బైబిలు ఉద్దేశము
యూఎఫ్‌ఓలు—దేవుడు పంపిన సందేశకులా?
ఇరవయ్యవ శతాబ్దం ముగుస్తూ భూమిపైన పరిస్థితులు ఎడతెగక క్షీణిస్తుండగా, గుర్తింపబడని ఎగిరే వస్తువులలో (యూఎఫ్‌ఓలు) మరియు వాటి ప్రయాణీకులలో, గ్రహాంతర జీవులలో నమ్మకం పెరిగిపోతోంది. యూఎఫ్‌ఓలు, ప్రజల అమాయకత్వాన్ని చూసి నవ్వాలనుకునే వారు ప్రారంభించిన కట్టుకథ, మోసం, దగా మాత్రమేనా?
యూఎఫ్‌ఓలను లేక వాటిలోని గ్రహాంతర ప్రయాణికులను చూశామని చెప్పేవారిలో సాధారణమైన, నమ్మదగిన ప్రజలున్నారు; వాస్తవానికి, వేరే గ్రహాలనుండి వచ్చిన ఈ సందర్శకులను విశ్వసించే వారిలో విద్యావంతులైన పండితులు మరియు వైజ్ఞానికులు కూడా ఉన్నారు. గ్రహాంతర జీవులు మానవులను గమనిస్తున్నారని, కొన్నిసార్లు వారితో సంభాషిస్తున్నారని వీరు ఒప్పింపబడ్డారు. అంతరిక్ష సందర్శకులను కలుసుకున్నామని చెప్పే ప్రజలకు సహాయం చేసేందుకు, గ్రహాంతర జీవుల మద్దతు గుంపులని పిలువబడేవి అందుబాటులో ఉన్నాయి.a
భూమిపైనున్న జీవాన్ని కాపాడాలన్న గ్రహాంతర జీవుల పథకం
మన మధ్యనున్న పరదేశులు (ఆంగ్లం) అనే పుస్తకంలో, రూత్ మాంట్‌గోమరీ, తాము మానవ శరీరాల్లో నివాసముంటున్న గ్రహాంతర జీవులమని ఒప్పింపబడిన ప్రజలను కొందరిని ఇంటర్వ్యూ చేసింది. అలాంటి ప్రజల సంఖ్య ఎంతగానో పెరిగిపోతుంది. మానవుల్లో నివాసముంటున్న గ్రహాంతర జీవులమని చెప్పుకునే వీరిలో కొందరు, “దేవ దూతలు మరియు పాలకుల ఉన్నతాధికారం సిద్ధం చేస్తున్న కాస్మిక్ సంఘటన” 2000వ సంవత్సరంలో జరుగుతుందని ప్రవచిస్తారు. గ్రహాంతర జీవులు చెట్ల, జంతువుల నమూనాలను సేకరించి, భద్రపరిచేందుకు యూఎఫ్‌ఓలను ఉపయోగిస్తున్నారని లేక భూమిపైకి రానున్న నాశనంనుండి తప్పించడానికి కోట్లాదిమంది మానవులను బదిలీ చేసేందుకు యూఎఫ్‌ఓలు రక్షక వ్యోమనౌకలుగా ఉపయోగింపబడతాయని కొంతమంది ప్రజలు నమ్ముతున్నారు. ఆ గొప్ప నాశనం తర్వాత, ఆత్మీయ అవగాహనగల “క్రొత్త యుగాన్ని మరియు క్రొత్త క్రమాన్ని” ప్రారంభించేందుకు మానవులు భూమికి తిరిగి వస్తారు. “గ్రహాంతర యువత” అని తమను తాము పిలుచుకునే గుంపు సభ్యుడు, అమెరికానందలి కలరడోలోని ఒక యౌవనుడు, తేజరిల్లు!కు ఇలా నిస్సంకోచంగా చెప్పాడు: “మా పరదేశ పూర్వికులు మమ్మల్ని ఇక్కడినుండి అంతర్ధానం చేసి మరో స్థలంలో ప్రత్యక్షం చేస్తారని నా స్నేహితులు, నేను ఎదురు చూస్తున్నాం.”
తాము గ్రహాంతర జీవులమని గట్టిగా చెప్పుకునే వారిలో కొద్దిమంది తాము దేవునిచేత నడిపింపబడుతున్నామని చెబుతారు, ఇతరులు తాము మానవాళికి సహాయం చేసే విషయంలో ఆయన సలహా కొరకు ఆయనతో ముఖాముఖిగా మాట్లాడతామని చెప్పుకుంటారు. రానున్న ప్రపంచనాశనం నుండి మానవజాతిని కాపాడేందుకు, దేవుడు ఇతర గ్రహాలకు చెందిన సందర్శకులను ఉపయోగించుకుంటున్నాడా?
మానవజాతితో దేవుని సంభాషణలు
మానవుని తొలి చరిత్రలో, దేవుడు మానవులతో సంభాషించాడు. ఆదాము హవ్వలు, నోవహు, అబ్రాహాము మరియు ఇతరులతో దేవుడు సంభాషించిన విషయాన్ని గురించి బైబిలు వృత్తాంతం వివరిస్తోంది.b (ఆదికాండము 3:8-10; 6:13; 15:1) దేవుని చిత్తాన్ని తెలియజేసేందుకు మరియు బైబిలును ఉత్పత్తి చేసేందుకు కలలు, స్వరాలు మరియు దర్శనాలు ఉపయోగింపబడ్డాయి. అయితే, బైబిలు వ్రాయడం ముగిసిన తర్వాత, పరలోకం నుండి ఎవరైనా మానవజాతితో సూటిగా మాట్లాడవలసిన అవసరం ఉందా? లేదు, ఎందుకంటే పరిశుద్ధ లేఖనాలు “దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు” చేస్తాయని బైబిలు చెబుతుంది. (2 తిమోతి 3:17) బైబిలు ప్రకారం, ఈ కష్ట కాలాల్లో నడిపింపు దేవుని లిఖిత వాక్యం నుండి వస్తుంది. అయినప్పటికీ, ఓ గ్రహాంతర ప్రతినిధి ద్వారా నేరుగా దేవుని నుండి మనం సందేశాన్ని లేక ప్రత్యేక ఉపదేశాలను పొందుతామని విశ్వసించేందుకు ఏదైనా కారణముందా? లేదు, ఎందుకంటే అపొస్తలుడైన పౌలు ఇలా తెలియజేశాడు: “మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పరలోకమునుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక.”—గలతీయులు 1:8.
భూమి అతి గొప్ప విపత్కర మార్పులను ఎదుర్కొనబోతున్నదని గ్రహాంతర జీవులమని చెప్పుకునే వారు పేర్కొన్న విషయాలు బైబిలు ప్రవచనాలతో పొందిక కలిగి ఉన్నప్పటికీ, తప్పించుకునేందుకు వారు అందించే విధానం సృష్టంపై ఆధారపడే ఉంటుంది. గ్రహాంతర వ్యోమనౌక లేక ఏదైనా ఇతర స్థలం యొక్క సురక్షిత ప్రాంతం అని చెప్పబడే చోటికి పారిపొమ్మని బైబిలు మనుష్యులను పురికొల్పడంలేదు. బదులుగా, దేవునితో సమర్పిత సంబంధంలో రక్షణను వెదకమని అది మనకు చెబుతుంది, ఆ సమర్పణ నీటి బాప్తిస్మం ద్వారా సూచించబడుతుంది. (1 పేతురు 3:21; కీర్తన 91:7; మత్తయి 28:19, 20; యోహాను 17:3 పోల్చండి.) “అంతమువరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును” అని యేసు చెప్పాడు.—మత్తయి 24:13.
తప్పించుకునేందుకు ఓ భౌతిక ప్రాంతాన్ని కాక దేవునితో ఆత్మీయ సంబంధాన్ని కలిగి ఉండడాన్ని ఈ లేఖనాలు నొక్కి చెప్పడం లేదా? కాబట్టి, ‘మానవులు కాని జీవులను’ గురించిన కథలు, మానవజాతికి తప్పించుకునేందుకు సహాయం చేసే బదులు, ప్రజల నిత్య సంక్షేమం కొరకు దేవుడు ఏమి కోరుతున్నాడో దాని నుండి వారి అవధానాన్ని మళ్లిస్తాయి.
తప్పించుకునేందుకు దేవుడు అందిస్తున్న విధానం నుండి మానవజాతిని ప్రక్కకు తొలగించడానికి ప్రయత్నిస్తూ, దేవునికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని ఎవరు చెప్పగలరు? “మానసిక మరియు సాంఘిక శాస్త్రాల్లో తర్ఫీదు పొందిన అంకితభావంగల యూఎఫ్‌ఓలజిస్టులు [యూఎఫ్‌ఓల గురించి అధ్యయనం చేసేవారు]” తమ అధ్యయనాల్లో “‘పడకగది సందర్శకులు,’ పిశాచాలు, ధ్వనులు చిలిపి చేష్టలు చేసే భూతాలు, భ్రాంత్యదృశ్యాలు, మతపరమైన దర్శనాలు మరియు దయ్యాలు అని పరిగణింపబడిన వాటిని” గురించిన తులనాత్మక అధ్యయనాలను కూడా కలిగి ఉన్నారని సంభాషణపై నివేదిక (ఆంగ్లం) అనే తన పుస్తకంలో ఎడ్ కాన్‌రాయ్ పేర్కొంటున్నాడు. అనేకమంది యూఎఫ్‌ఓలజిస్టులు మరియు మానవుల్లో నివాసముంటున్న గ్రహాంతర జీవులమని చెప్పుకునే వారనేకులు, ప్రయాణించేందుకు వ్యోమ నౌకలను ఉపయోగించడం చాలామేరకు అనవసరమని చెబుతారు. ఈ జీవులు అదృశ్యంగా ప్రయాణించగలరని మరియు వ్యోమ నౌకలో రాకుండానే భూమిపై ఎక్కడైనా ప్రత్యక్షం కాగలరని వారు చెబుతున్నారు.
మానవజాతిని తప్పు దారి పట్టించాలని సాతాను, అతని దయ్యాలు ఉద్దేశిస్తున్నారని బైబిలు హెచ్చరిస్తుంది. మానవజాతి యొక్క నిరాశ మరియు నిరీక్షణలేని పరిస్థితి నుండి వారు లాభం పొంది, ఆకర్షణీయమైనవి అయినప్పటికీ అబద్ధమైన పరిష్కారాలను అందిస్తారు. (2 కొరింథీయులు 11:14) కాబట్టి, “కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని” బైబిలు హెచ్చరిస్తోంది.—1 తిమోతి 4:1.
అదే విధంగా నేడు, అలాంటి జీవులనుండి వచ్చే సందర్శనాలని చెప్పబడేవి ఏవైనా మరియు ప్రయోజనకరమైన నడిపింపు అనిపించేదేదైనా ఏ విధంగా ఇవ్వబడినప్పటికీ వాటిని తృణీకరించాలి. దేవుని వాక్యపు నడిపింపుకంటే “గ్రహాంతర జీవుల” ఉపదేశాన్ని అంగీకరించే వారు తప్పకుండా తప్పుదారి పడతారు—అది ఈ కష్ట కాలాల్లో ఓ భయంకరమైన తప్పు చేసినట్లు అవుతుంది.
[అధస్సూచీలు]
a యూఎఫ్‌ఓలు మరియు గ్రహాంతర జీవాన్ని గురించిన చర్చ కొరకు తేజరిల్లు! యొక్క ఏప్రిల్ 8, 1990 (ఆంగ్లం) మరియు నవంబరు 8, 1990 (ఆంగ్లం) సంచికలను చూడండి.
b బైబిలు రచయితైన యెహెజ్కేలు చూసిన దాన్ని కొందరు యూఎఫ్‌ఓ అని వర్ణించారు. (యెహెజ్కేలు, 1వ అధ్యాయం) అయితే, అది యెహెజ్కేలు మరియు ఇతర ప్రవక్తల చేత వర్ణింపబడిన అనేక సూచనార్థక దర్శనాలలో ఒకటి, అది ఆధునిక కాలాల్లో పేర్కొనబడినట్లు వాస్తవమైన భౌతికంగా కనిపించే విషయం కాదు.