మా పాఠకుల నుండి
విసుగు “మీ జీవితం విసుగ్గా ఉందా? మీరు దాన్ని మార్చుకోగలరు!” (ఫిబ్రవరి 8, 1995) అనే శీర్షికల పరంపరను చదివాను, అది నాకెంత సహాయపడిందో నేను మీకు చెప్పవలసిందే. నేను విసుగెత్తానని నేనెన్నడూ అనుకోలేదు, కాని విసుగు కలిగించే దినచర్యవల్ల నా జీవితంలో నేనెంతో అసంతృప్తిని పొందాను. ఈ శీర్షిక నేను పూర్తిగా క్రొత్త కోణం నుండి విషయాలను పరిశీలించేలా చేసింది.
ఎస్. వి., అమెరికా
నాజీ అధికారాన్ని నిరాకరించుట “మేము హిట్లర్ యుద్ధానికి మద్దతునివ్వలేదు” (నవంబరు 8, 1994) అనే శీర్షికను చదివి చలించిపోయాను. నాజీ అధికారానికి మద్దతునిస్తున్న ఆరుగురు బిషప్పుల “సత్యనిష్ఠాప్రకటన” గూర్చిన చిత్రం కూడా అందులో ఉంది. నేను 1928లో జెస్యూట్ విద్యార్థినై ఉన్నప్పుడు నాతో ప్రమాణ స్వీకారం చేయించిన వ్యక్తి ఆ బిషప్పులలో ఒకరు. క్రైస్తవ విశ్వాసంలో ఎలా దృఢంగా ఉండాలో తనకే తెలియని వ్యక్తి “ప్రమాణం” చేపించడం అంటే నాకు నవ్వొస్తుంది! ఆ యుద్ధం కాథోలిక్ చర్చితో ఉన్న నా బంధాన్ని తెంచివేసింది. నేను నా స్వంత దేశాన్ని కూడా వదిలిపెట్టాను. నేను నా స్వంత మార్గంలో యుద్ధాన్ని ఎదిరించడానికి ప్రయత్నించినప్పటికీ, నాకు వోల్‌ఫార్ట్ కుటుంబానికున్నంతటి స్థయిర్యం లేకుండా పోయింది. తుపాకీలను పట్టుకోవడానికి నిరాకరించిన ఇద్దరు యెహోవాసాక్షులను గూర్చి నాకిప్పటికీ జ్ఞాపకముంది. వారు వెంటనే చంపబడ్డారు. నేను అలాంటివారిని ప్రశంసిస్తాను.
పి. కె., చిలీ
శిశువుతోపాటు నిద్రపోవడం మీ ఆగస్టు 8, 1994 సంచికలో డా. జేమ్స్ మ్యాక్‌కెన్నా నివేదికను గూర్చి ఎత్తివ్రాసినదాన్ని మేము గమనించాము. (“ప్రపంచ పరిశీలన”) తల్లులు తమ పిల్లలతో పడుకోవడం ఎస్.ఐ.డి.ఎస్ (సడన్ ఇన్‌ఫన్ట్ డెత్ సిన్‌డ్రొమ్ అంటే ఆకస్మిక శిశు మరణము)ను తగ్గిస్తుందని అది చెప్పింది. తలిదండ్రులు తాము నిద్రపోయేటప్పుడు తమ పిల్లలను ప్రక్కలో పడుకోబెట్టుకుంటే ఆకస్మిక శిశు మరణం సంభవించే ప్రమాదం మరీ ఎక్కువగా ఉందని ది న్యూజీలాండ్ కాట్ డెత్ అనే అధ్యయనం తెలిపింది.
డా. ఎస్. ఎల్. టి., న్యూజీలాండ్
ఈ సమాచారాన్నిబట్టి మీకు కృతజ్ఞతలు. డా. మ్యాక్‌కెన్నా ఇటీవలే తన దృక్కోణాన్ని స్పష్టం చేశాడు, తల్లి తన బిడ్డతో నిద్రపోయేటప్పుడు శిశువుకు ఆకస్మికంగా ఊపిరి ఆడకపోయే ప్రమాదాలు ఉన్నాయని గ్రహించాడు. (1 రాజులు 3:19 పోల్చండి.) కనుక చాలామంది డాక్టర్లు తన బిడ్డతో నిద్రపోవడాన్ని నిరుత్సాహపరుస్తూ దిండ్లు, గట్టి బొంతలు లేని ఊయలలో పడుకోబెట్టాలని సిఫారసు చేశారు.—ఎడిటర్.
తేనెటీగకు కంప్యూటర్‌కు పోటీ “తేనెటీగకు కంప్యూటర్‌కు పోటీ” అనే శీర్షికకు నేను కృతజ్ఞతలు చెప్పాలి. (ఫిబ్రవరి 8, 1995) ఈ శీర్షిక నా హృదయాంతరాలను ఎంతగానో స్పర్శించింది. తేనెటీగ వంటి చిన్న జీవులను కూడా మన మహోన్నత సృష్టికర్త అద్భుతంగా విశేషంగా సృజించాడు.
సి. కె., జర్మనీ
స్వయంశ్లాఘన “స్వయంశ్లాఘన—వెర్రితనపు సవాళ్లను ఎదుర్కొనుట” అనే శీర్షికను బట్టి మీకు ఎంతో కృతజ్ఞతలు. (ఫిబ్రవరి 8, 1995) మా సంఘంలో స్వయం శ్లాఘించుకొనే ఒకబ్బాయి ఉన్నాడు, నాకు అతడంటే చాలా ఇష్టం. స్వయంశ్లాఘనను గూర్చి అర్థం చేసుకోవడానికి నాకు ఈ శీర్షిక సహాయపడింది. అతనితోను అతని తల్లితోను కొంత సమయం గడపడం ద్వారా నేను సహాయపడగలనని ఇప్పుడు నాకు తెలుసు.
ఎ. ఎఫ్., జపాన్
మా కూతురు స్వయం శ్లాఘించుకునేది కాదు, కాని ఆమెకు అలాంటి లక్షణాలు ఉన్నట్లు కనబడుతున్నాయి. అనేకమంది పిల్లలకు గల సమస్యలను గూర్చి ప్రజలకు మీరు తెలియజేస్తున్నందువల్ల నాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాంటి పిల్లలను జీవించడానికి యోగ్యతగలవారిగా ప్రజలు ఎంచినప్పుడు అది ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ‘నేను మీ గురించి విచారిస్తున్నాను’ లేదా ‘మీరు చేసేటట్లు నేను చేసి ఉండను’ అనేటటువంటి వ్యాఖ్యానాలు బలపరచేవిగా ఉండవు. మా కూతురు సంతోషంగా ఉంది, కొన్నిసార్లు మిగిలిన మా పిల్లలు మా పై ఎక్కువ ఒత్తిడిని తెస్తారు. ఆమె పుట్టినందుకు మేము బాధపడం.
ఎల్. హెచ్., అమెరికా