కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g96 8/8 పేజీలు 9-11
  • చలన చిత్రాల 100 సంవత్సరాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • చలన చిత్రాల 100 సంవత్సరాలు
  • తేజరిల్లు!—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నిశ్శబ్ద యుగం
  • శబ్దం, రంగు
  • యుద్ధకాల ప్రచారం
  • సంక్షోభం
  • సామాజిక ప్రభావం
  • మీరు ఏ సినిమాలు చూస్తారు?
    తేజరిల్లు!—2005
  • ప్రస్తుతం ఏ సినిమాలు ఆడుతున్నాయి?
    తేజరిల్లు!—2005
  • స్క్రిప్టును సినిమాగా మలిచే విధానం
    తేజరిల్లు!—2005
  • నేటి కాల్పనిక విజ్ఞానశాస్త్రం వైపు ఒకపరి పరికించుట
    తేజరిల్లు!—1996
తేజరిల్లు!—1996
g96 8/8 పేజీలు 9-11

చలన చిత్రాల 100 సంవత్సరాలు

ఫ్రాన్స్‌లోని తేజరిల్లు! విలేఖరి ద్వారా

సినిమా అనేది ఒక ప్రత్యేక ఆవిష్కరణ కంటే ఎక్కువగా, దాదాపు 75 సంవత్సరాల అంతర్జాతీయ పరిశోధనా, ప్రయోగాల ఫలితమై ఉంది. 1832లో బెల్జియన్‌ జోసెఫ్‌ ప్లాటో కనుగొన్న ఫీనాకిస్టోస్కోప్‌, రేఖాచిత్రాల పరంపర నుండి కదలికను విజయవంతంగా పునర్నిర్మించింది. ఫ్రాన్స్‌లో, జోసెఫ్‌ న్యెప్స్‌, లూయీ డగ్యెర్‌ల మూలంగా 1839 కల్లా వాస్తవాన్ని ప్రతిమలుగా పరివర్తనం చేసే ఫోటోగ్రాఫిక్‌ ప్రక్రియ సాధ్యమైంది. ఫ్రెంచి దేశస్థుడైన ఏమీల్‌ రేనాడ్‌ సజీవ పారదర్శకాలను ప్రొజెక్టు చేస్తూ ఈ ఆలోచనను మరింత అభివృద్ధి చేశాడు, వాటిని 1892, 1900 సంవత్సరాల మధ్య కాలంలో లక్షలాదిమంది ప్రజలు చూశారు.

చలన చిత్రాల ప్రాముఖ్యమైన పురోభివృద్ధి కేవలం 100 సంవత్సరాల క్రితమే జరిగింది. 1890లో, అమెరికా దేశస్థుడైన ప్రఖ్యాత ఆవిష్కర్త థామస్‌ ఎడిసన్‌తోపాటు, ఆంగ్లేయుడైన ఆయన సహాయకుడు విలియమ్‌ డిక్‌సన్‌, చిన్న నిలువు పియానో అంత పరిమాణము, బరువుగల ఒక కెమేరాను రూపొందించారు, ఆ తర్వాతి సంవత్సరం ఒక్క మనిషి చూడగలిగే కైనెటోస్కోప్‌ అనేదాని పేటెంటు కొరకు ఎడిసన్‌ దరఖాస్తు పెట్టాడు. న్యూ జెర్సీలోని వెస్ట్‌ ఆరెంజ్‌లో, ప్రపంచంలోని మొట్టమొదటి ఫిల్మ్‌ స్టూడియో అయిన బ్లాక్‌ మరీయలో 35 మిల్లీమీటర్ల పెర్ఫొరేటెడ్‌ సెల్యులాయిడ్‌ స్ట్రిప్‌లపై రికార్డు చేయబడిన చిత్రాలు చిత్రీకరించబడ్డాయి. వివిధ నృత్యగానాలతో కూడిన నాటికలు, సర్కస్‌, వైల్డ్‌-వెస్ట్‌ ఘట్టాలతోపాటు విజయవంతమైన న్యూ యార్క్‌ నాటకాల నుండి సన్నివేశాలు ఈ చిత్రాలలో ఉన్నాయి. మొట్టమొదటి కైనెటోస్కోప్‌ పార్లర్‌ 1894లో న్యూ యార్క్‌లో ప్రారంభించబడింది, అదే సంవత్సరం అనేక యంత్రాలు యూరప్‌కు ఎగుమతి చేయబడ్డాయి.

ఎడిసన్‌కు మొదట ప్రొజెక్షన్‌లో ఆసక్తి లేకపోయినా, పోటీని తప్పించుకోవడానికి ఒక ప్రొజెక్టర్‌ను తయారు చేసేందుకు బలవంతపెట్టబడ్డాడు. 1896 ఏప్రిల్‌లో అతని విస్టాస్కోప్‌ న్యూ యార్క్‌లో రంగ ప్రవేశం చేసింది. అటుపిమ్మట ఆయన మొదలుపెట్టిన పేటెంట్‌ యుద్ధం పరిశ్రమపై పూర్తి గుత్తాధిపత్యం సాధించడానికి ఒక ట్రస్టు స్థాపించబడేందుకు కారణమయ్యింది.

ఫోటోలు తీస్తూ అదే సమయంలో చిత్రాలను ప్రొజెక్టు చేయగలిగే చేతిలో ఇమిడిపోయే కెమేరాను కనుగొనడానికి ఎడిసన్‌ యొక్క కైనెటోస్కోప్‌ యొక్క కాపీ, ఫ్రాన్స్‌లోని లయన్స్‌కు చెందిన పారిశ్రామికవేత్తలైన ఆగ్వీస్ట్‌, లూయీ ల్యీమ్యెర్‌లను ప్రేరేపించింది. వారి సీనేమాటాగ్రాఫ్‌ (“చలనం” అనే అర్థంగల గ్రీకు పదం కినేమా నుండి మరియు “చిత్రించు” అనే అర్థంగల గ్రాఫేన్‌ నుండి వచ్చింది) 1895 ఫిబ్రవరిలో పేటెంట్‌ చేయబడింది. తరువాత పారిస్‌నందలి, 14 బూల్వార్‌ డె కాపుసీన్‌లోని గ్రాన్‌ కేఫే వద్ద డిశంబరు 28న “సినిమా యొక్క అధికారిక ప్రపంచ ప్రీమియర్‌ జరిగింది.” తరువాతి రోజు 2,000 మంది పారిస్‌వాసులు విజ్ఞానశాస్త్రం యొక్క ఈ అతినూతన అద్భుతాన్ని వీక్షించడానికి గ్రాన్‌ కేఫే వద్ద గుమిగూడారు.

ల్యీమ్యెర్‌ సహోదరులు త్వరలోనే సినిమా హాళ్లను ప్రారంభిస్తూ, కెమేరామెన్లను ప్రపంచవ్యాప్తంగా పంపించనారంభించారు. కొన్ని సంవత్సరాలలోనే, వారు ప్రపంచ ప్రసిద్ధ స్థలాలను లేక రష్యాలోని జార్‌ నికొలాస్‌ ll పట్టాభిషేకం వంటి సంఘటనలతో కూడిన దాదాపు 1,500 చిత్రాలను తయారు చేశారు.

నిశ్శబ్ద యుగం

ఇంద్రజాలికుడు, పారిస్‌లోని ఒక థియేటర్‌ యజమాని అయిన జార్జస్‌ మేల్యేస్‌, తాను చూసినదానినిబట్టి సమ్మోహితుడయ్యాడు. సీనేమాటాగ్రాఫ్‌ను కొనుక్కుంటానని ఆయన ప్రతిపాదించాడు. దానికి స్పష్టంగా ఇదీ ప్రత్యుత్తరం: “లేదు, సీనేమాటాగ్రాఫ్‌ అమ్మకానికి కాదు. యౌవనుడా, అందుకు నాకు కృతజ్ఞతలు చెప్పు; ఈ ఆవిష్కరణకు భవిష్యత్తు లేదు.” అయినా, మేల్యేస్‌ పట్టువిడువకుండా, ఇంగ్లాండు నుండి తెచ్చిన పరికరాలతో చిత్రాలు తీయడం మొదలుపెట్టాడు. తన స్పెషల్‌ ఎఫెక్టులతో, స్క్రీన్‌ప్లేలతో మేల్యేస్‌ సినిమాటోగ్రఫీని ఒక కళా రూపంగా మార్చాడు. 1902లో ఆయన చిత్రం ల వాయజ్‌ డాన్‌ లా ల్యీన్‌ (చంద్రుని వద్దకు ప్రయాణం) అంతర్జాతీయంగా విజయాన్ని సాధించింది. పారిస్‌ నగర శివార్లలో ఉన్న మాంట్రియుల్‌లోని తన స్టూడియోలో, ఆయన 500 చిత్రాలు తయారు చేశాడు—వాటిలో అనేకం చేతితో రంగులు వేయబడినవే.

దాదాపు 1910వ సంవత్సరానికి, ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయబడిన చిత్రాలలో 70 శాతం ఫ్రెంచి మూలం గలవే. సినిమా అనేది “రేపటి థియేటరుగా, వార్తాపత్రికగా, పాఠశాలగా” తయారవ్వాలన్నదే లక్ష్యంగా గల పాటే సహోదరులు సినిమాని పారిశ్రామికీకరణం చేయడం మూలంగా ప్రాథమికంగా ఇది జరిగింది.

1919లో చార్లీ ఛాప్లిన్‌, డగ్లస్‌ ఫెయిర్‌బాంక్స్‌, డేవిడ్‌ డబ్ల్యు. గ్రిఫిత్‌, మేరీ పిక్ఫర్డ్‌లు కలిసి ట్రస్ట్‌ యొక్క వాణిజ్య ఆధిపత్యాన్ని కూలద్రోయడానికి యునైటెడ్‌ ఆర్టిస్ట్స్‌ను నెలకొల్పారు. 1915లో, గ్రిఫిత్‌ చిత్రం బర్త్‌ ఆఫ్‌ ఎ నేషన్‌ అనేది హాలీవుడ్‌కి మొట్టమొదటి బ్లాక్‌బస్టర్‌ అయింది. అమెరికా అంతర్యుద్ధాన్ని గూర్చిన అత్యంత వివాదాస్పదమైన ఈ చిత్రం కలహాలను రేపింది, చివరికి దానిలోని జాతి సంబంధ విషయం మూలాన దాని విడుదల వలన కొన్ని మరణాలు కూడా సంభవించాయి. అయితే, అది భారీ విజయాన్ని సాధించింది. దాన్ని చరిత్రలోకెల్లా అత్యంత లాభసాటియైన చిత్రాలలో ఒకటిగా చేస్తూ పది కోట్ల కంటే ఎక్కువమంది ప్రేక్షకులు దానిని చూశారు.

మొదటి ప్రపంచ యుద్ధం తరువాత, చిత్రాలు “అమెరికా మొత్తాన్ని నైట్‌ క్లబ్బులకు, కంట్రీ క్లబ్బులకు, మద్యం అక్రమంగా అమ్మబడే స్థలాలకూ ఆ స్థలాలలో ఉండే నైతిక అల్పత్వానికి పరిచయం చేశాయి.” ప్రపంచంలో వేరే చోట్ల సినిమా కార్యక్రమాలలో 60 నుండి 90 శాతం వరకు అమెరికా చిత్రాలు ఉండగా విదేశీ చిత్రాలు అమెరికా తెరలపై నుండి దాదాపు అదృశ్యమయ్యాయి. అమెరికా జీవన రీతిని, అమెరికా ఉత్పత్తులను మహిమపర్చడానికి సినిమా ఒక సాధనంగా ఉపయోగించబడింది. అదే సమయంలో, క్రొత్తగా సృష్టించబడిన “స్టార్‌ విధానం” రూడాల్ఫ్‌ వలంటీనో, మేరీ పిక్ఫర్డ్‌, డగ్లస్‌ ఫెయిర్‌బాంక్స్‌ వంటి వ్యక్తులను వాస్తవిక దేవతలుగా తయారు చేసింది.

శబ్దం, రంగు

“హే, అమ్మా, ఇది విను!” ఈ మాటలతో 1927లోని ద జాజ్‌ సింగర్‌లో అల్‌ జోల్‌సన్‌, నిశ్శబ్ద చిత్రాల స్వర్ణ యుగాన్ని అంతం చేసి, టాకీలను ప్రపంచానికి పరిచయం చేశాడు. సింక్రొనైజ్‌డ్‌ ఫోనోగ్రాఫ్‌ రికార్డులతో ప్రయోగాలు సినిమా మొదలైనప్పటి నుండి జరుపబడ్డాయి, కానీ ఎలక్ట్రికల్‌ రికార్డింగు, వాల్వ్‌ ఆంప్లిఫయర్ల ఆగమనంవల్ల 20వ దశకం వరకు శబ్దం ఉపయోగంలోకి రాలేదు. దాని ప్రవేశం సమస్యలు లేకుండా జరగలేదు.

మొదట చేతితో వేయబడిన చిత్రాల ద్వారా రంగు, సినిమాల్లోకి ప్రవేశించింది. తరువాత, స్టెన్సిళ్ల ఉపయోగం మొదలైంది. సమర్థవంతమైన కలర్‌-ఫిల్మ్‌ ప్రక్రియ లేకపోవడం మూలాన చిత్రాలు టింట్‌ చేయబడేవి. 1935లో మూడు రంగుల ప్రక్రియతో టెక్నికలర్‌ విజయవంతమయ్యేంత వరకు వివిధ పద్ధతులు ఉపయోగించబడ్డాయి. అయినా, 1939లో గాన్‌ విత్‌ ద విండ్‌ గొప్ప ప్రజాదరణ పొందిన తరువాత గానీ రంగు ఒక పెద్ద బాక్సాఫీసు ఆకర్షణగా పరిగణించబడలేదు.

యుద్ధకాల ప్రచారం

30లలోని మాంద్యం కాలంలో, సినిమా అనేది “ప్రజల ఒపీయమ్‌”గా పనిచేసింది. కానీ ప్రపంచంపై యుద్ధ ఛాయలు ముసురుకుంటుండగా, సినిమా ఉద్దేశం మోసపుచ్చడం, ప్రచారం చేయడంగా తయారయ్యింది. ముస్సోలినీ సినిమాను “లార్మా ప్యూ ఫార్టె,” లేక “మహా శక్తివంతమైన ఆయుధం” అని పిలిచాడు, హిట్లర్‌ క్రిందనున్నప్పుడు అది ప్రాథమికంగా యువతపై సిద్ధాంతాలను రుద్దడానికి జాతీయ సమాజవాదానికి వాచక ప్రతినిధిగా తయారైంది. డర్‌ ట్రయంఫ్‌ డస్‌ విలన్స్‌ (మనశ్శక్తి విజయం), ఓలింపియా వంటి సినిమాలు నాజీ నాయకులకు సమర్థవంతంగా దేవత్వాన్ని ఆపాదించాయి. ఇంకొక వైపు యూడ్‌ స్యూస్‌ (యూదా సూస్‌) యూదా విరుద్ధతను సమర్థించింది. బ్రిటన్‌లో, లారెన్స్‌ ఒలీవియర్‌ చిత్రం హెన్రీ V, డి డే కొరకు, దానివల్ల ఏర్పడే క్షతగాత్రుల కొరకు సిద్ధపడడానికి నైతిక మద్దతునిచ్చేదిగా పనిచేసింది.

సంక్షోభం

రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, టెలివిజన్‌ సెట్లు విరివిగా లభించనారంభించడంతో ప్రజలు సినిమాకు వెళ్లే బదులు ఇంటివద్దే ఉండిపోయారు. అమెరికాలో కేవలం పది సంవత్సరాలలో సగానికి సగం హాజరు తగ్గిపోయింది. 50లలో వెడల్పయిన తెరవున్న చిత్రాలు, డైరక్షనల్‌ స్టీరియో సౌండ్‌ ప్రవేశపెట్టబడినప్పటికీ వేలాది సినిమా హాళ్లు తప్పనిసరిగా మూసివేయవలసివచ్చింది. చిత్రాల నిర్మాణం మూడవ వంతుకు పడిపోయింది. ఈ పోటీని సమతుల్యం చేయడంలో ఒక ప్రయత్నంగా, కోట్లాది డాలర్లతో సెసిల్‌ బి. డ మిల్‌ నిర్మించిన పది ఆజ్ఞలు (1956) (ఆంగ్లం) వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు నిర్మించబడ్డాయి. యూరప్‌ సినిమా హాజరులో కూడా తీవ్రంగా తగ్గిపోయింది.

సామాజిక ప్రభావం

సినిమా సమాజం యొక్క అద్దం అని పిలువబడింది. తత్ఫలితంగా, 70వ దశకంలోని అనేక చిత్రాలు ఆ కాలంలోని “అశాంతిని, అసంతృప్తిని, భ్రాంతి తొలగిపోవడాన్ని, చింతను, చిత్తభ్రమను” ప్రతిబింబించాయి. ఇది భయానక సినిమాల పునరుద్ధరణ ద్వారాను, “సాతానువాదం ఎడల తాంత్రిక విద్య ఎడల అపూర్వమైన రీతిలో ఆకర్షింపబడడం” వంటివాటిలో చూడవచ్చు. విధ్వంసక చిత్రాలు “నిజ జీవిత విపత్తుల నుండి మనస్సును వేరేవైపు మరల్చేవిగా” పనిచేశాయి. (ప్రపంచ సినిమా—ఒక సంక్షిప్త చరిత్ర) మరోవైపు, “వక్రబుద్ధిని క్రమబద్ధం చేయడానికి ఉద్దేశపూర్వకమైన ప్రయత్నము” అని ఫ్రెంచి జర్నలిస్టు పిలిచినదాన్ని 80లు చూశాయి. 1983లో కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌ వద్ద ప్రదర్శించబడిన వాటిలో సగం చిత్రాలు సలింగ సంయోగం లేక రక్తసంబంధుల మధ్య లైంగిక దురాచారం మూలాంశంగా గల చిత్రాలే. హింస సమకాలిక చిత్రాలలో ప్రధాన పునరావృత్త మూలాంశంగా, అంటే మరలా మరలా వచ్చే మూలాంశంగా తయారైంది. 1992లో, హాలీవుడ్‌ సినిమాలలో 66 శాతం సినిమాలు హింసాత్మకమైన దృశ్యాలను కలిగివున్నాయి. గతంలో హింసకు సాధారణంగా ఒక సంకల్పం ఉండేది, ఇప్పుడు స్పష్టంగా అది కారణశూన్యమైంది.

ఆ విధంగా బయల్పరచబడడం యొక్క ఫలితం ఏమైవుంది? 1994 అక్టోబరులో, ఒక యౌవన జంట ఎటువంటి నేర చరిత్ర లేకపోయినా ఉద్రేకంతో పారిస్‌లో నలుగురిని చంపింది. దానికి, ఒక జంట 52 మందిని చంపడాన్ని చూపించిన నాచురల్‌ బార్న్‌ కిల్లర్స్‌ అనే చిత్రం సూటిగా నిందించబడింది. ప్రాముఖ్యంగా యౌవనులపై హింస కలుగజేస్తున్న ప్రభావాన్ని గూర్చి సమాజశాస్త్రజ్ఞులు మరీ మరీ చింతను వ్యక్తం చేస్తున్నారు. అటువంటి దృశ్యాలు వారికి ప్రవర్తనా నమూనాలుగా పని చేస్తాయి. నిజమే, అన్ని చిత్రాలూ హింసను లేక అనైతికతను మహిమపర్చవు. ద లయన్‌ కింగ్‌ వంటి ఇటీవలి చిత్రాలు మునుపటి బాక్సాఫీసు రికార్డులను బద్దలుకొట్టాయి.

గత 100 సంవత్సరాలలో సమాజాన్ని సినిమా ఎలా ప్రభావితం చేసిందని పారిస్‌ వార్తాపత్రిక ల మాండ్‌ ప్రసిద్ధ చిత్ర నిర్మాత, నటుడు అయిన ఒక వ్యక్తిని అడిగినప్పుడు ఆయన, సినిమా అనేది “యుద్ధాన్ని మహిమపరచడమే కాకుండా, గుండాలను ఆదర్శవంతులుగా చేసింది, అతి సులభమైన పరిష్కారాలనూ, ధర్మపరాయణ ఉపదేశాలను ప్రతిపాదించింది, అబద్ధ నిరీక్షణలను సృష్టించింది, సంపద, ఆస్తులు, నిర్జీవమైన భౌతిక అందం, ఇంకా మరెన్నో అవాస్తవికమైన, అయోగ్యమైన గమ్యాల ఎడల ఆరాధనా భావాన్ని వృద్ధి చేసింది,” అయినప్పటికీ అది కోట్లాదిమందికి దైనందిన జీవితపు కఠోర వాస్తవాల నుండి ఆహ్లాదకరమైన విముక్తిని అందించింది అని ప్రత్యుత్తరమిచ్చాడు.

దీపాలు ఆరిపోయి వెండి తెర జీవం పోసుకుంటుండగా, 100 సంవత్సరాలుగా ప్రజలను ఎంతగానో సమ్మోహితులను చేసిన దాని మాయను మనమింకా అప్పుడప్పుడు అనుభవిస్తుండవచ్చు.

[11వ పేజీలోని బాక్సు/చిత్రం]

“ఫోటో-డ్రామా ఆఫ్‌ క్రియేషన్‌”

1914వ సంవత్సరాంతానికి ఆస్ట్రేలియా, యూరప్‌, న్యూజీలాండ్‌, ఉత్తర అమెరికాలలోని దాదాపు 90 లక్షలమంది ప్రజలు వాచ్‌ టవర్‌ సొసైటీవారి ప్రదర్శన, “ఫోటో-డ్రామా ఆఫ్‌ క్రియేషన్‌”ను ఉచితంగా చూశారు. నాలుగు భాగాలలో ఈ ఎనిమిది గంటల కార్యక్రమంలో స్వరము, సంగీతంతో సింక్రొనైజ్‌ చేయబడిన చలన చిత్రాలు, స్లైడులు ఉన్నాయి. స్లైడులకు, చిత్రాలకు చేతితో రంగులు దిద్దబడ్డాయి. “ఫోటో-డ్రామా,” “బైబిలు ఎడల, అందులో వివరించబడ్డ దేవుని సంకల్పం ఎడల మెప్పుదలను అభివృద్ధి చేయడానికి” రూపొందించబడింది. టైమ్‌-లాప్స్‌ ఫోటోగ్రఫీ ద్వారా ఒక పువ్వు విచ్చుకోవడం, ఒక కోడిపిల్ల గ్రుడ్డులో నుండి బయటికి రావడం వంటివి ఫిల్ముపై బంధించడం దాని ఉన్నతాంశాలలో ఉన్నాయి.

[9వ పేజీలోని చిత్రం]

1895, ఫిబ్రవరిలో పేటెంట్‌ చేయబడిన “సీనేమాటాగ్రాఫ్‌ ల్యూమియేర్‌”

[క్రెడిట్‌ లైను]

© Héritiers Lumière. Collection Institut Lumière-Lyon

[Picture Credit Line on page 9]

© Héritiers Lumière. Collection Institut Lumière-Lyon

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి