బైబిలు ఉద్దేశము
మరియ “దేవుని మాత”యా?
“ఓ దేవుని మాతా, మీ కృపా రక్షణలో మేము శరణుజొచ్చియున్నాము; అవసరతలో మా ప్రార్థనను నిరాకరించవద్దు, కాని మమ్మల్ని వినాశనము నుండి రక్షించుము, ఓ నీవు మాత్రమే అనుగ్రహించబడిన దానవు.”
అలాంటి ప్రార్థన యేసుక్రీస్తు తల్లియైన మరియకు తమను తాము అర్పించుకున్న కోట్లకొలది స్త్రీ పురుషుల మానసిక భావాలను సంగ్రహపరుస్తుంది. వాళ్ళ దృష్టిలో వారి కొరకు దేవునితో వాదించగల, ఆయన తీర్పుల తీక్షణతను ఏదొక విధంగా తగ్గించగల దయగల తల్లి రూపం ఆమెది.
అయితే, మరియ నిజంగా “దేవుని మాత”యా?
మరియ—దేవునిచేత “అధికంగా ఆశీర్వదించబడింది”
నిస్సందేహంగా మరియ “అధికంగా ఆశీర్వదించబడింది”—ఎంతో ఆశీర్వదించబడింది, నిజానికి, జీవించిన మరే స్త్రీ కన్నా అధికంగా ఆశీర్వదించబడింది. (లూకా 1:28, ది జెరుసలేము బైబిలు) గబ్రియేలు దూత ఆమెకు ప్రత్యక్షమై ఆమె ఎంత ఆధిక్యతనొందినదై ఉంటుందో వివరించాడు. “ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు; ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును” అని ఆయన అన్నాడు. ఈ అద్భుత సంఘటన ఎలా సాధ్యమయ్యింది? గబ్రియేలు ఈ విధంగా కొనసాగించాడు: “పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.”—లూకా 1:31, 32, 35.
“అందుకు మరియ—ఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను.” (లూకా 1:38) అలా మరియ వినయంగా ఈ దైవిక నిర్దేశాన్ని అంగీకరించి, సకాలంలో యేసుకు జన్మనిచ్చింది.
అయినప్పటికీ, తరువాత అనేక శతాబ్దాల్లో ఆమె భక్తులు ఆమెను “ప్రభువు దాసురాలు” అనే స్థానం నుండి పరలోకంలో అపారమైన ప్రభావం గల “రాణీ మాత” అనే స్థానానికి హెచ్చించారు. చర్చి నాయకులు ఆమెను సా.శ. 431 లో ఎఫెసునందలి కౌన్సిల్‌లో “దేవుని మాత” అని అధికారికంగా ప్రకటించారు. ఈ రూపాంతరానికి కారణమేమిటి? పోప్ జాన్ పౌల్ II ఒక కారకాన్ని ఈ విధంగా వివరిస్తున్నాడు: “దేవుని తల్లి ఎడల నిజమైన భక్తి . . . పవిత్ర త్రిత్వం యొక్క మర్మంలో లోతుగా నాటుకుంది.”—క్రాసింగ్ ది త్రిషోల్డ్ ఆఫ్ హోప్.
కనుక, మరియను “దేవుని మాత” గా అంగీకరించడమనేది త్రిత్వంపై ఆధారపడి ఉంటుంది. అయితే, త్రిత్వమనేది బైబిలు బోధనా?a బైబిలులో అపొస్తలుడైన పేతురు ఏమని వ్రాశాడో దయచేసి పరిశీలించండి. “అబద్ధబోధకులు . . . కుయుక్తితో అపాయకరమైన మత సిద్ధాంతాలను ప్రవేశపెడుతూ, తమ అబద్ధ వాదాలతో మిమ్మల్ని మోసగించడానికి ప్రయత్నం చేస్తారు.” (2 పేతురు 2:1, 3, జె. బి. ఫిలిప్స్ యొక్క ఆధునిక ఆంగ్లంలోని క్రొత్త నిబంధన) త్రిత్వ బోధ అలాంటి ఒక మత సిద్ధాంతం. మరియ “దేవుని మాత” (గ్రీకు: తియోటొకోస్, అంటే “దేవునికి జన్మనిచ్చే”) అనే తలంపు ఎంతో సహేతుకమని ఒకప్పుడు అంగీకరించబడింది. ది వర్జిన్ అనే తన పుస్తకంలో జెఫ్రీ ఆష్ చెప్పేదేమంటే, త్రిత్వ సిద్ధాంతాన్ని విశ్వసించేవారు తర్కించే ప్రకారం “క్రీస్తు త్రిత్వంలోని దేవుడైతే, రెండవ వ్యక్తియైతే, ఆయన మానవునిగా వచ్చినప్పటి ఆయన తల్లి దేవుని తల్లి అవుతుంది.”
క్రొత్త కాటకిసమ్ ఆఫ్ ది కాథలిక్ చర్చ్ చెబుతున్నట్లు, యేసు “పూర్ణంగా దేవుడు మరియు పూర్తిగా దేవుడు” అయితే మరియను “దేవుని మాత” అని సముచితంగానే పిలువవచ్చు. అయితే, ఈ సిద్ధాంతం మొదట ఆవిష్కరించబడినప్పుడు త్రిత్వ విశ్వాసం గల నేటి ప్రొటెస్టెంట్ల వలెనే తొలి త్రిత్వ విశ్వాసులు కూడా ఈ బోధను అంగీకరించడం చాలా కష్టమని కనుగొన్నారని చెప్పవలసిందే. “ ‘పరలోకంలో పట్టజాలని ఆయన ఆమె ఉదరంలో పట్టాడు’ అన్నది భక్తికి సంబంధించిన అసత్యాభాసము” అని పిలువబడుతుంది. (ది వర్జిన్)—1 రాజులు 8:27 ను పోల్చండి.
యేసు క్రీస్తు నిజంగా “పూర్ణంగా దేవుడు మరియు పూర్తిగా దేవుడా”? లేదు, ఆయన ఎన్నడూ అలా చెప్పుకోలేదు. బదులుగా, ఆయన ఎల్లప్పుడూ, తన తండ్రి ముందు తన తక్కువ స్థానాన్ని గుర్తించాడు.—మత్తయి 26:39; మార్కు 13:32; యోహాను 14:28; 1 కొరింథీయులు 15:27, 28 చూడండి.
‘ఆలోచనాపరులకు తగిన విధంగా ఆరాధించండి’
అయితే, క్రైస్తవులు తమ తార్కిక శక్తిని ఉపయోగించాలని బైబిలు ప్రోత్సహిస్తుంది. మర్మం ముసుగులో ఉన్నదానిని గ్రుడ్డిగా విశ్వసించాలని మనం కోరబడలేదు. బదులుగా, మనం ‘ఆలోచనాపరులకు తగిన విధంగా ఆరాధించాలి’ అని అపొస్తలుడైన పౌలు చెబుతున్నాడు.—రోమీయులు 12:1, జెబి.
“మేమెన్నడూ దాని గూర్చి తలంచడానికి ప్రోత్సహించబడలేదు. మేమెన్నడూ ప్రశ్నించలేదు. యేసు దేవుడని మేము కేవలం విశ్వసించాం, కనుక మరియ ‘దేవుని మాత’ అని విశ్వసించాం—అది ఎంతో ఆశ్చర్యకరమైన విషయం!” అని కాథోలిక్‌గా పెంచబడిన ఆన్ అంటుంది. “దైవిక ఐక్యత” లోని ప్రతి సభ్యుడు “పూర్ణంగా దేవుడు మరియు పూర్తిగా దేవుడు” అని కాటకిసమ్ ఆఫ్ ది కాథలిక్ చర్చ్ చెబుతుందని గుర్తుచేసుకోండి. ముగ్గురు వేరువేరు దేవుళ్ళు లేరు అని అది చెబుతుంది. మరియ ఉదరంలో జీవిస్తున్న కణాలు విభజించబడి, తిరిగి విభజించబడి, “పూర్ణంగా మరియు పూర్తిగా దేవుడు” గర్భస్థ పిండంలో ఉన్నాడని, ఆమె గర్భం యొక్క మొదటి నెలలో పావు అంగుళం కన్నా తక్కువ పొడవుకు పెరిగాడని, కళ్ళు చెవులు ప్రాథమిక దశలోనే ఉండేవని మనం నమ్మాలా?
మరియ కుమారుడు “సర్వోన్నతుని కుమారుడు” అని “దేవుని కుమారుడు” అని పిలువబడుతాడని గబ్రియేలు దూత ఆమెతో చెప్పాడు కాని, “కుమారుడైన దేవుడు” అని పిలువబడుతాడని చెప్పలేదని గుర్తుంచుకోండి. నిజానికి, యేసు సర్వశక్తిమంతుడైన దేవుడైతే, నేటి త్రిత్వవాదులు ఉపయోగించిన “కుమారుడైన దేవుడు” అనే అదే పదాన్ని గబ్రియేలు దూత ఎందుకు ఉపయోగించలేదు? బైబిలులో అలాంటి బోధ లేదు గనుకనే గబ్రియేలు ఆ పదాన్ని ఉపయోగించలేదు.
నిజమే, దేవుని పనులను గూర్చిన మన అవగాహనలో మనకు పరిమితులున్నాయి. కాని, సర్వశక్తిమంతుడైన దేవుడు, జీవమంతటి సృష్టికర్త తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు జీవాన్ని మరియ ఉదరంలోనికి మార్చడానికి, దేవుని కుమారుడైన యేసుకు మరియ తల్లి అయ్యేంతవరకు తన చురుకైన శక్తి ద్వారా దాని పెరుగుదలను రక్షించేందుకు అద్భుతమైన శక్తి కలిగి ఉన్నాడని నమ్మడానికి లేఖనాల సరైన అవగాహన మనకు సహాయం చేస్తుంది.
అవును, క్రీస్తుగా అయిన వ్యక్తికి తల్లి అయ్యేంతటి గొప్ప ఆశీర్వాదం మరియకు లభించింది. “దేవుని మాత” అనే బిరుదునివ్వడాన్ని నిరాకరించడం—మరియ యొక్క స్వంత దీనత్వాన్ని గూర్చిన వృత్తాంతంతో సహా ఉన్న స్పష్టమైన బైబిలు బోధను అంగీకరించడం ఆమెకు అగౌరవాన్ని చూపడం కాదు.
[అధస్సూచి]
a వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించిన త్రిత్వమును మీరు నమ్మవలయునా? దయచేసి చూడండి.
[Picture Credit Line on page 24]
Museo del Prado, Madrid