అలసట ట్రక్ డ్రైవర్లకు కానరాని ఒక ఉచ్చు
జర్మనీలోని తేజరిల్లు! విలేఖరి ద్వారా
గంటల తరబడి బండి నడిపిస్తూ ఉండగా, శక్తివంతమైన ఇంజన్ చేసే ఎడతెగని శబ్దమూ రోడ్డుపై 14 చక్రాలు చేసే చప్పుడూ, అలసటకు విరుద్ధంగా ట్రక్కు డ్రైవర్లు చేసే పోరాటాన్ని మరింత కష్టతరం చేస్తాయి. అతను బండి నడుపుతుండగా, హెడ్‌లైట్ల వెలుగులో రోడ్డు మార్కర్లు నిశ్శబ్దంగా దాటి పోతుంటాయి. అకస్మాత్తుగా, ట్రేలర్ అటూ ఇటూ ఊగిసలాడుతుంది; బండి రోడ్డు మీదినుండి ప్రక్కకు తొలగిపోయింది.
స్టీరింగ్ వీల్‌ను గబగబా తిప్పుతూ, డ్రైవరు తన 40 టన్నుల వాహనాన్ని మళ్లీ రోడ్డు మీదికి ఒడుపుగా తెస్తాడు. ఇప్పుడు పూర్తిగా తేరుకున్న డ్రైవరు, గత కొన్ని క్షణాల్లో ఏమి జరిగిందో తను పూర్తిగా మర్చిపోయినట్లు గమనిస్తాడు. అతను అలసటను అనుభవిస్తున్నాడు.a
అలిసిపోయి బండి నడుపుతున్న వారు ఎవరైనా క్షణకాలంపాటూ మగతలోకి సులభంగా జారుకోగలరు. నేటి క్రిక్కిరిసిన రోడ్ల దృష్ట్యా, రోడ్డు మీద వెళ్లే ఇతరులకు కూడా అది ఎంతో ప్రమాదకరం కాగలదు. ఉదాహరణకు, జనవరి 1989 నుండి మార్చి 1994 వరకూ జరిగిన, బరువైన వస్తువులను రవాణా చేసే వాహన దుర్ఘటనల్లో 35 కంటే ఎక్కువ శాతం, బండి నడుపుతూ నిద్రలోకి జారుకున్న డ్రైవర్ల మూలంగానే జరిగాయి.
డ్రైవర్ల ప్రవర్తనను గురించి పరిశోధన చేస్తున్న ప్రొఫెసర్ జీ. స్టోకర్, తీవ్రమైన అలసట మగతకు దారితీస్తుందనీ మరి అది మద్యపానమంత ఎక్కువ మత్తెక్కించగలదనీ ఫ్హార్‌స్యూల్ అనే జర్మనీ పత్రికలో చెప్పాడు. ఆయన వ్యాఖ్యానాలు కేవలం ట్రక్కు డ్రైవర్లకే కాదుగానీ డ్రైవర్లందరికీ ప్రాముఖ్యమైనవన్నది వాస్తవం.
అలసటకు కారణాలు
అనేక దేశాల్లో చట్టం ఒక ట్రక్కు డ్రైవరు ఎన్ని గంటలు బండి నడపాలనే విషయాన్ని సిఫారసు చేస్తుండగా లేక నియంత్రిస్తుండగా, అలసటకు సంబంధించిన దుర్ఘటనలు అంత తరచుగా ఎందుకు జరుగుతున్నాయి? మొదటి విషయం ఏమంటే, మనం ఒక ట్రక్కు డ్రైవరు యొక్క పూర్తి పని గంటలను గమనించాలి, అందులో బండి నడపడం మాత్రమే కాక వేరే పనులు కూడా ఇమిడి ఉంటాయి. ఈ పని గంటలు తరచూ సుదీర్ఘమైనవీ, అస్థవ్యస్థమైనవీ అయి ఉంటాయి.
