పఠననిరాసక్తతకు వ్యతిరేకంగా జాగ్రత్తపడండి
చదవడానికి సంబంధించిన ఓ క్రొత్త సమస్య మన ప్రపంచాన్ని విస్తృతంగా ప్రభావితం చేస్తోంది. అది పఠననిరాసక్తత (అలిటరసీ) అని పిలువబడుతోంది. అది “చదవగలిగినప్పటికీ చదవడంలో ఆసక్తి లేని స్వభావం లేదా పరిస్థితి” అని నిర్వచింపబడుతోంది.a (మిరియమ్-వెబ్‌స్టర్స్ కోలజియేట్ డిక్షనరీ, టెన్త్ ఎడిషన్) అవును, చదవడం—ఒకప్పుడు సంతోషకరంగా చేయబడేది—నేడు ఒక పనన్నట్లుగా తరచూ నిరాకరించబడుతోంది. “చదవాలంటే శ్రమపడవలసి ఉంటుంది, అది అంత వినోదాన్నివ్వగలదు” అని 12 ఏండ్ల ఓ అమ్మాయి చెబుతుంది.
చాలా మంది పెద్దవాళ్ళు కూడా పఠననిరాసక్తులుగా ఉన్నారు. ఉదాహరణకు, అమెరికా 97 శాతం అక్షరాస్యత ఉందని గొప్ప చెప్పుకుంటుంది; కాని, అమెరికావారిలోనే యాభై కన్నా ఎక్కువ శాతం మంది పెద్దవారు పుస్తకాలను లేదా పత్రికలను చదవడం చాలా అరుదు! చదివే సామర్థ్యం ఉన్నంతగా చదవాలనే కోరిక ఎల్లప్పుడూ ఉండదన్నది స్పష్టం. బాగా విద్యావంతులైనవారి విషయంలోనూ ఇది నిజమే. “నేను పగలంతా పనిచేసి అలిసిపోయి ఇంటికి వచ్చినప్పుడు పుస్తకం చేతిలోనికి తీసుకునే బదులు టి.వి. ఆన్ చేస్తాను. అదే సులభం” అని హార్వార్డ్ కళాశాల పట్టభద్రుడు చెబుతున్నాడు.
చదివే విషయం ఏమైంది? ఇటీవలి దశాబ్దాల్లో దాని ప్రసిద్ధి శ్రద్ధనాకట్టుకునే సమాచార వ్యవస్థకు తలవొగ్గింది. “మనకిప్పుడు ఎమ్.టి.వి.—వి.సి.ఆర్. మరియు నిన్‌టెండో వీడియో ఆటలు మరియు వాక్‌మ్యాన్ ఉన్నాయి, తొందర పనులు లేని సమయాల్లోలా కష్టపడి పుస్తకాలు చదవడమనేది ఇప్పుడంత సులభతరంగా అనిపించదు” అని స్ట్రాట్‌ఫార్డ్ పి. షెర్మాన్ ఫార్‌చ్యూన్ అనే పత్రికలో వ్రాస్తున్నాడు. చదివే సమయాన్ని పోటీగా దోచుకునేది ఎక్కువగా టి.వి.యే. నిజానికి సగటు అమెరికా దేశస్థుడు తనకు 65 ఏండ్లు వచ్చేసరికి టి.వి.ని చూస్తూ తన జీవితంలోని 9 ఏండ్లు గడిపి ఉంటాడు!
చదవడం వలన కలిగే ప్రయోజనాలు తళుక్కుమనే స్క్రీన్‌కు తరచూ బలిచేయబడుతున్నాయి గనుక, ఈ క్రింది విషయాలను తలపోయడం మంచిది.
చదవడం వలన కలిగే ప్రయోజనాలు
చదవడం ఊహా శక్తిని ప్రేరేపిస్తుంది. దూరదర్శిని మీ కొరకు ఆలోచిస్తుంది. ముఖ కవళికలు, స్వరభేదాలు మరియు ప్రకృతి దృశ్యాలు, మరి ప్రతిదీ సవివరంగా తెలియజేయబడుతుంది.
అయితే, చదివేటప్పుడు పాత్రధారులను, వేదికను మీరే ఎన్నుకుని, ఆ నటనకు మీరే దర్శకత్వమిస్తారు. “మీకు చాలా స్వాతంత్ర్యం ఉంది. ప్రతి పాత్రను మీరు కావాలనుకునే విధంగా మీరు ఊహించుకోవచ్చు. మీరు టి.వి.లో దేనినైనా చూసేటప్పటి దాని కన్నా మీరు చదివేటప్పుడే మీకు వాటిపై ఎక్కువ అదుపు ఉంటుంది” అని 10 ఏండ్ల ఒక అబ్బాయి చెబుతున్నాడు. డా. బ్రూనో బెట్టిల్‌హీమ్ అభిప్రాయపడినట్లు “దూరదర్శిని ఊహను లోబరచుకుంటుందే తప్ప, దానిని విడుదల చేయదు. ఓ మంచి పుస్తకం మెదడును ఒక్కసారి ప్రేరేపించి, స్వతంత్రం చేస్తుంది.”
చదవడం వాక్పటిమను వృద్ధిచేస్తుంది. “ఏ బిడ్డయినా, పెద్దవారెవరైనా సరే దూరదర్శినిని మరీ ఎక్కువగా చూడడం ద్వారా ఎక్కువ అభివృద్ధిని సాధించరు” అని మసాచెసెట్స్‌నందలి విశ్వవిద్యాలయంలోని రెజినాల్డ్ దామరల్ పేర్కొన్నాడు. “దూరదర్శినిని చూడడానికి అవసరమైన సామర్థ్యాలు ఎంత ప్రాథమికమైనవంటే దూరదర్శినిని చూసే అసమర్థతను గురించి ఇంతవరకు మనం వినలేదు.”
దానికి భిన్నంగా, చదవడానికి వాక్పటిమ ఉండాలి, మరి చదవడమనేది వాక్పటిమను వృద్ధి చేస్తుంది కూడా; అది విడదీయలేని విధంగా మాట్లాడడంతోను వ్రాయడంతోను ముడిపడి ఉంది. ఒక ఉన్నత పాఠశాల ఆంగ్ల భాషా బోధకుడు ఈ విధంగా చెబుతున్నాడు: “విద్యార్థిగా మీ విజయమనేది మీ పదజాలం పై అంటే మీరు చదివేటప్పుడు మీరేమి అర్థం చేసుకోగలుగుతారు, మీరు వ్రాసేటప్పుడు ఏమని ఆలోచిస్తారు అనే రెండు విషయాలపై ఎక్కువగా ఆధారపడి ఉంటుందనడానికి సందేహం లేదు, చక్కని పదజాలాన్ని నిర్మించుకోవడానికి కేవలం చదవడం తప్ప మరే మార్గమూ లేదు.”
చదవడం అనేది ఓపికను కలిగిస్తుంది. టి.వి.ని చూస్తున్న వ్యక్తి తాను చూస్తున్న దానిని గూర్చి తలపోయడానికి ఎక్కువ సమయాన్నివ్వకుండా కేవలం ఒక్క గంటలోనే వెయ్యి కన్నా ఎక్కువ బొమ్మలు టి.వి. తెరపై కనిపిస్తాయి. “ఈ సాంకేతిక పద్ధతి అక్షరాలా కేవలం కొంత సేపు కొరకే” అని డా. మాత్యూ డ్యూమంట్ చెబుతున్నాడు. కొన్ని అధ్యయనాలు దూరదర్శినిని అమితంగా చూడడాన్ని పిల్లలూ పెద్దలూ అకస్మాత్తుగా తీర్మానాలను తీసుకోవడంతోనూ వారు కలత చెందడంతోనూ ముడిపెట్టడంలో ఆశ్చర్యం లేదు.
చదవడానికి ఓపిక అవసరం. “వాక్యాలు, పేరాలు మరియు పేజీలను మెల్లగా, వరుస క్రమంగా, క్రమబద్ధంగా తీయడమనేది కచ్చితంగా సహజ జ్ఞానం వల్ల తెలిసేది కాదు” అని వార్తావినిమయ నిపుణుడైన నెయిల్ పోస్ట్‌మ్యాన్ వ్రాస్తున్నాడు. చదువరి తన స్వంత వేగంలో తప్పనిసరిగా పేజీలో ఉన్నదానిని గూర్చి వ్యాఖ్యానించుకోవాలి, మదించుకోవాలి, ఆలోచించుకోవాలి. చదవడం అనేది మామూలు మాటలలోనికి మార్చుకునే సంకీర్ణమైన ప్రక్రియ, దానికి ఓపిక అవసరం, అది ఓపికను మెరుగుపరుస్తుంది కూడా.
ఓ సమతుల్య దృష్టి
చదవడం వలన ప్రయోజనాలున్నప్పటికీ, దూరదర్శినిని చూడడం వల్ల కూడా లాభాలున్నాయని ఒప్పుకోవలసిందే. కొన్ని రకాల సమాచారాన్ని అందజేయడంలో అది చదవడం వల్ల లభించేదానికన్నా మించిపోవచ్చు.b ఆసక్తిదాయకమైన ఒక టి.వి. కార్యక్రమం చదవడంలో ఆసక్తిని రేకెత్తించవచ్చు కూడా. “టి.వి. కార్యక్రమాల్లోని నాటక రూపంలోని పిల్లల సాహిత్యం మరియు విజ్ఞానశాస్త్రం వాటికి సంబంధించిన చర్చా విషయాలను గూర్చిన పుస్తకాలను చదవడానికి పిల్లలను ప్రభావితం చేస్తాయి” అని ది ఎన్‌సైక్లోపిడీయా అమెరికానా చెబుతుంది.
సమతుల్య దృష్టి అత్యావశ్యం. ముద్రించబడిన పేజీ మరియు దూరదర్శిని అనేవి రెండు విభిన్న సమాచార మాధ్యమాలు. ప్రతి ఒక్కదానికి స్వయంసిద్ధమైన విశిష్టతలు మరియు పరిమితులు ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఉపయోగించబడవచ్చు, లేదా దుర్వినియోగం చేయబడవచ్చు. అవును, ఒకడు తనను తాను ఒంటరిగా చేసుకునేంత మేరకు అమితంగా చదవడం అనేది, అమితంగా టి.వి.ని చూసేంతటి హానికరమైనది.—సామెతలు 18:1; ప్రసంగి 12:12.
అయినప్పటికీ, దృశ్యాలను చూసే దృష్ట్యా చదవడం అనేది తరచూ తగ్గించబడుతుంది. ఒక జపాన్ విలేఖరి ఈ విధంగా విలపిస్తున్నాడు: “మనం చదువరుల సంస్కృతి నుండి ప్రేక్షకుల సంస్కృతికి మారుతున్నాం.” ముఖ్యంగా యౌవనస్థుల మధ్య ఇది గమనించబడుతుంది. దాని ఫలితంగా, వారిలో చాలా మంది పఠన నిరాసక్తులుగా పెరుగుతూ, తర్వాత దాని పరిణామాలను అనుభవిస్తున్నారు. కనుక, తమ పిల్లలు చదవాలనే కోరికను పెంచుకోవడానికి తలిదండ్రులు ఎలా సహాయపడగలరు?
తలిదండ్రులు ఎలా సహాయపడగలరు
మాదిరినుంచండి. న్యూస్‌వీక్‌లోని “మంచి చదువరులను ఎలా పెంచాలి” అనే శీర్షిక ఉపయుక్తమైన ఈ ఉపదేశాన్నిస్తుంది: “మీరు దూరదర్శిని ముందు పప్పు ముద్దలా కూర్చునేటట్లయితే, మీ బిడ్డ కూడా అలా కూర్చునే సాధ్యత ఉంది. మరొక వైపు, మీరు సంతోషంగా ఒక మంచి పుస్తకంతో కూర్చుని కనబడితే చదవాలని చెప్పడమే కాక, మీరు కూడా అలా చేస్తున్నారని వాళ్ళు తెలుసుకుంటారు.” ఇంకా కొందరు తలిదండ్రులు తమ పిల్లల కొరకు చక్కగా పెద్దగా చదివి వినిపిస్తారు. అలా చేయడంవల్ల విచారకరంగా నేటి అనేక కుటుంబాల్లో కొరవడినదైన అనురాగ బంధాన్ని వారు సృష్టించుకుంటారు.
ఒక గ్రంథాలయాన్ని ఆరంభించుకోండి. “చుట్టూ పుస్తకాలను—అనేక పుస్తకాలను ఉంచుకోండి. పుస్తకాలు లభించేవి గనుకనే మరి ప్రతి ఒక్కరు వాటిని చదివేవారు కనుకనే నేను వాటిని చదివేవాడనన్నది నాకు గుర్తుంది” అని డా. తియోడోర్ ఐసక్ రూబిన్ చెబుతున్నాడు. పుస్తకాలు సులభంగా లభ్యమైతే పిల్లలు చదువుతారు. పుస్తకాలు తమ వ్యక్తిగత గ్రంథాలయంలోనివైతే చదవాలనే ఉత్సాహం ఇంకా ఎక్కువగా ఉంటుంది.
చదవడం మరింత ఉల్లాసకరంగా ఉండేలా చేయండి. బిడ్డ చదవడానికి ఇష్టపడుతున్నట్లయితే, నేర్చుకోవడానికి చేసే పోరాటంలో సగం జయించినట్లే అని చెప్పబడుతుంది. కనుక చదవడమనేది మీ పిల్లలకు ఒక ఆహ్లాదకరమైన అనుభవంగా చేయండి. ఎలా? మొదటిగా, దూరదర్శినిని చూసే సమయాన్ని పరిమితం చేయండి; అది చదివే సమయాన్ని తీసుకుంటుంది. రెండవదిగా, చదవడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించండి; ప్రశాంతమైన సమయాలు, మంచి వెలుతురుగల వ్యక్తిగత గ్రంథాలయం వంటి ప్రశాంతమైన స్థలాలు చదవడాన్ని పురికొల్పుతాయి. మూడవదిగా, చదవమని బలవంతం చేయవద్దు. చదివేందుకు, పుస్తకాలను, అవకాశాలను కల్పించండి, అయితే, చదవాలనే కోరికను వృద్ధి చేసుకునేందుకు బిడ్డను అనుమతించండి.
కొందరు తలిదండ్రులు చాలా చిన్న వయస్సులోనే తమ పిల్లల కొరకు చదివి వినిపించడం మొదలు పెడతారు. ఇది ప్రయోజనకరంగా ఉండగలదు. బిడ్డకు మూడేండ్ల వయస్సు వచ్చేసరికి, సాధారణంగా పెద్దలు ఉపయోగించే సామాన్య భాషలోని పదాలను సాఫీగా పలకలేకపోయినప్పటికీ, భాషను దాదాపుగా అర్థం చేసుకుంటాడు. “పిల్లలు ఒక భాషను మాట్లాడడం నేర్చుకునేదానికన్నా ఎంతో వేగంతో చాలా చిన్నప్పుడే దానిని అర్థం చేసుకోవడం నేర్చుకోనారంభిస్తారు” అని ది ఫస్ట్ త్రీ ఇయర్స్ ఆఫ్ లైఫ్ అనే పుస్తకం చెబుతుంది. బైబిలు తిమోతి గురించి ఈ విధంగా చెబుతుంది: ‘పరిశుద్ధ లేఖనములను శైశవం (ఇన్‌ఫెన్సీ) నుండి నీ వెరుగుదువు.’ (2 తిమోతి 3:15) ఇన్‌ఫెంట్ అనే పదం ఇన్‌ఫెన్స్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది, దాని భావం “మాట్లాడనివాడు.” అవును, తిమోతి తాను లేఖనాల్లోని పదాలను పలకడానికి చాలా ముందే వాటిని విన్నాడు.
బైబిలు—శ్రేష్ఠమైన సహాయకం
“బైబిలు అనేది భక్తిపూర్వకభయాన్ని కలిగించే సాహిత్య సేకరణ” అని ది బైబిల్ ఇన్ ఇట్స్ లిటెరరీ మిల్యు అనే పుస్తకం చెబుతుంది. నిజంగా, దాని 66 పుస్తకాల్లో యౌవనస్థులు వృద్ధులు ఒకేలా నేర్చుకోగల పద్య రూపాలు, పాటలు, చరిత్రాత్మక వృత్తాంతాలు ఉన్నాయి. (రోమీయులు 15:4) అంతేకాక, బైబిలు ‘దైవావేశము వలన కలిగిన లేఖనము, అది ఉపదేశించుటకును ఖండించుటకును తప్పు దిద్దుటకును నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.’—2 తిమోతి 3:16.
అవును, చదవవలసిన ముఖ్యమైన పుస్తకం దేవుని వాక్యమైన బైబిలే. మంచి కారణంతోనే ప్రతి ఇశ్రాయేలు రాజు లేఖనాల వ్యక్తిగత ప్రతిని కలిగి ఉండాలని, ‘తాను బ్రదుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుతూ ఉండాలని’ కోరబడింది. (ద్వితీయోపదేశకాండము 17:18; ద్వితీయోపదేశకాండము17:22) లేఖనాలను “ధ్యానిస్తూ” తన కొరకు నెమ్మది స్వరంతో “దివారాత్రము” చదవాలని యెహోషువ కోరబడ్డాడు.—యెహోషువ 1:8.
బైబిలులోని భాగాలు చదవడానికి సులభం కాదని ఒప్పుకోవలసిందే. వాటికి ఏకాగ్రత అవసరమవ్వవచ్చు. పేతురు వ్రాసినది గుర్తుంచుకోండి: ‘క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాల కొరకైన అపేక్షను కలుగజేసుకొనుడి.’ (1 పేతురు 2:2) అభ్యాసము వలన, దేవుని వాక్యమైన “పాల” ఎడల కలిగే వాంఛ శిశువు తన తల్లి పాల కొరకు జన్మ సిద్ధంగా అపేక్షించినట్లే సహజం కాగలదు. బైబిలు చదివే విషయంలో మెప్పుదలను అలవరచుకోవచ్చు.c అది ప్రయత్నించతగినది. “నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది” అని కీర్తన రచయిత వ్రాశాడు. (కీర్తన 119:105) మన కష్ట సమయాల్లో మనకందరికీ అలాంటి నడిపింపు అవసరం లేదా?
[అధస్సూచీలు]
a పఠననిరాసక్తత (అలిటరసీ) అనేది, “చదవడంలోని, వ్రాయడంలోని అసమర్థతయైన నిరక్షరాస్యత (ఇల్లిటరసీ)” అని భావించకూడదు.
b వాచ్‌టవర్ సొసైటీ దీనిని గుర్తించి, ముద్రించబడిన సమాచారంతో పాటు విభిన్న బైబిలు సంబంధ అంశాలపైన వీడియో క్యాసెట్లను ఇటీవలి సంవత్సరాల్లో అందజేసింది.
c బైబిలు జ్ఞానం కొరకు అపేక్షను కలుగజేసుకోవడానికి మీ పిల్లలకు సహాయపడడానికి నా బైబిలు కథల పుస్తకము (ఆంగ్లం) మరియు గొప్ప బోధకున్ని వినడం (ఆంగ్లం) వంటి సరళమైన బైబిలు పఠన సహాయకాలను వాచ్‌టవర్ సొసైటీ తయారు చేసింది. రెండు పుస్తకాలు ఆడియో క్యాసెట్లలో కూడా లభ్యమవుతాయి.