రబ్బర్ టాపింగ్—మీ జీవితాన్ని స్పృశించే ఒక వృత్తి
నైజీరియాలోని తేజరిల్లు! విలేఖరి ద్వారా
ఉదయం ఐదు గంటలకు, నైజీరియా వర్షపాత అడవి చీకటిగా, చల్లగా ఉంది. అడవి మధ్యలో ఉన్న ఒక మట్టి ఇంట్లో జాన్ నిద్రలేచి, హడావుడిగా బట్టలు వేసుకుంటాడు. తరువాత ఒక లాంతరు, ఒక ప్లాస్టిక్ బకెట్టు, వంపు తిరిగిన అంచుగల ఒక చిన్న కత్తి పట్టుకుని, ఆయన చీకట్లోకి కలిసిపోతాడు. తరువాతి నాలుగు గంటల వరకు, ఒక్కొక్క చెట్టు బెరడు మీద సన్నగా, క్రిందివైపుగా కోస్తూ ఆయన చెట్టు చెట్టుకు వెడతాడు.
చివరికి మీ జీవితాన్ని స్పృశించే సంఘటనల సుదీర్ఘ పరంపరలో ఇది మొదటిది. ఎందుకలా? ఎందుకంటే జాన్ కోసే చెట్లు రబ్బర్ చెట్లు కాబట్టి. మరి, పెన్సిల్ గుర్తులను రబ్ చేసే సామర్థ్యం ఉన్నందుకు ఆ పేరు పెట్టబడిన రబ్బరు, మనకున్న అత్యంత విలువైన, విరివిగా ఉపయోగించబడుతున్న వనరులలో ఒకటి.
వేలకొలది ఉత్పత్తులు
మీ జీవితంలో రబ్బరు పోషించే పాత్ర గురించి కొంచెం ఆలోచించండి. మీ బూట్ల అడుగు భాగం మరియు మడిమె క్రింది భాగం బహుశ రబ్బరు నుండి తయారు చేయబడి ఉండవచ్చు. మీ తివాచీ క్రింది భాగం, ఫర్నిచరు ఫోమ్ రబ్బరు కలిగివుండవచ్చు. మీ బట్టలలోని ఎలాస్టిక్ బహుశ రబ్బరు నుండి తయారు చేయబడి ఉండవచ్చు. వర్షం కురుస్తున్నప్పుడు, మీరు రబ్బరు నుండి తయారు చేయబడిన రైన్కోటును, బూట్లను అందుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఈత కొట్టడానికి వెళ్తున్నారా? వెట్ సూట్లు, గాగుల్స్, ఫిన్స్లలో రబ్బరు ఉంటుంది. మీరు ఈత కొట్టాలనుకోవడం లేదా? బహుశ మీరు కేవలం రబ్బర్ రాఫ్ట్పైన తేలుతూ ఉండాలని, లేదా రబ్బర్ బీచ్ బాల్‌తో ఆడుకోవాలని అనుకోవచ్చు. మీ ఇంట్లో అక్కడక్కడ బహుశ రబ్బరు బాండ్లు, రబ్బర్ ఎరేజర్లు, రబ్బర్ జిగురు ఉండవచ్చు. మీరు రాత్రి నిద్రపోయేటప్పుడు, రబ్బరు ఉత్పత్తుల నుండి తయారు చేసిన పరుపు, దిండుల మీద విశ్రమించవచ్చు. మీకు చలిగా ఉంటే, రబ్బరుతో తయారు చేసిన వేడినీటి బాటిల్‌కు దగ్గరగా సుఖప్రదంగా పడుకోవచ్చు.
ఈ వస్తువులే కాకుండా, రబ్బరుతో చేసిన భాగాలు అంటే వాషర్లు, బెల్టులు, గాస్కెట్లు, నీటి పంపులు, రోలర్లు, లేదా వాల్వులు వంటివి లేకపోతే నిశ్చయంగా చాలా ఉత్పత్తులు అంత బాగా పనిచేయవు. ఉదాహరణకు, ఒక సగటు కారులో, రబ్బరుతో చేసిన దాదాపు 600 భాగాలు ఉంటాయి. ద వరల్డ్ బుక్ ఎన్సైక్లోపీడియా ప్రకారం మొత్తం మీద 40,000 నుండి 50,000 రబ్బరు ఉత్పత్తులు తయారు చేయబడుతున్నాయి.
రబ్బరును అంత ఉపయోగకరమైనదిగా చేసేదేమిటి? అది దీర్ఘకాల మన్నికనిస్తుంది, ఉష్ణనిరోధకత గలది, స్థితిస్థాపక గుణం గలది, నీటినిరోధకత గలది, గాలిని చొరనివ్వదు, దెబ్బను తట్టుకుంటుంది. అది సైకిలుదైనా, మోటారు వాహనానిదైనా, లేక విమానందైనా సరే టైరును పరిశీలించండి. అది రబ్బరు గనుక, రోడ్డుకు దానికి మధ్య బాగా రాపిడి ఉన్నప్పటికీ టైరు త్వరగా అరిగిపోదు, తరచూ ఉండే ఘర్షణ మూలంగా దానికి నిప్పంటుకోదు కూడాను. మీరు బురద గుంటల్లో వెళ్తుంటే, టైరు నీటిలో నానుతుందని, కుళ్లిపోతుందని మీరు భయపడనవసరం లేదు; అది తుప్పు పట్టదు కూడాను. టైరులోకి నీరు వెళ్లడాన్ని ఆపడమే కాకుండా, ఒత్తిడితో లోపలికి ప్రవేశపెట్టబడిన గాలి బయటకు రావడాన్ని కూడా రబ్బరు ఆపుతుంది. అంతేగాక, మీరు ముందుకు వెళ్తుండగా, మీ టైర్లలో ఉన్న రబ్బరుకి ఉన్న దెబ్బను తట్టుకునే గుణం, రోడ్డుమీదున్న ఎత్తుపల్లాల వల్ల మీకు ఇబ్బంది కలుగకుండా కాపాడుతుంది. నిజంగా, రబ్బరు లేకుండా, టైరును ఉత్పత్తి చేయడం తయారీదారులకు ఎంతో కష్టం.
అందువల్ల మన జీవితాలను ఒక అనుకూలమైన విధంగా స్పృశించే విలువైన సేవను జాన్ వంటి రబ్బర్ టాపర్లు అందిస్తారన్న విషయంతో బహుశ మీరు సమ్మతిస్తుండవచ్చు. నిజమే, రబ్బరు అంతా చెట్ల నుండే రాదు. రసాయనాల నుండి ఉత్పత్తి చేయబడే కృత్రిమ రబ్బరు, పరిశ్రమలో అత్యధిక వాటాను కలిగివుంటుంది. రెండు రకాల రబ్బరులకు వాటి వాటి బలాలూ బలహీనతలు ఉన్నాయి. చాలా ఉత్పత్తులు ఏదో ఒకదాన్ని ఉపయోగించవచ్చు, తరచూ వర్తమాన ధరల ఆధారంగా ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ఇతర ఉత్పత్తులు కృత్రిమ, సహజ రబ్బరుల సమ్మేళనాలను ఉపయోగిస్తాయి. అనేక వాహనాల టైర్లు సహజ రబ్బరు కంటే ఎక్కువగా కృత్రిమ రబ్బరును కలిగి ఉంటాయి. అయితే, కృత్రిమ రబ్బరు వేడిని ఎక్కువగా తట్టుకోలేదు గనుక, పందెపు కార్లు, ట్రక్కులు, బస్సులు, విమానాల టైర్లలో ఎక్కువ నిష్పత్తిలో సహజ రబ్బరును ఉపయోగిస్తారు.
చెట్టును టాప్ చేయడం
భూమధ్యరేఖకు దగ్గరగా వేడి, తడి వాతావరణాలలో రబ్బరు చెట్లు చాలా బాగా పెరుగుతాయి. ప్రపంచంలోని సహజ రబ్బరులో ఎక్కువ శాతం ఆగ్నేయాసియా నుండి, ప్రాముఖ్యంగా మలేసియా, ఇండోనేషియాలలోని తోటల నుండి వస్తుంది. మిగతాది దక్షిణ అమెరికా నుండి అలాగే పశ్చిమ, మధ్య ఆఫ్రికాల నుండి వస్తుంది.
చెట్టుకు దాదాపు ఆరు సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు జాన్ దానిని టాప్ చేయడు. అటు తరువాత చెట్టు 25 నుండి 30 సంవత్సరాల వరకు రబ్బరును ఉత్పత్తి చేస్తుంది, దాదాపు 20 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. రబ్బరు చెట్టు ఉత్పత్తి చేయడం నుండి “ఉద్యోగ విరమణ” పొందినప్పుడు, 40 మీటర్ల ఎత్తు వరకు పెరగడం కొనసాగించవచ్చు, అది 100 లేక అంతకంటె ఎక్కువ సంవత్సరాల పండు వయస్సు వరకు చేరుకోవచ్చు.
చెట్టు నుండి నేరుగా వచ్చిన రబ్బరు, పాలలా కనిపిస్తుంది గానీ ఒక కారు టైరులా కన్పించదు. లాటెక్స్ అని పిలువబడే పాలవంటి ఈ పదార్థం, చిన్న రేణువుల పరిమాణంలో రబ్బరును కలిగి ఉంటుంది. లాటెక్స్లోని దాదాపు 35 శాతం రబ్బరు. మిగతాదంతా ఎక్కువగా నీరే.
లాటెక్స్‌ను టాప్ చేయడానికి, జాన్ బెరడు పైన వికర్ణ ఆకృతిలో ఒక గంటు పెడతాడు. ఈ గంటు చెట్టు చుట్టూ సగం వరకు ఉంటుంది. ఆయన మరీ లోతుగా గంటుపెట్టకుండా జాగ్రత్తపడతాడు, ఎందుకంటే అది చెట్టుకు నష్టాన్ని కలుగజేయగలదు. గంటు పెట్టిన వెంటనే లాటెక్స్ ప్రవహించనారంభిస్తుంది; ఆ గంటు ద్వారా ఏర్పడిన చీలిక వెంబడి అది చుక్కలు చుక్కలుగా స్రవిస్తూ, చెట్టుకు జాన్ అంటి పెట్టిన బొంగు కప్పులోకి కారుతుంది. ఈ ధార రెండు లేక మూడు గంటలపాటు కొనసాగుతుంది; తరువాత అది ఆగిపోతుంది.
ఒకటి లేక రెండు రోజుల తరువాత, జాన్ చెట్టును మళ్లీ టాప్ చేస్తున్నప్పుడు, సరీగ్గా మొదటిదాని క్రిందే మరొక గంటు పెడతాడు. అటుతరువాత దాని క్రింద పెడతాడు. చివరికి, చెట్టు బెరడు నుండి ఒక భాగం కోసివేయబడుతుంది. ఇప్పుడు జాన్, భవిష్యత్తులో టాప్ చేయడానికిగాను ఆ భాగం పూర్తిగా మానిపోయేందుకు దానిని విడిచిపెడుతూ, చెట్టులోని మరో భాగాన్ని టాప్ చేయడం మొదలుపెడతాడు.
లాటెక్స్ స్రవించేలా చెట్లను కోస్తూ, నిశ్శబ్ద అడవిలో ఒంటరిగా కదులుతూ జాన్ వేగంగా పని చేస్తాడు. తరువాత, నిండి ఉన్న లాటెక్స్‌ను తన బకెట్టులోకి సేకరిస్తూ, ప్రతి చెట్టును ఆయన పునర్దర్శిస్తాడు. అటుతరువాత, జాన్ లాటెక్స్కు ఫార్మిక్ ఆమ్లాన్ని, నీటిని కలుపుతాడు. ఇలా చేయడం, వినెగర్ పాలను పెరుగులా ఎలా గడ్డకట్టేలా చేస్తుందో అలా దానిని గడ్డకట్టిస్తుంది. తరువాత జాన్ లాటెక్స్తోనున్న ఆ బకెట్టును తన తలపై పెట్టుకుని మెయిన్ రోడ్డువైపుగా వెళ్తాడు, అక్కడ దగ్గరలోని రబ్బరు విధాయిత కర్మాగారం నుండి వచ్చిన ఒక ట్రక్కు దానిని సేకరిస్తుంది.
ఇప్పుడు జాన్ స్నానం చేసి, అన్నం తిని, విశ్రమించడానికి ఇంటికి తిరిగి వస్తాడు. మధ్యాహ్నం కాస్త చల్లబడుతుండగా, మరలా తన ఇంటి నుండి బయలుదేరుతున్నప్పుడు, ఆయన శుభ్రమైన బట్టలు వేసుకుని తయారయ్యి, చేతిలో ఒక బ్రీఫ్‌కేస్ పట్టుకుని ఉంటాడు. ఈసారి ఆయన చెట్టు చెట్టుకు కాదు గానీ, ఇంటింటికి వెళ్తాడు. ఒక క్రమ పయినీరు పరిచారకునిగా జాన్, ప్రకటనా పనిలో, శిష్యులను చేసే పనిలో పూర్తి వంతును కలిగివున్నాడు.
జాన్ తన ఆ నాటి మొదటి బైబిలు పఠనాన్ని నిర్వహిస్తుండగా, తాను సేకరించిన లాటెక్స్ విధాయిత కర్మాగారాన్ని చేరుకుని ఉంటుంది. అక్కడ రబ్బరు నీటి నుండి వేరుచేయబడి, ఎండపెట్టబడి, తరువాత రవాణా కొరకు బేళ్లుగా కుదించబడుతుంది. త్వరలోనే అది ఇంగ్లాండ్, జపాన్, లేక అమెరికాల వైపుగా పయనిస్తుంది. ప్రపంచవ్యాప్త సహజ రబ్బరు పరిశ్రమ, ప్రతి సంవత్సరం యాభై లక్షల టన్నులకు పైగా రబ్బరును ఉత్పత్తి చేస్తుంది. అది బహుశ సంభావ్యం కాకపోయినప్పటికీ, మీ తరువాతి బూట్ల జోడు నందలి సోల్‌లోని రబ్బరు, జాన్ టాప్ చేసిన చెట్టు నుండి వచ్చే సాధ్యత ఉంది.
[12వ పేజీలోని చిత్రం]
ఒక రబ్బరు చెట్టును టాప్ చేసే తన పనిలో జాన్
[14వ పేజీలోని చిత్రం]
జాన్ క్రైస్తవ పరిచర్యలో పాల్గొంటున్నాడు