విపత్తులకు వ్యతిరేకంగా మానవుని పోరాటం
మూడు సంవత్సరాలు గడిచిపోయాయి, యు.ఎన్ సెక్రటరీ జనరల్ బూట్రోస్ బూట్రోస్-గాలికి సంతోషం లేదు. “మనం కావలసినంత త్వరగా చర్య తీసుకోలేదు. తర్వాత ఎప్పుడో కాదు ఇప్పుడే సమావేశమవ్వాలని నేను మిమ్మల్ని కోరినప్పుడు, మనం నష్టపోయిన సమయాన్ని పరిహరించుకోగలమా అని చూడడమే నా ఉద్దేశం,” అని ఓ నిపుణుల బృందంతో 1993 తొలి భాగంలో ఆయన చెప్పాడు. కోల్పోయిన సమయమా? ఆయన మనస్సులో ఏముంది? ఐ.డి.ఎన్.డి.ఆర్ అనే ఐదక్షరాలు. వాటి భావం ఏమిటి? అంత తొందరెందుకు?
భౌగోళిక శాస్త్రజ్ఞుడును, ఐ.డి.ఎన్.డి.ఆర్ “పితరుడు”నైన ఫ్రాంక్ ప్రెస్ ఆ సమావేశానికి హాజరైన నిపుణుల్లో ఒకడు. డా. ప్రెస్ పదకొండు సంవత్సరాల క్రితం, ప్రకృతి విపత్తులకు వ్యతిరేకమైన పోరాటాన్ని తీవ్రతరం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రజ్ఞుల సమాజాన్ని కూడదీసుకోవడం మొదలెట్టాడు. ఐదు సంవత్సరాల తరువాత, 1989 డిశంబరులో, 1990 నుండి 2000 వరకున్న సంవత్సరాలను ప్రకృతి విపత్తుల తగ్గుదల కొరకైన అంతర్జాతీయ దశకం (ఇంటర్‌నాషనల్ డికేడ్ ఫర్ నాచురల్ డిసాస్టర్ రిడక్షన్) లేదా ఐ.డి.ఎన్.డి.ఆర్ అని పేర్కొంటూ ఉదాసీనవైఖరికి అంతం తేవాలన్న అతని ఆహ్వానానికి ఐక్యరాజ్యాలు ప్రతిస్పందించాయి. వాటి లక్ష్యమేమిటి?
మనస్సు మార్చుకోవలసిన అవసరముంది
ఐ.డి.ఎన్.డి.ఆర్ అంటే కష్టాలను, నాశనాన్ని, భూకంపాలను, ప్రకృతి విపత్తుల వలన కలిగే మరణాలను తగ్గించడానికి తన జ్ఞానాన్ని, వనరులను విరాళంగా ఇవ్వాలని, కలిసి కట్టుగా పనిచేయాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరుకోవడమేనని బ్రెజిల్ దేశస్థుడును భూగర్భశాస్త్ర ప్రొఫెసరును, ఐ.డి.ఎన్.డి.ఆర్ యొక్క సైంటిఫిక్ అండ్ టెక్నికల్ కమిటీ సభ్యుడునైన ఉంబెర్టో జి. కోర్డాని తేజరిల్లు!కు చెప్పాడు. “ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి, ప్రపంచం యొక్క శ్రద్ధ విపత్తు కలిగిన తర్వాత సహాయం చేయడంపై కాక విపత్తులను నివారించే లేదా తగ్గించే మార్గాలపై మళ్ళాలి” అని ప్రొఫెసర్ కోర్డాని నొక్కిచెప్పాడు.
అయితే, ప్రపంచవ్యాప్త ఆలోచనా విధానాన్ని మార్చడం ఒక దశకానికి పేరు పెట్టడంకన్నా ఎంతో కష్టం. ఎందుకంటే, “తీర్మానించేవారు సాధారణంగా నివారణకన్నా సహాయం అందించడంపైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు,” అని యునెస్కో పర్యావరణం మరియు అభివృద్ధి వార్తాలేఖ చెబుతుంది. ఉదాహరణకు, లాటిన్ అమెరికాలోని ప్రకృతి సంబంధమైన ఆపదల నిర్వాహకమండలిపై నేడు ఖర్చుచేయబడే డబ్బంతటిలో 90 కన్నా ఎక్కువ శాతం ప్రమాదాల ఉపశమనాలకు ఖర్చు చేయబడుతుంది, 10 కన్నా తక్కువ శాతం మాత్రం నివారణ కొరకు ఖర్చు చేయబడుతుంది. రాజకీయవేత్తలు కూడా “విపత్తును నివారించే లేదా తగ్గించే ఆకర్షణీయం కాని పథకాల కొరకు చందాలను అభ్యర్థించే బదులు విపత్తుకు గురైనవారిని ఊరడించడం వల్ల ఎక్కువ మద్దతును పొందుతారు,” అని ఐ.డి.ఎన్.డి.ఆర్ వారి విపత్తులను ఆపండి అనే వార్తాలేఖ చెబుతుంది.
లక్ష్యాలను పెట్టుకోవడం
వ్యయం చేసే ఈ విధానాన్ని మార్చేందుకు ఐక్యరాజ్యసమితి ఈ దశకం కొరకు మూడు లక్ష్యాలను నిర్ణయించింది. అవి ఏమిటంటే, అన్ని దేశాలు 2000 సంవత్సరం నాటికి, (1) ప్రకృతి సంబంధమైన ఆపదల వల్ల కలిగే నష్టాలను గూర్చిన అంచనాను, (2) దీర్ఘకాలిక సిద్ధపాటు మరియు నివారణ పథకాలను, మరియు (3) హెచ్చరికా విధానాలను సిద్ధం చేసుకుని ఉండాలి. ఐ.డి.ఎన్.డి.ఆర్ యొక్క అధ్యయనాన్ని మంచి ఉద్దేశాలను కచ్చితమైన పథకాలుగా మార్చేందుకు దేశీయ కమిటీలు రూపొందించబడ్డాయి, మే 1994లో ఐక్యరాజ్యసమితి స్పాన్సర్ చేసిన ప్రకృతి విపత్తుల తగ్గుదల కొరకైన ప్రపంచ సమావేశానికి జపాను అతిథేయురాలిగా ఉండింది. ఈ కార్యక్రమాలన్నీ పథకం వేయబడినప్పటికీ లేదా జరుగుతున్నప్పటికీ బూట్రోస్ గాలి ఎందుకు సంతృప్తి పడలేదు? అంతటా కలతపరచే ధోరణి ఉన్నందుకే.
బాధాకరమైన ధోరణి
మరొకవైపు, ఐ.డి.ఎన్.డి.ఆర్ చేసే ప్రయత్నాలు సఫలమౌతున్నాయి. విపత్తును తగ్గించడాన్ని గూర్చిన శాస్త్రజ్ఞుల జ్ఞానం పెరిగింది, మెరుగుపడిన హెచ్చరికా విధానాల వంటి కొన్ని పరికరాలు ప్రాణాలను కాపాడుతున్నాయి, నష్టాలను తగ్గిస్తున్నాయి. అయితే, ఈ విజయాలను సాధించినప్పటికీ “అనేకానేకమంది ప్రజలను బాధిస్తూ విపత్తుల సంఖ్య మరియు వాటి పరిమాణం పెరుగుతూనే ఉన్నాయి,” అని ఐ.డి.ఎన్.డి.ఆర్ సెక్రటరియట్ డైరెక్టరైన డా. కార్లే ఒలావి ఎలో పేర్కొన్నారు. మనం “1960వ పడి నుండి 1980వ పడి వరకు 3 రెట్ల పెరుగుదలను, 90వ పడిలో ఇంకా ఎక్కువ పెరుగుదలను” చూశామని మరో యు.ఎన్. నిపుణుడు ధ్రువపరుస్తున్నాడు. నిజానికి, 1991లో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన 434 గొప్ప విపత్తులు 1,62,000 మంది ప్రజలను హతమార్చాయి, 1992లో 6,200 కోట్ల (అమెరికా) డాలర్ల కన్నా ఎక్కువ నష్టాలు జరిగాయి. ప్రపంచం “ఎడతెగక విచారాన్ని కలిగిస్తూ క్లిష్టమైన పరిస్థితులను కలుగజేసే విపత్తు యంత్రంగా మారింది” అని యు.ఎన్.డి.పి (ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం) అడ్మినిస్ట్రేటర్ అయిన జేమ్స్ జి. స్పేత్ నిర్ధారించాడు. (యు.ఎన్.డి.పి అప్‌డేట్, నవంబరు 1993) కలతచెందించే ఈ ధోరణి వెనుకనున్నదేమిటి?
పెరుగుతున్నదెందుకని?
దీనికి జవాబు చెప్పేందుకు, ప్రకృతి సంబంధమైన ఆపదలకు, ప్రకృతి విపత్తులకు మధ్య గల తేడాను మొదట గమనించండి. మొదటిదిగా, వరద లేదా భూకంపంవంటి సహజ సంఘటన విపత్తుగా మారే శక్తి గలిగి ఉంటుంది, అయితే అది ఎల్లవేళలా అలా మారదు. ఉదాహరణకు, బ్రెజిల్‌లోని ఎవరూ నివసించని అమెజాన్ బేసిన్‌లో వరదలు రావడం సహజమైన సంఘటనలే, వాటివలన పెద్ద హాని లేదు. అయితే, బంగ్లాదేశ్‌లో జనసాంద్రత ఎక్కువగానున్న గంగా డెల్టా ప్రాంతంలో వచ్చే వరద చాలా మంది మానవులు చనిపోవడానికి, వస్తునష్టాలకు, పర్యావరణ నష్టాలకు దారితీస్తుంది. తరచూ అలాంటి నష్టాలు ఎంత విపత్కరమంటే, వాటికి గురైన సమాజాలు బయటనుండి సహాయంలేకపోతే తిరిగి కోలుకోలేవు. అలా జరిగినప్పుడు ప్రకృతి సంబంధమైన ఆపద ప్రకృతి విపత్తుగా మారింది. అయితే మానవునికి, ప్రకృతికి మధ్య ఈ సంఘర్షణలు ఎందుకింత అధికమౌతున్నాయి?
“మరింత తీవ్రమైన, ఎడతెగని అపాయాల పెరుగుదల ఒక కారణం” కావచ్చని విపత్తు నిపుణుడైన జేమ్స్ పి. బ్రూస్ పేర్కొంటున్నాడు. అయినప్పటికీ, విపత్తులు అధికం కావడానికి ముఖ్య కారణం ప్రకృతి సంబంధమైన ఆపదలు అధికం కావడం కాదు కాని, ఆ ఆపదలకు మానవుడు ఎక్కువగా గురవ్వడమేనని ఆయన మరియు ఇతర శాస్త్రజ్ఞుల ఏకాభిప్రాయం. “ప్రజల పరిస్థితులు, పర్యావరణ పరిస్థితులు, సాంకేతిక పరిస్థితుల సంయోగం” వలనే ఇలా గురవ్వడం ఎక్కువవుతుందని ప్రపంచ ఆరోగ్యం అనే పత్రిక సూచిస్తుంది. విపత్తును కలిగించే ఈ సంయోగంలోని కొన్ని ముఖ్యాంశాలేవి?
ఒకటేంటంటే, పెరుగుతున్న ప్రపంచ జనాబా. మానవ కుటుంబ పరిమాణం పెరుగుతున్న కొలది ప్రపంచంలోని 560 కోట్ల మంది ప్రజలు ప్రకృతి సంబంధమైన ఆపదకు గురయ్యే అవకాశం పెరుగుతుంది. అంతేకాక, అధిక జనసాంద్రత వల్ల కోట్లకొలది పేదప్రజలు ప్రకృతి ఆక్రమణాలకు ఎప్పుడూ గురవుతున్నాయని పేరుపడ్డ ప్రాంతాల్లో సురక్షితం కాని భవనాల్లో నివసించడం తప్పనిసరౌతుంది. దాని పర్యవసానం ఆశ్చర్యం కలిగించేదేమీ కాదు: 1960 నుండి ప్రపంచ జనాబా రెట్టింపయ్యింది, అయితే విపత్తు వలన కలిగే నష్టాలు దాదాపు పదిరెట్లు పెరిగాయి!
పర్యావరణ మార్పులు సమస్యలను అధికం చేస్తున్నాయి. నేపాల్ నుండి అమెజాన్ వరకు, దక్షిణ అమెరికా పల్లభూమి నుండి పసిఫిక్ దీవుల వరకు మానవుడు అడవులను నరికివేసి, భూమిని అమితంగా సేద్యం చేస్తూ తీరప్రాంత సరిహద్దులను నిర్మూలం చేస్తూ పరిసరాన్ని మార్చేస్తున్నాడు, అయితే దాని మూల్యం చెల్లించకుండా ఉండడంలేదు. “పర్యావరణం తట్టుకోగల శక్తిపై ఒత్తిడిని కలిగిస్తూ, దాని స్వభావాన్ని మార్చడానికి మనం ప్రయత్నం చేస్తుండగా ప్రకృతి సంబంధమైన ఆపద ప్రకృతి విపత్తుగా మారే అవకాశం ఎక్కువవుతుందని” మునుపటి ఐ.డి.ఎన్.డి.ఆర్ డైరెక్టరైన రాబర్ట్ హామిల్టన్ చెబుతున్నాడు.
అయితే, మానవుని క్రియలు నేటి వార్తాశీర్షికల్లో కనబడే విపత్తులు పెరగడానికి కారణమైనట్లయితే, దానికి వ్యతిరేకమైనది కూడా నిజమే అవుతుంది: నివారణా చర్యలను గైకొనడం ద్వారా మానవుడు రేపటి వార్తాశీర్షికలను మార్చగలడు. మరణాలు, వినాశనమూ తగ్గించబడగలవు. ఉదాహరణకు, భూకంపాల వలన కలిగే 90 శాతం మరణాలను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే, నివారణ కొరకైన చర్చలు ఆసక్తికరమైనప్పటికీ, విపత్తులు అనివార్యమని చాలా మంది ప్రజలు ఇప్పటికీ తలస్తూనే ఉన్నారు. ఈ విధివాద దృక్కోణమే “విపత్తును తగ్గించడానికి ఒకే ఒక పెద్ద ఆటంకం” అని యునెస్కో పర్యావరణం మరియు అభివృద్ధి వార్తాలేఖ నివేదిస్తుంది. మీరు ఆ ఆటంకానికి ఏవైపు ఉన్నారు?
అనివార్యమా లేక తగ్గించవచ్చా?
ముఖ్యంగా వర్ధమాన దేశాల్లో ఈ నిస్సహాయ భావం సర్వవ్యాప్తమయ్యింది—అందుకు ఆశ్చర్యం లేదు! గత 50 సంవత్సరాల్లో సంభవించిన ప్రకృతి విపత్తుల వల్ల చనిపోయినవారిలో 97 శాతం మంది వర్ధమాన దేశాల్లో జీవించినవారే! ఈ దేశాల్లో కొన్నింటిలో “ఒక విపత్తు ఎప్పుడు ముగుస్తుందో, మరొకటి ఎప్పుడు మొదలౌతుందో గుర్తించడం కష్టమయ్యేంత తరచుగా విపత్తులు కలుగుతుంటాయి” అని విపత్తులను ఆపండి అనే వార్తాలేఖ పేర్కొంటుంది. నిజానికి విపత్తుల్లో 95 శాతం వర్ధమాన దేశాల్లోనే కలుగుతున్నాయి. పేదరికం, నిరుద్యోగం, ఘోరమైన జీవనపరిస్థితులు వంటి అంతులేని వ్యక్తిగత విపత్తులు దీనికి తోడౌతున్నాయి, నిస్సహాయత నిరుపేదలను ఉప్పెనలా ఎందుకు మ్రింగివేస్తుందో మీరు గ్రహించగలరు. మళ్ళీమళ్ళీ వచ్చే విపత్తుల వలన కలిగే నష్టాలు వేదనాకరమైనవైనప్పటికీ ముందుగా విధించబడిన జీవిత భాగమన్నట్లు వారు వాటిని భరిస్తారు. అయితే అలాంటి నష్టాలు అనివార్యమా?
మీరేమి చేయగలరు మరియు ఏమి చేయలేరు
నిజమే, మీరు ప్రకృతి సంబంధమైన ఆపదలు తరచూ సంభవించడాన్ని గాని లేదా వాటి తీవ్రతను గాని అదుపు చేయలేరు. అయితే అవి మిమ్మల్ని పూర్తిగా నిస్సహాయులనుగా చేయవు. మీరు ఈ సంఘటనలకు గురికావడాన్ని తగ్గించుకో గలరు. ఎలా? ఈ తారతమ్యాన్ని గూర్చి తలంచండి.
ఒక వ్యక్తి చర్మ క్యాన్సర్ (విపత్తు) రాకుండా ఉండేందుకు ఎక్కువ ఎండ (సహజ సంఘటనకు) తగలకూడదని ఆశిస్తున్నాడనుకుందాం. అతడు ఏ చర్యలను తీసుకోగలడు? అతడు సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని (సంఘటనల సంభావ్య సంఖ్యను) అదుపు చేయలేడన్నది స్పష్టం. లేదా ఎండ తన పరిసరాలకు తగలడాన్ని (సంఘటన తీవ్రతను) తగ్గించలేడు. అయితే అది ఆయనను నిస్సహాయునిగా చేస్తుందా? లేదు, తాను ఎండ తగలడాన్ని తగ్గించుకోగలడు. ఉదాహరణకు, ఎండ విపరీతంగా ఉన్నప్పుడు ఇంట్లో ఉండగలడు, లేదా అది సాధ్యంకాకపోతే, అతడు బయటికి వెళ్ళేటప్పుడు టోపి పెట్టుకుపోవచ్చు, ఎండ నుండి కాపాడేటటువంటి దుస్తులను వేసుకోవచ్చు. ఇది అతనికి ఎండ (సంఘటన) నుండి అధిక రక్షణనిస్తుంది మరియు అతడు చర్మ క్యాన్సర్‌కు (విపత్తుకు) గురయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అతడు గైకొనే నివారణా చర్యలు అతనికి సహాయం చేయగలవు!
అలాగే, మీరు కూడా కొన్ని ప్రకృతి సంబంధమైన ఆపదలకు గురి కాకుండా మీ రక్షణను అధికం చేసే చర్యలను గైకొనవచ్చు. ఆ విధంగా విపత్తు కలిగినప్పుడు మీరు గురయ్యే అవకాశాన్ని, నష్టాలు కలిగే సాధ్యతను తగ్గించుకుంటారు. అభివృద్ధిచెందిన దేశాల్లో జీవిస్తున్నవారి కొరకు “మీరు సిద్ధంగా ఉన్నారా?” అనే బాక్సులో ఇవ్వబడిన సలహాలు ఉపయోగకరంగా ఉండగలవు. మీరు వర్ధమాన దేశంలో జీవిస్తున్నట్లయితే, “తక్కువ ఖర్చయ్యే ఉపయోగకరమైన మెరుగులు” అనే బాక్సులోని మాదిరులు ఇప్పుడు లభ్యమయ్యే సులభమైన పద్ధతులను గూర్చిన సమాచారాన్ని మీకివ్వవచ్చు. అవి ప్రాణాలను కాపాడడంలోను, నష్టాలను తగ్గించడంలోను సహాయకరంగా ఉండవచ్చు. నేడు సాంకేతిక విద్య అందుబాటులో ఉండగా “విధివాదం ఇక ఏ మాత్రం అంగీకారయోగ్యం కాదని,” భౌగోళిక శాస్త్రజ్ఞుడైన ఫ్రాంక్ ప్రెస్ గుర్తుచేస్తున్నారు. నిస్సందేహంగా, ప్రకృతి విపత్తుల విషయంలో కూడా కచ్చితంగా నయం కన్నా నివారణే మిన్న.
[6వ పేజీలోని బాక్సు]
మీరు సిద్ధంగా ఉన్నారా?
ప్రకృతి సంబంధమైన ఆపదలను ఎదుర్కునేందుకు యు.ఎస్. ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ అనేక మార్గాలను సిఫారసు చేసింది. వాటిలోని కొన్ని ముఖ్యాంశాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.
సమాచారాన్ని పొందండి. మీ స్థానిక అత్యవసర నిర్వాహక కార్యాలయాన్ని సంప్రదించి మీ సమాజంలో ఏ విపత్తులు కలుగవచ్చో కనుక్కోండి. మీరు కొన్నింటిని గూర్చి ఎరిగే ఉండవచ్చు, అయితే మరి కొన్ని మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. మీ ఇల్లు ప్రకృతి సంబంధమైన ఆపదలకు గురౌతుందని మీరు తెలుసుకున్నట్లయితే:
◻ మీ కుటుంబంతో కలిసి మీకు ఎదురయ్యే ఆపదలను గూర్చి చర్చించండి. ఒక్కో సందర్భంలో ఏం చేయాలో వివరించండి.
◻ అలాంటి సంఘటన వలన మీరు విడిపోతే ఒకరితోనొకరు ఎలా సంబంధం పెట్టుకోవాలో మీ కుటుంబంతో పథకం వేసుకోండి. మీరు కలుసుకునేందుకు రెండు స్థలాలను ఎన్నుకోండి: నిప్పంటుకోవడం వంటి అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఇంటి బయట ఒకటి, మీరు ఇంటికి తిరిగి రాలేని సందర్భంలో మీ పొరుగు ప్రాంతానికి వెలుపల మరొకటి.
◻ మీరనుకున్న స్థలాల్లోకి చేరుకోలేకపోతే మీ కుటుంబ సభ్యులందరూ ఫోన్ చేసి, వారెక్కడున్నారో చెప్పేందుకు మీ కుటుంబ మధ్యవర్తిగా ఉండమని మీ స్నేహితున్ని కోరండి. మీ ప్రాంతానికి దూరంగా ఉన్న ఒక స్నేహితున్ని ఎన్నుకోండి. ఎందుకంటే విపత్తులు సంభవించినప్పుడు, వాటికి గురైన ఆ ప్రాంతం నుండి ఫోను చేయడం కన్నా దూరంగా ఉన్న ప్రాంతానికి చేయడమే చాలావరకు సులభంగా ఉంటుంది. ఆ స్నేహితునికి ఎలా ఫోను చేయాలో మీ పిల్లలకు నేర్పండి. మీరు అక్కడ నుండి వెళ్ళిపోవలసిన అవసరముంటే మీరేమి చేయాలో చర్చించండి. ప్రత్యేక సహాయం అవసరమున్న మీ పొరుగువారికి మీరే సహాయం చేయగలరో ఆలోచించండి. మీ పెంపుడు జంతువులను ఎలా చూసుకోవాలో పథకం వేసుకోండి.
◻ అన్ని ఫోన్లకు అత్యవసర ఫోన్ నెంబర్లను అంటించండి.
◻ ఎలక్ట్రిక్ ఫ్యూస్ బాక్స్, నీటి గొట్టాలు, నాచురల్ గ్యాస్ మెయిన్ ఎక్కడున్నాయో గుర్తించండి. వాటిని ఎలా, ఎప్పుడు కట్టెయ్యాలో బాధ్యతగల కుటుంబ సభ్యులకు చూపించండి, మెయిన్ స్విచ్‌లకు దగ్గరలో అవసరమైన ఉపకరణాలను పెట్టండి.
◻ అగ్నిప్రమాదాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. ముఖ్యంగా పడక గదులకు దగ్గరగా పొగను కనిపెట్టే అలారాన్ని పెట్టుకోండి.
[8వ పేజీలోని బాక్సు]
తక్కువ ఖర్చయ్యే ఉపయోగకరమైన మెరుగులు
ప్రపంచ జనాబాలోని సగం కన్నా తక్కువ మంది ఒక వారంలో ఐదు డాలర్లు లేదా అంతకన్నా తక్కువ డబ్బుతో బ్రతుకుతున్నారు అని ప్రపంచ బ్యాంక్ నివేదిస్తుంది. మీరు ఆ పరిస్థితిలో ఉన్నప్పటికీ అన్వర్తించదగినవని నిరూపించబడిన కొన్ని పద్ధతులున్నాయని కొందరు నిపుణులు చెబుతున్నారు. “తగ్గించే తక్కువ ఖర్చయ్యే పద్ధతికి” జ్ఞానమే కీలకం గనుక, వాటిని గూర్చి మీరే తెలుసుకోండి అని పెరూ విపత్తు నిపుణుడైన ఆల్‌బెర్టో గేజ్‌కే నొక్కి చెబుతున్నాడు. దక్షిణ అమెరికాలోని రెండు ఉదాహరణలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:
మంచి ఇటుకల ఇంటిని లేదా మట్టి ఇంటిని ఎలా కట్టుకోవాలో ఐక్యరాజ్యసమితివారి ప్రకృతి విపత్తులను తగ్గించడం అనే మాన్యుల్ ఇలా వివరిస్తుంది:
◻ కొండ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకునేందుకు పునాది వేయడానికి భూమిని పల్లంగా చేయాలి.
◻ చతురస్రాకారంలో ఉండే ఇండ్లు బాగా గట్టిగా ఉంటాయి; మీకు దీర్ఘచతురస్రాకారంలో కావాలంటే, ఒక గోడకంటే మరో గోడ రెండున్నర రెట్లు పొడుగ్గా కట్టాలి.
◻ రాళ్ళు లేక కాన్‌క్రీట్ పునాదులు భూప్రకంపనాలను తగ్గిస్తాయి.
◻ ఒకే వెడల్పు, ఒకే దృఢత్వము, ఒకే ఎత్తుగల సమాంతర గోడలను కట్టుకోండి. వాటిని తక్కువ వెడల్పుతో కట్టండి. సాధారణంగా కట్టబడే మట్టి ఇండ్లకన్నా కూడా ఈ విధంగా కట్టబడిన ఇండ్లకు భూకంపం సంభవించినప్పుడు తక్కువ నష్టాలు కలుగుతాయి.
పారంపర్యాల ప్రకారం అల్లిన తడిక ఇల్లు (కిన్‌చా) నిర్మాణం అనేది నిరూపించబడిన మరో సాంకేతిక పద్ధతి. అడ్డంగాను, నిలువుగాను ఉన్న దూలాలపై అల్లిన జమ్ముతో, చిన్న కొమ్మలతో, కొంత మట్టితో నిర్మించబడేవే కిన్‌చా ఇండ్లు అని విపత్తులను ఆపండి అనే పుస్తకం చెబుతుంది. అలా 10 నుండి 15 సెంటీమీటర్ల వెడల్పు గల గోడలు గల ఈ రకమైన నిర్మాణం భూకంపం సమయంలో ఆ ఇంటిని కదలడానికి అనుమతిస్తుంది, భూకంపం ఆగిన తరువాత అది మళ్ళీ యథా స్థితికి వస్తుంది. మరి 1991లో భూకంపం వచ్చినప్పుడు ఒక మీటరు వెడల్పుగల గట్టి గోడలున్న ఇతర 10,000 ఇండ్లు కూలిపోయి 35 మంది ప్రజలు చనిపోగా, ఈ రకమైన ఇండ్లన్నీ తట్టుకొని నిలబడ్డాయి. యునెస్కో భవనశిల్పియైన జాన్ బానెన్ అభిప్రాయం ప్రకారం, ప్రజలను భూకంపాలు చంపడంలేదు, కూలిపోయే ఇండ్లు చంపుతున్నాయి.
[7వ పేజీలోని చిత్రాలు]
మానవుడు, కొన్ని స్థలాల్లో మరిన్ని ప్రకృతి విపత్తులకు దారితీస్తూ నిర్లక్ష్యంగా అడవులను నరికివేస్తున్నాడు