కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g96 7/8 పేజీలు 15-20
  • నేనొక న్యాయ బహిష్కృతుడినిగా ఉండేవాడిని

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నేనొక న్యాయ బహిష్కృతుడినిగా ఉండేవాడిని
  • తేజరిల్లు!—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నేనెందుకు న్యాయ బహిష్కృతుడినయ్యాను
  • న్యాయ బహిష్కృత కార్యకలాపాలు
  • ఖైదు, శిక్ష
  • బైబిలు సత్యాలు నేర్చుకోవడం
  • చాప్లైన్‌ నుండి వ్యతిరేకత
  • కారాగారంలో రాజ్య మందిరం
  • కారాగారంలో బాప్తిస్మం
  • కారాగారంలో శిష్యులను చేయడం
  • గొప్ప ఆనంద సందర్భాలు
  • న్యాయం కొరకు ఏకైక నిరీక్షణ
  • ప్రతిఫలదాయకమైన జీవితం
  • “యెహోవాసాక్షులను గూర్చిన నా అభిప్రాయాన్ని మీరు మార్చేశారు”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • అన్ని సందర్భాల్లోనూ రాజ్యసువార్తను వ్యాపింపజేయడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
తేజరిల్లు!—1996
g96 7/8 పేజీలు 15-20

నేనొక న్యాయ బహిష్కృతుడినిగా ఉండేవాడిని

అది సిసిలీలో మే 1, 1947. పిల్లలు, స్త్రీలతో సహా దాదాపు 3,000 మంది ప్రజలు, ఒక పర్వత కనుమ దగ్గర వార్షిక కార్మికుల దినం జరుపుకోవడానికి సమావేశమయ్యారు. దగ్గర్లోనున్న కొండలలో పొంచివున్న ప్రమాదం గురించి వారికి తెలియదు. బహుశ ఆ తరువాత జరిగిన దుస్సంఘటన గురించి మీరు చదివి ఉంటారు లేక సినిమాల్లో కూడా చూసి ఉంటారు. ఆ హత్యాకాండ స్లాటర్‌ ఆఫ్‌ పార్టెల్లా డెల్లా జీనేస్ట్రా అని పిలువబడింది, దానివల్ల 11 మంది చనిపోయారు, 56 మంది గాయపడ్డారు.

ఆ దుస్సంఘటనలో నాకే భాగం లేకపోయినా, నేను దానికి కారకులైన వేర్పాటువాదుల ముఠాకు చెందినవాడినే. వారి నాయకుడు సాల్వాటోరె జూలీయానో, నేను ఆయనతోపాటు మాన్టెలాప్రే గ్రామంలో పెరిగాను. ఆయన నాకంటే ఒక సంవత్సరమే పెద్దవాడు. నేను 19 సంవత్సరాలవాడిగా ఉన్నప్పుడు, 1942లో, రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలంలో సైన్యంలో సేవ చేయడానికి నేను పిలువబడ్డాను. ఆ సంవత్సరం తొలిభాగంలో నేను వీటా మోటీజీతో ప్రేమలో పడి, పెళ్లి చేసుకున్నాను. చివరికి, మాకు ముగ్గురు కుమారులు కలిగారు; మొదటివాడు 1943లో పుట్టాడు.

నేనెందుకు న్యాయ బహిష్కృతుడినయ్యాను

రెండవ ప్రపంచ యుద్ధం 1945లో అంతమైంది, నేను వలంటీర్‌ ఆర్మీ ఫర్‌ సిసీలియన్‌ ఇండిపెండెన్స్‌ (EVIS)లోని పశ్చిమ దళంలో చేరాను. ఇది మూవ్‌మెంట్‌ ఫర్‌ ది ఇండిపెండెన్స్‌ ఆఫ్‌ సిసిలీ (MIS) అని పిలువబడే వేర్పాటువాద రాజకీయ పార్టీకి చెందిన పారామిలిటరీ సైన్యం. అప్పటికే పలాయితునిగావున్న సాల్వాటోరె జూలీయానోకు, EVIS, MISకి చెందిన ఉన్నత వర్గం వారు మా దళం పదవీ బాధ్యతలను అప్పగించారు.

మా సిసిలీ ద్వీపంపై, మా ప్రజలపై మాకు గల ప్రేమచే మేము ఐక్యమయ్యాము. మేము అనుభవించిన అన్యాయాలవలన ఆగ్రహంతో ఉన్నాము. అందువలన, దాని 49వ రాష్ట్రంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలతో సిసిలీని కలపాలన్న జూలీయానో ముఠా ఉద్యమాన్ని నేను హత్తుకున్నాను. ఇది సంభవిస్తుందని నమ్మడానికి కారణం ఉందా? నిజానికి ఉంది, ఎందుకంటే తమకు వాషింగ్టన్‌, డి.సి.తో దగ్గరి సంబంధాలు ఉన్నాయని, ఆ విధంగా కలుపుకోవడానికి అమెరికా అధ్యక్షుడు హారీ ఎస్‌ ట్రూమన్‌ సుముఖంగా ఉన్నాడని MIS అధికారులు మాకు హామీ ఇచ్చారు.

న్యాయ బహిష్కృత కార్యకలాపాలు

ప్రముఖ వ్యక్తులను అపహరించడం, బంధ విమోచన ధనం కొరకు వారిని ఉంచుకోవడం నా జట్టు పనిలో ప్రధానంగా ఉండేవి. ఈ విధంగా మాకు అవసరమైన సరుకులను కొనుక్కోవడానికి మేము డబ్బు పొందేవారము. “మా అతిథులు” అని మేము పిలిచే అపహరించబడిన వారిలో ఎవరూ కూడా ఎప్పుడూ హాని చేయబడలేదు. వారు విడుదల చేయబడినప్పుడు, మేము పొందిన బంధ విమోచన ధనం తిరిగి రాబట్టుకోవడానికి ఉపయోగించుకునేందుకు మేము వారికొక రశీదు ఇచ్చేవారము. మేము విజయం సాధించిన తరువాత వారి డబ్బును తిరిగి సంపాదించుకునేందుకు ఆ రశీదుని ఉపయోగించవచ్చని వారికి చెప్పబడేది.

నేను దాదాపు 20 అపహరణలలో పాల్గొన్నాను, జాతీయ సైనిక పోలీసు బలగమైన కారాబీన్యేరీ సైనిక శిబిరాలపై చేసిన సాయుధ దాడుల్లో కూడా పాల్గొన్నాను. అయితే, నేనెన్నడూ ఎవరినీ చంపలేదనడానికి సంతోషిస్తున్నాను. పార్టెల్లా డెల్లా జీనేస్ట్రా గ్రామం వద్ద తీసుకున్న తెలివిహీనమైన చర్యతో మా వేర్పాటువాద దాడులు ఉచ్ఛస్థాయికి వచ్చాయి. అది జూలీయానో గుంపులోని దాదాపు డజను మంది వ్యక్తులచే ఏర్పాటు చేయబడి, కమ్యూనిస్టు పార్టీవైపు గురిపెట్టబడింది.

సామాన్య ప్రజానీకాన్ని—వారితోపాటు పొరుగువారిని, మద్దతుదారులను—చంపడం ఉద్దేశపూరితం కాకపోయినా, మాకు మద్దతిచ్చి, వారు మా చేత కాపాడబడుతున్నారని భావించిన ప్రజలు మేము వారిని వంచించామని విశ్వసించారు. అప్పటి నుండి జూలీయానో న్యాయ బహిష్కృతుల ముఠా కొరకు నిర్విరామంగా వేటాడడం జరిగింది. పోలీసులకు ఇచ్చిన హెచ్చరికల తరువాత, మా సహచరులలో చాలామంది పట్టుబడ్డారు. 1950, మార్చి 19న నేను చిక్కుకుని, తరువాత అరెస్టయ్యాను. ఆ వేసవిలో జూలీయానో కూడా చంపబడ్డాడు.

ఖైదు, శిక్ష

విచారణ కొరకు నన్ను ఉంచిన పాలెర్మోలోని ఒక కారాగారంలో, నేను యౌవనురాలైన నా భార్య, ముగ్గురు పిల్లల నుండి దూరమైనందున దుఃఖముఖుడనై ఉన్నాను. అయినప్పటికీ, సరైనదని నేను భావించిన దాని కొరకు పోరాడాలనే నా కోరిక పూర్తి నిరాశ నుండి నన్ను కాపాడింది. నా సమయాన్ని గడపడానికి చదవడం మొదలుపెట్టాను. ఒక పుస్తకం బైబిలును చదవాలనే నా కోరికను రేపింది. అది 19వ శతాబ్దంలో రాజకీయ కారణాలవల్ల ఖైదు చేయబడిన ఇటలీ దేశస్థుడైన సీల్వియో పెలీకో స్వీయ చరిత్ర.

కారాగారంలో తనతోపాటు ఎప్పుడూ ఒక నిఘంటువు, ఒక బైబిలు ఉండేవని పెలీకో వ్రాశాడు. నేను, నా కుటుంబం రోమన్‌ కాథోలిక్‌లమైనా, బైబిలు గురించి నిజంగా నేనేమీ వినలేదు. అందువలన ఒక ప్రతిని కలిగివుండేందుకు అధికారులకు విన్నపం చేసుకున్నాను. అది నిషిద్ధమని నాకు చెప్పారు, కానీ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల ఒక ప్రతిని నాకు ఇచ్చారు. తరువాత, నేనొక పూర్తి బైబిలు ప్రతిని సంపాదించగలిగాను, దాన్నిప్పటికీ ఒక అమూల్యమైన జ్ఞాపికగా ఉంచుకున్నాను.

చివరికి, 1951లో రోమ్‌కు సమీపానవున్న విటెర్బోలో నా విచారణ ప్రారంభమైంది. అది 13 నెలలు కొనసాగింది. నాకు రెండు టెర్మ్‌ల యావజ్జీవ శిక్షతో పాటు 302 సంవత్సరాల శిక్ష విధించారు! కారాగారం నుండి నేనెన్నటికీ సజీవంగా బయటికి రానన్నదే దానర్థం.

బైబిలు సత్యాలు నేర్చుకోవడం

పాలెర్మోలోని కారాగారానికి తిరిగి వచ్చిన తరువాత, మా గుంపులోని మరొక సభ్యుడు ఖైదు చేయబడిన విభాగంలో నియమించబడ్డాను, ఆయన జూలీయానోకు దాయాది. ఆయన నాకంటే మూడు సంవత్సరాలు ముందే అరెస్టయ్యాడు. దానికిముందు, అద్భుతమైన బైబిలు వాగ్దానాల గురించి తనతో మాట్లాడిన స్విట్జర్లాండ్‌ దేశస్థుడైన ఒక యెహోవాసాక్షిని ఆయన కారాగారంలో కలిశాడు. ఆ వ్యక్తి పాలెర్మోకు చెందిన తోటి యెహోవాసాక్షితోపాటు దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తుండగా అరెస్టయ్యాడు. (మత్తయి 24:14) ఆయన అరెస్టుకు మతగురువుల ప్రోద్బలం కారణమని నాకు తరువాత తెలియవచ్చింది.

నేను చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేసినా, నేను దేవునియందు, చర్చి బోధలయందు విశ్వాసముంచాను. సెయింట్లని పిలువబడే వారి ఎడల పూజ్యభావం లేఖనరహితమని, పది ఆజ్ఞలలో ఒకటి ఆరాధనలో ప్రతిమల ఉపయోగాన్ని నిషేధిస్తుందని తెలుసుకోవడం నన్ను చకితున్ని చేసింది. (నిర్గమకాండము 20:3, 4) నేను కావలికోట, తేజరిల్లు!లకు చందా కట్టాను, అవి నాకెంతో ప్రియమైనవయ్యాయి. నేను చదివినదంతా అర్థం చేసుకోలేదు, కానీ నేనెంత ఎక్కువగా చదివానో అంత ఎక్కువగా తప్పించుకోవాలని అనుకున్నాను, కారాగారం నుండి కాదు, కానీ మత సంబంధ అబద్ధం నుండి, ఆత్మీయ అంధత్వం నుండి.

