కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g97 10/8 పేజీలు 5-8
  • ద్వేషించడం నేర్పిన ప్రపంచం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ద్వేషించడం నేర్పిన ప్రపంచం
  • తేజరిల్లు!—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బాల్యదశలోనే ఆరంభం
  • మతం ఏమి బోధిస్తుంది?
  • భయం, కోపం, లేక గాయపడ్డ భావం
  • ద్వేషం ఎన్నటికైనా అంతమౌతుందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ద్వేషాన్ని నిర్మూలించే ఏకైక మార్గం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • ద్వేషమనే విషచక్రానికి కారణం ఏంటి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2022
మరిన్ని
తేజరిల్లు!—1997
g97 10/8 పేజీలు 5-8

ద్వేషించడం నేర్పిన ప్రపంచం

ప్రజలు జన్మతః స్వార్థపరులు. మరి స్వార్థాన్ని గనుక అదుపులో ఉంచకపోతే, అది ద్వేషంగా మారగలదు. స్వతఃసిద్ధమైన స్వార్థం చాలదన్నట్లుగా, ప్రజలు స్వార్థపరులయ్యేలా నిజంగా మానవ సమాజమే తర్ఫీదునిస్తుంది!

అందర్నీ ఒకే మూసలో చూడ్డం అన్నివేళలా సరియైందికాకపోయినా, కొన్ని వర్గాలకు చెందిన ప్రజల వైఖరులు కేవలం సహజద్భిన్న లక్షణాలుగా భావించి వాటిని త్రోసిపుచ్చలేనంత ప్రబలంగా ఉన్నాయి. రాజకీయ నాయకులు తమ నియోజక వర్గాల్లోని వారికి సహాయపడడానికన్నా ఎలక్షన్లలో గెలవడంపైనే తరచూ మరింత ఆసక్తిని చూపడం లేదా? వ్యాపారస్థులు హానికరమైన ఉత్పత్తులు మార్కెట్లోకి రాకుండా అరికట్టడంకన్నా అవసరమైతే వాటినమ్మి సొమ్ము చేసుకోవడంపైనే తరచూ మరింత శ్రద్ధను చూపడం లేదా? మతనాయకులు తమ మతగుంపులను నైతికతా మార్గాల్లో, ప్రేమ మార్గాల్లో నడిపించడంకన్నా పాపులారిటీనో డబ్బునో సంపాదించడంపైనే తరచూ మరింత శ్రద్ధను చూపడం లేదా?

బాల్యదశలోనే ఆరంభం

విచ్చలవిడితనంతో కూడిన వాతావరణంలో పిల్లలు పెరిగినప్పుడు, ఇతరుల కష్టసుఖాల్ని గురించి ఆలోచించడమూ, నిస్వార్థంగా ఉండడమూ అనేవి తమ కుర్రతనపు కోరికలనే బలిపీఠంపై ఆహుతి చేయబడతాయి గనుక, వాళ్లు నిజానికి స్వార్థప్రియులుగా ఉండేందుకు శిక్షణపొందారు. విద్యార్థులు విద్యా సంబంధ విషయాల్లో మాత్రమేగాక క్రీడల్లో కూడా ప్రథమ శ్రేణిలో ఉండేందుకు కృషి చేయాలని స్కూళ్లలోనూ, కాలేజీలలోనూ బోధించబడ్డారు. “మీరు ద్వితీయశ్రేణిలో గనుక ఉంటే, కనిష్ఠ శ్రేణికి పడిపోవచ్చు!” అనేది సూక్తి.

హింసను ప్రదర్శిస్తున్న వీడియో గేమ్‌లు, సమస్యల్ని స్వార్థపూరితమైన రీతిలో అంటే కేవలం శత్రువును తుడిచిపెట్టడం మూలంగా పరిష్కరించుకొనమని పిల్లలకు నేర్పిస్తాయి! ఇదెంత మాత్రం ప్రేమను పెంపొందించే దృక్పథం కాదు! వీడియో గేమ్‌లు పిల్లలకు ముప్పును తెస్తాయని అమెరికాలోని సర్జన్‌ జనరల్‌ దశాబ్దం క్రితమే హెచ్చరించాడు. ఆయన ఇలా తెలియజేశాడు: “ఉన్నదంతా శత్రువుని సఫా చేయడమే. నిర్మాణాత్మకమైనదేదీ గేమ్స్‌లో లేదు.” అనేక వీడియో గేమ్‌లు “మానవుని అతినీచమైన అంతర్బుద్ధిని రెచ్చగొడతాయి” అని ది న్యూయార్క్‌ టైమ్స్‌కు వచ్చిన ఓ ఉత్తరం అభిప్రాయపడింది. అది ఇంకా ఇలా తెలియజేసింది: “అవి మూర్ఖులూ, కోపోద్రేక స్వభావులూ అయిన కుర్ర తరాన్ని ఉత్పన్నం చేస్తున్నాయి.” “నేను వాటిని [వీడియో గేమ్‌లను] ఆడుతుండగా, ‘చంపు లేక చావు’ అనే అతి ప్రాచీన నినాదం అన్వయించబడే ఊహాలోకంలోనికి వెళ్లిపోయాను” అని జర్మనీ నుండి ఓ వీడియో గేమ్‌ ఔత్సాహికుడు చెప్పినప్పుడు, ఈ వ్యాఖ్యానంలోని మొదటి భాగంలో ఉన్న సత్యసంధతను అతడు నిజాయితీగా అంగీకరించాడు.

ద్వేషానికి జాతివాదం తోడైనప్పుడు, అది మరింత ప్రమాదకరమౌతుంది. కాబట్టి విదేశీయులకు వ్యతిరేకంగా, ప్రత్యేకంగా టర్కీ దేశస్థులకు వ్యతిరేకంగా హింసను ప్రదర్శించే మితవాద వీడియోల ఉనికి విషయంలో జర్మనీ దేశస్థులు స్పష్టంగా శ్రద్ధవహించారు. జనవరి 1, 1994 నాటికి జర్మనీలో ఉన్న 68,78,100 మంది విదేశీ నివాసులలో 27.9 శాతం మంది టర్కీదేశస్థులు ఉన్నందున, జర్మనీ దేశస్థులు ఈ విషయంలో శ్రద్ధవహించడానికి కారణమై ఉండవచ్చు.

చిన్నప్పటి నుండీ పిల్లలకు నీ దేశానికి శత్రువులైన వారిని ద్వేషించడంలో తప్పులేదని జాతీయవాదం బోధిస్తున్న దానిని జాతివాద భావాలు రెచ్చగొడతాయి. టైమ్‌ పత్రికకు వ్యాసాలు రాసే జార్జ్‌ ఎమ్‌. టాబర్‌ రచించిన ఓ వ్యాసం ఇలా తెలియజేసింది: “చరిత్రలోని అన్ని రాజకీయపరమైన వాదాల్లో, బహుశా బలమైన వాదం జాతీయవాదమే.” ఆయన ఇలా వివరించాడు: “దాని పేరిట ఎంతో రక్తం చిందించబడడానికి కారణం, మరేదీ కాదుగానీ మతమే. తమ కష్టాలకు కారకులుగా పొరుగునున్న ఏదొక జాతి గుంపుపై నిందమోపడం ద్వారా శతాబ్దాలుగా ప్రజానాయకులు మతమౌఢ్య గుంపుల్ని రెచ్చగొట్టారు.”

నేటి ప్రపంచలోని అనేక సమస్యల వెనుకనున్న కారణమేంటంటే ఇతర జాతి గుంపుల ఎడలా, జాతుల ఎడలా, లేక ప్రజల ఎడలా ఎంతోకాలంగా పాతుకుపోయివున్న ద్వేషమే. అపరిచితులపట్ల లేక విదేశీయులపట్ల ఉండే భయమైన క్జినోఫోబియా పెరుగుతోంది. అయితే, ఆసక్తిదాయకంగా, తక్కువమంది విదేశీయులు మాత్రమే ఉన్నచోట క్జినోఫోబియా భయం కొట్టొచ్చినట్లుగా ఉందని జర్మన్‌ సమాజవాదుల గుంపొకటి కనుగొంది. వ్యక్తిగత అనుభవం మూలంగా కన్నా, పూర్వనిర్ధారిత అభిప్రాయం మూలంగానే ఆ భయం ఎంతో తరచుగా కల్గుతుందని ఇది రుజువుచేస్తున్నట్టు కనబడుతుంది. “యువతలోని పూర్వనిర్ధారిత అభిప్రాయం ప్రధానంగా వారి స్నేహితులవల్లా, కుటుంబాలవల్లా పోషించబడింది” అని సమాజవాదులు కనుగొన్నారు. నిజానికి, ఇంటర్వ్యూ చేయబడినవారిలో 77 శాతం మందికి విదేశీయులతో ప్రత్యేక సంబంధం లేకపోయినప్పటికీ, లేక అతి కొద్దిగా మాత్రమే సంబంధమున్నప్పటికీ వాళ్లు దురభిమానాన్ని అంగీకరించారు.

అపరిపూర్ణులైన తలిదండ్రుల నుండి వారసత్వంగా వచ్చిన స్వార్థం మనందరికి ఉంది గనుక స్వార్థపరాయణత్వాన్ని గూర్చిన పాఠాన్ని నేర్పించడం కష్టమేమీకాదు. కానీ ప్రేమా ద్వేషాలకు మధ్యనున్న పోరాటంలో మతం ఏ పాత్ర నిర్వహిస్తుంది?

మతం ఏమి బోధిస్తుంది?

మతం ప్రేమను పెంపొందింపజేస్తుందని ప్రజలు సాధారణంగా తలుస్తారు. అలా అయితే, చెప్పుకోడానికి మూడు ఉదాహరణలు మాత్రమే అయిన ఉత్తర ఐర్లాండులోనూ, మధ్య ప్రాచ్యంలోనూ, ఇండియాలోనూ నెలకొనివున్న ఉద్రిక్తల వెనుకనున్న కారణం మత విభేదాలే ఎందుకవ్వాలి? అలజడులకు మత విభేదాలనుగాక రాజకీయ విభేదాలనే నిందించాలని కొంతమంది ప్రజలు వాదిస్తారనుకోండి. అదొక చర్చనీయాంశం. ఏమైనప్పటికీ, రాజకీయ, జాతి దురభిప్రాయాల్ని అధిగమించేందుకు ప్రజల్లో ప్రేమను తగినంత బలంగా నాటడం విషయంలో సంస్థీకరించబడిన మతం విఫలమైందనేది సుస్పష్టం. తత్ఫలితంగా కాథోలిక్‌, ఆర్థడాక్స్‌ విశ్వాసులలో, మరితర విశ్వాసాలకు చెందిన వారిలో అనేకమంది, హింసకు నడిపించే దురభిమానాన్ని ఖండించలేదు.

ఒకడు తాను సరైనవి కావని భావించే మతబోధల్నీ, ఆచరణల్నీ ఖండించడానికి ప్రయత్నించడంలో తప్పేమీలేదు. కానీ ఆ మతగుంపుతోగానీ లేక దాని సభ్యులతోగానీ పోరాడడంలో హింసను ఉపయోగించే హక్కును ఇది ఇస్తుందా? ది ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ రిలిజియన్‌ నిష్పాక్షికంగా ఇలా ఒప్పుకుంది: “సమీప ప్రాచ్య చరిత్రలోనూ, యూరోప్‌ చరిత్రలోనూ మత నాయకులు ఇతర మత గుంపులపై హింసాత్మకమైన దాడులు చేయడానికి పదే పదే పిలుపునిచ్చారు.”

“సామాజిక, మానసిక పురోభివృద్ధి ప్రక్రియలకు పోరాటం తప్పనిసరియని అంగీకరించడంలో డార్విన్‌వాదులు ఏకాకులు కాదు. పోరాటానికీ, హింసకూ, మరి ఆ విధంగా పురోభివృద్ధికీ మతం అనంతమైన మూలంగా పనిచేసింది” అని చెప్పడం ద్వారా హింస ఒక మతాంతర్గత భాగమని ఈ ఎన్‌సైక్లోపీడియా బయల్పరుస్తోంది.

పురోభివృద్ధి కొరకు హింస తప్పనిసరి అనే వాదం ఆధారంగా హింసను సమర్థించకూడదు. ఎందుకంటే అపొస్తలుడైన పేతురు, తనను కాపాడడానికి ప్రయత్నించినప్పుడు యేసుక్రీస్తు తెలియజేసిన సుపరిచితమైన సూత్రానికి ఇది విరుద్ధంగా ఉంటుంది. పేతురు “చెయ్యి చాచి, కత్తి దూసి ప్రధానయాజకుని దాసుని కొట్టి, వాని చెవి తెగనరికెను. యేసు —నీ కత్తి ఒరలో తిరిగి పెట్టుము; కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు” అని ఆయనతో చెప్పాడు.—మత్తయి 26:51, 52; యోహాను 18:10, 11.

వ్యక్తులు చెడ్డవారైనా, మంచివారైనా వారిపైకి హింసను మళ్లించడమనేది ప్రేమ మార్గం కాదు. ఆ విధంగా, హింసకు పాల్పడే ప్రజలు, ప్రేమగల దేవుని మాదిరిని అనుకరిస్తున్నామన్న తమ మాటను నిలుపుకోలేని వారౌతారు. ఏమస్‌ ఓఝ్‌ ఇటీవల ఇలా అభిప్రాయపడ్డాడు: “ఇది మతోన్మాదుల విలక్షణ వైఖరియై ఉంది . . . దేవుని నుండి వారు పొందే ఆజ్ఞలు ఎల్లప్పుడూ, విశేషంగా ఒకేవిధమైన ఆజ్ఞలై ఉన్నాయి: చంపండి. ఉన్మాదులందరి దేవుడూ బహుశా అపవాదిగానే కనబడుతున్నాడు.”

బైబిలు అలాంటి విషయాన్నే చెబుతోంది: “దీనినిబట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు; ఏ నరహంతకునియందును నిత్యజీవముండదని మీరెరుగుదురు. ఎవడైనను—నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించినయెడల అతడు అబద్ధికుడగును; తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడ ప్రేమింపవలెనను ఆజ్ఞను మనమాయనవలన పొందియున్నాము.”—1 యోహాను 3:10, 15; 4:20, 21.

సత్యమైన మతం ఆదర్శప్రాయమైన ప్రేమను అనుసరించాలి. అందులో శత్రువులను సహితం ప్రేమించడం చేరివుండాలి. యెహోవాను గురించి మనమిలా చదువుతాం: “ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతిమంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.” (మత్తయి 5:44, 45; 1 యోహాను 4:7-10 కూడా చూడండి.) ద్వేషానికి దేవుడైన సాతానుకు ఎంత భిన్నంగా ఉన్నాడో కదా! మితిమీరిన విచ్చలవిడితనంతోనూ, నేరంతోనూ, స్వార్థంతోనూ కూడిన జీవితాల్ని జీవించునట్లు వాడు ప్రజల్ని మరులుగొల్పి, ఆకర్షించి తద్వారా వాళ్ల జీవితాల్ని బాధా యాతనలతో నింపుతూ ఉన్నాడు. ఈ భ్రష్టమైన జీవన విధానం వారిని నాశనానికి నడిపిస్తుందని వాడు పూర్తిగా ఎరిగినప్పటికీ కూడా దీన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. తన స్వంత అనుయాయుల్ని కాపాడలేనివాడూ, కాపాడడానికి ఇష్టపడనివాడూ సేవించడానికి యోగ్యుడైన దేవుడేనా?

భయం, కోపం, లేక గాయపడ్డ భావం

ద్వేషాన్ని రగిల్చిన ఈ కారకాలు సులభంగానే ధ్రువపర్చబడ్డాయి. టైమ్‌ రిపోర్టు ఇలా చెబుతోంది: “సమస్యల్లో కూరుకుపోయిన 1930ల తర్వాత నుండీ యూరప్‌లోని అనేక రైట్‌-వింగ్‌ ఉద్యమాలు, సదవకాశాలుగా కనబడుతున్న అనేకమైన వాటి నుండి ప్రయోజనాన్ని పొందలేకపోయాయి. . . . తమకు ఉద్యోగాలు ఉండవని భయపడిన వారైన ప్రజలు, సెంట్రిస్ట్‌ ప్రభుత్వాల నిస్సహాయతపై రేగిన ప్రచ్ఛన్న కోపాన్ని వదలి తమ మధ్యనున్న విదేశీయుల్ని బలి పశువులను చేస్తున్నారు.” రయినషర్‌ మెర్‌క్యుర్‌ క్రిస్ట్‌ ఉన్త్‌ వెల్త్‌లో యోర్గ్‌ షిన్‌డ్లర్‌ గత రెండు దశాబ్దాలుగా జర్మనీలోనికి ప్రవాహంలా తరలివచ్చిన రాజకీయ శరణార్థులైన వేలాదిమందివైపు అవధానాన్ని మళ్లించాడు. ది జర్మన్‌ ట్రిబ్యూన్‌ ఇలా హెచ్చరిస్తోంది: “జాతి వాదం యూరప్‌ అందంతటా విజృంభిస్తోంది.” ఎంతోమంది వలసదారులు తరలిరావడం, ద్వేషభావాల్ని సృష్టిస్తుంది. ‘వాళ్లు మా డబ్బును దోచుకుంటున్నారు, మా ఉద్యోగాల్ని కాజేస్తున్నారు. వాళ్లు మా ఆడపిల్లలకు ముప్పుగా తయారయ్యారు’ అని ఫిర్యాదు చేయడాన్ని ప్రజలు విన్నారు. ప్రజలు “బెదిరించబడినట్లు లేక అవమానపర్చబడినట్లు భావించారు గనుకనే వాళ్లు హింసావాదులు అయ్యారు. సత్వరమైన చర్య అవసరమయ్యే వారి కోపానికి కారణమదే” అని ఆక్స్‌ఫర్డ్‌లోని సెయింట్‌ ఆంటోనీస్‌ కాలేజ్‌ విద్యుత్సభ సభ్యుడైన థియోడర్‌ ఝెల్‌డన్‌ తెలియజేశాడు.

ద్వేషించమని తన పౌరులకు బోధించే ప్రపంచమని మన ప్రపంచాన్ని గురించి వర్ణించేందుకు బ్రిటిష్‌ టీవీ విలేఖరి జోన్‌ బాక్‌వెల్‌ సరియైన పదాలను ఉపయోగిస్తోంది. ఆమె ఇలా రాస్తోంది: “నేను ఆర్థడాక్స్‌ క్రైస్తవురాల్ని కాను కానీ యేసు బోధలోని అపారమైన, సంపూర్ణ సత్యాన్ని నేను గుర్తిస్తాను: ప్రేమలేనితనమే వినాశనకరమగు దుష్టత్వం. . . . ప్రేమ సిద్ధాంతాన్ని ఇసుమంతైనా విశ్వసించని ఓ సమాజంలో మనం జీవిస్తున్నామని నాకు తెల్సు. స్వప్రయోజన లాభాపేక్షలకన్నా శ్రద్ధా నిస్వార్ధాలకు ఉన్నత విలువలనివ్వడాన్ని ధిక్కరించే టక్కుటమార సమాజం అలాంటి సిద్ధాంతాన్ని పసలేనిదనీ, భావోద్రేకమనీ, వట్టిభ్రమేననీ త్రోసిపుచ్చుతుంది. సమాజం దాని బాధ్యతల్ని మోసగించే తాజా వ్యవహారాన్ని ఖరారు చేస్తూ, క్రమం తప్పిన స్థితిలో ఉందని చూపించే రుజువుల్ని అల్పప్రాధాన్యంగలవిగా చేస్తూ ఉంటూనే అది ‘వాస్తవికంగా ఉండండి’ అని చెబుతోంది. అలాంటి ప్రపంచం వైఫల్యాల్నీ, స్వేచ్ఛావాదుల్నీ, అలాగే సామాజిక ప్రాధాన్యతలైన సాఫల్యతా, ఆత్మగౌరవాలనూ సంతోషకరమైన కుటుంబాలనూ కల్గివుండడంలో విఫలులైన ప్రజల్నీ ఉత్పన్నం చేస్తుంది.”

స్పష్టంగా, ఈ లోక దేవుడైన సాతాను మానవజాతికి ద్వేషాన్ని నేర్పిస్తున్నాడు. కానీ వ్యక్తులుగా, మనం ప్రేమించడం నేర్చుకోగలం. ఇది సాధ్యమేనని దీని తదుపరి శీర్షిక చూపిస్తుంది.

[7వ పేజీలోని చిత్రం]

ద్వేషించమని మీ పిల్లలకు వీడియో గేమ్‌లు బోధిస్తున్నాయా?

[8వ పేజీలోని చిత్రం]

యుద్ధహింస అనేది అజ్ఞానాన్నీ ద్వేషాన్నీ సూచించే లక్షణం

[క్రెడిట్‌ లైను]

Pascal Beaudenon/Sipa Press

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి