పరదైసుకి తిరిగి వెళ్లే దారి
పరదైసు కొరకైన మానవుని ఆకాంక్షా, దాన్ని పునఃసృష్టించడానికి ఆయన చేసిన చిన్నా పెద్దా ప్రయత్నాల దృష్ట్యా ఈపాటికి భూమి యథార్థంగానే పరదైసుగా మారివుండాలని ఒకరనుకోవచ్చు. కానీ అదలా మారలేదు.
దానికి విరుద్ధంగా మానవజాతి, దురాశకు ప్రాధాన్యతనిచ్చింది, దీనివల్ల తరచూ పర్యావరణమూ, దాన్లోని వైవిధ్యంగల జీవజాలమూ గొప్ప మూల్యం చెల్లించాల్సి వచ్చింది. భౌతిక సంపదే ప్రాముఖ్యమైనదని నమ్ముతూ చాలామంది ఈ భూమి ఒకనాడు ఏదెనువంటి పరదైసుగా మార్చబడుతుందనే ఆశనే వదిలేసుకున్నారు. బదులుగా, వారు పరదైసు కొరకైన ఏకైక నిరీక్షణగా పరలోకంలో మరణం తర్వాతి జీవితం కొరకు చూస్తూంటారు. ఈ దృష్టికోణం, మొట్టమొదటిగా, ఏదెను కొరకైన మన మానవ ఆకాంక్ష ఇక ఎప్పటికీ తీరదనీ, రెండవదిగా, దేవుడు ఈ భూమిని మానవ తప్పిదానికీ, దురాశలకీ వదిలివేశాడని అర్థమిస్తుంది. కానీ అది నిజమేనా? అసలు భవిష్యత్తులో ఏముంది? మరి ఆ భవిష్యత్తును మనం ఎక్కడ అనుభవిస్తాము?
పరదైసు—పరలోకంలోనా లేక భూమిమీదా?
దాదాపు 2,000 సంవత్సరాల క్రితం, తన ప్రక్కన వ్రేలాడదీయబడిన పశ్చాత్తాపపడిన దొంగతో మాట్లాడుతూ యేసుక్రీస్తు, “నీవు నాతోకూడ పరదైసులో ఉందువని” అన్నాడు. (లూకా 23:43) ఆ దొంగ తనతోపాటు పరలోకంలోనికి వెళ్తాడని యేసు మాటల భావమా? లేదు.
ఆ తప్పిదస్తుడు అటువంటి తలంపును కూడా అనుమతించివుండడు. ఎందుకు? ఎందుకంటే తన దినాల్లో ఉన్న హెబ్రీ లేఖనాల్లోని, కీర్తనలు 37:29 మొదటిభాగంవంటి లేఖన భాగాలతో ఆయన పరిచయం కల్గివుండివుండవచ్చు, అక్కడిలా ఉంది: “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు.” (ఇటాలిక్కులు మావి.) యేసు అదే సత్యాన్ని బోధించాడు, ఆయనిలా ప్రకటించాడు: “సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.” (ఇటాలిక్కులు మావి, మత్తయి 5:5.) ఈ లేఖనం సాధారణంగా ప్రభువు ప్రార్థన అని పిలువబడేదానితో పొందికను కల్గివుంది, అందులో ఇలా ఉంది: “నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక.”—మత్తయి 6:9, 10.
మానవ కుటుంబం కొరకు ఒక గృహంగా పరలోకాన్ని కాదు గానీ భూమినే దేవుడు సృష్టించాడని బైబిలు బోధిస్తుంది. ఆయన “[భూమి] నిరాకారముగానుండునట్లు . . . సృజింపలేదు” గానీ “నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను” అని ఆయన వాక్యము చెబుతుంది. (యెషయా 45:18) ఎంతకాలం వరకు? “భూమి యెన్నటికిని కదలకుండునట్లు ఆయన దానిని పునాదులమీద స్థిరపరచెను.” (కీర్తన 104:5) అవును, “భూమియొకటే యెల్లప్పుడును నిలుచునది.”—ప్రసంగి 1:4.
తనను సేవించే అనేకులకు ఈ భూమి శాశ్వత గృహమయ్యేలా చేయడమే దేవుని సంకల్పం. దేవుని వాక్యమైన బైబిలు దీనిపై ఎలా వ్యాఖ్యానిస్తోందో గమనించండి. కీర్తన 37:11 ఇలా ప్రవచిస్తోంది: “దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహు క్షేమము కలిగి నివసించెదరు.” ఎంతకాలం వరకు? కీర్తన 37:29 ఇలా చెబుతుంది: “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు. వారు దానిలో నిత్యము నివసించెదరు.” (ఇటాలిక్కులు మావి.) అప్పుడు ఈ లేఖనంలోని మాటలు వాస్తవమని గ్రహిస్తారు: “నీవు [దేవుడు] నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరచుచున్నావు,” అంటే దేవుని చిత్తానికి అనుగుణ్యంగావున్న కోరికను దేవుడు తృప్తిపరుస్తాడు.—కీర్తన 145:16.
దేవుని చిత్తాన్ని చేయాలన్న కోరికే లేనివారి విషయమేమిటి? సామెతలు 2:21, 22 ఇలా ప్రకటిస్తోంది: “యథార్థవంతులు దేశమందు నివసించుదురు. లోపములేనివారు దానిలో నిలిచియుందురు. భక్తిహీనులు దేశములో నుండకుండ నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలోనుండి పెరికివేయబడుదురు.”
పరదైసు పునఃస్థాపన
ఇప్పుడు త్వరలోనే, దేవుని తీర్పులు ఈ దుష్ట లోకానికి విరుద్ధంగా అమలుచేయబడతాయి. (మత్తయి 24:3-14; 2 తిమోతి 3:1-5, 13) కానీ దేవుడు “యొక గొప్ప సమూహము”ను రాబోయే ఆ నాశనంనుండి తప్పించి తాను రూపొందించబోయే ఒక నూతన లోకంలోనికి ప్రవేశించేలా కాపాడతాడు.—ప్రకటన 7:9-17.
అప్పుడు, దేవుడు తనకు విధేయులైన మానవులకు పూర్తి భూమిని మానవజాతి అంతటికొరకు పరదైసు గృహంగా మార్చే ఆనందకరమైన పనిని నిర్దేశిస్తాడు. బైబిలు ఇలా వాగ్దానం చేస్తోంది: “అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును. అడవి ఉల్లసించి కస్తూరిపుష్పమువలె పూయును. . . . అరణ్యములో నీళ్లు ఉబుకును. అడవిలో కాలువలు పారును.”—యెషయా 35:1, 6.
విస్తరించే ఆ పరదైసులో ఇక ఆకలివుండదు, బీదరికంవుండదు, మురికివాడలుండవు, ఇండ్లులేనివారుండరు, లేక నేరంతో నిండివుండే ప్రాంతాలుండవు. “దేశములోను . . . సస్య సమృద్ధి కలుగును.” (కీర్తన 72:16) “ఫలవృక్షములు ఫలములిచ్చును, భూమి పంట పండును.” (యెహెజ్కేలు 34:27) “జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు. ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలములననుభవింతురు. వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరు, వారు నాటుకొన్న వాటిని వేరొకరు అనుభవింపరు.” (యెషయా 65:21, 22) “ఎవరి భయము లేకుండ ప్రతివాడును తన ద్రాక్షచెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును.”—మీకా 4:4.
కొంతమంది పరలోకానికి వెళ్లడానికి కారణం
ప్రజల్లో అనేకులు తమకు భూపరదైసు అంటే ఆకాంక్ష ఉన్నట్లు బహుశ ఒప్పుకుంటారు. అది సహజమే, ఎందుకంటే దేవుడు వారిలో పరలోకానికొరకైన ఆకాంక్షను ఎన్నడూ పెట్టలేదు; వారు పరలోకంలోని జీవితం ఎలా ఉంటుందో ఊహించను కూడా ఊహించలేరు. ఉదాహరణకు, తన చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ పరిచారకునితో సంభాషించేటప్పుడు దైవభక్తిగల చర్చి సభ్యురాలైన పాట్ ఇలా అంది: “పరలోకానికి వెళ్లే తలంపులు నాకెప్పుడూ లేవు. నాకు అక్కడికి వెళ్లాలని లేదు, అయినా వెళ్తే మాత్రం నేనక్కడ ఏం చేస్తాను?”—కీర్తన 115:16 పోల్చండి.
నిజమే, ఒక పరిమిత సంఖ్యలో అంటే 1,44,000 మంది మానవులు పరలోకానికెళ్తారని బైబిలు బోధిస్తుంది. (ప్రకటన 14:1, 4) వారు పరలోకానికి ఎందుకు వెళ్తారో కూడా వివరిస్తూ, “మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురని” అది తెలియజేస్తుంది. (ఇటాలిక్కులు మావి, ప్రకటన 5:9, 10.) తమ రాజైన యేసుక్రీస్తుతోపాటు, వీరు “రాజ్యము”గా అంటే భూమిపైన క్రొత్త పరలోకపు ప్రభుత్వంగా తయారౌతారు, ఈ ప్రభుత్వం కొరకే క్రైస్తవులు ప్రార్థిస్తారు. ఈ ప్రభుత్వం భూమియొక్కా, మానవజాతియొక్కా పూర్తి పునరావాసాన్ని పర్యవేక్షిస్తుంది.—దానియేలు 2:44; 2 పేతురు 3:13.
అయితే, పరలోకంలో జీవించాలనే ఇచ్ఛ మానవుల్లో సహజంగా లేదు కాబట్టి, దేవుని ఆత్మ ఒక విశిష్టమైన విధానంలో 1,44,000 మందితో ‘సాక్ష్యమిస్తుంది,’ ఆ విధంగా వారు ఈ ప్రత్యేకమైన “ఉన్నతమైన పిలుపు”ను గ్రహిస్తారు. (రోమీయులు 8:16, 17; ఫిలిప్పీయులు 3:14) అయితే స్పష్టంగా, సాధారణ మానవజాతి విషయంలో పరిశుద్ధాత్మ ఆ విధంగా పనిచేయనవసరం లేదు ఎందుకంటే వారి నిరంతర గృహం పరదైసు భూమిపైనే ఉండబోతోంది.
ఒక ఆత్మీయ పరదైసు మార్గాన్ని సిద్ధపరుస్తుంది
పరదైసు భూమిపై నిరంతర జీవితానికి ఒకరు ఎలా అర్హులౌతారు? “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నునూ నీవు పంపిన యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని పొందడమే నిత్యజీవము” అని యేసు అన్నాడు. (యోహాను 17:3, NW) శాంతియుత మానవ సంబంధాలను దేవుని గూర్చిన జ్ఞానముతో జతచేస్తూ, యెషయా 11:9 ఇలా చెబుతుంది: “నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హానిచేయదు, నాశము చేయదు. సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండియుండును.”—యెషయా 48:18 పోల్చండి.
అయితే, ఈ జ్ఞానము కేవలం మెదడుకెక్కించుకునే జ్ఞానం కాదు. అది ఒకరి వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది, “ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము” వంటి దైవిక గుణాలను పెంపొందింపజేస్తుంది. (గలతీయులు 5:22, 23) యెహోవాసాక్షులు ఈ లక్షణాలను పెంపొందించుకోవడానికి కృషిచేస్తారు, తద్వారా వారు ఇప్పుడు కూడా ఒక ఆరోగ్యకరమైన ఆత్మీయ పరదైసును అనుభవించేలా ఆశీర్వదించబడ్డారు.—యెషయా 65:13, 14.
వారి ఆత్మీయ స్థితికి, పూర్తి దైవరాహిత్యంలోకీ, భ్రష్టత్వంలోకీ కూరుకుపోతున్న ఈ లోకపు ఆత్మీయ స్థితికి ఎంత వ్యత్యాసం ఉంది! అయితే త్వరలోనే, ఈ దుష్ట లోకాన్ని దేవుడు నాశనం చేస్తాడు. ఈలోగా, యెహోవాసాక్షులు తాము అనుభవిస్తున్న ఆత్మీయ పరదైసును చూడడానికి—అవును, తనిఖీ చేయడానికి—మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. అదృశ్య పరలోకపు రాజైన యేసు ఆ నూతన లోక భవిష్యద్ నివాసులను ఇరుకైన మార్గంగుండా నిశ్శబ్దంగా భూపరదైసులోనికీ, నిత్యజీవానికీ నడిపిస్తుండడాన్ని ఇప్పుడే మీకై మీరే చూడండి!—మత్తయి 7:13, 14; ప్రకటన 7:17; 21:3, 4.
[8, 9వ పేజీలోని చిత్రం]
ఈ లోక అంతాన్ని తప్పించుకునేవారు ఈ భూమిని ఒక పరదైసుగా తీర్చిదిద్దే పనిలో భాగం వహిస్తారు