ప్రపంచ పరిశీలన
ప్రాజెక్ట్ పులి అవకతవకలు
1973లో దేశ జాతీయ మృగం అంతరించకుండా అరికట్టేందుకు ఇండియాలో ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించబడింది. ఆ సమయంలో, ఇండియాలోని పులుల సంఖ్య 1,827కు తగ్గిపోయింది. ఆ ప్రాజెక్ట్‌కు అంతర్జాతీయ మద్దతు లభించింది, మరి చెప్పుకోదగిన విజయాన్ని సాధించింది. 1989 నాటికి ఇండియాలోని పులుల సంఖ్య 4,000 కన్నా ఎక్కువైంది. అయితే, ఇండియా టుడే ప్రకారంగా, మరోసారి పులులు ప్రమాదంలో ఉన్నాయి. ఇండియాలోని పులుల సంఖ్య 3,000 కన్నా తక్కువకు పడిపోయింది. ఎందుకు? సగటున రోజుకొక పులి చొప్పున వేటగాళ్లు చంపుతున్నారని కొందరు చెబుతున్నారు. ప్రాజెక్ట్ టైగర్ అంటే ఆ పెద్ద పిల్లికి రక్షణ ఇవ్వడమని భావం. కానీ అది రక్షణను ఇస్తున్నట్టుగా కన్పించడంలేదు. “తరచూ వేటగాళ్లచే కాల్చబడుతున్న ఫారెస్ట్ గార్డ్లకు సరియైన శిక్షణా లేదు, సరియైన ఆయుధాలూ లేవు” అని ఆ నివేదిక చెబుతోంది. పులి విషయానికొస్తే, దాని “ఉనికి అంతరించిపోతోంది.”
ముసలోళ్లలా ఉన్న మరణానికి గురౌతున్న పడుచోళ్లు
ఈ క్రింది నివేదికల ద్వారా సూచించబడినట్లుగా, దూమపానం వృద్ధాప్యానికి ఎదిగే ప్రక్రియ వేగం పుంజుకునేలా చేయవచ్చని పరిశోధకులు నమ్ముతున్నారు. బ్రిటన్ నుండి వెలువడే లాన్సెట్ ప్రకారంగా, దీర్ఘకాలం నుండీ దూమపానం చేస్తున్న వారికి, వయస్సు మళ్లక ముందే తల నెరసిపోయే అవకాశం నాల్గురెట్లుండగా, బట్టతల అయ్యే అవకాశంగానీ లేక బట్టతల అవుతూండే అవకాశంగానీ రెండురెట్లుంది. దీనిపై నివేదిస్తూ, దూమపానం చేసేవారి ముఖచర్మంపై ముడతలు అధికంగా ఉంటాయనీ, దూమపానం చేయని వారికంటె రెండురెట్లుగా వారి పళ్లు ఊడిపోయే సంభావ్యత ఉందనీ యుసి బర్క్లే వెల్నెస్ లెటర్ సూచించింది. బ్రిటీష్ వైద్య పత్రికలో (ఆంగ్లం) వచ్చిన ఇటీవల జరిపిన ఓ అధ్యయనాన్ని ప్రస్తావించే ఆ నివేదిక, పొగత్రాగని వారితో పోలిస్తే యావత్‌జీవిత పొగరాయుళ్లైన పురుషుల్లో సగంమందికి మాత్రమే 73వ ఏటకు చేరుకునే అవకాశం ఉందని చూపిస్తోంది. అంతేగాక, “పొగరాయుళ్లతో జీవించే పొగత్రాగనివారు హృద్రోగంతో బాధపడే సంభావ్యత 20 శాతం కన్నా ఎక్కువగా ఉంది” అని మంచి గృహనిర్వహణ (ఆంగ్లం) అనే పత్రిక నివేదిస్తోంది.
