విపత్తులకు వ్యతిరేకమైన పోరాటం జయించింది
ప్రకృతి విపత్తుల దుష్పరిణామాలను తగ్గించడానికి ఐక్యరాజ్యసమితి మరియు ఒక్కో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు నిజంగా ప్రశంసనీయమే. ప్రకృతి విపత్తుల తగ్గుదల కొరకైన అంతర్జాతీయ దశకం వంటి ప్రాజెక్టులు చెప్పేదేమంటే అలాంటి వైపరీత్యాలు ఎదురైనప్పుడు మానవజాతి నిస్సహాయతతో ఉండనవసరంలేదు. వ్యక్తులు, సమాజాలు, ప్రభుత్వాలు సరైన చర్యలను గైకొన్నట్లయితే ప్రాణాలు రక్షించబడతాయి.
ఇది చాలా ఆసక్తికరమైనది, ఎందుకంటే త్వరలోనే మానవజాతిపై ఉన్న ప్రభుత్వ పర్యవేక్షణలో మార్పు వస్తుందని బైబిలు మనకు చెబుతుంది. యేసు కాలం నాటి నుండి, క్రైస్తవులు ప్రభువు (“మా తండ్రి” అనే) ప్రార్థన చేస్తున్నారు, అందులో “నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక,” అనే మాటలు కూడా ఉన్నాయి. (మత్తయి 6:9, 10) దేవుని రాజ్యము నిజమైన ప్రభుత్వం. బైబిలు ప్రవచనం ప్రకారం, అతి త్వరలోనే అది “[మానవ] రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.” (దానియేలు 2:44) మానవజాతియంతా పరిపూర్ణమైన ఒకే ప్రభుత్వం క్రింద ఉండడాన్ని ఊహించండి. అది ఎంత భిన్నంగా ఉంటుందో!
ప్రకృతి సంబంధమైన ఆపదలు ప్రకృతి విపత్తులుగా మారకుండా ఉండేందుకు చర్య గైకొనవలసిన అవసరం ఉందని ప్రస్తుత దిన ప్రభుత్వాలు గ్రహిస్తున్నట్లయితే, దేవుని ప్రభుత్వం తన ప్రజలు ఈ విధంగా కష్టపడకుండా ఉండేలా చూస్తుందని మనం నమ్మకం కలిగి ఉండవచ్చు. కయీను హేబెలును చంపిన తరువాత, ఈ గ్రహంపై మొదటిసారిగా శాశ్వతమైన శాంతిని దేవుని ప్రభుత్వం తెస్తుంది. ఆ రాజ్యం క్రింద, ‘దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు.’ (కీర్తన 37:11) ‘మానవులందరూ యెహోవాచేత ఉపదేశము నొందుదురు వారికి అధిక విశ్రాంతి కలుగును’ అన్న మాటలు అక్షరాల నిజమయ్యేటట్లు ఆ రాజ్యం మానవ జాతియంతటికీ విద్యను బోధిస్తుంది.—యెషయా 54:13.
నేడు ప్రకృతి విపత్తులకు పేదవారే ఎక్కువగా గురౌతున్నారు. అయితే, దేవుని రాజ్యం క్రింద పరిపూర్ణ పర్యవేక్షణలో సరైన విద్యాభ్యాసాన్ని పొందే మానవజాతి ఇక పేదరికము వలన కలిగే కష్టాలను అనుభవించదు. యెషయా ప్రవక్త, అలాంటి పరిస్థితులను ముందుగా తెలియజేస్తూ, తన కాలం నాటి ప్రజలు అర్థం చేసుకొనేలా ఈ విధంగా వ్రాశాడు: “ఈ పర్వతముమీద సైన్యములకధిపతియగు యెహోవా సమస్తజనముల నిమిత్తము క్రొవ్వినవాటితో విందు చేయును మడ్డిమీదనున్న ద్రాక్షారసముతో విందుచేయును మూలుగుగల క్రొవ్వినవాటితో విందుచేయును మడ్డిమీది నిర్మలమైన ద్రాక్షారసముతో విందుచేయును.” (యెషయా 25:6) అవును, మంచి పదార్థాలతో విందు! తరువాత, రాజ్య పరిపాలన క్రింది జీవితాన్ని వర్ణిస్తూ కీర్తన రచయిత ఈ విధంగా వ్రాశాడు: “దేశములోను పర్వత శిఖరములమీదను సస్య సమృద్ధి కలుగును దాని పంట లెబానోను వృక్షములవలె తాండవమాడుచుండును నేలమీది పచ్చికవలె పట్టణస్థులు తేజరిల్లుదురు.”—కీర్తన 72:16.
ప్రకృతి విపత్తులకు వ్యతిరేకంగా మానవుని పోరాటం ముగుస్తుందన్నది వ్యక్తమే. దేవుని ఆత్మ నడిపింపు మరియు దేవుని రాజ్య పర్యవేక్షణల క్రింద దైవభయంగల మానవులు పోరాటంలో జయిస్తారు. అది ఎంత ఉపశమనంగా ఉంటుందో!