కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 7/8 పేజీలు 7-11
  • ప్రేమయందు కలిసి జీవించుట

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రేమయందు కలిసి జీవించుట
  • తేజరిల్లు!—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రేమ—“పరిపూర్ణతకు అనుబంధం”
  • “నెరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము”
  • కుటుంబ బంధాలను వృద్ధిచేసుకోవడంవల్ల ప్రయోజనాలు
  • పరస్పర గౌరవం వల్ల కలిగే ప్రయోజనాలు
  • విద్యావంతులను చేయడంలో తాత మామ్మల పాత్ర
  • దైవిక బోధకు అనుగుణ్యంగా ప్రవర్తించుట
  • కొన్ని సమస్యలేవి?
    తేజరిల్లు!—1995
  • తాత మామ్మలకు ఏమి జరుగుతోంది?
    తేజరిల్లు!—1995
  • జతగానే వృద్ధులు కావడం
    కుటుంబ సంతోషానికిగల రహస్యము
  • వృద్ధ తలిదండ్రులను సన్మానించడం ద్వారా లభించే ప్రతిఫలాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
తేజరిల్లు!—1995
g95 7/8 పేజీలు 7-11

ప్రేమయందు కలిసి జీవించుట

ప్రియమైన తాతామామ్మలకు,

మీరు కులాశాయేనా? నాకు జలుబు చేస్తున్నట్లుగా ఉంది.

మళ్ళీ ఒక రోజు మీరు నాతో ఆడినందుకు చాలా కృతజ్ఞతలు. మీరు నన్ను పార్కుకి, సార్వజనిక స్నాన ఘట్టానికి (పబ్లిక్‌ బాత్‌కు) తీసుకు వెళ్ళారు. నేనెంతో ఆనందించాను.

వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 11న మాకు మా పాఠశాలలో సంగీతనాట్య కార్యక్రమాలున్నాయి. మీరు మళ్ళీ రాగల్గితే, దయచేసి రండి.

తాతయ్యా, మామ్మ మీరు వస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది.

మీ ఆరోగ్యాన్ని గురించి శ్రద్ధ తీసుకోండి, ఎప్పుడూ సంతోషంగా ఉండండి. వాతావరణం చల్లగా మారబోతోంది గనుక, జలుబు రాకుండా జాగ్రత్తపడండి.

మీరు మళ్ళీ వచ్చి నాతో ఆడే సమయం కోసం ఎదురు చూస్తున్నాను. యూమీని, మాసాకీని నేనడిగానని చెప్పండి.

మీకా (జపానీయురాలు)

మీ మనమడు ఎప్పుడైనా ఇలాంటి ఉత్తరం వ్రాశాడా? అలాగైతే, మీరు దానిని అందుకున్నప్పుడు, నిస్సందేహంగా మీకదెంతో సంతోషాన్ని కలిగించి ఉండవచ్చు. అలాంటి ఉత్తరాలు తాత మామ్మలు మరియు మనమళ్ళ మధ్య ఉన్న చక్కని, ఆప్యాయతగల స్నేహబంధానికి నిదర్శనాలు. అయితే ఇలాంటి బంధాన్ని నిలబెట్టుకోవడానికి, కాపాడుకోవడానికి, బలపరుచుకోవడానికి ఏమి అవసరమై ఉంది? అది మూడు తరాలకూ ప్రయోజనకరమని ఎలా నిరూపించబడగలదు?

ప్రేమ—“పరిపూర్ణతకు అనుబంధం”

బ్రిటీష్‌లోని ఇద్దరు తాత మామ్మలు ఈ విధంగా చెబుతున్నారు: “శిరస్సత్వాన్ని అంగీకరించడం, ప్రేమయందు ఒకరితోనొకరు ఐక్యమవ్వడం అనేవి ముఖ్యమైన సూత్రాలని మేము భావిస్తున్నాము.” క్రైస్తవ ప్రేమను “పరిపూర్ణతకు అనుబంధము” అని వర్ణించే కొలొస్సయులు 3:14నందలి లేఖన భాగాన్ని ఈ ఇద్దరు యెహోవాసాక్షులు ప్రత్యేకంగా ఎత్తి చెబుతున్నారు. ప్రేమ అనేది గౌరవాన్ని, ఆలోచనా సహితమైన శ్రద్ధను, అనురాగాన్ని మరియు కుటుంబ ఐక్యాన్ని కలిగిస్తుంది. తండ్రి పని నుండి వచ్చినప్పుడు, ఆయనను కలిసి, ఆయనకు ఆప్యాయంగా స్వాగతం పలికేందుకు కుటుంబ సభ్యులందరూ పరుగెడుతారు. కుటుంబంలో ప్రేమ ఉంటే, తాత మామ్మలు వచ్చినప్పుడు కూడా అలాగే జరుగుతుంది. “తాతయ్యా, మామ్మా వచ్చేశారోచ్‌!” అని ఉత్సాహంతో బిడ్డ కేకేస్తుంది. బంధువులతో సహా కుటుంబమంతా ఆ రాత్రి భోజనానికి కూర్చుంటుంది, స్థానిక ఆచారం ప్రకారం, బల్లవద్ద కుటుంబ శిరస్సు స్థానంలో తనకు కేటాయించిన స్థలంలో తాతయ్య కూర్చుంటారు. ఈ చక్కని దృశ్యంలో మీరూ మీ కుటుంబం ఉన్నట్లు ఊహించుకోగలరా? మీరు ఈ ఆశీర్వాదాన్ని ఇష్టపడతారా?

“నెరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము”

తాత మామ్మల ఎడల గౌరవాన్ని, ప్రేమను ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కాక, ఎల్లవేళలా కనబరుస్తూ ఉండాలన్నది స్పష్టం. అందుకే, పిల్లలకు ఎల్లప్పుడూ బోధిస్తూ ఉండవలసిన అవసరం ఉంది. పిల్లలు తలిదండ్రుల మాదిరిని అనుసరిస్తూ, బంధువులను, మరితరులను ప్రేమించడాన్ని కుటుంబంలోనే నేర్చుకుంటారు. ఇంటర్వ్యూ చేయబడిన అనేకులు పేర్కొన్నట్లుగా వారి మాదిరి ప్రాముఖ్యమైనది. నైజీరియాలోని బెనిన్‌ నగరంనందలి మకైయ అనే పేరు గల తండ్రి ఈ విధంగా అంటున్నాడు: “నా అత్తమామలను గౌరవించడంలో నేను చూపిన మాదిరి కూడా వినయం గలవారిగాను, గౌరవం చూపించేవారుగాను ఉండేందుకు నా పిల్లలకు సహాయపడిందని నేను భావిస్తున్నాను. నేను నా అత్త మామలను ‘అమ్మా,’ ‘నాన్న’ అని పిలుస్తాను. నేను వారిని నా స్వంత తలిదండ్రులన్నట్లుగా గౌరవించడాన్ని నా పిల్లలు చూస్తున్నారు, వింటున్నారు.”

మనమళ్ళు తమ తాత మామ్మలను గౌరవించకపోతే, ఆ తప్పు వలన మాత్రమే కాదుగాని, తలిదండ్రులు వారిని సరిదిద్దనందువల్ల కూడా వారు కలతచెందుతారు. ఇటలీలోని రోమ్‌నందలి డమట్రియో అనే తాతయ్య ఇలా అంటున్నాడు: “మా మనమళ్ళు మా ఎడల మర్యాదను, గౌరవాన్ని చూపించడానికి నా కూతురు, అల్లుడు వాళ్ళకు ఇచ్చే తర్ఫీదు ద్వారా మమ్మల్ని వాళ్ళు ఎంతగా ప్రేమిస్తున్నారో గ్రహించగలను.” తాత మామ్మలు తమ వయస్సులోని తోటి ఆటగాళ్ళేనన్నట్లుగా, అప్పుడప్పుడు పిల్లలు వారితో అతి చనువుగా ప్రవర్తించవచ్చు లేదా తాము వాళ్ళ కన్నా గొప్పవాళ్ళమనే దృక్పథాన్ని కనబరచవచ్చు. అలాంటి ఏ ధోరణినైనా సరిదిద్ద వలసిన బాధ్యత తలిదండ్రులదే. నైజీరియాలోని సాక్షియైన పౌలు ఈ విధంగా చెబుతున్నాడు: “దాదాపు ఒక సంవత్సరం క్రితం, మా పిల్లలు మా అమ్మను చిన్న చూపు చూడడం మొదలెట్టారు. నేను దానిని గమనించినప్పుడు, వారికి నేను సామెతలు 16:31 చదివి వినిపించాను: ‘నెరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము,’ అలాగే వాళ్ళ నాయనమ్మ నా అమ్మ అని కూడా వారికి గుర్తు చేశాను. వారు నన్ను గౌరవించినట్లే, వారు ఆమెను కూడా గౌరవించాలి. అలాగే నేను, మీ యౌవనం—దానిని సాధ్యమైనంత మట్టుకు ఆనందించుడిa (ఆంగ్లం) అనే ఆంగ్ల పుస్తకాన్ని తీసి, ‘మీరు తలిదండ్రులను ఎలా దృష్టిస్తారు?’ అనే పేరు గల 10వ అధ్యాయాన్ని వారితో పాటు పఠించాను. ఇప్పుడు వాళ్ళ నాయనమ్మను గౌరవించడంలో వారికి ఏ ఇబ్బందీ లేదు.”

కుటుంబ బంధాలను వృద్ధిచేసుకోవడంవల్ల ప్రయోజనాలు

కుటుంబ సభ్యులు ఒకరికొకరు దూరంగా నివసిస్తున్నప్పటికీ, పరస్పర అనురాగాన్ని పెంపొందించుకోవచ్చు. నైజీరియాలోని స్టీవెన్‌ అనే తాతయ్య ఈ విధంగా వ్రాస్తున్నారు: “మేము ప్రతి మనమడికి (మనమరాలికి) వ్యక్తిగతంగా ఉత్తరాలు వ్రాస్తాము. ఈ పని కొంత కష్టమైనదే కాని, ఫలితం గొప్పది. మనమళ్ళతో సన్నిహిత సంబంధాన్ని నిలబెట్టుకోవడం ఎంతో సంతోషకరమైనది.” ఈ విషయంలో తలిదండ్రుల ప్రయత్నాలు చాలా ప్రాముఖ్యము. ఇంక కొందరు తమ పరిస్థితులను బట్టి ఫోను ద్వారా సంబంధాలను నిలబెట్టుకుంటారు.

ఇటలీలోని బారినందలి జూజెప్ప అనే పేరు గల తాతయ్యకు 11 మంది మనమళ్ళున్నారు, తన అతి సన్నిహితులైన కుటుంబ సభ్యులతో ఎలా ఆప్యాయతగల స్నేహబంధాన్ని పెంపొందించుకున్నాడో వివరిస్తున్నాడు: “మా ‘వంశములోని’ ఆరింటిలో మూడు కుటుంబాలు దూరంగా నివసిస్తున్నాయి. కాని మేము సంతోషకరమైన సంబంధాలు కలిగి ఉండడానికి అది ఆటంకం కాలేదు. మేమందరము 24 మందిమి, సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా కలుసుకునే అలవాటు మాకుంది.”

తాత మామ్మలు ఒంటరిగా జీవిస్తున్నప్పుడు, కుటుంబ సభ్యులు అటు ఇటు రాకపోకలు జరుపుకోవడం, ఫోన్లు చేసుకోవడం, ఉత్తరాలు వ్రాసుకోవడం క్రమంగా చేయనట్లయితే సన్నిహిత సంబంధాలు ఉండవు. ఎల్లప్పుడూ అనురాగాన్ని కనబరుస్తూ ఉండాలి. మధ్య వయస్కులైన లేదా ఇప్పటికీ మంచి ఆరోగ్యంగా ఉన్న కొందరు తాత మామ్మలు తాము ఇప్పటికీ చురుగ్గా ఉన్నప్పుడు, తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగినప్పుడు స్వతంత్రంగా ఉండాలని కోరుకోవచ్చు. అయినప్పటికీ, వారు తమను తాము కుటుంబం నుండి పూర్తిగా వేరు చేసుకుంటే, తమకు అనురాగం మరింత అవసరం ఉందని అనుకునేటప్పుడు వెంటనే దాన్ని పొందలేకపోవచ్చు.

నైజీరియాలోని మిఖాయేలు అనే తాత మరొక సలహా ఇస్తున్నాడు: “మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు తలంచెదరో దానిని మీరును చేయుడి—అని యేసు చెప్పిన బంగారు సూత్రాన్ని నేను అన్వర్తించుకుంటాను. అందువల్ల నా పిల్లలు నన్ను ఎంతో ప్రేమిస్తారు. మేము సరదాగా మాట్లాడుకుంటాము.” ఆయనింకా ఇలా చెబుతున్నాడు: “మా మనమళ్ళలో ఎవరైనా నన్ను కలతపరచినట్లయితే, అవసరమైతే వారితో నేను మాట్లాడతాను. నేను పట్టించుకోనవసరం లేనిదైతే, దాన్ని మరిచిపోతానంతే.”

తాత మామ్మల చిన్న చిన్న కానుకలు, పనులు అనుకూల ప్రతిస్పందనను తెస్తాయి. ఎప్పుడూ ఫిర్యాదులు చేసే బదులు దయగల, ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడడం జీవితాన్ని ఆనందమయంగా చేస్తుంది. మనమళ్ళతో సమయాన్ని గడిపి, ఆసక్తికరమైన ఆటలను ప్రయోజనకరమైన చిన్నపనులను వారికి నేర్పించి, బైబిలు కథలను, కుటుంబ పూర్వికుల కథలను చెప్పి వారిలో ప్రేమపూర్వకమైన, ఎన్నటికీ నిలిచే జ్ఞాపకాలను మిగిల్చండి. చిన్నవే అయినా, అలాంటి ముఖ్యమైన విషయాలు జీవితాన్ని మరింత ఆనందమయం చేస్తాయి.

పరస్పర గౌరవం వల్ల కలిగే ప్రయోజనాలు

గాస్పారా వెలా అనే వైద్యుడు చెప్పేదేమంటే, “పిల్లలను పెంచే తలిదండ్రుల అధికారాన్ని వ్యతిరేకించకుండా లేక పోటీపడకుండా ఉండేందుకు తాత మామ్మలు జాగ్రత్తపడవలసిన అవసరం ఉంది.” ఆయనింకా ఇలా అంటున్నాడు, “లేకపోతే, వారు తాతయ్య మామ్మలుగా తమ స్థానాన్ని మించిపోయి, తలిదండ్రుల స్థానాన్ని తీసుకున్నవారౌతారు.” ఈ సలహా, తమ పిల్లలకు తర్ఫీదునిచ్చే ప్రాథమిక బాధ్యత తల్లిదండ్రులకేనని లేఖనం చెబుతున్న దానికి అనుగుణ్యంగా ఉంది.—సామెతలు 6:20; కొలొస్సయులు 3:20.

తమ జీవితానుభవాన్ని బట్టి, సలహా ఇవ్వడం తాతయ్య మామ్మలకు చాలా సులభం. అయినప్పటికీ, అనవసరమైన, కొన్నిసార్లు కోరబడని ఉపదేశాన్నివ్వకుండా వారు జాగ్రత్తపడాలి. రాయ్‌, జీన్‌ అనేవారు ఈ విధంగా చెబుతున్నారు: “తమ పిల్లలకు తర్ఫీదును, క్రమశిక్షణను ఇవ్వవలసిన ముఖ్యమైన బాధ్యత తలిదండ్రులదేనని గుణగ్రహించడం ప్రాముఖ్యం. వారు కొన్ని విషయాల్లో మరీ కచ్చితంగా ఉంటారని, మరి కొన్నింటిలో అంత కచ్చితంగా ఉండరని ఒకరికి అనిపించవచ్చు. కాబట్టి జోక్యం చేసుకోవాలనే నిజమైన ప్రలోభానికి వ్యతిరేకంగా పోరాడవలసిన అవసరం ఉంటుంది.” మిఖాయేలు, షీనా అనే మరో ఇద్దరు బ్రిటీష్‌ తాత మామ్మలు అదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు: “పిల్లలు మనల్ని సలహా అడిగితే, మనమిస్తాం, కాని వాళ్ళు దానిని అంగీకరించాలని అపేక్షించనవసరం లేదు, లేదా వాళ్ళు అంగీకరించకపోతే మనం బాధపడనవసరం లేదు.” వివాహితులైన తమ కొడుకూ కూతుళ్ళ మీద నమ్మకం ఉండడం మంచిది. అలాంటి నమ్మకం మూడు తరాల మధ్య ఉన్న బంధాలను మెరుగుపరుస్తుంది.

దక్షిణ ఇంగ్లాండులో నివసించే తమ కొడుకూ కోడళ్ళతో ఉండే వివియన్‌, జాన్‌ అనే తాత మామ్మలు, తమ మనమళ్ళకు వారు అలవరచిన క్రమశిక్షణకు మద్దతునిచ్చేందుకు ఎల్లవేళలా ప్రయత్నించేవారు: “ఒకవేళ మేము భిన్నంగా తలంచినప్పటికీ, మా తలంపులను వారిపై రుద్దాలని ప్రయత్నించము. మేము తమ అమ్మానాన్నలకు మద్దతునిస్తామని పిల్లలు గ్రహిస్తే, ‘మా మధ్య కయ్యం పెట్టడానికి’ వాళ్ళు ఎన్నడూ ప్రయత్నించరు.” తలిదండ్రులు లేనప్పుడు కూడా మనమళ్ళకు క్రమశిక్షణనివ్వడాన్ని గూర్చి తాత మామ్మలు అప్రమత్తంగా ఉండాలి. బ్రిటన్‌లో ఉండే హరాల్డ్‌ ఇలా చెబుతున్నాడు: “తలిదండ్రులు లేనప్పుడు క్రమశిక్షణనివ్వవలసిన అవసరముందని తాత మామ్మలకు అనిపించినప్పుడు తలిదండ్రులతో ముందుగానే దానిని చర్చించాలి.” తరచూ, మనమళ్ళతో దయతో కూడిన, కచ్చితమైన ఒక మాట చెబితే లేదా “తలిదండ్రులు ఏమి చేయాలనేదాని” గురించి వారికి గుర్తుచేస్తే సరిపోతుందని కూడా హరాల్డ్‌ చెబుతున్నాడు.

నైజీరియాలోని క్రిష్టఫర్‌ అనే తాతయ్య తన స్వంత పిల్లల్లోని లోపాలను చూసినప్పుడు, ఆయన తన మనమళ్ళ సమక్షంలో వాటిని గూర్చి మాట్లాడనని వ్రాస్తున్నాడు: “తలిదండ్రులతో ఒంటరిగా ఉన్నప్పుడు వారికి అవసరమైన ఉపదేశాన్నిస్తాను.” అలాగే, తాత మామ్మల పాత్ర గౌరవించబడుతోందని రూఢి చేసుకోవడంలో తలిదండ్రులు ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. ఇటలీనందలి రోమ్‌లో నివసిస్తున్న కార్లో అనే ఓ తండ్రి ఈ విధంగా చెబుతున్నాడు, “పిల్లల సమక్షంలో తాత మామ్మల లేదా కుటుంబంలోని ఇతర సభ్యుల లోపాలను గూర్చి ఫిర్యాదు చేయకూడదన్నది ముఖ్యమైన విషయం.” జపానులోని హిరోకో అనే ఒక తల్లి ఈ విధంగా చెబుతుంది: “నా అత్తమామలతో సమస్యలు వచ్చినప్పుడు, నేను దానిని మొదట నా భర్తతో చర్చిస్తాను.”

