విపత్తులు సంభవించినప్పుడు
ఇరవైయవ శతాబ్దం గొప్ప విపత్తుల చేత గుర్తించబడింది, వాటిలో అధికము మానవులవల్లే కలిగాయి. అయితే కొన్ని అలా కాదు. మన దినాల గురించి ముందుగా తెలియజేస్తూ యేసుక్రీస్తు ఈ విధంగా చెప్పాడు: “జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును.” (మత్తయి 24:7, 8) నిజమే యుద్ధాలకు, ఆహార కొరతకు మానవుడే బాధ్యుడు కాని, భూకంపాలకు అతడు బాధ్యుడు కాడు. అదేవిధంగా, కొన్ని వినాశకరమైన వరదలు మానవుని క్రియలవల్ల సంభవించాయి, కాని భూకంపాలకు అతనిని నిందించలేము. తుపానులకు గాని, అగ్నిపర్వత ప్రేలుళ్ళకు గాని మానవుడ్ని తప్పు పట్టలేము.
వాటి కారణం ఏదైనప్పటికీ, ప్రకృతి విపత్తులు మానవుని అల్పత్వాన్ని, భయానకమైన ప్రకృతి శక్తుల ముందు అతని నిస్సహాయతను చూపిస్తున్నాయి. మన గృహమైన ఈ భూమి సాధారణంగా ఎంతో సురక్షితంగాను గట్టిగాను అనిపిస్తుంది. అయితే అది భూకంపంలో కదిలినప్పుడు, వరదనీటిచేత ముంచెత్తబడినప్పుడు, లేదా ఓ పెద్ద విస్ఫోటమన్నట్లు భయంకరమైన గాలి ఎడతెగక బలంగా వీచినప్పుడు ఆ భద్రతాభావం లేకుండా పోతుంది.
ప్రకృతి విపత్తులు 20వ శతాబ్దకాలంలో అత్యధికమైన నష్టానికి మరియు అనేకుల మరణానికి కారణమయ్యాయి. ఇది నివారించబడగలదా? ఇలాంటి వినాశకర ఫలితాలను తగ్గించడానికి ఏమైనా చేయవచ్చా? వ్యక్తులుగా మనలను మనం రక్షించుకోవడానికి మనం ఏమి చేయగలం? విపత్తు కలిగినప్పుడు మనం పూర్తిగా నిస్సహాయులుగా ఉంటామా? మానవజాతి ఎల్లప్పుడూ దీనికి గురవుతూనే ఉంటుందా? తరువాయి శీర్షికలు ఈ ప్రశ్నలను చర్చిస్తాయి.