కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g98 12/8 పేజీలు 4-7
  • ఎయిడ్స్‌—ఎలా ఎదుర్కోవాలి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఎయిడ్స్‌—ఎలా ఎదుర్కోవాలి
  • తేజరిల్లు!—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నివారణోపాయాలు
  • ఎప్పుడు పరీక్ష చేయించుకోవాలి
  • విద్య ఎలా సహాయం చేయగలదు?
  • చికిత్స విధానాలు ఎన్ని ఉన్నాయి?
  • వాక్సిన్‌లే జవాబా?
  • ఎయిడ్స్‌ ఆఫ్రికాలో వ్యాపిస్తోంది
    తేజరిల్లు!—2003
  • ఎయిడ్స్‌ రాకుండా నేనెలా కాపాడుకోగలను?
    తేజరిల్లు!—1994
  • ఎయిడ్స్‌—నేను అపాయంలో ఉన్నానా?
    తేజరిల్లు!—1993
  • “మానవ చరిత్రలోనే అత్యంత వినాశనకరమైన మహమ్మారి”
    తేజరిల్లు!—2003
మరిన్ని
తేజరిల్లు!—1998
g98 12/8 పేజీలు 4-7

ఎయిడ్స్‌—ఎలా ఎదుర్కోవాలి

ప్రస్తుతం ఎయిడ్స్‌కి చికిత్స లేదు. వైద్యశాస్త్రం త్వరలో చికిత్సను కనుగొంటుందన్న ఆశలు కూడా కనిపించడం లేదు. క్రొత్త చికిత్సలు వ్యాధి ముదరడాన్ని తగ్గిస్తున్నప్పటికీ అసలు ఈ ఇన్ఫెక్షనే సోకకుండా చూసుకోవడం ఉత్తమోత్తమం. అయితే నివారణను గురించి మనం చర్చించడానికి ముందు, అసలు ఎయిడ్స్‌ వైరస్‌ (హెచ్‌ఐవి) ఒక వ్యక్తినుండి మరో వ్యక్తికి ఎలా సంక్రమిస్తుంది ఎలా సంక్రమించదు అన్నది చూద్దాము.

ఈ ఇన్ఫెక్షన్‌ ప్రధానంగా నాలుగు విధాలుగా సోకవచ్చు: (1) కలుషితమైన సూదిని గాని సిరంజిని గాని ఉపయోగించడం ద్వారా, (2) లైంగిక సంపర్కం ద్వారా (జననేంద్రియ, పాయు సంబంధ, లేదా నోటిద్వారా చేసే సంపర్కం), (3) రక్త మార్పిడిలు, రక్త ఉత్పత్తుల ద్వారా. అయితే ఈ ప్రమాదం బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో తక్కువ చేయబడింది. ఇప్పుడు ఆ దేశాల్లో రక్తాన్ని హెచ్‌ఐవి యాంటిబాడీస్‌ కోసం పరీక్షలు చేస్తున్నారు, (4) హెచ్‌ఐవి ఇన్ఫెక్షన్‌ సోకిన తల్లి ద్వారా శిశువుకి; ఇది జననానికి ముందు లేదా పుట్టుక సమయంలో లేదా చనుబాలు త్రాగించేటప్పుడు జరుగవచ్చు.

యు.ఎస్‌. సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) ప్రకారం, ప్రస్తుత వైజ్ఞానిక ఆధారాలు ఇలా చెబుతున్నాయి: (1) మీకు జలుబు గాని లేదా ఫ్లూ గాని వచ్చినట్లు ఎయిడ్స్‌ రాదు, (2) మీరు ఎయిడ్స్‌ ఉన్న వ్యక్తి ప్రక్కన కూర్చోవడం వలన రాదు, లేదా ఈ ఇన్ఫెక్షన్‌ సోకిన వ్యక్తిని ముట్టుకోవడం ద్వారా గానీ లేక ఆలింగనం చేసుకోవడంహత్తుకోవడం ద్వారా గానీ రాదు, (3) ఇన్ఫెక్షన్‌ సోకిన వ్యక్తి ముట్టుకున్న, తయారు చేసిన, లేదా వడ్డించిన ఆహారాన్ని తినడం వలన రాదు. (4) టాయ్‌లెట్‌లు, టెలిఫోన్‌లు, బట్టలు, లేదా త్రాగే తినే పాత్రలను పంచుకోవడం ద్వారా రాదు. అంతేగాక, దోమల ద్వారా లేక మరితర కీటకాల ద్వారా ఈ వైరస్‌ సంక్రమించదు అని సీడీసీ చెబుతుంది.

నివారణోపాయాలు

ఇన్ఫెక్షన్‌ సోకినవారి రక్తంలో ఎయిడ్స్‌ వైరస్‌ దాగివుంటుంది. ఇన్ఫెక్షన్‌ సోకిన వ్యక్తి ఏదైనా ఇంజక్షన్‌ తీసుకున్నట్లైతే, వైరస్‌తోపాటు కొంత రక్తం సూదిపైన గాని లేదా సిరంజిలో గాని మిగిలిపోవచ్చు. ఆ విధంగా కలుషితమైన సూదితో మరొకరికి ఇంజక్షన్‌ ఇచ్చినట్లైతే ఆ వ్యక్తికి వైరస్‌ సోకవచ్చు. సూదిని గురించి గాని లేక సిరంజిని గురించి గాని మీకు సందేహంగా ఉన్నప్పుడు ఆ విషయమై డాక్టర్‌ని గాని నర్సుని గాని అడగడానికి భయపడవద్దు. తెలుసుకోవల్సిన హక్కు మీకు ఉంది; సంకోచించకండి, ఎందుకంటే మీ జీవితం ప్రమాదంలో ఉంది.

ఇన్ఫెక్షన్‌ సోకినవారి వీర్యంలోను లేదా జననేంద్రియ ద్రవాల్లోను కూడా ఎయిడ్స్‌ వైరస్‌ ఉంటుంది. అందుకని నివారణ గురించి సీడీసీ ఇలా సిఫారసు చేస్తుంది: “పూర్తి నిషేధం పాటించడం ద్వారా మాత్రమే మీరు సురక్షితంగా ఉండగలరు. మీరు ఒకవేళ లైంగిక సంపర్కంలో గనుక పాల్గొనాలనుకుంటే, మీరు దీర్ఘకాలికమైన పరస్పరం విశ్వసనీయమైన సంబంధంలోనికి అంటే వివాహం వంటి సంబంధంలోనికి ప్రవేశించేంత వరకు ఆగండి, అదీ ఇన్ఫెక్షన్‌ సోకని వివాహభాగస్వామితో మాత్రమే.”

మీరు సురక్షితంగా ఉండాలనుకుంటే “పరస్పరం విశ్వసనీయమైన సంబంధం” ఉండాలనీ దాన్ని కొనసాగించాలనీ గమనించండి. మీరు విశ్వసనీయంగా ఉండి మీ వివాహభాగస్వామి విశ్వసనీయంగా ఉండకపోతే మీరు సురక్షితంగా లేనట్లే. ఇది, లైంగికపరంగాను ఆర్థికపరంగాను పురుషాధిక్యత ఎక్కువగా ఉన్న సమాజంలోని స్త్రీలకు తరచూ సమస్యలను సృష్టిస్తుంది. కొన్ని దేశాల్లోని స్త్రీలకు సురక్షిత లైంగిక కార్యకలాపాలకు సంబంధించి చర్చలు జరిపే స్వాతంత్ర్యం మాట అలా ఉంచితే, సెక్స్‌ని గురించి పురుషులతో కనీసం ప్రస్తావించడానికి కూడా అనుమతి ఉండదు.

అయితే అటువంటి స్త్రీలందరూ శక్తిహీనులు కారు. పశ్చిమ ఆఫ్రికాలోని ఒక దేశంలో జరిపిన అధ్యయనం ఒకటి, ఆర్థిక స్వాతంత్ర్యం ఉన్న స్త్రీలు హింసాత్మక పరిణామాలేమీ లేకుండానే ఇన్ఫెక్షన్‌ సోకిన తమ భర్తలతో లైంగిక సంపర్కాన్ని నివారించగల్గారని చూపించింది. అమెరికాలోని న్యూజెర్సీలో కొంతమంది స్త్రీలు, పురుషుడు కండోమ్‌ ఉపయోగించడానికి ఇష్టపడనప్పుడు ఆ వ్యక్తితో సెక్స్‌ను నిరాకరించారు. లాటెక్స్‌ కండోమ్‌లు హెచ్‌ఐవి నుండి, లైంగికంగా సంక్రమించే మరితర వ్యాధుల నుండి రక్షణను ఇవ్వగలవు; అయితే వాటిని సరియైన పద్ధతిలోను క్రమం తప్పకుండాను వాడాలి.

ఎప్పుడు పరీక్ష చేయించుకోవాలి

మునుపటి శీర్షికలో ప్రస్తావించబడిన కరేన్‌ తనను తాను ఇన్ఫెక్షన్‌ నుండి కాపాడుకోవడానికి చేయగల్గిందేమీ లేకపోయింది. వారి వివాహానికి ముందే ఆమె భర్తకు ఇన్ఫెక్షన్‌ సోకింది, అంతేగాక వారి వివాహం ఈ మహమ్మారి విజృంభించక ముందు, హెచ్‌ఐవి పరీక్షలు తొలిదశలో ఉన్నప్పుడు జరిగింది. అయితే ఇప్పుడు కొన్ని దేశాల్లో హెచ్‌ఐవి పరీక్షలు చేయడం సామాన్యమైపోయింది. కాబట్టి ఒక వ్యక్తి తనకు హెచ్‌ఐవి ఉందో లేదోనని సందేహంగా ఉన్నట్లైతే అతడు లేక ఆమె వివాహానికి ముందే లేదా ప్రేమించడానికి ముందే పరీక్షలు చేయించుకోవడం మంచిది. కరేన్‌ ఇచ్చే సలహా: “మీ వివాహభాగస్వామిని జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి. తప్పుడు ఎంపిక చేసినందుకు మీరెంతో మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది, చివరికి మీ జీవితాన్నే బలిచేయాల్సి వస్తుంది.”

వివాహభాగస్వామి వ్యభిచారం చేసినప్పుడు పరీక్ష చేయడం, వ్యభిచారం చేయని భాగస్వామిని కాపాడడానికి సహాయం చేయగలదు. ఇన్ఫెక్షన్‌ సోకిన తర్వాత ఆరు నెలలకు గానీ ఒకే పరీక్షలో హెచ్‌ఐవి తేలదు గనుక చాలా పరీక్షలు అవసరం కావచ్చు. ఒకవేళ లైంగిక సంబంధం మళ్లీ కొనసాగించినట్లైతే (తద్వారా వ్యభిచారం చేసిన వివాహభాగస్వామిని క్షమించినట్లు సూచించినట్లైతే) కండోమ్‌లను ఉపయోగించడం ఇన్ఫెక్షన్‌ సోకకుండా కాపాడగలదు.

విద్య ఎలా సహాయం చేయగలదు?

ఎయిడ్స్‌ ఉద్భవించడానికి ఎంతోకాలం ముందే బైబిలు వ్రాయబడినప్పటికీ దాని సూత్రాలకు అనుగుణంగా జీవించడం ఈ వ్యాధినుండి రక్షణను ఇస్తుంది. ఉదాహరణకు, వివాహేతర సెక్స్‌ని బైబిలు ఖండిస్తుంది, వివాహబంధంలో విశ్వసనీయంగా ఉండాలని ఆజ్ఞాపిస్తుంది, క్రైస్తవులు తమలాగే బైబిలు సూత్రాలను అన్వయించేవారిని మాత్రమే వివాహమాడాలని చెబుతుంది. (1 కొరింథీయులు 7:39; హెబ్రీయులు 13:4) శరీరాన్ని మలినపర్చే అన్ని రకాల మాదకద్రవ్యాల దుర్వినియోగం, రక్తాన్ని లోపలికి తీసుకోవడం వంటివాటిని కూడా అది నిషేధిస్తుంది.—అపొస్తలుల కార్యములు 15:20; 2 కొరింథీయులు 7:1.

