కొన్ని ప్రసిద్ధమైన తోటలు
పరదైసుతో మానవుని అనుభవం ఏదెను అని పిలువబడే ప్రాంతంలోవున్న తోటలో ప్రారంభమైంది. ఇది బహుశ ఆధునిక టర్కీలోని లేక్ వాన్ దగ్గర ఉండివుండవచ్చు. నాలుగు పాయలైన ఒక నది ఆదాము హవ్వలకొరకు ఆ తోటను తడిపింది. దానిని “సేద్యపరచుటకును దాని కాచుటకును” వారు ఆ తోటలో ఉంచబడ్డారు. “చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షము”తో సమృద్ధిగా ఉన్న తోటను పెంచడం ఎంతటి ఆహ్లాదకరమైన పని!—ఆదికాండము 2:8-15.
ఏదెను ఒక పరిపూర్ణమైన గృహం. ఆదాము హవ్వలూ, వారి వంశస్థులూ దాని సరిహద్దులను విస్తరించవలసి ఉన్నారు, దేవుని సుందరమైన తోటను నమూనాగా ఉపయోగిస్తూ వారలా చేయాలన్నది స్పష్టమే. కాలక్రమేణ భూమి అంతా సరియైన మొత్తంలో ప్రజలతో నింపబడిన ఒక పరదైసుగా అయ్యేది. కానీ మన మొదటి తలిదండ్రుల మనఃపూర్వక అవిధేయత వారు ఈ పవిత్ర స్థలంనుండి వెళ్లగొట్టబడడానికి దారితీసింది. విషాదకరంగా, మానవ కుటుంబంలోని ఇతరులందరూ ఏదెనులోని ఈ గృహం వెలుపల జన్మించారు.
ఏదేమైనా, మానవజాతి పరదైసులో జీవించేందుకు సృష్టికర్తచే రూపనిర్మాణం చేయబడింది. అందుకని భవిష్యత్ తరాలు దాని ప్రతిరూపాన్ని తయారుచేసుకుని అందులో ఉండడానికి ప్రయత్నించడం సహజమే.
తొలి తోటలు
హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలోన్ ప్రాచీన ప్రపంచంలోని వింతల్లో ఒకటిగా వినుతికెక్కింది. తన స్వదేశంలోని అడవుల కొరకూ, పర్వతాల కొరకూ పరితపించిన తన మాదీయ భార్య కొరకు నెబుకద్నెజరు రాజు 2,500 కంటే ఎక్కువ సంవత్సరాల క్రితం వాటిని నిర్మించాడు. 22 మీటర్ల ఎత్తుతో విల్లు ఆకారంలోని కమానులతో ఉన్న ఈ మెట్లవంటి నిర్మాణంలో చెట్లు సమృద్ధిగా నాటబడ్డాయి, పెద్ద వృక్షాలను పోషించడానికి కూడా దీనిలో సరిపడేంత మట్టి ఉంది. ఇంటిబెంగతో ఉన్న రాణి మెట్లవంటి నిర్మాణంతో ఉన్న ఈ ఏదెనులాంటి ప్రాంతంలో తిరుగుతూ బహుశ ఓదార్పునుపొంది ఉంటుంది.
ఈజిప్ట్‌లోని సారవంతమైన నైలు లోయలో ప్రకృతిని అనుకరించి వేసే తోటలు ప్రాముఖ్యంగా ఉండేవి. “ప్రపంచంలోని చాలా పురాతనమైన తోటల చిత్రాలు ఈజిప్ట్‌లోనే లభిస్తాయి, అంతేగాక తోటల పెంపక సాంప్రదాయపు అసాధారణమైన సుదీర్ఘ . . . చరిత్రకు మూలస్థానం అదే” అని ది ఆక్స్ఫర్డ్ కంపానియన్ టు గార్డన్స్ అంటుంది. థీబీజ్వద్ద దాదాపు సా.శ.పూ. 1,400కు చెందిన ఒక తోట ప్లానులో కొలనులూ, అటూ ఇటూ చెట్లున్న వీధులూ, మంటపాలూ ఉన్నాయి. ఇది థీబిజ్లోని ఒక ఈజిప్ట్ అధికారికి చెందినది. రాచ తోటల తర్వాత దేవాలయ తోటలే మహా విలాసవంతమైన తోటలుగా ఉండేవి. ఈ తోటల్లో నీటి పక్షులూ, చేపలూ, తామరపూలూ నిండివున్న కొలనులూ సరస్సులూ ఉండేవి. వీటినుండి కాలువలు ప్రవహించి చెట్లతోపుల్నీ, పూలనూ, ఓషధి మొక్కలనూ తడిపేవి.—నిర్గమకాండము 7:19 పోల్చండి.
పర్షియన్లు కూడా తోటల ప్రపంచంలో తొలిసారిగా చెరగని ముద్రను వేశారు. పర్షియా, ఈజిప్ట్‌లలోని తోటలు ఎంత ఆకర్షణీయంగా ఉండేవంటే సా.శ.పూ. నాలుగవ శతాబ్దంలో అలెగ్జాండర్ ది గ్రేట్యొక్క గెలుపొందుతున్న సైన్యాలు గ్రీసుకు తిరిగివచ్చినప్పుడు విత్తనాలూ, మొక్కలూ, వాటిని గూర్చిన పథకాలూ వంటివాటిని ఎన్నింటినో తీసుకుని వచ్చాయి. ఏథెన్సులో, అరిస్టాటిల్ ఆయనతోపాటూ ఆయన విద్యార్ధి థీయోఫ్రేస్టస్ కల్సి సంఖ్యాపరంగా పెరుగుతున్న మొక్కలను సమకూర్చి అధ్యయనం చేయడానికీ, మొక్కలను వర్గీకరించడానికీ ఒక బొటానికల్ గార్డెన్‌ను స్థాపించారు. వారికిముందున్న ఈజిప్షియన్ల దగ్గరా, పర్షియన్ల దగ్గరా ఉన్నట్లే చాలామంది సంపన్నులైన గ్రీకుల దగ్గరా చెట్లు పుష్కలంగా ఉన్న తోటలు ఉన్నాయి.
రోమ్ నగర నివాసులు ఆ నగరంలోని కొద్దిపాటి స్థలంలోనే ఇండ్లనూ తోటలనూ మేళవించి కట్టుకునేవారు. సంపన్నులు గ్రామసీమల్లోని తమ భవంతులవద్ద కళ్లు చెదిరిపోయేలాంటి తోటలను ఆహ్లాదంకొరకు సృష్టించుకున్నారు. నిరంకుశుడైన నీరోకు కూడా తన స్వంత ఏదెను కావల్సివచ్చింది, అందుకని ఆతగాడు కనికరం లేకుండా వందలకొలది కుటుంబాలను ఖాళీ చేయించి, వారి ఇండ్లను కూలగొట్టించి తన రాజభవనం చుట్టూరా 125 ఎకరాలకుపైగా ఉన్న వైశాల్యంలో తన కొరకు వ్యక్తిగతంగా ఒక ఉద్యానవనాన్ని సృష్టించుకున్నాడు. తర్వాత, దాదాపు సా.శ. 138లో టివలీలోవున్న చక్రవర్తి హేద్రియన్కు చెందిన విల్లాతో రోమా లాండ్‌స్కేపింగ్ దాని అత్యుచ్ఛస్థాయికి చేరుకుంది. ఈ విల్లాలో 600 ఎకరాల వైశాల్యంలో ఉద్యానవనాలూ, చెరువులూ, సరస్సులూ, ఫౌంటైన్లూ ఉన్నాయి.
ప్రాచీన ఇశ్రాయేలీయులకు కూడా తోటలూ, ఉద్యానవనాలూ ఉండేవి. యూదా చరిత్రకారుడు జోసీఫస్ యెరూషలేమునుండి దాదాపు 13 నుండి 16 కిలోమీటర్ల దూరంలోవున్న ఈటమ్ అనే ఒక ప్రాంతంలో ఎన్నో ఏర్లున్న ఆహ్లాదకరమైన ఉద్యానవనాల గురించి వ్రాశాడు. సొలొమోను ‘తన కొరకు వేయించుకున్నాడని’ బైబిలు చెబుతున్న ‘తోటలూ, వనములూ, చెరువులూ, అడవులూ’ వంటివాట్లో ఈ ఈటమ్ ఉద్యానవనాలు చేరివుండవచ్చు. (ప్రసంగి 2:5, 6) యెరూషలేము వెలుపల ఒలీవల కొండమీద, యేసుక్రీస్తు వలన ఖ్యాతికెక్కిన గెత్సేమనే తోట ఉంది. ఇక్కడ, యేసు తన శిష్యులకు ప్రశాంతంగా బోధించడానికి ఒక చక్కని స్థలంగా ఉన్నట్లు కనుగొన్నాడు.—మత్తయి 26:36; యోహాను 18:1, 2.
అరబ్ తోటల నుండి ఇంగ్లీషు తోటలకు
అరబ్ సైన్యాలు సా.శ. ఏడవ శతాబ్దంలో తూర్పూపడమరలకు విస్తరించినప్పుడు అలెగ్జాండర్‌కు మల్లే వారికి పర్షియా తోటలు ఎదురయ్యాయి. (ఎస్తేరు 1:5 పోల్చండి.) “పర్షియాలోని తోటలు ఖురాన్లో విశ్వసనీయులకు వాగ్దానం చేయబడిన పరదైసుకు చాలా సమాంతరంగా ఉన్నట్లు అరబ్‌లు కనుగొన్నారు” అని హోవర్డ్ లాక్స్‌టన్ వ్రాస్తున్నాడు. మూర్లక్రింద ఉన్న స్పెయిన్నుండి మొదలుకొని కాశ్మీరు వరకూ ఉన్న అరబ్ తోటల్లో ఒక సగటు తోట పర్షియా తోట నమూనాలానే, ఏదెనులోని నాలుగు నదులను గుర్తుకుతెస్తూ నాలుగు ఏరులతో నాలుగు భాగాలుగా విభజించబడివుంటుంది, ఈ నాలుగు ఏరులు ఒక చెరువునుండి గానీ లేక ఒక నీటి ఊటనుండి గానీ బయలుదేరతాయి.
ఉత్తర భారతదేశంలో, 17వ శతాబ్దపు మొఘల్ పరిపాలకులు సుందరమైన కాశ్మీరు లోయలోని డాల్ సరస్సుకు ఆనుకుని 700కుపైగా పరదైసును తలపించే తోటలను నాటారు. చిత్రకారుని వర్ణఫలకంలోని కాంతులీనుతున్న రంగుల్లా, అక్కడక్కడ వందలకొలది నీటి ఊటలూ, టెర్రస్లూ, జలపాతాలూ ఈ తోటలను అలంకరించాయి. డాల్ సరస్సు ఒడ్డున షాజహాన్ (తాజ్‌మహల్ నిర్మాణకుడు) కట్టించిన నల్ల చలువరాతి మంటపంమీద ఇప్పటికీ ఈ అభిలేఖనం ఉంది: “ఈ భూతలంపైన ఎక్కడైనా పరదైసు అంటూ ఉందంటే, అది ఇక్కడే ఉంది, అది ఇక్కడే ఉంది, అది ఇక్కడే ఉంది.”
దీనికి కొన్ని శతాబ్దాల ముందు, యూరప్ మధ్య యుగాలనుండి 14వ శతాబ్దపు పునర్జాగరణోద్యమంలోనికి ప్రవేశించింది. మధ్య యుగం ప్రారంభమైన సా.శ. ఐదవ శతాబ్దం కాలంలో కాళ్లక్రింద నలగద్రొక్కబడిన రోమా తోటల సాంప్రదాయం మరోసారి నిలద్రొక్కుకోనారంభించింది—ఈసారి చర్చి పరిపాలన క్రింద. క్రైస్తవమత సామ్రాజ్యం తోటను ఒక ‘తాత్కాలిక పరదైసు’గా దృష్టించింది. క్రైస్తవ సన్యాసుల మఠానికి చెందిన ఒక తొమ్మిదవ శతాబ్దపు ప్లాను, “పరదైసు” అని పేరు పెట్టబడిన రెండు తోటలను చూపిస్తోంది. త్వరలోనే క్రైస్తవమత సామ్రాజ్యపు తోటలు మరింత పెద్దవిగానూ, మరింత వైభవోపేతంగానూ తయారయ్యాయి, కానీ ఆధ్యాత్మిక ఆదర్శాలను ప్రతిబింబించడానికి బదులుగా వాటిలో అనేకం అధికారానికి, సంపదకు చిహ్నాలుగా మారిపోయాయి.
ఫ్రాన్స్‌కు చెందిన ఛార్లెస్ VIII 1495లో ఇటలీలోని నేపుల్స్ను జయించినప్పుడు తన ఇంటికిలా వ్రాశాడు: “ఈ నగరంలో నాకున్న తోటలు మీరూహించలేనంత అందమైనవి . . . దీన్ని భూ పరదైసుగా చేసేందుకు కేవలం ఆదాము హవ్వలు మాత్రమే తక్కువయ్యారనిపిస్తోంది.” కానీ ఛార్లెస్ 17వ శతాబ్దం వరకూ జీవించివుంటే ఫ్రాన్స్ గడ్డపై కింగ్ లూయీ XIVకి చెందిన విస్తారమైన తోటలను చూసుండేవాడు. ప్యాలస్ ఆఫ్ వర్సైలోని తోటలు “ప్రపంచంలోని అత్యంత పెద్దవని, వైభవోపేతమైనవని ఇప్పటికీ క్లెయిం చేయవచ్చు” అని ద గార్డన్ అనే పుస్తకం నొక్కిచెబుతుంది.
అయితే పునర్జాగరణోద్యమం పరదైసుకు ఒక సరిక్రొత్త నిర్వచనం ఇచ్చింది: ప్రకృతి జ్ఞానవంతుడైన మానవుని అదుపాజ్ఞల్లో ఉండాలి. అతడు తోటలోని చెత్తనంతటినీ తీసివేసి దాన్ని అందంగా తీర్చిదిద్దాలి. చెట్లూ, పూలూ అన్నీ కచ్చితమైన జ్యామితీయ లెక్కల ప్రకారం ఏర్పాటు చేయబడి ఉండాలి. ఆ విధంగా, తొలి రోమా టోపియరీ—చెట్లనూ, పొదలనూ కత్తిరిస్తూ వాటిని చక్కని ఆకృతిలోకి మలుస్తూ పెంచే కళ—ఒక విభ్రాంతికరమైన పునరుజ్జీవనానికి వచ్చింది.
తర్వాత, 18, 19 శతాబ్దాల్లో నౌకా సాహసయాత్రలూ, వాణిజ్యమూ పాశ్చాత్య లోకానికి క్రొత్త మొక్కలనూ, తోటలను పెంచే పద్ధతులనూ వెల్లడించాయి. ఇంగ్లాండు తోటల రూపనిర్మాణానికి ప్రాముఖ్యతనివ్వనారంభించింది. “18వ శతాబ్దపు ఇంగ్లాండులో, మనిషి తాను ఒక భాగమైన ప్రకృతి ప్రపంచం గురించి మరింత ఎక్కువగా జ్ఞానం సంపాదించనారంభించాడు. ప్రకృతి ప్రపంచంపై తన మానవ నిర్మిత జ్యామితీయ క్రమాన్ని విధించడానికి బదులుగా ఆయన తన స్వంత జీవితాన్ని దానికి అనుగుణంగా మలుచుకోవడాన్ని పరిగణించడం మొదలుబెట్టాడు” అని ది న్యూ ఎన్సైక్లోపీడియా బ్రిటానికా అంటోంది. విలియమ్ కెంట్, లాన్సలట్ బ్రౌన్ వంటి వ్యక్తులు ప్రకృతిని అనుసరించి తోటలను వేయడంలో ఉత్కృష్టస్థాయికి చేరుకున్నారు. బ్రౌన్ ఇంగ్లాండులో రెండు వందలకన్నా ఎక్కువ ఎస్టేట్ల రూపనిర్మాణం చేశాడు. అమెరికాకు అధ్యక్షులైన ఇద్దరు వ్యక్తులు థామస్ జెఫర్సన్, జాన్ ఆడమ్స్ 1786లో ఇంగ్లీషు తోటలను అధ్యయనం చేయడానికి ఇంగ్లాండులో పర్యటించారు.
ప్రాచ్యంలోని భూతలదృశ్యాలు
పాశ్చాత్య దేశాలకు ఈజిప్ట్, గ్రీస్, రోమ్ తోటల సాంప్రదాయాలు ఎలాంటివో తూర్పు దేశాలకు చైనా తోటల సాంప్రదాయం అలాంటిది. నదులూ, రాళ్లూ, పర్వతాలూ అన్నీకూడా శరీరందాల్చిన ఆత్మలని దృష్టించి, వాటిని గౌరవించాలనే సర్వాత్మవాద మతాన్ని చైనీయులు తొలుత అవలంబించారు. తర్వాత టావోయిజం, కన్ఫ్యూషియానిజం, బౌద్ధమతం ఆ ప్రాంతంలో ఉద్ధృతమై వాటివాటి తోటల రకాలను ఉత్పత్తి చేశాయి.
జపాన్ సముద్రానికి ఆవలివైపున జపాన్ తోటలు తమ స్వంత శైలిని అభివృద్ధి చేసుకున్నాయి, అక్కడ రంగులకన్నా ఆకృతికి ప్రాధాన్యమివ్వబడుతుంది, ప్రతి వస్తువుకూ కచ్చితమైన స్థానం ఉంటుంది. ప్రకృతిలోని సౌందర్యాన్నీ, వైవిధ్యాన్నీ పరిమితమైన ప్రాంతంలో ప్రతిబింబించడానికైన ప్రయత్నంలో తోటమాలి రాళ్లను జాగ్రత్తగా ఉంచుతూ, తన తోటను నైపుణ్యంగా నాటి ఆ మొక్కలను చక్కని ఆకృతిలోకి మలుస్తూ పెంచుతాడు. ఇది, చిన్న చెట్టును లేక బహుశ ఒక చెట్ల తోపును కచ్చితమైన ఆకారంలోనికీ, నిష్పత్తుల్లోనికీ మలుస్తూ పెంచే కళ అయిన బోన్సాయ్లో (“కుండలోని మొక్క” అని అర్థం) స్పష్టంగా కన్పిస్తుంది.
తూర్పు దేశాల్లోని తోటను దాని సమాంతరమైన పాశ్చాత్య తోటతో పోలిస్తే శైలిలో విభిన్నత ఉన్నప్పటికీ కూడా పరదైసుకొరకైన ఆకాంక్షను అది ప్రతిబింబిస్తుంది. ఉదాహరణకు, జపాన్‌లో హేయాన్ కాలంలో (794-1185) తోటమాలులు “భూమిపై పరదైసు” వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నించారని జపాన్ తోటల చరిత్రకారుడు వీబి కవుటర్ట్ వ్రాస్తున్నాడు.
విశ్వవ్యాప్తమైన మక్కువ
చివరికి “సహజ” తోటల్లో—అడవుల్లో, అరణ్యాల్లో, గడ్డిమైదానాల్లో—జీవించే ఆదివాసులతోసహా తోటలంటే మక్కువ విశ్వవ్యాప్తమైపోయింది. బ్రిటానికా “మెక్సికోలోని ఆజ్‌టెక్‌లు, పెరూలోని ఇంకాల” గురించి చెబుతూ, “పాశ్చాత్య దేశాల్లోని తోటల్లానే . . . మెట్లవంటి పర్వతాలూ, చెట్లతోపులూ, ఫౌంటైన్లూ, అలంకృతమైన కొలనులూ వంటివాటితోనున్న విస్తారమైన తోటల గురించి కాంక్విస్టేడోర్లు నివేదించారు” అని అంటుంది.
అవును, నైలుకిరుప్రక్కలా ఉన్న ప్రాచీన చెట్లతోపులూ, తూర్పు దేశాల్లో ప్రకృతిని అనుకరించి వేయబడిన తోటలూ, ఆధునిక నగర పార్కులూ, బొటానికల్ గార్డెన్లూ—ఇవన్నీ ఏమి వెల్లడిస్తున్నాయి? పరదైసు కొరకైన మానవుని వాంఛ. “పరదైసును గూర్చిన బెంగ” కొనసాగుతునే ఉండడాన్ని గమనించి, రచయిత టెర్రీ కొమీటో ఇలా అన్నాడు: “తోటలు ఎటువంటి స్థలాలంటే వాటిలో ఉన్నప్పుడు మనుష్యులు ఇంట్లో ఉన్నట్లు భావిస్తారు.” మరి ‘నా ఇల్లు ఏదెనులోని తోటలా ఉంది’ అని చెప్పడానికి ఏ మానవుడు ఇష్టపడడు? కానీ కేవలం సంపన్నులకు మాత్రమే పరిమితంకాని ఒక భూవ్యాప్త ఏదెను కేవలం కలయేనా? లేక అది భవిష్యద్ వాస్తవమా?
[7వ పేజీలోని చిత్రం]
హ్యాంగింగ్ గార్డన్స్ ఆఫ్ బాబిలోన్ గురించి ఒక చిత్రకారుని భావన
[7వ పేజీలోని చిత్రం]
జపాన్‌లోని ఒక సాంప్రదాయక తోట
[7వ పేజీలోని చిత్రం]
వర్సై, ఫ్రాన్స్
చరిత్రంతటిలో మానవులు పరదైసు కొరకు పరితపించారు
[క్రెడిట్ లైను]
French Government Tourist Office/Rosine Mazin