పువ్వులు ఒకరు శ్రద్ధ తీసుకుంటున్నారని తెలియజేస్తున్నాయి
కొలంబియాలోని తేజరిల్లు! విలేఖరి ద్వారా
ఆకర్షితురాలైన తప్పటడుగులువేసే పాప బట్టర్కప్ పువ్వుల గుత్తిని సేకరించి బొద్దుగాముద్దుగా ఉండే తన పిడికిలిలో పట్టుకుని తను కనుగొన్న అమూల్యమైనదానితో తన మమ్మి దగ్గరకి పరుగెడుతుంది. ప్రేమగల భర్త తను తన భార్యనెంత ప్రేమిస్తున్నాడో చూపించేందుకు రోడ్డు ప్రక్కనున్న పూలబండి నుండి ఆమె కొరకు ఒక డజన్ గులాబీ పువ్వులను తీసుకుంటాడు. మెప్పుదలగల కుమారుడు తన తల్లిని సంతోషపరచేందుకు అప్పుడే కోసిన డాలియా పువ్వుల కొరకు దగ్గర్లో ఉన్న పూల దుకాణానికి ఫోన్ చేస్తాడు. శ్రద్ధగల గృహిణి సూపర్ మార్కెట్‌కు వెళ్ళి కావలసిన సరుకులన్నీ కొన్న తర్వాత వివిధ వర్ణాల కార్నేషన్ పువ్వుల గుత్తెను కొని భద్రంగా బుట్టలో పెట్టుకుంటుంది. ఆమె తన అభిరుచికి తగ్గట్లు అలంకరించుకున్న తన ఇంటికి అవి మరింత అందాన్ని తెస్తాయి.
పువ్వులు పెద్దల మనస్సులకు పిన్నల మనస్సులకు ఒకేలా ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి. “ఒకరు శ్రద్ధతీసుకుంటున్నారు” అన్న తలంపును తెలపడానికి అది చక్కని మార్గం. ఒక స్పానిష్ సామెత ఇలా చెబుతుంది: “ఒక గులాబీ పువ్వుకు కృతజ్ఞత చూపించనివారు, మరి దేనికీ కృతజ్ఞత చూపించరు.” (క్వైన్ నో అగ్రడెసె యునా రోసా, నో అగ్రడెసెరా నిన్గునా కోసా.)
పువ్వుల అమ్మకం మునుపెన్నటికన్నా చాలా వేగంగా పెరుగుతోంది. ఈ వేగంగల వైమానిక రవాణా యుగంలో ఇప్పుడు పూల మొక్కలను బాటసారుల కనులను ఆకర్షించే స్థలాలైన దుకాణాలకు, సూపర్మార్కెట్లకు, రోడ్డుప్రక్కన ఉండే పూలబండ్లకు అతి దూరంగా ఉన్న ప్రదేశాల్లో పెంచవచ్చు. పువ్వుల పరిశ్రమ “వేగంగా పెరుగుతుంది, చాలా వేగంగా మారుతోంది: దక్షిణ అర్ధగోళం నుండి పూల ఉత్పత్తి ఇంకా ఇంకా ఎక్కువగా వస్తోంది—హాలండ్ తర్వాత రెండవ పెద్ద ఎగుమతిదారియైన కొలంబియా నుండి ఎక్కువగా వస్తోంది” అని టైమ్ మాగజీన్ చెబుతుంది.
ప్లాస్టిక్‌తో కప్పబడిన గ్రీన్హౌస్లూ కృత్రిమ కొలనులూ
25 కన్నా ఎక్కువ సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్న కొలంబియా ప్రపంచవ్యాప్త కార్నేషన్ పువ్వుల ఎగుమతిలో మొదటి స్థానంలో ఉంది, అయితే మొత్తం పువ్వుల అమ్మకాలలో రెండవ స్థానంలో ఉంది. సంవత్సరమంతా పువ్వుల సాగుబడి చేసేందుకు కావలసిన అత్యంతనుకూలమైన వాతావరణం గల స్థలాలేవో నిర్ణయించేందుకు అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఒక విశ్వవిద్యాలయ విద్యార్థి 1964లో ఒక కంప్యూటర్ అధ్యయనాన్ని చేశాడు. భూమధ్యరేఖకు ఉత్తరాన ఆన్డీస్ పర్వతాల్లో దాదాపు 2,800 మీటర్ల ఎత్తున, బోగోటా నగరం ఉన్న ఎత్తు పల్లపు ప్రాంతాలలోని ఎత్తుల్లో, అక్కడి వాతావరణంలో పువ్వుల పంటకు కావలసిన పరిస్థితులు ఉన్నాయని ఆయన కనుగొన్నాడు.
మనోరంజకమైన శాన్టాఫే డి బోగోటాలోని పచ్చని పచ్చికబయలులో ప్లాస్టిక్‌తో కప్పబడిన గ్రీన్‌హౌస్‌లు కృత్రిమ కొలనులు అక్కడక్కడ కనిపిస్తాయి. కొలంబియా ఎగుమతి చేసే పువ్వుల్లో 92 శాతం పువ్వుల ఉత్పత్తి ఇక్కడే జరుగుతుంది. కొయ్య లేదా లోహపు చట్రాలున్న ఈ గ్రీన్హౌస్లలో వసంతకాల వాతావరణం జాగ్రత్తపూర్వకంగా అదుపుచేయబడుతుంది. ఆ వాతావరణం లక్షలాది కార్నేషన్ పూలను, డాలీయాలను, గులాబీలను, చేమంతి పూలను, పెరూ లిల్లీలను, మరితర అనేక వైవిధ్యమైన పువ్వులను పెంచుతుంది. అలా పూసిన పువ్వులను త్వరగానే కోసి, ప్యాక్ చేసి ఉత్తర అమెరికాకు, యూరోప్‌కు, ఆసియాకు రవాణా చేయడం జరుగుతుంది.
65 మరియు 68 డిగ్రీల ఫారన్‌హీట్ అన్నది పువ్వులను సాగుచేసేందుకు అవసరమైన ఉష్ణోగ్రత. పచ్చికబయలులో సంవత్సరం పొడవునా ఉండే సాధారణ ఉష్ణోగ్రత అది. ఇక్కడ వర్షపు నీళ్ళు బాగా ఉంటాయి. నేల సారవంతమైనది. తక్కువ కూలి తీసుకునే పనివాళ్ళు దొరుకుతారు. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు దాదాపు గడ్డకట్టేంతగా తగ్గవచ్చు. అప్పుడప్పుడు ఉష్ణోగ్రత పొగమంచుతో 29 డిగ్రీల ఫారన్‌హీట్ ఉంటుంది. పొగబెట్టే పాత్రలు, హై వాటేజ్ ఉన్న ప్రకాశమానమైన బల్బులు, లేదా స్ప్రింక్లర్లు చల్లదనాన్నుండి కాపాడుతాయి. ప్రకాశమానమైన బల్బులు పగటి సమయాన్ని పొడిగించేందుకు కూడా తోడ్పడుతూ, అలా అవి కొన్ని మొక్కలను మెలకువగా ఉంచుతూ వాటి పెరుగుదలను త్వరితపరుస్తాయి.
చాలా ముందుగానే ఉత్పత్తి పథకం వేయబడుతుంది
కొలంబియాలో 1,20,000 కన్నా ఎక్కువమంది పనివాళ్ళు పువ్వుల పరిశ్రమలోని ఏదో ఒక దశలో ఇమిడివున్నారు. పచ్చికబయలులో విస్తృతంగా ఏర్పడిన సమాజాల్లో నివసిస్తున్న యెహోవాసాక్షులు అనేకులు వారిలో ఉన్నారు. ఫాకాటాటీవాలోని ఒక సంఘంలో క్రైస్తవ పెద్ద అయిన బెనీటో కీన్టానా నర్సరీలో ప్రొడక్షన్ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. “మేము అనేక నెలల ముందే మార్కెట్లో ఉండే ఆయా సీజన్లలోని డిమాండ్లకు తగినంత ఉత్పత్తి చేసేందుకు పథకం వేయాలి. కార్నేషన్‌ల కొరకు తల్లి మొక్కలను హాలండ్ నుండి లేదా ఇటలీ నుండి, డాలియాల తల్లి మొక్కలను ఫ్లోరిడా నుండి దిగుమతి చేస్తాము. స్త్రీలు చిన్న కొమ్మలను జాగ్రత్తగా కోసి, వెచ్చగానున్న గ్రీన్హౌస్లో బారులుగా తీసిన వరుసల్లో నాటుతారు, వాటికి వేర్లువచ్చేవరకు మేఘంలాంటి పొగమంచు ద్వారా నీళ్ళు అందజేయబడతాయి. డాలియాలకు 12 రోజుల పాటు 20 నుండి 35 డిగ్రీల సెల్సియస్ (68 నుండి 95 డిగ్రీల ఫారన్‌హీట్) ఉష్ణోగ్రత అవసరం, రాత్రి వేళ రెండు గంటల అధిక వెలుతురు అవసరం. కార్నేషన్లకు 23 రోజులు 15 నుండి 25 డిగ్రీల సెల్సియస్ (59 డిగ్రీల నుండి 77 డిగ్రీల ఫారన్‌హీట్) ఉష్ణోగ్రత అవసరం, అయితే రాత్రివేళల్లో వెలుతురు అవసరంలేదు. తర్వాత మేము ఆ చిన్న మొలకలను మరో గ్రీన్‌హౌస్‌లోకి మార్చుతాము. అక్కడ అవి పూసే వరకూ వాటికి పోషకపదార్థాలను పెట్టడమూ పొగబెట్టడమూ నీళ్ళుపోయడమూ జరుగుతుంది. పువ్వులు పూయడానికి కార్నేషన్లకు ఆరునెలలు డాలియాలకు మూడు నెలలు పడుతుంది.”
కోత కాలంలో కష్టపడి పనిచేయడం
కోత కాలం వచ్చినప్పుడు, బాగా పని చేసేది స్త్రీలే. చేతులు బాగా శుభ్రంగా కడుక్కుని ఆ పనిని గ్లౌవ్స్ లేకుండా చేయడానికే ఎక్కువ ఇష్టపడతారు. మొగ్గలు ఎంత మేరకు విచ్చుకున్నాయి లేదా కాండాలు ఎంత నిటారుగా ఉన్నాయి అన్నదానిని, పువ్వుల నాణ్యతను నిశ్చయించే కారకాలను యంత్రాలు నిర్ణయించలేవు.
ఫాకాటాటివాలోని జూడీట్ కారడోర్ ఇలా వివరిస్తుంది: “అవసరమైన ఓపిక, జాగ్రత్తగా నెమ్మదిగా పట్టుకునే సామర్థ్యం, అలాగే వేగమూ మరియు నిపుణత స్త్రీలకున్నాయి. ఉదయం మేము గ్రీన్హౌస్లలోకి వెళ్ళేటప్పుడు పచ్చిక బయలు తరచూ పొగమంచుతో కప్పబడి ఉంటుంది; అది చాలా చల్లగా ఉంటుంది, గడ్డకట్టేంత చల్లగా కూడా ఉంటుంది. చాలా మంది అమ్మాయిలు స్కార్ఫ్‌లు కట్టుకుంటారు. పగటివేళ వాతావరణం వేడెక్కుతుంది, కొన్నిసార్లు ఉష్ణోగ్రత 90 డిగ్రీల దాకా అవుతుంది. అది చాలా కష్టమైన పని, ముఖ్యంగా కోత సీజన్లో మేము హడావిడిగా ఉంటాం, మేము ఓవర్‌టైమ్ చేయవలసి వస్తుంది.”
మనోరంజకమైన ఆహ్లాదకరమైన సందేశం
పువ్వులను కోసిన తర్వాత, ఒక ప్రత్యేక గదికి తీసుకువెళ్తారు. ఆ గదిలో కావలసినంత గాలి, వెలుతురూ ఉంటాయి. అక్కడ, స్త్రీలు పువ్వుల నాణ్యత, కాండాల నిటారుతనము, మందం, పొడవు వంటివాటిని బట్టి పువ్వులను ఏరి, వర్గీకరిస్తారు. తర్వాత పువ్వులను శుభ్రమైన ప్లాస్టిక్‌తో చుట్టి, ఒక్కో గుత్తిలో 25 పువ్వులు చొప్పున ప్యాకింగ్ కొరకు పువ్వుల గుత్తులను సిద్ధం చేస్తారు. మంచివాటిని మాత్రమే ఎగుమతి కొరకు తీసి పెడ్తారు.
పురుషులు నర్సరీ పేరు వ్రాసివున్న ప్రత్యేక విధమైన కార్డ్బోర్డులలో పువ్వుల గుత్తులను ప్యాక్ చేస్తారు. ఒక్కొక్క కార్డ్‌బోర్డులో 24 కార్నేషన్ పువ్వుల గుత్తుల చొప్పన ప్యాక్ చేస్తారు. ప్యాకింగ్‌లో పనిచేసే ఆలేహాన్డ్రో క్విన్టానా అనే పేరు గల బెనిటో సహోదరుడు ఇలా అంటున్నాడు: “అన్ని పంటలకన్నా పువ్వులు త్వరగా పాడవుతాయి కనుక మేము వేగంగా పనిచేయవలసిన అవసరం ఉంది. మా కంపెనీకి రెండు పంపులున్నాయి అవి ఒకసారికి 112 పెట్టెల చొప్పున రెండు గంటల సేపు పెట్టెలలోని వేడిగాలిని పీల్చి వేస్తూ చల్లని గాలిని బయటికి వదులుతూ ఉంటాయి. అలా అవి పువ్వుల ఉష్ణోగ్రతను తగ్గిస్తూ గడ్డకట్టే ఉష్ణోగ్రత కన్నా కాస్త ఎక్కువగా ఉంచుతాయి. తర్వాత పెట్టెలలోని రంథ్రాలను మూసివేస్తారు, ఎయిర్‌పోర్టుకి తీసుకువెళ్ళేందుకు ట్రక్కుల్లో ఎక్కించే వరకు స్టోర్ చేసే చల్లని స్థలంలో పువ్వులను ఉంచడం జరుగుతుంది.”
బోగోటాలోని ఎల్ డోరాడో ఇంటర్నాషనల్ ఎయిర్పోర్ట్ వద్ద, పువ్వులు ఎగుమతికి ముందు తనిఖీ చేయబడతాయి. ఆ తర్వాత, ఆ పువ్వులను నిల్వ ఉంచే చల్లని స్థలాల్లో కొన్ని గంటల పాటు ఉంచుతారు. అంటే, అమ్మకపు వస్తువులను సముద్రాల అవతల పంపిణీ చేయవలసిన చోట్లకు రవాణా చేసేందుకుగాను పెద్ద జెట్ విమానాల్లో ఎక్కించేంతవరకూ ఆ పువ్వులను అక్కడ ఉంచుతారు. కేవలం కొన్ని రోజుల్లో ఈ పువ్వులు ఇండ్లలో, ఆఫీసులలో, రోగుల గదుల్లో మరెక్కడైనా సరే విచ్చుకుని, ఒకరు శ్రద్ధతీసుకుంటున్నారన్న మనోరంజకమైన ఆహ్లాదకరమైన సందేశాన్నిస్తాయి.
నిజంగా శ్రద్ధతీసుకునే ఒకరు
మనమెక్కడకు వెళ్ళినా, మనం ఆనందించగల్గేందుకు భూమిమీద దాదాపు ప్రతిచోటా పువ్వులను కనుగొంటాం. పర్వతాల ఉన్నత స్థలాల్లో, మంచుప్రదేశాల అంచుల్లో, హిమనదుల అంచుల్లో, వనాల్లో, గడ్డిమైదానాల్లో, నీటిప్రవాహాల ప్రక్కన, నదుల ప్రక్కన, సముద్రతీరపు క్రిందిభాగాన, వేడిగానున్న ఎండబారిన ఎడారుల్లో కూడా పువ్వులు కనిపిస్తాయి. మానవుడు భూమిమీద ఉనికిలోకి రావడానికి ఎంతో కాలం క్రితం నుండి పువ్వులున్నాయి. వృక్షశాస్త్రజ్ఞులు చెప్పేదేమంటే, ‘పువ్వులు పూసే మొక్కలు జంతువుల మానవుల జీవితానికి ఆధారమైవున్నాయి. అవి లేకుండా జంతువులు మనుష్యులు ఉండలేరు.’
సొలొమోను రాజు జ్ఞానపూర్వకంగా ఇలా వ్యాఖ్యానించాడు: ‘దేనికాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమును దేవుడు నియమించియున్నాడు.’ (ప్రసంగి 3:11) ఇందులో దేవుడు బహుమానంగా ఇచ్చిన వైవిధ్యంగా శోభాయమానంగా ఉండే పువ్వులు కూడా ఇమిడి ఉన్నాయి. అనాది కాలం నుండే పువ్వులు పెద్దలకు పిన్నలకు ఒకేలా ఆహ్లాదాన్ని కలిగించాయి. నిజమే, దేవుడు నిజంగా శ్రద్ధ తీసుకుంటున్నాడు!
[17వ పేజీలోని బాక్సు]
పువ్వులు ఎక్కువ కాలం ఉండేలా చేసేందుకు
• పువ్వులను కుండీలో పెట్టే ముందు నీళ్ళలో ఉంచి కాండాలను ఏటవాలుగా కోయాలి. కాండాల చివర్లో ఉండే నీటి చుక్కలు గాలి ప్రవేశించడాన్ని నిరోధిస్తాయి, అలా నీళ్ళు, పోషకాలు తర్వాత పీల్చివేయబడడాన్ని అవి ఆపుతాయి.
• నీటిలో ఒక ఆస్పిరిన్ టాబ్లెట్టు, ఒక స్పూన్ పంచదార, లేదా కొంత కోలా కలిపితే పువ్వులు ఎక్కువసేపు తాజాగా ఉంటాయి అని కొలంబియా తోటశాస్త్రజ్ఞులు చెబుతున్న మాటలను గేవోమూన్డో పత్రిక ఉదాహరిస్తుంది. ప్రతి రెండు మూడు రోజులకొకసారి నీళ్ళను మారుస్తూ, గది ఏ ఉష్ణోగ్రతలో ఉంటుందో అదే ఉష్ణోగ్రతలో ఉన్న తాజా నీటిని పెట్టాలి, అయితే మొగ్గలు ఇంకా త్వరగా విచ్చుకునేందుకు వెచ్చని నీటిని కూడా ఉపయోగించవచ్చు.
• కొద్దిగా వాడిన పువ్వులను తరచూ తాజాగా చేసేందుకు, కాండాలను పది నిమిషాలు వేడి నీటిలో కొద్దిగా ముంచి, రేకులపైన చల్లని నీటిని చల్లవచ్చు. పువ్వులను వేడి వస్తువుల దగ్గర గాలి విసురుగా తగిలే చోటా ఉంచకూడదు, సూర్యకాంతి నేరుగా ప్రసరించని చోట ఉంచాలి.