యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .
నేను నా పాపాన్ని ఒప్పుకోవాలా?
“నేను ఎంతో సిగ్గుపడుతున్నాను, ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. నా తలిదండ్రుల దగ్గరికి వెళ్దామనుకుంటున్నాను, కానీ నేను చాలా సిగ్గుపడుతున్నాను.”—లీసా.a
మనస్తాపం చెందిన ఒక యౌవన స్త్రీ ఆ విధంగా వ్రాసింది. ఆమె ఒక అవిశ్వాసితో కొన్ని సంవత్సరాలపాటు భావోద్రేక సంబంధాన్ని పెట్టుకుంది, ఒకరోజు మద్యపానీయాల ప్రభావంలో ఆమె అతనితో లైంగిక సంబంధం పెట్టుకుంది.
క్రైస్తవ యౌవనుల మధ్య కూడా అటువంటి సంఘటనలు అప్పుడప్పుడు సంభవిస్తాయనడం విషాదకరం. మనం ఎంత యౌవనులుగా ఉంటామో ఎంత ఎక్కువ అనుభవరాహిత్యంతో ఉంటామో మనం అన్ని ఎక్కువ తప్పులు చేసే అవకాశం ఉంది. కానీ ఒక చిన్న తప్పు చేయడం ఒక విషయమైతే లైంగిక అనైతికతలో పడిపోవడం వంటి గంభీరమైన తప్పిదాలకు ఒడిగట్టడం పూర్తిగా వేరే విషయం. (1 కొరింథీయులు 6:9, 10) అది జరిగినప్పుడు ఒక యౌవనునికి సహాయం అవసరమౌతుంది. సమస్య ఏమంటే తప్పులను ఒప్పుకోవడం అంత సులభం కాదు.
ఒక క్రైస్తవ అమ్మాయి వివాహానికి పూర్వమే లైంగిక సంబంధం పెట్టుకుంది. ఆమె తన సంఘ పెద్దల ముందు ఒప్పుకోవాలని నిర్ణయించుకుంది, చివరికి తాను అలా చేసేందుకు ఒక తేదీని కూడా ఎన్నుకుంది. కానీ ఆమె ఆ తేదీని వాయిదా వేసింది. అటుతర్వాత, తేదీని వాయిదా వేస్తూ వచ్చింది. త్వరలోనే ఒక పూర్తి సంవత్సరం గడిచిపోయింది!
“రహస్యమేదియు లేదు”
మీరు గంభీరమైన పాపంలో పడినట్లైతే మౌనంగా ఉండడం మంచిది కాదని తెలుసుకోవాలి. ఒక్కటి మాత్రం నిజం, సాధారణంగా సత్యం ఏదో విధంగా బయటకు వస్తుంది. చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు మార్క్, పింగాణీతో చేయబడిన గోడమీది అలంకరణ వస్తువును పగులగొట్టాడు. “నేను దానిని జాగ్రత్తగా కలిపి అంటించివేయడానికి ప్రయత్నించాను” అంటూ ఆయన గుర్తుతెచ్చుకుంటున్నాడు, “కానీ మా అమ్మా నాన్న దానిలోని పగుళ్లను గమనించడానికి ఎంతో కాలం పట్టలేదు.” నిజమే, మీరిక ఏమాత్రం చిన్న పిల్లలు కారు. కానీ చాలామంది తలిదండ్రులు తమ పిల్లల్లో ఏదో పొరపాటుగా ఉన్నప్పుడు సాధారణంగా గ్రహించగలరు.
“నేను నా సమస్యలను అబద్ధాలాడి కప్పిపుచ్చడానికి ప్రయత్నించేదాన్ని” అని ఒప్పుకుంటుంది 15 సంవత్సరాల అన్, “కానీ నేను పరిస్థితులు మరింత ఘోరమయ్యేలా చేశాను.” చాలా తరచుగా అబద్ధాలు బహిర్గతమౌతాయి. మరి మీరు అబద్ధమాడారని మీ తలిదండ్రులు కనుగొన్నప్పుడు, మీరు మొదట్లోనే ఒప్పుకున్నప్పుడు అనుభవించే దుఃఖం కన్నా ఎక్కువ దుఃఖాన్ని వారు ఇప్పుడు అనుభవించే సాధ్యత ఉంది.
అంతకంటే ప్రాముఖ్యంగా బైబిలు ఇలా చెబుతుంది: “తేటపరచబడని రహస్యమేదియు లేదు; తెలియజేయబడకయు బయలుపడకయు నుండు మరుగైనదేదియు లేదు.” (లూకా 8:17) మనం ఏమి చేశామో ఏమి చేస్తున్నామో యెహోవాకు తెలుసు. ఆదాము దాచలేనట్లే మీరు కూడా ఆయననుండి ఏమీ దాచలేరు. (ఆదికాండము 3:8-11) సకాలంలో, మీ పాపాలు కూడా ఇతరులకు బహిర్గతమవ్వవచ్చు.—1 తిమోతి 5:24.
మౌనంగా ఉండిపోవడం మీకు ఇతర విధాల కూడా హాని కల్గించవచ్చు. కీర్తనల గ్రంథకర్త దావీదు ఇలా వ్రాశాడు: “నేను మౌనినై యుండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వనివలన నాయెముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నామీద బరువుగానుండెను.” (కీర్తన 32:3, 4) అవును, రహస్యాన్ని దాచడమనే భారం మనం భావోద్రేకంగా భారీ మూల్యాన్ని చెల్లించేలా చేయవచ్చు. చింత, అపరాధ భావన వీటితోపాటు, బయటపడుతుందనే భయం మీరు ఉత్తేజరహితులయ్యేలా చేయగలదు. మిమ్మల్ని మీరు మీ స్నేహితులనుండి, కుటుంబంనుండి వేర్పరచుకోవడం మొదలుపెట్టవచ్చు. మీకు దేవునితో సంబంధమే తెగిపోయినట్లు కూడా భావించవచ్చు! “నేను యెహోవాను దుఃఖపెట్టినందుకు అపరాధ భావనతో పోరాడుతున్నాను” అని ఆండ్రూ అనే యౌవనుడు వ్రాస్తున్నాడు. “అది నన్ను ఎంతో క్షోభకు గురిచేసింది.”
నిశ్శబ్దాన్ని చీల్చడం
ఈ భావోద్రేక అలజడినుండి ఉపశమనంపొందే మార్గం ఏదైనా ఉందా? అవును, ఉంది! కీర్తనల గ్రంథకర్త ఇలా అన్నాడు: “నా దోషమును కప్పుకొనక నీ యెదుట నా పాపము ఒప్పుకొంటిని . . . నీవు నా పాపదోషమును పరిహరించియున్నావు.” (కీర్తన 32:5; 1 యోహాను 1:9 పోల్చండి.) ఆండ్రూ అదేవిధంగా తన పాపాన్ని ఒప్పుకోవడంలో నిజమైన ఉపశమనాన్ని పొందాడు. ఆయనిలా గుర్తుతెచ్చుకుంటున్నాడు: “నేను యెహోవాను సమీపించాను, ఆయన క్షమాపణ కొరకు హృదయపూర్వకంగా ప్రార్థించాను.”
మీరూ అదే చేయగలరు. యెహోవాకు ప్రార్థించండి. మీరేమి చేశారో ఆయనకు తెలుసు, అయినా దీనంగా ప్రార్థనలో దానిని ఆయన ఎదుట ఒప్పుకోండి. మీరు సహాయం పొందనర్హతలేని దుష్టులని భావిస్తూ వెనక్కి తగ్గకుండా క్షమాపణ కొరకు అడగండి. మనం అపరిపూర్ణులమైనప్పటికీ దేవుని ఎదుట చక్కని స్థానాన్ని అనుభవించగల్గేలా యేసు చనిపోయాడు. (1 యోహాను 2:1, 2) అవసరమైన మార్పులు చేసుకునేందుకు బలం కొరకు కూడా మీరు అడుగవచ్చు. ఈ విధంగా దేవున్ని సమీపించడానికి 51వ కీర్తన చదవడం ప్రత్యేకంగా సహాయకరంగా ఉండగలదు.
మీ తలిదండ్రులకు చెప్పడం
అయితే కేవలం దేవుని ఎదుట ఒప్పుకోవడమే సరిపోదు, అంతకన్నా ఎక్కువే చేయాలి. మీ తలిదండ్రులకు చెప్పవలసిన బాధ్యత కూడా మీకు ఉంది. మిమ్మల్ని ‘యెహోవాయొక్క శిక్షలోను బోధలోను పెంచాలన్న’ ఆజ్ఞ దేవునిచే వారికివ్వబడింది. (ఎఫెసీయులు 6:4) వారికి మీ సమస్యలేమిటో తెలిస్తేనే వారు ఇది చేయగలరు. అయితే మీ తలిదండ్రులకు చెప్పడం సులభమైనదిగాను లేక ఆహ్లాదకరమైనదిగాను ఉండకపోవచ్చు. కానీ తమ మొదటి ప్రతిస్పందన తర్వాత వారు బహుశ తమ భావోద్రేకాలను అదుపులో పెట్టుకోవచ్చు. మీరు మీ సమస్యను వారికి వెల్లడించేంతగా వారిని మీరు నమ్మారని వారు ఆనందించవచ్చు కూడా. యేసు చెప్పిన తప్పిపోయిన కుమారుని ఉపమానం లైంగిక అనైతికతలో పడిపోయిన ఒక యౌవనస్థుని గురించి చెబుతుంది. కానీ ఆయన చివరికి ఒప్పుకున్నప్పుడు ఆయన తండ్రి ఆయనను చేతులు చాచి ఆహ్వానించాడు! (లూకా 15:11-24) నిస్సందేహంగా మీ తలిదండ్రులు కూడా అదే విధంగా మీ సహాయార్థం వస్తారు. ఎంతైనా వారు మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నారు.
నిజమే, మీరు మీ తలిదండ్రుల్ని గాయపరుస్తారని భయపడుతుండవచ్చు. కానీ మీ తలిదండ్రుల్ని గాయపర్చేది పాపాన్ని ఒప్పుకోవడం కాదు; పాపాన్ని చేయడమే! ఆ గాయాన్ని మాన్పడానికి ఒప్పుకోవడం మొదటి మెట్టు. ఇంతకుమునుపు ప్రస్తావించబడిన అన్ తన తలిదండ్రులకు చెప్పింది, తర్వాత గొప్ప ఉపశమనాన్ని పొందింది.b
ఒప్పుకోవడానికున్న మరో అవరోధం ఏమంటే సిగ్గుపడడం, ఇబ్బందిగా భావించడం. విశ్వసనీయుడైన ఎజ్రా తానుగా ఆ పాపాలు చేయలేదు, కానీ ఆయన తన తోటి యూదుల పాపాలను ఒప్పుకున్నప్పుడు ఆయనిలా అన్నాడు: “నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తికొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై యున్నాను.” (ఎజ్రా 9:6) నిజంగానే, మీరు తప్పు చేసినప్పుడు సిగ్గుగా భావించడం సరైనదే. మీ మనస్సాక్షి ఇంకా పని చేస్తుందని అది సూచిస్తుంది. మరి కాలం గడిచే కొలది ఆ లజ్జా భావాలు తగ్గుముఖం పడతాయి. ఆండ్రూ దీన్నిలా వ్యక్తం చేశాడు: “ఒప్పుకోవడం చాలా కష్టము, ఇబ్బందికరమైనదీ. కానీ యెహోవా బహుగా క్షమిస్తాడని తెలుసుకోవడం ఉపశమనంగా ఉంటుంది.”
సహాయం కొరకు పెద్దలవద్దకు వెళ్లడం
మీరు క్రైస్తవులైతే, మీ తలిదండ్రులకు చెప్పడంతోనే విషయం సమసిపోదు. ఆండ్రూ ఇలా అంటున్నాడు: “నేను నా సమస్యను సంఘ పెద్దలవద్దకు తీసుకెళ్లాలని నాకు తెలుసు. వారు నాకు సహాయం చేయడానికే ఉన్నారని తెల్సుకోవడం ఎంతటి ఉపశమనాన్నిచ్చింది!” అవును, యెహోవాసాక్షుల్లోని యౌవనులు సహాయం కొరకు, ప్రోత్సాహం కొరకు సంఘ పెద్దలవద్దకు వెళ్లవచ్చు, వెళ్లాలి కూడాను. కానీ మీరు కేవలం యెహోవాకు ప్రార్థించి విషయాన్ని అంతటితో ఎందుకు ముగించలేరు? ఎందుకంటే యెహోవా ‘మీ ఆత్మలను కాసే’ బాధ్యతను పెద్దలకు అప్పగించాడు. (హెబ్రీయులు 13:17) మీరు మరల పాపంలో పడిపోకుండేలా వారు మీకు సహాయం చేయగలరు.—యాకోబు 5:14-16 పోల్చండి.
మీకై మీరే సహాయం చేసుకోగలరని తర్కిస్తూ మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకండి. మీరలా చేయడానికి నిజంగా మీకు శక్తే ఉంటే ముందు అసలు మీరు పాపంలో పడేవారా? స్పష్టంగా, మీరు బయటినుండి సహాయాన్ని పొందవలసిన అవసరం ఉంది. ఆండ్రూ ధైర్యంగా అలా చేశాడు. ఆయనిచ్చే సలహా? “ఒక గంభీరమైన పాపం చేసిన, లేక ఇంతకు మునుపు పాపంలో పడిన వారినెవరినైనా యెహోవా ఎదుట ఆలాగే ఆయన కాపరులలో ఒకరి ఎదుట తమ హృదయాలను కుమ్మరించుమని నేను ప్రోత్సహిస్తాను.”
కానీ మీరు అసలు ఒక పెద్దను ఎలా సమీపిస్తారు? మీరు ఎవరి సమక్షంలోనైతే ఓదార్పుకరంగా ఉన్నట్లు భావిస్తారో వారిని ఎన్నుకోండి. మీరు ఇలా అంటూ ప్రారంభించవచ్చు: “నేను మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి” లేదా “నాకు ఒక సమస్య ఉంది” లేదా “నాకు ఒక సమస్య ఉంది, నాకు మీ సహాయం అవసరం.” మీరు నిజాయితీగా ఉండడం, ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం మీ పశ్చాత్తాపాన్ని, మారాలనే మీ కోరికను నిజంగా బయలుపరుస్తాయి.
‘నేను బహిష్కరింపబడతానని భయపడుతున్నాను’
అలా జరిగే సాధ్యత విషయమేమిటి? ఒక గంభీర పాపం చేయడం ఒకరిని బహిష్కరించేందుకు అర్హున్ని చేస్తుందన్నది నిజమే, కానీ కేవలం పాపం చేయడంతోనే బహిష్కరింపబడరు. బహిష్కరణ అనేది పశ్చాత్తాపపడడానికి నిరాకరించే వారికే—మొండితనంతో మారడానికి నిరాకరించే వారికే. సామెతలు 28:13 ఇలా అంటుంది: “అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరము పొందును.” సహాయం కొరకు మీరు పెద్దలను సమీపించారన్న వాస్తవమే మారాలన్న మీ కోరికకు నిదర్శనం. పెద్దలు ప్రాథమికంగా స్వస్థపరిచేవారేగాని శిక్షించేవారు కారు. దేవుని ప్రజలతో దయతోను గౌరవపూర్వకంగాను వ్యవహరించవలసిన బాధ్యత వారికి ఉంది. “మీ పాదములకు మార్గములను సరళము చేసి”కొనడానికి మీకు సహాయం చేయాలని వారు కోరుకుంటారు.—హెబ్రీయులు 12:13.
ఒప్పుకోవలసిందేమంటే మోసము, గంభీరమైన తప్పులను దీర్ఘకాలికంగా అభ్యసించడం ఇమిడివున్నప్పుడు, “మారుమనస్సునకు తగిన” ఒప్పింపజేసే “క్రియలు” లోపించవచ్చు. (అపొస్తలుల కార్యములు 26:20) కొన్నిసార్లు బహిష్కరణ జరుగవచ్చు. తప్పిదస్తుడు పశ్చాత్తాపపడిన సందర్భంలో కూడా ఏదోక విధమైన క్రమశిక్షణా చర్యను గైకొనే బాధ్యత పెద్దలకు ఉంది. వారి నిర్ణయం మీకు కోపం వచ్చేలా లేక చేదైన భావాలను అనుభవించేలా చేయాలా? హెబ్రీయులు 12:5, 6 వద్ద పౌలు మనకు ఇలా ఉద్బోధ చేస్తున్నాడు: “నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును.” మీరు ఎటువంటి క్రమశిక్షణను పొందినప్పటికీ, దాన్ని దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడన్నదానికి సాక్ష్యంగా దృష్టించండి. గుర్తుంచుకోండి, నిజమైన పశ్చాత్తాపం మన కరుణాపూర్వక తండ్రి అయిన యెహోవా దేవునితో మరల సరైన సంబంధాన్ని పునఃస్థాపిస్తుంది.
మీ తప్పులను ఒప్పుకోవడానికి ధైర్యం అవసరం. కాని ఆ విధంగా చేయడం ద్వారా, మీ తలిదండ్రులతోనే కాదు యెహోవా దేవునితో కూడా మీరు విషయాలను సరిదిద్దుకోవచ్చు. భయం, గర్వం, లేక ఇబ్బందిగా భావించడం మిమ్మల్ని సహాయం పొందడంనుండి ఆపనివ్వకండి. గుర్తుంచుకోండి: యెహోవా “బహుగా క్షమించును.”—యెషయా 55:7.
[అధస్సూచీలు]
a కొన్ని పేర్లు మార్చబడ్డాయి.
b మీ తలిదండ్రులను సమీపించడమెలాగ అన్నదానిపై సమాచారం కొరకు వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించిన యౌవనస్థులు అడిగే ప్రశ్నలు—ఆచరణయోగ్యమైన సమాధానాలు (ఆంగ్లం) పుస్తకంలోని 2వ అధ్యాయం చూడండి.
[12వ పేజీలోని చిత్రం]
‘పాపం చేసిన వారందరూ తమ హృదయాలను యెహోవా ఎదుట కుమ్మరించాలని నేను ప్రోత్సహిస్తాను.’—ఆండ్రూ
[11వ పేజీలోని చిత్రం]
మీ తలిదండ్రుల ఎదుట ఒప్పుకోవడం ఆత్మీయంగా కోలుకోవడానికి నడుపగలదు