ఋతుస్రావ పూర్వపు సిండ్రోమ్—కట్టుకథా లేక వాస్తవమా?
ఆమె ప్రవర్తన ఊహించలేనిది మరియు అంచనా వేయలేనిది. ఒక క్షణం ఆమె అంగీకరిస్తుంది; మరుక్షణం ఆమె వాదిస్తుంది. ఆమె నిరాశతో నిండిన మాటల్ని పలుకుతుంది. మీరు ఓదార్పుకరంగా మాట్లాడినప్పటికీ, మీరు చెప్పే దానికి, చేసే దానికి ఆమె అతిగా ప్రతిస్పందిస్తుంది. ఒక చిన్న వివాదం అతిపెద్ద సుడిగాలిగా మారి అగ్నికి ఆజ్యం పోయగలదు. కొన్ని రోజులు లేక దాదాపు ఓ వారం తర్వాత, ఈ “వేరే” స్త్రీ అకస్మాత్తుగా అంతర్దానమైపోతుంది, మరి కొన్ని రోజుల వరకు ఆమె తన . . . మామూలు ధోరణిలో ఉంటుంది.
అందరు స్త్రీల ప్రవర్తన ఇలా అతిగా మారిపోదన్న విషయాన్ని ఒప్పుకోవలసిందే. అయితే, ఋతుస్రావం రాడానికి కొంత ముందు, తమలో అలాంటి మార్పులను కొందరు స్త్రీలు గుర్తించి ఉండవచ్చు. అలాంటి మూడ్ మార్పులను ఏది కలిగిస్తుంది? అలాంటి ప్రవర్తన వాస్తవంగా ఋతు చక్ర సమయంలో వచ్చే మార్పుల ఫలితమేనా?
పి.ఎమ్.ఎస్ అంటే ఏంటి?
అమెరికా యొక్క మనస్తత్వశాస్త్ర పత్రిక ప్రకారం, “అనుదిన జీవిత పనులను ప్రభావితం చేసేంతటి తీవ్రమైన మరియు పునరావృతమయ్యే సూచనలను” ఏ స్త్రీ అయినా అనుభవిస్తుంటే మరి అవి ఎప్పుడూ ఋతుస్రావానికి ముందు సంభవిస్తే ఆమె పి.ఎమ్.ఎస్ (ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్) లేక ఋతుస్రావ పూర్వపు సిండ్రోమ్‌ను అనుభవిస్తుందన్న మాట. పి.ఎమ్.ఎస్‌ను గుర్తించడానికి పరిశోధనశాల పరీక్షలేమి లేనప్పటికీ, పి.ఎమ్.ఎస్ ఉన్న స్త్రీలు ప్రతి రెండు ఋతు చక్ర సమయాల మధ్యలో ఒకటి లేక రెండు వారాలపాటు ఎటువంటి సూచనలు అనుభవించకుండా ఉండాలి. ఈ నిర్వచనం ప్రకారం, కేవలం 10 శాతం మంది స్త్రీలు మాత్రమే పి.ఎమ్.ఎస్తో బాధపడుతున్నారని వైద్యులు అంచనావేశారు.
ఇతర వైద్యులకు పి.ఎమ్.ఎస్ అంటే భిన్నాభిప్రాయం ఉంది. మరి 40 నుండి 90 శాతం మంది, అంటే చాలా శాతం మంది స్త్రీలు పి.ఎమ్.ఎస్తో బాధపడుతున్నారని వారు వాదిస్తున్నారు. బరువు ఎక్కువ అవ్వడం, అలసట, కీళ్ల నొప్పి, కడుపు నొప్పి, తలపోటు, వికారం, చిరాకు, స్తనాల నొప్పి, ఎక్కువగా ఏడుపు రావడం, తిండి తినాలన్న అత్యాశ, మూడ్ మారిపోతుండటం వంటి విభిన్న సూచనలను అనుభవించడం వంటివాటిని ఆ పద నిర్వచనంలో ఇముడ్చుతున్నారు. పి.ఎమ్.ఎస్ సూచనలకు 150 కంటే ఎక్కువ సూచనలు కలుపబడుతున్నాయి. ఇప్పుడు ఋతుస్రావం ఇక జరగని స్త్రీలతోపాటు అందరు ఈ సూచనల్లో వేటినైనా లేక చాలావాటిని అనుభవించవచ్చు. అయితే, ఒక స్త్రీ సాధారణంగా తన 30వ పడిలో పి.ఎమ్.ఎస్‌ను అనుభవిస్తుంది. అనేకమంది స్త్రీలకు పి.ఎమ్.ఎస్ సూచనలు చాలా కష్టాన్ని కలిగిస్తాయి కానీ వాటిని అదుపు చేసుకోవచ్చు. కొంచెం తక్కువ తీవ్రమైన పి.ఎమ్.ఎస్తో బాధపడుతున్న వారిని గురించే ఈ శీర్షికలో మేము చర్చిస్తున్నాము.
మిచిగాన్ విశ్వవిద్యాలయంలో పరిశోధకురాలైన నాన్సీ రీమ్, పి.ఎమ్.ఎస్ అమెరికాలో “మామూలు ఆరోగ్య సమస్యగా” పరిగణింపబడుతుందని, అయితే ఇతర దేశాల్లో సూచనల రకం మరియు తీవ్రత విషయంలో అనేక తేడాలు ఉన్నాయని నివేదించింది. “కొందరు చాలా ప్రాముఖ్యమైన భౌతిక సూచనలను గురించి చెబుతున్నారు, మరి ఇతర సాంప్రదాయాల వారు ఎక్కువ భావోద్రేక సూచనలను నివేదిస్తున్నారు,” అని ఆమె చెప్పింది. చైనాలో పరిశోధన జరిపిన రీమ్ చైనా వారిని ఉదాహరణగా చెప్పింది. “చైనా వారి సాంప్రదాయంలో భావోద్రేక సూచనలను కలిగుండటాన్ని అంగీకరించరు.” దాని ఫలితంగా, ఋతుస్రావ సమస్యలను గురించి అడిగినప్పుడు స్త్రీలు నొప్పులపై అవధానాన్ని నిలుపుతారని ఆమె పేర్కొన్నది.
పి.ఎమ్.ఎస్ ప్రారంభాలు
“ఋతుస్రావ పూర్వపు ఉద్రేకానికి హార్మోన్ల కారకాలు” అన్న తన వ్యాసంలో 1931 నందు న్యూయార్క్‌కు చెందిన డా. రాబర్ట్ టి. ఫ్రాంక్ పి.ఎమ్.ఎస్‌ను గురించి మొదట చర్చించాడు. ఋతుస్రావానికి ముందు అలసట, ఏకాగ్రత లేమి మరియు నరాల ఉద్రిక్తతతో బాధపడిన స్త్రీలను ఆయన గమనించాడు.
ఆంగ్లేయ వైద్యులైన కాథరీనా డాల్టన్ మరియు రేమండ్ గ్రీన్ 22 సంవత్సరాల తర్వాత వైద్య పత్రికలో ఒక వ్యాసాన్ని వ్రాసి అందులో “ఋతుస్రావ పూర్వపు సిండ్రోమ్ (ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్)” అనే పదాన్ని నూతనంగా కల్పించారు. “ప్రపంచంలోని అతి సాధారణమైన మరి బహుశా పురాతనమైన జబ్బు” అని డా. డాల్టన్ పి.ఎమ్.ఎస్‌ను గురించి సూచించింది. స్త్రీ ప్రవర్తనపై పి.ఎమ్.ఎస్ కలిగుండగల్గే ప్రభావాన్ని గురించిన ఆమె పరిశోధనా ఫలితాలు 1980లో ప్రజలకు తెలిశాయి. హంతకులుగా ఆరోపించబడిన ఇద్దరు బ్రిటీష్ స్త్రీలను పరీక్షించమని ఆమె, మరితర వైద్యులు పిలువబడ్డారు. స్త్రీ ఋతుచక్ర సమయంలో జరిగే హార్మోన్ల మార్పిడి ఆమె ప్రవర్తనను ప్రభావితం చేయగలదని వారు నిర్థారించి చెప్పారు. వారి పి.ఎమ్.ఎస్ పరీక్షలపై ఆధారపడి, ఈ రెండు కేసుల్లోని నేరారోపణలను మినహాయించారు. ఒక నిర్ణయంలో, “తగ్గించబడిన బాధ్యత” అనే ఆధారంగా, ప్రతివాది నరహత్యకు తక్కువ శిక్ష పొందింది.
ముందు సూచింపబడినట్లు స్త్రీలు వినాశకరమైన ప్రవర్తన కలిగుండే సందర్భాలు ఒకటి లేక అర మాత్రమే. రెండు ఋతుస్రావ సమయాల్లో మరియు ఆ మధ్యలో అలాంటి ప్రవర్తనను గురించి మరియు అనేకమంది స్త్రీలు అనుభవించే స్వల్ప కష్టతరమైన సూచనలను గురించి వైద్యానికి సంబంధించిన, సంబంధించని పత్రికల్లో వాదన కొనసాగుతూనే ఉంది.
అయితే అలాంటి ప్రవర్తన వాస్తవంగా స్త్రీ శరీరంలోని ఆవృత్తమయ్యే హార్మోన్ల హెచ్చుతగ్గుల ఫలితంగా వచ్చిందేనా? లేక హార్మోన్లు చెలరేగడం మరియు అసంబద్ధంగా ఉండే స్త్రీ శరీరాన్ని గురించిన ఆలోచన కేవలం కట్టు కథా? ఒకవేళ హార్మోన్ల హెచ్చుతగ్గులు స్త్రీ ప్రవర్తనపై ప్రభావం కలిగి ఉంటే అవి ఎంత మేరకు అన్న విషయాన్ని గురించి చాలా భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఋతుచక్ర సమయంలో మెదడు మరియు అండాశయ హార్మోన్ల మధ్య జరిగే ప్రతిక్రియను గురించిన శ్రేష్ఠమైన అవగాహన, కొందరు స్త్రీలు పి.ఎమ్.ఎస్ వలన ఎందుకు బాధపడతారో తెలుసుకోవడంలో ఒక కీలకంగా ఉండగలదని అనేకమంది పరిశోధకులు మరియు వైద్యులు అంగీకరిస్తున్నారు.
ఋతుచక్రం
ప్రతి నాలుగు వారాలకు ఒకసారి, స్త్రీ శరీరం అత్యంత సంక్లిష్ట హార్మోన్ల హెచ్చుతగ్గుల వృత్తానికి లోనౌతుంది. అనేకుల చేత “శాపం” అని పిలువబడే పదమైన “ఋతుస్రావం (మెన్స్ట్రువేషన్)” “నెల (మంత్)” అనే భావమున్న లాటిన్ పదమైన మెన్సిస్ నుండి వచ్చింది.
చక్రాన్ని ప్రారంభించడానికి, పీయూష గ్రంథికి మెదడు యొక్క హైపోథలమస్ వర్తమానం పంపుతుంది. ఆ వర్తమానాన్ని అందుకున్నప్పుడు, పీయూష గ్రంథి ఎఫ్.ఎస్.హెచ్ (ఫాలికల్లను లేక ఏక విధారక ఫలములను ప్రేరేపించే హార్మోన్లను) స్రవిస్తుంది. ఎఫ్.ఎస్.హెచ్ రక్తం ద్వారా అండాశయాలకు ప్రయాణించి ఈస్ట్రోజన్ ఉత్పత్తిని ప్రారంభిస్తుంది. ఈస్ట్రోజన్ ఎక్కువవుతుండగా, ఎల్.హెచ్ (లూటియనైజింగ్ హార్మోను) పంపడం ద్వారా పీయూష గ్రంథి ప్రతిస్పందిస్తుంది. ఎఫ్.ఎస్.హెచ్ స్రవించడాన్ని ఎల్.హెచ్ తగ్గిస్తుంది. ఒక అండం ఫలదీకరణం చెంది గర్భం వరకు ప్రయాణిస్తుంది. అండం విడువబడినప్పుడు, ప్రోజెస్టరాన్ అనే హార్మోను స్రవిస్తుంది. అండం ఫలధీకరణం చెందకపోతే, ప్రోజెస్టరాన్ మరియు ఈస్ట్రోజన్ శాతం త్వరగా తగ్గిపోతుంది.
తనకు మద్దతు ఇచ్చే హార్మోన్లు లేకపోవడంతో అండాశయ పొర విచ్ఛిన్నమై, యోని (వజైనా) ద్వారా రక్తం, ద్రవం మరియు కొంత ధాతువు విసర్జింపబడుతుంది. ఒక ఋతుచక్రాన్ని ముగిస్తూ స్త్రీ గర్భాశయ పొర పూర్తిగా విచ్ఛిన్నమవ్వడానికి మూడు నుండి ఏడు రోజులు పడతాయి. ఒక చక్రం ముగియగా, మరో క్రొత్త వృత్తాన్ని ప్రారంభించడానికి మెదడు మళ్లీ హార్మోన్లను విడుదల చేస్తుంది.
హార్మోన్ల యుద్ధమా?
ఈస్ట్రోజన్ మరియు ప్రోజెస్టరాన్ల అసమతుల్యతే స్త్రీలో ఋతుస్రావ పూర్వపు సిండ్రోమ్‌ను ఉత్పన్నం చేస్తుందని కొందరు వాదిస్తున్నారు. సరైన సమతుల్యాన్ని పొందడానికి సాధారణంగా హార్మోన్లు కలిసి పనిచేస్తాయని వారు నొక్కి చెబుతున్నారు. ఒకదాని కంటే మరొకటి ఎక్కువ ఉత్పత్తి అయినప్పుడు ఒక యుద్ధం జరుగుతుంది, మరి యుద్ధంలో హతమైనవి స్త్రీ శరీరంలో మిగిలి పోతాయి.
ఈస్ట్రోజన్ శాతం ఎక్కువ అవ్వడం కొందరు స్త్రీలు చిరాకు పడేలా చేయవచ్చు. మరి ఇతరుల విషయంలో ప్రోజెస్టరాన్ అధికశాతమై, వారు కృంగినట్లు మరి అలసి పోయినట్లు భావించేలా చేస్తుంది.
హార్మోన్ల హెచ్చుతగ్గులు పి.ఎమ్.ఎస్‌ను కలిగిస్తాయన్న వాదాన్ని కొందరు పరిశోధకులు అంగీకరించడం లేదు. కొందరు స్త్రీలలో ఋతుస్రావ పూర్వపు సిండ్రోమ్‌ను ఉత్పత్తి చేయడంలో మానసిక మరియు సాంఘిక కారకాలు ఎక్కువ పాత్ర వహిస్తాయని వారు వాదిస్తారు. పి.ఎమ్.ఎస్కుగల కారకాలను గురించి నివేదిస్తూ “తీవ్రమైన పి.ఎమ్.ఎస్ ఉన్నా లేకపోయినా స్త్రీలలో బీజకోశ హార్మోన్ల నమూనా, నిష్పత్తి, మొత్తం సంఖ్య లేక సమయం విషయంలో స్పష్టమైన భేదాలేమి కనుగొనబడలేదని” రోగిపట్ల శ్రద్ధ అనే పుస్తకం పేర్కొన్నది.
ఉదాహరణకు పి.ఎమ్.ఎస్ సూచనలను ఒత్తిడి త్వరితం చేయడం, ఆలస్యం చేయడం లేక తీవ్రతరం చేయడం జరుగవచ్చు. పి.ఎమ్.ఎస్—బుతుస్రావపూర్వపు బాధ మరియు మీరు: వచ్చే నెల వేరుగా ఉండవచ్చు అనే పుస్తకమిలా పేర్కొంటుంది: “ఒత్తిడి హార్మోన్ల విడుదలను ఆటంకపర్చుతుంది మరి హార్మోన్ల తక్కువ విడుదల పి.ఎమ్.ఎస్ సూచనలను విపరీతం చేసే హార్మోన్ల హెచ్చుతగ్గులకు కారణం కాగలదు.” ఋతుస్రావానికి పూర్వం వైద్య, ఆర్థిక లేక కుటుంబ సమస్యలు ఎక్కువ తీవ్రమైనవిగాను మరి వాటితో వ్యవహరించడం సాధ్యం కానట్లుగాను కనిపిస్తాయి.
మచ్చపడి పోతుందేమోనన్న భయం
తన ఋతుస్రావానికి సంబంధించిన సూచనలను తను వెల్లడి చేస్తే ఒక స్త్రీ ఆదర్శప్రాయమైన పనిమంతురాలు లేక నిర్ణయం తీసుకునే వ్యక్తి కాదని భావించబడుతుందని కొందరు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. “స్త్రీలను చిన్నచూపు చూడటానికి సమాజానికున్న ఒక మార్గమది. నెలకొకసారి మీకు ఒంట్లో బాగోలేకపోతే, మీరు బయటకు వచ్చి గంభీరమైన, శక్తివంతమైన, ప్రభావంగల ఈ పనులు చేయకూడదని,” మనస్తత్త్వశాస్త్రజ్ఞురాలైన బార్బారా సోమర్ వాదిస్తుంది.
తమ ప్రవర్తనకు ఒక సాకులా ఆ పరిస్థితిని ఉపయోగించుకోవచ్చు గనుక, స్త్రీలు పి.ఎమ్.ఎస్‌ను అంగీకరించారని కొందరు పరిశోధకులు అంటున్నారు. ఎర్రపుస్తకం అనే పత్రికలోని ఒక పరిచయంలో, స్త్రీల తప్పుడు కొలత అనే పుస్తకం యొక్క రచయిత అయిన డా. కారోల్ టావ్రిస్ “‘నేను దయనీయంగా భావించడానికి నా జీవితంలో తప్పేమి జరిగింది?’ అని ఆలోచించే బదులు ‘నాకు వైద్యపరంగా ఏ రోగం ఉంది?’ అని అడగడానికి పి.ఎమ్.ఎస్ స్త్రీలకు వీలు కలిగిస్తుందని” పేర్కొన్నది.
ఏ.పి.ఏ (అమెరికన్ సైకాట్రిక్ అసోసియేషన్‌కు) చెందిన స్త్రీలపై కమిటీలోని స్త్రీ మనస్తత్త్వ శాస్త్రజ్ఞులు, 1985లో ఏ.పి.ఏ డయగ్నాస్టిక్ మరియు స్టాటిస్టికల్ మాన్యుల్లో పి.ఎమ్.ఎస్‌ను ఇమడ్చడానికి విరుద్ధంగా పోరాడారు. ప్రస్తుత (1987) మాన్యుల్ విషయసూచికలో అది “లేట్ లూటియన్ ఫేస్ డిప్ఫోరిక్ డిసార్డర్”గా సూచించబడినప్పటికీ, “ప్రీమెన్స్ట్రువల్ డిస్ఫోరిక్ డిసార్డర్” (పి.ఎమ్.డి.డి), దాని తరువాతి సంపుటి యొక్క ముఖ్య పాఠంలో పొందుపర్చాలని ఏ.పి.ఏ యొక్క ప్రతినిధివర్గం ప్రతిపాదించింది. దాన్ని మాన్యుల్లో పొందుపర్చడంతో అది అధికారిక మనస్తత్త్వ అస్తవ్యస్తత అవుతుంది.
“అది మానసిక అస్తవ్యస్తత కాదు గనుక అది ఆ పుస్తకంలో ఎక్కడా కనిపించదని” ఆ కార్యానికి పూర్వపు సలహాదారిణి అయిన డా. పావులా కప్లాన్ పేర్కొంటుంది. “వచ్చేసారి అటోర్నీ జనరల్ పదవి కొరకు స్త్రీ నామనిర్దేశం చేయబడినప్పుడు ‘మీకు పి.ఎమ్.డి.డి ఉందా?’ అని ఆమెను అడగటం జరుగుతుందని” ఆమె చెప్పింది.
ఉపశమనం కొరకైన అన్వేషణ
పి.ఎమ్.ఎస్ వివాదాన్ని గురించి వైద్య బృందం వాదిస్తూ ఉంది. పి.ఎమ్.ఎస్కుగల కచ్చితమైన కారణాన్ని మరియు చికిత్సను గురించిన అనేక వాదాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ప్రతిదీ భిన్నమైన సూచనలను ఉత్పన్నం చేస్తూ, పి.ఎమ్.ఎస్‌లో 18 రకాలవరకు ఉండవచ్చని కొందరు వైద్యులు భావిస్తున్నారు. పి.ఎమ్.ఎస్ సూచనలను ప్రారంభించడానికి జింక్ కొంత పాత్ర వహించగలదని ఇటీవలి అధ్యయనం నివేదించింది. కొందరికి తక్కువ కృంగుదల కలిగిస్తూ, విటమిన్-బి6 లోపించడమే అసలు సమస్యకు కారణం కావచ్చునని మరో అధ్యయనం నివేదించింది.
మళ్లీ మళ్లీ వచ్చే పి.ఎమ్.ఎస్ సూచనలకు ఉపశమనాన్ని వెదుకుతూ స్త్రీలు వెలుగు థెరపీ, నిద్ర వచ్చేలా చేసుకోవడం, బాగా విశ్రాంతి తీసుకునే టెక్నీక్లు, కృంగుదల రాకుండా ఉండే మందులు మరియు ప్రోజెస్టరాన్ను తగ్గించేలాంటి చికిత్సలను ప్రయత్నించారు. ఇప్పటికీ, సరిగ్గా పనిచేసే చికిత్స కనుగొనబడలేదు.
ఋతుస్రావానికి ముందు తట్టుకోలేనంతటి సూచనలతో బాధపడే స్త్రీలు వైద్యున్ని సంప్రదించాలి. ప్రతి పి.ఎమ్.ఎస్ కేసు ప్రత్యేకంగా ఉంటుంది, గనుక ప్రతి స్త్రీకి మంచి వైద్య సలహా మరియు సంపూర్ణ శ్రద్ధ అవసరం. విషజ్వరము, ఎండోమెట్రియాసిస్ మరియు కృంగుదలవంటి ఇతర తీవ్రమైన పరిస్థితుల్లా పి.ఎమ్.ఎస్ ఉండగలదు గనుక భౌతిక పరీక్ష చాలా ప్రాముఖ్యం.
మొదటిసారిగా వైద్యుని దగ్గరకు వెళ్లే ముందు, ఋతుస్రావానికి ముందు తాను అనుభవించే శారీరక మరియు భావోద్రేక సూచనలను గురించి డైరీలో స్పష్టంగా వ్రాసుకోవడం లేక క్యాలెండర్లో నోటు చేసుకోవడం మంచిది. తాను ఏ దినాల్లో అన్యమనస్కంగా, చిరాకుగా లేక కృంగిపోయి ఉంటుందో తెలుసుకోవడం ఆమె తన పట్టికను దానికనుగుణంగా వేసుకోడానికి వీలు కలిగిస్తుంది. ఆమె అసలు పి.ఎమ్.ఎస్తో బాధపడుతుందా లేదా తెలుసుకోడానికి కూడా ఆమెకు సహాయం చేయగలదు.
ఆమె జీవితంలో ఒత్తిడిని కలిగించే కారకాలను తగ్గించమని వైద్యులు సలహా ఇవ్వవచ్చు. పోషకాహారం మరియు క్రమమైన వ్యాయామం కూడా పి.ఎమ్.ఎస్తో పోరాడగలవు. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా, ప్రోటీనులు తక్కువగా ఉండే ఆహారం, ఋతుస్రావానికి పూర్వం కృంగిపోయే కొందరు స్త్రీల మూడ్‌లను బాగు చేసిందని ఒక విశ్వవిద్యాలయ అధ్యయనం చూపింది. అలసట మరియు చిరాకుతో పోరాడటానికి క్రమంగా వ్యాయామం చేయటం లేక పగలు బ్రిస్క్ వాక్ చేయటం సహాయం చేయగలవు.
వాస్తవానికి, కుటుంబ సభ్యులు, ప్రాముఖ్యంగా భర్త సహాయం చేయగలరు. స్త్రీ యొక్క నెలసరి స్రావం ఆమెకు కష్టం కలిగిస్తున్నప్పుడు వారు ప్రాముఖ్యంగా ఆమెపట్ల దయను, కనికరాన్ని చూపుతూ ఆమెను అర్థం చేసుకోవాలి.
వివాదం కొనసాగుతుంది
తన ఋతుస్రావ సమయంలో స్త్రీ అనుభవించే మామూలు భావోద్రేక మరియు శారీరక మార్పులకు “సిండ్రోమ్” అని పేరు పెట్టడం తప్పని కొందరు చెబుతున్నారు. పి.ఎమ్.ఎస్ స్త్రీలకు మచ్చ తెస్తుందని దాన్ని కొట్టిపారేస్తున్నారు.
అయితే, అనేకమంది స్త్రీలకు పి.ఎమ్.ఎస్ వాస్తవమైన విషయం. కుటుంబంతో, ఉద్యోగంతో వ్యవహరించడాన్ని కష్టతరం చేసే సూచనలను వారు ప్రతి నెలా అనుభవిస్తున్నారు. పి.ఎమ్.ఎస్ వాస్తవికతను గురించి వైద్యులు మరియు వైద్యులు కాని వారనేకులు వాదిస్తున్నారు గనుక, ఉపశమనం మరియు అవగాహన గురించిన అన్వేషణ నిరాశాజనకంగా ఉండగలదు.
[13వ పేజీలోని చిత్రం]
ప్రాముఖ్యంగా కనికరాన్ని మరియు దయను కలిగి ఉండటం ద్వారా కుటుంబ సభ్యులు సహాయం చేయగలరు