దీర్ఘాయుష్షు కోసమైన మన అన్వేషణ
“స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై మిక్కిలి బాధనొందును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును.”—యోబు 14:1, 2.
కొద్దికాల జీవితం గురించి సూచిస్తున్న పై మాటలు దాదాపు 3,500 సంవత్సరాల క్రితం వ్రాయబడినప్పటికీ, ఎవరూ కూడా ఆ మాటలతో ఏకీభవించకుండా ఉండలేరు. జీవితంలోని యౌవనాన్ని చాలా తక్కువగా అనుభవించి, ఆ తర్వాత వృద్ధులై, మరణించడం అసంతృప్తికరంగా ఉన్నట్లు ప్రజలు అన్ని కాలాల్లోను కనుగొన్నారు. కనుక, ఆయుష్షును పెంచుకునే పద్ధతులు చరిత్రంతటా చాలా ఎక్కువగా పెరిగాయి.
యోబు కాలంలో, ఐగుప్తీయులు తమ యౌవనాన్ని తిరిగి పొందే ప్రయత్నంలో జంతువుల వృషణాలను తినేవారు. అయితే అది వ్యర్థప్రయత్నమే అని తేలింది. మధ్యయుగం నాటి రసాయనశాస్త్రపు ప్రాథమిక లక్ష్యాల్లో ఒకటి దీర్ఘాయుష్షును ఇచ్చే దివ్యౌషధమును ఉత్పత్తి చేయాలన్నదే. కృత్రిమంగా తయారు చేసిన బంగారం అమర్త్య జీవితాన్నిస్తుందనీ, బంగారు ప్లేట్లలో భోజనం చేయడం వల్ల దీర్ఘాయుష్మంతులు అవుతారనీ చాలా మంది రసాయనశాస్త్రజ్ఞులు నమ్మారు. యోగా, శ్వాస సంబంధ వ్యాయామాలు, డైటింగ్ వంటి పద్ధతుల వల్ల శరీరంలోని రసాయనాల సమ్మేళనాన్ని మార్చవచ్చని, ఆ విధంగా అమర్త్యతను సంపాదించవచ్చని ప్రాచీన కాలపు చైనీయులైన టావోయిస్ట్‌లు నమ్మేవారు.
స్పెయిన్ దేశానికి చెందిన అన్వేషకుడైన జాన్ పాన్స డే లీయోన్, యౌవనపు ఊట కోసమై తాను అత్యాశతో చేసిన అన్వేషణకు పేరుపొందాడు. వసంత ఋతువులో, యువ కన్యలను ఒక చిన్నగదిలో ఉంచి, వాళ్ళు విడిచిన ఊపిరిని సీసాల్లో సేకరించి, ఆయుష్షును పొడిగించేందుకు దాన్ని ద్రవ రూపంలోని ఔషధంగా ఉపయోగించాలని 18వ శతాబ్దంలోని ఒక వైద్యుడు హెర్‌మిపుస్ రెడివీవుస్ అనే తన పుస్తకంలో సిఫారసు చేశాడు. ఈ పద్ధతులు ఏవీ కూడా ఫలించలేదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
యోబు పలికిన మాటలను మోషే వ్రాసి దాదాపు 3,500 సంవత్సరాలు గడిచిన తర్వాత, నేడు మానవుడు చంద్రుని మీద నడిచాడు, కార్లను కంప్యూటర్లను కనిపెట్టాడు, అణువులను, కణాలను పరిశోధించాడు. అయితే, ఇన్ని సాంకేతిక అభివృద్ధులు జరిగినప్పటికీ, మనం ‘కొద్ది దినములవాళ్ళమై, మిక్కిలి బాధనొందుతున్నాం.’ వర్ధమాన దేశాల్లో సంభవనీయ జీవిత కాలం, ఆకస్మికంగా గత శతాబ్దం కన్నా చాలా పెరిగిందన్నది నిజమే. అయితే, ఆ పెరుగుదల, ముఖ్యంగా మెరుగైన ఆరోగ్య సంరక్షణ వల్లా, మరింత ఫలవంతమైన పారిశుద్ధ్య పద్ధతుల వల్లా, మంచి పోషకాహారం వల్లా జరిగింది. ఉదాహరణకు, 19వ శతాబ్దపు మధ్య కాలం నుండి 1990ల ఆరంభం వరకు చూస్తే, స్వీడన్‌లోని పురుషుల సగటు ఆయుష్కాలం 40 ఏళ్ళు ఉన్నది 75 ఏళ్ళుగానూ, స్త్రీల సగటు ఆయుష్కాలం 44 ఏళ్ళు ఉన్నది 80 ఏళ్ళుగాను పెరిగింది. దీర్ఘకాలం జీవించాలన్న మానవుని వాంఛ నెరవేరిందని దీని భావమా?
కాదు. “మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు. అధికబలమున్న యెడల ఎనుబది సంవత్సరములగును. . . . అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము” అని సంవత్సరాల క్రితం మోషే వ్రాసిన మాటలు, కొన్ని దేశాల్లో ఎక్కువ మంది ప్రజలు వార్ధక్యాన్ని అనుభవించడానికి జీవించి ఉంటున్నప్పటికీ వర్తిస్తాయి. (కీర్తన 90:10) సమీప భవిష్యత్తులో, మనం మార్పును చూస్తామా? మానవుడు చెప్పుకోదగినంత దీర్ఘ కాలం జీవించగలడా? తరువాతి శీర్షిక ఇలాంటి ప్రశ్నలను చర్చిస్తుంది.