అనేకమంది ట్రక్కు డ్రైవర్లు తమ పనిని చివరి వరకూ చేసి ముగించేయాలని ఇష్టపడతారు, ఎలాంటి వాతావరణంలోనైనా తమ వస్తువులను వినియోగదారుల వరకూ తీసుకెళ్లడం అందులో ఇమిడి వుంటుంది. ప్రయాణించిన దూరాన్ని బట్టీ, తీసుకెళ్లిన బరువును బట్టీ దక్షత అంచనావేయబడుతుంది. పని గంటలు సగటు గంటల కంటే ఎంతో ఎక్కువ ఉండవచ్చు. జర్మనీలో అనేకమంది వారానికి 40 కంటే తక్కువ గంటలు పని చేస్తారు, అయితే అనేకమంది ట్రక్కు డ్రైవర్లు దానికి రెండంతల సమయం పని చేస్తారు.
ఇతర దేశాల్లో కూడా పరిస్థితులు అంత మెరుగ్గా ఏమీ లేవు. దక్షిణాఫ్రికాలో వేతనాలు చాలా తక్కువగా ఇస్తారు, కాబట్టి డ్రైవర్లు ఎక్కువ గంటలు బండి నడపడం ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తారు. డ్రైవర్లు తమ ప్రయాణాన్ని ముగించేందుకు రవాణా సంస్థలు తగినంత సమయాన్ని ఇస్తున్నప్పటికీ, అనేకమంది ట్రక్కు డ్రైవర్లు ఎక్కువ స్థలాలకు అదనపు బరువులను తీసుకెళ్లడం ద్వారా అదనంగా డబ్బు సంపాదిస్తారని అలా వారు ఎక్కువసేపు బండి నడిపేందుకు తమ సమయాన్ని వెచ్చిస్తారని భారతదేశం నుండి వచ్చిన నివేదికలు సూచిస్తున్నాయి. అందుకు వాళ్లు సమయానికి తిరిగి సంస్థను చేరుకునేందుకు తక్కువ సేపు నిద్రపోవలసి ఉంటుంది.
యూరోపియన్ యూనియన్‌లో, చట్టం అనుమతించిన అత్యధిక గంటలను ఉపయోగించుకోవడం ద్వారా, ఒక ట్రక్కు డ్రైవరు ఒక వారంలో 56 గంటలు బండి నడపగలడు. అయితే ఆ తర్వాతి వారంలో, అతని అత్యధిక గంటలు 34కు పరిమితమౌతాయి. అతను వస్తువులను బండిలో ఎక్కించేందుకూ దింపేందుకూ వెచ్చించిన గంటలతో సహా అతని పని గంటలన్నీ కూడా పర్యవేక్షణాయంత్రం ద్వారా రికార్డు చేయబడతాయి. అలా ఆ రికార్డు ప్రతి డ్రైవరూ తన పరిమితుల్లోనే ఉన్నాడా లేదా అనే విషయం చూడటాన్ని సాధ్యం చేస్తుంది.
వాహనాన్ని నడిపేందుకు ఎంత సమయాన్ని గడపాలి అనే విషయాన్ని నియంత్రించే మరొక కారకాంశం, యజమాని యొక్క దృక్పథం. అతని ట్రక్కు అతనికి ఒక విలువైన పెట్టుబడి, గనుక దాన్ని వీలైనంత ఎక్కువ ఉపయోగించుకోవాలనీ అంటే వీలైతే 24 గంటలూ కూడా సరుకులను రవాణా చేసేందుకు ఉపయోగించుకోవాలనీ అతను ప్రయత్నించవచ్చు. రవాణా సంస్థల మధ్య పోటీ ఎక్కువవుతోంది, స్వచ్ఛందంగా ఎక్కువ గంటలు పని చేయమని మేనేజర్లు డ్రైవర్లపై ఒత్తిడి తెస్తారు.
ఎక్కువ గంటలు పని చేయవలసి వచ్చినా, పని గంటలు అసాధారణమైన సమయాల్లో ప్రారంభమైనా కూడా అది అలసట కలిగించవచ్చు. ఉదాహరణకు, సాధారణంగా ఉదయం ఒకటి నుండి నాలుగు గంటల లోపల పని ప్రారంభిస్తారు. మరి అనేకమంది డ్రైవర్లు ఆ సమయాల్లో అత్యంత తక్కువ చురుకుగా ఉంటారు, వారు సరిగ్గా అవధానం నిలపలేరు. తమ వద్ద తక్కువ స్టాకు ఉంచుకునే సంస్థలు, ‘సరిగ్గా సమయానికి’ సరుకు తీసుకురావాలని డిమాండు చేస్తే వత్తిడి ఎక్కువౌతుంది. డ్రైవరు సరుకు తీసుకుని వినియోగదారుని వద్దకు సరిగ్గా ఒప్పందం చేయబడిన సమయానికల్లా చేరుకోవాలని దాని అర్థం. ట్రాఫిక్ రద్దీల వల్ల, వాతావరణం సరిగ్గా లేకపోవడం వల్ల, రోడ్డు మరమ్మతుల వల్ల ఆలస్యం కావచ్చు, డ్రైవరు వాటినన్నిటినీ ఎలాగోలా అధిగమించి సమయానికి చేరుకోవాలి.
ఎన్ని గంటలు మాత్రమే బండి నడపాలనే విషయంపై నియంత్రణలు ఉన్నప్పటికీ, పోలీసులు అప్పుడప్పుడూ తనిఖీ చేసినప్పుడు డ్రైవర్లు చట్టాన్ని అతిక్రమించారనే విషయం తెలియవచ్చింది. పోలీట్సై ఫెర్‌కేర్ & టెక్‌నిక్ అనే పత్రిక ప్రకారం, “ట్రక్కులనూ బస్సులనూ మరియు (పెట్రోల్ ట్యాంకర్లు, ఆసిడ్ ట్యాంకర్ల వంటి) ప్రమాదకరమైన సరుకునూ తీసుకెళ్లే వారందరిలో అంటే దాదాపు ప్రతి 8 మంది డ్రైవర్లలో ఒకరు, ఎన్ని గంటలు బండి నడపాలీ ఎన్ని గంటలు విశ్రాంతి తీసుకోవాలీ అనే విషయాల్లో విధింపబడిన నియమాలకు తగినట్లు ఉండరు.” హాంబర్గ్‌లో జరిగిన ఒక రవాణా తనిఖీలో, ఒక డ్రైవరు మధ్యలో ఎంతమాత్రం విశ్రాంతి తీసుకోకుండా తన బండిని 32 గంటలు ఎడతెరిపి లేకుండా నడిపాడనే విషయాన్ని పోలీసులు కనుగొన్నారు.
ప్రమాదాన్ని గుర్తించడం
అంతర్జాతీయంగా సరుకులను 30 సంవత్సరాలపాటూ రవాణా చేసిన దూర ప్రయాణాలు చేసే డ్రైవరును అలసట సమస్యను గురించి అడగటం జరిగింది. ఆయనిలా గమనించి చెప్పాడు: “అహంకారం మరియు అతినమ్మకం ఒక డ్రైవరు తన అలసటను అలక్ష్యం చేసేందుకు దారితీయగలదు. దుర్ఘటనలు జరిగేది అలాగే.” 22వ పేజీలో ఉన్న బాక్సులో అలసటను సూచించే విషయాలు లిస్టు ఇవ్వబడ్డాయి.
తొలి హెచ్చరికా సూచనలను గుర్తించడం జీవితాలను కాపాడగలదు. అమెరికాలో జాతీయ రవాణా భద్రతా బోర్డు చేత నిర్వహించబడిన ఒక అధ్యయనం కలవరపరిచే గణాంకాలను తెలియజేసింది: కేవలం ఒకే వాహనం ఇమిడివున్న 107 దుర్ఘటనల్లో, 62 దుర్ఘటనలు అలసటకు సంబంధించినవి. కాబట్టి, డ్రైవరు ఎప్పుడు నిద్రలోకి జారుకోబోతుంటాడో అప్పుడు అతనికి హెచ్చరికా సంకేతాలను పంపే సాంకేతిక సహాయకాలను వృద్ధిచేయడానికి రవాణా పరిశ్రమ ఎంతో ప్రాముఖ్యతనిస్తుంది.
ఒక డ్రైవరు ఎన్నిసార్లు రెప్ప వేస్తాడనే దాన్ని గమనించే వీడియో కెమేరాగల ఒక ఎలక్ట్రానిక్ పరికరాన్ని సిద్ధం చేసే విషయంలో జపనీయుల ఫర్మ్ ఒకటి పని చేస్తోంది. మరీ ఎక్కువసార్లు మగతగా రెప్ప వేస్తే, అతనికి అతని ప్రమాదకరమైన పరిస్థితిని గురించి, ముందే రికార్డు చేయబడిన స్వరం హెచ్చరికనిస్తుంది. వాహనం ఎంత సాఫీగా నడపబడుతుందనే విషయాన్ని కొలతవేసే ఒక యంత్రాన్ని సిద్ధం చేసే విషయంలో ఒక యూరోపియన్ కంపెనీ పని చేస్తోంది. ట్రక్కు ఊగిసలాడితే క్యాబిన్‌లో ఒక హెచ్చరిక వినిపిస్తుంది. అయితే, ప్రభావవంతమైన వస్తువులను ఉత్పత్తి చేసేందుకు కాస్త సమయంపడుతుంది.
ప్రమాదాన్ని తప్పించుకోవడం
అలసట అనేది దాదాపు ప్రతి వాహనంలోనూ ఆహ్వానించబడని మరియు అంగీకరించబడని ప్రయాణికునిగా ఉంది. అయితే దాన్నెలా బయటకు నెట్టడం అన్నదే ప్రశ్న. కొందరు డ్రైవర్లు కెఫేన్‌గల ద్రవాలను చాలా ఎక్కువ మోతాదుల్లో త్రాగుతారు, అయితే అలసట ఇంకా తమను వెంటాడుతూనే ఉందనే విషయాన్ని వారు తర్వాత తెలుసుకుంటారు. ఇతరులు ఉత్తేజాన్ని కలిగించే ఇతర పదార్థాలను తీసుకుంటారు. ఇవి ఆరోగ్య ప్రమాదాలను తెస్తాయనే విషయాన్ని చెప్పనవసరం లేదు. మెక్సికోలో కొంతమంది డ్రైవర్లు మెలకువతో ఉండేందుకు పచ్చి మిరపకాయలు (బాగా కారంగా ఉండే రకం) నములుతారు.
ఉదయాన్నే ప్రారంభించే ముందు, తగినంత నిద్రపోవడం ఎంతో మంచిది. సూత్రప్రాయంగా, ఒకరు తమకు విధించబడినన్ని గంటలు మాత్రమే బండి నడపాలి. దక్షిణాఫ్రికాలో, ఐదు గంటలు బండి నడిపిన తర్వాత కొంతసేపు ఆగాలని నిపుణులు సిఫారసు చేస్తున్నారు. బోరుకొట్టే రోడ్లలో నడిపిస్తున్నప్పుడు, డ్రైవరు తన మనస్సును చురుకుగాను మరియు కేంద్రీకరించి ఉంచుకోవాల్సి ఉంటుంది. కొందరు డ్రైవర్లు రేడియో వింటారు లేక సీబి రేడియో ద్వారా ఇతర డ్రైవర్లతో మాట్లాడతారు. ఒక యెహోవాసాక్షి అయిన డ్రైవరు కావలికోట మరియు తేజరిల్లు! వంటి బైబిలు అంశాలుగల క్యాసెట్‌లనూ బైబిలు లేఖనాలుగల క్యాసెట్‌లనూ వింటాడు. ఇతర చిట్కాలకు ఈ పేజీలో ఉన్న బాక్సులో కనుగొనవచ్చు.
జీవన వ్యయానికి సరితూగేందుకు తగినంత సంపాదించడం రాను రానూ మరింత కష్టమవుతుంది, కనుక సమతూకాన్ని కలిగి ఉండటం అంత సులభం కాదు. అలసట అనేది డ్రైవర్లకు ఎంత ప్రమాదకరమైన ఉచ్చులా ఉండగలదనే విషయాన్ని కొన్ని ఫర్మ్‌లు లేక మేనేజర్లు అలక్ష్యం చేయడం జరుగుతుంది. కాబట్టి, రవాణా వ్యాపారానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ, అలసటను గురించి ఇంతవరకూ నేర్చుకున్న విషయాలను మదిలో ఉంచుకోవడం ఎంతో మంచిది. దానికి తోడు, డ్రైవర్లు కూడా తరచూ తమ స్వంత అనుభవం నుండి కొన్ని చిట్కాలను ఇవ్వగలరు, అవి ఇతరులు మగతను తట్టుకునేందుకు సహాయం చేయగలవు.
అయితే, చురుకుగా ఉండేందుకుగల అతి చక్కని మార్గం, శరీరానికి కావలసిన దాన్ని దానికి కచ్చితంగా ఇవ్వడం: మీరు ఎలాంటి హెచ్చరికా సంకేతాలను కనుగొన్నా వెంటనే తర్వాతి స్టాపింగ్ స్థలంలో ఆగి కొంచెం సేపు నిద్రపోండి. దాని తర్వాతనే మళ్లీ బండి నడపడమనే సవాలును చేపట్టండి. అలసట యొక్క కానరాని ఉచ్చులోకి పడిపోకండి!
[అధస్సూచి]
a జర్మనీలో కేవలం కొద్దిమంది డ్రైవర్లు మాత్రమే మహిళలు గనుక, ఈ శీర్షికలో పుల్లింగం ఉపయోగించబడింది.
[22వ పేజీలోని బాక్సు]
తక్షణ చర్య అవసరమయ్యే హెచ్చరికా సంకేతాలు
• మీ కళ్లు మండుతున్నాయా లేక కనురెప్పలు వాలిపోతున్నాయా?
• మీరు సంగతులను ఊహించుకుంటున్నారా లేక మీరు పగటి కలలు కంటున్నారా?
• రోడ్డు మీకు మరీ ఇరుకుగా అనిపించి మీరు మధ్య లైను పై నడుపుతున్నారా?
• ప్రయాణంలో కొన్ని భాగాలను గురించి మీకు అసలు జ్ఞాపకం లేదా?
• మీరు స్టీరింగ్ చక్రాన్నీ బ్రేకులనూ ఉపయోగించే పద్ధతి మామూలు కన్నా కాస్త కుదుపులతో ఉందా?
పైనున్న ప్రశ్నల్లో కేవలం ఒక దానికైనా మీరు అవును అని సమాధానం చెబితే మీకు తక్షణమే విశ్రాంతి అవసరం అని అర్థం
[23వ పేజీలోని బాక్సు]
దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు
• తగినంత నిద్రపోండి
• ఉత్తేజాన్ని కలిగించే వాటిపై ఆధారపడకండి
• క్రమంగా విశ్రాంతి తీసుకోండి, చురుకుగా అయ్యేందుకు వ్యాయామం చేయండి
• బోరు కొట్టే ప్రాంతాలు ప్రత్యేకంగా చాలా ప్రమాదకరమైనవనే విషయాన్ని మనస్సులో ఉంచుకోండి
• ఆకలితో ప్రయాణాన్ని ప్రారంభించకండి. మంచి ఆహారపుటలవాట్లను అలవర్చుకోండి: తేలికైన మరియు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి
• ద్రవాలు పుష్కలంగా త్రాగండి, కానీ మద్యపానం చేయకండి