బంగారపు గనుల్ని త్రవ్వే చెదలు
1984లో ఆఫ్రికా దేశమైన నైజర్‌లో ఓ పల్లెటూరి వ్యక్తి బంగారపు గనిని కనుగొన్నాడు. కొత్త బంగారపు గనులను హస్తగతం చేసుకునే అన్వేషణ, అనేక దేశాలనుండి గనులను త్రవ్వేవారిని ఆ ప్రాంతానికి తీసుకొచ్చింది. బంగారు నిక్షేపాల్ని కనుగొనేందుకు ప్రాచీన ఆఫ్రికా పౌరులు చెదపుట్టలను ఉపయోగించారని కెనడాకు చెందిన భూగర్భశాస్త్రవేత్త క్రిష్ గ్లేసన్ జ్ఞాపకం చేసుకున్నాడు. పెద్ద పెద్ద పుట్టల్ని నిర్మించే చెదపురుగు జాతులకు నైజర్ నివాసస్థలం. ఆ పుట్టల్లో కొన్ని 1.8 మీటర్ల ఎత్తూ, 1.8 మీటర్ల వ్యాసం కల్గివున్నాయి. జలాన్వేషణలో భాగంగా చెదలు త్రవ్వుతుండే కొద్దీ—కొన్నిసార్లు 75 మీటర్ల లోతు వరకూ—పుట్టలు పెరుగుతాయి అని నేషనల్ జియోగ్రాఫిక్ పత్రిక వివరిస్తోంది. ఎక్కడ త్రవ్వాలనే విషయంలో తనకు సహాయపడతాయనే ఆశతో అనేక పుట్టల్లో నుండి పరీక్షించడానికి శాంపిల్ కొరకు కొంత మట్టిని గ్లీసన్ తీసుకున్నాడు. శాంపిల్‌గా తీసుకున్న అన్ని రకాల మట్టిలలో బంగారం ఉన్న జాడలేదుగానీ కొన్నింటిలో ఉంది! “బంగారం ఉందన్న జాడలుగల ఏ పుట్టయైనా సరే, ఆ పుట్టంతటిలో దాని జాడలు ఉన్నాయి” అని ఆయన కనుగొన్నాడు. చెదలు నీటి కొరకు త్రవ్వుతుండగా, బంగారంతోపాటూ వాటికి తారసపడిన ప్రతీదాన్నీ పైకి తీసుకొచ్చినట్లు కనబడుతోంది.
పిడుగుల ప్రమాదం
“పిడుగులు పడి మరణాలు సంభవించిన సంఘటనలు, ప్రజలు ఊహించినదాని కన్నా మరింత తరచుగా జరుగుతున్నాయి” అని ది ఆస్ట్రేలియన్ వార్తాపత్రిక నివేదిస్తోంది. పిడుగులు ఆస్ట్రేలియాలో ప్రతీ సంవత్సరమూ ఐదు నుండి పదిమంది ప్రజల్ని చంపుతున్నాయనీ, వందమందికి పైగా గాయపడుతున్నారనీ ఆ నివేదిక వివరిస్తోంది. పిడుగులు తాకడానికి ముందు ఏ విధమైన హెచ్చరికా లేకపోయినా, “పిడుగుల దాడికి గురికాబోయిన కొంతమంది ప్రజలు తమ రోమాలు నిక్కబొడుచుకున్న అనుభూతి కల్గినట్లు నివేదించారు” అని మెల్బరన్స్ బ్యూరో ఆఫ్ మీటరాలజీకి చెందిన ఫిల్ ఆల్ఫొర్డ్ తెలియజేశాడు. పిడుగుల దాడికి గురయ్యే అవకాశాల్ని తప్పించుకునేందుకు పటిష్టమైన భవనంలోగానీ లేక పైటాపు దృఢంగావుండి లోహనిర్మాణాలనుండి వేరుపర్చబడిన వాహనంలోగానీ మీరు ఆశ్రయం పొందవచ్చని ఆల్ఫొర్డ్ సిఫారసు చేస్తున్నాడు.
సెల్యులార్ టెలిఫోన్ మర్యాదలు
దూర ప్రాశ్చ్య ఆర్ధిక పునఃసమీక్ష (ఆంగ్లం) ప్రకారంగా పోర్టబుల్ సెల్యులార్ టెలిఫోన్ల ఆగమనం, ప్రాచీన మర్యాదకు సంబంధించిన కొన్ని పద్ధతుల అవసరాన్ని నొక్కి వక్కాణించింది. మీ ఫోన్‌ను అందుకునే వ్యక్తి ఎడలా, మీ చుట్టు ప్రక్కల ఉన్నవారి ఎడలా గౌరవాన్నీ శ్రద్ధనూ చూపించమని హాంకాంగ్ వాణిజ్య సలహాదారురాలైన టీనా లియూ ప్రోత్సహిస్తోంది. ఫోన్లో బిగ్గరగాగాక స్పష్టంగా మాట్లాడమనీ, ఫోన్ చేసేటప్పుడు తినడంగానీ, త్రాగడంగానీ చేయొద్దనీ ఆమె సలహానిస్తోంది. లియూ వాణిజ్యపరమైన సమావేశాలు జరిగే సమయంలో వచ్చే ఫోన్లకు జవాబివ్వడాన్నీ, వాటిని వేరేచోటికి అనుసంధానం చేయడాన్నీ లేక హాస్పటళ్లూ, గ్రంథాలయాలూ, ఆడిటోరియంలూ వంటి స్థలాల్లో కంపన శబ్ద సంకేతాన్ని ఆన్‌చేసి ఉంచడాన్నీ తగ్గించివేయాలని కూడా సిఫారసు చేస్తోంది. ఫోన్లో మాట్లాడుతూ సామాజికంగా కలుసుకునే సందర్భాలకు అంతరాయాన్ని కల్గించడం, స్నేహితులుగానీ లేక బంధువులుగానీ నిర్లక్ష్యం చేయబడ్డామని భావించడానికి కారణమౌతుంది. రెస్టారెంట్లో భోజనం చేయడాన్ని గూర్చి మాట్లాడుతూ, లియూ ఇలా వ్యాఖ్యానించింది: “నిర్ణీత సమయంలో అమ్మాయితో కలిసి కబుర్లు చెప్పుకునేటప్పుడు వచ్చిన ఫోన్‌కాల్‌లో మునిగిపోక, తానిచ్చిన పూలగుత్తుల ద్వారా ఆ అమ్మాయి నుండి సంపాదించిన అభిమానాన్ని జారవిడుచుకోకముందే దాన్ని ముగించడం మంచిది.”
భూకంపాల రాకను ముందుగా చెప్పలేం
ఇటీవల, భూకంపాల రాకను గూర్చి ముందుగా చెప్పే విజ్ఞానశాస్త్ర సంభావ్యతను చర్చించేందుకు భూకంప నిపుణుల అంతర్జాతీయ గుంపొకటి లండన్‌లో సమావేశమైంది. వాళ్లు చేసిన మదింపేమిటి? “[పెద్ద భూకంపాలు] రాకముందు గమనించదగిన, గుర్తించదగిన సూచనలు కనిపిస్తాయనీ, ఆ సూచనల ఆధారంగా హెచ్చరికలను ఇవ్వవచ్చనీ 100 సంవత్సరాలుగా అనేకమంది భూశాస్త్రవేత్తలు తలంచారు” అని ఈవోస్ అనే ప్రచురణలో టోక్యో యూనివర్శిటీకి చెందిన డా. రాబర్ట్ గెలర్ రాశాడు. బదులుగా, “భూకంపాల రాకను సహజంగా ముందుగా చెప్పడం కష్టం” గనుక, ఆ తలంపులో ఓ ప్రాథమిక సవరింపు అవసరం. ఎప్పుడొస్తాయో ముందుగా కచ్చితంగా చెప్పడం సాధ్యం కాకపోయినప్పటికీ, విస్తృత భూకంపన నివేదికలు ఉన్న స్థలాల్లో భూకంపాలు జరిగే సాధ్యతనూ, వాటి పరిమాణాన్నీ విజ్ఞాన శాస్త్రవేత్తలు అంచనావేయగలరు. ఉదాహరణకు, రాగల 50 సంవత్సరాల్లో అమెరికా ఖండంలోపల ఎక్కడ బలమైన కంపనాలు వచ్చే అవకాశముందో సూచించే ఓ క్రొత్త మ్యాప్‌ను యు.ఎస్. జియాలజికల్ సర్వే తయారుచేసింది. ఈ సమాచారం ఆధారంగా, కాలిఫోర్నియాలోని 70 శాతంకన్నా ఎక్కువ మంది ప్రజలు ప్రమాదం రాగల ప్రాంతాల్లో ప్రస్తుతం నివసిస్తున్నారని ప్రభుత్వ సంస్థలు సూచించాయి.
ఎలక్ట్రిక్ కార్లు, పర్యావరణం
పెట్రోలుతో నడిచే వాహనాలకన్నా బ్యాటరీలతో నడిచే కార్లు పర్యావరణానికి మంచిదా కాదా అనే విషయాన్ని కనుగొనేందుకు జర్మనీ దేశానికి చెందిన ఆటోమొబైల్ కంపెనీ ఓ అధ్యయనాన్ని నిర్వహించింది. ష్యూట్డాయిచె సైటున్గ్ వార్తా పత్రిక ప్రకారంగా, 1992 నుండి 1996 మధ్య కాలంలో 13 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన 100 మంది డ్రైవర్లు ఆ అధ్యయనంలో ఉన్నారు. ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీని తక్కువ దూరంలోనే మార్చుకోవాల్సి వచ్చినప్పటికీ, అవి అనేక ప్రయోజనాల్ని కల్గివున్నట్టు కనుగొనబడింది: అవి శబ్దంచేయకుండా పరిగెడతాయి. వాటిని ఎక్కడ ఉపయోగించినా ప్రత్యక్ష వ్యర్థపదార్థాల విసర్జనకు కారణంకావు. అయితే, ఓ ప్రధానమైన సమస్యనుబట్టి ఈ ప్రయోజనాలు కొరగాకుండా పోవొచ్చు. ఎలక్ట్రిసిటీని ఉత్పన్నంచేయడానికి భూమిలోనుండి తీయబడిన తైలాలచే నడిపించబడే వాహనాలు ఖర్చుచేసే శక్తికన్నా బ్యాటరీలను రీచార్జింగ్ చేయడానికి మరింత అధికశక్తి ఖర్చవుతుంది. ఇది వాహనాల్ని ఎన్నిసార్లు ఉపయోగిస్తున్నామనే దానిపై ఆధారపడి 1.5 నుండి 4 రెట్లు వరకూ ఉంటుంది, మరి ఆ శక్తిని మరోచోట ఉత్పన్నం చేయాల్సి ఉంటుంది. ఆ శక్తి ఎలా ఉత్పన్నం చేయబడుతుందనే దానిపై ఆధారపడి, “పర్యావరణానికి కలిగే నష్టం, పెట్రోలు ఉత్పత్తుల ద్వారా నడిచే వాహనాలు కల్గించే నష్టంకన్నా మరింత ఎక్కువగా” ఉండవచ్చని ఆ వార్తాపత్రిక వ్యాఖ్యానిస్తోంది.
ప్రేలుడు పదార్థాల్ని కబళించే మొక్కలు
పాత ఆయుధసామగ్రి ఉండే ప్రాంతాల్లోని నేల నుండీ నీటి నుండీ ప్రేలుడు పదార్థాల్ని పీల్చుకొని మరి వాటిని సురక్షితంగా విచ్ఛిన్నం చేయగలిగే సామర్థ్యాన్ని బీటుదుంప మొక్కలూ, మడుగుల్లో పెరిగే ఓ రకమైన కలుపు మొక్కలూ కల్గివున్నాయని న్యూ సైంటిస్ట్ పత్రిక నివేదిస్తోంది. టెక్సాస్‌లోని హోస్టన్‌లోని రైస్ యూనివర్సిటీలో సైంటిస్టులు పెరివింకిల్ అనే మొక్కకూ, పేరట్ ఫెథర్ అనే ఒక సాధారణ రకపు కలుపు మొక్కకూ టిఎన్టిని వేశారు. ఓ వారంలోపల వాటి కణజాలాల్లో ప్రేలుడు పదార్థాల జాడ మచ్చుకైనా కన్పించలేదు. మరి ఆ మొక్కల్ని తగలబెట్టినా విస్ఫోటం సంభవించలేదు. అదే సమయంలో, బీటుదుంప కణజాలాలు, దానినుండి తీయబడిన ద్రావణాలూ నైట్రోగ్లిజరిన్‌ని పీల్చుకొని విచ్ఛిన్నం చేయగలవని యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్‌లోని పరిశోధకులు కనుగొన్నారు. ఆ సైంటిస్టుల రెండు గుంపులూ, విస్ఫోటక పదార్థాల్ని విచ్ఛిన్నం చేయడంలో అతి సూక్ష్మక్రిముల సహాయాన్ని ఆ మొక్కలు పొందకుండేలా వాటిని శుభ్రం (స్టెరైల్) చేశారు. “ప్రస్తుతం, కట్టడాలు నిర్మించేందుకు పాత ఆయుధసామగ్రి ప్రాంతాలను బాగుచేయడం సహజంగానే ఎంతో ప్రమాదకరమైన, ఖర్చుతో కూడిన పని. కానీ నేలలో నుండీ, నీటిలో నుండీ ప్రేలుడు పదార్థాల్ని తొలగించేందుకూ వాటిని సురక్షితంగా విచ్ఛిన్నం చేసేందుకూ చౌకగా పెంచిన మొక్కల్ని ఉపయోగించినట్లైతే ఈ పరిస్థితి మారగలదు” అని ఆ శీర్షిక చెబుతోంది. వ్యర్ధ ఆయుధసామగ్రిని సముద్రంలో పారవేసే ప్రస్తుత ప్రక్రియ క్రమంగా నిలిపివేయబడుతుంది” గనుక ఈ మొక్కలను పెంచడం అత్యంతావశ్యం.
సహస్రాబ్ద పిచ్చి
“సంపూర్ణ యుద్ధ శతాబ్దంగా ఆరంభమై అణు శకంగా ఎదిగిన ఈ ఇరవయ్యవ శతాబ్దం, వినోదోల్లాసపు యుగంగా ముగియబోతున్నట్లు కనబడుతోంది” అని న్యూస్‌వీక్ పత్రిక చెబుతోంది. 1999 క్రొత్త సంవత్సరపు సాయం సమయ వేడుకల కొరకు “భూగోళవ్యాప్తంగా ఉన్న హోటళ్లు ఇప్పటికే పూర్తిగా బుక్కయిపోయాయి.” అయితే, సహస్రాబ్ది ఎక్కడ ఆరంభమౌతుందనే విషయంపై వివాదం విజృంభించింది. “ఆ సమస్య కిరిబటి దేశంలో ఆరంభమైంది” అని యు.యస్.న్యూస్ & వరల్డ్ రిపోర్టు అభిప్రాయపడుతోంది. “అంతర్జాతీయ తారీఖుల నిర్ధారిత రేఖ సాధారణంగా ద్వీపాల వరుసను కోసుకుంటూ దూసుకుపోతుంది: ప్రాచ్య కిరిబిటిలో ఆదివారమైతే, పడమర కిరిబిటిలో అది సోమవారం అవుతుంది.” 1995 జనవరి 1 తర్వాత నుండీ ఆ తారీఖుల నిర్దారిత రేఖ దాని ప్రాగ్దిశనున్న ద్వీపమైన కరలిన్ చుట్టూ పోతుందని తెలియజేయడం ద్వారా ఆ సమస్యను ఆ దేశం పరిష్కరించింది. క్రొత్త దినారంభాన్ని చూసే మొదటి ప్రదేశం కిరిబటి అవుతుందని దానర్థం. అయితే టాన్జా, న్యూజిలాండ్ వంటి ఇతర దేశాలు “ప్రథమ” స్థానాన్ని కోరుకున్నాయి. రాయల్ గ్రీన్విచ్ పరిశీలన కేంద్రం ప్రకారంగా, ఆ ప్రశ్న అభ్యాససిద్ధ ప్రాముఖ్యతను లేకుండా చేసింది. “సెప్టెంబరు సమ రాత్రిందిన కాలం నుండి మార్చి సమ రాత్రిందిన కాలం వరకూ దక్షిణ ధ్రువంపై సూర్యుడు ప్రకాశిస్తాడు గనుక భూమి దక్షిణాగ్ర భాగంపైనే సహస్రాబ్దారంభం జరుగుతుంది” అని ఆ నివేదిక తెలియజేస్తోంది. అయినప్పటికీ, 2,000 సంవత్సరం నాటికి గాక—2,001 జనవరి 1న ఇది సంభవిస్తుందని కూడా ఆ పరిశీలక కేంద్రం చెబుతోంది.
జాగ్రత్త: కొలోబస్ కోతులు రోడ్డు దాటే స్థలం
కొలోబస్ కోతులు ఇంకా వృద్ధిచెందుతున్న తూర్పు ఆఫ్రికానందలి కొన్ని స్థలాల్లో దక్షిణ కెన్యా కోస్తాతీరం దగ్గరున్న డీయానా అడవి ఒకటి. బిజీగా ఉండే బీచ్ రోడ్డును సురక్షితంగా ఎలా దాటాలన్నదే ఈ జంతువులు ఎదుర్కొంటున్న సమస్య. ఓ అంచనా ప్రకారంగా, ప్రతీనెలా కనీసం 12 కోతులు రోడ్డుమీద కార్ల క్రిందపడి చచ్చిపోతున్నాయని తూర్పు ఆఫ్రికా వన్యప్రాణి సొసైటీవారి పత్రిక స్వారా నివేదిస్తోంది. డీయానా బీచ్ ప్రాంతంలో ఉన్న నివాసుల గుంపొకటి, ఈ మారణహోమాన్ని తగ్గించేందుకు చర్యతీసుకోవాలని నిశ్చయించుకొంది. మరింత జాగ్రత్తగా నడపమని డ్రైవర్లను కోరడంతోపాటూ, వాళ్లు రోడ్డుకు పైగా ఎత్తులో తాళ్లతో ఓ వంతెనను ఇటీవల నిర్మించారు. వంతెనపై నడుస్తున్న కోతుల దృశ్యాన్ని చూసి, అక్కడి నివాసులు మరిన్ని వంతెనల్ని నిర్మించేందుకు ప్రణాళికల్ని రూపొందిస్తున్నారు.