తోటంటే మనకుండే మక్కువ
రణగొణధ్వనులూ, జీవిత గమనంలోని వేగమూ వంటివాటికి దూరంగా ఉన్న ఒక అందమైన తోటలోని ప్రశాంతతను మీరు ఇష్టపడరా? పచ్చికబయళ్లూ, పూలూ, చల్లని నీడనిచ్చే చెట్లూ, కొలనులూ వంటివాటితో నిశ్శబ్దంగా ఉండే పార్కులకి మీ కుటుంబంతో పిక్‌నిక్‌కి వెళ్లాలనీ, లేకపోతే ఒక స్నేహితునితో అలా సరదాగా వాహ్యాళికి వెళ్లాలనీ మీరు ఇష్టపడరా? అవును, తోట ఎంత సేదదీర్పుగానూ, ఆహ్లాదకరంగానూ, ప్రశాంతంగానూ, చివరికి అస్వస్థతలను నివారించేదిగానూ ఉంటుందో!
కొంతమంది బహుశ సమయం లేకపోవడం వలన తోటను పెంచడానికి అంత సుముఖంగా లేకపోవచ్చు, కానీ మనమందరం తోటలోని రంగులూ, సువాసనలూ, శబ్దాలూ, పండ్లూ అంటే ఎంతో ఇష్టపడతాము. ఆర్కిటెక్టూ, శాస్త్రవేత్తా, న్యాయవాదీ, ఆవిష్కర్తా, అమెరికా అధ్యక్షుడూ అయిన థామస్ జెఫర్సన్‌కు తోటంటే చాలా ఇష్టం. ఆయనిలా వ్రాశాడు: “నాకు భూమిని సాగుచేసేంత ఆహ్లాదకరమైన పని మరొకటి లేదు. . . . నేనిప్పటికీ తోటకు అంకితమయ్యే ఉన్నాను. నేను ముసలివాడినే అయినా, నేను యౌవనుడినైన తోటమాలినే.”
ఆయన దృక్కోణాన్ని అనేకమంది పంచుకుంటున్నారు. ప్రతిసంవత్సరం కోట్లాదిమంది సందర్శకులు ప్రపంచంలోని ప్రసిద్ధిచెందిన తోటలకు వెల్లువలా వస్తూంటారు—వాటిలో, ఇంగ్లాండ్‌లోని క్యూ గార్డెన్స్ (ది రాయల్ బొటానిక్ గార్డెన్స్); జపాన్‌లోని క్యోటో తోటలు; ఫ్రాన్స్‌లోని ప్యాలస్ ఆఫ్ వర్సై తోటలు; అమెరికాలోని పెన్సిల్వేనియాలోవున్న లాంగ్‌వుడ్ గార్డెన్స్ వంటివి పేర్కొనడానికి కేవలం కొన్ని మాత్రమే. వరుసగా చెట్లతోవున్న వీధుల్లో, ఇరుప్రక్కలా ఇళ్లు చక్కగా పేర్చినట్లుగావుండి ఆ ఇళ్ల చుట్టూరా పూపొదలూ, చెట్లూ, ప్రకాశవంతమైన రంగురంగుల పూలూ ఉండే నగర ప్రాంతాలు కూడా చాలా దేశాల్లో ఉన్నాయి—ఇవి ఒక చిన్న పరదైసులా ఉంటాయి.
తోటలు ఆరోగ్యాన్ని పెంపొందించగలవు
మానవులు ప్రకృతికి సమీపంగా ఉన్నప్పుడు వారి ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుందని గమనించడం జరిగింది, ఈ సమీపంగా ఉండడం అనేది కేవలం కిటికీలోనుండి పూలనూ, చెట్లనూ, పొదలనూ, పక్షులనూ చూడడంకన్నా ఎక్కువేమీ కాకపోవచ్చు. ఈ గ్రహింపు న్యూయార్క్ సిటీ హాస్పిటల్ పైకప్పుమీద ఒక తోట వేసేందుకు నడిపించింది. దాన్ని “అద్భుతంగా ఆహ్వానించారు” అని హాస్పిటల్‌లోని ఒక అధికారి అన్నాడు. “అది అటు రోగులకీ ఇటు సిబ్బందికీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసింది. . . . వ్యాధి చికిత్సలో ఇది ఎంతగానో తోడ్పడగలదని మాకు అన్పిస్తుంది.” నిజానికి, ప్రజలు తమ జ్ఞానేంద్రియాలతో ప్రకృతిని ఆస్వాదించడం ద్వారా శారీరకంగానూ, మానసికంగానూ, భావోద్రేకపరంగానూ ప్రయోజనం పొందగలరని అధ్యయనాలు చూపిస్తున్నాయి.
దానికితోడు, ఆధ్యాత్మిక చింతనగల వ్యక్తి దేవుని హస్త కృత్యాల మధ్య ఉన్నప్పుడు తాను ఆయనకు మరింత దగ్గరగా ఉన్నట్లు భావిస్తాడు. తోటకున్న ఈ విశేష్యం భూమి మీది మొట్టమొదటి తోట అయిన ఏదెను తోటలో కనపడుతుంది. అక్కడ దేవుడు మొట్టమొదట మానవునితో సంభాషించాడు.—ఆదికాండము 2:15-17; 3:8.
తోటమీదున్న మక్కువ విశ్వవ్యాప్తమైనది. మరి ఇది మనం చూడబోయే విధంగా విశేషమైనది. అయితే, ఆ లక్షణాన్ని గురించి చర్చించేముందు, పరదైసు కొరకు ప్రజలందరూ తమ హృదయాల్లో నిజంగా ఎంతగా పరితపించారో చూడడానికి చరిత్రలోని కొన్ని తోటలగుండా “నడువమని” మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.