మా పాఠకుల నుండి
సంతులనం “దేవుని బహుమానమైన సంతులనం” (ఏప్రిల్ 8, 1996) అనే శీర్షికను చదివిన తర్వాత మీకు కృతజ్ఞతలు చెప్పేంతగా నేను చలించిపోయాను. నేను ప్రస్తుతం ఆడియాలజీ చదువుతున్నాను. నా పాఠ్య పుస్తకాల్లో ఉన్న సమాచారం, తేజరిల్లు! శీర్షికలోని సమాచరం ఉన్నంత సంపూర్ణంగా కానీ అది అర్థమైనంత సులభంగా కానీ లేదు. చెవి చిత్రం కూడా అద్భుతంగా ఉంది.
జె. పి. ఎ., బ్రెజిల్
లైంగిక వేధింపు “లైంగిక వేధింపు ఇక ఏమాత్రం ఉండనప్పుడు!” (జూన్ 8, 1996) అన్న శీర్షికను అందించినందుకు కృతజ్ఞతలు. ఈ పత్రికలను నేను ఇతరులకు కూడా అందించడంవల్ల, వేధింపును ఎలా నివారించాలి, వేధింపబడినప్పుడు ఏమి చేయాలి అన్న విషయాలను గూర్చిన సలహాలకు ఎంతో మంది స్త్రీలు కృతజ్ఞతా భావాన్ని కల్గివున్నట్లు నేను గమనించాను. కొన్ని వారాల తర్వాత నేనే లైంగిక పీడనను అనుభవించాను అప్పుడు పోలీసులకు రిపోర్టు చేశాను. ఆ పరిస్థితితో నేను వ్యహరించిన విధానాన్ని చూసి నన్ను మెచ్చుకోవడం జరిగింది.
పేరు బయల్పపర్చబడలేదు, జర్మనీ
ఈ శీర్షికలకు నిజంగా ఎంతో కృతజ్ఞురాలిని. నేను ఇప్పుడు 11వ తరగతిలో చదువుకుంటున్నాను, మరి నేను వేధించబడినప్పటికీ ఈ విషయాన్ని నేను ఎవరితోను అనలేదు. నేను మా తలిదండ్రులకూ టీచర్లకూ చెప్పేందుకు నన్ను ఈ శీర్షికలు ప్రోత్సహించాయి. ఇప్పుడు నన్ను వేధించేవారిని నేను ఎదుర్కొనగల్గుతున్నాను.
కే. వై., జపాన్
నేను సెక్రటరీగా పనిచేస్తున్న 21 సంవత్సరాల యువతిని, నన్ను నా యజమాని వేధించాడు. నేను నా భావాలను ఆయనకు చెప్పడం ఎలాగా అని ఆలోచిస్తుండగా ఈ తేజరిల్లు! శీర్షిక వచ్చింది. నేను దాన్ని ఆయనకు ఇచ్చాను, ఆయన దాన్ని చదివాడు. ఆయన నన్ను క్షమాపణ కోరి మరెప్పుడూ అలా ప్రవర్తించడని మాట ఇచ్చాడు.
డి. ఎన్. ఐ., నైజీరియా
మీరు ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని వెలుగులోకి తెచ్చినందుకు నేను మెచ్చుకుంటున్నాను. కానీ మీ చిత్రాల ప్రకారం ఆడవాళ్లు మాత్రమే వేధించబడుతున్నారు. మీరు పూర్తి పక్షపాత దృక్పథాన్నే అందిస్తున్నారు.
హెచ్. టి., అమెరికా
మగవారికన్నా ఆడవాళ్లే ఎంతో ఎక్కువగా ఈ వేధింపుకు గురౌతున్నారని అనేకమంది పరిశోధకులు చెబుతున్నారు. అయినప్పటికీ, కచ్చితమైన ఉదాహరణలను ఎత్తి చెబుతూ మగవాళ్లు కూడా వేధింపుకు గురికావచ్చని శీర్షికలు ఒప్పుకున్నాయి.—ఎడిటరు.
ఈ విషయంపై రాసే శీర్షికలు స్త్రీలు తమను తాము కాపాడుకునేందుకు ఏమి చేయాలనే దాని గురించే ఎక్కువగా మాట్లాడతాయిగానీ పురుషులు ఆడవాళ్లను గౌరవించాలని బోధించే విషయాల్ని అలక్ష్యం చేస్తుంటాయి. ఎంతైనా వేధించేవాళ్లు లేకపోతే వేధింపే ఉండదు కదా. మీ శీర్షిక “పురుషులు కలిగి ఉండాల్సిన సరైన ప్రవర్తన”ను గూర్చి చెప్పింది. అందుకని, దీనికి మెప్పునివ్వాల్సిందే.
ఒ. చ., తైవాన్
స్నేహం “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . నేనెందుకు స్నేహితులను నిలుపుకోలేకపోతున్నాను?” (జూన్ 8, 1996) అనే శీర్షికకు నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలను పంపిస్తున్నాను. ఈ శీర్షిక నాకు ఎంత సహాయం చేసిందో మీకు తెలియదు. అడ్డంకులున్నప్పటికీ, నిరంతర స్నేహాన్ని కలిగివుండడం సాధ్యమని అది నాకు చూపింది. కొన్నిసార్లు, అపార్థాలను పోగొట్టడంలో మనం ఆలస్యం చేసినందుకు మనం స్నేహితులను పోగొట్టుకుంటాము. ఈ విషయంలో నాకున్న బలహీనతలతో నేను పోరాడేందుకు ఈ శీర్షిక నాకు సహాయపడింది.
ఎ. ఎం. పి., బ్రెజిల్
ఈ శీర్షిక సరిగ్గా సమయానికి వచ్చింది. ఓ అమ్మాయితో నాకెంతో ప్రాణప్రదంగా ఉన్న సంబంధం సన్నగిల్లసాగింది; మేమిద్దరం ఒకరితో ఒకరం మాట్లాడుకోని స్థితికి చేరుకున్నాం. ఆ శీర్షిక వచ్చినప్పుడు నేనూ నా స్నేహితురాలూ దాన్ని చదివి మేము బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నామని కనుగొన్నాము. మేము ఈ విషయాలను గూర్చి బాగా చర్చించుకుని మాకున్న ఎన్నో అపార్థాలను తీర్చేసుకున్నాము. ఇప్పుడు మా స్నేహానికి సరికొత్త శక్తి ఉంది.
ఎన్. టి., ఇటలీ