హెచ్‌ఐవి పాజిటివ్‌ వ్యక్తులను కలవడం విషయంలో ఉండగల అపాయాలు ప్రమాదాల విషయమై మీరు తెలుసుకోవడం జ్ఞానయుక్తం. ఎయిడ్స్‌ను గురించి తెలుసుకోవడం దానికి విరుద్ధంగా సంరక్షణను ఏర్పర్చుకోవడానికి సహాయం చేస్తుంది.

ఎయిడ్స్‌ యాక్షన్‌ లీగ్‌ ఇలా చెబుతుంది: “అత్యధిక కేసుల్లో ఎయిడ్స్‌ నివారించదగ్గదే. చికిత్స అంటూ ఒకటి దొరికేంత వరకు ఎయిడ్స్‌కి విరుద్ధంగా విద్య మాత్రమే అతి శ్రేష్ఠమైన, నేడు ఏకైక [సామూహిక] రక్షణను అందిస్తుంది. (ఇటాలిక్కులు మావి.) తల్లిదండ్రులు ఎయిడ్స్‌ గురించి దాపరికం లేకుండా మాట్లాడుకోవడం మంచిది. అలాగే పిల్లలతో కూడా వారు ఎయిడ్స్‌ గురించి మాట్లాడటం మంచిది.

చికిత్స విధానాలు ఎన్ని ఉన్నాయి?

ఒక వ్యక్తి హెచ్‌ఐవి ఇన్ఫెక్షన్‌ సోకిన తర్వాత వ్యాధి లక్షణాలు సాధారణంగా ఆరు నుండి పది సంవత్సరాల వరకు కనబడవు. ఆ సంవత్సరాల్లో శరీరం లోపల యుద్ధం జరుగుతూ ఉంటుంది. వైరస్‌లు లెక్కకు మించి పెరిగిపోయి వ్యాధి నిరోధక వ్యవస్థలోని కణాలను చంపుతూ ఉంటాయి. వ్యాధి నిరోధక వ్యవస్థలోని కణాలు ఎదురుదాడి జరుపుతాయి. చిట్టచివరికి ప్రతిరోజు కోట్ల కొలది క్రొత్త వైరస్‌లు ఉత్పత్తి అవుతుండగా వ్యాధి నిరోధక వ్యవస్థ కుప్పకూలిపోతుంది.

వ్యాధినిరోధక వ్యవస్థకు సహాయం చేసే ప్రయత్నంలో అనేక రకాల మందులు తయారుచేయబడ్డాయి. ఈ మందులకు AZT, DDI, DDC అనే అక్షరాలతో సంక్లిష్టమైన పేర్లు ఉన్నాయి. ఈ మందులు చక్కని ప్రయోజనాల్ని తీసుకువచ్చాయనీ చివరికి చికిత్సను కూడా కలుగజేస్తాయనీ అనేకమంది విశ్వసించినా అలాంటి ఆశలన్నీ త్వరలోనే అడియాసలయ్యాయి. అవి సమయం గడిచేకొద్దీ తమ ప్రభావాన్ని కోల్పోవడమే కాక కొంతమంది ప్రజల్లో ప్రమాదకరమైన సైడ్‌-ఎఫెక్టులను కలుగజేశాయి—రక్త కణాల సంఖ్య పడిపోవడం, రక్తం గడ్డకట్టడంలో అవ్యవస్థలు, చేతుల్లోను పాదాల్లోను నరాలకు హాని కలగడం వంటివి సంభవించాయి.

ఇప్పుడు క్రొత్త మందుల వర్గం రంగప్రవేశం చేసింది: ప్రోటీజ్‌ ఇన్‌హెబిటర్స్‌. డాక్టర్లు వీటిని ఇతర యాంటీవైరల్‌ మందులతోపాటు మూడురకాల మందుల సమ్మేళనంతో ప్రిస్క్రైబ్‌ చేస్తున్నారు. ఈ ట్రిపుల్‌ థెరపీ—వైరస్‌ను అంతం చేయనప్పటికీ అది శరీరంలో దాని పెరుగుదలను నివారిస్తుంది, కనీసం పెరుగుదలను నిరోధిస్తుంది.

వ్యాధిగ్రస్తులైన వారి ఆరోగ్యంలో ట్రిపుల్‌ థెరపీ చాలా గణనీయమైన ఫలితాల్ని తీసుకొచ్చింది. అయితే హెచ్‌ఐవి ఇన్ఫెక్షన్‌ సోకిన ప్రజలకు చాలా తొలి దశలోనే అంటే రోగలక్షణాలు పొడచూపడానికి ముందే ఇచ్చినప్పుడు ఈ మందులు బాగా పనిచేస్తాయని నిపుణులు నమ్ముతున్నారు. అలా ఇచ్చినప్పుడు ఈ ఇన్ఫెక్షన్‌ బాగా ముదిరిపోయిన ఎయిడ్స్‌గా మారడాన్ని నివారించడం సాధ్యంకావచ్చు. పూర్తిగా నివారించలేకపోయినా కనీసం ప్రస్తుతానికి నివారించవచ్చు. ఇటువంటి చికిత్స క్రొత్తది గనుక, ఈ థెరపీ ఇన్ఫెక్షన్‌ను ఎంతకాలంపాటు అదిమిపెడుతుందన్నది వేచిచూడవల్సిందే.

ట్రిపుల్‌ థెరపీ చాలా ఖరీదైనది. మూడు యాంటివైరల్‌ మందులకు ల్యాబ్‌ టెస్టులకు కలిపి సంవత్సరానికి సగటున 12,000 డాలర్లు ఖర్చు అవుతుంది. ఆర్థిక భారానికి తోడు, ట్రిపుల్‌ థెరపీ పొందుతున్న వ్యాధిగ్రస్తుడు తన మందుల్ని ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి. ప్రతిరోజు ఫ్రిజ్‌ తెరవడానికి అనేకమార్లు లేవాలి. సాధారణంగా, ఒక వ్యాధిగ్రస్తుడు కొన్ని మాత్రలను రోజుకి రెండుసార్లు; వేరేవాటిని రోజుకి మూడుసార్లు వేసుకోవల్సి ఉంటుంది. కొన్నింటిని ఖాళీ కడుపుతో తీసుకోవాలి, వేరేవాటిని భోజనం చేసిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. ఎయిడ్స్‌ రోగి చాలా సులభంగా ఇతర అనేక ఇన్ఫెక్షన్‌లకు గురి అవుతాడు, ఇక వీటిని నిరోధించడానికి కూడా అదనపు మందుల్ని తీసుకోవల్సి రావడంతో ఈ థెరపీ మరింత సంక్లిష్టమౌతుంది.

ట్రిపుల్‌ థెరపీని మధ్యలో ఆపివేస్తే ఏమి జరుగగలదో అన్నది డాక్టర్లకు చాలా పెద్ద భయంగా ఉంది. ఈ చికిత్సని మధ్యలో ఆపివేస్తే వైరస్‌ల సంఖ్య ఇక అదుపులేకుండా పెరుగుతుంది, అంతేగాక అప్పటిదాకా వేటికి విరుద్ధంగా పోరాడడానికైతే మందులు తీసుకుంటూ వచ్చారో ఆ మందులనే అధిగమించే శక్తిని, చికిత్సను తప్పించుకున్న వైరస్‌లు వృద్ధిచేసుకుంటాయి. మందుల్ని నిరోధించే రకాల హెచ్‌ఐవిలకు అయితే చికిత్స చేయడం మరింత కష్టంగా ఉంటుంది. అంతేగాక, ఈ సూపర్‌వైరస్‌లు వేరే ప్రజలకు కూడా సంక్రమించగలవు.

వాక్సిన్‌లే జవాబా?

ప్రపంచవ్యాప్త ఎయిడ్స్‌ మహమ్మారికి కళ్లెం వేయడానికి కీలకం ఒక సురక్షితమైన ప్రభావవంతమైన వాక్సినే అని కొంతమంది ఎయిడ్స్‌ పరిశోధకులు నమ్ముతారు. ఎల్లో ఫీవర్‌, మీజిల్స్‌, మమ్ప్స్‌, రూబెల్లా వంటి వ్యాధులకు విరుద్ధంగా, బలహీనపర్చిన వైరస్‌ల నుండి తయారుచేసిన వాక్సిన్‌లు విజయవంతంగా ఉపయోగించబడ్డాయి. సాధారణంగా, బలహీనపర్చిన ఒక వైరస్‌ను శరీరంలోనికి పంపినప్పుడు, మనశరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందించి దాన్ని నాశనం చేస్తుంది. అంతేకాదు, భవిష్యత్తులో అసలు వైరస్‌ దాడిచేసినా దాన్ని విజయవంతంగా నిర్మూలించేందుకుగాను రక్షణ కవచాన్ని నిర్మిస్తుంది.

హెచ్‌ఐవితో సమస్య ఏమిటంటే బలహీనపర్చిన హెచ్‌ఐవి వైరస్‌ కూడా ప్రాణాంతకంగా తయారుకాగలదని ఇటీవల కోతులతో జరిపిన రెండు ప్రయోగాలు సూచించాయి. వేరే మాటల్లో చెప్పాలంటే ఏ వ్యాధినుండైతే మనల్ని కాపాడాలని వాక్సిన్‌ను రూపొందించామో అదే వ్యాధిని ఆ వాక్సిన్‌ కలుగజేయగలదన్నమాట.

వాక్సిన్‌ కోసమైన అన్వేషణ చాలా నిరుత్సాహకరంగాను నిరాశాజనకంగాను ఉంది. చిన్న చిన్న వైరస్‌లను తప్పకుండా తుదముట్టించగల ప్రయోగాత్మక డజన్లకొద్దీ ఔషధాలను హెచ్‌ఐవి త్రిప్పికొట్టింది. అంతేకాదు, హెచ్‌ఐవి పరివర్తనం చెందుతుంది, ఇందుమూలాన దాన్ని గురిపెట్టడం చాలా కష్టంగా ఉంటుంది. (ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చూస్తే దాదాపు పది హెచ్‌ఐవి కుటుంబాలు ఉన్నాయి.) ఈ సమస్యకి తోడుగా, ఏ వ్యాధినిరోధక వ్యవస్థ కణాలనైతే వాక్సిన్‌ సంరక్షించాల్సి ఉందో అవే రోగనిరోధక వ్యవస్థ కణాలపై ఈ వైరస్‌ డైరెక్టుగా దాడిచేస్తుంది.

ఎయిడ్స్‌ పరిశోధనలో ఆర్థికపరమైన కారణాలు కూడా ఒక పాత్రను నిర్వహిస్తున్నాయి. “ప్రైవేట్‌ పరిశ్రమల పక్షంగా చాలా తక్కువ చొరవ” కన్పిస్తుందని వాషింగ్టన్‌లోని ఇంటర్నేషనల్‌ ఎయిడ్స్‌ ఇనీషియేటివ్‌ చెబుతుంది. దానికి కారణం: ఒక వాక్సిన్‌ను ఉత్పత్తి చేసినా అది అధికశాతం తక్కువ అభివృద్ధిచెందిన దేశాల్లో మార్కెట్‌ చేయబడుతుంది గనుక లాభాలు రావన్న భయం.

కష్టాలు ఉన్నప్పటికీ ఫలితాల్ని తీసుకురాగల ఒక వాక్సిన్‌ కోసం అన్వేషించడానికి పరిశోధకులు పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. అయితే, త్వరలో ఒక వాక్సిన్‌ ఉత్పత్తి అవుతుందన్న ఆశలు ప్రస్తుతం ఏమీ కన్పించడం లేదు. పరిశోధనశాల నుండి ఏదైనా మంచి వాక్సిన్‌ బయటికి వస్తే, అటుతర్వాత ఎంతో కష్టతరమైన, ఖరీదైన, ప్రాణాంతకం కాగల పరీక్షలు మానవులపై చేయడం జరగాలి.

[5వ పేజీలోని బాక్సు]

హెచ్‌ఐవి ఇన్ఫెక్షన్‌ ఎక్కువగా ఎవరికి సోకుతుంది?

ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు 16,000 మందికి ఈ ఇన్ఫెక్షన్‌ సోకుతుంది. వీరిలో 90 శాతం అభివృద్ధిచెందుతున్న దేశాల్లోనే ఉన్నారని అంచనా. ప్రతి 10 మందిలో ఒకరు 15 ఏండ్లకు తక్కువున్న అబ్బాయి లేక అమ్మాయే. మిగతావారందరు పెద్దవారే. ఈ పెద్దవారిలో 40 శాతానికిపైగా స్త్రీలు ఉన్నారు, 50 శాతానికిపైగా 15 నుండి 24 సంవత్సరాల మధ్యనున్న యౌవనులున్నారు.—ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు జాయింట్‌ యునైటెడ్‌ నేషన్స్‌ ప్రోగ్రామ్‌ ఆన్‌ హెచ్‌ఐవి/ఎయిడ్స్‌.

[7వ పేజీలోని బాక్సు]

ఇన్ఫెక్షన్‌ ఎవరికి సోకిందో ఎలా చెప్పగలము?

ఒక వ్యక్తిని కేవలం చూడడం ద్వారానే ఇన్ఫెక్షన్‌ సోకిందో లేదో చెప్పలేము. రోగలక్షణాలేమీ లేకుండానే హెచ్‌ఐవి కల్గివున్న వ్యక్తులు ఆరోగ్యకరంగా కన్పిస్తున్నప్పటికీ వారు తమకున్న వైరస్‌ను ఇతరులకు సంక్రమింపజేయగలరు. ఒక వ్యక్తి కేవలం తనకు ఇన్ఫెక్షన్‌ సోకలేదని చెప్పగానే నమ్మేయవచ్చా? అలా కానవసరం లేదు. ఇన్ఫెక్షన్‌ సోకిన చాలామందికి తమకు హెచ్‌ఐవి ఉందన్న సంగతి తమకే తెలియదు. ఆ విషయం తెలిసిన వ్యక్తులు బహుశ దాన్ని రహస్యంగా ఉంచాలనుకోవచ్చు, లేదా అబద్ధమాడవచ్చు. అమెరికాలో జరిపిన ఒక సర్వేలో, హెచ్‌ఐవి ఇన్ఫెక్షన్‌ సోకిన ప్రతి 10 మందిలో నలుగురు తమ స్థితిని గురించి తమ వివాహభాగస్వాములకు తెలపడం జరగలేదని వెల్లడైంది.

[6వ పేజీలోని బాక్సు/చిత్రం]

హెచ్‌ఐవి-ఎయిడ్స్‌ల మధ్యనున్న సంబంధం

హెచ్‌ఐవి (HIV) పూర్తి పేరు, “హ్యూమన్‌ ఇమ్యూనోడెఫీషియన్సీ వైరస్‌.” ఈ వైరస్‌ మన శరీరంలో వ్యాధులకు విరుద్ధంగా పోరాడే వ్యాధినిరోధక వ్యవస్థలోని భాగాలను నెమ్మది నెమ్మదిగా నాశనం చేస్తుంది. ఎయిడ్స్‌ (AIDS) పూర్తి పేరు, “అక్వైర్డ్‌ ఇమ్యూనోడెఫీషియన్సీ సిండ్రోమ్‌.” ఇది హెచ్‌ఐవి ఇన్ఫెక్షన్‌ సోకిన తర్వాత ఏర్పడే ప్రాణాంతకమైన చివరి స్థాయి. ఆ పేరే, వ్యాధినిరోధక వ్యవస్థని హెచ్‌ఐవి ఎంత ఘోరంగా దెబ్బతీసిందో వివరిస్తుంది. దీనితో వ్యాధిగ్రస్తుడు, వేరేవిధంగానైతే వ్యాధినిరోధక వ్యవస్థ ఎదుర్కొనే ఇన్ఫెక్షన్‌లకు సులభంగా బలి అయ్యేలా చేస్తుంది.

[క్రెడిట్‌ లైను]

CDC, Atlanta, Ga.

[7వ పేజీలోని చిత్రం]

వివాహం చేసుకోవడానికి ముందు హెచ్‌ఐవి పరీక్ష చేయించుకోవాలనుకోవడం జ్ఞానయుక్తమైన ఎంపిక

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి