ట్యూలప్—సంచలనాత్మకమైన గత చరిత్రగల ఒక పువ్వు
నెదర్లాండ్స్‌లోని తేజరిల్లు! విలేఖరి ద్వారా
“హాలెండ్‌కు వసంతం వచ్చినప్పుడు వేలకొలది ఎకరాలు . . . జీవానికి వచ్చినట్లు అనిపిస్తుంది” అని నెదర్లాండ్స్ బ్యూరో ఫర్ టూరిజం చెబుతుంది. అకస్మాత్తుగా, రంగుల విస్ఫోటం జరిగినట్లు, వికసిస్తున్న ట్యూలప్‌ల ప్రకాశవంతమైన వరుసలు పొలాల వెంబడి కనిపిస్తాయి. అది ప్రపంచ నలుమూలల నుండి పర్యాటకులను ఆకర్షించే పుష్ప శోభను సృష్టిస్తుంది. గాలిమరలు, జున్ను, చెక్క బూట్లు హాలెండ్‌కు విశిష్ట గుర్తులైనట్లే ఈ మనోహరమైన, ప్రఖ్యాత తోటపూలు కూడా హాలెండ్‌కు విశిష్ట గురుతులే అని చాలామంది సందర్శకుల ఉద్దేశం. కానీ నిజానికి ట్యూలప్‌ల మూలం టర్కీలో ఉందని మీకు తెలుసా?
ప్రాచ్య మూలం ఉన్న డచ్ ట్యూలప్‌లు
12వ శతాబ్దానికి చెందిన టర్కీ ఆభరణాలు ట్యూలప్‌లను చిత్రిస్తాయి, కానీ యూరప్ సాహిత్యం ట్యూలప్‌లను మొదటిసారిగా 1550లో పేర్కొన్నాయని వృక్షశాస్త్రజ్ఞురాలు అడేలయీడ్ ఎల్. స్టార్క్ తెలియజేస్తుంది. “ఆశ్చర్యచకితులైన విదేశీయులు” ఇంతకుముందు ఎరుగని “పెద్ద ఉల్లిపాయలతోనున్న ఎర్ర కలువలను” కాన్‌స్టాంటినోపుల్ (ఇస్తాంబుల్) బజార్లలో కొంటున్నారని ఫ్రాన్స్ నుండి వచ్చిన ఒక ప్రయాణికుడు 1553లో వ్రాశాడు. స్థానికులు ఆ పువ్వును డ్యూయెల్‌బండ్ అని పిలిచారు, దానికి టర్కిష్‌లో “తలపాగా” అని అర్థం. ఆ పదం “‘ట్యూలప్’ అనే పదానికి శబ్దవ్యుత్పత్తిశాస్త్ర మూలం అయ్యింది” అని డా. స్టార్క్ వివరిస్తుంది.
తలపాగావంటి ఈ పువ్వుల ఎడల ఆసక్తి కలిగిన విదేశీయులలో, టర్కీకి ఆస్ట్రియా దేశ రాయబారి (1555-62) అయిన ఆకీర్ గీలాన్ డ బూజ్బెక్ ఒకడు. ఆయన కొన్ని లశునాలను కాన్‌స్టాంటినోపుల్ నుండి వియన్నాకు తీసుకువెళ్లాడు, అక్కడ హాప్స్‌బర్గ్ చక్రవర్తి అయిన ఫెర్డినాండ్ Iకి చెందిన తోటలలో నాటబడ్డాయి. అక్కడ, ఫ్రెంచ్ వృక్షశాస్త్రజ్ఞుడైన షార్ల్ డ లేక్లూయెజ్ యొక్క నైపుణ్యవంతమైన సంరక్షణలో ట్యూలప్ లశునాలు వర్ధిల్లాయి. ఆయన కారొలస్ క్లూజీయస్ అనే తన లాటిన్ పేరుతో బాగా గుర్తించబడతాడు.
త్వరలోనే క్లూజీయస్ ఖ్యాతి నెదర్లాండ్స్‌లోని లైడెన్ విశ్వవిద్యాలయం వారి అవధానాన్ని ఆకర్షించింది, వారు ఆ విశ్వవిద్యాలయం యొక్క బొటానికల్ గార్డెన్‌కి సంరక్షకునిగా ఉండమని ఆయనను అంగీకరింపజేయడానికి ప్రయత్నించారు. 1593 అక్టోబరులో క్లూజీయస్ లైడెన్‌కు చేరుకున్నాడు, ఆయనతోపాటు “ట్యూలప్ లశునాల స్టాష్” కూడా వచ్చింది. కొన్ని నెలల తరువాత, 1594వ సంవత్సరపు వసంతంలో నెదర్లాండ్స్‌లో పూచిన మొట్టమొదటి ట్యూలప్ పువ్వుకు క్లూజీయస్ యొక్క క్రొత్త తోట కేంద్రస్థానం అయ్యింది.
ట్యూలపోమానియా—సంచలనాత్మక కాలం
ట్యూలప్ యొక్క ప్రస్ఫుటమైన రంగులు, విలక్షణమైన ఆకృతులు డచ్‌వారిని సమ్మోహితులను చేశాయి. లశునాలకు టర్కిష్ సుల్తానులు ఆపాదించిన అపరిమితమైన విలువను గూర్చిన భావనాత్మక వృత్తాంతాలు హోదా చింతగల ప్రతి పౌరుడు ఈర్ష్యపడడానికి కారణమయ్యాయి. ఎంతో కాలం గడవకముందే, ట్యూలప్‌లను పెంచడం లాభసాటి వ్యాపారంగా తయారైంది. గిరాకీ సరఫరాను మించిపోవడం మొదలైనప్పుడు లశునాల వెల పెరిగి, డచ్ చరిత్రకారులు టుల్పన్‌వ్యూడ, లేక టులిపోమానియా అని పిలిచే సంచలనాత్మక కాలం మొదలయ్యేందుకు కారణమైంది.
ట్యూలప్ లశునాలు అత్యంత ప్రసిద్ధ సరుకుగా తయారైనప్పుడు 1630లలో టులిపోమానియా దాని శిఖరాగ్రాన్ని చేరుకుంది. ఆ రోజుల్లో, ఒక అరుదైన ట్యూలప్ లశునం కొనుక్కోవడం కన్నా యాన్ డి. డ హేమ్ (17వ శతాబ్దానికి చెందిన ఒక గొప్ప స్తబ్దచేతన చిత్రకారుడు) వేసిన ట్యూలప్ చిత్రాన్ని కొనుక్కోవడం మరింత సులభమని కళా చరిత్రకారుడు ఆలవర్ ఇంపీ అన్నాడు. ఒక్క లశునం పెండ్లి కూతురు కొరకు కట్నంగా అంగీకరింపబడేది, వాగు ప్రక్కన ఉన్న గృహానికి అయ్యే వెల మూడు లశునాలు, ఒకే ఒక్క ట్యూలప్ బ్రాస్రీ రకం ట్యూలప్‌కు వర్ధిల్లుతున్న ఒక సారాయి బట్టీ విక్రయింపబడేది. లశునం వర్తకులు దాదాపు నెలకు 44,000 డాలర్లు (నేటి అమెరికా కరెన్సీలో) సంపాదించేవారు. “హాలెండు అంతటా ప్రయాణికుల కొరకైన హోటళ్లలోను, వసతి గృహాల్లోను సంభాషణలు, లావాదేవీలు ఒకే వస్తువు గురించి జరిగేవి—లశునాలు” అని ఒక మూలం చెబుతుంది.
“క్రమంగా పెరుగుతున్న ధరలు ట్యూలప్ విపణిలో లాభాలు ఆర్జించాలనే ఊహాకల్పనలు చేయడానికి అనేక సాధారణ మధ్య తరగతి మరియు బీద కుటుంబాలను శోధించాయి. అధిక ధరలకు పునర్విక్రయం చేయడానికిగాను లశునాలను కొనగలిగేలా గృహాలు, ఎస్టేటులు, పరిశ్రమలు తాకట్టు పెట్టబడ్డాయి. లశునాలు అసలు భూమిని విడువకుండానే అనేకసార్లు విక్రయాలు, పునర్విక్రయాలు జరిగేవి” అని ద న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా జతచేస్తుంది. భాగ్యాలు కన్రెప్పపాటులో రెండింతలయ్యేవి. బీదవారు ధనికులయ్యారు; ధనికులు మరింత ధనికులయ్యారు. లశునాల వర్తకం ఉన్మత్త సట్టా వ్యాపారి విపణిగా తయారయ్యింది. అకస్మాత్తుగా, 1637లో, కొనేవారికన్నా అమ్మేవారు ఎక్కువయ్యారు—అప్పుడు మార్కెట్టు కూలిపోయింది. సంపన్నులైన వేలాదిమంది డచ్‌వారు దాదాపు ఒక్క రాత్రిలోనే దరిద్రులైపోయారు.
సజీవ ఉత్సాహం కొనసాగుతూనే ఉంటుంది
అయినాగాని, ట్యూలప్ ఎడల సజీవ ఉత్సాహం ట్యూలపోమానియా పర్యవసానం తప్పించుకుని నిలిచింది, ట్యూలప్ లశునాల పరిశ్రమ మరలా వర్ధిల్లసాగింది. నిజానికి, 18వ శతాబ్దానికల్లా, డచ్ ట్యూలప్‌లు ఎంతగా పేరు పొందాయంటే ఒక టర్కీ సుల్తాను అయిన అహ్మద్ III వేలకొలది ట్యూలప్‌లను హాలెండు నుండి దిగుమతి చేసుకున్నాడు. ఆ విధంగా సుదీర్ఘ ప్రయాణం తరువాత టర్కీ ట్యూలప్‌ల డచ్ మొలకలు వాటి మూల స్థానానికి తిరిగి వచ్చాయి. నేడు, నెదర్లాండ్స్‌లో ట్యూలప్‌లను పెంచడం ఒక పెద్ద పరిశ్రమగా, లేక కొంతమంది అంటున్నట్లు సుందర వ్యాపారంగా తయారయ్యింది. దేశంలోని 34,000 చదరపు కిలోమీటర్లలో దాదాపు 7,700 ఎకరాలు ట్యూలప్ లశునాల పెంపకానికి ఉపయోగించబడుతున్నాయి. ప్రతి సంవత్సరం, దేశంలోని 3,300 మంది పెంపకందారులు దాదాపు 200 కోట్ల ట్యూలప్ లశునాలను 80 కంటె ఎక్కువ దేశాలకు ఎగుమతి చేస్తారు.
ట్యూలప్‌కు సంచలనాత్మక గత చరిత్ర ఉన్నప్పటికీ తోటకు ఇష్టమైన ఈ పువ్వు ఎడల మానవుని సజీవ ఉత్సాహం స్థిరంగానే ఉంది. ఈ అందమైన పువ్వు యొక్క సొగసైన ఆకృతిని, ఆకర్షణీయమైన రంగులను కాన్వాసుపై పెట్టడానికి, కాగితంపై పెట్టడానికి శతాబ్దాల తరబడి కళాకారులను, కవులను, శాస్త్రజ్ఞులను కదిలించింది. వారిలో ఒకరు, 18వ శతాబ్దపు శాస్త్రజ్ఞుడు యోహాన్ క్రిస్ట్యాన్ బేనెమాన్, ట్యూలప్ గురించి జర్మన్‌లో ఏకవిషయకరచన చేసిన తరువాత ఆ రచనకు డీ టుల్పె సుమ్ రూమ్ ఈరస్ షాయెప్‌ఫర్స్, ఉంట్ ఫర్గన్యూగంగ్ ఏడ్లర్ జెమ్యూయెటర్ (ట్యూలప్, దాని సృష్టికర్త మహిమ కొరకు, ఉదారబుద్ధి గలవారి ఆనందం కొరకు) అని పేరు పెట్టాడు. ఆయనకు, మరనేక ఇతర రచయితలకు, ట్యూలప్ “తోటమాలి చేతులలోని వస్తువు మాత్రమే కాదు కానీ అది సృష్టికర్త గొప్పదనాన్ని, మహిమను ప్రతిబింబిస్తుంది” అని అడేలయీడ్ స్టార్క్ పేర్కొంటుంది. ఈ సున్నితమైన పువ్వును చూస్తూ, దానితో సమ్మతించకపోవడం మీకు కష్టమౌతుంది.
[14వ పేజీలోని బాక్సు]
మీ ట్యూలప్‌లను పెంచే పద్ధతి
సరిపడినంత నీటి సరఫరా ఉన్నంత వరకు దాదాపు ప్రతివిధమైన నేల అనుకూలమైనదే. అయితే, పైపైమట్టితో ఇసుక, బొగ్గుబారిన చెట్లూ చేమలు, లేక ఎరువును కలపడం ద్వారా నాటడాన్ని సులభతరం చేయవచ్చు.
శరత్కాలంలో ట్యూలప్ లశునాలను నాటండి. వాటిని నాటడానికి రెండు మార్గాలున్నాయి: ప్రతి లశునానికి మీరు ఒక గొయ్యి త్రవ్వవచ్చు, లేక లశునాలన్నింటినీ ఒకేసారి నాటడానికి మీరు ఒక బీజాశయ్యను తయారు చేసుకోవచ్చు.
ట్యూలప్ లశునాలను నాటడానికి అనుభవము, అలవాటునుబట్టి గ్రహించిన నియమము: లశునం ఎత్తుకు రెండింతలు లోతున నాటాలి. అంటే దానర్థం లశునం క్రింది భాగం (చదునుగానున్న వైపు) భూతలానికి దాదాపు 20 సెంటీమీటర్లు క్రింద ఉండాలి. లశునాలను దాదాపు 12 సెంటీమీటర్ల ఎడంగా ఉంచండి.
లశునాలను త్రవ్విన మట్టితో కప్పివేయండి, పెరుగుదల మొదలయ్యేలా వెంటనే నీరు పోయండి. వాతావరణం బాగా శీతలంగా ఉన్నప్పుడు బొగ్గుబారిన చెట్లూ చేమలు లేక తడిపిన ఎండుగడ్డి, ఆకులు కలిపి చేసిన ఎరువు లశునాలను కాపాడుతాయి, అంతేగాక మట్టి ఎండిపోవడాన్ని కూడా నివారిస్తాయి. వసంతంలో మొలకలు మొట్టమొదటిసారిగా కనిపించినప్పుడు ఆ ఎరువును తీసివేయండి.
పూరేకులు వ్రేలాడడం మొదలెట్టినప్పుడు పూలను కోసివేయండి; లేకపోతే, మొక్క విత్తనం పట్టి లశునానికి తర్వాతి సంవత్సరం పెరుగుదలకు అవసరమయ్యే ఆహారం లేకుండా చేస్తుంది. ఆకుల సముదాయాన్ని సహజంగా వాడిపోనివ్వండి, తరువాత ఆకులు పసుపు రంగులోకి మారినప్పుడు వాటిని తీసేయండి.
అక్కడక్కడ చిందరవందరగా లశునాలను నాటడం కంటే, ఒకే రకమైన, ఒకే రంగుగల లశునాలను ఒక దగ్గర గుంపులు గుంపులుగా నాటండి. ఆ విధంగా మీరు రంగు రంగుల మచ్చలను సృష్టించి, మీ తోటలోని పుష్ప కళాఖండాన్ని పూర్తిగా ఆనందిస్తారు.—ఇంటర్నేషనల్ ఫ్లవర్ బల్బ్ సెంటర్, హాలెండ్/నేషనల్ జియోగ్రాఫిక్.
[Picture Credit Lines on page 13]
Page 12 bottom: Nederlands Bureau voor Toerisme; Top left, center, and top right: Internationaal Bloembollen Centrum, Holland; Page 13 bottom: Nederlands Bureau voor Toerisme/Capital Press