యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .
నేను కంప్యూటర్ లేక వీడియో ఆటలు ఆడాలా?
వారు మిమ్మల్ని చుట్టుముట్టారు! కానీ మీరు ఏమాత్రం నిస్సహాయులు కారు. మీరు మీ శత్రువులను గోధుమ పనల్లాగ ఊచకోత కోస్తూ, మీరు మీ లేజర్ ఫిరంగులను పేలుస్తారు. సమస్యేమిటంటే, మీరు ఎంత ఎక్కువగా కాలుస్తారో, అంత ఎక్కువమంది శత్రువులు పుట్టుకొస్తారు. అందువలన మీరు తప్పించుకోవాలంటే మీకు ఒకే ఒక్క మార్గం ఉంది—కంటికి కనిపించిన వారినందరినీ చంపేయడమే. మీరు పేలుస్తుండగా, శత్రువులు రక్తపు మడుగులో కూలిపోతారు . . .
“వెన్నులో వణుకు పుట్టించే, ఒళ్లు జలదరింపజేసే, తల విస్ఫోటనం కలుగజేసే సరదా!” ఇది, జనప్రియమైన ఒక కంప్యూటర్ ఆట యొక్క అతినూతన వర్షన్‌ను ఒక పత్రికా రచయిత ఔత్సాహికంగా వర్ణించిన విధానం. వాస్తవానికి, ఉత్కంఠభరిత స్వైరకల్పనల్లో పాల్గొనడానికి ఆటగాళ్లకు అవకాశమిచ్చే నవతరం కంప్యూటర్, వీడియో ఆటలలో ఇది కేవలం ఒక్కటి మాత్రమే. ఈ రక్తసిక్తమైన, తరచూ సాడిస్టికల్‌గా హింసాత్మకమైన ఆటలతో పోలిస్తే మునుపటి విడుదలలు తక్కువ ప్రభావం కలిగినవిగా అనిపించవచ్చు.
అయినప్పటికీ, హింసాత్మకమైన వీడియో, కంప్యూటర్ ఆటలు యౌవనస్థులలో చాలా ఎక్కువగా ప్రసిద్ధిగాంచాయి. అమెరికాలోని మూడింట ఒక వంతు ఇండ్లలో ఏదో ఒక రకమైన ఎలక్ట్రానిక్ ఆట వ్యవస్థ ఉందని అంచనా వేయబడింది, కోట్లాది యౌవనులకు అవి అందుబాటులో ఉన్నాయి. అంతగా సుసజ్జితం కాని ఇండ్లలోని యౌవనులకు, ఈ ఆటలు ఆడడానికి ఒక స్నేహితుని ఇంటికి లేదా స్థానిక వీడియో ఆర్కేడ్‌కు కేవలం కొద్దిదూరం నడిచి వెళ్లాల్సి రావచ్చు.
మీ విషయం ఏమిటి? ఈ క్రొత్త ఆటలలో కొన్నింటిని కొనడానికి—లేక కనీసం ప్రయత్నించడానికి మీరు శోధించబడ్డారా? సరే, వాస్తవాలన్నింటినీ పరిశీలించిన తరువాత, మీరు ఆ విధంగా చేయడం విషయమై మరలా ఆలోచించాలనుకోవచ్చు.
ఆటలన్నీ ఒకే విధమైనవి కావు!
ముందుగా, అన్ని వీడియో లేక కంప్యూటర్ ఆటలు అభ్యంతరకరమైనవి లేక హింసాత్మకమైనవి కావు అని మనం స్పష్టీకరిద్దాము. అనేక ఆటలు విద్యావిషయకంగా ఉన్నాయి; అవి భూగోళశాస్త్రం, గణితం, టైప్ రైటింగు వంటి అంశాలను ఉల్లాసవంతంగా, వినోదాత్మకంగా బోధిస్తాయి. ఇతర ఆటలు బాస్కెట్‌బాల్, హాకీ వంటి క్రీడలను సిమ్యులేట్ చేయడం ద్వారా మన ప్రతిక్రియలను సవాలు చేస్తాయి. ఆలోచనను రేకెత్తించి, మన మనస్సును సవాలు చేసే హై-టెక్ పజిల్స్ కూడా ఉన్నాయి.
శ్రేష్ఠమైన ఆటలు కూడా ఎంతో సమయాన్ని తీసుకుంటాయన్నది నిజమే. ‘సమయమును పోనివ్వక సద్వినియోగం’ చేసికొమ్మని, అంటే ఆత్మీయ గమ్యాలను వెంబడించడంలో సమయాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించమని బైబిలు క్రైస్తవులను ప్రోత్సహిస్తుంది. (ఎఫెసీయులు 5:16) అయితే, మెలకువగా ఉన్న ప్రతి క్షణమూ పని చేయడంలోను, చదవడంలోను గడపాలని బైబిలు కోరడం లేదు. దానికి భిన్నంగా, ‘నవ్వుటకు, నాట్యమాడుటకు సమయము కలదు’ అని అది మనకు గుర్తు చేస్తుంది. (ప్రసంగి 3:4) తగు మోతాదులో ఉంచినప్పుడు, క్రీడా కార్యకలాపాలు సేదదీర్పుగాను, ఆరోగ్యకరంగాను ఉండగలవు.
అయితే, ఈ ఆటల్లో అనేకం ఆటగాళ్లు అత్యంత ఎక్కువ సమయాన్ని వృథా చేయడానికి రూపొందించబడినట్లుగా కనిపిస్తుంది అని మనం ఎరిగి ఉండాలి. వాటిలో కొన్నింట్లో, ఒక నిర్దిష్ట స్థాయివద్ద ఆటలో నైపుణ్యాన్ని సాధించడానికి గంటలకు గంటలు గడుపుతారు. కానీ ముగింపుకు ముందు, అవశ్యంగా ఎంతో జటిలంగా, మరింత క్లిష్టంగా ఉండే మరెన్నో స్థాయిలను సాధించవలసి వస్తుందని ఆటగాడు కనుగొంటాడు! ఎంతో ప్రయాసకు చాలా తక్కువ ప్రతిఫలం ఇస్తున్నట్లు కనిపించే ఆటలు కూడా ఉన్నాయి. డాన్, సామ్ అనే ఇద్దరు క్రైస్తవ సహోదరులు తమ గణితశాస్త్ర సమస్యలను పరిష్కరించుకోవడానికి సహాయం చేస్తుందని చెప్పబడుతున్న ఒక నిర్దిష్ట ఆటను ఔత్సాహికంగా ఆడారు. అయితే, గణితశాస్త్ర లెక్కల్ని తెరపై చేయడం కన్నా కాగితంపై చేయడమే త్వరితంగా ఉన్నట్లు వారు త్వరలోనే గుర్తించారు!
అందువలన, సహేతుకంగా ఆరోగ్యకరమైనవిగా ఉన్న కంప్యూటర్, వీడియో ఆటల విషయంలో కూడా సరైన ఎంపిక చేసుకోవలసిన అవసరం ఉంది. డాన్, సామ్ ఇలా అంటున్నారు: “మీరు జాగ్రత్తగా షాపింగ్ చేస్తే, సాధారణంగా మీరొక మంచి ఆటను కనుగొనవచ్చు.” అయితే, చివరికి ఒక వ్యక్తికి విసుగు కలిగించేలా చేసే ఆటలపై ఎంతో మొత్తంలో డబ్బును ఖర్చు చేయకపోవడం తప్పకుండా సహేతుకమైనదే. ఒక తండ్రి తన పిల్లల్ని, వారు పాఠశాలలో పఠించే పాఠ్యాంశాలతో వ్యవహరించే ఆటలకే తమను తాము పరిమితం చేసుకోమని ప్రోత్సహిస్తున్నాడు.
వాటి చీకటి కోణం
దుఃఖకరంగా, అన్ని కంప్యూటర్, వీడియో ఆటలు నిరపాయకరమైన సరదాగా ఉండవు—విద్యావిషయకంగా అసలే ఉండవు. నేటి వినోద కంప్యూటర్ ప్రోగ్రాములలో అనేకం, బైబిలు “శరీరకార్యములు” అని పిలిచేవాటిపైన—దేవుడు ఖండించే అపరిశుద్ధ అభ్యాసాలపైన కేంద్రీకరింపబడి ఉంటాయి. ఆ ఖండించబడిన “కార్యము”లలో “అభిచారము” ఉంది. (గలతీయులు 5:19-21) నిజానికి, యెహోవా దేవునికి తాంత్రిక అభ్యాసము “హేయ”మైనది.—ద్వితీయోపదేశకాండము 18:10-12.
అయితే, నేటి ఆటలలో అనేకం అభిచారము, ఇంద్రజాలములో మునిగిపోయి ఉన్నాయి! ఒక ఆటలో గెలవాలంటే “మంత్రాలు” ఉపయోగించాలి. ఆటగాళ్లకు ఇలా ఆదేశించబడింది: “మీరు మంత్రం చెప్పడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, మెనూలో కుడివైపున క్రింద మూలలోని మెరుపు గురుతుపై క్లిక్ చేయండి, తరువాత మీరు వేయించాలనుకుంటున్న జీవిపై క్లిక్ చేయండి.” అటువంటి ఆటలు పిశాచ శక్తుల గురించి అనారోగ్యకరమైన ఉత్సుకతను పెంపొందించే అవకాశం లేదా?
ఒకరు ఎక్కువ మోతాదుల్లో ఘోరమైన హింసను చూడడం విషయమేమిటి? యు.ఎస్.న్యూస్ & వరల్డ్ రిపోర్ట్, “ప్రత్యర్థి గుండెను చీల్చి బయటకు తీయడాన్ని,” “పిశాచాలు చాలీచాలని దుస్తులు ధరించిన టీనేజీ అమ్మాయిల శరీరాల్లో రంధ్రాలు చేయడాన్ని” ప్రదర్శించే రెండు జనప్రియమైన ఆటలను గురించి చెబుతుంది. కంప్యూటరైజ్ చేయబడిన రక్తపాతాన్ని కొందరు నిరపాయకరమైన స్వైరకల్పనగా తేలిగ్గా కొట్టిపారేసినప్పటికీ, కీర్తన 11:5 నందు బైబిలు ఇలా హెచ్చరిస్తుంది: “యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులును బలాత్కారాసక్తులును ఆయనకు అసహ్యులు.”—యెషయా 2:4 పోల్చండి.
నీచమైన పోర్నోగ్రఫీని కంప్యూటర్ తెరపైకి రప్పించే సాధ్యత కూడా ఉంది. నగ్నత్వం, విశృంఖలమైన లైంగికత ఎంత సాధారణమైన దృశ్యాలైపోయాయంటే, హానికరమైన ఆటల గురించి కొనుగోలుదార్లను హెచ్చరించడానికి అమెరికా కంప్యూటర్ ఆటల తయారీదార్లు ఒక రేటింగ్ పద్ధతిని రూపొందించారు. అయితే, యౌవనస్థులకు అమ్మకాలను నిరోధించడానికి తక్కువమంది చిల్లర వర్తకులు ఇష్టపడుతున్నట్లు కనిపిస్తుంది. “మాకున్న ఒకే ఒక్క బాధ్యత వినియోగదారులకు ఏమి కావాలో అది ఇవ్వడమే” అని దుకాణంలో పనిచేసే ఒక గుమస్తా అన్నాడు. అయినా, ‘లైంగికంగా ఉద్రేకపరిచే చిత్రాలను చూడడం, ‘న్యాయమైన, పవిత్రమైన, యోగ్యమైన వాటిపై’ మనస్సును నిలుపుకోవడానికి నాకు సహాయం చేస్తాయా?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.—ఫిలిప్పీయులు 4:8.
వ్యసనంలా తయారయ్యిందా!
నిజమే, కంప్యూటరైజ్ చేయబడిన ఆట యౌవనులను నిజంగా ఎలా ప్రభావితం చేస్తుందన్న విషయంలో నిపుణులు వాదోపవాదాలను కలిగివున్నారు. న్యూ సైంటిస్ట్ పత్రికలో నివేదించబడిన ఒక అధ్యయనం, అటువంటి ఆటలు “చెడు ప్రవర్తనకు మూల కారణం కాదు” అని ఆశాజనకంగా నిర్ధారించింది. అయినప్పటికీ, ఆ అధ్యయనంలో సర్వే చేయబడిన యౌవనస్థులలో 97 శాతంమంది “ఆ ఆటలకు అలవాటుపడడం సాధ్యమేనని భావించారు.” ఆర్కేడ్ ఆటలు “ఎక్కువ డబ్బు ఖర్చు చేయడానికి ఆటగాళ్లను ప్రోత్సహిస్తాయి” గనుక అవి ప్రాముఖ్యంగా హానికరమైనవని ఆ యౌవనస్థులు చెప్పారు.
నిజంగానే ఈ ఆటలు వ్యసనంలా తయారయ్యేవిగా ఉంటాయా? కొంతమంది ఆటగాళ్ల విషయంలో, స్పష్టంగా అవును అనేదే జవాబు. ఒక యౌవనురాలు తేజరిల్లు!కు ఇలా చెప్పింది: “మీరు ఆలోచించగలిగినదంతా ఏమిటంటే, ఆట ముగింపుకు చేరుకోవడం, గెలవడము.” అదే విధంగా ఒక యువకుడు ఇలా గుర్తు తెచ్చుకుంటున్నాడు: “ఆటలోని వారందరినీ ఎలా చంపాలి, తరువాతి స్థాయికి ఎలా చేరుకోవాలనేవాటి గురించి ఆలోచించడంలోనే నేను గంటలకు గంటలు గడిపాను.”
ఒక ఆటలో నేనెన్నడూ అంతగా నిమగ్నమవ్వలేను అని మీరు అనుకోవచ్చు. కానీ టీవీ ప్రదర్శనలూ చిత్రాలు ప్రజలు కన్నీళ్లు పెట్టుకునేలా, కోపోద్రిక్తులయ్యేలా, లేక ఉత్తేజంతో కేకలు వేసేలా వారిని కదిలిస్తూ వారి భావోద్రేకాలను ఎలా అదుపు చేస్తాయో పరిశీలించండి. ఇప్పుడు, ఉత్తేజకరమైన కథనం, విశిష్టమైన పాత్రలు, మిరుమిట్లు గొలిపే స్పెషల్ ఎఫెక్టులు కలిగి ఉండడం మాత్రమే గాక, మీరు సూపర్‌హీరోగా ఉండేలా అనుమతించే కార్యక్రమాన్ని ఊహించండి. దానిలో పూర్తిగా నిమగ్నమవ్వడాన్ని నిరోధించడం సులభంగా ఉంటుందా? కాబట్టి, స్వైరకల్పనను వాస్తవం నుండి వేరు చేయడం కొంతమంది ఆటగాళ్లకు కష్టంగా ఉంటుందంటే దానిలో ఆశ్చర్యం లేదు. ఒక యౌవనుడు ఇలా గుర్తు తెచ్చుకుంటున్నాడు: “హింసాత్మకమైన ఆటలు ఆడడం యొక్క ప్రభావం ఎంత చెడ్డగా ఉందంటే, నా చెయ్యి ఒక తుపాకి అని నేను ఊహించుకుని దానిని ప్రజలకు గురిపెట్టాను కూడా.”
జ్ఞానయుక్తంగా ఎంపిక చేసుకోండి
కంప్యూటర్, వీడియో ఆటల ఉపయోగాన్ని తలిదండ్రులు నిర్బంధించని సందర్భంలో, ప్రసంగి 2:14 నందున్న సలహాను యౌవనులు పరిశీలించాలి: “జ్ఞానికి కన్నులు తలలోనున్నవి.” దానర్థం జ్ఞాని తాను ఎక్కడికి వెళ్తున్నాడో గమనిస్తాడు, ముందు ముందు ఏముందో చూస్తాడు. నిజంగా, కంప్యూటర్ వినోద ప్రపంచం ఇప్పటికే దేవుని జ్ఞానానికి ఎంతో విరుద్ధంగా ఉంది. (2 కొరింథీయులు 10:5 పోల్చండి.) మరి సాఫ్ట్‌వేర్ మాంత్రికులు తరువాత ఏమి అందిస్తారో ఎవరికి తెలుసు? అందువలన యౌవనుడెవరైనా ఒక ఆటను కొనడానికి, ఆడడానికి, లేక అద్దెకు తెచ్చుకోవడానికి ముందు, ‘అది దేని గురించినదై ఉంది? దాని పేరు తాంత్రిక సంబంధమైన దేనినైనా సూచిస్తుందా? దాని అట్టమీద దారుణమైన హింస చిత్రించబడి ఉందా?’ అని తనను తాను ప్రశ్నించుకోవాలి.
ఎలక్ట్రానిక్ ఆటలు వాటి ఉత్తమోత్తమ స్థితిలో, కొంత ఆరోగ్యకరమైన ఆనందాన్ని, జ్ఞానాన్ని అందించగలవు. కాని మీ అమూల్యమైన సమయంలో ఎంతో భాగాన్ని ఆక్రమించుకోవడానికి అవి నిజంగా యోగ్యమైనవేనా? ఇంతకుముందు ప్రస్తావించిన పధ్నాలుగేళ్ల సామ్, ఇలా వివరిస్తున్నాడు: “మేము వీడియో ఆటలు ఆడకూడదని మా నాన్నగారు ఎప్పుడూ నిర్దిష్టంగా చెప్పలేదు. కాని ఆయన, ‘ఒక మీటను నొక్కి, తెరమీద ఎవరో ఒకరు అటూఇటూ పరిగెత్తడాన్ని లేదా ఎగరడాన్ని చూడడంలో అంత ఆసక్తికరమైంది ఏముంది?’ అని అడిగారు.” “మరిప్పుడు అదే మా ఆలోచనా సరళి అయ్యింది” అని ఆయన సహోదరుడు డాన్ దానికి జతకలిపాడు.
అవును, మీరు ఆనందించడానికి చదవడం, కళా కౌశలములు అభ్యసించడం, ఆరోగ్యకరమైన క్రీడలలో పాల్గొనడం, పాడడం, లేక ఒక సంగీత వాయిద్యాన్ని నేర్చుకోవడం వంటి ఇతర మార్గాలు—బహుశ మరింత ప్రతిఫలదాయకమైన మార్గాలు ఉన్నాయని మర్చిపోకండి. “దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసి”కొనుటలో సమయాన్ని గడపడం ఎంతో ఎక్కువ ప్రయోజనకరం. (1 తిమోతి 4:7) అలా చేయడం ఏ ఎలక్ట్రానిక్ ఆట ఆడడం కంటె కూడా ఎంతో ఎక్కువ విలువైనదిగా ఉంటుంది.
[16వ పేజీలోని చిత్రం]
ఒక అధ్యయనంలో సర్వే చేయబడిన యౌవనస్థులలో తొంభై ఏడు శాతంమంది “ఆ ఆటలకు అలవాటుపడడం సాధ్యమేనని భావించారు”
[17వ పేజీలోని చిత్రం]
హింసాత్మకమైన వీడియో ఆటలు ఆడడం నిజంగా మీకు హాని కలిగించగలదా?