సంభాషణను అడ్డగించే అడ్డుగోడలు
పశ్చిమాఫ్రికా నందలి సియర్రా లియోన్‌లో నివసించే రాబర్ట్ వాచ్ టవర్ మిషనరీ. ఆయన ఆ దేశానికి వచ్చిన కొంతకాలానికి ఒక దినాన, ఆయన రోడ్డు ప్రక్కగా నడిచి వెళ్తుండగా, ఆ ప్రాంతపు పిల్లలు “తెల్లవాడు! తెల్లవాడు!” అని అరవడం ఆయన గమనించాడు. నల్ల అమెరికావాడైన రాబర్ట్, తెల్లవాడు ఎక్కడున్నాడని వెనక్కి తిరిగి చూశాడు, అయితే అక్కడ మరెవ్వరూ లేరు. ఆ పిల్లలు తనను గురించే అలా అరిచారని ఆయన అప్పుడు గుర్తించాడు!
అలా అరవడంలో ఏ దుర్బుద్ధీ లేదు. రాబర్ట్ తమ సంస్కృతినుండి భిన్నమైన సంస్కృతికి చెందిన వాడని తాము గుర్తించామని ఆ పిల్లలు తెలియజేశారు. రాబర్ట్‌ను తెల్లవాడు అని పిలవడం, ఆ తేడాను వారు వ్యక్తం చేయగల అతి శ్రేష్ఠమైన మార్గం.
మనం ఎవరమనే విషయాన్ని సంస్కృతి ప్రభావితం చేసే విధానం
“పంచుకున్న ఆలోచనల మొత్తం, . . . ఓ జీవిత విధానాన్ని సూచించే ఆచారాలు, నమ్మకాలు మరియు జ్ఞానం” అని సంస్కృతి విస్తృతంగా నిర్వచింపబడింది. నేరుగా బోధింపబడటం ద్వారా మనం అనేక సాంస్కృతిక విలువలను నేర్చుకుంటాం, అయితే మనకు తెలియకుండానే మనం ఎన్నో విషయాలను కూడా స్వీకరిస్తాము. ఒక పరిశోధకుడు ఇలా చెప్పాడు: “[ఒక పిల్లవాని] పుట్టుక సమయం నుండే వాడు ఏ ఆచారాలలోకి జన్మిస్తాడో అవి వాని అనుభవాన్ని, ప్రవర్తనను రూపుదిద్దుతాయి. వాడు మాట్లాడగలిగే సమయానికల్లా, వాడు తన సంస్కృతి యొక్క బుజ్జి ఉత్పాదన, మరి వాడు పెరిగి తన సంస్కృతిలో భాగం వహించగలిగే సమయానికల్లా దాని అలవాట్లు అతని అలవాట్లౌతాయి, దాని నమ్మకాలు అతని నమ్మకాలౌతాయి, దానికి అసాధ్యమైన విషయం అతనికి అసాధ్యమైన విషయమౌతుంది.”
సంస్కృతి మన కొరకు జీవితాన్ని అనేక విధాలుగా సులభతరం చేస్తుంది. పిల్లలుగా మనం మన తలిదండ్రులను ఎలా ప్రీతిపరచాలో వెంటనే నేర్చుకుంటాము. మన సమాజంలో ఏది అంగీకారమైనది ఏది అంగీకారంకాదు అనే విషయాన్ని తెలుసుకోవడం, ఎలా ప్రవర్తించాలి, ఏమి ధరించాలి, ఇతరులతో ఎలా మెలగాలి అనే విషయాల్లో నిర్ణయాలు తీసుకునేందుకు మనకు నడిపింపునిస్తుంది.
అయితే, వ్యక్తులుగా మనం ఏమైయున్నామనేది కేవలం మన సాంస్కృతిక పూర్వ చరిత్రపైనే ఆధారపడి ఉండదు. ప్రతి సంస్కృతిలోనూ ప్రజల మధ్య వ్యత్యాసాలున్నాయి. మనం ఎవరిమనే విషయం జన్యు కణాల ద్వారా, జీవితంలోని మన అనుభవం ద్వారా మరియు అనేక ఇతర విషయాల ద్వారా కూడా నిర్ణయింపబడుతుంది. అయినప్పటికీ, మనం లోకాన్ని సంస్కృతి అనే కళ్లద్దాలతో చూస్తాము.
ఉదాహరణకు, మన సంస్కృతి మనం ఏ భాష మాట్లాడాలనేదే కాకుండా మనం దాన్నెలా మాట్లాడతామనే విషయాన్ని కూడా నిర్ణయిస్తుంది. మధ్యప్రాచ్యంలోని కొన్ని భాగాల్లో, పునరుక్తిని మరియు రూపకాలంకారాన్ని ఉపయోగిస్తూ, అనేక పదాలతో తమను తాము నైపుణ్యంగా వ్యక్తం చేసుకోగల సామర్థ్యాన్ని ప్రజలు విలువైన దానిగా ఎంచుతారు. దానికి భిన్నంగా, కొన్ని సుదూర తూర్పు దేశాలకు చెందిన ప్రజలు మౌఖిక సంభాషణను క్లుప్తంగా ఉంచుతారు. ఓ జపాన్ సామెత ఈ అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తుంది: “నీ నోటితోనే నీవు నాశనం తెచ్చుకుంటావు.”
మనం సమయాన్ని ఎలా దృష్టిస్తామనేది మన సంస్కృతి నిర్ణయిస్తుంది. స్విట్జర్లాండ్‌లో మీరు ఒక అపాయింట్‌మెంట్‌కి పది నిమిషాలు ఆలస్యమౌతే మీరు క్షమాపణ చెప్పాలని అపేక్షించబడుతుంది. ఇతర దేశాల్లో మీరు ఒకటి లేక రెండు గంటలైనా ఆలస్యంగా రావచ్చు, మీరు క్షమాపణ చెప్పాలని ఎవరూ అపేక్షించరు.
మన సంస్కృతి మనకు విలువలను కూడా బోధిస్తుంది. “మీరు మరీ బరువెక్కి పోతున్నారు. మీరు నిజంగా చాలా లావు అవుతున్నారు!” అని ఎవరైనా మీతో అంటే మీరెలా భావిస్తారో ఆలోచించండి. భారీ ఖాయం కలిగి వుండటాన్ని విలువైనదిగా ఎంచే ఆఫ్రికా సంస్కృతిలో మీరు పెంచబడి ఉంటే, మీరు బహుశా ఆ వ్యాఖ్యానాన్ని విని ఆనందించి ఉండేవారు. అయితే సన్నగా ఉండటాన్ని గొప్పగా భావించే పశ్చిమ సంస్కృతిలో మీరు గనుక పెంచబడి ఉంటే, ఆ నిర్మొహమాటమైన వ్యాఖ్యానం మీకు కలత కలిగించవచ్చు.
‘మా పద్ధతే మంచిది!’
అన్ని ప్రాంతాల్లోని ప్రజలూ తమ స్వంత సంస్కృతే మంచిదని ఊహించుకునేందుకు మొగ్గు చూపుతారు గనుక అది తరచూ వివిధ సంస్కృతులకు చెందిన వారి మధ్య సంభాషణకు అడ్డంకులను కలిగిస్తుంటుంది. మనలో అనేకులం మన నమ్మకాలు, విలువలు, పారంపర్యాలు, వస్త్రధారణా విధానం మరియు అందాన్ని గురించిన అభిప్రాయాలు ఇతర ఏ ప్రత్యామ్నాయానికంటే సరైనవని, మంచివని మరియు శ్రేష్ఠమైనవని భావిస్తాము. మన స్వంత గుంపుల విలువల ప్రకారం మనం ఇతర సంస్కృతులను తూచి చూసేందుకు మొగ్గు చూపుతాం. అలాంటి ఆలోచనా సరళి, జాతిదురభిమానమని పిలువబడుతోంది. ద న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ఇలా గమనించి చెబుతోంది: “జాతిదురభిమానం . . . దాదాపు విశ్వవ్యాప్తమైనదని చెప్పవచ్చు. ప్రపంచంలోని దాదాపు అన్ని సంస్కృతుల సభ్యులూ, తమ స్వంత జీవనవిధానం ఎంతో సన్నిహితులైన పొరుగువారి జీవనవిధానం కంటే కూడా ఉన్నతమైనదని భావిస్తారు.”
రెండు వందల సంవత్సరాల పుర్వం, ఓ ఆంగ్లేయ స్క్వైర్ ఆ విషయాన్ని గురించి మొరటుగా ఇలా చెప్పాడు: “నా [దృష్టిలో], విదేశీయులందరూ శుంఠలే.” ఈ మాటలు ఏ ఉదాహరణల పుస్తకంలో ఉన్నాయో దాని సంపాదకుడు ఇలా వ్రాశాడు: “[ఇది] దాదాపు విశ్వవ్యాప్త భావాలను కచ్చితంగా వ్యక్తపరుస్తుంది.”
ఇతర సంస్కృతులకు చెందిన వారి ఎడల అసహనం కలిగివుండడం యొక్క ఉదాహరణలు కోకొల్లలు. 1930లలో ఓ జర్మన్ నవలా రచయిత ద్వారా వ్రాయబడినప్పటికీ, ఈ క్రింది ఉదాహరణ నాజీ నాయకుడు హెర్మాన్ గోరింగ్‌కి తరచూ ఆపాదించబడుతూ ఉంటుంది: “సంస్కృతి అనే పదాన్ని విన్నప్పుడు నేను నా రివాల్వర్ అందుకుంటాను.”
జాతిదురభిమాన భావాలు తీవ్రతరమైనప్పుడు అవి వైషమ్యాలకు దారి తీయవచ్చు, ఆ వైషమ్యాలు విముఖత మరియు విభేదాలకు కారణం కావచ్చు. రిచ్చర్డ్ గోల్డ్‌స్టోన్, రువాండా మరియు పూర్వపు యుగోస్లేవియాలో జరిగిన యుద్ధ సంబంధిత నేరాలను పరిశోధించే అంతర్జాతీయ నేరస్థుల ట్రిబ్యూనల్‌కు చెందిన ప్రాసిక్యూటర్. ఆ రెండు విభేదాల్లోని పాశవిక క్రియలను గురించి ఆయనిలా చెప్పాడు: “ఈ విధమైన సంగతి ఎక్కడైనా జరుగవచ్చు. ఈ ఉదాహరణలో విభిన్న సంస్కృతులు, చరిత్రగల రెండు వేర్వేరు దేశాలున్నాయి, అయినప్పటికీ ఓ పొరుగువాడు తన పొరుగువాని ఎడల అదే విధమైన అతి నీచమైన క్రియలు చేశాడు. ఈ విధమైన నీచపు జాతిపర లేక మతపర యుద్ధమనేది, వైషమ్యానికి దౌర్జన్యపూరిత రూపాన్ని ఇవ్వడమే. బాధింపబడిన గుంపులోని వారు నీచమైన వారని లేక వారికి దయ్యంపట్టిందని వీరు భావిస్తారు. అలాగని ప్రజలు గనుక ఒకసారి ఒప్పింపబడితే, అలాంటి ఘోరమైన పనులు [చేయకుండా] సామాన్య ప్రజలను ఆపగల నైతిక హద్దుల నుండి అది వారిని స్వతంత్రులను చేస్తుంది.”
మన దృక్కోణాన్ని విశాలపర్చుకోవడం
మన స్నేహితులుగా ఉండాలని మనం ఎన్నుకునే ప్రజలు సాధారణంగా చాలా వరకూ మన వలెనే ఉండే, మన దృక్పథాలను మరియు విలువలను పంచుకునే ప్రజలై ఉంటారు. మనం వారిని నమ్ముతాం, అర్థం చేసుకుంటాం. వారి సహవాసంలో ఉన్నప్పుడు మనం ఉపశమనాన్ని పొందుతాం. వేరొక వ్యక్తి ప్రవర్తన విచిత్రంగా లేక అసాధారణంగా ఉన్నట్లు మనం భావిస్తే, మన స్నేహితులు కూడా మన వంటి పక్షపాత వైఖరినే కలిగి ఉంటారు గనుక వారు తప్పకుండా మనతో ఏకీభవిస్తారు.
సాంస్కృతిక పూర్వచరిత్రనుబట్టి మననుండి భిన్నంగా ఉండే వారితో మనం సంభాషించడం ద్వారా మనమేమి పొందగలం? ఒక విషయం ఏమంటే, ఇతరులు ఎందుకలా ఆలోచిస్తారు మరియు ప్రవర్తిస్తారు అనే విషయాలకున్న కారణాలను తెలుసుకునేందుకు మంచి సంభాషణ మనకు సహాయం చేస్తుంది. పశ్చిమాఫ్రికా వాడైన కున్లీ ఇలా చెబుతున్నాడు: “భోజనం చేసే సమయంలో మాట్లాడకూడదని ఆఫ్రికాలోని అనేకమంది పిల్లలకు గట్టిగా చెప్పబడుతుంది. అయితే కొన్ని యూరప్ దేశాల్లో, భోజన సమయాల్లో సంభాషించడాన్ని ప్రోత్సహిస్తారు. యూరప్ వారు ఆఫ్రికా వారితో కలిసి భోజనం చేస్తే ఏమి జరుగుతుంది? ఆఫ్రికా వ్యక్తి తన భోజనాన్ని అంత ధ్యానంతో ఎందుకు భుజిస్తున్నాడా అని యూరప్‌వారు ఆశ్చర్యపోతారు. అదే సమయంలో, ఈ యూరప్ వ్యక్తి వస పిట్టలా ఎందుకు వాగుతున్నాడా అని ఆఫ్రికా వారు ఆశ్చర్యపోతారు.” అలాంటి పరిస్థితుల్లో, ఒకరి సాంస్కృతిక పూర్వచరిత్రను మరొకరు అర్థం చేసుకోవడం సాంఘిక దురభిమానాన్ని తొలగించేందుకు ఎంతో చేయగలదన్నది స్పష్టమౌతుంది.
ఇతర సంస్కృతులకు చెందిన ప్రజల గురించి మనం తెలుసుకుంటుండగా, ఇతరులను గూర్చిన మన అవగాహన పెరగడమే కాకుండా, మనల్ని మనం కూడా బాగా అర్థం చేసుకోగల్గుతాము. ఒక మనుష్యవర్ణన శాస్త్రజ్ఞుడు ఇలా వ్రాశాడు: “సముద్ర గర్భంలోని జీవి చూడగలిగేది నీళ్లను మాత్రమే. ఏదైనా ప్రమాదం దాన్ని ఉపరితలానికి తెచ్చి గాలిని పరిచయం చేస్తేనే కానీ నీళ్లు ఉన్నాయని దానికి తెలియదు. . . . తన స్వంత సమాజపు సంస్కృతిని మొత్తంగా చూడగలిగే సామర్థ్యం . . . కొరకు కొంత విశ్లేషణ అవసరం, కాని చాలా అరుదుగా అలా విశ్లేషించడం జరుగుతుంది.” అయినప్పటికీ, మనం ఇతర సంస్కృతుల గురించి తెలుసుకోవడం ద్వారా, సముద్ర గర్భంలో ఉండి చివరకు గాలిని చూసిన జీవివలె అవుతాం; మనం జీవిస్తున్న సాంస్కృతిక “నీళ్లను” మనం తెలుసుకుంటాం. రచయిత థోమస్ అబెర్‌క్రోంబీ విషయాన్ని ఇలా చక్కగా వ్యక్తం చేశాడు: “విదేశీ సంస్కృతి చేత ఎన్నడూ ఆకర్షింపబడని వ్యక్తి, తన స్వంత ప్రతిబంధకాలను ఎన్నడూ గ్రహించలేడు.”
క్లుప్తంగా చెప్పాలంటే, ఇతర సంస్కృతుల ఎడల మెప్పు మన దృక్కోణాన్ని విస్తృతం చేయడం ద్వారా మన జీవితాలను సుసంపన్నం చేయగలదు, తద్వారా మనల్ని మనం శ్రేష్ఠంగా అర్థం చేసుకోగలగడం మాత్రమే కాకుండా మనం ఇతరులను కూడా శ్రేష్ఠంగా అర్థం చేసుకోగల్గుతాం. సాంస్కృతిక వారసత్వం మరియు జాతిదురభిమానపు ఆలోచనా సరళి సంభాషణకు విరుద్ధంగా అడ్డుగోడలు కాగల్గినప్పటికీ, అవి అలా ఉండాల్సిన అవసరం లేదు. ఆ గోడలను కూలద్రోయవచ్చు.
[6వ పేజీలోని చిత్రం]
“ప్రపంచంలోని దాదాపు అన్ని సంస్కృతుల సభ్యులూ తమ జీవన విధానం ఎంతో సన్నిహితులైన పొరుగువారి జీవనవిధానంకంటే కూడా ఉన్నతమైనదని భావిస్తారు.”—ద న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా
[7వ పేజీలోని చిత్రం]
ఇతర సంస్కృతుల్లోని మంచి విషయాలను ఆనందించడాన్ని మనం నేర్చుకోవచ్చు
[Picture Credit Line on page 6]
Globe: Mountain High Maps® Copyright © 1995 Digital Wisdom, Inc.