కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g98 12/8 పేజీలు 26-27
  • జంతువుల పట్ల క్రూరత్వం—తప్పా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జంతువుల పట్ల క్రూరత్వం—తప్పా?
  • తేజరిల్లు!—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • క్రూరత్వం ఎందుకు తప్పు?
  • జంతువులకు ఉపశమనం
  • జంతువులు పరలోకానికి వెళ్తాయా?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • మాంసం తినడం తప్పా?
    తేజరిల్లు!—1997
  • భవిష్యత్‌ సంగతేమిటి?
    తేజరిల్లు!—1992
తేజరిల్లు!—1998
g98 12/8 పేజీలు 26-27

బైబిలు ఉద్దేశము

జంతువుల పట్ల క్రూరత్వం—తప్పా?

మధ్య అమెరికాలోని ఒక క్రీడా మైదానంలో, అందరి దృష్టి రెండు కోడి పుంజుల మీదే ఉంది, అందులో ఒకటి ఎర్రని కోడిపుంజు మరోటి తెల్లని కోడిపుంజు. ఎర్రని కోడిపుంజు తన కాలికి కట్టివున్న పదునైన చిన్న కత్తితో తెల్లని కోడిపుంజును పొడవడంతో జనసమూహం ఆనందోత్సాహాలతో కేకలు వేసింది. ఒక రిఫరీ రెండు పుంజులనూ చేతుల్లోకి తీసుకున్నాడు. తెల్లని కోడిపుంజు ఇప్పుడు కుంటిదై చనిపోయింది, దాని శరీరం నుండి రక్తం కారుతోంది. కోళ్ళ పందెం అంతటితో అయిపోయింది.

దక్షిణ ఫిలిప్పీన్స్‌లో, రెండు గుఱ్ఱాలు ఒకదాని మీదికి ఒకటి ఉసికొల్పబడ్డాయి. గుఱ్ఱాలకు చెవుల మీద, మెడ మీద, ముట్టె మీద, ఇతర శరీర భాగాల మీద గాట్లు పడుతుంటే ప్రేక్షకులు ఆ క్రూరమైన దృశ్యాన్ని చూస్తున్నారు. ఆ రెండు గుఱ్ఱాలు సజీవంగా బయటికి వచ్చినప్పటికీ, కనీసం వాటిలో ఒకటైనా అవిటిదైపోతుంది లేక గ్రుడ్డిదైపోతుంది లేదా చివరికి మరణానికి దారితీసే గాయాలౌతాయి.

రష్యాలో రెండు కుక్కలు ఒకదానిపై మరొకటి కలబడ్డాయి. కొంతసేపటిలోనే, కళ్లు పీకివేయబడి, చెవులు చీల్చివేయబడి అవి గాయాలు తగిలిన కాళ్లతో, గాయాల నుండి రక్తం కారుతుండగా అటూ ఇటూ తిరుగుతున్నాయి.

శతాబ్దాలుగా మానవుడు క్రీడల పేరిట ఒక జంతువు మీదికి మరొ జంతువును ఉసిగొల్పాడు, తరచూ దాని వెనుకనున్న ప్రేరేపణ జూదమే. ఆ క్రీడల్లో ఎద్దులతో పోరాటం, నక్క వేటలు, చివరికి సాలీడు పందాలు కూడా చోటు చేసుకున్నాయి. అంతేగాక, విజ్ఞానశాస్త్రం పేరిట ఎన్నో జంతువులు హింసననుభవిస్తున్నాయి. అదనంగా, లెక్కలేనన్ని జంతువులు తమ యజమానుల నిర్లక్ష్యానికి గురై బాధను అనుభవిస్తున్నాయి. ఆ నిర్లక్ష్యం ఉద్దేశపూర్వకమైనదైనా అవ్వొచ్చు, కాకపోవచ్చు.

కొన్ని దేశాల్లో, జంతువులతో వ్యవహరించే విధానాన్ని నియంత్రించే, క్రూరమైన చర్యల్ని నిషేధించే చట్టాలున్నాయి. వెనుకటికి దాదాపు 1641లో మసాచుసెట్స్‌ బే కాలనీ “ది బాడి ఆఫ్‌ లిబర్టీస్‌”ను రూపొందించింది, అవి ఇలా పేర్కొన్నాయి: “మానవుని ఉపయోగార్థమై ఉంచుకున్న పశువులపట్ల ఏ మానవుడూ నిరంకుశత్వాన్ని లేక క్రూరత్వాన్ని ప్రదర్శించకూడదు.” అప్పటి నుండి, జంతువుల పట్ల క్రూరత్వానికి వ్యతిరేకంగా శాసనాలు రూపొందించబడ్డాయి, సంస్థలు స్థాపించబడ్డాయి.

అయినప్పటికీ, పైన పేర్కొనబడిన పోరాడే క్రీడలను ప్రోత్సహించే అనేకులు, తమను తాము జంతు క్రూరత్వాన్ని పెంపొందింపజేస్తున్న వారిగా దృష్టించుకోరు. కొందరు తాము జంతువులను ప్రేమిస్తున్నామని చెప్పుకుంటారు, అవి బాధపడేందుకూ, చనిపోయేందుకూ వాళ్లే పాశవికంగా కారణమౌతారు. కోడి పందాల ప్రియులు, తాము పెంచే కోళ్లు, వండుకు తినడం కోసమే పెంచే సగటు కోళ్లకన్నా ఎక్కువ కాలం జీవిస్తాయని అంటారు—నిజానికిది కంటి తుడుపు మాత్రమే!

క్రూరత్వం ఎందుకు తప్పు?

జంతువుల నుండి ప్రయోజనం పొందడానికి దేవుడు మనల్ని అనుమతిస్తున్నాడు. ఆహారం కోసం, బట్టల కోసం, లేక జంతువుల నుండి రానైవున్న అపాయం నుండి తప్పించుకోవడం కోసం మనం జంతువులను చంపడాన్ని బైబిలు సూత్రాలు అనుమతిస్తున్నాయి. (ఆదికాండము 3:21; 9:3; నిర్గమకాండము 21:28) అయినప్పటికీ, జీవం దేవుని దృష్టిలో పవిత్రమైనది. జంతువులపై చెలాయించే మన ఆధిపత్యం, జీవం పట్ల మనకున్న గౌరవాన్ని చూపించే సమతూకమైన విధానంలో ఉండాలి. తన ఆనందం కోసం జంతువులనూ, అలాగే మానవులనూ చంపినట్టు స్పష్టమౌతున్న నిమ్రోదు అనే పేరుగల వ్యక్తి గురించి బైబిలు ప్రతికూలంగా మాట్లాడుతోంది.—ఆదికాండము 10:9.

జంతువుల పట్ల దేవునికి గల శ్రద్ధ గురించి యేసు ఇలా మాట్లాడాడు: “అయదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును గదా; అయనను వాటిలో ఒకటైనను దేవునియెదుట మరువబడదు.” (లూకా 12:6) అంతేగాక, దుష్టత్వాన్ని అనుసరిస్తూ ఉండి కూడా తర్వాత పశ్చాత్తాపపడిన ప్రజలున్న నగరాన్ని నాశనం చేయకుండా దేవుడు తన మనస్సు మార్చుకున్నప్పుడు, ఆయన తానే ఇలా చెప్పాడు: “అయతే నూట ఇరువదివేలకంటె ఎక్కువై[న] . . . జనమును బహు పశువులును గల నీనెవె మహాపురము విషయములో నేను విచారపడవద్దా?” (యోనా 4:11) ఇష్టమొచ్చినప్పుడు పడేసే వ్యర్థ పదార్థాల్లా జంతువులను ఆయన పరిగణించలేదని స్పష్టమౌతుంది.

ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చేటప్పుడు, జంతువుల గురించి సరైన శ్రద్ధ తీసుకోవాలని దేవుడు వారికి బోధించాడు. తప్పిపోయిన జంతువును దాని యజమానికి అప్పగించాలనీ, కష్టంలో ఉన్న జంతువులకు సహాయం చేయాలనీ ఆయన వారిని కోరాడు. (నిర్గమకాండము 23:4, 5) మానవుల్లానే జంతువులు కూడా సబ్బాతు దిన విశ్రాంతి నుండి ప్రయోజనం పొందవలసి ఉన్నాయి. (నిర్గమకాండము 23:12) పొలం పనులు చేసే జంతువులతో సరైన విధంగా వ్యవహరించడాన్ని నిర్దేశించే సూత్రాలు కూడా ఉన్నాయి. (ద్వితీయోపదేశకాండము 22:10; 25:4) జంతువులపై శ్రద్ధ తీసుకుని, కాపాడాలి, కానీ హింసించకూడదు అని స్పష్టమౌతుంది.

సామెతలు 12:10 దేవుని దృక్కోణాన్ని స్పష్టంగా ఇలా తెలియజేస్తుంది: “నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును, భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే.” ఒక బైబిలు వ్యాఖ్యానం ఆ వచనాన్ని ఇలా తెలియజేస్తుంది: “నీతిమంతుని దయ నోరులేని జంతువులను కూడా చేరుతుంది, కాని దుష్టుడు తాను దయగా ఉన్నాననుకున్నప్పుడు కూడా క్రూరంగా ఉంటాడు.”—విలియమ్‌ మక్‌డోనాల్డ్‌ వ్రాసిన బిలీవర్స్‌ బైబిల్‌ కామెంటరి.

నీతిమంతుడు జంతువులతో దయగా వ్యవహరించి, వాటి అవసరతలను గుర్తించడానికి ప్రయత్నిస్తాడు. దుష్టుడు జంతువుల పట్ల మౌఖికంగా ప్రేమను వ్యక్తపర్చినప్పటికీ, అతని “వాత్సల్యము” నిజానికి క్రూరత్వమే. అతని మనస్సులోవున్న స్వార్థపూరిత ఉద్దేశాన్ని అతని చర్యలు చూపిస్తాయి. డబ్బు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఒక జంతువును మరో జంతువు మీదకు ఉసిగొలిపే వారి విషయంలో ఇదెంత నిజం!

జంతువులకు ఉపశమనం

నిజమే, మానవుడు “సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని [ఏలాలన్నది]” దేవుని ఆది సంకల్పమైయుంది. (ఆదికాండము 1:28) ఆ సంకల్పంలో, జంతువుల పట్ల క్రూరత్వానికి తావు లేదు. జంతువుల పట్ల చూపించే అమానుష చర్యలు నిరంతరం సాగవు. అనవసరమైన బాధనంతటినీ దేవుడు తొలగిస్తాడని నమ్మడానికి మనకు కారణముంది. కాని ఎలా?

దుష్టులూ, క్రూరులూ అయిన ప్రజలను నాశనం చేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. (సామెతలు 2:22) జంతువుల గురించి హొషేయ 2:18 ఇలా చెబుతుంది: “ఆ దినమున . . . భూజంతువులతోను ఆకాశపక్షులతోను నేలను ప్రాకుజంతువులతోను నిబంధన చేయుదును. . . . [వాటిని] నిర్భయముగా నివసింపజేయుదును.” శాంతికరమైన పరిస్థితులు, నీతిమంతులైన మానవులకే కాక జంతువులకు కూడా ప్రయోజనం చేకూర్చే ఆ కాలంలో జీవించడం ఎంత అద్భుతంగా ఉంటుందో కదా!

[26వ పేజీలోని చిత్రం]

ఫ్రాన్సిస్కో గోయా వేసిన “ఒక గ్రామంలో బుల్‌ఫైట్‌”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి