మా పాఠకుల నుండి
ఆద్యంతం చదవడం నాకు తేజరిల్లు! ఎప్పుడూ ఇష్టమే. కాని నా శ్రద్ధను ఆకర్షించిన శీర్షికలను మాత్రమే నేను చదివేదాన్ని. ఇప్పుడిప్పుడు పత్రికను నేను ఆద్యంతం చదువుతున్నాను, అలా మునుపైతే వదిలిపెట్టి ఉండే విషయాలు ఇప్పుడు ఎంతో ఇష్టమైనవిగా మారుతున్నాయి. ఉదాహరణకు, “ప్రాచీన అమెరికన్ ఇండియన్ పారంపర్యం” (మార్చి 8, 1996 ఆంగ్లం) చదవడం ఇప్పుడే ముగించాను, నిజంగా దాన్ని చదివి ఆనందించాను!
ఇ. ఎ. ఎస్., బ్రెజిల్
ఇతరులను నొప్పించడం “బైబిలు ఉద్దేశము: మీరు ఎదుటివారి మనస్సు నొప్పించినప్పుడు ఏమి చేయాలి” అనే (మార్చి 8, 1996) శీర్షిక సరిగ్గా సమయానికి వచ్చింది. ఒక క్రైస్తవ సహోదరి అకస్మాత్తుగా నాతో మాట్లాడడం మానివేసింది. నేను ఆమెను నొప్పించేదేమైనా చేశానా అని అడిగాను, క్షమించమని కోరాను. కాని ఇది ఆమె దృక్పథాన్ని మార్చలేదు. దానితో చాలా బాధపడ్డాను, యెహోవాకు నేను చేసే సేవ అంగీకారయోగ్యమైనది కాదని తలంచనారంభించాను. శీర్షిక యొక్క చివరి పేరాను చదివి నేనెంతగా ఊరట పొందానో! “మీరు సమాధానపడేందుకు ఒకసారి ప్రయత్నించిన తర్వాత, యెహోవా మీ ఆరాధనను ఆనందంగా అంగీకరిస్తాడనే” అది చెప్పింది.
ఎమ్. ఆర్., అర్జెంటీనా
త్రాచు పాము “ఓ త్రాచుపామును కలిసేందుకు మీరు ఇష్టపడతారా?” అనే (ఏప్రిల్ 8, 1996) శీర్షిక చాలా ఆసక్తికరమైనది. కాని 12వ పేజీలోని చిత్రం దగ్గరున్న క్యాప్షన్‌లో “ఓ వెచ్చని రాతిపై ఎండకాచుకుంటూ ఓ నల్ల త్రాచుపాము తన పడగను విప్పుతుంది” అని ఉంది. నాకు తెలిసినంత వరకు, త్రాచు పాము అపాయాన్ని గ్రహించినప్పుడు లేదా కోపం వచ్చినప్పుడు మాత్రమే తన పడగను విప్పుతుంది.
ఆర్. ఎఫ్., జర్మనీ
14వ పేజీలోని 1వ పేరాలోను 16వ పేజీ 2వ పేరాలోను ఆ శీర్షికలో అది వివరించబడింది. ఆ ఫోటోలోని త్రాచు పాము ఫోటోగ్రాఫర్ అసిస్టెంట్ రెచ్చగొట్టినందుకు చేస్తున్న ప్రతిక్రియ అని ఇండియాలోని మా విలేఖరి చెబుతున్నారు.—ఎడిటర్
వికలాంగుడైన డ్రైవర్ “వికలాంగున్ని అయినా వాహనం నడిపేందుకు సమర్థున్ని” అనే (జూన్ 8, 1996) శీర్షిక సరైన సమయానికి వచ్చింది. ఒక వికలాంగునిగా నా క్రైస్తవ పరిచర్య చాలా పరిమితంగా ఉందని నేను కనుగొన్నాను. యెహోవా కృప వలన, నేనిప్పుడు ఒక మోడిఫైడ్ కారును సంపాదించుకున్నాను, ఈ శీర్షిక నా పరిచర్యను విపులం చేసుకునేందుకు నన్ను పురికొల్పింది.
ఎ. ఎ. వి., బ్రెజిల్
నాట్యం విరామ కార్యక్రమంగా శాస్త్రీయ, లాటిన్, సాఫ్ట్ పాపులర్ సంగీతానికి నాట్యం చేయడంలో నేను ఆనందిస్తాను. “బైబిలు ఉద్దేశము: నాట్యం క్రైస్తవుల కొరకా?” అనే (జూన్ 8, 1996) శీర్షికను నేను నిజంగా ప్రశంసిస్తున్నాను. ఈ రకమైన వినోదాన్ని సునిశితంగా పరిశీలించి దాని స్థానంలో దానిని ఉంచేందుకు ఇది నాకు సహాయపడింది. మీరు వేసిన మనస్సాక్షిని పరిశీలించే ప్రశ్నలు నేను నిష్కళంకంగా ఉండడానికి, “ఇహలోకమాలిన్యము” నాకు ‘అంటకుండా’ చూసుకునేందుకు నాకు సహాయపడతాయి.—యాకోబు 1:27.
డి. డి. జి., ట్రినిడాడ్
నాకు 15 ఏండ్లు. నాట్యం విషయానికొస్తే ఏది ఉచితమైనది ఏది అనుచితమైనది అని తీర్మానించుకోవడం చాలా కష్టమని నేను కనుగొన్నాను. ఆ శీర్షిక బైబిలు నుండి ఉదాహరించబడిన లేఖనాలతో సహా ఇచ్చిన నిర్దేశాన్ని ఉపయోగించి ఉచితమైనదేదో నేను ఇప్పుడు తీర్మానించుకోగలుగుతున్నాను.
ఎమ్. ఆర్., అమెరికా
సరిగా వినిపించనివారి కొరకైన ఏర్పాట్లు నేను చెవిటిదాన్ని, అంధురాలను, “సంజ్ఞలు చేసే చేతులతో భాషించడం” అనే (ఏప్రిల్ 8, 1996 ఆంగ్లం) శీర్షికకు మీకు కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నాను. అమెరికా సంజ్ఞ భాషలో జరిగిన యెహోవాసాక్షుల “ఆనందమయ స్తుతికర్తలు” అనే జిల్లా సమావేశాన్ని గూర్చి అది చెబుతుంది. చాలామంది చెవిటివారు అంధులు అక్కడ హాజరయ్యారని తెలుసుకోవడం నాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉండింది. 1995 డిశంబరులో మాకు జిల్లా సమావేశం జరిగినప్పుడు, నా కోసం సమావేశ కార్యక్రమాన్ని అనువదించిన వారికి నేను చాలా కృతజ్ఞురాలను. నేను బ్రెయిలీ నేర్చుకోనే లేదు. కనుక ఇతరులకు ప్రకటించేందుకు నేను 121 బైబిలు పాఠ్యభాగాలను కంఠాపాఠం నేర్చుకున్నాను. చెవిటివారు వినడాన్ని గూర్చి, నత్తివారు మాట్లాడడాన్ని గూర్చి యెషయా 35:5, 6లో ఉన్న దేవుని వాగ్దాన నెరవేర్పును చూడాలన్నది నా కోరిక. రానున్న పరదైసులో నేను యెహోవాకు స్తుతికీర్తనలు పాడగల్గాలని కోరుకుంటున్నాను!
ఎ. ఎఫ్. ఎ., అర్జెంటీనా