మీ మూత్రపిండాలు జీవాన్ని పోషించే ఫిల్టర్
ఐర్లాండ్‌లోని తేజరిల్లు! విలేఖరి ద్వారా
ఈ భూమికీ మానవ శరీరానికీ సారూప్యత ఉంది: జీవాన్ని పోషించేందుకు ఈ రెండింటికీ ఫిల్టర్ కావాలి. సూర్యుని నుండి ఎడతెగక వచ్చే ప్రమాదకరమైన కిరణాల దాడి నుండి భూమికి కాపుదల కావాలి. మన వాతావరణం యొక్క ఓజోను పొర జీవానికి ఎంతో అవసరమైన వెలుగు భూమికి చేరుకునేలా చేస్తూ వీటిని ఫిల్టర్ చేస్తుంది. మరి మీ శరీరమో? మీ శరీరంలోని అనేక రసాయనిక ప్రక్రియలు విషపూరిత పదార్థాలనూ వ్యర్థపదార్థాలనూ మీ రక్తప్రవాహంలోకి విడుదల చేస్తాయి. వాటిని అక్కడే ఉండనిస్తే, అవి మీకు గంభీరమైన సమస్యలు సృష్టించవచ్చు, చివరికి మరణానికి కూడా దారితీయవచ్చు. అవి ఎడతెగక వడపోయబడి తీసివేయబడాలి.
ఇలా వడపోయడం మీ మూత్రపిండాలకుగల అతి ముఖ్యమైన పనుల్లో ఒకటి. అయితే మీ శరీరానికి ఆహారాన్నీ పోషణనూ ఇచ్చే ప్రాముఖ్యమైన పదార్థాలు ఉండేలా చూస్తూ అదే సమయంలో ప్రమాదకరమైన పదార్థాలను గుర్తించడం, వేరుపరచడం మరియు వాటిని తీసేయడం వంటి పనులను ఈ చిన్న అవయవాలు ఎలా చేయగలవు? మరి మీ మూత్రపిండాలు మిమ్మల్ని మంచి ఆరోగ్యంతో ఉంచేందుకు మీరు వాటికి ఎలా సహాయం చేయగలరు?
మీ మూత్రపిండాల లోపల ఏముంది?
మానవులకు సాధారణంగా రెండు మూత్రపిండాలు ఉంటాయి, అవి మీ నడుము భాగంలో వెన్నెముకకు ఇరు వైపులా ఉంటాయి. ఒక్కొక్కటి పది సెంటీమీటర్ల పొడవు, ఐదు సెంటీమీటర్ల వెడల్పు మరియు రెండున్నర సెంటీమీటర్ల మందం ఉండి దాదాపు 110 నుండి 170 గ్రాముల బరువుంటుంది. మూత్రపిండాన్ని నిలువుగా కోసి చూస్తే, ప్రక్కనున్న చిత్రపటంలో చూపబడిన విధంగా చక్కగా వ్యవస్థీకరించబడిన అనేక భాగాలు కనిపిస్తాయి.
మూత్రపిండం పని చేసే విధానాన్ని తెలుసుకునేందుకు, ఒక క్రీడా కార్యక్రమాన్ని చూసేందుకు వేలాదిమంది ప్రేక్షకులు స్టేడియం లోనకు రావటాన్ని ఊహించుకోండి. మొదటిగా, ఆ గుంపు అనేక చిన్న వరుసలుగా విభజింపబడాలి. తర్వాత ప్రతి వరుసలో ఉన్న ప్రజలు ఒకరి తర్వాత మరొకరు భద్రతా ద్వారాలగుండా వెళ్లాలి, అక్కడ టికెట్టు లేని వ్యక్తిని పక్కకు పంపించేస్తారు. టికెట్టు ఉన్న ప్రేక్షకులు తమకు నియమింపబడిన సీట్ల వద్దకు వెళ్తారు.
అదే విధంగా, మీ రక్తంగా ఏర్పడే అనేక మూల పదార్థాలన్నీ కూడా మీ శరీరం అంతటా ప్రసరించాల్సి ఉంటుంది. అయితే, అవి అలా చేస్తుండగా, ఒక్కో మూత్రపిండానికీ ఒకటి చొప్పున ఉన్న వృక్క ధమనులు అనే పెద్ద రక్తనాళాల ద్వారా అవి మీ మూత్రపిండాలలోకి అనేకసార్లు వెళ్లవలసి ఉంటుంది. (24వ పేజీలోని బొమ్మను చూడండి.) మూత్రపిండంలోకి ప్రవేశించిన తర్వాత, వృక్క ధమని మూత్రపిండం యొక్క వెలుపలి మరియు లోపలి పొరల్లో చిన్న నాళాలుగా విభజన చెందుతుంది. అలా మీ రక్తంలోని అనేక పదార్థాలు చిన్న మరియు మరింత వ్యవహరించదగ్గ “వరుసల”లోకి వెళ్తాయి.
తుదకు, రక్తం చిన్న గుచ్ఛాల వద్దకు చేరుకుంటుంది, వాటిలో ఒక్కొక్కటి గట్టిగా కలిపి ఉన్న దాదాపు 40 చిన్న రక్తనాళాలను కలిగి ఉంటాయి. గ్లోమెరూలస్ అని పిలువబడే ఒక్కో గుచ్ఛం కూడా, బౌమెన్ గుళిక అని పిలువబడే రెండు పొరల త్వచంతో చుట్టబడి ఉంటుంది.a అలా గ్లోమెరూలస్ మరియు బౌమెన్ గుళిక మీ మూత్రపిండంలోని ‘భద్రతా ద్వారం’ యొక్క మొదటి భాగం అవుతాయి, అదే ఒక వృక్క ప్రమాణం. అది మీ మూత్రపిండం యొక్క సాధారణ వడపోత విభాగం. ప్రతి మూత్రపిండంలోనూ పది లక్షలకంటే ఎక్కువ వృక్క ప్రమాణాలు ఉంటాయి. అయితే అవి ఎంత చిన్నగా ఉంటాయంటే వాటిని పరీక్షించేందుకు మీకు ఒక సూక్ష్మదర్శిని అవసరం అవుతుంది!—25వ పేజీలో పెద్దగా చూపబడిన ఒక వృక్క ప్రమాణం యొక్క బొమ్మను చూడండి.
మీ రక్తాన్ని రెండు స్థాయిల్లో వడపోయడం
మీ రక్తప్రవాహంలోని కణాలూ ప్రోటీనులు ఎంతో ప్రాముఖ్యమైనవి. అవి ప్రాణవాయువును అందించడం, రక్షణ కలిగించడం మరియు నష్టాన్ని పూరించడం వంటి అతి ప్రాముఖ్యమైన సేవలను మీ శరీరానికి అందిస్తాయి. రక్త కణాల మరియు ప్రోటీనుల నష్టాన్ని నివారించేందుకు, వడపోత యొక్క మొదటి స్థాయి వాటిని మిగతా అన్ని పదార్థాలనుండీ వేరు చేస్తుంది. ఈ ప్రత్యేకమైన పనిని బౌమెన్ గుళికలు చేస్తాయి. అయితే ఎలా?
గ్లోమరూలస్లోకి ప్రవేశించే రక్తనాళాలు అతి పలుచని గోడలుగల చిన్న రక్తకేశనాళికలుగా విభజించబడతాయి. అలా, రక్తం యొక్క ఒత్తిడి మీ రక్తప్రవాహంలో నుండి కొంత నీటిని మరియు ఇతర చిన్న అణువులను తమ పలుచని పొరనుండి బౌమెన్ గుళికలోకీ మరియు దానికి అంటుకుని ఉన్న చుట్టచుట్టబడిన నాళికలోకీ పంపగలుగుతుంది. ఈ నాళికను సంవళిత నాళిక అని అంటారు. పెద్దవైన ప్రోటీను అణువులు మరియు రక్తకణాలన్నీ కూడా రక్తప్రవాహంలోనే ఉండిపోయి రక్తకేశనాళికల ద్వారా ప్రవహించడం కొనసాగిస్తాయి.
ఇప్పుడు వడపోత మరింత వరణాత్మకంగా ఉంటుంది. మీ మూత్రపిండాలు మీ శరీరానికి ప్రాముఖ్యమైనవి ఏవీ కూడా తప్పించుకోకుండా చూస్తాయి! ఈ స్థాయిలో నాళికగుండా ప్రవహించే ద్రవం పలుచని మిశ్రమంగా ఉంటుంది, అందులో ఉపయుక్తమైన అణువులూ వాటితో పాటూ వ్యర్థమైన మరియు అనవసరమైన పదార్థాలూ ఉంటాయి. నాళిక యొక్క లోపలి గోడ వెంబడి ఉండే ప్రత్యేకించబడిన కణాలు నీరు, లవణాలు, చక్కెర పదార్థాలు, ఖనిజాలు, విటమిన్లు, హార్మోన్లు మరియు అమీనో ఆమ్లాల వంటి ఉపయోగకరమైన అణువులను గుర్తిస్తాయి. అవి నాళిక గోడలోకి మళ్లీ తీసుకోబడి మీ రక్తప్రవాహంలోకి మళ్లీ పోయేలా చుట్టుప్రక్కలగల రక్తకేశనాళికల జాలంలోకి తిరిగి వెళ్లేలా చేయబడటం ద్వారా లాఘవంగా సంగ్రహించబడతాయి. రక్తకేశనాళికలు తర్వాత మళ్లీ చిన్న సిరలుగా జతపడి అవన్నీ కూడా వృక్క సిర అని పిలువబడే రక్త నాళంగా మళ్లీ రూపొందేందుకు జత చేయబడతాయి. వడపోయబడి శుభ్రం చేయబడి ఉన్న మీ రక్తం ఇప్పుడు దాని ద్వారా మూత్రపిండాలను వదిలి మీ శరీరంలోని జీవాన్ని కాపాడేందుకు ముందుకు సాగుతుంది.
వ్యర్థపదార్థాలను విసర్జించడం
మరి నాళికలో ఉండిపోయే ద్రవం సంగతేమిటి? మీ శరీరానికి అవసరం లేని పదార్థాలను అది కలిగి ఉంటుందన్నది స్పష్టమైన విషయం. పెద్ద సంగ్రహణ నాళం వైపుకు ఆ ద్రవం ఈ నాళిక గుండా వెళ్తుండగా, నాళిక గోడలోని ఇతర కణాలు అమ్మోనియా, పొటాషియం, యూరియా, యూరిక్ ఆమ్లం మరియు మిగులు నీరుగల అదనపు స్రవణాలను దానిలోనకు విడుదల చేస్తాయి. ఆ చివరి ఉత్పత్తే మూత్రం.
విభిన్న వృక్కప్రమాణాల నుండి వచ్చే సంగ్రహణ నాళములు అన్నీ కలిసి, సూచీస్తంభాల చివరనగల కొనల గుండా మూత్రాన్ని విడుదల చేస్తాయి. మూత్రం వృక్క మూత్రపిండ ద్రోణిలోకి వెళ్తుంది, ఆ తర్వాత మూత్రపిండాన్నీ మరియు కోశమునూ కలిపే మూత్రనాళం అని పిలువబడే దాని ద్వారా బయటకుపోతుంది. మీ శరీరంలోనుండి విసర్జింపబడే ముందు మూత్రం మీ కోశంలో నిలువ ఉంటుంది.
వాటికి సూక్ష్మ రూపం ఉన్నప్పటికీ, మీ మూత్రపిండాల్లో 20 లక్షలకంటే ఎక్కువగా వున్న వృక్కప్రమాణాలు ఎంతో గొప్ప పని చేస్తాయి. ది న్యూ ఎన్సైక్లోపేడియా బ్రిటానికా ఇలా పేర్కొంటుంది: “వృక్కప్రమాణాలు . . . మీ రక్తంలో వున్న ఐదు లీటర్ల నీళ్లను ప్రతి 45 నిమిషాలకు ఒకసారి వడపోస్తాయి.” విభిన్న పదార్థాలు తిరిగి పీల్చుకోబడి మరియు అనేక ప్రక్రియలు పూర్తి అయ్యేసరికి ఒక మామూలు, ఆరోగ్యవంతమైన శరీరం 24 గంటల్లో రెండు లీటర్ల వ్యర్థపదార్థాన్ని మూత్రం రూపంలో విసర్జించగలదు. ఎంత కష్టించి పని చేసే మరియు సంపూర్ణమైన వడపోత విధానమో కదా!
మీ మూత్రపిండాల గురించి శ్రద్ధ తీసుకోండి!
మీ మూత్రపిండాలు స్వయంగా శుభ్రం చేసుకుంటాయీ, తమ ఎడల తామే శ్రద్ధ వహిస్తాయీ, అవి అలా ఎంతో కాలం పని చేయగలవు. అయితే, అవి తమ పని తాము చేసుకుపోయేందుకు వాటికి సహాయం చేయడంలో మీకూ కొంత భాగముంది. మీ శరీరం ఆరోగ్యవంతంగా ఉండాలంటే మీ మూత్రపిండాలగుండా ఎంతో ఎక్కువ నీరు ప్రవహించాల్సి ఉంటుంది. నిజానికి, నీళ్లు ఎక్కువ త్రాగడం మూత్రపిండాల రోగమూ మూత్రపిండాల్లో రాళ్లు తయ్యారవ్వడం వంటి వాటిని నివారించేందుకు ప్రధానమైన మార్గంగా పరిగణించబడుతోంది.b నీళ్లు త్రాగడం మీ అరుగుదలకూ కార్డియోవాస్కులర్ వ్యవస్థకూ కూడా సహాయం చేస్తుంది అని న్యూయార్క్ నందలి లాంగ్ ఐలాండ్ కళాశాల ఆసుపత్రిలోని యూరాలజీ విభాగానికి అధ్యక్షుడైన డా. సి. గోడెక్ పేర్కొన్నాడు.
ఎన్ని నీళ్లు? ఇతర ఆహార పదార్థాలకూ ద్రవాలకూ తోడు ఒక వ్యక్తి ప్రతిరోజు కనీసం రెండు లీటర్ల నీళ్లు త్రాగాలని డా. గోడెక్ మరియు ఇతర అనేకమంది వైద్యులు సిఫారసు చేస్తున్నారు. “అనేకమంది ప్రజలు జలశూన్యతకు గురౌతారు” అని డా. గోడెక్ తేజరిల్లు!కు చెప్పాడు. మీ మూత్రపిండాలకూ మీ హృదయానికీ జబ్బు చేయనంత వరకూ వాటికి నీళ్లు మంచివే అని ఆయన పేర్కొన్నాడు. “అయితే మీరు తగినన్ని నీళ్లు త్రాగాలి, కానీ అనేకమంది ప్రజలు త్రాగరు” అని డా. గోడెక్ చెప్పాడు.
కొందరు నీళ్లకు నిమ్మరసం వంటి ఏదైనా అదనపు రుచిని జత చేసుకునేందుకు ఇష్టపడతారు. ఇతరులు ఊట నీటిని లేక ఆక్టివేటెడ్ చార్కోల్తో వడపోయబడిన నీటిని ఇష్టపడతారు. ఏది ఏమైనప్పటికీ, ఇతర ద్రవాల కంటే కూడా, తేట నీళ్లూ లేదా కాస్త ఇతర రుచులు కలిసివున్న నీళ్లు మీ మూత్రపిండాలకు ఎక్కువ శ్రేష్ఠమైనవి. వాస్తవానికి, పళ్ల రసాలు మరియు ఇతర తీయని ద్రవాల్లో ఉండే చక్కెర మీ శరీరం యొక్క నీటి అవసరతను అధికం చేస్తుంది. మత్తు పదార్థాలు లేక కాఫీన్గల ద్రవాలు మీ శరీరం నీటిని కోల్పోయేలా చేస్తాయి.
రోజుకు రెండు లీటర్ల నీళ్లు త్రాగడాన్ని అలవాటు చేసుకోవడం నిజంగా ఒక సవాలుగా ఉండగలదు. ఒక విషయం ఏమంటే, ఆ నీటిని విసర్జించేందుకు పదే పదే టాయ్‌లెట్‌కు వెళ్లడం అనేకమంది ప్రజలకు అసౌకర్యంగా లేక ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఆ అదనపు శ్రమ తీసుకుంటే మీ శరీరం మీకు రుణపడి ఉంటుంది. తగినన్ని నీళ్లు త్రాగడం మీ ఆరోగ్యాన్ని కాపాడేందుకు సహాయం చేయడంతో పాటూ, మీ రూపాన్ని కూడా మెరుగుపర్చగలదు. మంచి పోషణ మరియు ద్రవాలు ఎక్కువగా తీసుకోవడం, మీ చర్మాన్ని మరింత అందంగా ఉంచేందుకు ఏ బాహ్య చర్మ మందులకంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటాయని వైద్యులు పేర్కొంటారు.
దుఃఖకరంగా, మన దాహ వ్యవస్థ అసంపూర్ణమైనది, మరియు మనం వృద్ధులమౌతుండగా అది మరింత క్షీణిస్తుంది. అలా, మనకు ఎన్ని నీళ్లు కావాలనే విషయాన్ని చెప్పేందుకు మనం దాహంపై మాత్రమే ఆధారపడలేము. మనం తగినన్ని నీళ్లు త్రాగేందుకు ఎలా జాగ్రత్తవహించగలం? కొందరు దినారంభంలో రెండు గ్లాసుల నీళ్లు త్రాగుతారు, తర్వాత వాళ్లు అప్పుడప్పుడూ మళ్లీ ఒక్కో గ్లాసు నీళ్లు త్రాగుతారు. ఇతరులు పారదర్శకమైన పాత్రలో నీళ్లు పెట్టుకుని దాన్ని తాము అందుకోగలిగేంత దగ్గర్లో ఉంచుకుంటారు, వాళ్లు దినమంతటిలోనూ అప్పుడప్పుడూ ఒక గుటక త్రాగేందుకు వాళ్లకది జ్ఞాపకం చేస్తుంది. మీరు ఎలాంటి పద్ధతిని ఉపయోగించినప్పటికీ, స్వచ్ఛమైన, శుభ్రమైన నీళ్లు ఎక్కువగా త్రాగడం మిమ్మల్ని సజీవంగా ఉంచుతున్న అద్భుతమైన వడపోత విధానమైన మూత్రపిండం ఎడల మెప్పును ప్రదర్శించేందుకు ఒక మార్గం.
[అధస్సూచీలు]
a 1840వ దశాబ్దం తొలి కాలంలో, ఆంగ్లేయ సర్జన్ మరియు హిస్టాలజిస్ట్ అయిన విలియం బౌమెన్ ఈ చిన్న గుళికనూ దాని పనినీ వివరించాడు. దానికి ఆయన పేరు పెట్టబడింది.
b తేజరిల్లు! యొక్క 1993 ఆగస్టు 22 సంచికలోని 20-2 పేజీలను మరియు 1986 మార్చి 8 సంచికలోని 18వ పేజీని చూడండి.
[25వ పేజీలోని బాక్సు]
వృక్కప్రమాణం—ప్రధానమైన వడపోత విభాగం
ప్రతి మూత్రపిండంలోనూ పది లక్షలకంటే ఎక్కువ వృక్కప్రమాణాలు ఉంటాయి. ప్రతి ఒక వృక్కప్రమాణంలో కనుగొనబడే గొట్టంవంటి భాగం దాదాపు మూడు సెంటీమీటర్ల పొడవూ కేవలం 0.05 మిల్లీమీటర్ల వెడల్పూ ఉంటుంది. అయినప్పటికీ, ఒక మూత్రపిండంలోని నాళికలన్నింటినీ బయటకు తీయగలిగితే అవి దాదాపు 30 కిలోమీటర్ల పొడవు ఉంటాయ్!
బౌమెన్ గుళిక వాస్తవానికి వృక్కప్రమాణంలోని సంవలిత నాళిక యొక్క మడిచిన చివర. ఈ నాళిక రక్తకేశనాళికలు అని పిలువబడే అతి చిన్న రక్తనాళాల జాలంతో చుట్టుముట్టబడి ఉంటుంది. ఆ నాళిక పెద్ద సంగ్రహణ నాళంలోకి ప్రవేశిస్తుంది, అది వృక్కప్రమాణం వడియగట్టిన వ్యర్థ మరియు విష పదార్థాలన్నింటినీ తీసుకుపోతుంది.
[24, 24వ పేజీలోని చిత్రం]
వృక్క సిర క్రొత్తగా వడపోయబడిన రక్తాన్ని శరీరంలోకి తీసుకుపోతుంది
వృక్క ధమని వడపోయబడని రక్తాన్ని మూత్రపిండాలకు చేరవేస్తుంది
వృక్క సూచిస్తంభాలు శంక్వాకారంలో ఉంటాయి, అవి వృక్క మూత్రపిండ ద్రోణి వరకు మూత్రాన్ని చేరవేస్తాయి
వల్కలము ప్రతి వృక్కప్రమాణం యొక్క గ్లోమెరూలస్ను కలిగి ఉంటుంది
వృక్క మూత్రపిండ ద్రోణి అనేది మూత్రాన్ని సేకరించి మూత్రనాళంలోకి పంపే గరాటు
మూత్రనాళం మూత్రాన్ని మూత్రపిండం నుండి కోశానికి పంపుతుంది
[25వ పేజీలోని చిత్రం]
దాదాపు 20 లక్షలకంటే ఎక్కువగావున్న సూక్ష్మ నాళికా వడపోత విధానాలైన వృక్కప్రమాణాలు రక్తాన్ని శుభ్రం చేస్తాయి
బౌమెన్ గుళిక
గ్లోమెరూలస్
మూత్రం సంవలిత నాళం ద్వారా తీసుకోబడుతుంది, తర్వాత కోశంలోకి పోతుంది
రక్తనాళాలు