మలేరియాపై యుద్ధంలో మళ్లీ ప్రాథమిక పద్ధతులు
ప్రపంచ అవధానం అంతర్యుద్ధాలూ, నేరమూ, నిరుద్యోగమూ, మరితర సంక్షోభాలపైన కేంద్రీకరించబడుతుండగా, మలేరియా మరణాలు ప్రముఖ వార్తల్లో ఏమాత్రం స్థానం పొందడంలేదు. ఏదేమైనా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం ప్రపంచ జనాభాలో దాదాపు సగంమంది నేడు మలేరియా బారినపడే ప్రమాదంలో నివసిస్తున్నారు, మరి దాదాపు 30 నుండి 50 కోట్లమంది దానిమూలాన అస్వస్థతకు గురౌతుంటారు. ఇది మలేరియాను “ఉష్ణమండల వ్యాధులన్నింట్లోకెల్లా అత్యధికంగా వ్యాప్తిచెందిన, అత్యంత ప్రాణాంతకమైన వ్యాధుల్లో ఒకటిగా” చేస్తుంది. ఎంత ప్రాణాంతకమైనది?
ప్రతి 20 క్షణాలకు మలేరియా మూలంగా ఒకరు చనిపోతున్నారు. దీంతో, ప్రతి సంవత్సరం దానిమూలాన మృత్యువాత పడేవారి సంఖ్య 15 లక్షలమందికిపైగా చేరుకుంటుంది—ఇది ఆఫ్రికానందలి బోట్స్వానా దేశ జనాభాకు సరిసమానం. ప్రతి పది మలేరియా మరణాల్లో తొమ్మిది మరణాలు ఆఫ్రికాలోని ఉష్ణమండల ప్రాంతంలోనే సంభవిస్తున్నాయి, ఇక్కడి బాధితుల్లో చాలామంది చిన్న పిల్లలే. ఉత్తర దక్షిణ అమెరికాల్లో చూసినట్లైతే అమెజాన్ ప్రాంతంలో మలేరియా అత్యంత తీవ్రంగా ఉందని WHO నమోదు చేసింది. అటవీ ప్రాంతాల నిర్మూలనమూ మరితర పర్యావరణ మార్పులూ ప్రపంచంలోని ఆ భాగంలో మలేరియా బాధితుల సంఖ్యలో పెరుగుదలకు కారణమయ్యాయి. బ్రెజిల్‌లోని కొన్ని అమెజాన్ సమాజాల్లో సమస్య ఇప్పుడు ఎంత తీవ్రంగా తయారయ్యిందంటే ప్రతి 1,000 నివాసుల్లో 500 మందికి ఈ వ్యాధి సోకింది.
ఆఫ్రికాలోనైనా, అమెరికాల్లోనైనా, ఆసియాలోనైనా, లేక మరింకెక్కడైనా మలేరియా ప్రాథమికంగా ప్రజల్లోని అత్యంత బీదవారిని పొట్టనబెట్టుకుంటుంది. ఈ ప్రజలకు, “ఆరోగ్య సేవలను పొందే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది, వ్యక్తిగత సంరక్షణ కొరకు చాలా తక్కువ డబ్బు ఉంటుంది, అంతేగాక సంస్థీకృత మలేరియా నియంత్రణ చర్యలు వీరికి అందనంతగా చాలా దూరంలో వీరు ఉంటారు” అని WHO అంటుంది. అయినప్పటికీ, బీదవారి దుస్థితి మరీ అంత నిరాశాపూరితంగా లేదు. ఇటీవలి సంవత్సరాల్లో, మలేరియా మరణాలను నివారించడానికైన అత్యంత ఆశాజనకమైన పద్ధతుల్లో ఒకటి మరింత అందుబాటులోకి వచ్చిందని ఉష్ణమండల-వ్యాధుల పరిశోధనపై ఒక వార్తాలేఖ అయిన TDRన్యూస్ అంటుంది. ఆ జీవరక్షకి పేరు? క్రిమిసంహారక మందులతో కూడిన దోమతెరలు.
నికర లాభాలు
దోమతెరలు ఉపయోగించడం తిరిగి ప్రాథమిక పద్ధతులకు మరలడమే అయినప్పటికీ, ఆఫ్రికాలోని WHO కార్యాలయపు నిర్దేశకుడైన డా. ఎబ్రాహీమ్ సాంబ, మలేరియా వ్యతిరేక పోరాటంలో దోమతెరల సామర్థ్యాన్ని పరీక్షించడానికి చేసిన ప్రయోగాలు “చాలా అద్భుతమైన ఫలితాల్ని” చూపించాయని పానోస్ ఇన్స్టిట్యూట్కు చెందిన ఒక వార్తాలేఖ అయిన పానోస్ ఫీచర్స్‌కు చెప్పాడు. ఉదాహరణకు, సూక్ష్మక్రిముల చర్యల ఫలితంగా కుళ్లిపోయే క్రిమిసంహారకాలు నింపబడిన దోమతెరల్ని ఉపయోగించడం ఐదు సంవత్సరాలకు తక్కువ వయస్సున్న పిల్లల్లో కేవలం మలేరియా మరణాల్ని మాత్రమే కాక అన్ని మరణాలనూ మూడింట ఒకవంతును తగ్గించింది. ప్రాణాలను కాపాడడం మాత్రమే గాక, “దోమతెరలు ఆరోగ్య సేవలపైనున్న భారాన్ని బాగా తగ్గించగలవు,” దానికి కారణం మలేరియా కొరకు చికిత్స అవసరమయ్యే రోగులు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు గనుక.
అయితే, ఒక్క సమస్య ఇంకా పరిష్కారమవ్వాల్సివుంది: దోమతెరలకు డబ్బెవరిస్తారు? ఆఫ్రికాలోని ఒక దేశంలోని ప్రజల్ని చందాలడిగినప్పుడు చాలామంది ఇవ్వడానికి నిరాకరించారు. ఇది ఆశ్చర్యకరమైన విషయం ఏమీ కాదు, ఎందుకంటే ఆరోగ్య పరిరక్షణ నిమిత్తం ఒక్క సంవత్సరానికి ఒక్క వ్యక్తి 5 (అమెరికా) డాలర్లకన్నా తక్కువ ఖర్చుచేసే దేశాల్లో నివసిస్తున్న ప్రజలకు చివరికి ఒక దోమతెర కూడా—క్రిమిసంహారక మందులు ఉన్నదైనా లేనిదైనా—ఒక విలాసవస్తువే మరి. ఏదేమైనా, మలేరియా రోగులకు చికిత్స చేయడానికయ్యే ఖర్చుకన్నా ఈ నివారణా పద్ధతి మూలంగా ప్రభుత్వాలకు తక్కువ ఖర్చౌతుంది గనుక, ఐక్యరాజ్య సమితి నిపుణులు “క్రిమిసంహారక మందులతో కూడిన దోమతెరల్ని పంపిణీచేయడమూ, వాటికి నిధులు చేకూర్చడమూ ప్రభుత్వాలకు ఆర్థికంగా తక్కువ భారంగా ఉంటుంది” అని అంటున్నారు. నిజానికి, దోమతెరల్ని పంపిణీచేయడం నిధుల్ని ప్రభుత్వానికి ఆదాచేయడానికైన ఒక మార్గంగా ఉండవచ్చు. అయితే, లక్షలాది బీద పౌరులకు అది ఇంకా ఎంతో ఎక్కువే—వారికది తమ జీవితాలను కాపాడుకోవడానికి ఒక మాధ్యమం.
[31వ పేజీలోని చిత్రసౌజన్యం]
CDC, Atlanta, Ga.