మన కాలంలో ఎంతో అనాదరణకు గురైన చిత్రకారుడు
“ప్రకృతి దేవుని కళ.”—సర్ థామస్ బ్రవున్, 17వ శతాబ్దపు వైద్యుడు.
లియోనార్డో డా విన్సీ, రెమ్బ్రాంట్, వాన్ గోష్—ఈ పేర్లు కోట్లాదిమందికి తెలిసినవి. మీరు వారు వేసిన చిత్రాల్లోని మొదటి వాటిని ఎన్నడూ చూడక పోయినప్పటికీ, గొప్ప చిత్రకారులుగా ఈ వ్యక్తులు మీకు తెలుసు. ఒక విధంగా చెప్పాలంటే వారి కళ వారిని అమర్త్యులను చేసింది.
వారు క్యాన్వాస్పై, ఇప్పటికీ చూపరుల ఊహను స్పర్శించే వాటిని, అంటే ఓ మంత్రించే నవ్వును, భావాలను తాకే చిత్రాన్ని, సృష్టిలోని సౌందర్యం యొక్క ఒక మచ్చుతునకను అలాగే బంధించి ఉంచారు. మనల్ని శతాబ్దాలు దూరపర్చినప్పటికీ—వారిని ఏది వశీకరించిందో దానిచేత మనం వశీకరింపబడ్డాము.
మనం చిత్రకారులం లేక చిత్ర విమర్శకులం కాకపోవచ్చు, అయినప్పటికీ మనం కళలోని గొప్పతనాన్ని తెలుసుకోవచ్చు. మనం ఎవరి పనినైతే పొగుడుతామో ఆ చిత్రకారుని వలెనే, మనకు కూడా అందాన్ని గురించి కొంత తెలుసు. రంగు, ఆకృతి, నమూనా మరియు వెలుగును గుర్తించగల మన ఇంద్రియ శక్తిని కొన్నిసార్లు మనం అలక్ష్యం చేస్తాం, అయితే అది మన జీవితంలో ఒక భాగం. కంటికి అందంగా కనిపించే వస్తువులతో లేక చిత్రకళలతో మన ఇళ్లను అలంకరించుకోవాలని మనం ఇష్టపడటంలో ఆశ్చర్యంలేదు. అభిరుచులు భిన్నంగా ఉన్నా, అందాన్ని గుర్తించగల ఈ ఇంద్రియశక్తి అనేది మానవజాతిలో అత్యధికులు కలిగున్న బహుమానమే. మనల్ని మన సృష్టికర్తకు దగ్గర చేయగల బహుమానం అది.
అందం యొక్క బహుమానం
మానవజాతిని జంతువుల నుండి విభిన్నంగా ఉంచే అనేక గుణలక్షణాల్లో అందాన్ని గుర్తించగల ఇంద్రియ శక్తి ఒకటి. సుమా ఆర్టిస్—హిస్టోరియా జెనెరల్ డెల్ ఆర్టె (కాంప్రిహెన్సివ్ ట్రీటైస్ ఆఫ్ ఆర్ట్—ఎ జెనరల్ హిస్టరీ ఆఫ్ ఆర్ట్) అనే ఒక గ్రంథం “అందాన్ని చూడగల సామర్థ్యమున్న జంతువుగా మనిషిని నిర్వచించవచ్చని” సూచిస్తుంది. మనం జంతువులనుండి భిన్నంగా ఉన్నాం గనుక మనం సృష్టిని వేరే దృక్కోణంతో చూస్తాం. ఒక అందమైన సూర్యాస్తమయాన్ని ఓ కుక్క గుణగ్రహిస్తుందా?
మనల్ని ఆ విధంగా ఎవరు చేశారు? “దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను,” అని బైబిలు వివరిస్తుంది. (ఆదికాండము 1:27) మన తొలి తలిదండ్రులు దేవునిలా ఉండిరని కాదు. దానికి బదులు, తాను కలిగివున్న లక్షణాలను దేవుడు వారికి కూడా ఇచ్చాడని దానర్థం. అందాన్ని గుణగ్రహించగల సామర్థ్యం వాటిలో ఒకటి.
కొంత లోత్తెన ప్రక్రియ ద్వారా మానవ మెదడు అందాన్ని గ్రహిస్తుంది. మొదటిగా, మన అవధానాన్ని ఆకర్షించే వస్తువుల ధ్వనులను, వాసనలను, రంగులను మరియు ఆకారాలను గూర్చిన సమాచారాన్ని మన ఇంద్రియాలు మన మెదడుకు అందజేస్తాయి. అయితే అందమనేది, మనచుట్టూ ఏమి జరుగుతుందో మాత్రమే చెప్పగల విద్యుత్రసాయనిక ప్రేరకాల మొత్తంకన్నా ఎంతో ఎక్కువే. వృక్షాన్ని, పువ్వును లేక పక్షిని, ఓ జంతువు చూసినట్లుగా మనం చూడం. ఈ వస్తువులు మనకు ఎలాంటి తక్షణ ఆచరణాత్మక ప్రయోజనాలను ఇవ్వకపోయినప్పటికీ, మనకు ఉల్లాసాన్నైతే తప్పక ఇస్తాయి. వాటి సౌందర్య విలువను గ్రహించడానికి మన మెదడు మనకు వీలుకలిగిస్తుంది.
ఈ సామర్థ్యత మన భావోద్రేకాలను స్పర్శించి, మన జీవితాలను స్ఫూర్తివంతం చేస్తుంది. స్పెయిన్లో నివసించే మేరి, అనేక సంవత్సరాల క్రితం తను ఒక సుదూర సరస్సు ప్రక్కన నిల్చుని సూర్యాస్తమయాన్ని గమనించిన ఓ నవంబరు నెల సంధ్యాకాలాన్ని ఆమె స్పష్టంగా జ్ఞాపకం చేసుకుంటుంది. “కొంగలు ఒకదానితో ఒకటి మాట్లాడుతూ తెరలుతెరలుగా ఎగురుతూ నా వైపుకు వచ్చాయి. కెంపువర్ణ ఆకాశంనిండా వేలకొలది పక్షులు వెడల్పుగా సాలెగూడు ఆకారంలో ఎగురుతూ వెళ్లాయి. రష్యా మరియు స్కాండినేవియా నుండి మొదలైన వాటి సాంవత్సరిక వలసప్రయాణం, వాటిని తమ ఈ స్పానిష్ విరామస్థలానికి తీసుకువచ్చాయి. ఆ అనుభవం ఎంత అందంగా ఉండినదంటే అది నాకు ఏడుపొచ్చేలా చేసిందని” ఆమె చెబుతుంది.
సౌందర్యం యొక్క బహుమానం ఎందుకు?
సౌందర్యాన్ని గుర్తించగల ఇంద్రియ శక్తి, కొంతమంది ప్రజలను, వివేకవంతులైన తన సృష్టి ప్రాణులు తన కళాఖండాలను చూసి ఆనందించాలని ఇష్టపడే ప్రేమపూర్వకమైన సృష్టికర్త ఉనికి వైపుకు వారి అవధానాన్ని స్పష్టంగా మళ్లిస్తుంది. సౌందర్యాన్ని గుర్తించగల మన ఇంద్రియ శక్తిని ఒక ప్రేమపూర్వక సృష్టికర్తకు ఆపాదించడం ఎంత సహేతుకం, సంతృప్తిదాయకం. “దేవుడు ప్రేమాస్వరూపి” అని బైబిలు వివరిస్తుంది, మరి పంచుకోవడమే ప్రేమ యొక్క పరమార్థం. (1 యోహాను 4:8; అపొస్తలుల కార్యములు 20:35) తన సృజనాత్మక కళను మనతో పంచుకునేందుకు యెహోవా ఎంతో ఆనందించాడు. ఒక సంగీత మహాగానాన్ని ఎన్నడూ వినకుంటే లేక ఒక మహత్తరమైన చిత్రాన్ని ఎన్నడూ చూడకుంటే వాటి సౌందర్యం నశించిపోయినట్లే. కళను పంచుకుని, ఆనందించడానికే అది సృష్టించబడింది—ప్రేక్షకులు లేకుంటే అది నిర్జీవమైనదే.
అవును, అందమైన వస్తువులను యెహోవా ఒక సంకల్పంతో సృష్టించాడు, అంటే వాటిని పంచుకుని, ఆనందించాలనే సంకల్పంతోనే సృష్టించాడు. వాస్తవానికి, మన మొదటి తలిదండ్రుల గృహం ఏదెను అని పిలువబడే ఒక విశాలమైన పరదైసు వనం—దాని అర్థం “సంతోషం.” దేవుడు భూమిని తన కళాఖండాలతో నింపడమే కాక దాన్ని గమనించి, గుణగ్రహించే సామర్థ్యాన్ని కూడా ఆయన మానవజాతికి ఇచ్చాడు. మరి తిలకించేందుకు ఎంతటి సౌందర్య సంపద ఉందో! “విశ్వాన్ని ఆసక్తికరంగా అలాగే ఫలవంతంగా చేసేందుకు ప్రకృతి తాను ‘ప్రత్యేక ప్రయత్నం’ చేస్తుందేమో అని కొన్నిసార్లు అనిపిస్తుందని” పాల్ డేవిస్ గమనించి చెప్పాడు. దాన్ని మనం అధ్యయనం చేసి ఆనందించగల సామర్థ్యంతో మనల్ని సృష్టించేందుకు యెహోవా ‘ప్రత్యేక ప్రయత్నం’ చేశాడు గనుకనే మనకు ఈ విశ్వం కచ్చితంగా ఆసక్తికరంగా, ఫలవంతంగా ఉన్నది.
ప్రాకృతిక సౌందర్యాన్ని గుర్తించడం—మరియు దానికి సాటియైన దాన్ని చేయాలన్న కోరిక—గుహల్లోని చిత్రకారుని నుండి సాహిత్య చిత్రకళా విధానం వరకూ అన్ని సాంప్రదాయాల్లో ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించదు. వేల సంవత్సరాల పూర్వం, ఉత్తర స్పెయిన్ నివాసులు కెన్టాబ్రియానందలి అల్టామిరా గుహల్లో జంతువుల స్పష్టమైన, వివరమైన చిత్రాలను గీశారు. ఒక శతాబ్దంకంటే పూర్వం, సాహిత్య చిత్రకారులు తమ స్టూడియోలనుండి బయటకు వచ్చి, పూల వనంలో రంగుల ప్రదర్శనను లేక నీటిపై వెలుగు నమూనాల మార్పును కెమేరాలో బంధించేందుకు ప్రయత్నించారు. చిన్న పిల్లలకు కూడా చక్కగా ఉండే ఈ సంగతులను గురించి బాగా తెలుసు. వాస్తవానికి, వాళ్లలో చాలామంది పిల్లలకు క్రెయాన్లను, కాగితాన్ని ఇస్తే తమ ఊహను ఆకర్షించే వాటిని దించడానికి ఇష్టపడతారు.
ఈ దినాల్లో, అనేకమంది పెద్దలు తమను ప్రభావితం చేసిన అందమైన దృశ్యాన్ని మళ్లీ జ్ఞాపకం చేసుకునేందుకు ఒక ఫోటో తీసుకోడానికి ఇష్టపడతారు. అయితే కెమేరా లేకుండా కూడా, మనం దశాబ్దాల క్రితం చూసిన అందమైన దృశ్యాలను కూడా మన మనస్సు మళ్లీ జ్ఞాపకం చేసుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. తాను ఎంతో విస్తారంగా అలంకరించిన మన భూగృహాన్ని ఆనందించే సామర్థ్యంతో దేవుడు మనల్ని సృష్టించాడన్నది స్పష్టం. (కీర్తన 115:16) సౌందర్యాన్ని గుర్తించగల ఇంద్రియ శక్తిని దేవుడు మనకు ఇవ్వడంలో మరో కారణం కూడా ఉంది.
‘ఆయన లక్షణాలు తేటపడుతున్నాయి’
ప్రకృతిలో ఉన్న కళపట్ల మన మెప్పును విశాలం చేసుకోవడం, మనచుట్టూ ఎవరి హస్తకళలు ఉన్నాయో ఆ సృష్టికర్తను మనం ఎక్కువగా తెలుసుకోడానికి మనకు సహాయం చేయగలదు. గలిలయ చుట్టుప్రక్కల పెరుగుతున్న పిచ్చిపూలను నిశితంగా చూడమని యేసు ఒక సందర్భంలో తన శిష్యులకు చెప్పాడు. “అడవిపువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడకవు అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదానివలెనైనను అలంకరింపబడలేదు” అని ఆయన చెప్పాడు. (మత్తయి 6:28, 29) మానవకుటుంబం యొక్క అవసరతలపట్ల దేవుడు అశ్రద్ధ కలిగి లేడని మనకు జ్ఞాపకం చేయడానికి, ఒక అల్పమైన పిచ్చిపువ్వు యొక్క అందం పనికి వస్తుంది.
మనం ఒక వ్యక్తిని అతని ‘ఫలాలను,’ లేక పనులను బట్టి తీర్పు తీర్చగలమని కూడా యేసు చెప్పాడు. (మత్తయి 7:16-20) అలా, దేవుని కళా పని ఆయన వ్యక్తిత్వాన్ని గురించిన అంతర్దృష్టిని మనకిస్తుందని అపేక్షించడం ఎంతో సబబు. ‘జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడే . . . ఆయన లక్షణాలు’ కొన్ని ఏవి?—రోమీయులు 1:20.
“యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి! జ్ఞానముచేత నీవు వాటన్నిటిని నిర్మించితివి,” అని కీర్తనల గ్రంథకర్త ఆశ్చర్యంతో పలికాడు. (కీర్తన 104:24) భూమి యొక్క పుష్ప మరియు జంతు సమూహాన్ని “చిత్రించడానికి” ఆయన ఉపయోగించిన రంగులలో కూడా దేవుని జ్ఞానాన్ని గుర్తించవచ్చు. “రంగు మనస్సుకు, కళ్లకు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుందని,” కొలర్, డిసెగ్నో ఎడ్ ఎస్టెటికా నెల్’ఆర్ట్ ప్రాఫికా (రంగు—వివరమైన కళలో రూపం మరియు అందాలు) అనే తమ పుస్తకంలో ఫాబ్రిస్, గెర్మానీ సూచిస్తున్నారు. కళ్లకు చక్కగా కనిపించి స్ఫూర్తినిచ్చే, సమంగా, భిన్నంగా ఉన్న రంగులు అన్ని చోట్లా ఉన్నాయి. అయితే, ఎక్కువ ఆకర్షణీయంగా కనిపించే రంగుల ప్రభావాలు సప్తవర్ణాల ద్వారా ఉత్పన్నం చేయబడినవే అయ్యుండవచ్చు—ప్రకాశవంతమైన వర్షధనుస్సువంటి రంగులు—జ్ఞానవంతమైన రూపకల్పనకు ఒక శక్తివంతమైన ఉదాహరణ.
సప్తవర్ణాలు ప్రాముఖ్యంగా తేనెపిట్టలలో సాధారణంగా ఉంటాయి.a వాటి ఈకలను అంత ప్రకాశవంతం చేసేది ఏది? వాటి ఈకలలో పైనుండి మూడవ వరుస—ఒక పట్టకంవలె—సూర్యకాంతిని వర్షధనుస్సు వంటి రంగులలోకి విభజిస్తుంది. నగవంటి ఈ తేనెపిట్టను అలంకరించే మిరుమిట్లుగొలిపే ఎర్ర, నీలం మరియు ఆకుపచ్చ రంగులకు, ఈ పక్షికున్న ముద్దు పేర్లయిన కెంపు, ఇంద్రనీలం, మరకతం బాగా సరిపోతాయి. “ఈ విశిష్టమైన ప్రాణుల మహత్తరమైన సౌందర్యం యొక్క సంకల్పమేమిటి?” అని హమ్మింగ్ బర్డ్స్ అనే తన పుస్తకంలో సారా గాడ్విన్ అడుగుతుంది. “విజ్ఞానశాస్త్రం నిర్ధారించేంత మేరకు, చూపరి కళ్లను మిరుమిట్లుగొలపడం కంటే ఈ భూమిపై మిగతా ఏ సంకల్పమూ లేదని” ఆమె చెబుతుంది. ఏ మానవ చిత్రకారుడు కూడా ఇంతవరకూ అలాంటి రంగుల పలకను ఉపయోగించ లేదన్నది నిశ్చయం!
ఉద్ధృతంగా పడుతున్న జలపాతంలో, ఎగిసే అలల్లో, నురగలు కక్కుతూ ఘోషిస్తున్న కెరటంలో, లేక ఒక అడవిలోని శక్తివంతమైన వీదురు గాలికి ఊగిసలాడుతున్న ఆకాశాన్నంటే చెట్లలో మనం దేవుని శక్తిని తెలుసుకోగలం. ఈ శక్తివంతమైన కళాఖండాలు ఒక ప్రశాంతమైన దృశ్యమంత ప్రభావవంతంగా ఉండగలవు. కాలిఫోర్నియా యొక్క సెయిరా నివేడాలోనున్న డగ్లస్ ఫర్ అనే పొడువైన చెట్ల గుంపుపై ఒకప్పుడు గాలివాన ప్రభావం ఎలా ఉండిందో అమెరికా యొక్క ప్రఖ్యాత ప్రకృతి శాస్త్రజ్ఞుడు జాన్ మ్యుయర్ వివరించాడు:
“అవి చిన్నగా ఉన్నప్పటికీ, 100 గజాల పొడవు ఉన్నాయి, మరి వాటి నాజూకైన, కుంచెవంటి మొదళ్లు ఆ పరమానందంలో ఊగిసలాడుతూ, గిరులు తిరిగాయి. . . . ఆ లేత మొదళ్లు ఆ రసవత్తరమైన వానలో కదులుతూ హుష్మనే శబ్దంతో, వెనక్కి ముందుకూ గుండ్రంగా వంగుతూ తిరుగుతూ నిటారైన అడ్డమైన కదలికల అనుహ్యమైన కూర్పుతో కదిలాయి.” వేల సంవత్సరాల క్రితం కీర్తనల గ్రంథకర్త వ్రాసినట్లు, ‘తుపాను యెహోవాను స్తుతిస్తుంది’—ఆయన అసాధారణశక్తికి ఒక మచ్చుతునకను అది మనకు చూపుతుంది.—కీర్తన 148:7, 8.
జపానీయులకు పక్షి ఎల్లప్పుడూ ప్రేమకు సూచనగా ఉంటూంది. అందమైన జపాన్ కొంగలు, జత కూడేటప్పుడు చేసే గొప్ప నృత్యాలు ఒక నృత్యనాటికంత మహత్తరంగా ఉంటాయి. ఈ విహంగ నటీనటులు ఎంత విలువైనవిగా ఎంచబడతాయంటే, అవి జపాన్లో “ప్రత్యేక ప్రకృతి చిహ్నాలుగా” నియమించబడ్డాయి. కొంగలు జత కూడితే జీవితాంతం కలిసి ఉంటాయి, అవి 50 సంవత్సరాలు జీవిస్తాయి గనుక, జపానీయులు వాటిని వైవాహిక విశ్వాస్యతకు మూలరూపంగా భావిస్తారు.
దేవుని ప్రేమ విషయమేంటి? యెహోవా తన యథార్థ సేవకులను ప్రేమపూర్వకంగా కాపాడటాన్ని, తల్లి పక్షి తన పిల్లలను ప్రకృతి వైపరీత్యాలనుండి కాపాడటానికి తన రెక్కలను కప్పడంతో బైబిలు పోల్చడం ఎంతో ఆసక్తికరం. “తన గూడు రేపి పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని” మోసే గ్రద్ద గురించి ద్వితీయోపదేశకాండము 32:11 మాట్లాడుతుంది. పిల్లలు గూడు వదలి ఎగురడాన్ని ప్రోత్సహించేందుకు తల్లి గ్రద్ద ఈ పనులు చేస్తుంది. పిల్లలను తన రెక్కలపై మోసుకెళ్లడం ద్వారా వాటికి సహాయం చేసే గ్రద్దలు చాలా తక్కువగా కనిపించినప్పటికీ అలా జరిగిందని నివేదించబడింది.—కీర్తన 17:8.
మన చుట్టూ ఉన్న ప్రాకృతిక ప్రపంచాన్ని మనం నిశితంగా పరిశీలిస్తుంటే, అక్కడ పని చేసే కొన్ని నియమాలు దేవుని వ్యక్తిత్వపు అంశాలను కూడా బయల్పర్చుతాయి.
వైవిధ్యమే జీవితాభిరుచి
దేవుని పనితనంలో వెంటనే స్పష్టమయ్యే ఒక అంశమే వైవిధ్యం. మొక్కలు, పక్షులు, జంతువులు మరి పురుగుల రకాలు విరివిగా ఉన్నాయి. కేవలం రెండున్నర ఎకరాల ఉష్ణమండల అడవిలోనే 300 విభిన్న జాతుల వృక్షాలు, 41,000 జాతుల పురుగులు ఉండవచ్చు; మూడు చదరపు కిలోమీటర్లలో 1,500 రకాల సీతాకోకచిలుకలు ఉండవచ్చు; మరి ఒక వృక్షం మాత్రమే 150 జాతుల పేడ పురుగులకు నిలయం కావచ్చు! ఒకేలా ఉండే ఇద్దరు మనుష్యులు ఎక్కడా లేనట్లే, అదే విషయాన్ని సింధూర వృక్షాలు లేక పులుల గురించి చెప్పవచ్చు. మానవ చిత్రకారులు ఎంతో గొప్పగా ఎంచే లక్షణమైన సహజత్వం, ప్రకృతి లోలోపల ఇమిడిపోయిన ఒక భాగం.
మనం ప్రకృతి కళలో కేవలం కొన్ని అంశాలను మాత్రమే గమనించాం. దాన్ని మరింత నిశితంగా పరిశీలించడం ద్వారా, మనం దేవుని వ్యక్తిత్వంలో అనేక ఇతర అభిముఖాలను వివేచించగలం. అయితే అలా చేసేందుకు, దేవుడు మనకిచ్చిన కళను గుర్తించగల ఇంద్రియ శక్తికి మనం పని చెప్పాలి. మహాగొప్ప చిత్రకారుని కళను మేలైన రీతిలో గుణగ్రహించడాన్ని మనమెలా నేర్చుకోగలం?
[అధస్సూచీలు]
a ఉష్టమండల అమెరికాలోని ప్రభావవంతమైన నీలపు మార్ఫోస్ వంటి అనేక సీతాకోక చిలుకలు తమ రెక్కలపై సప్తవర్ణాలవంటి ఛాయలను కలిగి ఉన్నాయి.
[22వ పేజీలోని బాక్సు]
మనల్ని ఇక్కడెవరు ఉంచారో మనం తెల్సుకోవలసిన అవసరముంది
బైబిలు అనువాదకుడైన రెనాల్డ్ నాక్స్, వైజ్ఞానికుడైన జాన్ స్కాట్ హాల్డెన్తో ఒకసారి వేదాంతిక చర్చలో పాల్గొన్నాడు. “లక్షలకొలది గ్రహాలను కలిగివున్న విశ్వంలో, వాటిలో కనీసం ఒకదానిలోనైనా జీవం కనుగొనబడాలన్నది సబబు కాదా?” అని హాల్డెన్ తర్కించాడు.
“సర్, స్కాట్లాండ్ యార్డ్ ఒక శరీరాన్ని మీ క్యాబిన్ ట్రంక్లో కనుగొంటే, ‘ప్రపంచంలో లక్షల ట్రంక్లు ఉన్నాయి—వాటిలో ఒకదానిలో తప్పకుండా ఒక శరీరం ఉండదా అని’ మీరు వాళ్లతో అంటారా? ఏది ఏమైనా ఆ శరీరాన్ని అక్కడ ఎవరు పెట్టారో మీరు తప్పక తెలుసుకోవాలని అనుకుంటారు.”—ద లిటిల్, బ్రవున్ బుక్ ఆఫ్ అనెక్డోట్స్.
మన కుతూహలాన్ని తీర్చడమే కాకుండా, మనల్ని ఇక్కడ ఎవరు పెట్టారో తెలుసుకోడానికి మరో కారణం కూడా ఉంది—కాబట్టి, తగిన గౌరవాన్ని ఆయనకు మనం ఇవ్వగలం. అది పెయింట్ దుకాణంలో జరిగిన ప్రమాదంకంటే ఎక్కువేమీ కాదని అహంకారంగల ఒక విమర్శకుడు, తన పనిని వర్ణిస్తే ఒక ప్రతిభావంతుడైన చిత్రకారుడు ఎలా ప్రతిస్పందిస్తాడు? అదే విధంగా, విశ్వాన్ని సృష్టించిన వాని కళను ఒక అనుకోని విపత్తుతో పోల్చి చెబితే అదెంతటి అవమానం?
[క్రెడిట్ లైను]
Courtesy of ROE/Anglo-Australian Observatory, photograph by David Malin
[23వ పేజీలోని చిత్రాలు]
ఎగురుతున్న కొంగలు
స్పెయిన్నందలి అల్టామిరాలోని గుహ చిత్రాలు
[24వ పేజీలోని చిత్రాలు]
డాల్ఫిన్లు, తేనెపిట్టలు మరియు జలపాతాలు, ఇవన్నీ గొప్ప చిత్రకారుని వ్యక్తిత్వపు అంశాలను బయల్పర్చుతాయి
[Credit Lines]
Godo-Foto
G. C. Kelley, Tucson, AZ
Godo-Foto