విద్యావంతులను చేయడంలో తాత మామ్మల పాత్ర

మిగిలిన అన్ని కుటుంబాలకు భిన్నంగా ప్రతి కుటుంబానికి తనదైన చరిత్ర, ఆచారాలు, అనుభవాలు ఉంటాయి. సాధారణంగా, కుటుంబ గత చరిత్ర తెలుసుకోవడానికి, తాత మామ్మలే మూలాధారం. ఒక ఆఫ్రికా సామెత ప్రకారం, “చనిపోయే ప్రతి వృద్ధుడు కాలిపోతున్న గ్రంథాలయం వంటివాడు.” బంధువులు, ముఖ్యమైన కుటుంబ సంఘటనలు, అలాగే కుటుంబ వేర్లను కలిపే విధమైన కుటుంబ విశిష్టతలను గూర్చిన జ్ఞాపకాలను తాత మామ్మలు పంచుకుంటారు. బైబిలు ఇచ్చే నైతిక మార్గదర్శకాన్ని మినహాయించి, “యౌవనస్థులు తమ కుటుంబ చరిత్రను గూర్చి తెలుసుకోకపో”తే “వారి పూర్వికులకుగల అనుభవమనే పునాది లేకుండా, నైతిక విలువలు, ఆత్మ విశ్వాసము లేనివారిగా, భద్రత లేనివారిగా వారు పెరుగుతారు” అని ఒక నిపుణుడు చెబుతున్నాడు.”—గయెటనా బార్లెట్టా, నన్నీ ఇ నిపోటీ (తాత మామ్మలు, మనమళ్ళు).

అమ్మా నాన్న, మరితర బంధువులు చిన్నగా ఉన్నప్పటి కథ వినడానికి మనమళ్ళు ఇష్టపడతారు. ఆల్బమ్‌లోని ఫోటోలను చూడడం ఉపదేశాత్మకంగాను, వినోదం కలిగించేదిగాను ఉండగలదు. ఫోటోగ్రాఫుల్లో చిత్రీకరించబడిన గత సంఘటనల కథను తాత మామ్మలు చెబుతుండగా ప్రేమానురాగాలు ఉట్టిపడుతాయి.

బ్రిటీష్‌లోని యెహోవాసాక్షులైన రెజ్‌, మోళీ అనే తాత మామ్మలు ఈ విధంగా చెబుతున్నారు: “మనమళ్ళతో కలిసి ఉండడంలో, వారితో కలిసి పనులు చేయడంలో, వారి అమ్మానాన్నలతో ఉన్న సన్నిహిత సంబంధంలో చొరబడకుండా, వారి ప్రశ్నలకు జవాబివ్వడంలో, కలిసి ఆడుకోవడంలో, కలిసి చదవడంలో, వాళ్ళకు వ్రాయడం నేర్పించడంలో, వారు చదువుతుంటే వినడంలో వారి పాఠశాల విశేషాలను ప్రేమపూర్వకంగా వినడంలో మేము ఆనందిస్తాము.”

పిల్లల, మనమళ్ళ శారీరక క్షేమాన్ని గూర్చి మాత్రమే పట్టించుకుంటారన్నది అనేక మంది తాత మామ్మలు, అమ్మా నాన్నలు చేసే పెద్ద పొరపాటు. పైన పేర్కొనబడిన రెజ్‌, మోళీ అనేవారు ఈ విధంగా చెప్పారు: “మన పిల్లలకు, మనమళ్ళకు మనమిచ్చే గొప్ప వారసత్వమేమంటే, వారు దేవుని వాక్యమును గూర్చిన నిజమైన జ్ఞానంలో పెరిగేలా చూడడమే.”—ద్వితీయోపదేశకాండము 4:9; 32:7; కీర్తన 48:13; 78:3, 4, 6.

దైవిక బోధకు అనుగుణ్యంగా ప్రవర్తించుట

దేవుని వాక్యమగు పరిశుద్ధ బైబిలు ప్రజలపై ‘ప్రభావం చూపిస్తుంది.’ అది స్వార్థం మరియు గర్వం వంటి విభేదాలు కలిగించే స్వభావాలను అదుపు చేసుకోవడానికి, విడనాడానికి వారికి సహాయపడేంతటి శక్తి గలది. (హెబ్రీయులు 4:12) కాబట్టి దానిని ఆచరణలో పెట్టేవారు కుటుంబంలో శాంతిని, ఐక్యతను అనుభవిస్తారు. ‘తమ సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూస్తూ,’ ఐక్యతను కాపాడుకోవడానికి ప్రేమను దీన మనస్సును చూపించాలని అందరినీ ప్రోత్సహించే ఫిలిప్పీయులు 2:2-4, మూడు తరాల్లో ఉండే అంతరాన్ని తీసివేసేందుకు సహాయపడే అనేక లేఖనాల్లో ఒకటి.

దైవిక బోధకు అనుగుణ్యంగా ప్రవర్తిస్తూ, ఆర్ధికంగాను, భావోద్రేకపరంగాను, ఆత్మీయంగాను ‘తమ తలిదండ్రులకు, తాత మామ్మలకు ప్రత్యుపకారము చేయవలెను’ అన్న ఉపదేశాన్ని తలిదండ్రులు, మనమళ్ళు ఒకేలా గంభీరంగా తీసుకోవాలి. (1 తిమోతి 5:4) వారు యెహోవా ఎడల ఆరోగ్యకరమైన భయంతో, “తల నెరసినవానియెదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరచి నీ దేవునికి భయపడవలెను” అన్న ఆయన మాటలను మనస్సులో ఉంచుకుని తాత మామ్మలకు ప్రగాఢమైన గౌరవాన్ని కనబరచాలి. (లేవీయకాండము 19:32) తాత మామ్మలు తమ వారసుల క్షేమం కొరకు ప్రయత్నం చేస్తూ మంచితనాన్ని కనబరచవలెను: “మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును.”—సామెతలు 13:22.

“కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము తండ్రులే కుమారులకు అలంకారము” అని సామెతలు 17:6 చెబుతున్నట్లు, తాత మామ్మలు, తలిదండ్రులు, మనమ్మళ్ళు, అందరూ కలిసి జీవిస్తున్నా, లేకపోయినా, ప్రేమా గౌరవాలపై ఆధారపడిన అనురాగ బంధాల్లో పరస్పరం ప్రయోజనాలను పొందగలరు.

[అధస్సూచీలు]

a వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ఆఫ్‌ న్యూయార్క్‌, ఇన్‌కార్పొరేటెడ్‌వారు ప్రచురించినది.

[8వ పేజీలోని చిత్రం]

కుటుంబాలు తిరిగి కలుసుకోవడం, కుటుంబ ఐక్యానికి తోడ్పడుతుంది

[9వ పేజీలోని చిత్రం]

మీరు మీ తాత మామ్మలకు ఉత్తరం వ్రాసినప్పుడు వారు ప్రోత్సహించబడుతారు

[10వ పేజీలోని చిత్రం]

మీ మనమళ్ళతో కుటుంబ ఆల్బమ్‌లో ఫోటోలను చూడడం సంతోషకరమైన అనుభవంగా ఉండగలదు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి