కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g97 4/8 పేజీలు 19-21
  • ఏడిపిస్తే ఏమిటి హాని?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఏడిపిస్తే ఏమిటి హాని?
  • తేజరిల్లు!—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఏడిపించేవాడంటే ఏమిటి?
  • ఏడిపించేవారిగా చేసేది
  • జీవితాంతం ఉండే పర్యవసానాలు
  • ఎలా మారాలి
  • నన్ను ఎవరైనా ఏడిపిస్తుంటే నేనేం చేయాలి?
    యువత అడిగే ప్రశ్నలు
  • స్కూల్లో నన్ను ఎవరైనా ఏడిపిస్తుంటే నేనేం చేయాలి?
    యువత అడిగే 10 ప్రశ్నలకు జవాబులు
  • నా పిల్లల్ని ఎవరైనా ఏడ్పిస్తే ఏం చేయాలి?
    కుటుంబం కోసం
  • ఎవరైనా ఏడిపిస్తే యెహోవావైపు చూడండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
మరిన్ని
తేజరిల్లు!—1997
g97 4/8 పేజీలు 19-21

యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .

ఏడిపిస్తే ఏమిటి హాని?

‘ఏయ్‌! నేను కాస్త తమాషాగా వ్యవహరించానంతే. దానిలో అంత పట్టించుకోవడానికేముంది? అంతేకాక, రాన్‌కు అది తగిన శాస్తి.’

మీరు మీ తోటివారిలో అనేకులకన్నా ఎత్తుగాను బలంగాను ఉండవచ్చు. లేదా బహుశా మీరు చాకులాంటివారే కావచ్చు, వ్యంగ్యంగా మాట్లాడేవారయ్యుండవచ్చు, కలహశీలులయ్యుండవచ్చు. ఏదైనా సరే, భయపెట్టడమైనా, ఆటపట్టించడమైనా, ఇతరులను నొప్పించి నవ్వుకోవడమైనా సరే మీకు సులభంగా కనిపిస్తుండవచ్చు.

ఇతరులను ఏడిపించినప్పుడు మీ స్నేహితులకు నవ్వు పుట్టించవచ్చు కానీ, అది తేలికగా కొట్టిపారేయవలసిన విషయం కాదు. నిజానికి, ఏడ్పించడం అనేది ఏడ్పించబడేవారికి తాము ముందనుకున్నదానికన్నా చాలా హానికరమని కొందరు పరిశోధకులు కనుగొంటున్నారు. పాఠశాలలో చదువుకునే వయస్సులోని పిల్లల్లో “ఏడ్పించబడిన వారిలో 90 శాతం మంది తమకు సైడ్‌ ఎఫక్ట్‌లు కలిగాయని—తమ గ్రేడులు తగ్గాయని, ఉత్కంఠ అధికమైందని, స్నేహితులను లేదా సాంఘిక జీవితాన్ని కోల్పోయామని చెప్పారని” తెలిసింది. జపాన్‌లో 13 ఏండ్ల ఒక బాలుడు “మూడు సంవత్సరాలు ఏడ్పించబడిన విషయాన్ని వివరంగా తెలిపే పెద్ద ఉత్తరాన్ని వ్రాసి పెట్టి ఉరేసుకున్నాడు.”a

ఏ విషయాలు ఒకనిని ఏడిపించేవానిగా చేస్తాయి? మీరు ఇతరులను ఏడిపిస్తున్నట్లయితే, మీరు ఎలా మారగలరు?

ఏడిపించేవాడంటే ఏమిటి?

నోవహు కాలంలోని జలప్రళయానికి ముందు జీవించిన ఏడిపించే మనుష్యులను గూర్చి బైబిలు చెబుతుంది. వారు నెఫిలీములు అని పిలువబడ్డారు, ఆ పదం అర్థం “ఇతరులను పడవేయువారు.” వారి భయానక ఏలుబడిలో, “భూలోకము బలాత్కారముతో నిండియుండెను.”—ఆదికాండము 6:4-11.

అయితే, మీరు ఏడిపించేవారయ్యేందుకు ప్రజలను కొట్టవలసిన అవసరంలేదు లేదా ద్వేషంతో నెట్టవలసిన అవసరంలేదు. ఇతరులతో—ముఖ్యంగా బలహీనులతో, సున్నిత మనస్కులతో క్రూరమైన విధంగా లేదా దుష్టమైన విధంగా వ్యవహరించేవాడే ఏడిపించేవాడు. (ప్రసంగి 4:1 పోల్చండి.) ఏడిపించేవారు బెదిరించేందుకు, భయపెట్టేందుకు, అదుపుచేసేందుకు ప్రయత్నిస్తారు. కానీ చాలా మంది తమ పిడికిళ్ళను కాదు గానీ తమ నోటినే ఉపయోగిస్తారు. నిజానికి, ఎక్కువగా ఆటపట్టించేది ఉద్వేగ సంబంధంగా నొప్పించడం ద్వారానే. కనుక అందులో అవమానించడాలు, వ్యంగ్యము, వెక్కిరించడం మరియు పేర్లు పెట్టడమూ ఇమిడి ఉన్నాయి.

అయితే, కొన్నిసార్లు, ఏడిపించడమనేది కుయుక్తిగా జరగగలదు. ఉదాహరణకు, లీసాకు ఏమి జరిగిందో చూడండి.b ఆమె కొందరు స్నేహితులతోపాటు పెరిగి పెద్దదైంది. కానీ తనకు 15 ఏండ్లు వచ్చేసరికి, పరిస్థితులు మారనారంభించాయి. లీసా చాలా అందంగా తయారయి, అనేకుల అవధానాన్ని ఆకర్షించనారంభించింది. “నా స్నేహితురాళ్ళు నన్ను వదిలిపెట్టనారంభించారు, నా వెనుక, నా ఎదుట కూడా వాళ్ళు నా గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారు” అని ఆమె వివరిస్తుంది. వారు ఆమె పేరును చెడగొట్టేందుకు ప్రయత్నిస్తూ ఆమెను గూర్చి అబద్ధాలు కూడా చెప్పనారంభించారు. అవును, అసూయ వల్ల కోపోద్రేకం చెందినవారై, వారు ఆమెను కఠినంగా క్రూరంగా ఏడిపించారు.

ఏడిపించేవారిగా చేసేది

కలహశీలం తరచూ ఒకరి ఇంటి వాతావరణంతో ముడిపెట్టబడివుంటుంది. “మా నాన్న కలహశీలి. కనుక నేనూ కలహశీలిగానే ఉండేవాడ్ని” అని స్కాట్‌ అనే ఒక యువకుడు అన్నాడు. ఏరన్‌కు కూడా ఇంట్లో జీవితం దుర్భరంగా ఉండేది. “నా కుటుంబ పరిస్థితి—అది చాలా భిన్నమైనదని—ప్రజలకు తెలుసని నేను గ్రహించాను—వారు నాకు సానుభూతి చూపడం నాకిష్టం లేదు” అని ఆయన గుర్తు చేసుకుంటున్నాడు. కనుక ఏరన్‌ క్రీడల్లో పాల్గొన్నప్పుడు తానే గెలవాలి. గెలవడం మాత్రమే సరిపోదు. వారి ఓటమిని మళ్ళీ మళ్ళీ ఎత్తిపొడుస్తూ తన విరోధులను అవమానపరచాలి.

మరొకవైపు, బ్రెన్ట్‌ను దైవభయంగల తలిదండ్రుల చేతుల్లో పెరిగాడు. అయితే, “నేను ప్రజలను నవ్విస్తాను, ఎప్పుడు ఆపాలో కొన్నిసార్లు నాకు తెలియదు, నేను ఎవరో ఒకరిని నొప్పిస్తాను” అని ఆయన ఒప్పుకుంటున్నాడు. సరదాగా ఉండాలన్న, తనవైపుకు అవధానాన్ని ఆకర్షించాలన్న బ్రెన్ట్‌ కోరిక ఇతర ప్రజల భావాలను తాను అగౌరవించేందుకు కారణమయ్యింది.—సామెతలు 12:18.

ఇతర యువకులు టీ.వీ. ద్వారా ప్రభావితం చేయబడినట్లు కనిపిస్తారు. నేరాలను గూర్చిన నాటకాలు ‘కఠినులైన పాత్రలకు’ ఘనతనిస్తూ, దయగలవారిగా ఉండడం మగతనం కాదన్నట్లుగా చూపిస్తాయి. ప్రసిద్ధమైన హాస్య కథలు వ్యంగ్యంతో నిండివున్నాయి. క్రీడల సమయాల్లో జరిగే కొట్లాటలను, కఠువుగా మాట్లాడడాన్ని వార్తా నివేదికలు తరచూ ఉన్నతపరుస్తాయి. మనం ఇతరులతో ఎలా వ్యవహరిస్తామన్న దానిని మన స్నేహితులు కూడా ప్రభావితం చేయగలరు. మన తోటివాళ్ళు ఏడిపించేవాళ్ళయితే, మనం వేధించబడకుండా ఉండేందుకు అదే పని చేయడంలో మనం వాళ్ళతో సులభంగా కలుస్తాము.

మీ పరిస్థితి ఏదైనా సరే, మీరు ఏడిపించే పద్ధతులను అవలంబిస్తున్నట్లయితే, దానికి బాధితులయ్యేది మీ చేత నొప్పించబడినవారు మాత్రమే కాదు.

జీవితాంతం ఉండే పర్యవసానాలు

సైకాలజీ టుడే అనే పత్రిక ఇలా నివేదిస్తుంది: “ఏడిపించడం అన్నది బాల్యంలోనే ఆరంభమవ్వవచ్చు. కానీ అది యుక్తవయస్సు వరకూ కొనసాగుతుంది.” “సెకండ్‌ గ్రేడ్‌లో ఏడిపించేవారిగా గుర్తించబడిన 65 శాతం మంది అబ్బాయిలు 24 ఏండ్లొచ్చేసరికి నేరస్థులుగా నిర్ధారించబడ్డారు” అని ది డాలాస్‌ మార్నింగ్‌ న్యూస్‌లో నివేదించబడిన ఒక పరిశోధనా అధ్యయనం కనుగొన్నది.

నిజమే, ఏడిపించే వారందరూ నేరస్థులుగా మారరు. కానీ ఇతరుల భావాలను అలక్ష్యం చేయడాన్ని అలవాటు చేసుకోవడం తరువాత మీ జీవితంలో నిజమైన సమస్యలను సృష్టించగలవు. వైవాహిక జీవితంలోను ఆ అలవాటు కొనసాగించినట్లయితే, అది మీ వివాహ జతకు మీ పిల్లలకు తీవ్రమైన దుఃఖాన్ని కలిగిస్తుంది. ఇతరులతో సర్దుకుపోవడం తెలిసినవారినే పై అధికారులు ఇష్టపడతారు గనుక, మీ ఉద్యోగావకాశాలను కూడా అది లేకుండా చేయగలదు. అలాగే క్రైస్తవ సంఘంలో భవిష్యత్‌ ఆధిక్యతలు కూడా ఆపుజేయబడతాయి. “ఒకరోజు నేను సంఘ పెద్దగా సేవచేసే యోగ్యతను పొందడానికి ఇష్టపడవచ్చు. కానీ నేను వ్యంగ్యంగా ఏమైనా మాట్లాడతానని ప్రజలు అనుకున్నట్లయితే వాళ్ళు తమ సమస్యలను నా దగ్గరికి తీసుకురారని నేను గ్రహించేందుకు మా డాడీ నాకు సహాయం చేశారు” అని బ్రెన్ట్‌ చెబుతున్నారు.—తీతు 1:7.

ఎలా మారాలి

మనం మన తప్పులను ఎల్లప్పుడూ స్పష్టంగా చూడలేము. ఒకని “దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టియెదుట వాని ముఖస్తుతి చేయ”గలదని లేఖనాలు హెచ్చరిస్తున్నాయి. (కీర్తన 36:2) తాము గమనించినదేమిటో చెప్పమని మీరు మీ తల్లి/తండ్రిని, నమ్మగల ఒక స్నేహితు(రాలి)ని లేదా పరిపక్వత గల ఒక క్రైస్తవున్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు. నిజం బాధ కలిగించవచ్చు, కాని మీరు మార్చుకోవలసినవేమిటో తెలుసుకునేందుకు మీకు అది సహాయపడవచ్చు. (సామెతలు 20:30) “వినడం నాకు చాలా పెద్ద సహాయం చేసినదని నేననుకుంటున్నాను, సత్యసంధులైనవారు నేనెక్కడ పొరపాటు చేశానో నాకు చెప్పారు. అది నేను వినాలని కోరుకున్నది కాదు కానీ, నాకు అది చాలా అవసరమైనది” అని ఏరన్‌ చెబుతున్నాడు.

దానర్థం వాస్తవానికి మీరు మీ పూర్తి వ్యక్తిత్వంలోనే నాటకీయమైన మార్పులు తెచ్చుకోవాలనా? లేదు, మీ ఆలోచనా విధానాన్ని లేదా ప్రవర్తనను మళ్ళీ సరిదిద్దుకోవలసిన విషయమై ఉండవచ్చు. (2 కొరింథీయులు 13:11) ఉదాహరణకు, బహుశా ఇప్పటివరకు మీ పెద్ద రూపాన్ని బట్టి, బలాన్ని బట్టి, మీ చలాకీతనాన్ని బట్టి మీ గురించి మీరు ఉన్నతులుగా భావించి ఉండవచ్చు. అయితే, “వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచుచు” ప్రవర్తించాలని బైబిలు మనలను ప్రోత్సహిస్తుంది. (ఫిలిప్పీయులు 2:3) ఇతరుల రూపూ బలమూ ఎలా ఉన్నా, మీకు లేని ప్రశంసార్హమైన గుణాలు వారికున్నాయని గ్రహించండి.

కలహశీలాన్ని లేదా అధికారం చెలాయించే దృక్పథాన్ని కూడా విడిచిపెట్టవలసిన అవసరం ఉండవచ్చు. మీ “సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడ”డానికి కృషిచేయండి. (ఫిలిప్పీయులు 2:4) మీ అభిప్రాయాలను తెలపవలసిన అవసరముంటే, అసభ్యమైన మాటలను ఉపయోగించకుండా, వ్యంగ్యంగా మాట్లాడకుండా, లేదా అవమానించకుండా తెలియజేయండి.—ఎఫెసీయులు 4:31.

ఏడ్పించాలన్న ప్రలోభం మీలో మళ్ళీ కలుగుతున్నట్లయితే, ఏడ్పించిన నెఫిలీములను దేవుడు నాశనం చేశాడని గుర్తుంచుకోండి. (ఆదికాండము 6:4-7; 7:11, 12, 22) శతాబ్దాల తర్వాత, యెహెజ్కేలు ప్రవక్త కాలంలో, నిస్సహాయులను “త్రోసి,” “పొడిచి” అపరాధం చేసినవారియెడల దేవుడు ఎంతో అసంతృప్తిని కనబరచాడు. (యెహెజ్కేలు 34:21) ఏడ్పించడాన్ని యెహోవా అసహ్యించుకుంటాడని తెలుసుకోవడం ఒకరు కావలసిన మార్పులు చేసుకోవడానికి శక్తివంతమైన ప్రేరేపణ కాగలదు!

బైబిలు సూత్రాలను ప్రార్థనాపూర్వకంగా ధ్యానించేందుకు కూడా అది సహాయపడుతుంది. “కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి” అని బంగారు నియమం చెబుతుంది. (మత్తయి 7:12) ఒకరిని భయపెట్టాలన్న ప్రలోభం కలిగినప్పుడు ‘నన్ను ఎత్తిపొడుపు మాటలు అనడం, భయపెట్టడం, లేదా అవమానపరచడం నాకిష్టమేనా? అలాంటప్పుడు, నేను ఇతరులతో ఎందుకు అలా వ్యవహరిస్తున్నాను?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ‘ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులుగా మారాలని’ బైబిలు మనకు ఆజ్ఞాపిస్తోంది. (ఎఫెసీయులు 4:32) యేసు ఈ విషయంలో పరిపూర్ణమైన మాదిరిని ఉంచాడు. ఆయన మిగిలిన మానవులందరి కన్నా ఉన్నతుడైనప్పటికీ, ఆయన ప్రతి ఒక్కరితో దయతోను, తదనుభూతితోను, గౌరవంతోను వ్యవహరించాడు. (మత్తయి 11:28-30) మీకన్నా బలహీనులైన వారెవరైనా—లేదా మీకు చికాకు కలిగించేవారైనా సరే—మీకు ఎదురైనప్పుడు మీరూ అలాగే చేసేందుకు ప్రయత్నించండి.

అయితే, మీ కలహశీలం ఇంట్లో ఇతరులు మీతో మెలుగుతున్న విధానం వల్ల కలిగే కోపోద్రేకాల వల్లనైతే అప్పుడేమిటి? కొన్నిసార్లు, అలాంటి కోపం సమర్థించబడవచ్చు. (ప్రసంగి 7:7 పోల్చండి.) అయినప్పటికీ, నీతిమంతుడైన యోబు హెచ్చరించబడ్డాడని బైబిలు చెబుతుంది: “నీకు క్రోధము పుట్టుచున్నది గనుక నీవు ఒకవేళ తిరస్కారము చేయుదువేమో జాగ్రత్తపడుము. . . . జాగ్రత్తపడుము చెడుతనము చేయకుండుము.” (యోబు 36:18, 21) ఇతరులు మీతో అమర్యాదగా వ్యవహరించినప్పటికీ, మీరు ఇతరులతో అమర్యాదగా వ్యవహరించే హక్కు మీకు లేదు. మీ తలిదండ్రులతో విషయాలను చర్చించడమే మంచి పద్ధతి. మీతో మరీ అమర్యాదగా వ్యవహరించడం జరిగినట్లయితే, మళ్ళీ హాని జరుగకుండా ఉండేందుకు మీకు బయటి నుండి సహాయం అవసరం కావచ్చు.

మారడం సులభం కాకపోవచ్చు, కానీ అది సాధ్యమే. “నేను దీని గురించి దాదాపు ప్రతిరోజు ప్రార్థిస్తాను, నేను కొన్ని మంచి సవరణలు చేసుకోవడానికి యెహోవా నాకు సహాయం చేశాడు” అని బ్రెన్ట్‌ చెబుతున్నాడు. ఇతరులతో మెలిగే విధానంలో మీరు సవరణలు చేసుకుంటుండగా, ప్రజలు మిమ్మల్ని ముందుకన్నా ఎక్కువగా ఇష్టపడుతున్నారని మీరు గ్రహిస్తారన్నదానికి సందేహమే లేదు. ఏడ్పించేవారంటే ప్రజలు భయపడవచ్చు, కానీ నిజానికి ఎవరూ వాళ్ళను ఇష్టపడరు.

[అధస్సూచీలు]

a ఏడ్పించబడేవారు వేధింపును ఎలా వదిలించుకోవాలి అనే చర్చ కోసం ఆగస్టు 8, 1989 సంచిక (ఆంగ్లం)లోని “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . స్కూల్లో ఏడ్పించేవారితో నేనేమి చేయగలను?” అనే శీర్షికను చూడండి.

b కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

[21వ పేజీలోని చిత్రం]

“ఏడ్పించడమనేది బాల్యంలో ప్రారంభమవ్వవచ్చు, కానీ అది యుక్తవయస్సు వరకూ కొనసాగుతుంది”

[20వ పేజీలోని చిత్రం]

చెడుమాటలు ఉపయోగించడం కూడా ఒక రకంగా ఏడ్పించడమే

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి