వర్ధిల్లుతుండేలా మీ పిల్లలకు సహాయం చేయండి
పిల్లల్ని పెంచే విషయానికొచ్చేసరికి చాలామంది తలిదండ్రులు జవాబుల కొరకు వెదకని చోటంటూ ఉండదు, కానీ నిజానికి జవాబులు తమ స్వంత ఇంట్లోనే అందుబాటులో ఉంటాయి. అసంఖ్యాకమైన కుటుంబాల్లో బైబిలు ఉంటుంది, కానీ పిల్లల్ని పెంచడంలో దాన్ని ఉపయోగించడానికి బదులు అది పుస్తకాల షెల్ఫులో దుమ్ముకొట్టుకుపోయి ఉంటుంది.
నిజమే, కుటుంబ జీవితంలో బైబిలును ఒక నిర్దేశక పుస్తకంగా ఉపయోగించే విషయంలో నేడు చాలామంది సంశయంతో ఉన్నారు. అది పాతకాలం నాటిదనీ, పాతతలంపులు గలదనీ, లేక చాలా కఠోర నియమాలు గలదనీ వాళ్లు కొట్టిపారేస్తారు. కానీ నిజాయితీతో కూడిన పరిశీలన కుటుంబాలకు బైబిలు ఒక ఆచరణయోగ్యమైన పుస్తకమని వెల్లడిస్తుంది. ఎలాగో మనం చూద్దాం.
సరైన వాతావరణం
తన పిల్లల్ని “[తన] భోజనపు బల్లచుట్టు . . . ఒలీవ మొక్కలవలె” దృష్టించమని బైబిలు తండ్రికి చెబుతుంది. (కీర్తన 128:3, 4) సరైన పోషణ, మట్టి, తేమ వంటివి ఇవ్వకపోతే, లేదా జాగ్రత్తగా సాగుచేయకపోతే కోమలమైన మొక్కలు ఫలాల్ని ఉత్పత్తి చేసే వృక్షాలుగా తయారుకావు. అదేవిధంగా, పిల్లల్ని పెంచడంలో విజయాన్ని సాధించడానికి పనీ శ్రద్ధా అవసరమౌతాయి. పిల్లలు పరిపక్వతకు ఎదగాలంటే వారికి ఆరోగ్యకరమైన వాతావరణం అవసరం.
అటువంటి వాతావరణానికి కావాల్సిన మొట్టమొదటి అంశం ప్రేమ—వైవాహిక దంపతుల మధ్యా, తలిదండ్రులకూ పిల్లలకూ మధ్యా ప్రేమ ఉండాలి. (ఎఫెసీయులు 5:33; తీతుకు 2:4) అనేక కుటుంబాల్లోని సభ్యులు ఒకర్నొకరు ప్రేమిస్తారు, కానీ అటువంటి ప్రేమను వ్యక్తం చేయాల్సిన అవసరాన్ని గుర్తించరు. అయితే, ఆలోచించండి: మీరొక స్నేహితునికి ఉత్తరాలు వ్రాసి వాటిపైన చిరునామా వ్రాయక, స్టాంపు అంటించక, లేక అసలు పంపించక మీ దగ్గరే ఉంచుకుంటే మీరు మీ స్నేహితునికి మీ భావాల్ని వ్యక్తం చేసినట్లు న్యాయయుక్తంగా చెప్పగలరా? అదే విధంగా, నిజమైన ప్రేమ అనేది హృదయాన్ని ఉత్తేజితంచేసే ఒక భావన కన్నా ఎంతో ఎక్కువని బైబిలు చూపుతోంది; అది మాటలద్వారా చేతలద్వారా తనను తాను వ్యక్తం చేసుకుంటుంది. (యోహాను 14:15 మరియు 1 యోహాను 5:3 పోల్చండి.) తన కుమారునిపట్ల తనకుగల ప్రేమను ఈ మాటల్లో వ్యక్తం చేస్తూ, దేవుడే ఒక మాదిరిని ఉంచాడు: “ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నా[ను].”—మత్తయి 3:17.
మెచ్చుకోవడం
తలిదండ్రులు తమ పిల్లలకు అటువంటి ప్రేమను ఎలా చూపించగలరు? మొట్టమొదట, మంచి కొరకు చూడండి. పిల్లల్లో తప్పుల్ని కనుగొనడం సులభం. వారి అపరిపక్వత, అనుభవరాహిత్యం, స్వార్థం లెక్కలేనన్ని విధాల్లో ప్రదర్శితమౌతాయి, అదీ ప్రతిరోజూ. (సామెతలు 22:15) కానీ వాళ్లు ప్రతిరోజు చాలా మంచి పనులూ చేస్తారు. మీరు వేటిమీద కేంద్రీకరిస్తారు? దేవుడు మనం చేసే తప్పులమీద ధ్యానముంచడు కానీ మనం చేసే మంచిని గుర్తుంచుకుంటాడు. (కీర్తన 130:3; హెబ్రీయులు 6:10) మనం మన పిల్లల్తో కూడా అదే విధంగా వ్యవహరించాలి.
ఒక యౌవనస్థుడు ఇలా వ్యాఖ్యానిస్తున్నాడు: “నేను ఇంట్లో ఉన్న కాలమంతటిలోనూ నన్ను మెచ్చుకున్న సందర్భాలే లేవు—ఇంట్లోనైనా లేక స్కూల్లోనైనా నేను సాధించినవాటికి నన్ను మెచ్చుకున్నది లేనే లేదు.” తలిదండ్రులారా, మీ పిల్లలకున్న ఈ కీలకమైన అవసరాన్ని నిర్లక్ష్యం చేయకండి! పిల్లలు చేసే మంచి పనులకు వారినందర్నీ క్రమంగా మెచ్చుకోవాలి. ఇలా చేస్తే, తాము చేసేదేదీ అంత మంచిదిగా ఉండదని వారు నిర్ధారించేసుకుని ‘క్రుంగిన మనస్సు’తో ఎదిగే ప్రమాదం తగ్గుతుంది.—కొలొస్సయులు 3:21.
సంభాషణ
యాకోబు 1:19లోని సలహాను అనుసరించడం, మీ పిల్లలకు ప్రేమను వ్యక్తం చేసే మరొక మంచి మార్గం: “వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై యుండవలెను.” మీ పిల్లల మనస్సుల్లో ఏముందో వెలికితీయడానికి ప్రయత్నిస్తూ, వారు చెప్పాలనుకుంటున్నది నిజంగా వింటారా? తాము మాట్లాడ్డం ముగించడానికి ముందే మీరు లెక్చరిస్తారనీ లేకపోతే తాము నిజంగా ఎలా భావిస్తున్నారో మీకు తెలిస్తే మీకు కోపం వస్తుందనీ మీ పిల్లలకు తెలిస్తే, బహుశా వారు తమ భావనల్ని తమలోనే దాచుకోవచ్చు. కానీ మీరు నిజంగా వింటారని వారికి తెలిస్తే వారు తమ మనస్సువిప్పి చెప్పే అవకాశం ఎక్కువగా ఉంటుంది.—సామెతలు 20:5 పోల్చండి.
అయితే, తప్పు అని మీకనిపించిన భావనల్ని వారు వెల్లడిస్తే అప్పుడేమిటి? అప్పుడు మీరు కోపంతో ప్రతిస్పందించడానికో, ఒక లెక్చరివ్వడానికో, లేక కాస్త క్రమశిక్షణనివ్వడానికో అది సమయమా? నిజమే, కొన్ని రకాల పిల్లచేష్టలు “వినుటకు వేగిరపడువాడును, కోపించుటకు నిదానించువాడునై” ఉండడాన్ని కష్టతరం చేస్తాయి. కానీ దేవుడు తన పిల్లల్తో వ్యవహరించిన విధానాన్ని మళ్లీ పరిశీలించండి. తన పిల్లలు నిజంగా తామెలా భావిస్తున్నామన్నది చెప్పడానికి భయపడేలా చేస్తూ, ఆయన అనారోగ్యకరమైన భీతితో కూడిన వాతావరణాన్ని సృష్టిస్తాడా? లేదు! కీర్తన 62:8 ఇలా చెబుతుంది: “జనులారా, యెల్లప్పుడు [దేవుని]యందు నమ్మిక యుంచుడి. ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము.”
అందుకనేమరి, సొదొమ గొమొఱ్ఱా పట్టణాలను నాశనం చేయాలన్న దేవుని నిర్ణయం విషయంలో అబ్రాహాము కలవరపడినప్పుడు ఆయన తన పరలోకపు తండ్రికి ఇలా చెప్పడానికి సంశయించలేదు: “ఆ చొప్పున . . . [చేయుట] నీకు దూరమవును గాక . . . సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా?” యెహోవా అబ్రాహామును మందలించలేదు; ఆయన చెప్పింది విని, ఆయన భయాల్ని ఉపశమింపజేశాడు. (ఆదికాండము 18:20-33) తన పిల్లలు పూర్తిగా అయుక్తమైన, నిర్హేతుకమైన భావనల్ని వెళ్లగ్రక్కినప్పడు కూడా దేవుడు అసాధారణమైన రీతిలో ఓర్పును కలిగివున్నాడు, మృదువుగా ఉన్నాడు.—యోనా 3:10–4:11.
అదే విధంగా పిల్లలు హృదయాంతర్భాగంలోని తమ భావనల్ని వెల్లడిచేయడానికి భయపడని వాతావరణాన్ని తలిదండ్రులు సృష్టించాల్సిన అవసరం ఉంది. ఆ భావనలు ఎంత కలతపర్చేవైనా పిల్లలు వాటిని వ్యక్తపర్చడానికి భయపడని వాతావరణం ఉండాలి. కాబట్టి మీ పిల్లవాడు తీవ్రమైన భావోద్వేగాన్ని వ్యక్తం చేస్తే, వినండి. తిట్టడానికి బదులు, పిల్లవాని భావనల్ని గుర్తించి, దానికిగల కారణాలను వెలికితీయండి. ఉదాహరణకు, మీరు ఇలా చెప్పవచ్చు: ‘నీకు ఫలానావాడంటే కోపంగా ఉన్నట్లుంది. ఏమైందో నాకు చెప్పగలవా?’
కోపాన్ని అదుపులో పెట్టుకోవడం
ఏ తండ్రీ లేక తల్లీ యెహోవా అంత ఓర్పును కలిగివుండరు. మరి పిల్లలు కూడా తలిదండ్రుల ఓర్పును చివరికంటా పరీక్షించవచ్చు. మీరు అప్పుడప్పుడు మీ పిల్లలపైన కోపంగా ఉంటే, ఇది మిమ్మల్ని చెడ్డ తండ్రిగానో లేక చెడ్డ తల్లిగానో చేస్తుందని చింతించకండి. కొన్నిసార్లు మీరు యుక్తమైన రీతిలోనే కోపంగా ఉండవచ్చు. దేవుడు కూడా తన పిల్లలపైన యుక్తమైన రీతిలోనే, చివరికి తనకు అతి ప్రియమైన వారిపైన కూడా కోప్పడతాడు. (నిర్గమకాండము 4:14; ద్వితీయోపదేశకాండము 34:12) అయితే, మన కోపాన్ని ఎలా అదుపులో ఉంచుకోవచ్చో ఆయన వాక్యము నేర్పిస్తుంది.—ఎఫెసీయులు 4:26.
ఎలా? కొన్నిసార్లు కొన్ని నిమిషాలపాటు విషయం మార్చడం సహాయకరంగా ఉంటుంది, ఆ విధంగా మీ కోపం నిమ్మళించే అవకాశం ఉంది. (సామెతలు 17:14) గుర్తుంచుకోండి, వాళ్లు చిన్నపిల్లలు! పెద్దవారిలా ప్రవర్తించాలనీ లేక పరిపక్వతగల ఆలోచనా విధానాన్ని ప్రదర్శించాలనీ అపేక్షించకండి. (1 కొరింథీయులు 13:11) మీ పిల్లవాడు ఒక ప్రత్యేక తరహాలో ఎందుకు ప్రవర్తిస్తాడో అర్థంచేసుకోవడం మీ కోపాన్ని తగ్గించవచ్చు. (సామెతలు 19:11) ఏదైనా చెడ్డపని చేయడానికీ, చెడ్డవ్యక్తిగా ఉండడానికీ మధ్యనున్న గొప్ప అంతరాన్ని ఎన్నడూ మర్చిపోవద్దు. “దుర్మార్గుడా” అని పిల్లవాని మీద అరవడం మూలాన ఆ పిల్లవాడు, ‘మంచిగా ఉండాలని ప్రయత్నించడం కూడా ఎందుకు?’ అని అనుకునేందుకు నడిపించగలదు. కానీ ప్రేమపూర్వకంగా సరిదిద్దడం మరోసారి మెరుగ్గా ప్రవర్తించడానికి సహాయం చేస్తుంది.
క్రమాన్నీ, గౌరవాన్నీ కాపాడడం
పిల్లలకు క్రమాన్నీ, గౌరవాన్నీ కల్గివుండడాన్ని నేర్పించడం తలిదండ్రులు ఎదుర్కొనే గొప్ప సవాళ్లలో ఒకటి. దేన్నైనా సరే అనుమతించే నేటి లోకంలో తమ పిల్లల్ని కట్టుబాట్లలో పెట్టడం అసలు సరియైన పద్ధతేనా అని చాలామంది ఆశ్చర్యపోతుంటారు. బైబిలు ఇలా జవాబిస్తోంది: “బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును.” (సామెతలు 29:15) కొంతమంది “బెత్తము” అన్న పదమంటేనే విముఖతతో ఉంటారు, అది పిల్లలపై దురాచారం చేయడమనే భావాన్ని ఇస్తుందని అనుకుంటారు వారు. కానీ విషయం అది కాదు. “బెత్తము” అన్న దానికి హెబ్రీ పదం గొర్రెల కాపరి తన గొర్రెల్ని—బాదడానికి కాదుగానీ—నడిపించడానికి ఉపయోగించే ఒక కర్రను సూచిస్తుంది.a కాబట్టి బెత్తము క్రమశిక్షణకు సూచన.
బైబిలులో, క్రమశిక్షణనివ్వడం అంటే ప్రాథమికంగా బోధించడం అని అర్థం. అందుకనే సామెతల పుస్తకంలో ‘క్రమశిక్షణను విను’ అనే హెబ్రీ పదబంధం దాదాపు నాలుగుసార్లు ఉంది. (సామెతలు 1:8; 4:1; 8:33; 19:27) సరియైనది చేయడంద్వారా మంచి ప్రతిఫలం దక్కుతుందనీ తప్పుడు పనులు చేయడంద్వారా చెడ్డ పర్యవసానాలు కలుగుతాయని పిల్లలు నేర్చుకోవల్సిన అవసరముంది. మెచ్చుకోవడంవంటి బహుమతులు మంచి ప్రవర్తను బలపర్చినట్లే శిక్షించడం అనేది చెడుగా ప్రవర్తించినందుకు ఇచ్చే మందలింపును బలపరుస్తుంది. (ద్వితీయోపదేశకాండము 11:26-28 పోల్చండి.) శిక్ష విషయానికి వస్తే తలిదండ్రులు దేవుని మాదిరిని అనుకరించడం మంచిది, ఎందుకంటే తాను తన ప్రజలను “న్యాయమునుబట్టి” శిక్షిస్తానని వారికి చెప్పాడు. (ఇటాలిక్కులు మావి.) (యిర్మీయా 46:28) కొంతమంది పిల్లల్ని దారిలోకి తేవడానికి వారికి కొన్ని తీవ్రమైన మాటలకన్నా ఎక్కువే అవసరమౌతాయి. ఇతరులకు మరింత గట్టి చర్యలు అవసరమౌతాయి. కానీ “న్యాయమునుబట్టి” శిక్షించడంలో పిల్లవానికి భావోద్రేకంగానూ లేక శారీరకంగానూ ఎటువంటి నిజమైన హానీ తలపెట్టడమూ ఇమిడివుండదు.
సమతుల్యమైన క్రమశిక్షణలో పిల్లలకు హద్దుల గురించీ, పరిమితుల గురించీ బోధించడం ఇమిడివుండాలి. ఈ హద్దులూ పరిమితుల్లో చాలామట్టుకు దేవుని వాక్యంలో స్పష్టంగా నిర్వచించబడివున్నాయి. ఒకరి వ్యక్తిగత ఆస్తిచుట్టూ ఉండే సరిహద్దుల పట్ల గౌరవాన్ని కలిగివుండాలని బైబిలు బోధిస్తుంది. (ద్వితీయోపదేశకాండము 19:14) అది శారీరక హద్దుల్ని ఏర్పరుస్తుంది, అందువలన హింసను ప్రేమించడమూ లేక ఉద్దేశపూర్వకంగా ఇతరులకు హానికల్గించడమూ తప్పు. (కీర్తన 11:5; మత్తయి 7:12) అది లైంగిక హద్దుల్ని స్థాపిస్తుంది, వావివరుసలు తప్పి వ్యభిచరించడాన్ని ఖండిస్తుంది. (లేవీయకాండము 18:6-18) అది చివరికి వ్యక్తిగత, భావోద్రేక హద్దుల్ని కూడా గుర్తిస్తుంది, తద్వారా ఎవరినైనా దూషణకరమైన మాటలు అనడాన్నీ లేక ఇతర రకాలైన మౌఖిక నిందల్నీ నిషేధిస్తుంది. (మత్తయి 5:22) ఈ పరిమితుల గురించీ, హద్దుల గురించీ పిల్లలకు—మాటద్వారా మాదిరిద్వారా—బోధించడం ఆరోగ్యకరమైన కుటుంబ వాతావరణాన్ని సృష్టించడానికి కీలకం.
కుటుంబంలో క్రమమూ, గౌరవమూ కాపాడడానికి మరొక కీలకం కుటుంబంలోని వ్యక్తుల పాత్రలను అర్థంచేసుకోవడంలో ఉంది. నేడు చాలా కుటుంబాల్లో, అటువంటి పాత్రలు అస్పష్టంగానూ గలిబిలిగానూ ఉన్నాయి. కొన్ని కుటుంబాల్లో, తల్లి గానీ తండ్రి గానీ తమకు భారంగా అన్పిస్తున్న సమస్యల్ని ఒక పిల్లవానితో చెప్పుకుంటారు, వాటి విషయంలో పిల్లవాడు ఏమైనా చేయడానికి సామర్థ్యంలేనటువంటి సమస్యలు అవి. మరితర కుటుంబాల్లో, పిల్లలు పూర్తి కుటుంబానికంతటి కొరకూ నిర్ణయాలు చేస్తూ పిల్ల నియంతలుగా ప్రవర్తించేలా అనుమతించబడతారు. అటువంటివి తప్పు మాత్రమే కాదు గానీ హానికరం కూడాను. యౌవనులైన తమ పిల్లల అవసరతలను తీర్చవలసిన బాధ్యత తలిదండ్రులకే ఉంది—అవి శారీరకమైనవైనా, భావోద్రేకమైనవైనా, లేక ఆత్మీయమైనవైనా—అంతేగానీ ఆ బాధ్యత పిల్లలది కాదు. (2 కొరింథీయులు 12:14; 1 తిమోతి 5:8) యాకోబు ఉదాహరణను పరిశీలించండి, ఆయన పిల్లలపైన మరీ ఎక్కువ భారం ఉండకుండేలా తన కుటుంబమంతటి నడక వేగాన్నీ, సేవకుల నడక వేగాన్ని తగ్గించాడు. ఆయన వారి పరిమితులను అర్థం చేసుకుని దానికి అనుగుణంగా చర్యతీసుకున్నాడు.—ఆదికాండము 33:13, 14.
ఆత్మీయ అవసరాలను తీర్చడం
ఆరోగ్యకరమైన కుటుంబ వాతావరణానికి ఆత్మీయత కన్నా ఎక్కువ కీలకమైనది ఏదీ లేదు. (మత్తయి 5:3) పిల్లలకు ఆత్మీయ విషయాలపట్ల గొప్ప ఆసక్తి ఉంటుంది. వారికి మనస్సునిండా ప్రశ్నలే: మనం ఎందుకు ఉనికిలో ఉన్నాము? భూమినీ, దాన్లోని జంతువుల్నీ, చెట్లనూ, సముద్రాల్నీ ఎవరు చేశారు? ప్రజలు ఎందుకు చనిపోతారు? తర్వాత ఏమి జరుగుతుంది? మంచి ప్రజలకు చెడు విషయాలు ఎందుకు సంభవిస్తాయి? ఈ పట్టికకు అంతే లేదనిపిస్తుంది. తరచూ, అటువంటి విషయాల గురించి తలిదండ్రులే ఆలోచించడానికి సుముఖులుగా ఉండరు.b
తమ పిల్లలకు ఆత్మీయ శిక్షణనివ్వడానికి సమయం వెచ్చించమని బైబిలు తలిదండ్రులకు ఉద్బోధ చేస్తుంది. అటువంటి శిక్షణను గురించి అది తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య క్రమంగా కొనసాగే సంభాషణగా వాత్సల్యపూరిత మాటల్లో వర్ణిస్తుంది. కలిసి ఎక్కడికైనా నడిచి వెళ్తున్నప్పుడు, ఇంట్లో కూర్చున్నప్పుడు, పడుకోబోయేముందు—ఎప్పుడు సాధ్యమైతే అప్పుడు—తలిదండ్రులు తమ పిల్లలకు దేవుని గురించీ ఆయన వాక్యం గురించీ బోధించవచ్చు.—ద్వితీయోపదేశకాండము 6:6, 7; ఎఫెసీయులు 6:4.
అటువంటి ఆత్మీయ కార్యక్రమాన్ని సిఫారసు చేయడానికన్నా బైబిలు ఇంకా ఎక్కువే చేస్తుంది. మీకు అవసరమయ్యే సమాచారాన్ని కూడా అందిస్తుంది. లేకపోతే, పైన పేర్కొనబడిన పిల్లల ప్రశ్నలకు జవాబుల్ని మీరు మాత్రం ఎలా ఇవ్వగలరు? బైబిలులో జవాబులు ఉన్నాయి. అవి స్పష్టంగా ఉన్నాయి, అవి సమ్మోహితుల్ని చేసేవిగా ఉన్నాయి, మరి అవి ఈ నిరాశాజనకమైన లోకంలో గొప్ప నిరీక్షణను ఇస్తాయి. బైబిలులోని బుద్ధిని మీ పిల్లలు గ్రహించడం వారికి నేటి గందరగోళంతో నిండిన లోకంలో అత్యంత దృఢమైన లంగరును, కచ్చితమైన నిర్దేశనాన్ని ఇవ్వగలదు. వారికది ఇవ్వండి, అప్పుడు వారు నిజంగా వర్ధిల్లుతారు—ఇప్పుడూ, మరి భవిష్యత్తులోనూ.
[అధస్సూచీలు]
a తేజరిల్లు! (ఆంగ్లం) సెప్టెంబరు 8, 1992, పేజీలు 26-8 చూడండి.
b కుటుంబ సంతోషానికిగల రహస్యము అనే పుస్తకం కుటుంబ పఠనానికై రూపొందించబడింది, దానిలో వివాహమూ, పిల్లల పెంపకమూ అనే విషయాలపై బైబిలు నుండి ఆచరణయోగ్యమైన నిర్దేశనాలు ఉన్నాయి. దాన్ని వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రచురించింది.
[11వ పేజీలోని చిత్రం]
మీ పిల్లవాన్ని ఏదైనా ప్రత్యేక విషయం గురించి క్రమంగా మెచ్చుకోవడం కోసం మార్గాల కొరకు వెదకండి
[9వ పేజీలోని బాక్సు]
పిల్లలు వర్ధిల్లడానికి సహాయం చేయగల మార్గాలు
• తాము ప్రేమించబడుతున్నామనీ, తామంటే ఇష్టమనీ వారు భావించే ఒక భద్రతగల వాతావరణాన్ని అందించండి
• వారిని క్రమంగా మెచ్చుకోండి. నిర్దిష్టంగా చెప్పండి
• మంచి శ్రోతగా ఉండండి
• కోపం పెల్లుబికినప్పుడు విషయం మార్చండి
• స్పష్టమైన, స్థిరమైన హద్దులూ పరిమితులూ ఏర్పర్చండి
• ఒక్కొక్క పిల్లవాని అవసరాలకు తగినట్లుగా క్రమశిక్షణను మార్చండి
• సహేతుకమైనదానికన్నా ఎక్కువ మీ పిల్లవానినుండి అపేక్షించకండి
• దేవుని వాక్యాన్ని క్రమంగా పఠించడంద్వారా ఆత్మీయ అవసరాల గురించి శ్రద్ధవహించండి
[10వ పేజీలోని బాక్సు]
తన కాలానికన్నా ఎంతో ముందుంది
ప్రాచీన ఇశ్రాయేలీయులు తమ చుట్టూ ఉన్న జనాంగాల కన్నా ఎంతో ఉన్నతమైన స్థాయిలోని కుటుంబ జీవితాన్ని అనుభవించేలా బైబిలు సూత్రాలు వారికి సహాయం చేశాయి. చరిత్రకారుడైన ఆల్ఫ్రెడ్ ఎడర్‌షైమ్ ఇలా వ్యాఖ్యానిస్తున్నాడు: “ఇశ్రాయేలు సరిహద్దులకు అవతల అసలు కుటుంబ జీవితమనేది ఒకటి ఉందని చెప్పడం యుక్తం కాదు. కుటుంబ జీవితమే కాదు, కుటుంబం అని మనం దేన్నైతే పిలుస్తామో అది కూడా ఉనికిలో ఉన్నట్లు మనం చెప్పలేము.” ఉదాహరణకు, ప్రాచీన రోమన్‌ల చట్టం కుటుంబంలో తండ్రికి సంపూర్ణాధికారాన్నిచ్చింది. ఆయన తన పిల్లల్ని బానిసలుగా అమ్మివేయవచ్చు, కార్మికులుగా పనిచేయించవచ్చు, లేక వారికి మరణశిక్షను విధించవచ్చు—ఇందుకు ఆయనకు శిక్ష పడదు.
యూదులు తమ పిల్లల్తో మృదువుగా వ్యవహరించడం కొంతమంది రోమన్‌లకు వింతగా ఉండేది. నిజానికి, యూదుల ఆచారాలు “పూర్తిగా వక్రమైనవనీ, హేయమైనవనీ” అంటూ మొదటి శతాబ్దపు చరిత్రకారుడు టాసిటస్ యూదులకు వ్యతిరేకంగా ఒక విద్వేషపూరితమైన వ్యాసం వ్రాశాడు. అయితే ఆయన ఇలా అంగీకరించాడు: “నవజాత శిశువును చంపడం వారి మధ్య ఒక నేరం.”
బైబిలు ఉన్నతమైన ప్రమాణాన్ని అందిస్తుంది. అది, పిల్లలు అమూల్యమైనవారని—నిజానికి దేవుడే అనుగ్రహించిన స్వాస్థ్యంగా వారిని దృష్టించాలని—తగిన విధంగా వారితో వ్యవహరించాలని యూదులకు నేర్పించింది. (కీర్తన 127:3) స్పష్టంగా చాలామంది ఆ సలహాకు అనుగుణ్యంగా జీవించారు. ఈ సంబంధంగా, చివరికి వారి భాష కూడా ఎంతో వెల్లడిచేసేదిగా ఉంది. కుమారునికీ కుమార్తెకూ ఉన్న పదాలకు తోడు, ప్రాచీన హెబ్రీ భాషలో పిల్లల కొరకు తొమ్మిది పదాలున్నాయనీ, ఒక్కొక్కటి జీవితంలోని వివిధ దశలకు వర్తిస్తుందని ఎడర్‌షైమ్ అంటున్నాడు. ఉదాహరణకు, తల్లిపాలు త్రాగే బిడ్డకు ఒక పదం ఉంది, పాలుమానిన పిల్లవానికి మరో పదం ఉంది. కాస్త పెద్ద పిల్లలకు, వారు కాస్త దృఢంగానూ, బలంగానూ తయారౌతున్నారని సూచించే ఒక పదం ఉంది. ఇంకా పెద్దవారైన యౌవనులకు, అక్షరార్థంగా ‘స్వేచ్ఛకొరకు తనను తాను విదిలించుకోవడం’ అనే అర్థంగల పదం ఉంది. ఎడర్‌షైమ్ ఇలా వ్యాఖ్యానిస్తున్నాడు: “పురోభివృద్ధికరంగావున్న ఒక్కొక్క దశకు ఒక్కొక్క వర్ణనాత్మకమైన పదాన్ని ఇవ్వడం కోసం పిల్లల-జీవితాల్ని అంత సునిశితంగా గమనించినవారు నిశ్చయంగానే తమ పిల్లలతో ఎంతో ప్రీతికరమైన అనుబంధాన్ని కలిగివుండి ఉంటారు.”