ప్రపంచ పరిశీలన
పిల్లలు మాదక ద్రవ్యాలకు బానిసలవ్వడానికి కారణం
“మన పిల్లలు మాదక ద్రవ్యాలకు మరియు మద్యానికి అలవాటుపడకుండా ఎలా కాపాడుకోవచ్చు, ఇతరులతో ‘వద్దు అని చెప్పడం’ సులభమని కొందరు పిల్లలెలా కనుగొన్నారు?” అమెరికాలోని అరిజోనా విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు చేసిన అధ్యయనంలో కొన్ని సాధ్యమైన జవాబులను కనుగొన్న పేరెంట్స్ అనే పత్రికలో ఈ ప్రశ్నలు ఇటీవలే లేవదీయబడ్డాయి. ఈ అధ్యయనం ఆరు, ఏడు తరగతుల్లోని దాదాపు 1,200 పిల్లలను పరిశోధించి, మాదక ద్రవ్యాలు మరియు మద్య పానీయాల దురుపయోగం చేసేందుకు పిల్లలను ప్రేరేపిస్తున్నదని అనుమానించబడిన అపాయకరమైన పది విభిన్న కారణాలపై శ్రద్ధను కేంద్రీకరించింది. “తోటివారి ఒత్తిడి, మద్యాన్ని లేదా మాదక ద్రవ్యాలను ఉపయోగించే స్నేహితులుండడం అనేవి సందేహించబడుతున్న” రెండు ముఖ్యమైన కారణాలు. మరొకవైపు, విద్యాభ్యాస విజయం ఆత్మగౌరవాన్ని పెంచి, మత్తుమందులను ఉపయోగించేవారితో స్నేహాన్ని పెంపొందించకుండా ఉంటుంది గనుక, అదొక నివారణోపాయంగా ఉండగలదని ఆ అధ్యయనం కనుగొనింది.
భయానకమైన వాటి ఎడల భ్రమ
“యౌవనారంభంలోని పిల్లలు భయానకమైన వాటికి బానిసలయ్యారు” అని కెనడాలోని ది గ్లోబ్ అండ్ మెయిల్ అనే పత్రిక నివేదిస్తుంది. “భయానకమైన చిత్రాల కార్డులు, హాస్య రచనలు, ఆర్ట్‌వర్క్‌లు, చలన చిత్రాలు మరియు సంగీతం యౌవనుల మధ్య బాగా ప్రచారంలో ఉన్నాయి.” భయంకరమైన వాటిని చదవాలన్న అలాంటి ఇష్టాన్ని తీర్చేందుకు, ఒక ప్రకాశకుడు యౌవనారంభంలోని పిల్లల కొరకైన భయానకమైన పుస్తకాలను సంవత్సరానికి నాలుగుకు బదులు నెలకొకటి చొప్పున ప్రచురించాడు. ఇతర ప్రకాశకులు నెలకు రెండు చొప్పున చేశారు. భయంకరమైన వాటి ఎడల అంత భ్రమ ఎందుకు? రచయితయైన షాన్ రాన్ ప్రకారం, “చరిత్ర దృష్ట్యా సుస్తిగా మరియు అసంతోషంగా ఉన్నప్పుడు భయానకం అనేది మరింత జనసమ్మతిని పొందుతుంది.” ద గ్లోబ్ ప్రకారం ర్యాన్‌గారు ఈ విధంగా చెబుతున్నారు: “తొంభయవ పడిలో మనం ప్రభుత్వాల వల్ల, అసంతోషం వల్ల, భయంకరమైన నేరాల వల్ల అసంతృప్తిచెందామన్నది స్పష్టం. ఈ సమయాల్లో భయానకమైనవి జనసమ్మతమౌతాయి.”
చేతులు సరిగ్గా కడుక్కోవడం
మీరు క్రమంగా చేతులు కడుక్కోవడం వల్లనే “జలుబు, ఫ్లూ, గొంతు పడిశెము, కడుపులో వికారములకు, మరింత తీవ్రమైన వ్యాధులకు కారణమయ్యే క్రిములను వైరసులను తొలగించడానికి సహాయపడుతుంది” అని వైద్యులు చెబుతున్నారని ద టొరొంటో స్టార్ నివేదిస్తుంది. “మోంట్రియల్ ఎపిడెమియోలజిస్టయిన డా. కూలియో సాటో చెప్పేదేమంటే చేతులను బాగా కడుక్కోవడం అనేది వైరసుల వల్ల, బ్యాక్టీరియాల వల్ల సోకే వ్యాధులకు—అంటే పై భాగంలోని శ్వాసావయవ వ్యాధులను 54 శాతం మరియు అతిసార వ్యాధులను 72 శాతం వరకు గోచరమయ్యేంత పరిమాణంలో తగ్గిస్తుంది.” కెనడియన్ పెడియాట్రిక్ సొసైటీ చెప్పేదేమంటే చేతులను సరిగ్గా కడుక్కోవడంలో నీటి పంపు క్రింద చేతులుంచి, 30 అని ఎంచేదాక చేతులను సబ్బుతో బాగా రుద్ది, టాపు తెరిచిపెట్టి 5 అని ఎంచేదాక కడగాలి. చివరికి, ఎవరూ ఉపయోగించని తువాలుతో చేతులను తుడుచుకోవాలి, లేదా పేపర్ టవల్‌ను లేదా హ్యాండ్స్ ఫ్రీ డ్రయర్‌ను ఉపయోగించాలి. రెస్టారెంట్లలోను వేడివేడి తినుబండారాలు అమ్మే బండ్లలోను భోజనశాలల్లోను ఆహారాన్నందించేవారు చేతులు కడుక్కోవడంలో ఎక్కువ శ్రద్ధ చూపించాలి.
పేదప్రజల పరిస్థితి
డెన్మార్క్‌లోని కోఫెన్‌హాగన్‌లో ఇటీవల జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశంలోని సాంఘిక అభివృద్ధి కొరకైన ప్రపంచ సమ్మేళనం ప్రకారం, లోకమంతటా ఉన్న గ్రామీణ బీద ప్రజలు దుర్భర పరిస్థితిలో ఉన్నారు. ఆ సమ్మేళనంలో ఏమని నివేదించబడినదంటే, ప్రజలు విపరీతమైన దారిద్ర్యంలో జీవిస్తున్నారు, వీరిలో సగం మంది ప్రతిరోజు పస్తులుంటున్నారు. ఈ సమస్యకు కారణం నిరుద్యోగమే. నిరుద్యోగుల మొత్తం సంఖ్య లేదా సరిగ్గా పని లేని వారి సంఖ్య దాదాపు 80 కోట్ల వరకూ ఉందని అంచనా. మొత్తం మీద గమనిస్తే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగం చేయగల వారిలో 30 శాతం మందిని ఫలవంతమైన విధంగా ఉపయోగించుకోవడంలేదు. ప్రతిరోజు 110 కోట్ల నుండి 130 కోట్ల మంది ప్రజలు ఒక (అమెరికా) డాలర్ కన్నా తక్కువ డబ్బుతో బ్రతుకుతున్నారు. ఈ సమస్యను కచ్చితంగా మరింత తీవ్రతరం చేస్తున్న నిరక్షరాస్యత ఇప్పుడు దాదాపు 90.5 కోట్ల మంది ప్రజలను బాధిస్తుంది. వారి సంఖ్య త్వరగా తగ్గడం లేదు; 13 కోట్ల మంది పిల్లలు యోగ్యతగల వారైనప్పటికీ పాఠశాలకు వెళ్ళడం లేదు, మరి వారి సంఖ్య 2000 సంవత్సరం నాటికి 14.4 కోట్లకు చేరుతుందని అంచనా వేయబడుతుంది.
తరువాతి జీవితమా లేక భ్రమనా?
ప్రసార సాధనాలు తరచూ “మరణాన్ని సమీపించిన అనుభవాలను” గూర్చిన కథలను ప్రసారం చేస్తున్నాయి, ఆ కథల్లో మరణాన్ని సమీపించిన రోగులు తాము తరువాతి జీవితాన్ని చవి చూశామని వాదిస్తారు. ప్రాణవాయువు తగ్గి, భ్రమ కలగడం వల్లే ఇలాంటి అనుభవాలు కలుగుతాయని జర్మనీలోని నాడీశాస్త్రజ్ఞుల జట్టు చేసిన ప్రయోగాలు ఇటీవల తెలిపాయి. డి గూయ్ ఎన్ ఎమ్‌లాండర్ అనే డచ్ వార్తా పత్రిక ప్రకారం, అమిత గాలివెలుతురు ద్వారా మహా అంటే 22 సెకండ్ల వరకు అచేతనంలోకి తీసుకువెళ్ళబడిన 42 మంది ఆరోగ్యవంతులైన యువకులను ఈ జట్టు అధ్యయనం చేసింది. తరువాత, ఆ యువకులు ఆశ్చర్యకరంగా “మరణాన్ని సమీపించిన అనుభవాల” వంటి భావోద్వేగాలను, దర్శనాలను గూర్చి వర్ణించారు. కొందరు యువకులు మరింత ముదురు రంగులను మరియు కాంతులను చూసినట్లు, తమను తాము పైనుండి చూసినట్లు, తమ ప్రియమైనవారిని ఆహ్లాదకరమైన పరిస్థితుల్లో చూసినట్లు, ఇలాంటి మరెన్నింటినో చూస్తున్నట్లు నివేదించారు. అనేక మంది యౌవనస్థులు తాము చేతనంలోనికి తిరిగి రావడానికి కోరుకోని విధంగా భావోద్వేగాలు ఆనందదాయకంగాను, సమాధానపూర్ణంగాను ఉన్నాయని వర్ణించారు.
సగం భూమి ఇప్పటికీ నిర్మానుష్యంగా ఉంది
“మానవుడు ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ, భూగ్రహంలోని సగం భూమి ఇప్పటికీ నిర్మానుష్యంగానే ఉంది” అని న్యూ సైంటిస్ట్ పత్రిక నివేదిస్తుంది. క్రొత్త అధ్యయనం “తొమ్మిది కోట్ల చతురస్ర కిలోమీటర్ల భూమి అంటే భూభాగంలోని దాదాపు 52 శాతం ఇప్పటికీ నిర్మానుష్యంగానే ఉందని కనుగొన్నది.” భూగ్రహంలోని మూడవ వంతు మాత్రమే ఎడారిగా ఉందన్న 1989 సర్వే ఫలితాలకన్నా ఇది ఎంతో అధికంగా ఉన్నదెందుకని? ఎందుకంటే క్రితం 4,000 చతురస్రపు కిలోమీటర్ల ప్రాంతాలను ఉపయోగించుకోగా, అంతర్జాతీయ సంరక్షణ శాఖలోని లీ హాన్నా చేసిన ఇటీవలి అధ్యయనంలో 1,000 చతురస్రపు కిలోమీటర్లంతటి చిన్న ప్రాంతాలను ఇమిడ్చారు. “మరింత లోతైన అధ్యయనం మానవులు నివసించని ఇంకా ఎక్కువ శాతం భూగ్రహాన్ని బయల్పర్చవచ్చు” అని ఆ శీర్షిక చెబుతుంది. అయినను, హాన్నా చెప్పినదేమంటే నివసించని భూమిలోని ఎక్కువ భాగము “బండలతో, మంచుగడ్డలతో, ఎడారి ఇసుక”తో ఉండి మానవులకు, వన్యప్రాణులకు కూడా నివాసయోగ్యం కానిదిగా ఉంది. “భూగ్రహంలోని నివాస యోగ్యమైన దాదాపు మూడు వంతుల కన్నా ఎక్కువ భాగం భూమిని మానవుడు ఉపయోగించుకోవడంతో ప్రకృతి వర్ధిల్లే స్థలం కనిపించకుండా పోయింది” అని ఆయన చెప్పాడు. సర్వేలోని మూడు రకాలు ఏమిటంటే: ప్రజలు నివసించని (52 శాతం) భూమి, కొంతవరకు నివసిస్తున్న (24 శాతం) భూమి మరియు పూర్తిగా ఆక్రమించబడిన (24 శాతం) భూమి.
జంతువుల కొరకు ట్రాఫిక్ లైట్లా?
జంతువులు రోడ్లను దాటడం ఎంతోకాలంగా వాహనాన్ని నడిపేవారికి, జంతువులకూ ఒక పెద్ద అపాయంగానే ఉంటూ వస్తోంది. టెర్ సావేజ్ అనే ఫ్రెంచ్ ప్రకృతి పత్రిక నివేదించేదేమంటే జంతువులు రాత్రులు అడవుల్లోని రోడ్లను దాటిపోయేటప్పుడు కలిగే ప్రమాదాల దృష్ట్యా, ఫ్రెంచ్ నేషనల్ ఆఫీస్ ఆఫ్ ఫోరెస్ట్స్‌లోని టెక్నీషియన్లు ఆశ్చర్యకరమైన ఒక విషయాన్ని కనుగొన్నారు. జంతువులు ఎర్ర లైట్లకు ఆగిపోతాయి! ప్రయోగాలు చూపించేదేమంటే తరచూ రెడ్‌లైట్లు వెలగడం జంతువుల్లో తాత్కాలిక పక్షవాతం కలిగేలా చేయగలదు. ఫ్రాన్సులోని అడవుల్లోని రోడ్ల గుండా వెళ్ళే వాహనాల హెడ్‌లైట్ల కాంతిని పట్టుకునే రెడ్ రిఫ్రెక్టర్లను ఇప్పుడు స్థాపించారు, ఆ వెలుతురు వాహనాన్ని నడిపేవారివైపుకు వెనుకకు పోకుండా, అదంతా వనాంతరాల్లోకి ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు జంతువులు రోడ్డుమీదికి దూకే ముందు, వెలుతురు పోయేవరకు వేచి ఉంటాయి.
పడక మీదే ఉండిపోవడం వలన నష్టాలు
“ఎక్కువ సమయం పడక మీద విశ్రాంతి తీసుకోవడం మేలు కన్నా ఎక్కువ కీడే చేస్తుంది” అని లండన్‌లోని ది టైమ్స్ అనే పత్రిక చెబుతుంది. దాదాపు 50 సంవత్సరాల క్రిత, సర్ రిచర్డ్ ఆషర్ అనే వైద్యుడు ప్రామాణికమైన ఈ చికిత్సా విధానాన్ని ప్రశ్నించి, రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టుకుపోవడం, కండరాల బలం కోల్పోవడం, ఎముకల్లో కాల్షియం లేకపోవడం, మూత్రపిండంలో రాళ్ళు, మలబద్ధకం మరియు కృంగుదల వంటి ఆరోగ్య ప్రమాదాల వైపుకు శ్రద్ధ మళ్ళించారు. ఈ హెచ్చరికను అధ్యయనాలు రూఢిచేసినప్పటి నుండి, రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టుకుపోయి ఆ తరువాత ప్రాణాంతకంగా శ్వాసకోశంలో అడ్డం పడడానికి, చనిపోక ముందు పడక మీద ఎంత కాలం విశ్రాంతి తీసుకోబడింది అనేదానితో నేరుగా సంబంధం ఉందని శవ పరీక్షలు తేల్చాయి. అయితే మరొకవైపు, సయాటికా (శ్రోణి నాడీ వెంబడి వచ్చే నొప్పి)తో పాటు విపరీతమైన నడుం నొప్పి మరియు గర్భధారణ సమయంలో నెలలు గడుస్తున్న కొలది వచ్చే నొప్పి ఉండే సందర్భాల్లో పడుకుని విశ్రాంతి తీసుకోవడాన్ని వైద్యులు సిఫారసు చేశారు. నిజానికి, ఇతర నిజమైన మరియు తీవ్రమైన రోగాలకు, విశ్రాంతి తీసుకోవడం తప్ప మరే ప్రత్యామ్నాయం లేకపోవచ్చు. ఒక్కసారి కోలుకున్న తరువాత, లేవడం కదలడం కోలుకోవడాన్ని త్వరితం చేస్తాయని వైద్యులు నమ్ముతున్నారు.
నిస్సంతు దంపతులకు క్రొత్త నిరీక్షణా?
నిస్సంతు దంపతులు తమ వంధ్యత్వాన్ని అధిగమించేందుకు ఒక క్రొత్త చికిత్సా పద్ధతి సహాయపడుతుందని ఫ్రెంచ్ వార్తా ఏజెన్సీయైన ఫ్రాన్స్ ప్రెస్ నివేదిస్తుంది. డెన్మార్క్‌లో ఆరంభించబడిన ఈ వైద్యశాస్త్రంలో అతి శ్రేష్ఠమైన గాజు సూదిని ఉపయోగించి పురుష బీజ కణాన్ని స్త్రీలోని అండాశయంలోనికి చేర్చడం జరుగుతుంది. ఈ పద్ధతికి పూర్ణజాగ్రత్త మరియు గొప్ప నిపుణత అవసరమున్నప్పటికీ (ఒక బీజకణం ఒక మిల్లీమీటరులో రెండువేల వంతుంటుంది; అండం ఒక మిల్లీమీటరులో పదవ వంతు ఉంటుంది) ఆ పద్ధతి ఫలవంతమైనదని నిరూపించబడింది. అందులో పేరు తెలియని దాతది కాకుండా తన భర్త బీజకణాన్నే ఉపయోగిస్తూ స్త్రీ శరీరంలోనికి చేర్చే అవకాశం ఉంది—అలా భావోద్రేక నైతిక మరియు మతపరమైన ప్రశ్నలను నివారించవచ్చు. ఎందుకంటే తక్కువ గుణము గల బీజకణము నిస్సంతు దంపతుల్లోని మూడు వంతుల మంది వంధ్యత్వానికి కారణం. ఈ పద్ధతిని ఉపయోగించే ఒక వైద్యుడు భావించేదేమంటే అనేకమంది దంపతులు కుటుంబాలను ప్రారంభించడానికి నవీకరించబడిన ఆశలను కలిగి ఉండవచ్చు.