ఆఫ్రికా పాఠశాల—అది ఏమి నేర్పించింది?
ఘానాలోని తేజరిల్లు! విలేఖరి
ఆఫ్రికా పాఠశాలా? గతంలో అలాంటి ఏర్పాటు నిజంగా ఉండేదని తెలుసుకుని కొందరు పాశ్చాత్యులు ఆశ్చర్యపడవచ్చు. విచారకరంగా, ఆఫ్రికా దేశస్థులను గురించి ఈటెను పట్టుకొనివున్న ఆదిమ సమాజంలోని వ్యక్తులని చిత్ర పరిశ్రమ కలిగించిన అభిప్రాయం ప్రజల మనస్సుల్లో నుండి పోవడం లేదు. గత కాలంలోని ఆఫ్రికా దేశస్థులు విద్యావంతులుగా ఎలా ఎంచబడ్డారో కొందరు ఊహించనైనా ఊహించలేరు.
నిజంగా, పారంపర్య సమాజాల్లో పెరిగిన ఆఫ్రికా దేశస్థులు పుస్తకాల నుండి పాఠాలను నేర్చుకోలేదు, వారు తరగతి గదిలో నియత తర్ఫీదు పొందలేదన్నది వాస్తవమే. అయితే, ఈ ఖండంలోనికి ఐరోపాలోలాంటి నియత విద్యాభ్యాసం రావడానికి చాలా కాలం క్రితమే తమ స్థానిక సంస్కృతిలో పని చేసేందుకు సంసిద్ధులయ్యేందుకు, వర్ధిల్లేందుకు పిల్లలకు సహాయపడే సఫలవంతమైన విద్యాభ్యాస పద్ధతులు అనేక ఆఫ్రికా సమాజాల్లో ఉండేవి. ఉదాహరణకు, ఘానాలోని ట్వి భాష మాట్లాడే ఆకాన్ ప్రజల విద్యాభ్యాసాన్ని పరిగణించండి.
ఇంట్లో విద్యాభ్యాసం
ఆకాన్ ప్రజల్లో, ఇల్లు ప్రాథమిక తరగతి గదిగా పనిచేసేది. బిడ్డ విద్యాభ్యాసం, వాడు తన తలిదండ్రుల నుండి భాష నేర్చుకుంటున్నప్పటి నుండి మొదలయ్యేది. అదే సమయంలో వాడు సభ్యతను గూర్చిన మొదటి పాఠాలను కూడా నేర్చుకునేవాడు. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఇంటికి వచ్చినప్పుడు పిల్లవానిని పలకరిస్తాడు, అప్పుడు వాడు సరైన విధంగా నమ్రతతో ప్రతిస్పందించేందుకు వానికి నేర్పించబడేది. తరువాత, బిడ్డను ఒక పనిమీద బయటికి పంపించేటప్పుడు, చెప్పబడిన సందేశాన్ని నమ్రతతో ఎలా అందించాలో వానికి నేర్పించబడేది.
ఈ విద్యాభ్యాస పద్ధతి “బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు” అని బైబిలులో సామెతలు 22:6 నందు చెప్పబడిన దానికి సారూప్యంగా ఉంది. బిడ్డను పెంచడంలో తలిదండ్రులు, ముఖ్యంగా తండ్రి శ్రద్ధ తీసుకునేవాడు. “బిడ్డ తల్లిలా ఉండకపోతే తండ్రిలా ఉంటాడు” అని ఒక ఆకాన్ సామెత చెప్పింది.
బిడ్డ పెరుగుతూ ఉండగానే తన విద్యాభాసాన్ని పూర్తి చేసుకునేవాడు. పుస్తకాల ద్వారా కాదు గాని, క్వాకు ఆనాన్‌సే అని పిలువబడే పౌరాణికమైన సాలెపురుగు వంటి వాటిని గూర్చిన కల్పిత కథల ద్వారా జీవితాన్ని గూర్చిన పాఠాలు బోధించబడేవి. పిల్లలు ఈ కథలను ఎంతగా ఇష్టపడేవారో! చల్లగాలి వీస్తున్న సాయంకాల సమయంలో లేదా వెన్నెల కాస్తున్న రాత్రిలో, వారు చలిమంట చుట్టూ కూర్చుని, జయాపజయాలను గూర్చిన ఈ కథలను చెప్పుకుని మనసారా ఆనందించేవారు.
ఒక ప్రసిద్ధమైన కథ ఏమిటంటే ఆనాన్‌సే లోకంలోని జ్ఞానాన్నంతటినీ కుండలో పెట్టేందుకు భూమియంతటా పర్యటించాడు. ఆయన పని పూర్తయినట్లు అనిపించింది, ఆ జ్ఞానాన్ని మరెవ్వరూ అందుకోలేని విధంగా ఉండేందుకు, ఆ కుండను చెట్టు పై భాగాన వ్రేలాడదీయాలని ఆయన నిర్ణయించుకున్నాడు. జ్ఞానాన్ని నింపిన కుండను తాడుకు కట్టి, తన పొట్టకు వ్రేలాడగట్టుకుని ఆయన ప్రయాసంతో చెట్టెక్కడం మొదలెట్టాడు. అతడలా కష్టపడుతుంటే, ఆయన మొదటి కుమారుడు టికుమా అక్కడికి వచ్చి, “అయ్యో, నాన్నోయ్! ఎవరైనా కుండను పొట్టకు కట్టుకుని చెట్టెక్కుతారా? పైకి వెళ్ళడానికి వీలయ్యేలా వెనక కట్టుకోవచ్చుకదా?” అని బిగ్గరగా అన్నాడు. ఆనాన్‌సే క్రిందున్న తన కుమారుడ్ని చూస్తూ, “నాకు నేర్పించడానికి నీకెంత ధైర్యం?” అని అరిచాడు.
ఇంక కొంత జ్ఞానం కుండకు బయటే ఉండిపోయిందని అప్పుడు స్పష్టమైంది! దీనిని గ్రహించిన ఆనాన్‌సే కోపంతో విసురుగా ఆ కుండను నేలకు విసిరేసి, దానిని పగులగొట్టి, జ్ఞానాన్నంతటినీ చెల్లాచెదరు చేసేశాడు. అక్కడికి ఎవరైతే ముందుగా చేరుకున్నారో వారు ఎక్కువ జ్ఞానవంతులయ్యారు. పాఠమేంటంటే: జ్ఞానమనేది ఎవరికీ గుత్తసొమ్ము కాదు. కనుక ఆకానీయులు ఈ విధంగా చెబుతారు: “ఆలోచనా సభ ఒక తలతో రూపొందదు.”—సామెతలు 15:22; 24:6 పోల్చండి.
జీవన నైపుణ్యాలు
ఆకానీయుల విద్యాభ్యాసంలో జీవించే నిపుణతల కొరకైన తర్ఫీదు కూడా ఉంది. చాలా మంది అబ్బాయిలు తండ్రుల వృత్తిని—సాధారణంగా వ్యవసాయాన్ని చేపట్టేవారు. కాని వేటాడడం, ఈత కల్లు గీయడం వంటి ఇతర నిపుణతలను మరియు బుట్టలను అల్లడం వంటి పనులను నేర్చుకోవలసి ఉంది. కొయ్యలను చెక్కడం, లేదా నేత పని వంటి శ్రమతోకూడిన పనులకు గొప్ప వడ్రంగి అయ్యేందుకు అనేక మంది అబ్బాయిలకు తర్ఫీదివ్వబడుతుంది. మరి అమ్మాయిల విషయమేమిటి? వారికివ్వబడే తర్ఫీదు ముఖ్యంగా కూరగాయల నుండి నూనెను తయారు చేయడం, సబ్బును, కుండలను తయారు చేయడం, దూదిని వడకడం వంటి ఇంటిపనులు చేయడంపై కేంద్రీకరించబడుతుంది.
పారంపర్య ప్రకారమున్న పాఠశాల “పాఠ్యప్రణాళికలో” విజ్ఞానశాస్త్రం కూడా చేర్చబడింది. ఔషధ మూలికల విత్తనాలను గూర్చి, వాటి తయారీని గూర్చి, వాటిని అందించడం వంటి వాటిని గూర్చిన జ్ఞానం తండ్రి నుండి కుమారునికి లేదా తాత నుండి మనమడికి అందించబడేది. పిల్లవాడు చేతి వ్రేళ్ళను, అలాగే చలువరాళ్ళను, రాళ్ళను, కర్ర మీది గుర్తులను ఉపయోగించి లెక్కపెట్టడాన్ని నేర్చుకునేవాడు. ఒవారె, డ్రాట్స్ వంటి ఆటలు లెక్కించే సామర్థ్యాలను అధికం చేసేవి.
యువకులైన ఆకానీయులు రచ్చబండదగ్గర హాజరై రాజకీయ, న్యాయవిచారణ విధానాలను గూర్చిన అవగాహనను కూడా పొందేవారు. స్థానిక విలాప గీతాలను పద్యాలను చరిత్రను సంగీతాన్ని డప్పు వాయించడాన్ని మరియు నృత్యాన్ని నేర్చుకునేందుకు అంత్యక్రియలు అలాగే పండుగ సందర్భాలు అవకాశాలనిచ్చేవి.
సామాజిక బాధ్యత
ఆకానీయులు పిల్లవాణ్ణి దూరంగా ఉంచరు. చిన్నప్పటినుండే, సమాజంలో పిల్లవానికి గల బాధ్యత తెలియజేస్తారు. పిల్లవాడు ఆడుకోవడానికి తోటి పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడే తన మొదటి పాఠాలను నేర్చుకునేవాడు. తరువాయి సంవత్సరాల్లో పిల్లవాడు సాంఘిక సేవ వంటి సహకార కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. పిల్లవాడు చెడుగా ప్రవర్తించినప్పుడు కేవలం తలిదండ్రులే కాక, సమాజంలోని పెద్దవారెవరైనా సరే వాడిని శిక్షించేవారు. నిజానికి, తప్పు చేసే ఏ పిల్లవానికైనా క్రమశిక్షణ నేర్పడం అనేది పెద్దవారి బాధ్యతగా పరిగణించబడేది.
అలాంటి శిక్షణ చక్కగా స్వీకరించబడేది, ఎందుకంటే పిల్లలు పెద్దలను ఉన్నతంగా గౌరవించాలని బోధించబడేది. నిజానికి, “ఒక వృద్ధ స్త్రీ ఒక వ్యక్తికి మాత్రమే మామ్మ కాదు” అని ఆకానీయులు అంటారు. కనుక పెద్దవారికి గౌరవం చూపడం, పరిచర్య చేయడం అనేది ఒక బాధ్యత. ఏ పిల్లవాడైనా సరైన కారణం లేకుండానే వృద్ధునికి సపర్య చేయడానికి నిరాకరిస్తే, అది వాని తలిదండ్రులకు తెలియజేయబడేది.
మతపరమైన విద్యాభ్యాసం
ఆకానీయులు ప్రకృతి ఎడల మరియు తెలియని విశ్వం ఎడల ఎంతో భక్తి గల మతవిశ్వాసులు. నిజమే, వారు బహు దేవతారాధికులు, అనేక మంది దేవుళ్ళను విశ్వాసముంచేవారు. అయినప్పటికీ, ఆకానీయులు ఒక సర్వోన్నత వ్యక్తి ఉనికియందు నమ్మకముంచేవారు. (రోమీయులు 1:20) “దేవుడు,” ఏ దేవుడైనా అనే పదానికి ఆకాన్ పదం ఒన్యామా. అయినప్పటికీ, ఆకానీయులకు సృష్టికర్తను వర్ణించేందుకు ఆ పదం సరిపోనట్టుగా అనిపించింది. కనుక, వారు ఆయనను ఓన్యాన్‌కాపోన్ అని పిలుస్తారు, “ఆయన మాత్రమే మహోన్నతుడైన దేవుడు” అని దాని భావం.
వారు అల్పులైన దేవుళ్ళను ఆరాధించేవారు, అది మహోన్నతుడైన దేవుని ఏర్పాటని వారు నమ్మేవారు. ఇది పరమోన్నతాధికారి తనకన్నా తక్కువ అధికారం గల అధికారుల చేత సేవించబడడం వంటిదని వారు భావించేవారు. ఏవిధంగానైనా, ఆకానీయుల పిల్లవానికి ఈ మత విశ్వాసం బోధించబడేది.
నేడు పారంపర్యాలను గూర్చిన విద్యాభ్యాసం
ఇటీవల సంవత్సరాల్లో లక్షలాది మంది ఆఫ్రికా దేశస్థులు పెద్ద నగరాలకు వలస వెళ్ళారు, అక్కడ తరగతి గదిలో నియత విద్యా బోధన ఉంటుంది, అది పారంపర్య రీతిలో ఉన్న విద్యాబోధన స్థానాన్ని దాదాపు తీసుకుంది. అయినప్పటికీ, పారంపర్యాల ప్రకారం ఉన్న ఆఫ్రికా పాఠశాల కొన్ని సమాజాల్లో ముఖ్యంగా పట్టణాల్లో పురోభివృద్ధిని సాధిస్తూనే ఉంది. అంతెందుకు, కొందరు ఆఫ్రికా దేశస్థులు పారంపర్య ప్రకారమైన మరియు నియత విద్యాభ్యాసాల నుండి కూడా ప్రయోజనం పొందారు!
ఉదాహరణకు, ఘానాలోని ఆల్‌ఫ్రెడ్ అనే పేరు గల క్రైస్తవ పరిచారకుని విషయమే తీసుకోండి. ఆయన నియత విద్యాభ్యాసాన్ని పొందినప్పటికీ, పారంపర్యం ప్రకారమున్న జీవిత విధానంలోని అనేక అంశాల ఎడల ఆయనకు ఎంతో గౌరవముంది. ఆల్‌ఫ్రెడ్ ఈ విధంగా చెబుతున్నాడు: “నిరక్షరాస్యులైన నా బంధువులు చాలా మందికి పారంపర్యాల ప్రకారమున్న తర్ఫీదే ఉన్నప్పటికీ, జీవితంలోని ఆచరణాత్మకమైన విషయాల్లో వారు చాలా మంచి ఉపాధ్యాయులు. వారిలోని తోటి క్రైస్తవులతో నేను పని చేయడం వల్ల సరళమైన సూటియైన విధానంలో వర్తమానాన్ని అందించే ఫలవంతమైన అనేక మార్గాలను నేను నేర్చుకున్నాను. అలా నేను పారంపర్య పూర్వోపరాలు గలవారితోను మరియు నియత విద్యాభ్యాసం గలవారితోను మాట్లాడగలను. తరచూ, ఈ ప్రజలు ఉపయోగించే సామెతను లేదా ఉదాహరణను తీసుకుని, దానికి మరింత మెరుగులు దిద్ది, దానిని నా బైబిలు ప్రసంగాల్లో కలిపేవాడ్ని. ఇది వినే ప్రేక్షకులు తరచూ ఉత్సాహంతో కరతాళ ధ్వనులను చేసేవారు! అయితే, నిజానికి, ఆ ఘనత అంతా పారంపర్యంగా తర్ఫీదునొందిన ఈ స్త్రీ పురుషులకే చెందాలి.”
ఆఫ్రికా పాఠశాల తిరస్కారాన్ని కాదు గాని, గౌరవాన్నే ఆకర్షించే ఎన్నో ప్రశంసనీయమైన అంశాలను కలిగి ఉంది. ఇది సాంకేతికమైన అద్భుతాలనేమీ సృష్టించకపోవచ్చు, కాని పటిష్ఠమైన కుటుంబ నిర్మాణాన్ని, సమాజంలో ఒకరనే భావనను, శ్రద్ధగల మనస్సును, ఆకర్షణీయమైన హాస్యరస భావాన్ని, ఉదార స్వభావాన్ని, ఆతిథ్య గుణాన్ని కలిగించింది. అయితే, ఆఫ్రికాలోని పట్టణవాసులు గ్రామాల్లో నివసిస్తున్న బంధువులను అప్పుడప్పుడు దర్శించడం ద్వారా వారితో గల సంబంధాన్ని కాపాడుకోవడంలో ఆశ్చర్యం లేదు. అలాంటి సందర్భాల్లో ఇబ్బందిగా అనిపించే క్షణాలు లేకుండా పోవు. నగరవాసులు తరచూ పారంపర్య విధానాల విషయానికొచ్చే సరికి తొట్రుపడతారు. ఉదాహరణకు, ఒక గుంపుతో కరచాలనం చేసేటప్పుడు కుడివైపు నుండి ఎడమ వైపుకు వెళ్ళడమే “సరైన” పద్ధతి అని వారికి తరచూ తెలియదు. అయినప్పటికీ, అలాంటి సందర్శనలు ఇరుపక్షాల వారికి ఆహ్లాదకరంగా ఉంటాయి.
అయితే, ఆఫ్రికా పారంపర్య పాఠశాల గౌరవాన్ని, భక్తిని నేర్పించినప్పటికీ అది యెహోవాను మరియు ఆయన కుమారున్ని గూర్చిన జీవాన్నిచ్చే జ్ఞానాన్ని అందివ్వలేదు. (యోహాను 17:3) ఆకాన్ మరియు ఆకాన్‌లోని ఇతర జాతుల గుంపులతో ఈ ప్రాముఖ్యమైన జ్ఞానాన్ని అందించే పనిచేయడానికి యెహోవాసాక్షులు ఆధిక్యతనొందారు. వారు నియత విద్యాభ్యాసం పొందని వేల కొలది ఆఫ్రికా దేశస్థులు తాము దేవుని వాక్యాన్ని స్వయంగా పఠించగలిగేందుకు చదవడానికి వ్రాయడానికి నేర్పించారు. “తమ ఆత్మీయ అవసరతలందు శ్రద్ధగల” వారి కొరకు, ఒక వ్యక్తి పొందే సాధ్యతగల అతి ప్రాముఖ్యమైన విద్యాభ్యాసమిది.—మత్తయి 5:3, NW.
[25వ పేజీలోని చిత్రాలు]
ఆకానీయుల పిల్లవానికి సమాజం ఎడల తనకున్న బాధ్యత తెలియజేయబడేది
[26వ పేజీలోని చిత్రం]
యెహోవాసాక్షుల రాజ్యమందిరాలు అక్షరాభ్యాస తరగతులను జరుపుతున్నాయి