దీర్ఘాయువుకు ఏ నిరీక్షణ ఉంది?
“స్త్రీ కనిన నరుడు కించిదాయుస్సుగలవాడై మిక్కిలి బాధనొందును.”—యోబు 14:1, అథఃస్సూచిలో వ్రాయబడిన యోబు మాటలు.
జీవిత అల్పత్వాన్ని గూర్చి కావ్యాల్లో ఎంత తరచుగా వర్ణించబడిందో కదా! యోబు వలె, మొదటి శతాబ్దపు ఒక రచయిత ఇలా వ్రాశాడు: “మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే.”—యాకోబు 4:14.
జీవితమనేది ఎంతో కొద్దిపాటిదిగా ఉన్నట్లు మీరు కూడా గమనించారా? దాదాపు 400 సంవత్సరాల క్రితం, విలియం షేక్స్‌పియర్ ఇలా వ్రాశాడు: “ఆరిపో, ఆరిపో, చిరు దీపమా! జీవితం క్షణభంగురమైనది.” గత శతాబ్దంలో, అమెరికన్ ఆదివాసుల ముఖ్యుడు ఇలా అడిగాడు: “జీవితమంటే ఏమిటి?” తర్వాత ఆయనిలా సమాధానమిచ్చాడు: “అది రాత్రిలో వెలిగే మిణుగురు పురుగు వెలుగంత చిన్నదే.”
తమ ఆయుష్కాలం ఎంతై ఉండాలని మానవులు నిరీక్షించవచ్చు? దాదాపు 3,500 సంవత్సరాల క్రితం, తన కాలం నాటి పరిస్థితిని ప్రవక్తయైన మోషే ఇలా వర్ణించాడు: “మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధికబలమున్న యెడల ఎనుబది సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము.”—కీర్తన 90:10.
డెబ్బది సంవత్సరాలు, అంటే కేవలం 25,567 దినాలు. గనుక 80 సంవత్సరాల్లో 29,219 దినాలు మాత్రమే ఉంటాయి. నిజంగా, ఎంత తక్కువ! మానవ జీవితాన్ని పొడిగించడానికి ఏదైనా చేయవచ్చా?
వైద్య విజ్ఞానం సహాయం చేయగలదా?
సైన్స్ పత్రిక ఇలా తెలియజేసింది: “[అమెరికాలో] జనన సమయంలో వయోపరిమితి 1900లో 47 సంవత్సరాలుగా ఉండేది, అది 1988 నాటికి దాదాపు 75 సంవత్సరాలకు పెరిగింది.” మంచి ఆరోగ్య జాగ్రత్తలు మరియు పోషకాహారం ఫలితంగా శిశు మరణ రేటును తగ్గించడం ద్వారా అమెరికాలోవున్న ప్రజలు ఇప్పుడు దాదాపు మోషే తెలియజేసినంత కాలం జీవించడానికి నిరీక్షించవచ్చు. అయినప్పటికీ, అనేకమంది ప్రజలు ఎంతకాలం జీవిస్తారనే విషయంలో ఆశ్చర్యకరమైన పెరుగుదలను నిరీక్షించవచ్చా?
విశేషంగా, వృద్ధాప్యం విషయంలో ప్రముఖ నిపుణుడైన లియొనార్డ్ హేఫ్లిక్ మనం ఎలా మరియు ఎందుకు వృద్ధులమౌతాము అనే తన పుస్తకంలో ఇలా చెప్పాడు: “జీవ వైద్య పరిశోధనా పురోభివృద్ధి, ఈ శతాబ్దంలోని మెరుగైన చికిత్సా విధానం మానవ దీర్ఘాయువుపై కచ్చితంగా ప్రభావాన్ని చూపాయి, కాని ఎక్కువమంది ప్రజలు మానవ ఆయుష్కాలం యొక్క ఉన్నత నిర్ణీత పరిమితిని చేరడానికి అనుమతించడం ద్వారా మాత్రమే అలా చేయడం సాధ్యమైంది.” కాబట్టి ఆయనిలా వివరించాడు: “వయోపరిమితి పెరిగింది కాని జీవన పరిమాణం పెరగలేదు; తేడా సందిగ్థమైనది.”
మానవుని జీవన పరిమాణం యొక్క “ఉన్నత నిర్ణీత పరిమితి” అంటే ఏమిటి? ఇటీవలి కాలాల్లో ఎవరైనా 115 కంటే ఎక్కువ వయస్సు వరకు జీవించారన్నది కచ్చితంగా చెప్పలేమని కొందరంటారు. అయితే, సైన్స్ పత్రిక ఇలా చెబుతుంది: “1990 నాటికి అత్యధిక కాలం జీవించిన వ్యక్తి 120 సంవత్సరాల కంటె కొంచెం ఎక్కువ మాత్రమే జీవించినట్లు తేలింది.” ఈ సంవత్సరం తొలి భాగంలో, అనేకమంది నివేదకులు మరియు ఫోటోగ్రాఫర్లతోపాటు ఫ్రెంచి ఆరోగ్య శాఖ మంత్రి, ఫ్రాన్సు నందలి ఆర్ల్స్‌కు చెందిన జీన్ కాల్ మీన్ యొక్క 120వ జన్మదిన సందర్భంగా ఆమెను దర్శించాడు. మోషే కూడా 120 సంవత్సరాల వయస్సు వరకు అంటే సగటు కంటే ఎంతో ఎక్కువకాలం జీవించాడు.—ద్వితీయోపదేశకాండము 34:7.
ప్రజలు సాధారణంగా అంతకాలం లేదా అంతకన్నా ఎక్కువకాలం జీవించగలరనే నిరీక్షణను శాస్త్రజ్ఞులు ఇవ్వగలరా? లేదు, అనేకమంది ఇవ్వలేరు. డెట్రాయిట్ న్యూస్‌లోని ముఖ్యశీర్షిక ఇలా ఉంది: “సగటు జీవన పరిమాణం యొక్క ఉన్నత పరిమితి 85 సంవత్సరాలై ఉండవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.” వృద్ధాప్యం విషయంలో పేరుపొందిన సలహాదారుడైన ఎస్. జే ఆల్‌షాన్‌స్కీ ఆ శీర్షికనందిలా చెప్పాడు: “మీరొకసారి 85 సంవత్సరాల వయస్సును దాటిన తర్వాత, ప్రజలు అనేకావయవ వైఫల్యాల మూలంగా మరణిస్తారు. వాళ్లు శ్వాసించడం మానేస్తారు. ప్రాథమికంగా, వారు వృద్ధాప్యం మూలంగా మరణిస్తారు. దానికి చికిత్స ఏమీ లేదు.” ఆయనింకా ఇలా కొనసాగించాడు: “మానవ కణాలు వృద్ధాప్యానికి ఎదగడాన్ని ఆపనంత వరకు, ఆయుష్కాలంలో ఆశ్చర్యకరమైన పెరుగుదల ఉండదు.”
బహుశా “దీర్ఘాయువు యొక్క ఉన్నత పరిమితికి ఇప్పటికే చేరినందున వయోపరిమితి పడిపోయే అవకాశం తక్కువని” సైన్స్ పత్రిక తెలియజేసింది. మరణ ధృవపత్రాలలో నివేదించబడే మరణ కారణాలన్నిటిని తీసివేయగలిగితే, ఆయుష్కాలం 20 కంటే తక్కువ సంవత్సరాలు పెరగగలదని చెప్పబడుతుంది.
కాబట్టి, అనేకమంది విజ్ఞానశాస్త్రవేత్తలు మానవుని జీవిత పరిమాణం యొక్క నిడివి క్రొత్తది కాదన్నట్లు, మారదన్నట్లు దృష్టిస్తారు. అయినప్పటికీ, మానవులు చివరికి ఎంతో ఎక్కువకాలం జీవించగలరని నమ్మడం ఎందుకు కారణ సహితమైనది?