మనం మన జన్యువులచే పూర్వనిర్ణీతం చేయబడ్డామా?
“మ న విధి నక్షత్రాల్లో ఉందని మనం అనుకునేవాళ్లం. ఇప్పుడు చాలామట్టుకు మన విధి మన జన్యువుల్లోనే ఉందని మనకు తెలుసు.” రూత్ హబ్బర్డ్, ఇలైజా వాల్డ్‌లు వ్రాసిన ఎక్స్‌ప్లోడింగ్ ద జీన్ మిథ్ అనే పుస్తకం తొలిభాగంలో జేమ్స్ వాట్సన్ అలా చెప్పినట్లు ఎత్తివ్రాయబడింది. అయితే, వాట్సన్ మాటలకు క్రిందుగా, ఆర్.సి. లవాన్‌టన్, స్టీవెన్ రోజ్, లీయాన్ జే. కేమన్‌లు ఇలా చెబుతున్నట్లుగా ఎత్తివ్రాయబడింది: “సాంఘిక పరిస్థితుల ద్వారా రూపుదిద్దలేని విధంగా మన జన్యువులలో నిర్మించబడ్డ ఏ ప్రాముఖ్యమైన మానవ సాంఘిక ప్రవర్తన గురించీ మేము ఊహించలేకపోతున్నాము.”
ఆ పుస్తకంలో ఉన్న విషయాలలో కొన్నింటిని క్లుప్తీకరించే దాని పైఅట్ట, “మానవ ప్రవర్తన జన్యు సంబంధమైనదా?” అనే కీలక ప్రశ్నతో మొదలౌతుంది. ఇంకొక మాటలో చెప్పాలంటే, మానవ ప్రవర్తన పూర్తిగా జీవి యొక్క ఆనువంశిక జీవశాస్త్ర స్వభావాలను, విశిష్ట లక్షణాలను సంక్రమింపజేసే జన్యువులచే నిర్ధారించబడుతుందా? అది జన్యు సంబంధమైనది కాబట్టి ఏదైనా అనైతిక ప్రవర్తన అంగీకారయోగ్యంగా ఉండాలా? జన్యుపరమైన ఉన్ముఖత మూలంగా బాధ్యత క్షీణించిందని వాదించగలుగుతూ వారు జన్యు లిపి బాధితులని నేరస్థుల ఎడల వ్యవహరించాలా?
ఈ శతాబ్దంలో శాస్త్రజ్ఞులు అనేక ప్రయోజనకరమైన ఆవిష్కరణలు చేశారనడంలో సందేహమేమీ లేదు. ఈ ఆవిష్కరణల్లో మన జన్యు నిర్మాణ బ్లూప్రింట్ అని పిలువబడే అద్భుతమైన DNA ఉంది. జన్యు లిపి కలిగివుండే సమాచారం శాస్త్రజ్ఞులలోను, పామరులలోను ఒకే విధంగా ఆసక్తిని రేకెత్తించింది. జన్యుశాస్త్ర రంగంలో పరిశోధన నిజంగా ఏమి కనుగొంది? కనుగొనబడిన విషయాలు ఆధునిక ప్రీప్రోగ్రామింగ్ సిద్ధాంతానికి లేక పూర్వనిర్ణీతం చేయబడుతుందనే సిద్ధాంతానికి మద్దతునిచ్చేందుకు ఎలా ఉపయోగించబడ్డాయి?
దాంపత్య ద్రోహం, సలింగ సంపర్కం విషయమేమిటి?
ది ఆస్ట్రేలియన్‌లో ప్రచురించబడిన ఒక శీర్షిక చెబుతున్నదాని ప్రకారం, “దాంపత్య ద్రోహం బహుశ మన జన్యువులలో ఉన్నట్లుంది. . . . మన వంచించే వ్యక్తిత్వాలు ఆ విధంగా ఉండేట్లు ముందే నిర్ధారించబడ్డాయన్నట్లుగా కనబడుతుంది” అని కొంత జన్యు సంబంధ పరిశోధన నొక్కి చెబుతుంది. విచ్చలవిడి జీవనరీతికి కారణం క్షీణించిన తమ బాధ్యతాభావమే అని వాదించాలనుకునే వారెవరికైనా ఒక లొసుగును సృష్టించడం ద్వారా ఈ వైఖరి వివాహాలపై, కుటుంబాలపై ఎటువంటి విధ్వంసాన్ని తీసుకు రాగలదో కొంచెం ఊహించండి!
సలింగ సంపర్కం గురించి “పుట్టుకా లేక పెంపకమా?” అన్న ప్రధాన శీర్షిక న్యూస్‌వీక్ పత్రికలో ప్రచురించబడింది. ఆ శీర్షిక ఇలా పేర్కొంది: “సలింగ సంపర్కం జన్యుశాస్త్ర సంబంధ విషయమై ఉండవచ్చు, పెంపకానికి సంబంధించినది కాకపోవచ్చు అని సూచించే క్రొత్త పరిశోధనను విజ్ఞానశాస్త్రము, మనోవ్యాధిశాస్త్రములు అర్థం చేసుకోవడానికి యాతనపడుతున్నాయి. . . . సలింగ సంపర్కం క్రోమోసోమ్‌లలోనే మొదలౌతుందనే సూచనను సలింగ సంపర్క సమాజంలోనే అనేకమంది అంగీకరిస్తున్నారు.”
తరువాత ఆ శీర్షిక డా. రిచర్డ్ పిల్లర్డ్ ఇలా చెప్పినట్లు ఉదాహరించింది: “ఒకరి లైంగిక ఉన్ముఖత జన్యుశాస్త్రంచే నిర్ధారించబడితే దానర్థం ‘ఇది తప్పు కాదు, అది నీ తప్పు కాదు.’” “ఏ తప్పూ లేదు” అనే ఈ వాదనను మరింత బలపరుస్తూ, సలింగ సంపర్క పరిశోధకుడు ఫ్రెడ్‌రిక్ విటమ్ “సలింగ సంపర్కం స్వాభావికమైనదని చెప్పినప్పుడు, ప్రజలలో ఉపశమనంతో కూడిన నిట్టూర్పు విడిచే ధోరణి ఉంది. అది కుటుంబాలను, సలింగ సంపర్కులను అపరాధ భావాన్నుండి విముక్తులను చేస్తుంది. సమాజం సలింగ సంపర్కులైన ఉపాధ్యాయులు వంటి విషయాలను గురించి అంతగా చింతించనవసరం లేదని కూడా దాని భావం” అని చెబుతున్నాడు.
కొన్నిసార్లు, సలింగ సంపర్క ధోరణులు జన్యువులచే నిర్ధారించబడతాయన్న దానికిగల ఆరోపిత సాక్ష్యాన్ని ప్రసార మాధ్యమాలు సాధ్యతగలది మరియు కచ్చితంగా చెప్పలేనిది అన్నట్లుగా కాకుండా వాస్తవికమైనది మరియు నిర్ణాయకమైనది అన్నట్లుగా చూపించాయి.
న్యూ స్టేట్స్‌మన్ & సొసైటీ అనే పత్రిక ఆకర్షణీయమైన అలంకారిక భాషను ఉపయోగిస్తూ దానిపై చన్నీళ్లు గుమ్మరించింది: “దిగ్భ్రమచెందిన పాఠకుడు స్పష్టమైన భౌతిక సాక్ష్యాన్ని—లేదా, నిజానికి, విచ్చలవిడితనం ‘పురుష జన్యువులలో సంకేత లిపిలో ఉంది, పురుష మెదడు సర్క్యూట్‌బోర్డ్‌పై ముద్రించబడింది’ అనే విజ్ఞానశాస్త్ర పరంగా సంచలనాత్మకమైన [నింద్యమైన] వాదనకు ఆధారం పూర్తిగా లేకపోవడాన్ని ఉపేక్షించవచ్చు.” క్రాకింగ్ ద కోడ్ అనే తమ పుస్తకంలో, డేవిడ్ సూజూకీ, జోసెఫ్ లవైన్‌లు ప్రస్తుత జన్యు పరిశోధన గురించి తమ చింతను వ్యక్తం చేస్తున్నారు: “జన్యువులు ప్రవర్తనను సాధారణ భావంలో ప్రభావితం చేస్తాయని వాదించడం సాధ్యమైనప్పటికీ, ఒక నిర్దిష్ట జన్యువు—లేక జన్యువుల జంట, లేక చివరికి ఇరవై జన్యువులు—తన పరిసరాలకు ఒక జంతువు చూపే ప్రతిస్పందనల నిర్దిష్టమైన వివరాలను నిజంగా నియంత్రిస్తాయని చూపించడం పూర్తిగా వేరే విషయం. ఇక్కడ, ఎవరైనా నిర్దిష్ట ప్రవర్తనలను ముందే చెప్పగలిగే రీతిలో ప్రభావితం చేసే DNA యొక్క తీగెలను, వాటి చోటును కనిపెట్టి, వాటిని మార్చగలిగే కచ్చితమైన అణు భావంలో ఎవరైనా కనుగొన్నారేమోనని అడగడం న్యాయంగా ఉంటుంది.”
త్రాగుబోతుతనానికి మరియు అపరాధిత్వానికి జన్యువులు
సంవత్సరాలుగా త్రాగుబోతుతనంపైన అధ్యయనం అనేకమంది జన్యు పరిశోధకులను ఆకర్షించింది. కొన్ని నిర్దిష్ట జన్యువులు ఉండడము లేక లేకపోవడమే త్రాగుబోతుతనానికి కారణమని అధ్యయనాలు చూపించాయని కొంతమంది వాదిస్తారు. ఉదాహరణకు, ద న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ 1988లో “త్రాగుబోతుతనం వారసత్వంగా లభించే లక్షణమని గత దశాబ్దంలో మూడు వేర్వేరు పరిశోధనలు నిర్ణాయకమైన సాక్ష్యాన్ని అందించాయి” అని నివేదించింది.
అయితే, వ్యసనాల రంగంలో నిపుణులైన కొంతమంది ఇప్పుడు త్రాగుబోతుతనం ఎక్కువగా జీవశాస్త్ర సంబంధ కారణాలచే ప్రభావితం చేయబడుతుందన్న అభిప్రాయాన్ని సవాలు చేస్తున్నారు. ఏప్రిల్ 9, 1996, ద బోస్టన్ గ్లోబ్‌లోని నివేదిక ఇలా పేర్కొంది: “త్రాగుబోతుతనపు జన్యువు కనుచూపుమేరలో కనిపించడంలేదు, కొంతమందిని త్రాగుబోతుతనానికి ఆయత్తపర్చే లక్షణమైన తూలే స్థితికి చేరుకోకుండానే మరీ ఎక్కువగా త్రాగేందుకు అనుమతించే జన్యు సంబంధ శక్తిని మాత్రమే బహుశ తాము కనుగొంటామని కొంతమంది పరిశోధకులు గుర్తిస్తున్నారు.”
యూనివర్శిటీ ఆఫ్ మేరీలాండ్ వద్ద “జన్యుశాస్త్రం మరియు నేర ప్రవృత్తిలపై పరిశోధన యొక్క భావము, ప్రాముఖ్యత” అన్న పేరుతో జరిగిన ఒక సమావేశంపై ద న్యూయార్క్ టైమ్స్ నివేదికనిచ్చింది. నేర జన్యువు అనే ఆలోచన చాలా సరళంగా ఉంది. చాలామంది వ్యాఖ్యాతలు అదే పంథాను అనుసరించడానికి ఉత్సాహంగా ఉన్నట్లున్నారు. ద న్యూయార్క్ టైమ్స్ మ్యాగజైన్‌లో ఒక విజ్ఞానశాస్త్ర రచయిత, బహుశ దుష్టత్వమనేది “గర్భధారణ సమయంలో మన తలిదండ్రులు మనకు అందజేసే క్రోమోసోమ్‌ల చుట్టలోనే పొదగబడి” ఉండవచ్చని చెప్పాడు. అపరాధిత్వానికి ఉన్ముఖులను చేసే జన్యువుల గురించిన క్రమమైన చర్చ, నేరం అనేది “మెదడులోని క్రమరాహిత్యం అనే ఒక సామాన్య మూలం” కలిగివుందన్న అభిప్రాయాన్ని సృష్టిస్తుందని ద న్యూయార్క్ టైమ్స్‌లోని ఒక శీర్షిక నివేదిస్తుంది.
జన్యుశాస్త్ర పరీక్షలు హింసాత్మక ప్రవర్తనా ప్రవృత్తిని చూపే పిల్లలను గుర్తించే సమయం వస్తుందని హార్వర్డ్ మానసిక శాస్త్రవేత్త అయిన జెరోమ్ కేగన్ జోస్యం చెబుతున్నాడు. సాంఘిక సంస్కరణ ద్వారా చేసే బదులు జీవశాస్త్రపరంగా కలుగజేసుకుని నేరాన్ని అదుపుచేయగల ఆశ ఉండవచ్చని కొంతమంది ప్రజలు సూచిస్తారు.
ప్రవర్తనకున్న జన్యు సంబంధ ఆధారాన్ని గురించిన ఊహాకల్పనలను నివేదించేటప్పుడు భాష తరచూ సందిగ్ధంగాను, అనిశ్చయంగాను ఉంది. ఎక్స్‌ప్లోడింగ్ ద జీన్ మిథ్ పుస్తకం, క్రుంగుదలకు జన్యు సంబంధమైన కారణాన్ని తాను కనుగొన్నానని చెప్పిన ప్రవర్తనా జన్యుశాస్త్రవేత్తయైన లింకన్ ఈవ్స్ చేసిన అధ్యయనాన్ని గురించి చెబుతుంది. క్రుంగుదలకు గురౌతారని పరిగణించబడిన స్త్రీలను సర్వే చేసిన తరువాత ఈవ్స్, “[స్త్రీల] క్రుంగుదలతో కూడిన స్వభావం మరియు విధానం అటువంటి యాదృచ్చిక విపత్తులు జరిగే సాధ్యతను మరింత ఎక్కువగా చేసివుండవచ్చని సూచించాడు.” ఈ “యాదృచ్ఛిక విపత్తులు” ఏమిటి? అధ్యయనం చేయబడిన స్త్రీలు “మానభంగం చేయబడ్డారు, దాడిచేయబడ్డారు, లేక వారి ఉద్యోగాల నుండి తీసివేయబడ్డారు.” అయితే ఈ ఉద్వేగాఘాత సంఘటనలను క్రుంగుదల కలుగజేసిందా? “అదేమి తర్కం?” అని అంటూ ఆ పుస్తకం కొనసాగింది. “స్త్రీలు మానభంగం చేయబడ్డారు, దాడిచేయబడ్డారు, లేక వారి ఉద్యోగాల నుండి తీసివేయబడ్డారు, మరి వారు క్రుంగిపోయారు. వారెంత ఉద్వేగాఘాత సంఘటనలను అనుభవించారో అంత ఎక్కువగా క్రుంగుదల ఉంది. . . . క్రుంగుదల ఏదో జీవితానుభవానికి సంబంధించినది కాదని ఒకవేళ ఆయన [ఈవ్స్] కనుగొని ఉంటే జన్యు సంబంధమైన లింకు కొరకు వెదకడం విలువైనదిగా ఉండేది.”
ఈ కథలు “వార్తా మాధ్యమాలలోను, విజ్ఞానశాస్త్ర జర్నల్‌లలోను రెండింటిలోనూ [ప్రవర్తనా] జన్యుశాస్త్రంపై వచ్చిన అనేకమైన తాజా నివేదికలకు ఉదాహరణలుగా ఉన్నాయి. మన జీవితాలలో జన్యువుల ప్రాముఖ్యతను గూర్చిన ఆసక్తికరమైన వాస్తవాలు, నిరాధారమైన ఊహలు, విశృంఖలమైన అతిశయోక్తులతో కూడిన మిశ్రమం వాటిలో ఉంటుంది. ఈ వ్రాతల్లో గమనించదగ్గ విషయం ఏమిటంటే దాని సందిగ్ధతే” అని అదే ప్రచురణ అంటుంది. అదింకనూ ఇలా అంటోంది: “కేన్సర్ లేక అధిక రక్తపు పోటు వంటి సంక్లిష్ట పరిస్థితులను వివరించడం కొరకు మెండెల్ ఆనువంశిక నమూనాను అనుసరించే పరిస్థితులతో జన్యువులను జతచేయడానికి మరియు ఊహాజనిత జన్యు సంబంధ ‘ధోరణులను’ ఉపయోగించడానికి చాలా తేడా ఉంది. మానవ ప్రవర్తనలను వివరించడానికి జన్యు పరిశోధన సహాయం చేయగలదని సూచిస్తున్నప్పుడు శాస్త్రజ్ఞులు ఒక ముగింపుకు త్వరగా చేరుకుంటున్నారు.”
అయినప్పటికి ముందు ప్రస్తావించిన వాటి దృష్ట్యా, తరచూ లేవనెత్తబడే ప్రశ్నలు ఇంకా ఆలాగే ఉన్నాయి: మారిన ప్రవర్తనా నమూనాలు మన జీవితాల్లో ఉత్పన్నమౌతున్నట్లు మనం కొన్నిసార్లు ఎందుకు కనుగొంటాము? మరి అటువంటి పరిస్థితులలో మనకు ఎటువంటి నియంత్రణ ఉంటుంది? మన జీవితాలపై నియంత్రణను ఎలా సాధించి, కొనసాగిస్తాము? తరువాతి శీర్షిక ఈ ప్రశ్నలకు కొన్ని జవాబులను ఇవ్వడంలో సహాయకరంగా ఉండవచ్చు.
[6వ పేజీలోని బాక్సు/చిత్రం]
జీన్ థెరపీ—నిరీక్షణలు నెరవేర్చబడ్డాయా?
జన్మసిద్ధ జన్యు వ్యాధులను నయం చేయడానికి విరుగుడు జన్యువులను రోగి శరీరంలోకి ఇంజక్ట్ చేసే జీన్ థెరపీ విషయమేమిటి? కొన్ని సంవత్సరాల క్రితం శాస్త్రజ్ఞులకు గొప్ప ఆశలు ఉండేవి. “జన్యు థెరపీని ప్రారంభించడానికి ఇది సమయమా?” అని అడుగుతూ డిశంబరు 16, 1995 ది ఎకానమిస్ట్ సంచిక ఇలా చెబుతుంది: “దాని ప్రాక్టిషనర్ల బహిరంగ ప్రకటనలనుబట్టి, వార్తాపత్రికలలో బహుగా ప్రచురించడాన్నిబట్టి నిర్ణయిస్తూ ఒకరు అలా అనుకోవచ్చు. కానీ అమెరికాలోని విజ్ఞానశాస్త్ర నిపుణుల పానెల్ విభేదిస్తుంది. ఈ రంగాన్ని సమీక్షించమని పధ్నాలుగుమంది ప్రముఖ విజ్ఞానశాస్త్రజ్ఞులను నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (NIH) ప్రధానాధికారి అయిన హెరోల్డ్ వార్మస్ అడిగాడు. ఏడు నెలల ధ్యానం తరువాత గత వారం ప్రచురించబడిన నివేదికలో జన్యు థెరపీ ఆశావహంగా ఉన్నప్పటికీ, ప్రస్తుత సమయానికి అది సాధించినవి ‘అతిశయోక్తిగా’ ఉన్నాయని వారు అన్నారు.” అడెనోసిన్ డియామినేస్ (ADA) డెఫీషియన్సీ బాధితులు లేక అన్య జన్యువులను చేర్చడం ద్వారా చికిత్సకు వీలౌతుందనుకున్న మరొక డజను ఇతర వ్యాధులు ఉన్న 597 రోగులపై పరీక్షలు జరుపబడ్డాయి. “పానెల్ ప్రకారం, అటువంటి పరీక్షలో పాల్గొనడం నుండి స్పష్టంగా ఒక్క రోగి కూడా ప్రయోజనం పొందలేదు” అని ది ఎకానమిస్ట్ అంటుంది.
[7వ పేజీలోని చిత్రాలు]
జన్యుపరమైన ఉన్ముఖత గురించి కొందరు ఏమని వాదించగలిగినప్పటికీ, తాము ఎలా ప్రవర్తించాలన్న దానిగురించి ప్రజలు ఎంపిక చేసుకోవచ్చు