ఈలోగా, దేవున్ని ప్రీతిపర్చడానికి నేను నా ప్రాచీన స్వభావమును వదలుకుని నవీన స్వభావమును—దీనమైనది, క్రీస్తుయేసు ధరించినటువంటిది—ధరించుకోవాలని గ్రహించాను. (ఎఫెసీయులు 4:20-24) నా మార్పు క్రమంగా జరిగింది. అయినా ఎంతో త్వరగా నేను నా తోటి ఖైదీల పక్షాన పనులను చేయనారంభించాను, అంతేగాక నేను నేర్చుకుంటున్న గొప్ప విషయాలను గురించి వారితో మాట్లాడడానికి ప్రయత్నించాను. ఆ విధంగా, 1953లో నాకొరకు ఆనందదాయకమైన కాలం మొదలైంది. కానీ కొన్ని అడ్డంకులు ఉండేవి.

చాప్లైన్‌ నుండి వ్యతిరేకత

కావలికోట, తేజరిల్లు!లకు చందా కట్టిన ఆరు నెలల తరువాత, వాటి బట్వాడా ఆటంకపర్చబడింది. ఖైదీల ఉత్తర ప్రత్యుత్తరాల సెన్సారు వారి దగ్గరికి వెళ్లి, విషయాన్ని ఆయన అవధానానికి తెచ్చాను. బట్వాడాను ఆపుచేయించింది కారాగార చాప్లైన్‌ అని ఆయన నాతో చెప్పాడు.

చాప్లైన్‌ను చూడాలని కోరాను. మా చర్చా సమయంలో నాకున్న కొద్దిపాటి జ్ఞానంతో, ఆరాధనలో ప్రతిమల్ని ఉపయోగించడాన్ని గురించి నిర్గమకాండము 20:3, 4, యెషయా 44:14-17 వంటి లేఖనాలతో సహా బైబిలు ఏమి చెబుతున్నదో చూపించాను. మత్తయి 23:8, 9లోని, “భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరుపెట్టవద్దు” అనే యేసు మాటలను కూడా ఆయనకు చదివి వినిపించాను. ఆయన రోషంతో, నేను అజ్ఞానిని కాబట్టి బైబిలును అర్థం చేసుకోలేనని ప్రత్యుత్తరమిచ్చాడు.

నేను నా వ్యక్తిత్వాన్ని మార్చుకోవడం అప్పటికే ప్రారంభించడం మంచిదైంది—లేకపోతే నేనేం చేసేవాడినో నాకే తెలియదు. ప్రశాంతంగా నేను జవాబిచ్చాను: “అవును, అది నిజమే; నేను అజ్ఞానిని. కానీ నీవు చదువుకున్నావు, అయినా నాకు బైబిలు సత్యాలను నేర్పడానికి నీవేమీ చేయలేదు.” యెహోవాసాక్షుల సాహిత్యాన్ని పొందాలంటే నేను కాథోలిక్‌ మతాన్ని విడిచిపెట్టడానికి న్యాయ మంత్రిత్వశాఖకు ఒక అభ్యర్థన చేయవలసి వస్తుందని చాప్లైన్‌ ప్రత్యుత్తరమిచ్చాడు. నేను అప్పటికప్పడే అలా చేశాను, కానీ నా అభ్యర్థన ఆదరించబడలేదు. అయినా, ఆ తరువాత, నన్ను నేను ఒక యెహోవాసాక్షిగా నమోదు చేయించుకోవడంలో సఫలుడనయ్యాను, మరి పత్రికలను మరలా పొందగలుగుతున్నాను. కానీ నేను చాలా పట్టుదల కలిగివుండవలసి వచ్చింది.

కారాగారంలో రాజ్య మందిరం

నేను డబ్బు సంపాదించి నా కుటుంబానికి పంపడానికి కారాగార డైరెక్టరుని ఒక ఉద్యోగం కొరకు కొంతకాలంగా అడిగాను. నాకొక వేళ ఉద్యోగం ఇస్తే ఇతరులకు కూడా ఇవ్వవలసి వస్తుందని, మరది సాధ్యం కాదు అని ఆయనెప్పుడూ అనేవాడు. కానీ 1955, ఆగస్టు 5వ తారీఖు ఉదయాన డైరెక్టరు నాకొక శుభవార్త అందించాడు—కారాగారం లోపల గుమస్తాగా నేను ఉద్యోగ బాధ్యతలు తీసుకోవాలి.

నా పని నేను కారాగార డైరెక్టరు దగ్గర గౌరవాన్ని సంపాదించేలా చేసింది, ఆయన దయాపూర్వకంగా బైబిలు పఠనానికి కూటాలను జరుపుకోవడానికి సామాన్లగదిని ఉపయోగించుకునేందుకుగాను అనుజ్ఞ ఇచ్చాడు. తత్ఫలితంగా 1956లో, పనికిరాని ఫెల్‌ క్యాబినెట్ల చెక్కలు ఉపయోగించి, యెహోవాసాక్షులు కూటాలు జరుపుకునే స్థలమైన రాజ్య మందిరమని పిలువగలిగే దానికి బెంచీలను తయారు చేశాను. అక్కడ ఇతర తోటి ఖైదీలతో ప్రతి ఆదివారం నేను సమకూడేవాడిని, మా బైబిలు చర్చలకు వచ్చే వారి హాజరు 25 మందితో శిఖరాగ్ర సంఖ్యను చేరుకుంది.

కొంత కాలానికి నేను జరుపుతున్న కూటాల గురించి చాప్లైన్‌ తెలుసుకొన్నాడు, ఆయన ఉగ్రుడయ్యాడు. తత్ఫలితంగా, 1957 వేసవిలో, నేను పాలెర్మో నుండి ఎల్బా దీవిలో పోర్టో ఆట్సురోలోని సంస్కరణ జైలులోకి నన్ను బదిలీ చేశారు. ఈ స్థలానికి భయంకరమైన పేరుంది.

కారాగారంలో బాప్తిస్మం

నేను అక్కడికి చేరుకున్న తరువాత, 18 రోజుల వరకు నన్ను ఏకాంత కారాగారవాసంలో ఉంచారు. అక్కడ నేను కనీసం బైబిలును ఉంచుకోవడానికి కూడా అనుమతించలేదు. అటు తరువాత, నేను కాథోలిక్‌ మతాన్ని విడిచిపెట్టడానికి అనుమతించుమని న్యాయ మంత్రిత్వశాఖకు నేను మరలా ఉత్తరం వ్రాశాను. అయితే ఈసారి, నేను రోమ్‌లోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయం సహాయాన్ని అర్థించాను. పది నెలల తరువాత, ఎంతగానో ఎదురుచూసిన జవాబు అందింది. మంత్రిత్వశాఖ నా మత మార్పిడిని గుర్తించింది! దీనర్థం నేను బైబిలును, పత్రికలను, మరితర బైబిలు సాహిత్యాలను కలిగివుండడం మాత్రమే కాదు కానీ యెహోవాసాక్షుల పరిచారకుడు నన్ను క్రమంగా సందర్శించవచ్చు కూడా.

ఇటలీలోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయం నుండి వచ్చిన జూజెప్పే రోమానో మొట్టమొదటిసారి నన్ను సందర్శించినప్పుడు నా ఆనందానికి పట్టపగ్గాల్లేవు. కారాగార అధికారుల అనుమతితో చివరికి నేను నీటి బాప్తిస్మం ద్వారా యెహోవాకు నా సమర్పణను సూచించగలిగేలా ఏర్పాట్లు జరిగాయి. 1958, అక్టోబరు 4న కారాగార డైరెక్టరు, క్రమశిక్షణా ఆదేశాధికారి, మరితర అధికారుల సమక్షంలో సహోదరుడు రోమానో, మరొక తోటి ఖైదీతోపాటు, నాకు కారాగారంలోని తోటకు నీరు పెట్టడానికి ఉపయోగించే పెద్ద టబ్‌లో బాప్తిస్మమిచ్చాడు.

ఇతర తోటి ఖైదీలతో దాదాపు ఎల్లప్పుడూ నేను కావలికోటను పఠించగలిగే వాడినే అయినా, వార్షిక క్రీస్తు మరణ జ్ఞాపకార్థ దినాన్ని నేను నా జైలుగదిలో ఒంటరిగా ఆచరించవలసి వచ్చేది. ఎందుకంటే ఈ ఆచరణ సూర్యాస్తమయం తరువాత జరుగుతుంది. నా కళ్లను మూసుకుని నేను నా తోటి సాక్షులతో కూడి ఉన్నానని ఊహించుకుని ప్రార్థించేవాడిని.

కారాగారంలో శిష్యులను చేయడం

1968లో, పేసారో ప్రాంతంలోని ఫోసోమ్‌బ్రోనే వద్దనున్న కారాగారంలోకి నేను బదిలీ చేయబడ్డాను. బైబిలు సత్యాలను గూర్చి ఇతరులతో మాట్లాడడం ద్వారా అక్కడ నేను మంచి ఫలితాలను అనుభవించాను. సాక్ష్యమివ్వడానికి అవకాశాలు చాలా సులభంగా దొరికే చికిత్సాలయంలో నేను పని చేశాను. యేమాన్వెలే ఆల్టావిల్లా అనే ఒక తోటి ఖైదీ అభివృద్ధిని చూడడం ప్రాముఖ్యంగా చాలా ఆనందకరంగా ఉండింది. రెండు నెలల పఠనం తరువాత, అపొస్తలుల కార్యములు 19:19 వద్దనున్న సలహాను అన్వయించాలని, మాంత్రిక విద్యకు సంబంధించిన తన పుస్తకాన్ని ధ్వంసం చేయాలని ఆయన గ్రహించాడు. తరువాత, యేమాన్వెలే యెహోవాసాక్షులలో ఒకడయ్యాడు.

ఆ తరువాతి సంవత్సరం నేపుల్స్‌ తీరానికి అవతలవున్న ప్రోకీడా దీవిలోని కారాగారంలోకి నన్ను బదిలీ చేశారు. మంచి ప్రవర్తన మూలాన నన్ను మరల చికిత్సాలయంలో నియమించారు. అక్కడ నేను కన్ఫర్మ్‌డ్‌ కాథోలిక్‌ అయిన మార్యో మోరేనో అనే ఒక తోటి ఖైదీని కలిశాను. ఆయన అకౌంటింగ్‌ విభాగంలో పని చేస్తూ బాధ్యతగల స్థానం వహిస్తున్నాడు.

ఒక సాయంత్రం మార్యో చదవడానికి ఏదైనా ఉందా అని అడిగాడు, నేనాయనకు నిత్య జీవమునకు నడుపు సత్యము పుస్తకాన్ని ఇచ్చాను.a తాను చదువుతున్నదాని ప్రాముఖ్యాన్ని ఆయన వెంటనే గ్రహించాడు, మేము బైబిలు పఠనం ఆరంభించాము. రోజుకు మూడు డబ్బాల సిగరెట్లు త్రాగే మార్యో పొగత్రాగడం ఆపేశాడు. దానికి తోడు, కారాగారంలో జరిగే అకౌంటింగ్‌ పనిలో కూడా తను నిజాయితీగా వ్యవహరించాలని తెలుసుకున్నాడు. తనకు కాబోయే భార్యకు ఆయన సాక్ష్యమివ్వడం ప్రారంభించాడు, ఆమె కూడా బైబిలు బోధలను అంగీకరించింది. ఆ తరువాత కొద్ది కాలానికే అక్కడ ఆ కారాగారంలోనే వారు పెళ్లి చేసుకున్నారు. 1975లో నేపుల్స్‌లోని సమావేశంలో మార్యో భార్య బాప్తిస్మం తీసుకుంది. అదే రోజు ఆమె భర్త కారాగారంలో బాప్తిస్మం పొందాడని విన్నప్పుడు ఆమె ఎంత గొప్ప ఆనందం అనుభవించిందో!

ప్రోకీడాలో నన్ను సందర్శిస్తున్న సాక్షులతో వారం వారం చర్చలను జరిగించడానికి అనుమతి ఇచ్చారు. నేను భోజనం తయారుచేసి, దానిని వారితో కలిసి సందర్శకుల గదిలో పంచుకోవడానికి కూడా నన్ను అనుమతించారు. ఒకేసారి పదిమంది వరకు సమకూడవచ్చు. యెహోవాసాక్షుల ప్రయాణ కాపరులు సందర్శించినప్పుడు, వారి స్లయిడు ప్రదర్శనలను చూపించడానికి నేను అనుమతి పొందాను. ఒకసారి 14 మంది సాక్షులు సందర్శించినప్పుడు నేను కావలికోట పఠనాన్ని జరిపే ఆధిక్యతను అనుభవించాను. అధికారులు నన్ను పూర్తిగా నమ్ముతున్నట్లు అనిపించింది. అనుమతించబడిన దినాల్లో, సాయంకాలమౌతుండగా, నేను చెరసాల గదుల్లో ప్రకటించేవాడిని.

1974లో, వేర్వేరు కారాగారాల్లో 24 సంవత్సరాలు గడిపిన తరువాత, క్షమాపణ కొరకు అర్జీ పెట్టమని నన్ను ప్రోత్సహిస్తూ ఒక న్యాయాధిపతి నన్ను సందర్శించాడు. అలా చేయడం భావ్యమని నేను తలంచలేదు ఎందుకంటే అలా చేయడం నేను పార్టెల్లా డెల్లా జీనేస్ట్రా మారణకాండలో భాగం వహించానని ఒప్పుకోవడమే అవుతుంది, కానీ నేను దానిలో భాగం వహించలేదు.

గొప్ప ఆనంద సందర్భాలు

1975లో ఒక క్రొత్త చట్టం కారాగారం నుండి కొంతకాలంపాటు బయటికి వెళ్లి వచ్చేందుకు అనుమతించింది. ఆవిధంగా, నేను నేపుల్స్‌ పట్టణంలో నా మొదటి యెహోవాసాక్షుల సమావేశానికి హాజరయ్యే అవకాశం లభించింది. ఐదు మరపురాని దినాలను నేను ఆనందించాను, నేను ఆ సమయంలో ఇంతకుముందు ఎన్నడూ చూడనంత మంది క్రైస్తవ సహోదర సహోదరీలను కలిశాను.

చివరికి నాకు ప్రత్యేక ఆనందాన్నిచ్చింది ఏమిటంటే, అన్ని సంవత్సరాల తరువాత నేను నా కుటుంబంతో తిరిగి ఐక్యమవ్వడం. నా భార్య వీటా నాకు విశ్వాసంగా ఉండిపోయింది, నా కుమారులు ఇప్పుడు 20, 30లలో ఉన్న యౌవనులు.

ఆ తరువాతి సంవత్సరం—చాలా సార్లు కారాగారానికి వెలుపల సెలవు దినాలను ఆనందించాను—అప్పుడు కారాగారం నుండి విడుదలకు నన్ను దరఖాస్తు చేయమని సూచించారు. నా గురించిన ప్రొబేషన్‌ మేజిస్ట్రేటు నివేదికలో, నా దరఖాస్తును అంగీకరించమని ఆయన సిఫారసు చేశాడు. ఆయనిలా వ్రాశాడు: “జూలీయానో ఆజ్ఞలను పాటించిన రక్తదాహంగల యౌవనునితో పోల్చినప్పుడు మాన్నినో ఈరోజు మరో మనిషి; ఆయన పూర్తిగా గుర్తుపట్టలేని మనిషని నిర్భయంగా చెప్పవచ్చు.”

ఈలోగా, ప్రోకీడాలోని కారాగార అధికారులు నా క్షమాపణ కొరకు అభ్యర్థించారు. చివరికి, క్షమాపణ లభించింది, 1978 డిశంబరు 28న నేను కారాగారం నుండి విడుదల చేయబడ్డాను. 28 కంటే ఎక్కువ సంవత్సరాల నిర్బంధం తరువాత స్వేచ్ఛా మనిషి అవ్వడం ఎంత ఆనందకరమైనదో గదా!

న్యాయం కొరకు ఏకైక నిరీక్షణ

సాల్వాటోరె జూలీయానో ఆజ్ఞల క్రిందవున్న ఓ కిడ్నాపర్‌గా నా కుటుంబం కొరకు, నా దేశ ప్రజల కొరకు నిజమైన స్వేచ్ఛ తీసుకు వస్తుందని నేను నమ్మిన దాని కొరకు నేను పోరాడాను. అయితే, మానవులు ఎంత నిజాయితీగా ఉన్నప్పటికీ, యౌవనునిగా నేను ఎంతగానో కోరుకున్న న్యాయాన్ని వారు తీసుకురాలేరు అని నేను బైబిలు నుండి నేర్చుకున్నాను. కేవలం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు చేతుల్లోని తన రాజ్యం మాత్రమే అన్యాయం నుండి ఎంతగానో కోరబడుతున్న ఉపశమనాన్ని అందించగలదు అని గ్రహించడానికి బైబిలు జ్ఞానం నాకు సహాయం చేసినందుకు కృతజ్ఞుడను.—యెషయా 9:6, 7; దానియేలు 2:44; మత్తయి 6:9, 10; ప్రకటన 21:3, 4.

నా వ్యక్తిత్వంలోని మార్పును గూర్చి అనేక దినపత్రికలు వ్రాశాయి, అటువంటి మార్పుకు బైబిలు జ్ఞానమే కారణము. ఉదాహరణకు, ప్రోకీడాలోని కారాగార వార్డెను ఇలా చెప్పినట్లు పాయేజె సేరా అనే వార్తాపత్రిక ఎత్తి వ్రాసింది: “ఖైదీలందరూ ఫ్రాంక్‌ వలె ఉంటే, కారాగారాలు అదృశ్యమౌతాయి; ఆయన ప్రవర్తన అనింద్యమైనది, ఆయనెన్నడూ పోట్లాడేవాడు కాదు, ఆయనెన్నడూ ఏమాత్రం మందలించబడలేదు.” ఇంకొక వార్తాపత్రిక, ఆవేనీరె, ఇలా అంది: “ఆయనొక మాదిరికరమైన ఖైదీ, అసామాన్యమైనవాడు. ఆయన పునఃప్రాప్తి చేసుకున్న ఖ్యాతి ఊహించనలవి కానిది. ఆయన సంస్థల ఎడల, కారాగార అధికారుల ఎడల గౌరవాన్ని కలిగివున్నాడు, అసాధారణమైన ఆత్మీయతను కలిగివున్నాడు.”

ప్రతిఫలదాయకమైన జీవితం

1984 నుండి, నేను యెహోవాసాక్షుల సంఘంలో ఒక పెద్దగా, పయినీరు అని పిలువబడే పూర్తికాల పరిచారకునిగా సేవ చేశాను. 1990లో, 15 సంవత్సరాల క్రితం నేను బైబిలు జ్ఞానాన్ని పంచుకున్న ఒక కారాగార గార్డు, తాను తన కుటుంబమంతా యెహోవాసాక్షులయ్యారని చెప్పడానికి ఫోను చేశాడు.

కానీ నా అత్యంత ఆనందకరమైన అనుభవం 1995 జూలైలో వచ్చింది. ఆ సంవత్సరం నా ప్రియమైన భార్య వీటా బాప్తిస్మానికి హాజరయ్యే ఆనందమయ అవకాశం లభించింది. అనేక సంవత్సరాల తరువాత, ఆమె బైబిలు బోధలను తన స్వంతం చేసుకుంది. ఇప్పుడు నా విశ్వాసాన్ని పంచుకోని నా ముగ్గురు కుమారులు, దేవుని వాక్యాన్నుండి నేను నేర్చుకున్న దానిని బహుశ ఒక నాటికి స్వీకరిస్తారేమో.

ఇతరులు బైబిలు సత్యాలను నేర్చుకునేలా సహాయం చేసిన నా అనుభవాలు సాటిలేని ఆనందాన్ని ఇచ్చాయి. నిత్యజీవానికి నడిపించే జ్ఞానాన్ని పొందగలిగి దాన్ని యథార్థ హృదయులతో పంచుకోగలగడం ఎంత ప్రతిఫలదాయకం!—యోహాను 17:3.—ఫ్రాంక్‌ మాన్నినో చెప్పినది.

[అధస్సూచి]

a వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీవారిచే ప్రచురించబడింది.

[15వ పేజీలోని చిత్రం]

మారణకాండ జరిగిన సిసిలీలోని పర్వత కనుమ

[16వ పేజీలోని చిత్రం]

1942లో మేము పెళ్లి చేసుకున్నప్పుడు

[18వ పేజీలోని చిత్రం]

నేను తరుచూ కారాగార గార్డులతో బైబిలు సత్యాలను పంచుకున్నాను

[20వ పేజీలోని చిత్రం]

నా భార్యతో

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి