పిల్లలపై లైంగిక అత్యాచారం ఒక ప్రపంచవ్యాప్త సమస్య
స్వీడన్‌లోని తేజరిల్లు! విలేఖరి ద్వారా
పిల్లలపై లైంగిక అత్యాచారమనే ఒక విభ్రాంతికరమైన అభ్యాసం మానవ సమాజాన్ని పట్టి కుదిపేస్తోంది. దీని పరిధి గురించీ, దీని స్వభావం గురించీ ఇటీవలి సంవత్సరాల వరకూ అంతగా తెలియదు. దీని విషయమై ఏమి చేయవచ్చో పరిశీలించడానికని 130 దేశాల ప్రతినిధులు మొదటి వరల్డ్ కాంగ్రెస్ అగైన్స్ట్ కమర్షియల్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయ్‌టేషన్ ఆఫ్ చిల్డ్రన్ వద్ద స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో సమావేశమయ్యారు. స్వీడన్‌లోని తేజరిల్లు! విలేఖరి కూడా అక్కడ ఉన్నారు.
మాగ్డాలన్కు 14 ఏండ్లున్నప్పుడు ఫిలిప్పీన్స్‌లోని మనీలాలోవున్న ఒక బార్లో ఒక “హోస్టెస్”గా పని చేసే ప్రలోభంలో ఆమె పడింది. నిజానికి ఆమె మగ కస్టమర్లను ఒక చిన్న గదిలోనికి తీసుకుని వెళ్లి, వారి లైంగిక వాంఛలను తీర్చడానికిగాను తన శరీరంపైని బట్టలను తీసివేయడం ఆమె పనిలో ఒక భాగం—ఒక్క రాత్రికి దాదాపు 15 మంది మగవాళ్లు, శనివారాల్లోనైతే 30 మంది. కొన్నిసార్లు, తానిక ఎంతమాత్రం ఓర్చుకోలేనని ఆమె తనతో చెప్పినప్పుడు మేనేజరు ఆమె కొనసాగేందుకు బలవంతపెట్టేవాడు. తరచూ ఆమె పని సమయం ఉదయం నాలుగు గంటలకు ముగుస్తుంది. అప్పటికి ఆమె నిస్సత్తువతోనూ, కృంగుదలతోనూ, హీనస్థితిలోనూ ఉన్నట్లు భావిస్తుంది.
సరూన్, కంబోడియాలోని పోనోమ్ ఫెన్లో ఒక అనాధ వీధి బాలుడు. ఆయనకు సిఫిలిస్ ఉంది, విదేశీయులతో కల్సి ‘బయట తిరిగాడు’ అని ఇతరులు అంటారు. ఒక పగోడాలో నివసించడానికి ఆయనకు ఇల్లు ఇచ్చారు, ఆయనను ‘చూసుకోవడానికి’ ఒక మాజీ సన్యాసి అక్కడ ఉన్నాడు. అయితే, ఈయన ఆ పిల్లవాడిపై లైంగిక అత్యాచారం చేశాడు, సెక్స్ కొరకు ఆ పిల్లవాడిని విదేశీయులకు సరఫరా చేసేవాడు. ఆ పగోడాలోని సరూన్ నివసించే ఇల్లును కూల్చేసినప్పుడు ఆయన తన ఆంటీతోపాటు నివసించనారంభించాడు. అయినప్పటికీ, వీధుల్లో మగ వేశ్యగా పనిచేయాల్సివచ్చేది.
గత సంవత్సరం చివర్లో, వరల్డ్ కాంగ్రెస్ అగైన్స్ట్ కమర్షియల్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయ్‌టేషన్ ఆఫ్ చిల్డ్రన్వద్ద వ్యవహరించిన భయంకరమైన సమస్యకు ఇవి కేవలం రెండు ఉదాహరణలే. ఈ అభ్యాసం ఎంత విస్తృతంగా ఉంది? లక్షలాదిమంది పిల్లలు ఇందులో ఉన్నారు—నిజానికి, కోట్లాదిమంది పిల్లలు ఉన్నారని కొంతమంది చెబ్తారు. ఒక ప్రతినిధి సమస్యను సంక్షిప్తపర్చి ఇలా చెప్పింది: “పిల్లలు లైంగిక, ఆర్థిక సరుకుల్లా అమ్మబడుతున్నారూ, కొనబడుతున్నారు. వారు నిషిద్ధ సరుకులకుమల్లే దేశాలలోనూ, సరిహద్దుల మీదుగానూ రవాణా చేయబడుతున్నారు, వేశ్యా గృహాల్లో బందీలుగా చేయబడుతున్నారు, లైంగిక అత్యాచారం చేసే అనేకానేకులకు లోబడేలా బలవంతపెట్టబడుతున్నారు.”
ఈ సమావేశంలో తన తొలి మాటల్లో స్వీడన్ ప్రధానమంత్రి యోరన్ పెర్సన్, “నేరాల్లోనే అత్యంత నికృష్టమైనది, అత్యంత పాశవికమైనది, హేయమైనది” అని ఈ అత్యాచారంపై ముద్రవేశాడు. ఐక్యరాజ్య సమితి ప్రతినిధి ఒకరు, ఇది “పిల్లలపై అన్ని కోణాలనుండి దాడిచేయడం . . . , పూర్తిగా నీచమైనది, మానవ హక్కుల సంబంధంగా ఊహించలేనటువంటి అత్యంత తుచ్ఛమైన ఉల్లంఘన” అని చెప్పింది. దాని పరిధి, స్వభావం, కారకాలు, ప్రభావాలు వంటివి ఎంతగా ఉన్నాయో పరిగణించబడుతుండగా, కాంగ్రెస్ జరుగుతున్నంత సేపూ వేదికమీదినుండి పిల్లలపై లైంగిక అత్యాచారాల విషయమై ఆగ్రహావేశాలతో కూడిన అలాంటి వ్యక్తీకరణలు అనేకం వినవచ్చాయి.
ఒక సమాచార మూలం చెప్పినట్లుగా, “దాని పరిధి అంతర్జాతీయమైనది, దాని ప్రభావం తరతరాలకూ ఉంటుంది.” మరొకటి ఇలా అంటుంది: “మల్టీక్రోర్ డాలర్ల చట్టవిరుద్ధ సెక్స్ మార్కెట్లోకి ప్రతి సంవత్సరం పదిలక్షలమంది పిల్లలు ప్రవేశిస్తున్నట్లు అంచనా వేయబడుతుంది.” దీని పరిణామం? “పిల్లల గౌరవం, గుర్తింపు, ఆత్మాభిమానం క్షీణిస్తుంది, వారి నమ్మకం సన్నగిల్లిపోతుంది. వారి శారీరక, భావోద్రేక ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది, వారి హక్కులు ఉల్లంఘించబడతాయి, వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారౌతుంది.”
కొన్ని కారకాలు
ఈ సమస్య ఇంతగా పెచ్చుపెరిగిపోయేలా చేసిన కొన్ని కారకాలు ఏమిటి? కొంతమంది పిల్లలు “వీధుల్లో బ్రతకడానికి ఒక మార్గంగానో, పరిస్థితులవల్లో, తమ కుటుంబాలకు మద్దతునివ్వడంలో సహాయం చేయడానికో లేక బట్టలకూ ఇంట్లో సరుకులకూ డబ్బు చెల్లించడానికో వేశ్యావృత్తిలోనికి నెట్టబడుతున్నారు. వాణిజ్య ప్రకటనల్లో ప్రజలు వినిమయ వస్తువులను కల్గివుండడంలో ఆనందాన్ని అనుభవిస్తున్నారని ప్రదర్శించడంతో ఇతర పిల్లలు ప్రలోభంలో పడిపోతున్నారు” అని చెప్పబడుతుంది. మరితరులు అపహరించబడి వేశ్యావృత్తిలోకి బలవంతంగా నెట్టబడుతున్నారు. అన్నిచోట్లా నైతిక విలువలు తీవ్రగతిన కొట్టుకుపోవడం, దాంతోపాటు సాధారణంగావున్న నైరాశ్యావాదం వంటివి కారకాల్లో ఉన్నట్లు పేర్కొనబడుతున్నాయి.
చాలామంది అమ్మాయిలూ అబ్బాయిలూ ఇంట్లో హింసలు, వావివరుసలు తప్పి వ్యభిచారం జరగడంవంటి కుటుంబ దుర్వ్యవహారాల మూలంగా వీధుల్లోపడి సెక్స్ వాణిజ్యంలో కూరుకుపోతున్నారు. అక్కడ, వారు శిశుకాముకులచే మరితరులచే, చివరికి కొంతమంది పోలీసుల చేతిలో కూడా అత్యాచారానికి గురయ్యే ప్రమాదంలో ఉన్నట్లు అనిపిస్తోంది. ఈ సమస్యపైన అద్దెకు పిల్లలు (ఆంగ్లం) అనే పేరుతో ఒక రిపోర్టు బ్రెజిల్‌లోని ఆరు సంవత్సరాల వయస్సున్న కాట్యా గురించి చెబుతుంది. ఆమెను ఒక పోలీసు పట్టుకుని, అసభ్యకరమైన చేష్టలు ప్రదర్శించమని బలవంతపెట్టాడు, తన పై అధికారికి దీని గురించి ఆ అమ్మాయి చెబితే ఆమె కుటుంబాన్నంతటినీ చంపేస్తానని బెదిరించాడు. తరువాతి రోజు మరి ఐదుగురిని వెంటబెట్టుకొచ్చాడు, ఆ అమ్మాయి అదే లైంగిక సేవ తామందరికొరకు చేయాలని వారు కోరారు.
స్వీడన్‌లోని ఒక సంస్థ అయిన చిల్డ్రన్స్ ఓమ్బడ్స్మన్ ప్రతినిధులకు ఇలా చెప్పింది: “పిల్లల వ్యభిచారానికి కారకమయ్యేది ఏమిటనేదానిపై అధ్యయనాలు చేసినప్పుడు, [సెక్స్] పర్యటన ప్రముఖ కారకాలలో ఒకటనడంలో ఏ సందేహమూ లేదు.” ఒక నివేదిక ఇలా చెప్పింది: “గత పది సంవత్సరాల్లో పిల్లల వ్యభిచారం నమ్మశక్యంకాని విధంగా పెరగడానికి అసలు కారణం పర్యటనా వ్యాపారమే. పిల్లల వ్యభిచారం అభివృద్ధిచెందుతున్న దేశాలు అందించే అతి నూతన పర్యాటక ఆకర్షణగా తయారైంది.” యూరప్, అమెరికా, జపాన్, మరితర దేశాలనుండి జరిగే “సెక్స్ పర్యటనలు” వ్యభిచారం చేసే పిల్లలకొరకు ప్రపంచవ్యాప్తంగా గొప్ప డిమాండును సృష్టిస్తున్నాయి. ఒక యూరప్ విమానయాన సంస్థ సెక్స్ పర్యటనలను అభివృద్ధిచేయడానికి లైంగికంగా అశ్లీలకరమైన భంగిమలోవున్న ఒక అమ్మాయి కార్టూనును ఉపయోగించింది. ప్రతిసంవత్సరం ట్రావెల్ ఏజెన్సీలు వేలాదిమందికొరకు సెక్స్ పర్యటనలను ఏర్పాటు చేస్తుంటాయి.
కారకాల పొడవైన పట్టికలో క్రొత్త సాంకేతికత ద్వారా పిల్లల-సెక్స్ పరిశ్రమను అంతర్జాతీయంగా అభివృద్ధి చేయడం కూడా ఉంది. ఇంటర్నెట్, దాంతోపాటు మరితర సంబంధిత కంప్యూటర్ టెక్నాలజీలూ పోర్నోగ్రఫీకి అత్యంత పెద్ద ఏకైక మూలంగా తయారయ్యాయని నివేదించబడుతుంది. అదేవిధంగా తక్కువ ఖరీదుచేసే వీడియో పరికరాలు కూడా పిల్లల పోర్నోగ్రఫీ ఉత్పత్తిని సులభతరం చేశాయి.
వారెవరు?
పిల్లలపై లైంగికంగా అత్యాచారం చేసే పెద్దవారిలో చాలామంది శిశుకాముకులే అయివుంటారు. శిశుకాముకునికి పిల్లలంటే వక్రమైన లైంగిక ఆకర్షణ ఉంటుంది. చిల్డ్రన్స్ ఓమ్బడ్స్మన్ ఆఫ్ స్వీడన్ ప్రకారం, “వాళ్లు వయస్సులో పెద్దవారో, కన్నాల్లోంచి తొంగిచూసేవారో లేక భయంకరంగావుండే మగవారో కానవసరం లేదు. ఒక సగటు శిశుకాముకుడు మధ్యవయస్కుడైవుండి చక్కగా చదువుకున్న వ్యక్తి అయివుంటాడు, తరచూ అధ్యాపకునిగానో, వైద్యునిగానో, సంఘ సంస్కర్తగానో పిల్లలతోపాటు పనిచేస్తూ ఉండేవాడైవుంటాడు, లేకపోతే ఒక ప్రీస్టు కూడా అయివుంటాడు.”
ఒక డాక్టరూ, ఆస్ట్రియా దేశీయుడూ అయిన ఒక సెక్స్ పర్యాటకుడు ఫిలిప్పీన్స్‌లోని రోజార్యో అనే, 12 సంవత్సరాల వయస్సున్న ఒక అమ్మాయిపై లైంగిక అత్యాచారం జరిపిన ఒక ఉదాహరణను స్వీడన్ గుంపు ఉటంకించింది. ఆయన చేసిన అత్యాచారం ఆ అమ్మాయి మరణానికి దారితీసింది.
జెనీవాలోవున్న యూనిసెఫ్ (ఐక్యరాజ్య సమితి పిల్లల నిధి) ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు కారల్ బెలామి ఫిలిప్పీన్స్‌కు చెందిన ఆ 12 సంవత్సరాల అమ్మాయి గురించి ఇలా చెప్పాడు: “తరచూ, పిల్లల ఎడల శ్రద్ధవహించి, వారికి సంరక్షణనందించవల్సిన బాధ్యతను కల్గివున్న ఆ పెద్దలే ఈ సహించరాని అభ్యాసాన్ని అనుమతించి కొనసాగిస్తూ ఉంటారు. పిల్లలపై లైంగిక అత్యాచారం చేయడానికి తమ ప్రతిష్ఠనూ అధికారాన్నీ ఉపయోగించేవారిలో అధ్యాపకులూ, ఆరోగ్య కార్యకర్తలూ, పోలీసు అధికారులూ, రాజకీయవేత్తలూ, చర్చిలోని ప్రీస్టులవంటి సభ్యులూ ఉన్నారు.”
మతం ఇమిడివుంది
స్టాక్‌హోమ్ కాంగ్రెస్వద్ద రోమన్ కాథోలిక్ చర్చికి చెందిన ఒక ప్రతినిధి, పిల్లలపై అత్యాచారం చేయడం “నేరాల్లోనే అత్యంత హేయమైనది” అనీ, “విలువలు పూర్తిగా వక్రీకరించబడి, బాగా క్షీణించడం వలన కల్గిన పరిణామం” అనీ ప్రకటించాడు. అయితే, అటువంటి అభ్యాసాలు తన స్వంత ప్రీస్టుల్లోనే కొనసాగడంచేత కాథోలిక్ చర్చి తీవ్రంగా ప్రభావితమౌతోంది.
“అమెరికా కాథోలిక్ చర్చియొక్క ఆధునిక చరిత్రలోనే ప్రీస్టుల సంబంధంగా జరిగిన అత్యంత ఘోరమైన స్కాండల్” గురించి ఆగస్టు 16, 1993 న్యూస్‌వీక్ సంచికలో “ప్రీస్టులూ, అత్యాచారాలు” అనే పేరుతో ఒక శీర్షిక ఇలా నివేదించింది: “అంచనాల ప్రకారం 1982 నుండి 400 మంది ప్రీస్టులకు వ్యతిరేకంగా ఆరోపణలు దాఖలు చేయబడగా, దాదాపు 2,500 మంది ప్రీస్టులు పిల్లల్ని గానీ టీనేజర్లను గానీ లైంగికంగా పీడించి ఉంటారని కొంతమంది చర్చివారు చెబుతారు. . . . ఈ నిందలవల్ల డబ్బు ఖర్చవ్వడంతోపాటుగా చర్చి తీవ్రమైన ఇబ్బందిని ఎదుర్కోవల్సివచ్చింది—దానికున్న నైతిక అధికారంలో కొంత కోల్పోవల్సివచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇతర మతాలూ అదే స్థితిలోనే ఉన్నాయి.
ఇంగ్లాండ్‌లో ఒక సెక్స్-నేర నిపుణుడు రే వైర్, ఇద్దరు అబ్బాయిలపై ఒక ప్రీస్టు పాశవికంగా అత్యాచారం జరిపిన ఉదంతం గురించి స్టాక్‌హోమ్ కాంగ్రెస్‌లో చెప్పాడు. ఆ ఇద్దరు అబ్బాయిల్లో ఒకరు ఇప్పుడు ప్రీస్టుల చేతిలో అత్యాచారానికి బలైన పిల్లల కొరకు ఒక సంస్థను నడుపుతున్నాడు, రెండోవాడు తానే అత్యాచారం జరిపేవాడయ్యాడు.
థాయ్‌లాండ్‌కు చెందిన ఒక బౌద్ధ విద్వాంసుడైన మిడానాన్డు బైకూ, “థాయ్‌లాండ్‌లోని పిల్లలపై లైంగిక అత్యాచారాలు చాలా స్థాయిల్లో జరగడానికి కొన్ని రకాలైన బౌద్ధధర్మ అభ్యాసాలు బాధ్యతవహిస్తాయనీ, థాయ్‌లాండ్‌లోని గ్రామాల్లో వేశ్యావృత్తిలోనికి బలవంతంగా నెట్టబడ్డ పిల్లలు అక్కడి సంఘానికి తిరిగి ఇచ్చే డబ్బునుండి సన్యాసులు కొన్నిసార్లు ప్రయోజనం పొందారనీ” నివేదించాడు.
ఏం చేయగలం?
అత్యాచారం చేసేవారు తమ ప్రవర్తనను సమర్థించుకోవడాన్ని సవాలు చేయమని ఇంగ్లాండ్‌లోని లెస్టర్ యూనివర్సిటీకి చెందిన డా. జూల్యా ఓకానల్ డేవిడ్సన్ కాంగ్రెస్‌కు పిలుపునిచ్చింది. అత్యాచారం చేసేవారు తరచూ పిల్లవాడు అప్పటికే మలినమై ఉన్నాడని, పాడైపోయినవాడని వాదిస్తూ, ఆ పిల్లలు లైంగికంగా నీతిబాహ్యమైనవారనే, అనైతికమైనవారనే తప్పుడు భావనపై దృష్టిని కేంద్రీకరిస్తారు. అత్యాచారం చేసే ఇతరులు తమ చర్యలవలన పిల్లలకు ఏ హానీ సంభవించదనీ, పిల్లలకు ప్రయోజనం కలుగుతుందనీ వక్రమైన, అబద్ధమైన తర్కాన్ని ఉపయోగిస్తారు.
సెక్స్ పర్యటనను ఎదుర్కునే ఒక పానెల్, స్కూలు పాఠాల్లో బోధించడంద్వారా దానిని ఎదుర్కోవడాన్ని సిఫారసు చేసింది. దానికితోడు, తమ పర్యటన అంతటిలో—ప్రయాణానికి ముందు, ప్రయాణంలోనూ, గమ్యస్థానంలోనూ పిల్లలపై లైంగిక అత్యాచారాలకు వ్యతిరేకంగా ఉన్న సమాచారం పర్యాటకులకు చేరాలి.
క్రొత్త కమ్యూనికేషన్ టెక్నాలజీల గురించి ఒక పానెల్, పిల్లలను అత్యాచారానికి గురిచేయడానికి సంబంధించిన సమాచారాన్ని నిర్మూలించడానికి నిర్దేశకాలను అన్ని దేశాలకు అందజేయాలని సూచించింది. ఈ రంగంలో కార్యకలాపాలను సమన్వయపర్చడానికి ఏకైక అంతర్జాతీయ సంస్థను ఒకదాన్ని స్థాపించడాన్ని పరిశీలించడం జరిగింది. మరొక పానెల్ కంప్యూటర్ సంబంధిత పిల్లల పోర్నోగ్రఫీనీ కలిగి ఉండడాన్ని సాధారణంగా అన్ని దేశాల్లోనూ నేరాపరాధాలుగా పరిగణించాలని, చట్ట ప్రకారం శిక్షించాలని సిఫారసు చేసింది.
తలిదండ్రులు ఏమి చేయగలరు? ప్రచార మాధ్యమాల పాత్రను పరిశీలిస్తున్న ఒక పానెల్ తలిదండ్రులు తమ పిల్లల్ని కాపాడే బాధ్యతను తీసుకోవాలని సూచించింది. అదిలా చెబుతుంది: “తమ పిల్లలు ప్రచార మాధ్యమాలను వినియోగించుకోవడం మొదలుపెట్టేవారిగా అభివృద్ధిచెందుతుండగా తలిదండ్రులు వారికి నిర్దేశనాన్నివ్వవచ్చు. అంతేగాక పిల్లవాడు వివేచనలో అభివృద్ధిచెందడానికి సహాయంచేస్తూ ప్రచార మాధ్యమాల ప్రభావాన్ని సమతూకం చేయడానికై సమాచార మూలాల వివరణ గురించీ, వాటి విస్తృతి గురించీ అదనపు సమాచారాన్ని కూడా అందించాలి.”
స్వీడన్‌లోని ఒక టీవీ కార్యక్రమం ఈ కాంగ్రెస్‌ని గురించి నివేదిస్తూ, తలిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవల్సిన అవసరతనూ, ప్రమాదాలను గురించి వారిని హెచ్చరించాల్సిన అవసరతనూ నొక్కిచెప్పింది. అయితే, అది ఇలా సలహా ఇచ్చింది: “పిల్లలను కేవలం ‘చెడ్డవాడైన ముసలి వారిని’ గురించి హెచ్చరించడం మాత్రమే చేయవద్దు, ఎందుకంటే పిల్లలు . . . ఆ విధంగా తాము కేవలం వయస్సులో పెద్దవారైన, మురికివారైన వ్యక్తుల విషయంలో మాత్రమే జాగ్రత్తగా ఉండాలని వారనుకుంటారు, కానీ అటువంటి నేరాలు చేసేది చక్కని బట్టలను ధరించి లేక నీటైన సూటు ధరించే వ్యక్తి అయివుంటాడు. అందుకని, వారిపట్ల అసాధారణమైన ఆసక్తిని ప్రదర్శించే అపరిచితుల గురించి వారిని హెచ్చరించండి.” తమకు తెల్సినవారితో సహా ఎవరైనా సరే అనుచితంగా ప్రవర్తించడం మొదలుబెట్టేవారి గురించి కూడా పిల్లలను హెచ్చరించాలి—వారి గురించి అధికారులకు రిపోర్టు చేయాలని కూడా పురికొల్పాలి.
ఏకైక పరిష్కారం
పిల్లలపై లైంగిక అత్యాచారాలను కలుగజేసే కారకాలను ఎలా నివారించాలన్నది స్టాక్‌హోమ్ కాంగ్రెస్ సూచించలేకపోయింది. కారకాలు ఇవీ: ప్రతిచోటా తీవ్రగతిన కొట్టుకుపోతున్న నైతిక విలువలు; పెరిగిపోతున్న స్వార్థమూ, వస్తు సంపత్తిపట్ల వాంఛ; ప్రజలను అన్యాయాలనుండి రక్షించడానికి చేయబడిన చట్టాలపట్ల పెరిగిపోతున్న అగౌరవం; ఇతరుల మంచీ, మర్యాదలపట్లా, వారి జీవితాలపట్లా పెరిగిపోతున్న ఉదాసీనత; కుటుంబ వ్యవస్థ తీవ్రగతిన విచ్ఛిన్నమవ్వడము; జనాభా పెరుగుదల, నిరుద్యోగం, నగరీకరణ, వలసపోవడం వంటి కారణాలవల్ల విస్తృతమౌతున్న బీదరికం; విదేశీయులపట్లా, కాందిశీకులపట్లా పెరిగిపోతున్న జాతివిద్వేషం; నిరంతరంగా పెరిగిపోతున్న మాదకద్రవ్యాల ఉత్పాదనా, వాటి రవాణా; భ్రష్టమైన మత దృక్కోణాలూ, అభ్యాసాలూ, ఆచారాలు.
పిల్లలపై లైంగిక అత్యాచారం నిర్ఘాంతపర్చే అంశంగా ఉన్నప్పటికీ, బైబిలును జాగ్రత్తగా చదివేవారికి అది అంత ఆశ్చర్యకరమైందేం కాదు. ఎందుకలా? ఎందుకంటే మనం ఇప్పుడు “అంత్యదినముల”ని బైబిలు పిలిచే కాలంలో జీవిస్తున్నాము మరి, దేవుని వాక్యం ప్రకారం ప్రస్తుతం “అపాయకరమైన కాలములు” ఉన్నాయి. (2 తిమోతి 3:1-5, 13) కాబట్టి నైతిక విలువలు అంతకంతకూ దిగజారిపోతుండడంలో ఆశ్చర్యమేమైనా ఉందా?
అయినప్పటికీ, ప్రపంచంలోని గొప్ప సమస్యలకన్నింటికీ బైబిలు సూచిస్తున్న ఒకే ఒక్క పరిష్కారం—సర్వశక్తిమంతుడైన దేవుడు పూర్తిగా శుభ్రం చేయడం. త్వరలోనే ఆయన తన శక్తిని ప్రదర్శించి, తన నీతియుక్త సూత్రాలకూ, నియమాలకూ బద్ధులుకాని వారిని నిర్మూలిస్తాడు: “యథార్థవంతులు దేశమందు నివసించుదురు. లోపములేనివారు దానిలో నిలిచియుందురు. భక్తిహీనులు దేశములో నుండకుండ నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలోనుండి పెరికివేయబడుదురు.”—సామెతలు 2:21, 22; 2 థెస్సలొనీకయులు 1:6-9.
“పెరికివేయ”బడేవారిలో పిల్లలను వేశ్యలుగా తయారుచేసేవారూ, పిల్లలను దుర్వినియోగంచేసేవారందరూ ఉంటారు. దేవుని వాక్యం ఇలా చెబుతుంది: “జారులైనను . . . వ్యభిచారులైనను . . . పురుష [లేక బాలుర] సంయోగులైనను . . . దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.” (1 కొరింథీయులు 6:9, 10) అదింకా, “అసహ్యులును . . . వ్యభిచారులును . . . రెండవ మరణము”నకు—నిత్య నాశనానికి అప్పగించబడతారని జతచేస్తుంది.—ప్రకటన 21:8.
దేవుడు భూమిని పరిశుభ్రపర్చి, ఒక పూర్తి క్రొత్తదైన న్యాయమైన విధానాన్ని, ‘క్రొత్త ఆకాశములను, క్రొత్త భూమిని’ ప్రవేశపెడ్తాడు. (2 పేతురు 3:13) అప్పుడు, ఆయన రూపొందించే ఆ నూతన లోకంలో భ్రష్టులైన ప్రజలు, వక్రమైన ప్రజలు ఇక ఎన్నటికీ అమాయకులను వేధించరు. అమాయకులు బాధితులమౌతామని ఇకెన్నడూ భయపడాల్సిన పనిలేదు, ఎందుకంటే వారు “ఎవరి భయములేకుండ” ఉంటారు.—మీకా 4:4.
[12వ పేజీలోని చిత్రం]
“నేరాల్లోనే . . . అత్యంత పాశవికమైనది, హేయమైనది.”—స్వీడన్ ప్రధానమంత్రి
[13వ పేజీలోని చిత్రం]
“ప్రతివారం ఒక కోటినుండి 1.2 కోట్ల పురుషులు యౌవన వేశ్యలను కలుస్తుంటారు.”—ది ఎకానమిస్ట్, లండన్
[14వ పేజీలోని చిత్రం]
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పిల్లలపై అత్యాచారాలకు సెక్స్ పర్యటన ప్రధాన కారకంగా ఉంది
[13వ పేజీలోని బాక్సు]
సెక్స్ పర్యటన—ఎందుకు?
(పర్యాటకులు పిల్లలతో సెక్స్‌లో ఎందుకు పాల్గొంటారన్నదానికి కొన్ని కారణాలు)
(1) అజ్ఞాతంగా ఉండగల్గడం పర్యాటకుడిని ఇంట్లో ఉండే సాంఘిక కట్టుబాట్లనుండి విముక్తం చేస్తుంది
(2) స్థానిక భాష కాస్తంత మాత్రమే తెలిసి ఉండడం, లేకపోతే అసలే తెలియకపోవడం వలన, పర్యాటకులు పిల్లవానితో సెక్స్‌లో పాల్గొనడానికి డబ్బు చెల్లించడం అనేది అంగీకృతమైందనో లేక బీదరికంలో ఉన్న పిల్లలకు సహాయం చేయడానికైన ఒక మార్గం అనో నమ్మడానికి నడిపిస్తుంది
(3) జాతివాద వైఖరులు, తమకంటే నిమ్నజాతికి చెందినవారని తాము పరిగణించేవారిపై సందర్శకులు అత్యాచారం జరిపేలా చేస్తాయి
(4) అభివృద్ధిచెందుతున్న దేశాల్లో లైంగిక సేవలు చౌకగా అందడం చూసి తాము ధనవంతులమని పర్యాటకులు భావిస్తారు
[15వ పేజీలోని బాక్సు]
సమస్యయొక్క ప్రపంచవ్యాప్త పరిధి
(ఈ క్రింది అంచనాలు వివిధ ప్రభుత్వ అధికారాలూ, సంస్థలూ వేసినవి)
అమెరికా: 1,00,000 కన్నా ఎక్కువమంది పిల్లలు ఇందులో ఉన్నారని అధికారిక మూలాలు చెబుతున్నాయి
ఇండియా: 4,00,000 మంది పిల్లలు సెక్స్ పరిశ్రమలో ఉన్నారు
కెనడా: యౌవనారంభంలో ఉన్న వేలాదిమంది అమ్మాయిలు సంస్థీకృత వేశ్యా గ్యాంగులచే వేశ్యలుగా చేయబడుతున్నారు
కొలంబియా: బొగోటా వీధుల్లో లైంగిక అత్యాచారం చేయబడ్డ పిల్లల సంఖ్య గత ఏడేళ్లలో ఐదురెట్లయ్యింది
చైనా: వేశ్యలుగా చేయబడిన 2,00,000 నుండి 5,00,000 మంది పిల్లలు. ఇటీవలి సంవత్సరాలలో దాదాపు 5,000 మంది చైనా అమ్మాయిలు సరిహద్దు దాటించబడతారని ప్రలోభపెట్టబడి, మ్యాన్మార్లో వేశ్యలుగా అమ్మివేయబడ్డారు
తూర్పు యూరప్: 1,00,000 మంది వీధి పిల్లలు. చాలామంది పశ్చిమ యూరప్‌లోని వేశ్యా గృహాలకు పంపించివేయబడ్డారు
తైవాన్: 30,000 పిల్లలు ఇందులో ఉన్నారు
థాయ్‌లాండ్: 3,00,000 మంది పిల్లలు ఇందులో ఉన్నారు
ఫిలిప్పీన్స్: 40,000 మంది పిల్లలు ఇందులో ఉన్నారు
బ్రెజిల్: కనీసం 2,50,000 మంది బాల వ్యభిచారులు
మొజాంబిక్: ఐక్యరాజ్య సమితికి చెందిన శాంతిపరిరక్షక దళాలు పిల్లలపై లైంగిక అత్యాచారాలు చేశాయని సహాయక సంస్థలు ఆరోపించాయి
మ్యాన్మార్: ప్రతిసంవత్సరం 10,000 మంది అమ్మాయిలూ, స్త్రీలూ థాయ్‌లాండ్‌లోని వేశ్యా గృహాలకు రవాణా చేయబడుతున్నారు
శ్రీలంక: 6 నుండి 14 సంవత్సరాల మధ్యనున్న 10,000 మంది పిల్లలు వేశ్యా గృహాల్లో బానిసలుగా చేయబడ్డారు, 10 నుండి 18 సంవత్సరాల మధ్యనున్న మరి 5,000 మంది స్వతంత్రంగా పర్యాటక కేంద్రాల్లో పనిచేస్తున్నారు