ప్రపంచ పరిశీలన
విశ్వ విజ్ఞానం
ద న్యూయార్క్ టైమ్స్ ప్రకారం, ఇటీవలి ఆవిష్కరణలు అంతరిక్ష వైజ్ఞానికులు అనేక సిద్ధాంతాల గురించి మళ్లీ ఆలోచించేలా చేస్తున్నాయి. ఉదాహరణకు, హబల్ అంతరిక్ష దుర్భిణితో ఆకాశాల్లోకి పరిశీలించి చూసే వ్యోమగాములు, మన విశ్వంలో దాదాపు 4,000 కోట్ల నుండి 5,000 కోట్ల నక్షత్ర వీధులున్నాయనే ముగింపుకు వచ్చారు. 10,000 కోట్లు ఉన్నాయని మునుపు చేసిన అంచనాకు ఇది విరుద్ధంగా ఉంది. ఒక దినం ఈ విషయం గురించి ప్రకటించిన తర్వాత, విశ్వంలో “కనిపించకుండా పోయిన” పదార్థంలో కనీసం సగ భాగాన్ని తాము గుర్తించామని అమెరికన్ ఆస్ట్రనామికల్ సొసైటీ వైజ్ఞానికులు తదుపరి నివేదించారు, అది నక్షత్ర వీధులను పట్టి ఉంచే గురుత్వాకర్షణశక్తిని అందించే, లెక్కకు రాని పదార్థం. శ్వేతకుబ్జలని పిలువబడే కాలిపోయిన నక్షత్రాల పెద్ద మొత్తమే ఈ కనిపించని పదార్థంలోని చాలా భాగమని వైజ్ఞానికులు చెబుతారు. దానికి తోడు, గాలిలియే వ్యోమనౌక నుండి వచ్చిన డేటా బృహస్పతి గ్రహాన్ని గురించిన సిద్ధాంతాలను సవాలు చేస్తుంది. “డేటా వచ్చిన వెంటనే మాలో అణుకువ భావాలు కలుగుతాయి. డేటా ఫలితాలు మా సిద్ధాంతాలతో సాధారణంగా ఎక్కువ పొందికను కలిగి ఉండవు” అని ప్రముఖ ప్రాజెక్టు వైజ్ఞానికుడైన డా. టోరెన్స్ జాన్‌సన్ చెప్పాడు.
అపహరణలు పెరిగిపోతున్నాయి
బ్రెజిల్ నందలి రియో డే జనైరోలోని నేరస్థులు ఇటీవలి ఒక సంవత్సరంలో, విస్తరిస్తున్న అపహరణ పరిశ్రమనుండి మాత్రమే 1.2 అరబ్ (అమెరికా) డాలర్లను తీసుకున్నారని జర్నల్ డా టార్డి నివేదిస్తుంది, అలా వారు ఆ నగరంలో సంస్థీకరింపబడిన నేరాలకు అపహరణను ఓ ముఖ్య ద్రవ్య మూలంగా చేస్తున్నారు. అపహరించడం ఎంతో అభివృద్ధి చెందింది. “ఆకస్మిక” లేక స్వల్పకాల అపహరణలు, “అడిగిన డబ్బును వాయిదాల పద్ధతిలో ఇచ్చే” మధ్య తరగతి బాధితుల అపహరణలు మరియు ధనిక ప్రజల సంక్లిష్టమైన, చక్కగా పథకం వేయబడిన అపహరణలు కూడా ఉన్నాయి. ఇతర దేశాల్లో అపహరించడం కూడా పెరిగిపోతోంది. ఫిలిప్పైన్ నిపుణులు ఇతర విషయాలతోపాటు, ఈ క్రింది విషయాలను సిఫారసు చేస్తున్నారని ఏషియావీక్ పత్రిక తెలియజేస్తోంది. చీకటిపడిన తర్వాత ప్రాముఖ్యంగా ఒంటరిగా ప్రయాణించవద్దు, మీరు ఎక్కడ ఉంటారనేది ఒక విశ్వసనీయమైన వ్యక్తికి ఎల్లప్పుడూ చెప్పండి, మీ కారును వెలుతురు బాగా ఉన్న, భద్రతగల స్థలాల్లో నిలపండి, పిల్లలను పర్యవేక్షణ లేకుండా వదలవద్దు.
దాహమే చాలదు
“ఒక వ్యక్తి తనకు దాహమైనప్పుడే నీళ్లు త్రాగితే, అతను తనకు అవసరమైనన్ని నీళ్లు త్రాగడని” వ్యాయామ శరీర శాస్త్రం యొక్క పండితుడైన డా. మార్క్ డేవిస్ చెబుతున్నాడు. శరీరంలోని ద్రవమంతా తగ్గిపోయిన తర్వాతే దాహమేస్తుంది గనుక, అనేకమంది ప్రజలు కొద్దిగా నిర్జలీకృత స్థితిలో ఉంటారు. మరి ప్రజలు వృద్ధులౌతున్న కొలదీ దాహాన్ని కలిగించే వారి వ్యవస్థ అంత నిశితంగా ఉండదు. ద న్యూయార్క్ టైమ్స్‌లో నివేదించబడినట్లు, వాతావరణం వేడిగా లేక మరీ చల్లగా మరియు పొడిగా ఉన్నప్పుడు, మనం వ్యాయామం చేసినప్పుడు లేక ఆహార నియమం పాటిస్తున్నప్పుడు, మరియు ద్రవ నష్టం కలిగించే విరోచనాలు, జ్వరం మరియు వాంతుల వంటి పరిస్థితులతోపాటు మనకు అనారోగ్యం చేసినప్పుడు మనకు ఎక్కువ నీళ్లు అవసరం. పీచులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకునేవారు కూడా నీరు ఎక్కువ త్రాగాలి, ఎందుకంటే పీచులను అరిగించుకునేందుకు నీళ్లు ఎక్కువగా అవసరమౌతాయి. పండ్లు, కూరగాయల్లో అధిక శాతం నీళ్లు ఉన్నప్పటికీ, మన అవసరతల్లో అనేకం నీళ్లు త్రాగడం ద్వారానే తీర్చబడతాయి. నీళ్లను శరీరం త్వరగా పీల్చుకుంటుంది గనుక అవే మంచివి. ఓ ద్రవం ఎంత తియ్యగా ఉంటే అది అంత మెల్లగా పీల్చుకోబడుతుంది. వాస్తవానికి సోడాలు మనకు ఎక్కువ దాహాన్ని కలిగిస్తాయి, ఎందుకంటే చక్కెర పదార్థాన్ని అరిగించుకునేందుకు ద్రవం అవసరమౌతుంది. కేఫీన్ మరియు మద్యం ఎక్కువ మూత్రం వచ్చేలా చేస్తాయి గనుక, అవి ఉన్న పానీయాలపై ఆధారపడితే శరీరానికి ఎక్కువ ద్రవ నష్టం కలుగుతుంది. “పెద్దలు కనీసం 2.4 డెస్సీలీటర్ల ఎనిమిది గ్లాసుల నీళ్లు త్రాగాలని” టైమ్స్ పత్రిక చెబుతుంది.
చెదలు తినలేని చెక్క
జపాన్‌నందలి నారాలోని ఓ చెక్క పెగోడా, 1,200 సంవత్సరాలుగా రోడంట్లు, చెదలు లేక సూక్ష్మక్రిముల వలన ప్రమాదానికి గురికాకుండా ఉందని న్యూ సైంటిస్ట్ పత్రిక నివేదిస్తుంది. చెదలకు పెగోడా అంటే అంత అసహ్యం కలిగించేది ఏమిటో తెలుసుకుందామని, కొరియానందలి సియోల్ జాతీయ విశ్వవిద్యాలయ ప్రతినిధులు, మరో ఇద్దరు జపాన్ వైజ్ఞానికులు బయల్దేరారు. ఆ పురాతన కట్టడాన్ని నిర్మించేందుకు ఉపయోగించిన సైప్రస్ చెట్టు రకాన్ని వారు పరీక్షించినప్పుడు, రోడంట్లకు ఎంతో అసహ్యకరమైన కొన్ని రసాయనాలను అది కలిగి ఉందనీ, ఆ రసాయనాల పూత పూసిన దేన్నీ అవి తినవని వారు కనుగొన్నారు. ఈ సైప్రస్ నుండి జపాన్ కలప పరిశ్రమ ప్రతి సంవత్సరం దాదాపు 4,000 టన్నుల ఱంపపుపొడిని ఉత్పత్తి చేస్తుంది, ఱంపపుపొడినుండి తీయబడిన మిశ్ర పదార్థాలు చెదలను అరికట్టేందుకు ఉపయోగింపబడే కొన్ని విష పదార్థాల స్థానాన్ని తీసుకుంటాయని నిరీక్షించబడుతోంది.
దారితప్పిన తలిదండ్రులు
లెక్స్‌ప్రెస్ అనే ఫ్రెంచి పత్రికలో నివేదింపబడిన ఒక సర్వే ప్రకారం, తమ పిల్లల విద్యాభాసం విషయానికొస్తే, తలిదండ్రుల్లో అధికశాతం మంది “విజయం” మరియు “స్వేచ్ఛ” అత్యంత ప్రాముఖ్యమైనవని అన్నారు, పిల్లలు తమ స్వంత నైతిక విలువలను ఎంపిక చేసుకోవాలని తలిదండ్రులు భావిస్తున్నారు. విద్యాభ్యాసం యొక్క లక్ష్యం సరైన నైతిక విలువలను నేర్పడమేనా అని అడిగినప్పుడు, 6 నుండి 12 సంవత్సరాల వయస్సుగల పిల్లల తలిదండ్రుల్లో 70 శాతం మంది కాదని సమాధానం చెప్పారు. ఇంటర్వ్యూ చేయబడిన తలిదండ్రులు మరియు ఉపాధ్యాయుల్లో అరవై శాతం మంది, భవిష్యత్తు కొరకు పిల్లలు ఎంతమాత్రం సరిగ్గా సిద్ధపరచబడలేదని భావిస్తున్నారు అయినప్పటికీ ఆ పిల్లలు సమాజానికి విలువైన వారిగా ఉంటారని వారు అసంగతంగా నమ్మడం జరుగుతోందని ఆ పత్రిక పేర్కొంటుంది. “తలిదండ్రులుగా తమ పాత్ర ఏమిటో లేక తమ బాధ్యతలేమిటో వారికి ఎంతమాత్రం తెలియదని” చెబుతూ, ఆ సర్వే కొందరి భయాలను ధృవీకరిస్తుందని లెక్స్‌ప్రెస్ చెప్పింది.
“కంప్యూటర్ సంబంధిత” గొంతు వాపు
కంప్యూటర్‌లను ఉపయోగించే వారు స్వరాన్ని గుర్తించే వ్యవస్థను వాడటం ద్వారా తమ చేతులకు, భుజాలకు నొప్పి తగ్గించాలనుకుంటూ, మరీ గంభీరమైన సమస్య అని కొందరు పరిగణించే దాన్ని ఎదుర్కొంటున్నారు, అదేమిటంటే గొంతు తీవ్రంగా బొంగురు పోవడం, చివరకు పూర్తిగా స్వరాన్ని కోల్పోవడమని కెనడా వార్తాపత్రికైన ద గ్లోబ్ అండ్ మెయిల్ నివేదిస్తుంది. కంప్యూటర్ అర్థం చేసుకునేలా ప్రతి పదాన్ని విశేషంగా మరియు కచ్చితంగా అదే స్థాయిలో ఉచ్చరించాల్సి ఉంటుంది గనుక, కంప్యూటర్‌ను ఉపయోగించే వారు మామూలుగా ఊపిరి పీల్చుకోరు, అలా వారి స్వర తంత్రులు తమ పటుత్వాన్ని కోల్పోతాయి. స్వర తంత్రులు పదే పదే ఒకదానికొకటి తగులుతుంటాయి గనుక వాటిపై కంతులు లేక పుండ్లు రావచ్చని లేక తంత్రులే నీరసించి పోవచ్చని టోరంటో విశ్వవిద్యాలయానికి చెందిన డా. సైమన్ మగ్రేల్ గ్లోబ్ పత్రికకు చెప్పాడు. స్వర తంత్రులను ఆరోగ్యవంతంగా ఉంచుకునేందుకు, కంప్యూటర్‌లను ఉపయోగించే వారు అలాంటి కంప్యూటర్‌లపై వారు గడిపే సమయాన్ని పరిమితం చేసుకోవాలని, తరచూ ఆ పనిని ఆపాలని, ఎక్కువ నీళ్లు త్రాగాలని, మరియు మద్యాన్ని, కెఫేన్‌ను మరియు స్వర తంత్రులు ఎండిపోయేలా చేయగల మందులను నివారించాలని స్వర నిపుణులు సలహా ఇస్తున్నారు.
“కనిపించకుండాపోతున్న” స్త్రీలు
“స్త్రీల ఆరోగ్యం ఎడల పక్షపాతం చూపని సమాజాల్లో, ప్రతి 100 మంది పురుషులకు 106 మంది స్త్రీలున్నారు. ఇది జీవశాస్త్ర సంబంధ వాస్తవమని” యూరప్ యూన్యన్ ద్వారా ప్రచురించబడిన పత్రికైన ద కొరియర్ పేర్కొంటోంది. అయితే ఐక్యరాజ్య సమితి అధ్యయనాలు మరో వాస్తవాన్ని కూడా సూచిస్తున్నాయి: చైనా, భారతదేశం, కొరియా రిపబ్లిక్ మరియు పాకిస్తాన్ వంటి ఆసియా దేశాల్లో సగటున ప్రతి 100 మంది పురుషులకు 94 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు. ఎందుకని? “వైజ్ఞానిక పురోభివృద్ధులు పిండం యొక్క లింగాన్ని తొలి దశలోనే గుర్తించడాన్ని సాధ్యం చేశాయి” అలా అవి “ఆడ మగ జననాల్లో అసమతౌల్యాన్ని” తీవ్రతరం చేశాయని ద కొరియర్ వివరిస్తుంది. ఉదాహరణకు, కొరియా రిపబ్లిక్ నందు 1982లో 100 మంది అబ్బాయిలు పుడితే 94 మంది అమ్మాయిలే పుట్టారు, అయితే 1989లో, ఆ నిష్పత్తి ప్రతి 100 మందికి 88 మందిగా తగ్గిపోయింది. మన గ్రహం (ఆంగ్లం) అనే ఐక్యరాజ్య సమితి ప్రచురణ ఇలా జోడిస్తుంది: “ఆ గణాంకాలు విస్మయాన్ని కలిగించేవిగా ఉన్నాయి: ఆడ శిశువులను చంపడం మరియు స్త్రీ పిండముల గర్భస్రావం వలన పది కోట్ల ఆసియా స్త్రీలు ‘కనిపించడం’ లేదు.”
ఆయుధాలా, అభివృద్ధా?
ఒక వంద అమెరికా డాలర్లతో, ఓ AK-47 రైఫల్‌నైనా లేక ఓ ఏడాది వయస్సున్న 3,000 మంది పిల్లల్లో గ్రుడ్డితనాన్ని నివారించడానికి తగినన్ని విటమిన్-A మాత్రలనైనా కొనవచ్చు. పది కోట్ల డాలర్లతో, ఒక కోటి మందుపాతరలనైనా లేక 77 లక్షలమంది పిల్లలను శిశు ప్రాయంలో వచ్చే ఆరు ప్రాణాంతకమైన వ్యాధులనుండి తప్పించడానికి తగినన్ని టీకాలనైనా కొనవచ్చు. ఎనభై కోట్ల డాలర్లతో 23 F-16 యుద్ధ విమానాలనైనా కొనవచ్చు లేక మానసిక వికలాంగం వంటి అయోడిన్ తక్కువైనప్పుడు వచ్చే సమస్యలనుండి 1.6 అరబ్ మంది ప్రజలను కాపాడేందుకు, పదేళ్ల వరకూ ఉప్పు అయోడినేషన్ చేయవచ్చు. దాదాపు 2.4 అరబ్ డాలర్లతో ఓ అణు జలాంతర్గామినైనా కొనవచ్చు లేక 4.8 కోట్లమంది ప్రజల కొరకు నీటి మరియు పారిశుద్ధ్య సౌకర్యాలను ఏర్పాటు చేయవచ్చు. ప్రపంచం దేనికి ప్రాధాన్యతనిస్తోంది? ప్రపంచ పిల్లల పరిస్థితి 1996 ప్రకారం, కేవలం 1994లో అభివృద్ధి చెందుతున్న దేశాలకు అమ్మిన ఆయుధాల మొత్తం ధర 25.4 అరబ్ డాలర్లు, ఆ డబ్బును దానికి ప్రతిగా అభివృద్ధి ప్రయత్నాల కొరకు వెచ్చించవచ్చు.
నారికురుపు వ్యాధి లొంగిపోతోంది
“మశూచి పూర్తిగా నివారించబడింది. దాని తర్వాత పూర్తిగా నివారించబడగలిగే మానవ వ్యాధి నారి కురుపు వ్యాధేనని” ది ఎకానమిస్ట్ పేర్కొంటుంది. ఆ వ్యాధి వచ్చిందన్న నివేదికలు ఇటీవల 1989లో ప్రపంచవ్యాప్తంగా 9,00,000 ఉండినవి. అవి గత సంవత్సరం 1,63,000కు తగ్గిపోయాయి, అనేక దేశాల్లో ప్రతి సంవత్సరం సగానికి సగం తగ్గిపోతున్నాయని” ది ఎకానమిస్ట్ పేర్కొంటుంది. “యుద్ధం మరియు వ్యాధి కలిసి కట్టుగా ఉంటాయని నిరూపిస్తూ” కేవలం సూడన్ మినహాయించబడింది. సూక్ష్మ లార్వా రూపంలో ప్రారంభమయ్యే, నీటిలో ఉండే పరాన్నజీవియైన ఈ నారి కురుపు మధ్యాసియా, పాకిస్తాన్ మరియు అనేక ఆఫ్రికా దేశాల్లో నిర్మూలించబడింది. నీటిని శుభ్రం చేసే ఒక రసాయనాన్ని ఉపయోగించడం ద్వారా, త్రాగే నీళ్లను ఓ బట్టతో వడకట్టడాన్ని ప్రజలకు నేర్పడం ద్వారా మరియు త్రాగే నీటి వనరుల్లో ఈ వ్యాధి సోకిన వారు స్నానం చేయకుండా లేక నడవకుండా నివారించడం ద్వారా ఆరోగ్య సంస్థలు దాన్ని అదుపులోకి తెచ్చాయి. ఒకసారి లోనకు వెళ్లిన తర్వాత, మగ పురుగులు సంపర్కం తర్వాత చనిపోతాయి, ఆడ పురుగులు పొడవులో ఒక మీటరు వరకు పెరుగగలవు. అంతకు ముందే అవి, బాధితుని కాలికి అయిన నొప్పి కలిగించే పుండ్లలోనుండి మెల్లగా బయటకు వస్తాయి, కొన్నిసార్లు కుంటితనాన్ని మరియు కండరాలకు నష్టాన్ని కలిగిస్తాయి.
అప్పుడే జన్మించిన పిల్లలను విడనాడటం
ఇటలీలో ఒక తల్లి, తనకు అప్పుడే జన్మించిన శిశువును చట్టబద్ధంగా నిరాకరించవచ్చు, ఆ బిడ్డను దత్తత తీసుకుని పెంచుకునేందుకు ఇష్టపడే దంపతులను వెదికే బాధ్యతను కూడా పిల్లల గురించి శ్రద్ధవహించే అధికారులకు ఇవ్వవచ్చు. అయినప్పటికీ, 1995 కాలంలో 600 మంది పిల్లలు పుట్టిన వెంటనే విడిచిపెట్టబడ్డారు, “అనేకులు చెత్త కుండీల్లో, ఇతరులు చర్చీలకు లేక ఆరోగ్య సేవా కేంద్రాలకు దగ్గర్లో” వదిలివేయబడ్డారని ఇటలీ వార్తాపత్రికైన లా రిపబ్లికా చెబుతోంది. ఈ అసాధారణ ఘణన దేశం యొక్క అత్యంత పారిశ్రామికీకరణ చెందిన మరియు సంపన్నమైన ప్రాంతాల్లో అలాగే పేద మరియు అతితక్కువ అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో కూడా సంభవిస్తోంది. ఇటాలియన్ సొసైటీ ఆఫ్ సైకాలజీ యొక్క అధ్యక్షురాలైన వారా స్లెపాయ్ ప్రకారం, ఇది సమాజమంతటా ఉన్న “మరణ ఛాయకు హెచ్చరికా సంకేతం.”