కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 11/8 పేజీలు 4-8
  • నిరంతరం జీవించడానికి రూపొందించబడింది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నిరంతరం జీవించడానికి రూపొందించబడింది
  • తేజరిల్లు!—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • జీవించాలనే కోరిక
  • దానికదే మరమ్మతు చేసుకోవడానికి రూపొందించబడింది
  • కణం
  • మెదడు
  • మనమెందుకు వృద్ధులమై మరణిస్తున్నాము?
    తేజరిల్లు!—1995
  • కణాలు చేసే అద్భుతం—ఒకే కణం నుండి వేర్వేరు అవయవాలు రావడం
    సృష్టిలో అద్భుతాలు
  • అద్భుతమైన మీ ఎర్ర రక్తకణాలు
    తేజరిల్లు!—2006
  • దేవుడున్నాడని మనమెలా తెలుసుకోగలము
    దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?
తేజరిల్లు!—1995
g95 11/8 పేజీలు 4-8

నిరంతరం జీవించడానికి రూపొందించబడింది

మానవ శరీరం అద్భుతంగా రూపొందించబడింది. దాని అభివృద్ధి, పెరుగుదల కేవలం అద్భుతం. “నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి,” అని ఒక ప్రాచీన రచయిత ఆశ్చర్యపోయాడు. (కీర్తన 139:14) మానవ శరీర అద్భుతాల గురించి బాగా ఎరిగిన ఆధునిక విజ్ఞానశాస్త్రవేత్తలు కొందరు వృద్ధాప్యం మరియు మరణం ఒక చిక్కు సమస్యగా ఉన్నట్లు భావిస్తున్నారు. మీరు కూడా అలాగే భావిస్తున్నారా?

“వృద్ధాప్యం మనకు ఇంత తరచుగా ఎదురౌతున్నా, అది ప్రాముఖ్యమైన జీవశాస్త్ర రహస్యమని అనేకమంది ప్రజలు గ్రహించకపోవడం నాకు ఆశ్చర్యం కలిగిస్తుందని” హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన జీవశాస్త్రజ్ఞుడైన స్టీవెన్‌ ఆస్టడ్‌ వ్రాశాడు. ప్రతి ఒక్కరు వృద్ధులౌతారనే వాస్తవం, “[వృద్ధాప్యం] తక్కువ కలవరపర్చేదిగా అనిపించేలా చేస్తుందని” ఆస్టడ్‌ అంటున్నాడు. అయినప్పటికీ, నిజంగా మీరు దాని గురించి ఆలోచించినప్పుడు, వృద్ధాప్యం, మరణం అర్థవంతమైనవిగా అనిపిస్తాయా?

మానవ జీవితం మరియు పెరుగుదల యొక్క అద్భుతాలను గుర్తించిన డా. లియొనార్డ్‌ హేఫ్లిక్‌ గత సంవత్సరం మనం ఎలా మరియు ఎందుకు వృద్ధులమౌతాము అనే తన పుస్తకంలో ఇలా వ్రాశాడు: “మనల్ని గర్భధారణ నుండి జననం వరకు, ఆ తర్వాత లైంగిక పరిపక్వత, వయోజనులయ్యే వరకు తీసుకువెళ్లడానికి, ఆ అద్భుతాలను నిరంతరం కొనసాగించే మరింత సుళువైన సంవిధానంలాంటి విధానాన్ని ప్రకృతి ఎంపిక చేసుకోనట్లనిపిస్తుంది. ఈ అంతర్దృష్టి బయోజెరాన్‌టాలజిస్ట్‌లను [వృద్ధాప్యం యొక్క జీవసంబంధ అంశాలను అధ్యయనం చేసేవారు] దశాబ్దాలుగా అయోమయంలో పడవేసింది.”

వృద్ధాప్యం మరియు మరణం గురించి మీరు కూడా కలవర పడుతున్నారా? అవి ఏ సంకల్పాన్ని నెరవేరుస్తాయి? హేఫ్లిక్‌ ఇలా తెలియజేశాడు: “దాదాపుగా గర్భధారణ నుండి పరిపక్వత వరకు జీవ సంబంధ సంఘటనలన్నిటికీ ఒక ఉద్దేశం ఉన్నట్లుంది, కాని వృద్ధాప్యానికి మాత్రం ఏ ఉద్దేశం లేనట్లుంది. వృద్ధాప్యం ఎందుకు సంభవిస్తుందో అసలు స్పష్టం కావడంలేదు. మనం వృద్ధాప్యం యొక్క జీవశాస్త్రం గురించి ఎంతో నేర్చుకున్నప్పటికీ . . . మరణానికి ముందు వచ్చే ఉద్దేశరహితమైన వృద్ధాప్యం యొక్క అనివార్య ఫలితాన్ని మనం ఎదుర్కొనవలసిందే.”

మనం వృద్ధులమై మరణించడానికి కాదుగాని భూమిపై నిరంతరం జీవించడానికేనన్నది సాధ్యమేనా?

జీవించాలనే కోరిక

వృద్ధులై మరణించడానికి దాదాపు ఎవ్వరూ ఇష్టపడరని కచ్చితంగా మీకు తెలిసే ఉంటుంది. వాస్తవానికి, అనేకులు ఆ ఉత్తరాపేక్షనుబట్టి భయపడతారు. షెర్‌విన్‌ బి. నలంద్‌ అనే వైద్యుడు మనమెలా మరణిస్తాము అనే తన పుస్తకంలో ఇలా వ్రాశాడు: “ఏమీ లేని లేక శూన్యత కూడా లేని శాశ్వత అపస్మారక స్థితి ఉందనే ఉద్దేశంతో, మన స్వంత మరణాన్నే ఎదుర్కోవడానికి మనలో ఎవరూ మానసికంగా సిద్ధంగా లేనట్లు అనిపిస్తుంది.” వృద్ధులై, రోగగ్రస్థులై మరణించాలని కోరుకునే వారెవరైనా మీకు తెలుసా?

అయితే, వృద్ధాప్యం మరియు మరణం సహజమై, ఏదైనా బృహత్ప్రణాళికలో భాగమైతే వాటిని మనం ఆహ్వానించమా? కాని మనం వాటిని ఆహ్వానించం. ఎందుకాహ్వానించం? మనం తయారు చేయబడిన విధానంలో దానికి సమాధానం ఉంది. “[దేవుడు] శాశ్వతకాల జ్ఞానమును [మన] హృదయమందుంచి యున్నాడు” అని బైబిలు చెబుతుంది. (ప్రసంగి 3:11) నిరంతర భవిష్యత్తు కొరకైన ఈ కోరిక మూలంగానే, యౌవనపు ఊట అని పిలువబడినదాని కొరకు ప్రజలు ఎంతోకాలం అన్వేషించారు. నిరంతరం యౌవనులుగా ఉండాలని వారికిష్టం. అది ఈ ప్రశ్నను లేవదీస్తుంది, దీర్ఘాయువు కలిగివుండగల సామర్థ్యం మనకుందా?

దానికదే మరమ్మతు చేసుకోవడానికి రూపొందించబడింది

జీవశాస్త్రజ్ఞుడైన ఆస్టడ్‌ నాచురల్‌ హిస్టరీ అనే పత్రికలో వ్రాస్తూ, ఈ సాధారణ దృక్కోణాన్ని తెలియజేశాడు: “అరిగిపోవడం కేవలం అనివార్యమని మనం యంత్రాల గురించి ఆలోచించినట్లే, మనగురించి, ఇతర జంతువుల గురించి ఆలోచిస్తాము.” కాని ఇది నిజం కాదు. “జీవులు యంత్రాలకు వేరై ఉంటాయి. జీవులు తమకు తాము మరమ్మతు చేసుకుంటాయి; గాయాలు మానుతాయి, ఎముకలు కట్టుకుంటాయి, అనారోగ్యం పోతుంది” అని ఆస్టడ్‌ చెప్పాడు.

కాబట్టి, ఆసక్తికరమైన ప్రశ్నేమిటంటే, మరి మనమెందుకు వృద్ధులమౌతాము? ఆస్టడ్‌ అడిగినట్లుగా: “అయితే మరి, [జీవులు] కూడా ఎందుకు యంత్రాల్లానే అరిగి తరగిపోతాయి?” శరీర కణాలు పునరుత్పత్తి చెందుతాయి గనుక, అవి నిరంతరం అలాగే కొనసాగించలేవా?

పరిణామ జీవశాస్త్రజ్ఞుడైన జేరెడ్‌ డైమండ్‌, వాటికవే మరమ్మతు చేసుకొనేందుకు భౌతిక జీవులకుగల అద్భుతమైన సామర్థ్యం గురించి డిస్కవర్‌ అనే పత్రికలో చర్చించాడు. ఆయనిలా వ్రాశాడు: “మన శరీరాలకు హాని జరుగకుండా నిరోధించే దృశ్యమైన ఉదాహరణ ఏమిటంటే గాయాలు మానడమే, దీని ద్వారా మనం మన చర్మానికి జరిగిన నష్టాన్ని మరమ్మతు చేసుకుంటాము. మనకంటే ఎన్నో జంతువులు మరింత అద్భుతమైన ఫలితాలను సాధించగలవు: బల్లులు తెగిపోయిన తమ తోకలను, నక్షత్రచేపలు మరియు పీతలు తమ అవయవాలను, సముద్ర కుకుంబర్‌లు తమ ఆంత్రములను పునరుత్పత్తి చేసుకోగలవు.”

పళ్లు మళ్లీ రావడం గురించి డైమండ్‌ ఇలా చెప్పాడు: “తమ జీవిత కాలంలో మానవులకు రెండు జతలు, ఏనుగులకు ఆరు జతలు, సొరచేపలకు లెక్కలేనన్ని పెరుగుతాయి.” ఆ తర్వాత ఆయనిలా వివరించాడు: “క్రమమైన పునరాక్రమణ అనే క్రియ అతిసూక్ష్మమైన స్థాయిలో కూడా జరుగుతుంది. మన పేగులకు లోపలి భాగంలో ఉండే కణాలను మనం ప్రతి కొద్ది రోజులకు, మూత్రాశయం లోపలి భాగంలో ఉండే కణాలను ప్రతి రెండు నెలలకు, మన ఎఱ్ఱ రక్త కణాలను ప్రతి నాలుగు నెలలకు తిరిగి పొందుతాము.

“అణుస్థాయిలో మన ప్రొటీన్‌ అణువులు, ఒక్కో ప్రత్యేకమైన అణువు దాని గుణాన్ని బట్టి, ఎడతెగకుండా తమ చుట్టూ తాము తిరుగుతూ కదులుతూ ఉంటాయి; అలా చేయడం ద్వారా పాడైన అణువులు ఒకే స్థలంలో పోగవ్వకుండా మనం నిరోధిస్తాము. కాబట్టి మీరు మీ ప్రియమైన వారి రూపాన్ని నెల క్రితం రూపంతో పోలిస్తే, అతడు లేక ఆమె అలాగే కనిపించవచ్చు, కాని ఆ ప్రియమైన వారి శరీరాన్ని రూపొందించే ప్రత్యేకమైన అణువులనేకం మాత్రం వేరేవైయుంటాయి. రాజుగారి గుఱ్ఱాలూ మనుషులూ కలిసి కూడా విరిగిపోయిన హమ్‌టీ డమ్‌టీని మళ్లీ అతికించలేకపోయినా, ప్రకృతి మాత్రం మనల్ని ప్రతి రోజు వేరు చేసి మళ్లీ దగ్గర చేరుస్తోంది.”

శరీరంలోని అనేక కణాలు కొంతకాలానికొకసారి పునరుత్పత్తి చెందుతాయి. కాని కొన్ని కణాలు, అంటే మెదడు యొక్క నాడీ కణాల స్థానంలో మాత్రం ఎన్నడూ వేరేవి ఉంచబడవు. అయితే, హేఫ్లిక్‌ ఇలా వివరించాడు: “కణంలోని ప్రతి భాగంలో క్రొత్తది ఉంచబడినట్లయితే, అది ఇక అదే పాత కణం కాదు. మీరు ఏ నాడీ కణాలతో జన్మించారో అవి నేడు అవే కణాలలా కనిపించవచ్చు, కాని వాస్తవానికి మీరు జన్మించినప్పుడు వాటిని రూపొందించిన అనేక అణువుల స్థానంలో . . . క్రొత్త అణువులు ఉంచబడి ఉండవచ్చు. కాబట్టి విభజన చెందని కణాలు మీరు జన్మించినప్పుడున్న అవే కణాలు అయివుండకపోవచ్చు!” అలా ఎందుకంటే కణాల యొక్క మూల పదార్థముల స్థానంలో క్రొత్తవి ఉంచబడ్డాయి. కాబట్టి, శరీరాణువుల స్థానంలో సూత్రానుసారంగా క్రొత్తవి ఉంచబడడం మనం నిరంతరం జీవించి ఉండేలా చేయగలదు!

“మనల్ని గర్భధారణ నుండి జననం వరకు తీసుకు వెళ్లే అద్భుతాల” గురించి డా. హేఫ్లిక్‌ మాట్లాడాడని గుర్తు తెచ్చుకోండి. వీటిలో కొన్ని ఏవి? మనం వాటిని క్లుప్తంగా పరీక్షిస్తుండగా, “కేవలం ఆ అద్భుతాలను నిరంతరం కొనసాగించడానికి మరింత సుళువైన సంవిధానం” అని ఆయన పిలిచిన దాన్ని అమలు చేయడం యొక్క సాధ్యత గురించి పరిశీలించండి.

కణం

ఒక వ్యక్తి ఒక కోటి కోట్ల కణాలచే రూపొందించబడతాడు, వాటిలో ప్రతి ఒక్కటి అగోచరమైన విధంగా సంశ్లిష్టమైనది. దాని సంశ్లిష్టతను వివరించడానికి న్యూస్‌వీక్‌ పత్రిక, కణాన్ని ప్రాకారములుగల పట్టణంతో పోల్చింది. “విద్యుచ్ఛక్తి ఉత్పాదకయంత్రాలు కణం యొక్క శక్తిని ఉత్పత్తి చేస్తాయి, కర్మాగారాలు వాణిజ్యపరమైన రసాయనావశ్యక విభాగాలైన మాంసకృత్తులను ఉత్పన్నం చేస్తాయి. సంశ్లిష్టమైన రవాణా విధానాలు ప్రత్యేకమైన రసాయనాలను కణంలోను, కణంపైనా ఒక స్థలం నుండి మరో స్థలానికి నడిపిస్తాయి. అడ్డుకట్ట వద్ద ఉండే కాపలాదారులు ఎగుమతి దిగుమతి వ్యాపారాలను అదుపు చేస్తారు, అలాగే ప్రమాద సూచకాలేమైనా ఉన్నాయా అని బయటి ప్రపంచాన్ని గమనిస్తుంటారు. దాడి చేసే వారితో పోరాడడానికి, శిక్షణపొందిన జీవసంబంధ సైన్యం సంసిద్ధంగా ఉంటుంది. కేంద్రీకృతమైన జన్యు ప్రభుత్వం శాంతిని కాపాడుతుంది” అని పత్రిక తెలియజేసింది.

మీరు, అంటే దాదాపు ఒక కోటి కోట్ల కణాలుగల మీరు ఎలా ఉనికిలోకి వచ్చారో పరిశీలించండి. మీ తండ్రి నుండి వెలువడిన రేతస్సు మీ తల్లి యొక్క అండంతో కలిసినప్పుడు ఏర్పడే ఏక కణంగా మీరు ప్రారంభమయ్యారు. చివరికి మీరు, అంటే పూర్తిగా క్రొత్త, విశేషమైన మనిషియైన మిమ్మల్ని రూపొందించడానికి ఆ కలయికలో, డిఎన్‌ఏలో (డీఆక్సీ రైబో న్యూక్లియక్‌ యాసిడ్‌ యొక్క సంక్షిప్త పదం) పథకాలు రూపొందించబడ్డాయి. డిఎన్‌ఏలోవున్న ఉపదేశాలను “ఒకవేళ వ్రాసినట్లయితే అవి 600 పేజీలుగల వెయ్యి పుస్తకాలకు సరిపోతాయని” చెప్పబడుతుంది.

కొంతకాలానికి, ఆ మొదటి కణం విభజన చెందడం ప్రారంభించి, రెండు కణాలుగా ఆ తర్వాత నాలుగు, ఎనిమిది అలా విభజన చెందుతుంది. చివరికి, దాదాపు 270 దినాల తర్వాత—ఈ మధ్య కాలంలో ఒక శిశువు రూపొందడానికి మీ తల్లిలో అనేకరకాల వేల కోట్ల కణాలు వృద్ధి చెందుతాయి—మీరు జన్మించారు. ఇది, మిమ్మల్ని ఎలా తయారు చేయాలనేదాన్ని గూర్చిన విస్తృతమైన ఉపదేశాలుగల పుస్తకాలతో నిండివున్న పెద్ద గది ఆ మొదటి కణంలో ఉందేమో అన్నట్లుంది. కాని, ఈ సంశ్లిష్టమైన ఉపదేశాలు ప్రతి తర్వాతి కణానికి అందజేయబడ్డాయన్న వాస్తవం ఎంతో అద్భుతమైనది. అవును, అద్భుతమైన విధంగా మీ శరీరంలోని ప్రతి కణంలోనూ, ఫలదీకరణం చెందిన అండంగల మొదటి కణంలోవున్న అదే సమాచారం ఉంటుంది.

ఇది కూడా పరిశీలించండి. ప్రతి కణానికీ అన్ని రకాలైన కణాలను ఉత్పన్నం చేయడానికి కావలసిన సమాచారం ఉంటుంది గనుక, ఉదాహరణకు, హృదయ కణాలను రూపొందించ వలసిన సమయం వచ్చినప్పుడు ఇతర కణాలను చేయడానికున్న ఉపదేశాలు ఎలా అణిచివేయబడతాయి? స్పష్టంగా, శిశువును రూపొందించడానికి కావలసిన సవివర నమూనాలను సొరుగు నిండా కలిగివున్న కాంట్రాక్టర్‌వలె పనిచేస్తూ, ఒక కణం హృదయ కణాలను రూపొందించడానికి దాని దస్తావేజుల సొరుగులో నుండి ఒక సవివర నమూనాను ఎంపిక చేసుకుంది. నాడీ కణాలను రూపొందించడానికి ఉపదేశాలుగల వేరే సవివర నమూనాను మరో కణం ఎంపిక చేసుకుంది, అయితే కాలేయ కణాలను రూపొందించడానికి మరొకటి మరో సవివర నమూనాను తీసుకుంది, అలా కొనసాగుతుంది. కచ్చితంగా, ఒక ప్రత్యేక రకమైన కణాన్ని రూపొందించడానికి అవసరమైన ఉపదేశాలను ఎంపిక చేసుకునేందుకు, అదే సమయంలో ఇతర ఉపదేశాలను అణిచివేసేందుకు గల ఇంకా వివరించబడని ఈ సామర్థ్యం “మనల్ని గర్భధారణ నుండి జననం వరకు తీసుకువెళ్లే” అనేక “అద్భుతాల్లో” మరొకటి.

అయితే, దానిలో ఇంకా ఎంతో ఇమిడి ఉంది. ఉదాహరణకు, హృదయ కణాలు లయబద్ధంగా సంకోచం చెందేలా ప్రేరేపించబడవలసిన అవసరం ఉంది. అలా, శరీరం ఏ పనిలో అయితే ఇమిడి ఉందో ఆ పనిలో దాన్ని బలపర్చేందుకు హృదయం సరైన రేటు ప్రకారం కొట్టుకునేలా చేయడానికి విద్యుత్‌ ప్రేరణలను ఉత్పన్నం చేసేందుకు హృదయంలోనే ఒక సంశ్లిష్టమైన విధానం రూపొందించబడింది. నిజంగా, ఒక అద్భుతమైన రూపకల్పన! హృదయం గురించి వైద్యులు ఇలా చెప్పారంటే ఆశ్చర్యం లేదు: “మనిషి రూపొందించిన ఏ రకమైన ఏ యంత్రం కన్నా అది ఎంతో సామర్థ్యం గలది.”

మెదడు

ఇంకా గొప్ప అద్భుతం ఏమిటంటే, మానవ అద్భుతంలోని అత్యంత అగోచర భాగమైన మెదడు యొక్క అభివృద్ధి. గర్భధారణ జరిగిన మూడు వారాల తర్వాత, మెదడు కణాలు రూపొందడం ప్రారంభమౌతాయి. చివరికి, న్యూరాన్‌లని పిలువబడే దాదాపు పదివేల కోట్ల నాడీ కణాలు అంటే పాలపుంతలో ఎన్ని నక్షత్రాలున్నాయో అన్ని కణాలు, మానవ మెదడులో చేర్చబడతాయి.

“వీటిలో ప్రతి ఒక్కటి మెదడులోని దాదాపు 10,000 ఇతర నాడీ కణాల నుండి ఉత్పాదకాన్ని పొంది, మరో వెయ్యి నాడీ కణాలకు సందేశాలను పంపుతాయని” టైమ్‌ పత్రిక నివేదించింది. అనువైన కలయికల సాధ్యతలను గమనిస్తూ, నాడీ సంబంధ శాస్త్రవేత్తయైన జెరాల్డ్‌ ఎడెల్‌మాన్‌ ఇలా చెప్పాడు: “అగ్గిపుల్ల తలంత చిన్నగా ఉండే, మెదడులోని ఒక భాగం కూడా కేవలం అత్యద్భుతమైన గణాంకమని వివరించగలన్ని విధాలుగా కలుపగల దాదాపు వంద కోట్ల అనుసంధానాలు కలిగివుంటుంది, అంటే గణాంక క్రమం ప్రకారం పది ప్రక్కన లక్ష సున్నాలు ఉన్నన్ని అన్నమాట.”

ఇది మెదడుకు ఎంతటి సామర్థ్యాన్ని ఇస్తుంది? మానవ మెదడు “ప్రపంచంలోని అత్యంత పెద్ద గ్రంథాలయాల్లో ఉన్నన్ని అంటే సుమారు రెండు కోట్ల సంపుటిలలో సరిపోయేంత” సమాచారాన్ని కలిగివుండగలదని ఖగోళ శాస్త్రజ్ఞుడైన కాల్‌ సేగన్‌ చెప్పాడు. జార్జ్‌ లియొనార్డ్‌ అనే రచయిత ఇలా ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ, మరింత ముందుకు వెళ్లాడు: “వాస్తవానికి, బహుశా మనం ఇప్పుడు ఒక అమితాశ్చర్యకరమైన ఊహ గురించి చెప్పవచ్చు: మెదడు యొక్క మొత్తం సృజనాత్మక సామర్థ్యం నిజంగా, అంతు లేనిది.”

కాబట్టి, ఈ క్రింది వ్యాఖ్యానాలను బట్టి మనం ఆశ్చర్యపోకూడదు: “మెదడు, మనం మన విశ్వంలో ఇంతవరకు కనుగొన్న అత్యంత సంశ్లిష్టమైనది” అని అణుజీవశాస్త్ర వేత్త, డిఎన్‌ఏ యొక్క భౌతిక రూపాన్ని కనుగొన్నవారిలో ఒకడైన జేమ్స్‌ వాట్సన్‌ చెప్పాడు. మెదడును కంప్యూటరుతో పోల్చడాన్ని నిరసించే నాడీ వైద్యుడు రిచర్డ్‌ రెస్టల్‌ ఇలా చెప్పాడు: “మనకు తెలిసిన విశ్వమంతటిలో మెదడు వంటిది మరెక్కడా మచ్చుకైనా లేదన్న వాస్తవం మెదడు యొక్క విశేషతకు ఆధారం.”

ఒక అంచనా ప్రకారం, మన ప్రస్తుత జీవిత కాలంలో, మన మెదడు యొక్క సంభవనీయ శక్తిలోని కేవలం స్వల్ప భాగాన్ని, దాదాపు 1/10,000 వంతును లేదా 1 శాతంలో 1/100 వంతును మాత్రమే ఉపయోగించుకుంటామని నాడీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని గురించి ఆలోచించండి. అలాంటి అద్భుతమైన సాధ్యతలుగల మెదడు మనకివ్వబడి, దాన్ని ఎన్నడూ పూర్తిగా ఉపయోగించుకోలేక పోవడం కారణసహితమైనదేనా? నిరంతరం నేర్చుకొనే సామర్థ్యం గల మానవులు వాస్తవానికి నిరంతరం జీవించడానికి రూపొందించబడ్డారన్నది సహేతుకం కాదంటారా?

అదే నిజమైతే, మరి మనమెందుకు వృద్ధులమౌతున్నాము? ఏ పొరపాటు జరిగింది? స్పష్టంగా మన శరీరాలు నిరంతరం ఉండేలా రూపొందించబడితే, దాదాపు 70 లేక 80 సంవత్సరాల తర్వాత మన మెందుకు మరణిస్తున్నాము?

[7వ పేజీలోని చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

కణం—ఓ అద్భుతమైన నిర్మాణం

కణత్వచము

కణంలోపల, బయట పదార్థాల ప్రసరణను నియంత్రించే పొర

కేంద్రకము

రెండు పొరలతో చుట్టబడి ఉంటుంది, ఇది కణం కార్యకలాపాలను నడిపించే నియంత్రణ కేంద్రము

రైబోసోమ్‌లు

వీటిపై అమైనో ఆమ్లాలు ప్రొటీన్లుగా తయారు కావడానికి సమకూడుతాయి

క్రోమోజోమ్‌లు

వీటిలో కణం యొక్క డిఎన్‌ఏ మరియు దాని బృహత్ప్రణాళిక ఉంటాయి

కేంద్రకాంశము

రైబోసోమ్‌లు సమావేశమయ్యే స్థలం

అంతర్జీవ ద్రవ్యజాలకము

వాటికి అంటుకొనివున్న రైబోసోమ్‌లచే రూపొందించబడిన ప్రొటీన్లను భద్రపర్చే లేదా రవాణా చేసే పొరలు (కొన్ని రైబోసోమ్‌లు కణంలో స్వేచ్ఛగా తేలుతుంటాయి)

మైటోకాండ్రియా

కణానికి శక్తినందించే అణువులు, ఏటిపిలకు ఇవి ఉత్పత్తి కేంద్రాలు

గాల్జి నిర్మాణం

ఇది పలు మడతలతోకూడిన త్వచసంబంధ నిర్మాణం, ఇది కణం రూపొందించే ప్రొటీన్లను సంపుటీకరణ చేసి కణ బాహ్యానికి అందజేస్తుంది

తారావత్కేంద్రములు

అవి కేంద్రకం దగ్గర ఉంటాయి, కణ విభజనకు అత్యవసరమైనవి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి