ఫ్లారిడాలోని ఎవర్గ్లేడ్స్—అరణ్యంలో నుండి ఆర్తనాదం
ప్రతిసంవత్సరం దాదాపు పది లక్షలమంది, మహోన్నతమైన సృష్టికర్త యొక్క ఆశ్చర్యం కల్గించే అద్భుతమైన చేతి పనులను వీక్షించడానికి ఈ అద్భుతమైన ఉష్ణమండల పరదైసువద్దకు గుమిగూడతారు. ఇక్కడ, సంభ్రమంతో నిలబడి చూసేందుకు రెండు కొండల మధ్య కిలోమీటర్ల లోతున ఉండే లోయలు గానీ, ఆకాశాన్నంటుతున్న కొండచరియలు గానీ, ఫోటోలు తీసుకోవడానికి ఎత్తైన జలపాతాలు గానీ, సురక్షితమైన స్థలంనుండి చూసి ఆనందించడానికి అటు ఇటు తిరుగులాడుతున్న మూస్ జంతువుగానీ, నింపాదిగా నడుస్తున్న గ్రిజ్లీ ఎలుగుబంట్లు గానీ లేవు. దానికి బదులుగా, ఎవర్గ్లేడ్స్ జాతీయ ఉద్యానవనం ఊపిరిని బిగబట్టేలా చేసే ప్రకృతి సౌందర్యం ఉందని కాదుగాని జీవశాస్త్ర బాహుళ్యతనుబట్టి ప్రపంచంలో మొట్టమొదట స్థాపించబడిన జాతీయ ఉద్యానవనమైంది.
పాక్షికంగా గడ్డిమైదానాలు, పాక్షికంగా ఉష్ణమండల బురదనేలలతో అది “గడ్డి నది” అని పిలువబడుతుంది. దానిలో నివసించేవాటికి జీవితం శతాబ్దాలుగా కొనసాగుతూ ఉన్నట్లే ఇప్పుడూ కొనసాగుతుంది. మూడు మీటర్ల పొడవున్న అలిగేటర్లు తాము తర్వాత పట్టబోయే జంతువుకొరకు ఒక కన్ను తెరిచివుంచి, సెగలు కక్కుతున్న ఎండలో చలికాచుకుంటాయి. రాత్రి సమయాల్లో ఆ బురదనేలలు వాటి అరుపులతో దద్ధరిల్లుతాయి, జతకట్టే క్రియలను అవి చేస్తుండగా భూమి అదురుతుంది. స్నానాల తొట్టి పరిమాణంలోని తాబేళ్లు ఆహారం కొరకు గడ్డిమధ్యలోనుండి నెమ్మదిగా నడుస్తూ ఉంటాయి. బాణంలా దూసుకుపోతూ సరదాగా ఉండే నది ఆటర్లు అదే నివాసస్థలాన్ని వాటితో పంచుకుంటాయి. వేటకు బయలుదేరిన ఫ్లారిడా పాంథర్ల తాజా అడుగుజాడలను మెత్తని మట్టిపై చూడవచ్చు. తెల్లతోక జింక ఎల్లప్పుడూ జాగరూకతతో ఉండాలి, ఎందుకంటే పొంచివుండి వేటాడే ఈ పాంథర్లు అవకాశం దొరికినప్పుడల్లా వాటిపై దాడిచేసి చంపుతాయి. తరచూ తమ ఆహారాన్ని దగ్గరలోనున్న వాగులవద్ద కడుక్కుంటున్నట్లు చిత్రించబడే రాకూన్లు ఎవర్‌గ్లేడ్స్‌లో హాయిగా జీవిస్తాయి, వాటికి ఆహారం గ్లేడ్స్లోనే సమృద్ధిగా దొరుకుతుంది.
ఎవర్గ్లేడ్స్కి వచ్చే సందర్శకులకు దాదాపు ఎన్నడూ చూడనంత విస్తారమైన జీవరాశి కూడా అక్కడ ఉంది. అనేక రకాలైన కప్పలు నేలకుపైనున్న ఆకులతోను, కలువల ఆకులతోను, మానవ నిర్మిత కాలువల్లోని అందమైన నీటి హయసింథ్లతోను ఏమాత్రం గుర్తుపట్టలేని రీతిలో కలిసిపోయి వాటిపై కూర్చునివుంటాయి. నీట్లో పెరిగే మొక్కలమధ్య నిజంగానే నత్తనడకతో ప్రాకే ఆపిల్ నత్తలు—ఇవి మలస్కావర్గంలోనివి, గోల్ఫ్బంతి పరిమాణంలో ఉంటాయి, వీటికి మొప్పలు, నీట్‌లోనూ నీటిబయటా ఊపిరిపీల్చుకోవడాన్ని సాధ్యపరిచే సంకీర్ణం కాని ఊపిరితిత్తులు ఉంటాయి. అంతగా లోతులేని నీళ్ళలో గాజురొయ్యలు, పీతలు, అనేక రకాల చేపలు నిండుగావుంటాయి. అక్కడ పాములు సమృద్ధిగాను, కీటకాలు, ప్రాకే జంతువులు విస్తారంగాను ఉంటాయి—ప్రతీది తినడానికో లేక తినబడడానికో సిద్ధంగా ఉంటాయి.
అక్కడ కానవచ్చే రెక్కలుగల ప్రాణులలో అందమైన రోజీయట్ స్పూన్బిల్లు, వైట్ ఇబిస్లు, తమ జతలు ఎగరడం మానేసి పుట్టబోయే పిల్లలున్న గ్రుడ్లను పొదగుతుండగా పైన గిరికీలు కొడుతున్న స్నోయీ ఎగరెట్లు ఉన్నాయి. ప్రస్ఫుటంగా కన్పించే గ్రేట్ బ్లూ హెరాన్లు చిరకాలం గుర్తుండిపోతాయి, ఇవి లెక్కపెట్టడం సాధ్యంకానంత వేగంతో ఎగురుతుంటాయి. సముద్రపు పక్షులు, గూడుబాతులు, రక్తవర్ణంలోని గాలిన్యూల్లు అమెరికా జాతీయ చిహ్నమైన రాచఠీవిగల బాల్డ్ ఈగల్లతో ఆకాశాన్ని పంచుకుంటాయి.
పొడవైన మెడలతో ఉండే కార్మరెంట్లు, ఇంగ్లీషు ఎస్ (S) అక్షరం ఆకారంలోని పొడవైన తన మెడను నీట్లోనుండి బయటికి తీసినప్పుడు ఒక పక్షికన్నా ఎక్కువగా ఒక సరీసృపంలా కన్పిస్తుంది గనుక పాముపక్షి అని కూడా పిలువబడే అన్హింగలు అక్కడున్నాయి. స్వతస్సిద్ధంగా ఆకలితో ఉండే ఈ రెండు రకాల పక్షులు ఎవర్‌గ్లేడ్స్‌లోని లోతులేని నీళ్లలో ఆహారం కొరకు పోటీపడతాయి. ఈ రెండూ తడిసిపోయినప్పుడు ఒక ఛాయాచిత్రం కొరకు నిల్చున్నట్లు తమ రెక్కలను చాచి, తమ తోక ఈకల్ని చాపి ఆడంబరపూర్వకమైన ప్రదర్శనను చేస్తాయి. వాటి ఈకలు పూర్తిగా ఎండిపోయినప్పుడు మాత్రమే అవి ఎగురగల్గుతాయి.
దృష్టిని తప్పించుకోకూడదన్నట్లుగా కొంగవంటి లింప్కిన్ తన అరుపులతో సందర్శకులు ఉలికిపడేలా చేస్తుంది. గోధుమ-తెలుపురంగుల్లోని మచ్చలతో ఉన్న ఈ పెద్ద పక్షి ఏడుపు పక్షి అని పిలువబడుతుంది ఎందుకంటే దాని అరుపులు దుఃఖభరితుడైన ఒక మనిషి విలపిస్తున్నట్లుగా ధ్వనిస్తాయి. అరుదైన మరియు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న, కాకి పరిమాణంలో ఉండే వేటాడేపక్షి అయిన ఎవర్గ్లేడ్స్ గ్రద్ద విహంగ వీక్షకులకు ఒక చిరస్మరణీయమైన దృశ్యం, దాని మనుగడ ఆపిల్ నత్తలు దొరకడంపైనే ఆధారపడివుంటుంది. సందర్శకులు పైకిచూస్తూ నిగనిగలాడే పచ్చని ఆకులతో కప్పబడి, స్పానిష్ నాచు పోగులతో అలంకరించబడిన అద్భుతమైన లైవ్ ఓక్చెట్లపైన నివసిస్తున్న పక్షుల పెద్ద సమూహాన్ని చూసి విస్మయంచెందుతారు. చెట్లను చుట్టుకుని ఉన్న మృదువైన తీగలనుండి వ్రేలాడుతున్న పచ్చని, ఎర్రని పూలు పక్షుల రంగులతో మిశ్రితమౌతాయి. ఇక్కడ, సందర్శకులు తాము ఏ దేశంలో ఉన్నారో ఏ ఖండంలో ఉన్నారో మర్చిపోవచ్చు. ఓహ్, ఇక్కడ పూర్తిగా వేరే లోకమేవుంది, అదే సహజమైన, అందమైన అసలైన పరదైసు.
చివరిగా, అంత లోతులేని నీళ్లు, అందులో బంగారు వన్నెలోని రంపం గడ్డి ఉన్నాయి—ఇవి ఎవర్‌గ్లేడ్స్‌లో స్పష్టంగా కనపించే విశేషతలు. తళుక్కుమంటూ, నిగనిగలాడుతూ, కనుచూపుమేరా ఈ నిశ్శబ్ద గడ్డి నది బల్లలా చదునుగా కన్పిస్తూ, దక్షిణం దిశగా ప్రతి కిలోమీటరుకు నాలుగు సెంటీమీటర్లకు తక్కువ చొప్పున ఏటవాలుతో గ్రహించలేని విధంగా, గమనార్హం కాని ప్రవాహంతో దీని నీరు ఎల్లప్పుడు సముద్రంవైపుకి బద్దకంగా ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ నీరు ఎవర్గ్లేడ్స్కి జీవరక్తం వంటిది; అది లేకపోతే గ్లేడ్స్ చనిపోతుంది.
ఈ శతాబ్ద తొలిభాగంలో, మానవ చేతులచే ఎవర్గ్లేడ్స్ ఇంత ఘోరంగా నష్టపర్చబడడానికి ముందు, ఈ గడ్డి సముద్రం తూర్పునుండి పశ్చిమానికి 80 కిలోమీటర్ల పొడవున, కిస్సిమ్మీ నదినుండి ఫ్లారిడా అఖాతం వరకు 500 కిలోమీటర్లకు విస్తరించి ఉండేది. సగటు ఎత్తున్న వ్యక్తి ఈ దూరాన్ని తన భుజాలు తడవకుండా దాటగలడు. సందర్శకులకు అద్భుతమైన అనుభూతిన్నిస్తూ బంగారు వన్నెలోని పొడవైన రంపం గడ్డి మధ్యన నీటిపైన ఎయిర్బోట్లు అత్యంత వేగంతో దూసుకుపోతుంటాయి. చేపలుపట్టేవారు తరతరాలుగా చేస్తున్నట్లే బాస్చేపలు మరితర మంచినీటి, ఉప్పునీటి చేపలను పట్టడానికి వస్తుంటారు.
సహాయం కొరకు నిస్పృహతో కూడిన పిలుపు
ఈ శతాబ్దం ఆరంభించే సరికి, ఫ్లారిడాలోని రాజకీయవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎవర్గ్లేడ్స్ అవాంఛిత జీవులతో నిండివున్న ఊబినేల అని, దానిని తీసివేసి స్థిరాస్తి సంబంధమైన అభివృద్ధికొరకు, పట్టణాభివృద్ధికొరకు, వ్యవసాయాభివృద్ధికొరకు స్థలాన్ని ఏర్పర్చాలని అనుకున్నారు. “దానికి ఆనకట్ట కట్టండి, కాలువ త్రవ్వండి, దాన్ని ఎండగట్టండి, దారి మళ్లించండి” అన్నదే వారి నినాదమైంది. 1905లో, ఫ్లారిడాకు గవర్నరుగా ఎన్నిక కాకముందు ఎన్. బి. బ్రూవర్డ్ “మహామారితో నిండివున్న బురదనేల”లోని ఆఖరి నీటిబిందువును ఎండగడతానని ప్రతినపూనాడు.
అవి వట్టి వాగ్దానాలు కావు. భూమిని ఎత్తివేసే రాకాసివంటి యంత్రాలు, త్రవ్వే ఉపకరణాలు తీసుకువచ్చారు. అమెరికా సైనిక ఇంజినీరింగు దళాల నిర్దేశము, పర్యవేక్షణ క్రింద 90 కిలోమీటర్ల కాలువలు 9 మీటర్ల లోతున త్రవ్వబడ్డాయి, ఈ ప్రక్రియలో పది లక్షల చదరపు మీటర్ల చిత్తడినేలలు నాశనమయ్యాయి. భారీ గట్లు, కాలువలు, నీటిని పంపుచేసే కేంద్రాలు నిర్మించబడ్డాయి. ఎవర్గ్లేడ్స్కి అడ్డదిడ్డంగా అనేక కాలువలు, రోడ్లు నిర్మించబడ్డాయి. అమూల్యమైన, జీవదాతయైన నీరు జీవులతో నిండివున్న ప్రాంతంలోనుండి క్రొత్తగా అభివృద్ధిచేయబడిన పెద్ద వ్యవసాయ క్షేత్రాలవైపుకు మళ్లించబడింది. భారీ గృహనిర్మాణాల కొరకు, ఫ్రీవేల కొరకు, షాపింగ్ సెంటర్ల కొరకు, గోల్ఫ్ కోర్సుల కొరకు స్థలాన్ని మ్రింగివేస్తూ తీర ప్రాంతంలోని నగరాలు కూడా పశ్చిమంవైపుగా విస్తరించాయి.
ఎవర్‌గ్లేడ్స్‌లోని కొంత భాగం 1947లో జాతీయ ఉద్యానవనంగా ప్రకటించబడినప్పటికీ మురుగునీటి పారుదల, నీటిని దారిమళ్లించడం వినాశకరమైన గతిలోనే కొనసాగాయి. ఎవర్గ్లేడ్స్ను ఎండగట్టడం—అలా చేయడానికి కోట్లాది డాలర్లను వెచ్చించడం—గొప్ప మూర్ఖతయని పర్యావరణ శాస్త్రజ్ఞులు అంగీకరిస్తున్నారు. నీటి ప్రవాహానికి భంగం కల్గించడం ఎవర్‌గ్లేడ్స్‌లోని జీవజాలంపై వినాశకరమైన ప్రభావం కలిగించగలదని ఎంతోమంది అర్థం చేసుకోలేదు. ఆ నష్టం స్పష్టమవ్వడానికి దశాబ్దాలు పట్టింది.
అయితే 1980వ దశకం మధ్యభాగంకల్లా, ఎవర్గ్లేడ్స్ అంతరించిపోతున్నాయని పర్యావరణ శాస్త్రజ్ఞులు, జీవశాస్త్రజ్ఞులు హెచ్చరికలు చేయడం మొదలుపెట్టారు. అక్కడున్న ప్రతి జీవి ఫిర్యాదు చేస్తున్నట్లుగా, సహాయం కొరకు గట్టిగా మొరపెడుతున్నట్లుగా అనిపిస్తుంది. అలిగేటర్లు నివసించిన నీటి మడుగు ప్రాంతాలు అనావృష్టి కాలంలో ఎండిపోనారంభించాయి. వర్షాలు కురిసి ఆ ప్రాంతాల్లో వరదలు వచ్చినప్పుడు వాటి గూళ్లు, గ్రుడ్లు కొట్టుకుపోయాయి. ఇప్పుడు వాటి సంఖ్యలు తీవ్రంగా పడిపోతున్నాయి. అవి తమ స్వంత పిల్లల్ని భక్షిస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. పొడుగాటి కాళ్ళు కలిగి నీళ్ళలోనుంచి నడిచిపోయే ప్రస్ఫుటంగా కన్పించే నీటిపక్షులు ఆ ప్రాంతంలో ఒకప్పుడు పది లక్షల కంటే ఎక్కువున్నట్లు లెక్కించబడ్డాయి, ఇప్పుడు 90 శాతం తగ్గుదలతో వాటి సంఖ్య కొన్ని వేలకు తగ్గిపోయింది. ఒకప్పుడు తమ గూళ్లకు తిరిగివచ్చేప్పుడు ఆకాశాన్ని కమ్మివేసే అందమైన రోజీయట్ స్పూన్బిల్లు అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు చాలా తగ్గిపోయాయి. 1960లనుండి వుడ్ స్టార్క్‌ల సంఖ్య 6,000 నుండి కేవలం 500కు తగ్గిపోవడం, వాటిని అంతరించిపోయే ప్రమాదంలో పడవేసింది. సమృద్ధిగా ఉండే ఫ్లారిడా అఖాతంలోని పెంపక కేంద్రాలు కూడా ప్రమాదంలో ఉన్నాయి, ఈ పెంపక కేంద్రాలు రాష్ట్రంలోని చిప్పగల చేపల పరిశ్రమకొరకు ఏర్పాటు చేయబడ్డాయి. లేళ్లు మొదలుకొని తాబేళ్లవరకు ఇతర అన్ని సకశేరుకాల జనసంఖ్యలు 75 శాతం నుండి 95 శాతం వరకు తగ్గిపోయాయని ఒక మూలం తెలుపుతుంది.
వ్యవసాయం మరితర మానవ కార్యకలాపాల ద్వారా క్రమంగా వాటి నివాసస్థలాలను ఆక్రమించడానికి తోడు, భూమిని నీటినీ నెమ్మదిగా మలినపర్చిన ఎరువులు క్రిమిసంహారకాల కాలుష్యాలు కూడా చేరాయి. బురదనేలల్లోని చేప మొదలుకొని రాకూన్లు, అలిగేటర్లు, తాబేళ్లవరకు ఆహార చక్రంలోని అన్ని స్థాయిల్లోను హెచ్చైన మోతాదుల్లో పాదరసం ఉన్నట్లు గుర్తించబడింది. నేలనుండి వచ్చిన పాదరసం కలిసివున్న కొన్ని నిర్దిష్ట జలాల్లో పట్టబడిన బాస్ చేపను, ఏటిచేపను తినవద్దని జాలరులకు సలహా ఇవ్వబడింది. పాంథర్లు కూడా మానవుని దాడికి గురయ్యాయి, అవి పాదరసంచే విషయుక్తంకావడం ద్వారా చంపబడడం మాత్రమే గాక వేటగాళ్ల వలన కూడా చంపబడ్డాయి. ఈ జంతువు ఎంతగా అంతరించిపోయే ప్రమాదంలో ఉందంటే వాటి సంఖ్య పూర్తి రాష్ట్రంలో 30 కంటే తక్కువగా ఉందని, పార్కులో 10 ఉన్నాయని నమ్మబడుతుంది. ఎవర్‌గ్లేడ్స్‌లోని అనేక ప్రాదేశిక చెట్లు కూడా అంతరించిపోయేలా ఉన్నాయి.
కొంతమంది పరిశీలకులు, పర్యావరణ శాస్త్రజ్ఞులు ఎవర్గ్లేడ్స్ మరల కోలుకునే అవకాశంలేని స్థాయికి చేరుకునివుండవచ్చని నమ్ముతున్నారు. అయితే, రాష్ట్రము మరియు ఫెడరల్ ఏజెన్సీలు నిధులు చేకూర్చడం ద్వారా, త్వరితగతిన చర్యను గైకొనడం ద్వారా ఎవర్గ్లేడ్స్ను రక్షించవచ్చని ప్రభుత్వ అధికారులు, పార్కు అధికారులు మరి అనేకమంది పర్యావరణ శాస్త్రజ్ఞులు నమ్ముతున్నారు. “ఇంత పెద్దది మరియు సంక్లిష్టమైనది మరల కోలుకునే అవకాశంలేని స్థాయికి ఎప్పుడు చేరుకుంటుందో ఎవరికీ నిజంగా తెలియదు” అని ఒక అధికారి అంటూ, “అదిప్పటికే జరిగిపోయివుండవచ్చు” అని ఆయన జతచేస్తున్నాడు. జీవశాస్త్రవేత్త అయిన జాన్ ఆగ్డన్ ఎవర్గ్లేడ్స్ను తిరిగి పొందే సాధ్యత అంత సంతృప్తికరంగా ఉన్నట్లు లేదని ఒప్పుకుంటున్నాడు, కానీ ఆయన ఆశావాదంతో ఉన్నాడు. “నేను ఆశావాదంతో ఉండాల్సిందే” అంటున్నాడాయన, “ప్రత్యామ్నాయమేమంటే జీవశాస్త్రపరమైన ఎడారే, పార్కులోని శేషంలో ఇక్కడ కొన్ని అలిగేటర్లు, అక్కడ కొన్ని పక్షిగూళ్లు, వీటికి కేంద్రబిందువుగా గడ్డివంటి పదార్థాలతో నింపబడిన పాంథర్ ఉంటాయి.”
దేశవ్యాప్తంగా ఫ్లారిడా అధికారులు, జీవశాస్త్రజ్ఞులు, పర్యావరణ శాస్త్రజ్ఞులు వేసే గావుకేకలు అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులతో సహా వాషింగ్టన్‌లోని ఫెడరల్ అధికారులు, రాజకీయవేత్తలకు కూడా వినబడ్డాయి. ఇప్పుడు అమెరికా సైనిక ఇంజినీరింగు దళాలు ఒక క్రొత్త ప్రాజెక్టును ప్రారంభించాలి, వీరి పూర్వవర్తులు సంవత్సరాల క్రితం అవకతవకలతో కూడిన పనిని చేసిపెట్టారు. వారి మనఃఫలకంపైనున్న కొంగ్రొత్త దృశ్యం ఏమంటే దాన్ని ఎండగట్టి, దానికి ఆనకట్ట కట్టి, దాన్ని దారి మళ్లించడానికి బదులుగా ఎవర్గ్లేడ్స్ను దానిలోని జీవరాశిని రక్షించడానికి పనిచేయడమే.
స్పష్టంగా, అత్యంత కీలకమైన విషయం నీళ్లే. “విజయానికి ఆధారం శుభ్రమైన నీరు—అదీ పెద్ద మొత్తంలో” అని యు.ఎస్.న్యూస్ & వరల్డ్ రిపోర్ట్ వ్రాస్తుంది, “ఆ నీరు వ్యవసాయానికి లేక పట్టణ ప్రాంతాలకు సరఫరా చేసే నీటిని తగ్గించడం ద్వారానే వస్తుంది. దీనికి దక్షిణ ఫ్లారిడా చెరకు పంటలు, కూరగాయల వ్యవసాయ క్షేత్రాలు లక్ష్యాలై ఉండడం అత్యంత సంభవనీయం.” “నీటి పంపకం చాలా కష్టతరంగా ఉంటుంది, కానీ మేము సరిపడినంత నీటిని ఇచ్చాము, ఇంకా ఎక్కువ ఇవ్వలేము” అని ఎవర్గ్లేడ్స్ పార్క్ పర్యవేక్షణాధికారి అయిన రాబర్ట్ షాండ్లర్ ప్రకటించాడు. “ఇతరులు జాగ్రత్తగా వాడవలసిన అవసరం ఉంది” అని ఆయన అన్నాడు. ఎవర్గ్లేడ్స్ను తిరిగి పొందే ప్రతిపాదనను ప్రతిపాదించేవారు ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అత్యంత గొప్ప పోరాటం ఫ్లారిడా చెరకు వ్యవసాయదారులనుండి, ఎవర్‌గ్లేడ్స్‌లోని పెద్ద పెద్ద భూమి ఖామందులనుండి ఎదుర్కోవలసి వస్తుందని భయపడుతున్నారు. వారి అవసరాల నిమిత్తం గొప్ప మొత్తంలో నీరు మరల్చబడడంవలన గ్లేడ్స్లోని జీవరాశి బలవుతుంది.
ఎవర్గ్లేడ్స్ను తిరిగిపొందడము, దాన్ని సంరక్షించడం చరిత్రలోనే అత్యంత సాహసవంతమైన, అత్యంత ఖరీదైన పునఃస్థాపనా ప్రణాళిక అవుతుంది. “మనం గొప్ప మొత్తంలోని డబ్బు ఇమిడివుండే దానిగురించి, పెద్ద మొత్తంలో భూమి ఇమిడివుండే దానిగురించి, ప్రపంచంలో ఎన్నడూ ఎక్కడా కనీవినీ ఎరుగని స్థాయిలో జరిగే ఆవరణ వ్యవస్థ యొక్క పునఃస్థాపన గురించి మాట్లాడుతున్నాము” అని వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ వద్ద ఎవర్గ్లేడ్స్ ప్రాజెక్టుకు ఇన్ఛార్జిలో ఉన్న ఒక అధికారి అన్నాడు. “రాబోయే 15 నుండి 20 సంవత్సరాలలో, దాదాపు 200 కోట్ల అమెరికా డాలర్లను వెచ్చించి అమెరికా సైనిక ఇంజినీరింగు దళాలు, రాష్ట్ర ప్రభుత్వము, మరితర ఫెడరల్ ఏజెన్సీలు 14,000 చదరపు కిలోమీటర్ల చిత్తడినేలలు మరియు నీటి మార్గాలతోపాటుగా పూర్తి ఫ్లారిడా ఎవర్గ్లేడ్స్ ఆవరణ వ్యవస్థలోని నీటి పారుదలను మరియు మురుగు నీటిని క్రమబద్ధంచేయడానికి ప్రణాళికను వేస్తున్నాయి” అని సైన్స్ పత్రిక వివరించింది.
అదనంగా, ఆ ప్రణాళిక ప్రకారం ఓకీకోబీ సరస్సువద్దనున్న దాదాపు 1,00,000 ఎకరాల వ్యవసాయక్షేత్రాన్ని కొని దానిని బురదనేలగా మార్చాల్సివుంటుంది. ఈ బురదనేల మిగతా వ్యవసాయక్షేత్రాల్లోని కాలుష్యాలను వడగట్టుతుంది. ఎవర్గ్లేడ్స్ను శుభ్రం చేయడానికి కావాల్సిన అదనపు డబ్బును సంపాదించడానికి ఫెడరల్ సబ్సిడీపై కిలో చక్కెరకు 75 పైసల కోతను విధించాలన్న ప్రతిపాదనకు చెరకు వ్యవసాయదారులు ఆగ్రహంతో అసమ్మతిని తెల్పుతున్నారు. “దానిని నాశనం చేయడం ద్వారా అత్యంత ఎక్కువ ప్రయోజనంపొందిన వారే దాని పునఃస్థాపన ఖర్చులు భరించాలి, వారు: ఫ్లారిడాలోని చక్కెర వ్యవసాయదారులు మరియు విధాయితం చేసేవారు” అని యుఎస్ఏ టుడే వార్తాపత్రిక తన సంపాదకీయంలో తెలియజేస్తుంది. ఫ్లారిడాలోని చక్కెరపై కిలోకు 75 పైసల నిర్ధారణ సాలీనా 3.5 కోట్ల అమెరికా డాలర్లను తెస్తుందని అంచనా వేయబడుతుంది.
సాగుబడిచేసేవారికి, చెరకు వ్యవసాయదారులకు వ్యతిరేకంగా జీవశాస్త్రజ్ఞులు, పర్యావరణ శాస్త్రజ్ఞులు, ప్రకృతి సౌందర్యారాధకులు చేసే పోరాటం కొనసాగుతునే ఉంటుందని అనుకుంటున్నారు. అమెరికాలోని ఇతర భాగాలలో ఇవే పక్షాల మధ్య పోరాటం జరుగుతుంది. ఉపాధ్యక్షుడు గోర్ సహకారం కొరకు విజ్ఞప్తి చేశాడు. “కలిసి పనిచేయడంద్వారా, మనం ఈ విభజనను తొలగించి ఒక ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని, వర్ధిల్లే ఆర్థికవ్యవస్థను తీసుకురాగలము” అన్నాడాయన, “కానీ చర్యగైకొనవలసిన సమయం ఇదే. ప్రపంచంలో మరో ఎవర్గ్లేడ్స్ లేదు.”
[13వ పేజీలోని చిత్రం]
అలిగేటర్
[క్రెడిట్ లైను]
USDA Forest Service
[14వ పేజీలోని చిత్రం]
బట్టతల గ్రద్ద
[15వ పేజీలోని చిత్రం]
వైట్ ఇబిస్
[15వ పేజీలోని చిత్రం]
గూట్లో ఉన్న అన్హింగ, లేక పాముపక్షుల జత
[16వ పేజీలోని చిత్రం]
నీట్లో నడుస్తున్న రాకూన్ త్రయం
[16వ పేజీలోని చిత్రం]
ఎగరెట్
[17వ పేజీలోని చిత్రం]
లింప్కిన్, ఏడుపు పక్షి అని కూడా పిలువబడుతుంది
[17వ పేజీలోని చిత్రం]
గ్రేట్ బ్లూ హెరాన్
[17వ పేజీలోని చిత్రం]
కార్మరెంట్ పిల్లలు