వజ్రాలు ఎందుకంత ఖరీదైనవి?
స్పెయిన్‌లోని తేజరిల్లు! విలేఖరి ద్వారా
కొన్నిసార్లు అందాన్ని కనిపెట్టవచ్చు. మరి కొన్నిసార్లు దాన్ని సృష్టించాల్సిందే. అయితే, ఓ వజ్రాన్ని కనిపెట్టనూవచ్చు, సృష్టించనూవచ్చు.
నిస్సందేహంగా, ముడి వజ్రాలు ప్రకృతి యొక్క రమణీయమైన సృష్టే. భూమి ఉపరితలం క్రిందనున్న తీవ్రమైన పీడనమూ, గరిష్ట ఉష్ణోగ్రతలూ సరళీకృతమైన కర్బనాన్ని నెమ్మదిగా కఠినమైన స్ఫటికాలుగా మారుస్తాయి. కానీ ఈ అరుదైన రాళ్లు, తరచూ కనుక్కోమని సవాల్ని విసురుతాయి. ఈ అమూల్యమైన రాళ్లను అన్వేషించడంలో భూమిపై అంటే ఆస్ట్రేలియా, సైబీరియా, దక్షిణ ఆఫ్రికాలలోని ప్రకృతిసిద్ధ సుందర ప్రదేశాలలో అక్కడక్కడా అతి పెద్దవైన గోతులను త్రవ్వడమైంది. దాదాపు ఆరు గ్రాముల బరువున్న కొన్ని వజ్రాల్ని వెలికి తీయడానికి, వంద టన్నుల మట్టిని త్రవ్వి, దాన్ని జల్లెడపట్టాల్సి రావొచ్చు!
ఓ వజ్రాన్ని ఒక్కసారి కనుక్కోగానే, అది ఒక ఉంగరానికో లేక నెక్లెస్‌కో సొగసును తేకమునుపు, నిబిడీకృతమైన దాని అందాన్ని నిపుణులైన కంసాలులు శ్రమనోర్చి తీర్చిదిద్దుతారు.
ఈ కృషీ కౌశల్యాలు చౌకగా లభ్యంకాకపోవడం సహజమే. కానీ అనేకమంది స్త్రీలు, పురుషులు అవి గిట్టుబాటైనవేనని భావిస్తారు. మరి విశేషంగా ఆ వజ్రాన్ని శాశ్వత అనురాగానికి గుర్తుగా భార్యకో లేక కాబోయే భార్యకో బహుకరిస్తే అలా భావిస్తారు. వజ్రపు అందమూ, భావుకతా దాన్ని భూమిపై అత్యంత అమూల్యమైన స్ఫటికంగా చేశాయి.a
ఏన్ట్‌వెర్ప్‌ను సందర్శించడం
బెల్జియమ్‌లోని ఏన్ట్‌వెర్ప్ నగరాన్ని సందర్శించినప్పుడు ఈ అసమానమైన రాళ్లపై నాకున్న ఆసక్తి పెరిగింది. ఈ నగర సంపద ఎక్కువగా వజ్రాలపైనే ఆధారపడివుంది. ‘వజ్రాన్ని అంత ఆకర్షణీయమైనదిగా చేసేదేమిటి? వజ్రాన్ని తయారుచేసే విధానంలో ఉన్న రహస్యం ఏమిటి?’ అని ఆలోచించాను.
ఆ ప్రశ్నలకు జవాబు కోసం, మూడు తరాలనుండీ వజ్రాల వర్తకంలో పనిచేసిన డిర్క్ లూట్స్ కుటుంబంతో మాట్లాడాను. “ఏన్ట్‌వెర్ప్ నగరం ప్రపంచంలోని వజ్రాల ప్రధాన కేంద్రాల్లో ఒకటి గనుక దీన్ని వజ్రానికి మంచి స్నేహితురాలు అని మేము పిలుస్తాం. కాబట్టి మీరు వజ్రాన్ని తయారుచేసే విధానంలోగల రహస్యాన్ని కనుక్కోవడానికి సరైన స్థలానికే వచ్చారు” అని ఆయన వివరించాడు.
మొట్టమొదటిగా, ఆయన తానప్పుడే తీసుకొచ్చిన కొన్ని ముడి వజ్రాల్ని నాకు చూపించాడు. అవి 3,50,000 డాలర్ల విలువగలవైనా, వాటిని చూడగానే అవి అంత విలువైనవిగా అన్పించలేదు, బదులుగా అవి ఓ గుప్పెడు గాజు ముక్కల్లా కన్పించాయి. కానీ వాటిని దగ్గరగా చూడడంవల్ల, వజ్రాల్ని కోసేవాడు వెలికితీయగలిగే అందాన్ని సూచించిన అంతర్గత ప్రాశస్త్యం బయటపడింది. నేను వాటి ఆకర్షణను గ్రహించనారంభించాను.
“అప్పుడప్పుడూ, పెద్దదైన ఓ ముడి వజ్రాన్ని నేను చూచినప్పుడు, నేను ఏదో వశీకరణకు లోనైనట్టు అంటే దాదాపు భావోద్రేకంగా దగ్గరైనట్టు భావిస్తాను” అని డిర్క్ ఒప్పుకున్నాడు. “అసంకల్పితంగా, ఆ వజ్రాన్ని కొనాలని అనుకుంటాను. అది, అమూల్యమైన ఒక ముత్యాన్ని అంటే తనకు కలిగినదంతా అమ్మి వేసి, కొనడానికి సిద్ధపడేంత పరిపూర్ణమైన ఓ ముత్యాన్ని కనుగొన్న యేసు ఉపమానంలోని మనుష్యుని నాకు జ్ఞాపకం చేస్తుంది. అంతమేరకు నేను వెళ్లలేదనుకోండి” అని నవ్వి, “కానీ కొన్ని అత్యుత్తమమైన వజ్రాలు ఓ ప్రత్యేకమైన ఆకర్షణతో ఆకట్టుకుంటాయనీ, వాటిని అమ్మడం కొనడంలోనే జీవితాన్ని గడిపిన మాలాంటి వారిని కూడా ఆకట్టుకుంటాయనీ నేను ఒప్పుకుంటాను. ముడి రాయినుండి విలువైన రత్నాన్ని తయారు చేయడంలో దాని సాధకబాధకాలు దానికి ఉన్నప్పటికీ అది ఆకట్టుకునేదిగా ఉండొచ్చు” అని అన్నాడు.
ముడి వజ్రాన్ని సానబట్టడం
అమూల్యమైన రాయి, నిర్లక్ష్యంగాకోసే వజ్రపు కోతగాని చేతిలో పాడవ్వచ్చని నేను విన్నాను. అలా తరచూ జరిగితేనో అని ఆలోచించాను. “ఇది అరుదుగాగాని జరగదని” డిర్క్ అంగీకరించాడు. “రాయి ముక్కలుగా అయిపోయినప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది. వజ్రానికి మెరుగులు దిద్దడంలో అప్పుడప్పుడూ గ్లెట్స్‌కుగానీ లేక పగుళ్లువంటి లోపానికిగానీ తగిలి, వజ్రం పాడవ్వవచ్చు. పోలరైజ్డ్ వెలుతుర్లో మేము ఎల్లప్పుడూ జాగ్రత్తగా గరుకుగావున్న వజ్రపురాయిని పరిశీలిస్తాం. అది వజ్రంలో అనుమానాస్పదమైన స్థలాన్ని చూపిస్తుంది; కానీ పొరపాట్లకు తావీయలేని పద్ధతంటూ ఏదీ లేదు, నేను దానికి చింతిస్తున్నాను.
“పగిలిపోయిన వజ్రపురాయి మాకో పీడకలలాంటిదే అయినా మాకు ఇబ్బందిని కల్గించేది అది ఒక్కటి మాత్రమే కాదు. కొన్నిసార్లు వజ్రపురాయిని కోసి, ముఖరూపాల్ని మెరుగులు దిద్దిన తర్వాత దాని రంగు ముదురు వర్ణానికి మారిపోతుంది, మరి దాని విలువ పడిపోతుంది. గరుకుగావున్న వజ్రపురాయిని ప్రథమ శ్రేణికి చెందిన రత్నంగా చేసేందుకు దాన్ని 60 శాతం వరకూగానీ లేక అంతకన్నా ఎక్కువగానీ మేము తరచూ కోసెయ్యాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి.”
ఇదంతా వజ్రం తయారీలో చేరివుందని నేను గ్రహించేంత వరకూ, ఎంతో ధనం వృధా అయిపోతున్నట్లుగానే నాకు అన్పించింది. అప్పుడే కోసి మెరుగులు దిద్దబడిన హృదయాకారంగల ఓ పెద్ద వజ్రాన్ని డిర్క్ నాకు చూపించాడు. “ఇది ఎలా మెరుస్తుందో మీరు చూశారా?” అని ఆయన నన్ను ప్రశ్నించాడు. “ఆ వజ్రపురాయి లోపలవున్న ప్రకాశం, నిజానికి పరావర్తనం చెందిన వెలుగేతప్ప మరేమీకాదు.
“ఆ వజ్రాన్ని చెక్కేవాడు చేయాల్సిందేంటంటే, ఆ వజ్రపురాయిలోనికి వెలుగు ప్రవేశించి, చూస్తున్నవానివైపుకు ఆ వెలుగు తిరిగి పరావర్తనంచెందే రీతిలో ఆ ముఖాకృతులన్నిటినీ కోయడమే. గుండ్రంగా కట్‌చేయడం వంటి పారంపర్యపు ఆకృతులు, దీన్ని మరింత ప్రతిభావంతమైన రీతిలో ప్రతిబింబిస్తాయి. కానీ ఈ హృదయాకృతిగల వజ్రం వంటి ఫ్యాన్సీ డిజైన్లు కూడా సాధ్యమైనంత ఎక్కువ మోతాదులో వెలుగును పరావర్తనం చెందించేందుకే ఉద్దేశించబడ్డాయి. అది వజ్రాల్ని తయారుచేసేవానికి ఉండాల్సిన కళ. నిజానికి, ప్రసిద్ధిగాంచిన ఓ వజ్రాల ఉత్పత్తిదారుడు, దాన్ని తన ధర్మ సూత్రంగా ఎంచుకున్నాడు. ‘తయారీలోనే ఉంది మాయంతా.’”
“వజ్రాన్ని ఏ ఆకృతిలో కొయ్యాలో మీరెలా నిర్ణయిస్తారు?” అని డిర్క్‌ని అడిగాను. “మేము కొనాలనుకున్న ముడి వజ్రపురాయిని చాలా జాగ్రత్తగా పరిశీలించడం మొదలుపెడతాం” అని చెప్పాడు. “అంటే చాలా జాగ్రత్తగా అన్నమాట! ఓ వజ్రాన్ని ఎలా కోయాలో అని తుది నిర్ణయాన్ని తీసుకోవడానికి ముందు ఓ నెలనుండి ఆ పెద్ద వజ్రపురాయిని పరిశీలించడం నాకు గుర్తే. ఫలానా ఆకృతిలోనికి కోసేందుకు అనువుగా ముడి వజ్రపురాయి ఉండడంవల్ల కొన్నిసార్లు అది సులభమౌతుంది. ప్రతీ సందర్భంలోనూ, ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ రద్దును కోల్పోయేలా ఆ నిర్దిష్టమైన వజ్రపురాయికి శ్రేష్ఠమైన ఆకృతిని నిర్ణయించడమే లక్ష్యం. కానీ మేము ప్రతీ ముఖాకృతినీ కట్‌చెయ్యడమంటే—విలక్షణమైన ఓ వజ్రానికి 50 ముఖాకృతులుంటాయి—దాని బరువును కోల్పోవడమే.”
తర్వాత డిర్క్ నన్ను ఒక వజ్రపురాయిని జాగ్రత్తగా చూడమని అడిగాడు. నగలను బాగుచేసేవాళ్లు ఉపయోగించే భూతద్దమైన లోప్‌ను ఇస్తూ, “ఆ వజ్రపురాయి కుడివైపున వున్న లోపాన్ని మీరు చూశారా?” అని ఆయన అడిగాడు. ఆ రత్నానికి లోపల ఓ మూల—పగుళ్లున్న అద్దంలో కన్పించే అడ్డదిడ్డమైన గీతల్లాంటి—గీతల్ని కొన్నింటిని చూశాను. “అలాంటి లోపం, వజ్రపు విలువను ఎంతగానో తగ్గించివేస్తుంది. మేము దాన్ని కట్‌చేసి తీసెయ్యవచ్చనుకోండి, కానీ అలా చేయడమంటే ఆ రాయిలోని అధిక మొత్తాన్ని కోల్పోవడమే. ఆ లోపం గనుక కళ్లకు కన్పించకపోతే, దాన్ని మేము కాస్త తక్కువ ధరకు అమ్మివేయగలం.”
అలాంటి చిన్న వజ్రాలు ఎందుకంత విలువైనవో తెల్సుకోవడానికి నేను ఆసక్తి చూపించాను. స్పష్టంగా, దీనికి అనేక కారణాలు ఉన్నాయి.
“‘వజ్రం శాశ్వతమైనది’ అనే పాత సామెత ప్రకటనా నినాదమే అయినప్పటికీ, సామాన్యంగా వాస్తవమే” అని డిర్క్ తెలియజేశాడు. “వజ్రాలు పనికిరానివైపోవు, వాటి వన్నె తగ్గిపోదు. అవి ఒకప్పుడున్నంత అరుదైనవికాకపోయినా, అరుదైనవే, మరి అవి అందమైనవీ—ఆ విషయంలో సందేహమేమీ లేదు! కానీ వాటి విలువను నిర్ధారిస్తున్న అత్యంత ప్రాముఖ్యమైన కారణం బహుశా, ప్రపంచవ్యాప్తంగా వజ్రాలకున్న డిమాండే. ఇది ఎక్కువగా ప్రకటనలపై ఆధారపడివుంది.
“వజ్రపుటుంగరాన్ని ఓ స్త్రీ ఎందుకు కావాలని కోరుకుంటుంది?” అని డిర్క్ ఆలోచనలో మునిగిపోయాడు. “ఆమె బహుశా వజ్రాల్ని ప్రేమకూ, రోమాన్స్‌కూ ముడిపెడుతుంది. ఓ వజ్రం ఎంతో కొంత ప్రత్యేకతను కల్గివుంది, శాశ్వతంగా భద్రపర్చుకోదగినది. వజ్రం ఉన్నంత కాలం వరకూ నిలిచివుండబోయే తమ మధ్యనున్న ప్రేమను ఆమెకు గుర్తు చేస్తుంది. ఈ అభిప్రాయం లేక కొంతమంది పిలిచేవిధంగా ఈ భ్రమ నైపుణ్యవంతంగా పెంపొందించబడింది. ఈ సందేశాన్ని అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వజ్రాలను కొనేలా చేస్తున్న సందేశాన్ని—ప్రకటించడానికి 1995లో దాదాపు 18,00,00,000 డాలర్లను ఖర్చుపెట్టడమైంది.”
వజ్రం విలువ
“మెరుగులు దిద్దబడిన రత్నం విలువ దాని సైజుపై ఆధారపడివుంటుందని అనుకుంటా” అని నేను అభిప్రాయపడ్డాను. “అది మీరు అనుకున్నంత సులభమైనదేమీ కాదు” అని డిర్క్ ప్రత్యుత్తరమిచ్చాడు. “వజ్రాల వర్తకులు, వజ్రాల విలువ నాలుగు కారణాలపై ఆధారపడివుందని చెబుతారు: కట్, కేరట్, వర్ణం, స్పష్టత. వీటిలో ప్రతీదీ ఆ వజ్రపురాయి అందంపైనా—మరి ఆ విధంగా విలువపైనా—ప్రభావాన్ని చూపిస్తాయి.
“కట్ చేయడం దగ్గరనుండీ మన చర్చను ఆరంభిద్దాం. బాగా కట్‌చేయడాన్ని, లఘచిత్రంలోని శిల్పకళయైన కళానైపుణ్యమని మీరు చెప్పవచ్చు. మీరు ప్రశంసించిన హృదయాకారపు వజ్రాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. తయారుచేయడానికి ఆ ఆకారమేమీ అంత సులభమైనది కాదు. ఏ ఇతర ఆకారాలకన్నా ఈ ఆకారానికే అసలు వజ్రపురాయిలో నుండి ఎక్కువ రద్దు పోతుంది. ఆ రత్నం యొక్క అందాన్ని ద్విగుణీకృతం చేయడానికి అన్ని ముఖవైఖరులూ ఓ పద్దతి ప్రకారంగా ఎలా అమర్చబడ్డాయో గమనించండి. ఈ నిర్దిష్టమైన వజ్రం అతి శ్రేష్ఠమైన కట్‌ను కల్గివుందని మేము చెబుతాం.
“మీరు దీని సైజును చూసి మొదట ముగ్ధులయ్యారు, ఇది 8 కారెట్లున్న పెద్ద వజ్రపురాయి గనుక అలా ముగ్ధులవ్వడం అర్థంచేసుకోదగినదే. (ఒక కారట్ 0.2 గ్రాముకి సమానం.) యాదృచ్ఛికంగా, మేము వజ్రపురాయిని తూయడంద్వారానే కారట్ విలువను నిర్ణయిస్తాం. సాధారణంగా మాట్లాడాలంటే, ఎన్ని ఎక్కువ కారెట్లుంటే అది అంత విలువైన వజ్రం అవుతుంది. కానీ దాని విలువను వర్ణం, స్పష్టతలు కూడా ప్రభావితం చేస్తాయి.
“మీరు మా ముడి వజ్రాల పేకెట్‌లో చూసినట్లుగా వజ్రాలు అన్ని ఆకారాల్లోనూ, రంగుల్లోనూ వస్తాయి. మొట్టమొదట మేము చేయాల్సిన పని, వాటిని వాటివాటి వర్ణాల్నిబట్టి వేరు చేయడమే. శ్వేతవర్ణంగల వజ్రపురాళ్లు, మరింత విలువైనవిగా ఉంటాయి. అయితే, కెంపువర్ణమూ, నీలివర్ణమూ లేక ఎరుపు వర్ణమూ వంటి ఫ్యాన్సీ రంగులని మేము పిలిచే రాళ్లూ ఉన్నాయి; మరి ఇవి చాలా అరుదుగా దొరకుతాయి గనుక శ్వేతవర్ణపు రాళ్లకన్నా అత్యధిక ధరను పలుకుతాయి.
“చివరగా, మేము ఓ వజ్రపురాయిని దాని స్పష్టతనుబట్టి నాణ్యత నిర్ణయిస్తాం. ఓ రాయి గనుక లోపంలేనిదని వర్గీకరించబడితే, అంటే మీరు ఆ రాయిలోనికి చూసినప్పుడు, లోప్‌తో చూసినప్పటికీ మీరు ఏ విధమైన లోపాల్ని కనుగొనలేరు. ఆ విధంగా, ఓ వజ్రానికి కారెట్లలో దాని బరువెంత ప్రాముఖ్యమో అలాగే దానికి కట్, స్పష్టత, వర్ణమూ ప్రాముఖ్యమై ఉండగలవు. ఉదాహరణకు, మెరుగు పెట్టబడిన వాటిలోకెల్లా, బహుశా అతి పెద్దదైన వజ్రం (546.67 కారెట్లు) 1995లో ప్రదర్శనకు పెట్టబడింది. కానీ అది దాదాపు ఓ గోల్ఫ్‌బంతి సైజులో ఉన్నప్పటికీ, దానికున్న దిగువస్థాయి స్పష్టతనుబట్టీ, దాని పసుపు-గోధుమ వర్ణాన్నిబట్టీ ప్రపంచంలోని అత్యంత విలువైన వజ్రం కాలేదు.”
ఏన్ట్‌వెర్ప్‌ను విడిచిపెట్టక మునుపు, వజ్రాల పరిశ్రమలో 50 ఏళ్లనుండీ ఉన్న హాన్స్ విన్స్‌తో మాట్లాడాను. చివరగా నేనొక ప్రశ్న అడగాలని అనుకున్నాను, ఓ వజ్రాన్ని ఏది అంత ప్రత్యేకమైనదిగా చేస్తుంది?
“చిన్నచిన్న వజ్రాల్లో అంత ఎగ్జయిట్‌మెంట్ ఉండదు—వాటిని ఓ మెషిన్‌పైనైనా రూపుదిద్దవచ్చు” అని ఆయన ప్రత్యుత్తరమిచ్చాడు. “కానీ పెద్దపెద్ద వజ్రాలు నన్ను సమ్మోహితున్ని చేసాయి. ప్రతీ రాయి వైవిధ్యమైనది—కార్బన్ కోట్లాది సంవత్సరాలుగా లావా పీడనంచే ఒత్తిడికిలోనై ఉత్పన్నమైన ఓ అసమానమైన సృష్టి. మీరు వజ్రపురాయిని అధ్యయనం చేసినప్పుడు, చెట్టు కాండంపైవున్న గుండ్రని రేఖల్ని పోలిన వయస్సు నిర్ధారిత రేఖల్ని మీరు నిజంగా దానిపై చూస్తారు. అనుభవంగల ఓ డీలరు, అది ఏ గనిలోనుండి తీయబడిందో కూడా మీకు చెప్పగలడు.
“శిల్పి శిలను ఎలా చూస్తాడో అలాగే వజ్రాల ఉత్పత్తిదారుడూ అలాంటి రాయివైపు చూస్తాడు. తాను దేన్ని సృష్టించగలడో అతడు అప్పటికే తన మనో దృష్టితో చూస్తాడు. తన మనఃకల్పనలో, అతడు కటింగ్‌చేస్తూ, మెరుగులుదిద్దుతూ ఉంటాడు. మరి ఓ అద్భుతమైన రత్నం పుట్టుకొస్తుంది. చివరికి ఆ వజ్రం ఓ ఉంగరంలోనో లేక ఓ నెక్లెస్‌లోనో పొదగబడినప్పుడు, అది తన యజమానికి అదే విధమైన ఆనందాన్ని ఇస్తుందని తలంచడానికి నేను ఇష్టపడతాను.”
అన్నిటినీ పరిశీలించిన మీదట, అది తన యజమానికి ఆనందాన్నిస్తుంది గనుకనే వజ్రాన్ని తయారు చేయడం యోగ్యమైంది.
[అధస్సూచి]
a వజ్రాల ధరలు అధికంగా ఉండడానికి గల ప్రధానమైన కారణం, కేంద్రీయ విక్రయ సంస్థ గుత్తాధికారంచే నియంత్రించబడడమే.
[23వ పేజీలోని చిత్రాలు]
8 కారెట్ల హృదయాకారపు వజ్రం (రాళ్లు అసలు పరిమాణంవి కావు)
పేర్ ఆకారపు కట్
“కార్డినల్ టోపీ” కట్
కట్‌చేయబడని వజ్రపురాళ్ల కారట్ బరువును నిర్ధారించడం
వర్ణాన్నిబట్టి గరుకుగావున్న వజ్రాల్ని వేరుపర్చడం
మరింత మెరుగులు దిద్దడం అవసరమో కాదోనని ముఖ ఆకృతుల్ని పరిశీలించడం