అందరికీ ఆహారం ఒక స్వప్నమేనా?
ఇటలీలోని తేజరిల్లు! విలేఖరి ద్వారా
“ఆకలి మరియు కుపోషణ నుండి విముక్తి పొందే హక్కు ప్రతి స్త్రీకీ, పురుషునికీ పిల్లవానికీ ఉందని” వెనకటికి 1974లో ఐక్యరాజ్య సమితి ఆహార వ్యవసాయసంస్థ (FAO) నిర్వహించిన ప్రపంచ ఆహార మహాసభ ప్రకటించింది. “ఒక దశాబ్దంలోనే” ప్రపంచంలో నుండి ఆకలిని నిర్మూలించాలని కోరడం జరిగింది.
అయితే, గత సంవత్సరం చివరి భాగంలో రోమ్‌నందు FAO ముఖ్య కార్యాలయంలో ఐదు దినాల ప్రపంచ ఆహార మహాసభ కొరకు 173 దేశాల ప్రతినిధులు సమావేశమైనప్పుడు, “పొరపాటు ఎక్కడ జరిగింది?” అని ప్రశ్నించడమే వారి ఉద్దేశం. అందరికీ ఆహారాన్ని అందించడంలో విఫలమవ్వడం మాత్రమే కాదు కానీ, ఇప్పుడు అంటే రెండు దశాబ్దాల కంటే ఎక్కువ కాలం గడిచిన తర్వాత పరిస్థితి మరింత క్షీణించింది.
ఆహారానికీ జనాభాకీ పేదరికానికీ సంబంధించిన ముఖ్యమైన విషయాలు తక్షణ చర్య అవసరమైనవి. ఆ సమావేశంలో విడుదల చేయబడిన ఒక పత్రం ద్వారా అంగీకరించిన విధంగా, ఈ సమస్యలు గనుక పరిష్కరించబడకపోతే, “అనేక దేశాల మరియు ప్రాంతాల సాంఘీక స్థిరత తీవ్రంగా దెబ్బతినవచ్చు, బహుశా ప్రపంచ శాంతికి కూడా భంగం వాటిల్లవచ్చు.” ఒక పరిశీలకుడు సవివరంగా ఇలా అన్నాడు: “నాగరికత మరియు జాతీయ సంస్కృతుల నాశనాన్ని మనం చూస్తాం.”
FAO డైరెక్టర్-జనరల్ జాక్ జూఫ్ ప్రకారం, “నేడు 80 కోట్ల కంటే ఎక్కువమంది ప్రజలకు తగినంత ఆహారం అందుబాటులో లేదు; వారిలో 20 కోట్లమంది పిల్లలే.” ప్రస్తుతం 580 కోట్లున్న ప్రపంచ జనాభా 2025వ సంవత్సరానికల్లా 830 కోట్లకు పెరిగిపోయి ఉంటుందనీ, ఆ పెరుగుదలలో చాలా శాతం వర్థమాన దేశాల్లోనే ఉంటుందనీ అంచనావేయబడింది. జూఫ్ ఇలా విలపిస్తున్నాడు: “జీవాన్నీ గౌరవాన్నీ కలిగి ఉండగల, అన్యాక్రాంతానికి తగని తమ హక్కు నుండి రిక్తపర్చబడిన స్త్రీల, పురుషుల, పిల్లల అత్యధిక సంఖ్య అంగీకరించలేనంత ఎక్కువగా ఉంది. ఆకలితో అలమటిస్తున్న వారి కేకలకు, క్షీణించిన భూమి, నరికివేయ బడిన అడవులు మరియు అత్యధికంగా తగ్గిపోతున్న చేపలుపట్టే జలాల మూగ రోదన తోడయ్యింది.”
ఏ పరిష్కారం ప్రతిపాదించబడింది? ఆహార కొరతగల దేశాలకు “ఆహార భద్రతను” అలాగే తమను తాము పోషించుకోవడాన్ని సాధ్యపరిచే నైపుణ్యాలను, పెట్టుబడిని మరియు సాంకేతికతను వారికి అందించడమనే “ధైర్యంతో కూడిన చర్యలోనే” పరిష్కారం ఉందని జూఫ్ చెబుతున్నాడు.
“ఆహార భద్రత”—ఎందుకంత పట్టుదొరకకుండా ఉంది?
సమావేశం వెలువరించిన ఒక పత్రం ప్రకారం, “ఒక క్రియాశీలమైన మరియు ఆరోగ్యవంతమైన జీవితం కొరకైన తమ ఆహార అవసరతలకూ ఇష్టాయిష్టాలకూ అనుగుణంగా ఉండే తగినంత, సురక్షితమైన మరియు పోషక విలువలున్న ఆహారాన్ని పొందే భౌతిక మరియు ఆర్థిక అవకాశం ప్రజలందరికీ అన్నివేళలా ఉన్నప్పుడే ఆహార భద్రత ఉనికిలో ఉంటుంది.”
ఆహార భద్రతకు ఎలా ముప్పు వాటిల్లగలదనే విషయం జైరీలోని శరణార్థి సంక్షోభం ద్వారా ఉదాహరించబడింది. పదిలక్షలమంది రువాండా శరణార్థులు ఆకలితో అలమటిస్తుండగా, వారికి ఇచ్చేందుకు సరిపోయేటంత ఆహారం ఐక్యరాజ్య సమితి ఏజెన్సీల వద్ద కుప్పలుగా ఉంది. అయితే రవాణా మరియు పంపకం ఏర్పాట్లకు రాజకీయ అనుమతి మరియు స్థానిక అధికారుల సహకారం లేదా స్థానిక సేనానాయకులు శరణార్థి శిబిరాలను అదుపు చేస్తున్నట్లైతే వారి సహకారం అవసరమయ్యాయి. జైరీలోని అత్యవసర పరిస్థితి, ఆహారం అందుబాటులో ఉన్నప్పటికీ ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టడం అంతర్జాతీయ సమాజానికి ఎంత కష్టసాధ్యమైన విషయంగా ఉంటుందో మరొకసారి చూపిస్తోంది. ఒక పరిశీలకుడు ఇలా పేర్కొన్నాడు: “ఏదైనా చర్య తీసుకునే ముందు సంస్థల సమాఖ్యల సమూహాలను సంప్రదించి వారిని బతిమాలుకోవలసి ఉంటుంది.”
అమెరికా వ్యవసాయ విభాగం యొక్క పత్రం ద్వారా సూచించబడిన విధంగా, ఎన్నో మూల కారకాల వలన ఆహార భద్రత తీవ్రంగా దెబ్బతినగలదు. ఆ కారకాల్లో ప్రకృతి వైపరీత్యాలే కాకుండా, యుద్ధం మరియు పౌర కలహం, అనుచితమైన జాతీయ పాలసీలు, తగినంత పరిశోధన మరియు సాంకేతికత లేకపోవడం, పర్యావరణ క్షీణత, పేదరికం, జనాభా పెరుగుదల, లింగ అసమానత మరియు క్షీణిస్తున్న ఆరోగ్యం కూడా ఉన్నాయి.
కొన్ని విషయాలను సాధించడం జరిగింది. 1970ల నుండీ, సగటు ఆహార శక్తి సరఫరా అంటే ఆహార వినియోగాన్ని సూచించేది, వర్థమాన దేశాల్లో ఒక వ్యక్తి ఒక దినానికి 2,140 క్యాలరీలు తీసుకునేది నేడు 2,520 క్యాలరీలకు పెరిగింది. అయితే FAO ప్రకారం, 2030వ సంవత్సరానికల్లా అనేక వందల కోట్ల జనాభా పెరుగుతుంది గనుక, “ప్రస్తుత ఆహార ప్రాప్యత స్థాయిని కొనసాగించాలంటే, సరఫరాలను 75 శాతంకంటే ఎక్కువకు పెంచేందుకు తీవ్రగతిలోనూ స్థిమితమైన విధంగానూ అధిక ఉత్పాదన చేయవలసిన అవసరం ఉంటుంది. అదీ కూడా మనందరమూ ఆధారపడి ఉన్న సహజ వనరులను నాశనం చేయకుండా దాన్ని సాధించవలసి ఉంటుంది.” ఆకలితో అలమటిస్తున్న జనాభాకు ఆహారాన్ని అందించడం అలా ఒక అస్పష్టమైన ఉత్తరాపేక్షగా ఉంది.
‘మనకు చర్యలు కావాలి, మరిన్ని మహాసభలు కాదు’
ప్రపంచ ఆహార మహాసభ యొక్క ఏర్పాట్లను గురించి మరియు అది చేసిన వాగ్దానాలను గురించి అనేక విమర్శలు తలెత్తాయి. కుపోషణకు గురైన ప్రజల సంఖ్యను ప్రస్తుత స్థాయిలో సగానికి సగం తగ్గిస్తామనే వాగ్దానం యొక్క “పరిమితత్వాన్ని,” ఒక లాటిన్ అమెరికన్ ప్రతినిధి ఎంతో “సిగ్గుకరమైన” విషయంగా ఖండించాడు. మహాసభ అంగీకరించిన ప్రతిపాదనల విషయంలో పదిహేను దేశాలు తమ అభిప్రాయాల్లో అసమానతను వ్యక్తం చేశాయి. ఒక క్లుప్త ప్రస్తావననూ క్రియాత్మక పథకాన్నీ తయారు చేసేందుకే “రెండు సంవత్సరాల ఎదురు దాడులూ ప్రతిపాదనలూ అవసరమయ్యాయి” అని లా రిపబ్లికా అనే ఇటాలియన్ వార్తాపత్రిక చెప్పింది. “గాయాలు . . . మళ్లీ పచ్చి పుండ్లుకాకుండా ఉండేందుకు ప్రతి పదం ప్రతి కామా కూడా ఆచి తూచి వ్రాయబడింది.”
మహాసభ పత్రాలను సిద్ధం చేసేందుకు సహాయపడిన వారిలో అనేకులు దాని ఫలితాలను బట్టి అసంతృప్తి చెందారు. “ప్రకటించబడిన చక్కని ప్రతిపాదనలు వాస్తవమౌతాయా అనే విషయంలో మేమెంతో సంశయంతో ఉన్నాము” అని ఒకరు అన్నారు. వివాదానికి లక్ష్యమైన విషయం ఏమిటంటే, “హక్కును” న్యాయస్థానంలో సమర్థించవచ్చు గనుక, ఆహారాన్ని కలిగి ఉండటం అనే దాన్ని “అంతర్జాతీయంగా గుర్తించబడిన హక్కు”గా నిర్వచించవచ్చా అనేదే. కెనడాకు చెందిన ఒక వ్యక్తి ఇలా వివరించాడు: “ధన సహాయాన్ని ఇవ్వమని తమను ఒత్తిడి చేస్తారేమోనని సంపన్న దేశాలు భయపడ్డాయి. అందుకే ప్రకటనలోని సమాచారాన్ని నీరుగార్చాలని పట్టుబట్టాయి.”
ఐక్యరాజ్య సమితి నిర్వహించే మహాసభల్లో అంతంలేని చర్చలు జరుగుతున్నందున యూరప్ ప్రభుత్వం యొక్క ఒక మంత్రి ఇలా చెప్పింది: “[జనాభా మరియు అభివృద్ధిని గురించి, 1994లో జరిగిన] కైరో మహాసభలో ఎన్నో విషయాలను చర్చించిన తర్వాత కూడా, మేము ప్రతి సమావేశంలోనూ అవే విషయాలను మళ్లీ మళ్లీ చర్చిస్తున్నట్లు కనుగొంటున్నాము.” ఆమె ఇలా సిఫారసు చేసింది: “మన తోటి మానవుల కొరకు క్రియాత్మక పథకాలను అమలుపర్చడం అనేది మన అజెండాల్లో ముందు ఉండాలి కానీ మరిన్ని మహాసభలను జరుపుకోవడం కాదు.”
మహాసభకు హాజరవ్వడం, అందుకయ్యే ఖర్చులను భరించలేని దేశాలకు చాలా ఎక్కువ ఖర్చులను తెచ్చిపెట్టిందని కూడా పరిశీలకులు సూచించారు. ఒక చిన్న ఆఫ్రికా దేశం 14 మంది ప్రతినిధులనూ అలాగే ఇద్దరు మంత్రులనూ పంపింది, వారందరూ కూడా రోమ్‌లో రెండు వారాలకంటే ఎక్కువ దినాలు ఉన్నారు. సగటు సాంవత్సరిక ఆదాయం ఒక వ్యక్తికి 3,300 డాలర్లకంటే ఎక్కువ లేని ఒక ఆఫ్రికా దేశాధ్యక్షుని భార్య, రోమ్ యొక్క అత్యంత అధునాతనమైన ముఖ్య షాపింగ్ ప్రాంతంలో 23,000 డాలర్ల కొనుగోలు చేసిందని కోరీరే డెల్లా సేరా అనే ఒక ఇటాలియన్ వార్తాపత్రిక నివేదించింది.
మహాసభలో ఆమోదించబడిన ప్రణాళిక సఫలమౌతుందని నమ్మేందుకు కారణం ఉందా? ఒక పాత్రికేయుడు ఇలా సమాధానమిస్తున్నాడు: “ప్రభుత్వాలు దాన్ని గంభీరంగా తీసుకుని దాని ప్రతిపాదనలు నెరవేర్చబడేందుకు చర్యలు తీసుకుంటారని మాత్రమే మనం నిరీక్షించగలం. వారలా చేస్తారా? . . . మనం ఆశాభావం కలిగి ఉండేందుకు చరిత్ర చాలా తక్కువ కారణాలను అందిస్తుంది.” స్థూల జాతీయ ఆదాయం యొక్క 0.7 శాతాన్ని అభివృద్ధి సహాయం కొరకు అందజేస్తామని 1992 రియో డె జనైరో నందలి అర్త్ మహాసభలో తీర్మానం చేయబడినప్పటికీ, “కేవలం కొన్ని దేశాలు మాత్రమే తప్పనిసరి కాని ఆ లక్ష్యాన్ని చేరుకున్నాయనే” నిరుత్సాహకరమైన వాస్తవాన్ని అదే వ్యాఖ్యాత సూచించాడు.
ఆకలితో అలమటిస్తున్న వారికి అన్నమెవరు పెడతారు?
మానవజాతికి ఎన్ని మంచి ఉద్దేశాలు ఉన్నప్పటికీ, “తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు” చరిత్ర సుస్పష్టంగా ప్రదర్శించింది. (యిర్మీయా 10:23) కాబట్టి మానవులు తమ స్వంత ప్రయత్నం ద్వారా అందరికీ ఆహారాన్ని అందించడమన్నది అసంభవం. పేరాశ, అవ్యవస్థ, మరియు అహంకారం మానవజాతిని అంచువరకూ తీసుకుపోయాయి. FAO యొక్క డైరెక్టర్ జనరల్ ఇలా వ్యాఖ్యానించాడు: “తుది విశ్లేషణలో మనకు అవసరమైనది హృదయాలూ మనస్సులూ మరియు చిత్తాలు మారడమే.”
దీనిని కేవలం దేవుని రాజ్యం మాత్రమే చేయగలదు. శతాబ్దాల క్రితం, వాస్తవానికి యెహోవా తన ప్రజల విషయంలో ఇలా ప్రవచించాడు: “వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను. . . . నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు.”—యిర్మీయా 31:33, 34.
యెహోవా దేవుడు మానవజాతి యొక్క తోటవంటి గృహాన్ని సిద్ధం చేసినప్పుడు, ఆయన మానవునికి “భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్షమును” ఆహారంగా ఇచ్చాడు. (ఆదికాండము 1:29) ఆ ఏర్పాటు పుష్కలమైనది, పోషకమైనది, మరియు సులభంగా అందుబాటులో ఉండేది. తమ ఆహార అవసరతలను తీర్చుకునేందుకు మానవజాతికి అవసరమైనది సరిగ్గా అదే.
దేవుని సంకల్పం మారలేదు. (యెషయా 55:10, 11) అందరికీ ఆహారాన్ని అందించడం, పేదరికాన్ని తొలగించడం, ప్రకృతి వైపరీత్యాలను అదుపు చేయడం, మరియు గొడవలను నిర్మూలించడం ద్వారా మానవ జాతి యొక్క ప్రతి అవసరాన్నీ తన క్రీస్తు రాజ్యం ద్వారా తానే తీర్చుతానని ఆయన ఎంతోకాలం క్రితమే హామీ ఇచ్చాడు. (కీర్తన 46:8, 9; యెషయా 11:9; మార్కు 4:37-41; 6:37-44 పోల్చండి.) అప్పుడు “భూమి దాని ఫలములిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును.” “దేశములోను పర్వత శిఖరములమీదను సస్య సమృద్ధి కలుగును.”—కీర్తన 67:6; 72:16.
[12వ పేజీలోని చిత్రసౌజన్యం]
Dorothea Lange, FSA Collection, Library of Congress