కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g97 9/8 పేజీలు 18-20
  • మాంసం తినడం తప్పా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మాంసం తినడం తప్పా?
  • తేజరిల్లు!—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • కొంతమంది మాంసం ఎందుకు తినరు?
  • జంతువుల్ని చంపడం తప్పా?
  • జంతువుల్ని ఆహారం నిమిత్తం ఉపయోగించడం
  • జంతు జీవనంపట్ల గౌరవాన్ని చూపడం
  • జంతువులపట్ల కనికరంతో ఉండడం
  • క్రైస్తవుడు శాకాహారిగా ఉండాలా?
  • జంతువుల పట్ల క్రూరత్వం—తప్పా?
    తేజరిల్లు!—1998
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • జంతువులు పరలోకానికి వెళ్తాయా?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
మరిన్ని
తేజరిల్లు!—1997
g97 9/8 పేజీలు 18-20

బైబిలు ఉద్దేశము

మాంసం తినడం తప్పా?

“ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్షమును మీకిచ్చియున్నాను; అవి మీకాహారమగును.”—ఆదికాండము 1:29.

ఒక శాకాహార హైందవ కుటుంబం నుండి వచ్చిన పద్దెనిమిదేళ్ల సుజాత, మొదటి మానవుడైన ఆదాముకు దేవుడిచ్చిన ఆహార నిర్దేశనంతో పూర్తిగా ఏకీభవించింది. కానీ ఆమె వెంటనే ఇలా అడిగింది: “మరైతే తినడానికి ఇన్ని ఆహారపదార్థాలుండగా ప్రజలు జంతువుల్ని ఎందుకు చంపుతారు?”

ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలు అటువంటి అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తుంటారు. ప్రాచ్య దేశాల్లో కోట్లాదిమంది మాంసరహిత ఆహారాన్ని భుజిస్తారు. దానికితోడు, పాశ్చాత్య దేశాల్లో శాకాహారుల సంఖ్య పెరుగుతూ ఉంది. కేవలం అమెరికాలోనే, దాదాపు ఒక కోటీ 24 లక్షలమంది తాము శాకాహారులమని చెప్పుకుంటారు, ఒక దశాబ్దానికి పూర్వం ఉన్న సంఖ్యతో పోలిస్తే ఇది దాదాపు 30 లక్షలు ఎక్కువ.

అంతమంది ప్రజలు మాంసరహిత ఆహారాన్ని ఎందుకు ఇష్టపడతారు? జంతుజీవంపట్ల కలిగివుండాల్సిన సరైన దృక్కోణమేమిటి? మాంసం తినడం జీవంపట్ల అగౌరవాన్ని ప్రదర్శిస్తుందా? ఆదికాండము 1:29లో పేర్కొనబడినదాని దృష్ట్యా, మాంసం తినడం తప్పా? ముందుగా, కొంతమంది మాంసం ఎందుకు తినరో పరిశీలించండి.

కొంతమంది మాంసం ఎందుకు తినరు?

సుజాతకైతే తాను తీసుకునే ఆహారంలో తన మత నమ్మకాలు ఇమిడివున్నాయి. “చిన్నప్పటినుండి నేను హిందువుగా పెరిగాను, పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతూ వచ్చాను” అని వివరిస్తుందామె. “మానవ జీవాత్మ ఒక జంతువుగా తిరిగి జన్మించగలదు కాబట్టి నేను జంతువులను నాతో సమానమైనవిగా పరిగణిస్తాను. మరి అందుకనే ఆహారం కోసం వాటిని చంపడం తప్పని నాకన్పిస్తుంది.” ఇతర మతాలు కూడా శాకాహర భోజనాన్ని సిఫారసు చేస్తాయి.

మత నమ్మకాలకు తోడు ఇతర కారణాలు కూడా ప్రజల ఆహారపుటలవాట్లను ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు, డా. నీల్‌ బెర్నార్డ్‌ సూటిగా ఇలా నొక్కిచెబుతున్నాడు: “మాంసం ఎందుకు తింటారంటే కేవలం అలవాటు మూలానో లేక అజ్ఞానం మూలానో మాత్రమే.” మాంసం తినడం మూలాన గుండె జబ్బూ, క్యాన్సరూ వంటి ఆరోగ్య ప్రమాదాలు సంభవించే సాధ్యత ఉండడం మూలానే ఆయనకు ఈ దృఢమైన అభిప్రాయం ఉంది.a

అమెరికాలో అత్యంత వేగంగా శాకాహారులుగా మారుతున్న సమూహంలో టీనేజర్లు ఉన్నారని చెప్పబడుతుంది. జంతువులపట్ల ఉన్న శ్రద్ధ ఒక కారణం. “పిల్లలకి జంతువులంటే ఎంతో ప్రేమ” అంటుంది పీపుల్‌ ఫర్‌ ది ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ యానిమల్స్‌కు చెందిన ట్రేసీ రైమన్‌. “ఆహారం కోసం జంతువుల్ని చంపకముందు వాటికి ఏమి జరుగుతుందో తెల్సుకోవడం మొదలుబెట్టినప్పుడు, వాటిపట్ల వారికి ఉండే అనురాగం మరింత ఎక్కువవుతుంది.”

పర్యావరణ స్పృహ ఉన్న చాలామంది ప్రజలు తాము తినే ఆహారానికీ, ఆహారం కొరకు జంతువుల్ని పెంచడంలో సహజ వనరులపై పడుతున్న అత్యధిక భారానికీ మధ్య ఉన్న సంబంధాన్ని అర్థంచేసుకుంటారు. ఉదాహరణకు, కేవలం ఒక్క కిలో బీఫ్‌ను ఉత్పత్తి చేయడానికి దాదాపు 3,300 లీటర్ల నీరు అవసరం అవుతుంది, ఒక్క కిలో చికెన్‌ను ఉత్పత్తి చేయడానికి 3,100 లీటర్ల నీరు అవసరం అవుతుంది. కొంతమంది మాంసం తినకుండా ఉండడానికి ఇదొక కారణమౌతుంది.

మీ విషయం ఏమిటి? మీరు మాంసం తినకుండా ఉండాలా? ఆ ప్రశ్నకు జవాబిచ్చే ముందు, మరొక దృక్కోణం పరిశీలించండి. కీర్తన 50:10, 11లో కనుగొనబడినట్లుగా అన్నింటి సృష్టికర్తా అయిన యెహోవా దేవుడు ఇలా అంటున్నాడు: “అడవిమృగములన్నియు వేయికొండలమీది పశువులన్నియు నావేగదా. కొండలలోని పక్షులన్నిటిని నేనెరుగుదును. పొలములలోని పశ్వాదులు నా వశమైయున్నవి.” జంతువులన్నీ నిజానికి దేవునికే చెందుతాయి గనుక, జంతు జీవనం గురించీ, ఆహారం నిమిత్తం మానవుడు వాటిని ఉపయోగించడం గురించీ సృష్టికర్త ఏవిధంగా భావిస్తాడో అర్థంచేసుకోవడం ప్రాముఖ్యం.

జంతువుల్ని చంపడం తప్పా?

జంతువులు మానవులతో సమానమని పరిగణించే సుజాతలాంటి కొంతమంది, ఏ ఉద్దేశంతోనైనా సరే వాటిని చంపడం తప్పనీ—ఆహారం కోసం చంపడం మరీ తప్పనీ దృఢంగా భావిస్తారు. అయినప్పటికీ, జంతు జీవనానికీ మానవ జీవనానికి మధ్య తేడా ఉందని దేవుడు భావిస్తున్నాడనీ, వివిధ కారణాల నిమిత్తం జంతువుల్ని చంపడాన్ని ఆయన అనుమతిస్తున్నాడనీ లేఖనాలు సూచిస్తున్నాయి. ఉదాహరణకు ఇశ్రాయేలులో, ఒకరి జీవితానికి గానీ ఎవరైనా పెంచుకునే పశువుల ప్రాణాలకు గానీ ప్రమాదకరంగా ఉన్న జంతువును చంపవచ్చు.—నిర్గమకాండము 21:28, 29; 1 సమూయేలు 17:34-36.

తొలి కాలాలనుండీ, దేవుడు తన ఆరాధనలో జంతువులను బలిగా అర్పించడాన్ని ఆమోదించాడు. (ఆదికాండము 4:2-5; 8:20, 21) ఐగుప్తునుండి తమ నిర్గమనాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రతిసంవత్సరం పస్కాను ఆచరించమని కూడా ఆయన ఇశ్రాయేలీయులకు ఉపదేశించాడు, దీనిలో ఒక గొఱ్ఱెపిల్లను గానీ లేక మేకను గానీ బలియర్పించి, దాని మాంసాన్ని తినడమూ ఇమిడివుంది. (నిర్గమకాండము 12:3-9) అంతేగాక మోషే ధర్మశాస్త్రం క్రింద జంతువులను బలియర్పించే ఇతర సందర్భాలు కూడా ఉండేవి.

ఒక 70 ఏండ్ల హైందవ స్త్రీ బైబిలును మొదటిసారిగా చదువుతూ జంతువుల బలియర్పణ గురించి చదివినప్పుడు ఆమెకు ఆ తలంపే నచ్చలేదు. కానీ ఆమె పురోభివృద్ధికరంగా లేఖనాల జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు దేవుడు ఆజ్ఞాపించిన బలియర్పణల విషయంలో ఆయనకు ఒక సంకల్పం ఉందని తెల్సుకోగల్గింది. అవి యేసుక్రీస్తు బలియర్పణను ముందే సూచించాయి, పాప క్షమాపణకు చట్టపరంగా ఆవశ్యకమైనదాన్ని పూర్తిచేయడానికి ఈ బలియర్పణ అవసరమైంది. (హెబ్రీయులు 8:3-5; 10:1-10; 1 యోహాను 2:1, 2) చాలా సందర్భాల్లో అర్పణలు యాజకులకూ, కొన్నిసార్లు ఆరాధికులకూ ఆహారంగా కూడా పనిచేశాయి. (లేవీయకాండము 7:11-21; 19:5-8) జీవకోటియంతా దేవునికి చెందుతుంది, ఆయన అటువంటి ఏర్పాటును ఒక సంకల్పం నిమిత్తం సరియైన విధంగానే స్థాపించగలడు. ఒక్కసారి యేసు చనిపోయిన తర్వాత ఆరాధనలో జంతువుల బలియర్పణ అవసరత ఇక ఏమాత్రం లేదు.—కొలొస్సయులు 2:13-17; హెబ్రీయులు 10:1-12.

జంతువుల్ని ఆహారం నిమిత్తం ఉపయోగించడం

అయితే, ఆహారం నిమిత్తం జంతువుల్ని చంపడం సంగతేమిటి? మానవునికి తొలుత ఇవ్వబడినది శాకాహారమేనన్నది నిజమే. కానీ యెహోవా తర్వాత ఆహారంలో జంతువుల మాంసాన్ని కూడా చేర్చాడు. దాదాపు 4,000 సంవత్సరాల క్రితం—నీతిమంతుడైన నోవహు కాలంలో—యెహోవా భూవ్యాప్త జలప్రళయాన్ని తీసుకొచ్చి భూమ్మీద అప్పుడున్న దుష్టత్వాన్ని అంతం చేశాడు. నోవహు, ఆయన కుటుంబమూ జలప్రళయాన్ని తప్పించుకున్నారు, ఆయన తన ఓడలోనికి తీసుకున్న జంతుజాలం కూడా జలప్రళయాన్ని తప్పించుకుంది. వారు ఓడనుండి బయటికి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా యెహోవా ఇలా చెప్పాడు: “ప్రాణముగల సమస్తచరములు మీకు ఆహారమగును; పచ్చని కూరమొక్కలనిచ్చినట్లు వాటిని మీకిచ్చియున్నాను.” (ఆదికాండము 9:3) అయితే, అదే సమయంలో దేవుడు ఈ చట్టాన్ని ఇచ్చాడు: “నరుని రక్తమును చిందించువాని రక్తము నరునివలననే చిందింపబడును; ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను.” (ఆదికాండము 9:6) స్పష్టంగా, జంతువులు మానవులతో సమానమని దేవుడు దృష్టించలేదు.

నిజానికి, జంతువులను గూర్చి సుజాతకు ఉన్న దృఢ విశ్వాసం పునర్జన్మయందు ఆమెకున్న విశ్వాసంపైన ఆధారపడివుంది. ఈ విషయాన్ని గూర్చి, మానవులూ జంతువులూ జీవాత్మలే అయినప్పటికీ, జీవాత్మ అమర్త్యమైనది కాదని బైబిలు వివరిస్తుంది. (ఆదికాండము 2:7; యెహెజ్కేలు 18:4, 20; అపొస్తలుల కార్యములు 3:23; ప్రకటన 16:3) జీవాత్మలుగా, మానవులతోపాటు జంతువులూ చనిపోతాయి, ఇక ఉనికిలో ఉండకుండాపోతాయి. (ప్రసంగి 3:19, 20) అయితే, మానవులకు దేవుని నూతన లోకంలో పునరుత్థానమనే అద్భుతమైన నిరీక్షణ ఉంది.b (లూకా 23:43; అపొస్తలుల కార్యములు 24:15) ఇది కూడా జంతువులు మానవులతో సమానం కావని సూచిస్తుంది.

“అయితే మానవ ఆహారంలో ఈ మార్పు ఎందుకు?” సుజాత తెల్సుకోవాలనుకుంది. జలప్రళయం మూలాన స్పష్టంగానే భూవాతావరణంలో తీవ్రమైన మార్పులు వచ్చాయి. వృక్ష సంపద తక్కువగా ఉండే ప్రాంతాల్లో జీవించే భవిష్యద్‌ తరాల్లోనివారి అవసరాలను ఊహించి యెహోవా మానవుని ఆహారంలో మాంసాన్ని చేర్చాడన్నది బైబిలు చెప్పడం లేదు. కానీ ఒక మార్పును ప్రవేశపెట్టే హక్కు జీవరాసులన్నింటి యజమానికి ఉందన్నది సుజాత అంగీకరించగల్గింది.

జంతు జీవనంపట్ల గౌరవాన్ని చూపడం

అయితే, సుజాత ఇలా ప్రశ్నించింది, ‘జంతు జీవనానికి మనం కనీసం గౌరవాన్నైనా చూపవద్దా?’ తప్పకుండా, మనం గౌరవాన్ని చూపాలి. అన్నింటి సృష్టికర్త అయినవాడు దీన్ని మనం ఎలా చూపగలమో చెప్పాడు. “అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు” అని ఆదికాండము 9:4లోని ఆయన ఆజ్ఞ పేర్కొంటుంది. రక్తం తినడంపై ఈ ఆంక్ష ఎందుకు? “రక్తము దేహమునకు ప్రాణము [జీవము]” అంటుంది బైబిలు. (లేవీయకాండము 17:10, 11) యెహోవా ఈ విధంగా కోరాడు: ‘నీవు రక్తమును తినక భూమిమీద నీళ్లవలె పారబోయవలెను.’—ద్వితీయోపదేశకాండము 12:16, 24.

మాంసం తినడానికైన ఈ ఏర్పాటు, కేవలం వేటాడ్డంలోని మజా కొరకో లేక స్వంత శౌర్యాన్ని ప్రదర్శించడానికో జంతు రక్తాన్ని అనవసరంగా ఒలికించడానికి అనుమతించడం కాదు. నిమ్రోదు ఇదే చేశాడని స్పష్టమౌతుంది. బైబిలు ఆయన్ను “యెహోవాయెదుట పరాక్రమముగల వేటగాడు” అని గుర్తిస్తుంది. (ఇటాలిక్కులు మావి.) (ఆదికాండము 10:9) నేడు కూడా, వేట్టాడ్డంలోనూ జంతువుల్ని చంపడంలోనూ ఉత్సాహాన్ని చూపే ప్రవృత్తి కొందర్లో సులభంగా అభివృద్ధి కావచ్చు. కానీ అటువంటి స్ఫూర్తికీ జంతు జీవనం పట్ల ఉద్దేశపూర్వక నిర్లక్ష్యానికీ దగ్గరి సంబంధం ఉంది, దేవుడు దాన్ని ఆమోదించడు.c

జంతువులపట్ల కనికరంతో ఉండడం

నేడు కొంతమంది శాకాహారులు ఆధునిక మాంసం ఉత్పత్తి పరిశ్రమల్లో జంతువులపట్ల వ్యవహరించే విధానం విషయంలో కూడా నిజాయితీతో కూడిన చింతను వ్యక్తం చేస్తున్నారు. “జంతువుల సహజసిద్ధ ప్రవర్తనపట్ల వ్యవసాయ వ్యాపారానికి అసలు శ్రద్ధ లేదు” అని ద వెజిటేరియన్‌ హ్యాండ్‌బుక్‌ వ్యాఖ్యానిస్తుంది. “భయంకరమైన పరిస్థితుల్లోనూ చాలా తక్కువ స్థలంలోనూ, అసహజమైన వాతావరణంలో పెంచబడుతున్న ఆధునిక దినంలోని జంతువులు ఇంతకు మునుపెన్నటికన్నా ఎక్కువగా మానవునిచే దోచుకోబడుతున్నాయి” అని కూడా అది వ్యాఖ్యానిస్తోంది.

ఆహారం నిమిత్తం జంతువుల్ని ఉపయోగించడం దేవుని చిత్తానికి విరుద్ధమేమీ కాకపోయినా, వాటిపట్ల క్రూరంగా ప్రవర్తించడం దేవుని చిత్తానికి విరుద్ధమైనదే. “నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును” అని బైబిలు సామెతలు 12:10 నందు అంటుంది. పెంపుడు జంతువుల విషయంలో తగిన శ్రద్ధను తీసుకోవాలని మోషే ధర్మశాస్త్రము ఆజ్ఞాపించింది.—నిర్గమకాండము 23:4, 5; ద్వితీయోపదేశకాండము 22:10; 25:4.

క్రైస్తవుడు శాకాహారిగా ఉండాలా?

మునుపు చెప్పినట్లుగానే, శాకాహారిగా అవ్వాలో—లేక శాకాహారిగానే ఉండిపోవాలో—అనేది కచ్చితంగా ఒకరి వ్యక్తిగత నిర్ణయానికి సంబంధించినది. ఆరోగ్యపరమైన, ఆర్థికపరమైన, పర్యావరణపరమైన, లేక జంతువులపట్ల కనికరానికి సంబంధించిన కారణాలను బట్టి ఒక వ్యక్తి శాకాహారమే తీసుకోవాలని ఎంపిక చేసుకోవచ్చు. కానీ ఆయన అటువంటి ఆహారం అనేక రకాల ఆహారాల్లో కేవలం ఒక్క తరహా ఆహారం మాత్రమేనని గుర్తించాలి. మాంసాన్ని తినే వ్యక్తి ఒక శాకాహారిని నిందించకూడదు, అదే విధంగా ఒక శాకాహారి మాంసాన్ని తినే ఇతరులను విమర్శించకూడదు. మాంసాన్ని తినడమూ లేక దానికి దూరంగా ఉండడమూ ఎవరినైనా ఒక శ్రేష్ఠమైన వ్యక్తిగా చేయదు. (రోమీయులు 14:1-17) ఒకరి ఆహారం వారి జీవితంలో ప్రధానమైన చింతగా మారనూ కూడదు. “మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతి మాటవలనను జీవించును” అని అన్నాడు యేసు.—మత్తయి 4:4.

జంతువులపట్ల క్రూరత్వమూ, భూ వనరుల దుర్వినియోగమూ వంటి విషయాలకొస్తే, భ్రష్టమైనటువంటీ లోభంతో నిండినటువంటీ ఈ విధానానికి అంతం తీసుకువస్తాననీ దాని స్థానంలో తన హస్తకృతి అయినటువంటి నూతన లోకాన్ని తీసుకువస్తాననీ యెహోవా వాగ్దానం చేశాడు. (కీర్తన 37:10, 11; మత్తయి 6:9, 10; 2 పేతురు 3:13) ఆ నూతన లోకంలో మానవులు జంతువులతోపాటు నిరంతరం శాంతితో సహజీవనం చేస్తారు, మరి యెహోవా ‘ప్రతి జీవి కోరికను తృప్తి పరుస్తాడు.’—కీర్తనలు 145:16; యెషయా 65:25.

[అధస్సూచీలు]

a తేజరిల్లు! జూలై 8, 1997, 3-13 పేజీలు చూడండి.

b వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించిన కావలికోట యొక్క మే 15, 1997, 3-8 పేజీలు చూడండి.

c కావలికోట (ఆంగ్లం) మే 15, 1990, 30-1 పేజీలు చూడండి.

[18వ పేజీలోని చిత్రసౌజన్యం]

Punch

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి