశ్రాయేలు రాజైన దావీదుకు లేదు. అయినప్పటికీ, తన శరీరాన్ని గూర్చీ, దాని అనేక బహుమానాల్ని గూర్చీ ధ్యానించి, తన సృష్టికర్తను ఆయన ఇలా కీర్తించాడు: “నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. . . . నీ కార్యములు ఆశ్చర్యకరములు.” (కీర్తన 139:14) వినికిడి శక్తితో పాటూ శరీరంలోని అద్భుతాల్ని గూర్చీ, మర్మాల్ని గూర్చీ చేసే విజ్ఞానశాస్త్ర పరిశోధన రాజైన దావీదు చెప్పినది వాస్తవమనే రుజువుకు అంటే జ్ఞానియు ప్రేమామయుడునైన సృష్టికర్త మనల్ని అద్భుతంగా రూపించాడన్న దానికి మరింత రుజువునిస్తోంది!

[అధస్సూచి]

a తేజరిల్లు! (ఆంగ్లం) జనవరి 22, 1990, 18-21 పేజీలను చూడండి.

[27వ పేజీలోని బాక్సు/చిత్రం]

వినికిడి శక్తి పాడైన వారికి సహాయం

పెద్ద పెద్ద శబ్దాలను అదేపనిగా వినడం, వినికిడి శక్తి శాశ్వతంగా పాడవ్వడానికి కారణమౌతుంది. విపరీతమైన పెద్ద శబ్దాలతో సంగీతాన్ని వినడం లేక చెవులకు ఏ విధమైన భద్రత లేకుండా రణగొణ ధ్వనులు సృష్టించే పరికరాలున్న పరిసర ప్రాంతాల్లో పనిచేయడం అలాంటి నష్టానికి సమంకావు. హియరింగ్‌ ఎయిడ్‌ (శబ్ద విస్తారక సాధనం) వినికిడిశక్తి తగ్గినవారికీ, పుట్టుకతోనే చెవిటివారైన వారిలో కొంతమందికీ కొంతమేరకు సహాయాన్ని ఇవ్వగలదు. అనేకమందికి, అలాంటి సాధనాలు వివిధ శబ్దాల్ని వినేందుకు వారి సామర్థ్యాన్ని పునరుద్ధరిస్తాయి. మొట్టమొదటి సారిగా హియరింగ్‌ ఎయిడ్స్‌ను అమర్చిన తర్వాత, ఓ స్త్రీ తన వంటగది కిటికీకి ఆవల నుండి ఓ అపరిచితమైన శబ్దం రావడాన్ని గుర్తించింది. “అది పక్షుల అరుపులా! అనేక సంవత్సరాలుగా నేను పక్షుల అరుపుల్ని వినలేకపోయానే” అని ఆమె అబ్బురపడింది!

విపరీతంగా పాడవ్వకపోయినప్పటికీ కూడా, వార్ధక్యం మూలంగా హెచ్చు స్థాయి ధ్వనుల్ని పసిగట్టేందుకైన మన సామర్థ్యం సాధారణంగా తగ్గిపోతుంది. విచారకరంగా, ఇందులో సంభాషణను అర్థంచేసుకోడానికి తరచూ మరింత ప్రాముఖ్యమయ్యే ధ్వనులైన స్వరసమ్మేళన తరంగ పౌనఃపున్యాలు చేరివుంటాయి. కాబట్టి, పారుతున్న నీళ్ల మూలంగానో లేక కాగితం నలగడంవల్లో ఉత్పన్నమయ్యే శబ్దాలవంటి, ఇళ్లల్లో ఉండే సాధారణ శబ్దాలు స్వరసమ్మేళనాలతో ఢీకొనే హెచ్చు తరంగ పౌనఃపున్యాల్ని కల్గివున్నందున వాటి మూలంగా మౌఖిక సంభాషణకు అంతరాయం కల్గవచ్చని వృద్ధులు కనుగొనవచ్చు. హియరింగ్‌ ఎయిడ్స్‌ కొంతవరకు ఉపశమనాన్ని ఇవ్వొచ్చుగానీ వాటికుండే అననుకూలత వాటికుంది. ఒక విషయమేంటంటే, నాణ్యమైన హియరింగ్‌ ఎయిడ్స్‌ ఎంతో ఖరీదైనవిగా అంటే అనేక దేశాల్లోని సగటు వ్యక్తికి పూర్తిగా అందుబాటులో లేనంత ఖరీదులో ఉండొచ్చు. ఏదేమైనాగానీ, ఏ హియరింగ్‌ ఎయిడ్‌ కూడా మన సహజ వినికిడి శక్తిని పూర్తిగా పునఃస్థాపించలేదు. గనుక ఏం చెయ్యాలి?

శ్రద్ధ చూపించడం, ఎంతో సహాయకరంగా ఉండగలదు. వినికిడి శక్తి కోల్పోయిన వ్యక్తితో మాట్లాడే ముందు, మీరు ఆయనకు ఏదో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని ఆయన గ్రహించేలా చూడండి. ఆ వ్యక్తి ముఖంలోకి చూడ్డానికి ప్రయత్నించండి. ఇలా చేయడం, ఆయన మీ శరీర కదలికల్నీ, పెదాల కదలికల్నీ చూసేలా, మరి మీ మాటల్లోని స్వరసమ్మేళనాల పూర్తి శక్తిని వినేలా వీలుకల్పిస్తుంది. వీలైతే, ఆ వ్యక్తికి దగ్గరగా వెళ్లి, నెమ్మదిగానూ స్పష్టంగానూ మాట్లాడండి; కేకలు వేయకండి. వినికిడిశక్తిని కోల్పోయిన అనేకమంది ప్రజలకు నిజానికి పెద్దపెద్ద శబ్దాలు బాధాకరమైనవి. ఓ వ్యాఖ్యానం గనుక అర్థంగాకపోతే, దాన్నే పునశ్చరణ చేయడానికి బదులు వేరే పదాల్లో చెప్పడానికి ప్రయత్నించండి. అదే విధంగా, మీ వినికిడి శక్తి గనుక మునుపటిలా లేకపోతే, మాట్లాడుతున్న వ్యక్తి దగ్గరగా వెళ్లడం ద్వారా, ఓపికగా ఉండడం ద్వారా ఇతరులు మీతో సంభాషించడాన్ని సులభమయ్యేలా మీరు చేయగలరు. ఈ అదనపు ప్రయత్నాలు సంబంధాల్ని మెరుగుపర్చుకోడంలో సత్ఫలితాల్ని ఇవ్వవొచ్చు. మిమ్మల్ని మీరు మీ చుట్టు ప్రక్కల ఉన్నవారికి అనుకూలంగా ఉంచుకోడానికి సహాయపడగలవు.

[చిత్రం]

వినికిడి శక్తి కోల్పోయిన ఓ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు, ఆయన వైపు తిరిగి, నెమ్మదిగానూ స్పష్టంగానూ మాట్లాడండి

[26వ పేజీలోని చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

మీ చెవి

పిన్నా

ఓవల్‌ విండో

శ్రవణ నాడి

హేమర్‌ (మల్లెస్‌)

ఎన్‌విల్‌ (ఇన్‌కస్‌)

స్టిర్రప్‌ (స్టేపెస్‌)

శ్రవణ కాలువ

కర్ణభేరి

కాక్లియా

ఆర్గన్‌ ఆఫ్‌ కార్టై

రౌండ్‌ విండో

శ్రవణ నాడి

రోమ కణాలు

టెక్టోరియల్‌ మెంబ్రేన్‌

నాడీ తంతువులు

బేసిలర్‌ మెంబ్రేన్‌

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి