దైవిక ప్రమాణాలకు కట్టుబడివుంటూనే నమ్యతతో ఉండడం
“సహనంగల వ్యక్తులు ఎన్నడూ మూఢులు కారు, మూఢులు ఎన్నడూ సహనంగల వ్యక్తులు కారు” అంటుంది ఒక చైనా సామెత. ఆ సామెతలో ఎంతో నిజం దాగివుంది, ఎందుకంటే సహనం కలిగివుండడం ఒక సవాలు, అందుకు సరైన ప్రవర్తనా ప్రమాణాలకు కట్టుబడి ఉండడం అవసరం. కానీ మనం ఏ ప్రమాణాలకు కట్టుబడివుండాలి? మానవజాతి నిర్మాణకర్త తన వాక్యమైన పరిశుద్ధ బైబిలులో వివరించినట్లుగా ఆయన పెట్టిన ప్రమాణాలను అనుసరించడం తర్కబద్ధం కాదా? దేవుడు తానే తన ప్రమాణాలకు తగినట్లుగా ఉండడంలో ఉత్కృష్టమైన మాదిరిగా ఉన్నాడు.
సృష్టికర్త—మన అత్యంత గొప్ప మాదిరి
సర్వోన్నత దేవుడైన యెహోవా సహనంలో సంపూర్ణంగా సమతౌల్యం కలిగివున్నాడు, అటు అతిగా చూపడు ఇటు మరీ తక్కువగా చూపడు. వేలాది సంవత్సరాలుగా, ఆయన తన నామాన్ని కళంకపర్చేవారిని, మానవజాతిని భ్రష్టపర్చేవారిని, భూమిని దుర్వినియోగం చేసేవారిని సహించాడు. రోమీయులు 9:22లో నమోదు చేయబడినట్లుగా, దేవుడు ‘నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను బహు దీర్ఘశాంతముతో సహించాడు’ అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. దేవుడు ఎందుకు అంత కాలం సహనంతో ఉన్నాడు? ఎందుకంటే ఆయన సహనానికి ఒక ఉద్దేశం ఉంది.
దేవుడు “యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు” ఉన్నాడు గనుక ఆయన మానవజాతి ఎడల ఓర్పుతో ఉన్నాడు. (2 పేతురు 3:9) సృష్టికర్త మానవజాతికి బైబిలును ఇచ్చి, ప్రవర్తన విషయంలో తన ప్రమాణాలను అంతటా తెలియజేయాలని తన సేవకులకు నియమించాడు. నిజ క్రైస్తవులు ఈ ప్రమాణాలకు కట్టుబడివున్నారు. కానీ దీనర్థం దేవుని సేవకులు అన్ని సందర్భాలలో కఠినంగా ఉండాలనా?
నమ్యతతో ఉన్నప్పటికీ దృఢంగా ఉండడం
“ఇరుకు ద్వారమున ప్రవేశించు”మని నిత్యజీవం కోరేవారిని యేసుక్రీస్తు ప్రోత్సహించాడు. కానీ ఇరుకు ద్వారం గుండా వెళ్లడం అంటే ఇరుకైన మనస్సు కలిగివుండడమని అర్థం కాదు. మనం ఇతరుల మధ్య ఉన్నప్పుడు వారిపై ప్రాబల్యం కలిగివుండాలనే స్వభావంతోను, లేక తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అనే స్వభావంతోను ఉంటే, మనం ఈ వైఖరికి కళ్లెం వేస్తే అందరి జీవితాలు నిశ్చయంగా మరింత ఆహ్లాదకరంగా ఉంటాయి. కానీ ఎలా?—మత్తయి 7:13; 1 పేతురు 4:15.
గ్రీకు విద్యార్థిని అయిన థీయోఫానో విభిన్న పూర్వరంగాలు గల ప్రజలతో కలిసి సమయాన్ని గడపడం వారిని మరింత చక్కగా అర్థం చేసుకోవడానికి నడిపిందని వివరించింది. ఆమె ఇలా అంటుంది: “వారు మన ఆలోచనా విధానాన్ని అవలంబించడానికి ప్రయత్నించేలా బలవంతం చేయడం కన్నా మనం వారి విధానంలో వెళ్లడానికి ప్రయత్నించడం ప్రాముఖ్యం.” అందువల్ల, ఎవరినైనా బాగా తెలుసుకోవడం ద్వారా ఆహారం విషయంలో వారి అభిరుచి చివరికి భాషకు సంబంధించి వారి యాస కూడా మనం అనుకున్నంత విడ్డూరంగా ఏమీ లేవని కనుగొనవచ్చు. సంభాషణలో ప్రతీసారి మనమే ఎక్కువగా మాట్లాడడానికి లేక మన మాటే నెగ్గాలని పట్టుబట్టడానికి బదులుగా వారి దృక్కోణాన్ని వినడం ద్వారా మనం అనేక ఉపయోగకరమైన విషయాలు నేర్చుకుంటాము. నిజానికి, నూతన భావాలను గ్రహించే మనస్సున్న ప్రజలు జీవితం ఎంతో ప్రతిఫలదాయకంగా ఉన్నట్లు కనుగొంటారు.
వ్యక్తిగత అభిరుచి ఇమిడివున్నప్పుడు మనం నమ్యతతో ఉండాలి, ఇతరులు తమ స్వంత ఎంపికను కలిగివుండేలా అనుమతించాలి. కానీ ప్రవర్తనలో మన సృష్టికర్తకు విధేయత కనపర్చడం ఇమిడివుంటే మనం దృఢంగా ఉండాలి. సర్వోన్నత దేవుడు అన్ని విధాలైన ప్రవర్తనలను ఆమోదించడు. ఆయన దీన్ని గతంలో తన సేవకులతో వ్యవహరించడంలో స్పష్టం చేశాడు.
సహనం అతిగా కలిగివుండడమనే ఉచ్చు
ప్రాచీన ఇశ్రాయేలు జనాంగం యొక్క యాజకుడైన ఏలీ దేవుని సేవకుడు, ఆయన సహనం అతిగా కనపర్చే ఉచ్చులో చిక్కుకున్నాడు. ఇశ్రాయేలీయులు దేవుని నియమాలకు విధేయులవ్వడానికి అంగీకరిస్తూ ఆయనతో ఒక నిబంధన సంబంధంలోనికి ప్రవేశించారు. కానీ ఏలీ ఇద్దరు కుమారులు హోఫ్నీ, ఫీనెహాసు పేరాశపరులుగాను అనైతికంగాను ఉండి, సర్వోన్నతుని ఎడల ఎంతో అగౌరవంతో ప్రవర్తించారు. దేవుని ధర్మశాస్త్రంలో నిష్ణాతుడైనప్పటికీ, ఏలీ కేవలం చిన్నగా మందలించి ఊరుకున్నాడు, క్రమశిక్షణను అందించడంలో కటువుగా ప్రవర్తించలేదు. దేవుడు దుష్టత్వాన్ని సహిస్తాడని అనుకోవడంలోనే ఆయన పొరబాటు చేశాడు. సృష్టికర్త బలహీనతను దుష్టత్వాన్ని వేరువేరుగా దృష్టిస్తాడు. వారు ఇష్టపూర్వకంగా దేవుని ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించడం వలన ఏలీ ఇద్దరు దుష్ట కుమారులు తీవ్రంగా శిక్షించబడ్డారు—మరి అది వారికి తగినదే.—1 సమూయేలు 2:12-17, 22-25; 3:11-14; 4:17.
మన కుటుంబంలో మన పిల్లలు మళ్లీ మళ్లీ తప్పులు చేస్తూ ఉండడాన్ని పట్టించుకోకుండా అతిగా సహనం కనబరచడం ఎంతటి విషాదకరమైన విషయమో! వారిని “ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను” పెంచడం ఎంత శ్రేష్ఠం! ప్రవర్తన విషయంలో మనమే దైవిక ప్రమాణాలను అంటిపెట్టుకుని, వాటిని మన పిల్లల్లో నాటాలి అని దీనర్థం.—ఎఫెసీయులు 6:4.
అదేవిధంగా, క్రైస్తవ సంఘం దుష్టత్వాన్ని సహించలేదు. ఒకవేళ ఒక సభ్యుడు తప్పుడు మార్గాన్ని అభ్యసించి, పశ్చాత్తాపపడడానికి నిరాకరిస్తే ఆయనను తీసివేయాలి. (1 కొరింథీయులు 5:9-13) అయితే, నిజ క్రైస్తవులు కుటుంబ వలయం బయట, సంఘం బయట సమాజాన్ని మొత్తంగా మార్చాలని ప్రయత్నించరు.
యెహోవాతో ఒక బలమైన సంబంధం
అసహనం చింతతో కూడిన వాతావరణాన్ని సృష్టిస్తుంది. అయితే, ఒకవేళ మనం యెహోవాతో సన్నిహిత వ్యక్తిగత సంబంధం కలిగివుంటే మనం సరైన సమతౌల్యాన్ని కల్గివుండడానికి సహాయం చేసే ఒక భద్రతా భావాన్ని మనం అనుభవిస్తాము. “యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును” అని మనం సామెతలు 18:10నందు చదువుతాము. నిశ్చయంగా సృష్టికర్త తగిన సమయంలో సరిదిద్దలేని ఎటువంటి హానీ మనకు లేక మన ప్రియమైన వారికి సంభవించదు.
దేవునితో సన్నిహిత సంబంధం ద్వారా గొప్పగా ప్రయోజనం పొందినవారిలో ఒకరు అపొస్తలుడైన పౌలు. సౌలు అనే పేరుతో తెలియబడ్డ యూదునిగా ఆయన యేసుక్రీస్తు అనుచరులను హింసించాడు, తద్వారా రక్తాన్ని చిందించినందుకు అపరాధి అయ్యాడు. కానీ సౌలు తానే క్రైస్తవుడయ్యాడు, అపొస్తలుడైన పౌలుగా మారిన తర్వాత పూర్తికాల సువార్త పనిలో నిమగ్నమయ్యాడు. “గ్రీసుదేశస్థులకును గ్రీసుదేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును” ప్రజలందరికినీ ప్రకటించడంలో పౌలు నూతన భావాలను గ్రహించే మనస్సుగల వైఖరిని ప్రదర్శించాడు.—రోమీయులు 1:14, 15; అపొస్తలుల కార్యములు 8:1-3.
ఆయన ఎలా మారగల్గాడు? లేఖనముల కచ్చితమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడం ద్వారాను పక్షపాతి కానివాడైన దేవుని ఎడల ప్రేమలో అభివృద్ధిచెందడం ద్వారాను ఆయనలా చేయగల్గాడు. దేవుడు ప్రతి వ్యక్తిని వారి సంస్కృతి లేక జాతి ఆధారంగా కాదు గానీ అతడు లేక ఆమె ఏమై ఉన్నాడు లేక ఏమై ఉంది మరియు ఏమి చేస్తాడు లేక ఏమి చేస్తుంది అన్న దాని ఆధారంగా తీర్పుతీర్చడంలో ఆయన సరైనదే చేస్తున్నాడని పౌలు తెలుసుకున్నాడు. అవును, దేవునికి క్రియలు ప్రాముఖ్యం. “దేవుడు పక్షపాతి కాడని . . . ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును” అని పేతురు చెప్పాడు. (అపొస్తలుల కార్యములు 10:34, 35) సర్వశక్తుడైన దేవుడు దురభిమానం గలవాడు కాడు. తమ స్వంత ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి ఉద్దేశపూర్వకంగా అసహనాన్ని ఉపయోగించుకొనే కొంతమంది ప్రపంచ నాయకులకు ఇది భిన్నంగా ఉంది.
కాలాలు మారుతున్నాయి
ఇంగ్లాండులోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన జాన్ గ్రే ప్రకారం సహనం అనేది “ఒక సద్గుణం, అది ఈమధ్య చాలా అరుదైపోయింది.” కానీ ఇది మారుతుంది. దైవిక జ్ఞానంతో సమతౌల్యం చేయబడిన సహనం జయిస్తుంది.
త్వరలోనే రానైయున్న దేవుని నూతన లోకంలో అసహనం కనుమరుగౌతుంది. దురభిమానం, మూఢత్వం వంటి అసహనం యొక్క తీవ్రమైన రూపాలు నామరూపాలు లేకుండా పోతాయి. సంకుచిత స్వభావం ఇక ఎంతమాత్రం జీవితంలోని ఆనందాన్ని పీల్చివేయదు. అప్పుడు, కాశ్మీరు లోయలో సాధ్యమవ్వగల పరదైసుకన్నా ఎంతో గొప్ప పరదైసు వస్తుంది.—యెషయా 65:17, 21-25.
ఆ నూతన లోకంలో జీవించడానికి మీరు ఎదురుచూస్తున్నారా? అది ఎంతటి విశేష ఆధిక్యతయై ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది!
[8వ పేజీలోని చిత్రం]
అపొస్తలుడైన పౌలు సరైన సమతౌల్యాన్ని ప్రదర్శించాడు ఎందుకంటే ఆయన దేవునితో సంబంధాన్ని కలిగివున్నాడు